మంగుళూరు శాఖ వార్షికోత్సవంలో జనరల్‌ ‌కరియప్ప


‘‘‌ముస్లింలు ఇస్లామును, క్రైస్తవులు క్రైస్తవమతాన్ని, యూదులు జూడాయిజమును పొగుడుతూన్నప్పుడు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ ధర్మాన్ని పొగడటంలో తప్పేముంది?’’ అని రా.స్వ.సంఘ మంగుళూరు శాఖ వార్షికోత్సవంలో అధ్యక్ష స్థానం నుండి ప్రసంగిస్తూ మాజీ సర్వసైన్యాధ్యక్షులు జనరల్‌ శ్రీ ‌కె.యమ్‌.‌కరియప్ప ప్రశ్నించారు.

జనరల్‌ ‌కరియప్ప ఇంకా ఇలా అన్నారు : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మతసంస్థ అని, అది ఇతర సమాజాలవారిని నాశనం చేయబూనుతున్నదనీ కొందరు అపోహపడుతున్నారు. నాకు కూడా చాలామంది అలా చెప్పారు. కాని ఈ అపోహలు రాజకీయవాదులచే – బహుశా కావాలనే – ప్రయత్నపూర్వకంగా కల్పించినవేనని నేను తెలుసుకున్నాను. శ్రీ యాదవరావ్‌జోషీ తమ ఉపన్యాసం వల్ల ఈ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేశారు. నేడు ఎవరైనా సన్నిహితంగా వచ్చి, నిష్కల్మష హృదయంతో పరిశీలించినట్టయితే జాతి కోసం నిస్వార్థసేవ సంఘ లక్ష్యమనీ, దానిపై మోపిన ఆరోపణలన్నీ స్వార్థపరులు స్వప్రయోజనాల కోసం చేసే యత్నాల ఫలితాలు మాత్రమేననీ వారు గ్రహిస్తారు.
పరాయి ప్రభుత్వంతో ఏండ్ల తరబడి పోరు సలిపి నేడు మనం స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాం. దీనిని మనం సంరక్షించుకోవాలి. కాని నేడు ప్రజలలో ఏకాత్మభావం కనబడుతోందా? ప్రాంతాలు, వర్గాలు, భాషల వంటి క్షుద్ర కారణాల కోసం ప్రజలు కలహించుకోవటం మనం చూస్తున్నాం. మన మీ సంకుచిత్వాలను విడనాడి ఏకాత్మభావాన్నీ, నిస్వార్థత్యాగాన్నీ, దేశభక్తినీ అలవరచుకోని పక్షంలో ప్రగతిని గురించిన ప్రవచనాలు అర్థరహితాలవుతాయి. ఆర్థికాభివృద్ధికై మనకు ప్రణాళికలున్నాయి. కాని సర్వప్రథమమైనది మాతృదేశ సేవ కోసం సర్వసమర్పణ భావ నిర్మాణం. అతి ప్రముఖమైన ఈ అవసరాన్ని సంఘం పూర్తి చేస్తోంది. యువకులైన మీరందరూ సంఘకార్యంలో భాగంగా ప్రతినిత్యం క్రమపద్ధతిలో కలుసుకొని వివిధ శారీరక కార్యక్రమాలను కొనసాగిస్తారని నాకు తెలిసింది. ఈ కార్యక్రమాలు క్రమశిక్షణను, ధైర్యాన్నీ, ఇతర సద్గుణాలను నిర్మించటంలో ఎంతో తోడ్పడాతయనేది నిశ్చయం. యువకులు ఏ విధంగా అభివృద్ధి పొందాలని నేను ఎల్లప్పుడూ వాంఛిస్తున్నానో సరిగా అదే మార్గంలో మీరు పురోగమిస్తున్నారు. ఇది నా హృదయానికి హత్తుకునే కార్యం. ఉదాత్తమైన ఇట్టి కార్యం మతతత్త్వవాదమనీ, సంకుచితమనీ ప్రచారం చేస్తున్నారు. ఎంతటి అన్యాయం!
స్వార్థపరులు చేస్తున్న ఈ కువ్యాఖ్యల వల్ల మీరు (స్వయంసేవకులు) చలించకండి. సంస్థకు జన్మదాతలైన పూజ్య డాక్టర్‌ ‌హెడ్గెవార్‌ ‌మాతృభూమి సేవకై స్వార్థరహితమనే, భక్తి అనే ఉజ్జ్వలాదర్శాన్ని మీ ముందుంచారు. ముందుకు చూడండి. పురోగమించండి. దేశం మీ సేవకై ఎదురుచూస్తోంది.
మీ శారీరక ప్రదర్శనలను చూచి నేను ముగ్ధుడనయ్యాను. మీ సంచలన్‌(‌రూట్‌మార్చ్) ‌లోని హుందాతనాన్నీ, మెలకువను నేను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాను. మీరు శారీరక శిక్షణలో చాల చక్కని స్థాయిని పొందారు. ఇది మీ దైనందిన కార్యక్రమ ఫలితమేననేది నిర్వివాదం.
ప్రజలు – ముఖ్యంగా యువకులు- శారీరకంగా శక్తినీ, మానసిక ఏకాగ్రతనూ, నైతిక శీలాన్నీ కలిగి ఉన్నప్పుడే దేశం వైభవ సంపన్నమవుతుంది. కేవలం కబుర్లవల్ల కాదు. ఈ ఊక దంపుడు ఉపన్యాసాలను విని విని విసిగిపోయాను. మాతృభూమి యొక్క పునరుద్ధరణకు అత్యావశ్యకమైన ఈ శిక్షణను సంఘం మీకు ఇస్తూ ఉండటం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది.
శ్రీ యాదవరావ్‌ ‌జోషీ వంటి తేజోవంతులు, స్వార్థరహితులు అయిన నాయకులు నేడు దేశానికి అవసరం. మీలో ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క జోషీని చూడాలని నా ఆకాంక్ష.
సైనిక వ్యక్తిగా నేనొక విషయాన్ని మీకు చెప్పదలచుకొన్నాను. ఏ జాతి ఉద్ధరణ అయినా 5 అంశాలపై ఆధారపడి ఉంటుంది. వానిలో మొదటిది స్థైర్యం. ఎంతటి భయానక పరిస్థితులలోనైనా మనం నిరాశను పొందకూడదు. కష్టాలనన్నిటినీ అవి వచ్చిన చోటికే త్రిప్పి కొట్టి మనం అచంచలంగా ఉండటము, రెండవది ఆర్థిక సుస్థిరత, మూడవది పారిశ్రామికాభివృద్ధి, నాల్గవది ధైర్యవంతులైన ప్రజలు, ఐదవది సైనిక శక్తి. ఈ సద్గుణాలన్నింటినీ మనం ప్రయత్నపూర్వకంగా అలవరచుకోవాలి.
మనది వైభవయుతమైన పరంపర. యుగయుగాలుగా మన జాతి గౌరవ గరిమను సంస్కృతం ప్రకటిస్తూ వస్తోంది. ప్రతి ఒక్కరికీ సంస్కృతంలో కనీసం ప్రాథమికమైన విజ్ఞానమైనా ఉండాలని నేను వాంఛిస్తున్నాను.’’
అంతకుపూర్వం సంఘ అఖిల భారతీయ బౌద్ధిక్‌ ‌ప్రముఖ్‌ శ్రీ ‌యాదవరావ్‌ ‌జోషీ సంఘ ఆశయాదర్శాలను వివరిస్తూ గంభీరమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు.
గౌరవనీయులైన అధ్యక్షులకు అధ్యక్ష ప్రణామంతో వార్షికోత్సవం ప్రారంభమయింది. ధ్వజారోహణ, సంఘ ప్రార్థనల అనంతరం గణవేషధారులైన స్వయంసేవకులు చక్కని శారీరక ప్రదర్శనలను ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా సంఘచాలక్‌ ‌కర్కల్‌ ‌సదాశివరావు జనరల్‌ ‌కరియప్పను పుష్పమాలాంకృతుణ్ణి చేశారు. ఉత్సవం సమాప్తమైన తర్వాత జనరల్‌ ‌కరియప్ప పరమపూజనీయ డాక్టర్‌ ‌హెడ్గవార్‌, శ్రీ ‌గురూజీల అలంకృతములైన చిత్రపటాలు చూశారు. మంగుళూరు శాఖలోని ప్రముఖ కార్యకర్తలను ఆయనకు పరిచయం చేశారు.
మంగుళూరులోని విశాలమైన కేంద్రమైదానం ఈ మహోత్సవదర్శనార్థం విచ్చేసిన ప్రజలతో క్రిక్కిరిసిపోయింది.

– 6.3.1959 జాగృతి


నాడు జనరల్‌ ‌కరియప్ప చెప్పినవే నేడు భాగవత్‌ ‌గుర్తు చేస్తున్నారు!

ఆరున్నర దశాబ్దాల క్రితమే భారతమాత ముద్దుబిడ్డ జనరల్‌ ‌కరియప్ప చాలా చక్కని విషయం చెప్పిన సంగతి పక్క వ్యాసం చదివితే అర్థమవుతుంది. సంఘం మీద ఏదైనా అభిప్రాయం ఏర్పరుచుకునే ముందు ఒక్కసారి వారి పనితీరును పరిశీలించండి అని ఆయన పిలుపునిచ్చారు. అది ఆయన స్వీయానుభవమని మంగుళూరు సభకు హాజరు కావడాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలోను, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద ఒక అభిప్రాయానికి వచ్చే ముందు, ఒక్కసారి శాఖలను దర్శించవలసిందని సర్‌సంఘచాలక్‌ ‌డా. మోహన్‌ ‌భాగవత్‌ ‌పలుమార్లు సూచించారు. ఇదేకాదు, జనరల్‌ ‌కరియప్ప చెప్పిన చాలా విషయాలను డాక్టర్‌ ‌భాగవత్‌ ‌పునరుద్ఘాటించిన సంగతి అర్థమవుతుంది.
సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే వేరే ఏ ఇతర సంస్థ దృష్టి కోణం నుంచి చూడడం సరికాదని ఆయన పలు సమావేశాలలో చెప్పారు. సంఘం స్వయంసేవకులను నిర్మిస్తుంది. వారికి విలువలు అందిస్తుంది. భారత పరమ వైభవ స్థితి కోసం పనిచేయడానికి సంసిద్ధులను చేస్తుంది అన్నారాయన. కానీ స్వయంసేవకులు తాము ఇష్టపడిన రంగంలో పాటు పడుతూ ఉంటే వారిని సంఘం నిర్దేశించదని స్పష్టం చేశారు. దేశంలో దేశభక్తి ప్రపూరిత వాతావరణం నిర్మించడానికి శాఖ నుంచి వెళ్లిన స్వయంసేవకులు తమ వంతు ప్రయత్నం చేస్తారని ఆయన తెలియచేశారు.
ముస్లింలను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖలలో అనుమతిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన పలు సందర్భాలలో సూటిగానే సమాధానం ఇచ్చారు. గతంలో ఎవరైనా కొన్ని అభిప్రాయాలు ప్రకటించి ఉంటే, ఆ కాలాన్ని, ఆ సందర్భాన్ని కూడా పరిశీలించడం ధర్మమని కూడా డాక్టర్‌ ‌భాగవత్‌ ‌చెబుతూ వస్తున్నారు. తమను చాలా సందర్భాలలో అపార్థం చేసుకోవడమే ఎక్కువ అని ఆయన చెప్పారు. ఉదాహరణకు రిజర్వేషన్‌లు. తాము ఏనాడూ రిజర్వేషన్‌లను వ్యతిరేకించలేదని అన్నారు. ఈ విషయంలో మా మాటలకు పెడర్థాలు తీశారని కూడా గుర్తు చేశారు. భారతదేశంలో జనాభా సమీకరణలను,వాటి మధ్య సమతౌల్యాన్ని కాపాడక తప్పదని, మన జనాభా సమీకరణల మార్పునకు అక్రమ చొరబాట్లు పెద్ద సమస్య అని ఆయన నిష్కర్షగానే చెప్పారు. గోరక్షణ పేరుతో హింసకు పాల్పడడం కూడా ఆమోదయోగ్యం కాదనే సర్‌సంఘచాలక్‌ ‌వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శతాబ్ది సందర్భంగా ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌, ఇతర ప్రముఖ నగరాలలో జరిగిన అన్ని ప్రత్యేక కార్యక్రమాలలోను డా. మోహన్‌ ‌భాగవత్‌ ఈ ‌విషయాలనే పునరుద్ఘాటించారు కూడా.
హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో డా.భాగవత్‌ అన్న మాటలు ఒకసారి పరిశీలిద్దాం.
‘సంఘ్‌ అనే పేరు ఎంతో ప్రసిద్ధి. భారతదేశానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి ఈ రోజు ప్రపంచమంతా తెలుసుకుంటున్నారు. కానీ సంఘ్‌ ‌కార్యకలాపాల స్వరూపం ఏమిటి? దాని దృష్టి ఏమిటి? స్వయంసేవకులు ఏం చేస్తారు? వ్యవస్థ ఏమిటి? అనే విషయంలో అపోహలు ఉన్నాయి’ అని ఆయన అంగీకరించారు. అందుకు కారణం స్పష్టత లోపించడమే. కాబట్టి ఆ అపోహలను నివారించాలి అనే ఆయన కోరారు.

About Author

By editor

Twitter
YOUTUBE