గళమెత్తిన గతం
మానవ అభ్యున్నతి సంఘ అభ్యున్నతిపై ఆధారపడి ఉంటుంది. ఆ అభ్యున్నతికి అక్కడి ప్రకృతి సిద్ధమైన సంపద, శీతోష్ణస్థితి తదితర పరిస్థితులు కూడా దోహదపడుతూ ఉంటాయి. వికసిస్తున్న సంఘంలో ఆయా వ్యక్తుల మానసిక పరిణామానికి భౌతిక, ఆర్థిక, నైతిక జీవన పరిణామానికి పరతంత్రం వలనో మరే ఇతర కారణాలతోనో తీవ్ర అవరోధం ఏర్పడితే వికాసం ఆగిపోతుంది. కానీ సంఘ అభ్యుదయం సర్వదా వాంఛనీయం. అలాంటి అభ్యుదయం కోసం చేసే కృషినే సంఘసేవ అని కూడా చెబుతాం.
ప్రాచీన సంస్కృత వా్మఙయంలో దానశీలతే ప్రధానమన్న భావన ఉంది. బలి,శిభి,కర్ణుడు మొదలైన ఐతిహాసిక వీరుల దానతత్పరత సుప్రసిద్ధం. దానాలను రెండు వర్గాలుగా విభజించారు. యజ్ఞయాగాది సత్కర్మల నిర్వహణకు వ్యక్తులకు ఇచ్చేవి ‘ఇష్టములు’. సమాజమంతటికీ ప్రయోజనం చేకూర్చే చెరువులు, బావులు, ఆలయాలు, పాఠశాలలు, చికిత్సాలయాల నిర్మాణం కోసం ఇచ్చే దానాలు ‘పూర్తము’లు. జమీందారుల వంటివారే గాక, సామాన్యులు కూడా పూర్తములను ఇచ్చిన వారిలో కనిపిస్తారు. దేశంలోను, తెలుగు ప్రాంతాల లోను చాలా పట్టణాలలో, గ్రామాలలో ఇలాంటి వారు ఉన్నారని చరిత్ర చెబుతున్నది. వల్లూరి సూర్యనారాయణరావు, మోతే గంగరాజు, నాళం రామలింగయ్య, పైడా వెంకటచలపతి, రేబాల లక్క్ష్మీనరసింహరెడ్డి, సుద్దపల్లి రామచంద్రారెడ్డి, మాడపాటి వెంకటేశ్వరరావు, కొత్త లక్ష్మయ్య మొదలైన వారు అలా చరిత్రలో ప్రసిద్ధులయ్యారు. 18,19వ శతాబ్ద ప్రారంభంలో ప్రతి పట్టణంలోను దాతల (వర్తకులు) నుంచి ధర్మనిధి వసూలు చేసి అనేక సత్కార్యాలు చేసే సంప్రదాయం ఉండేది. వారిలో గోదావరి జిల్లాలోని మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు చిరస్మరణీయం.
సత్యలింగం నాయకర్ జన్మస్థలం గోదావరి జిల్లా కోరంగి గ్రామం. ఇది చరిత్రలో పెద్ద నౌకా నిర్మాణం కేంద్రం. వీరు సామాన్య కుటుంబీకులు. 1868వ సంవత్సరంలో రంగూన్ వెళ్లి, మూడేళ్లకు ఒక పడవ వంతున సంపాదించి, స్టీమర్లలోనూ పడవలలోనూ వ్యాపారం చేసి ఆనాడే కొన్ని లక్షల రూపాయలు ఆర్జించారాయన. ఆయనకు దానగుణం ఉండడం ఈ ప్రాంత వాసుల అదృష్టం. నాయకర్ నెలకొల్పిన దాన సంస్థకు నాడు సుమారు రూ.7 లక్షల విలువ గల భూములు కాకినాడ సమీప గ్రామాలలో ఉన్నాయి. ఒకలక్షా ఏభై వేల రూపాయలతో జగన్నాథ పురంలో పాఠశాల, సత్రం మొదలైనవి నిర్మించారు.
జనవరి 29, 1915న నాయకర్ దివంగతు లయ్యారు. ఆయన వీలునామా ఆయన కీర్తిలాగే చరిత్రలో నిలిచిపోతుంది. పాఠకుల సౌకర్యం కోసం గ్రాంథికంలో ఉన్న ఆ వీలునామాను వ్యావహారిక భాషలో ఇస్తున్నామని గమనించవలసినది.
‘సత్యలింగం నాయకర్ అను నేను రాసిన మరణ శాసనం కడపటిదైయున్నది. దీనిని అమలు జరిపించేందుకు నా దత్తకుమారుడైన సుబ్రహ్మణ్యం, నా వ్యవహారాలు చూసే గుమస్తా పెనుపోతు గోవింద రాజులను యగ్జిక్యూటరులుగా నేర్పరచడమైనది. ప్రస్తుతం నా అధీనమందున్న చరస్ధిర రూపకమగు యావదాస్తి నా స్వార్జితం గాన, నా బంధువులు గాని, మరి యే ఇతరులు గాని నా యాస్తిలోనెట్టి భాగమున్ను కలిగియుండరని తెలియజేయుచున్నాను.
నా అవసాన కాలమందు నా హక్కు భుక్తములు కలిగిన చరస్థిర రూపకమగు యావదాస్తిపై ఉదహరించిన ఎగ్జిక్యూటర్లకు, ఈ క్రింది పద్ధతిలో మరణశాసన పూర్వకముగా అప్పగిస్తున్నాను. మొదటిది నేనితరుల కివ్వవలసిన సొమ్ము, గుమస్తా, నౌకర్లు వగైరా జనాలకు ఇవ్వవలసిన జీతాలు ఇవ్వడం, రెండవది, ప్రొబేటు (వీలు రుజువై, తగిన ఆఫీసరు చేత సర్టిఫై చేసిన పబ్లిక్ కాపీ) తయారైన వెంటనే నా వ్యవహారాలు చూసే గుమస్తా పెనుబోతు గోవిందరాజుకు పదివేల రూపాయలు ఇవ్వాలి. చాలాకాలం నుండి నమ్మకంగా పనిచేసినందుకు ఈ సొమ్ము ఇస్తున్నాను. ఈ దిగువనుదహరించిన రీతిగా ధర్మకర్తత్వపు పనికి అంగీకరించినా, లేకపోయినా, నా తదనంతరం నా ఎస్టేట్ సంబంధమైన పనులు చూడడం మానేసినా ప్రొబేటు తయారైన రెండు మాసాలలో అతని సొమ్ము అతనికి చెల్లించాలి.
మూడవది ‘మల్లాడి సత్యలింగ నాయకర్ ధర్మము’ ఎమ్.ఎస్.ఎన్.చారిటీస్ ఈ దిగువ ఉదహరించిన ధర్మాల కోసం 8 లక్షల రూపాయలు ఇవ్వాలి. అందుకు ఈ దిగువ ఉదహరించిన వారిని ధర్మకర్తలుగా నియమిస్తున్నాను. వారిలో 1) నా దత్తకుమారుడు మల్లాడి సుబ్రహ్మణ్యం, (2) నా వ్యవహారాలు చూసే గుమస్తా పెనుబోతు గోవింద రాజు (3) ప్రస్తుతం కాకినాడ మున్సిపాలిటీలో నున్న దురిశేటి శేషగిరిరావు పంతులు (4) కొవ్వూరి బసివిరెడ్డి వారి కుమారుడు ఆదెయ్యరెడ్డి.
ఈ కింద చెప్పిన కట్టడాల కోసం, వాటి నిమిత్తము సంపాదించే నివేశన స్థలాల నిమిత్తం రూ.1 లక్షకు మించని మొత్తాన్ని ధర్మకర్తలు సాధ్యమైనంత త్వరలో ఖర్చు చేయాలి. (ఎ) విశాలమైన ఆట స్థలాలతోటి, ఆధునిక ఏర్పాట్లుగల జిమ్నాషియములతోటి, మద్రాసు ఇలాకా కాకినాడ జగన్నాథపురంలో ఇటుకలతో ఒక స్కూలు భవనం కట్టాలి. (బి) కాకినాడ సమీపంలోని చొల్లంగి గ్రామంలో దేవస్థానమొకటి రాళ్లతో నిర్మించాలి. దైవ ప్రతిష్ఠ ధర్మకర్తల సమక్షంలో జరపాలి. వారందరు ఏకీభవించకుంటే దురిశేటి శేషగిరిరావు పంతులు గారి అభిప్రాయం ప్రకారం జరగాలి. దేవస్థానం చుట్టూ పెరడు, ఒక నుయ్యి ఉండాలి. (సి) బీదలకు అన్నం పెట్టడానికి స్కూలుకు సమీపంగా జగన్నాథŠ పురంలో ఇటుకలతో ఒక సత్రం కట్టాలి.
పైన ఉదహరించిన కట్టడాలకు ఒక లక్ష రూపాయలు చాలని యెడల మిగిలిన 7 లక్షల సొమ్ము వల్ల వచ్చు వడ్డీ గాని, రాబడి వల్ల గాని ఆ పనులు పూర్తి కావించాలి. అసలు సొమ్ములు ఏ భాగమైనా కానీ, యే కారణం చేతనైనా తగ్గించ కూడదు. స్కూలు, సత్రం, ఆలయం ఉన్నత విద్యాభి వృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు 1 లక్ష రూపాయలు మూలధనంగా ఉండాలి. పైన చెప్పిన ధార్మిక కార్యక్రమాలు పైననే ఉదహరించిన 7 లక్షల ధనం నుండి వచ్చే వడ్డీ వల్ల గాని, మరియే ఇతర రాబడితో గాని నిర్వహించాలి.
మద్రాసు యూనివర్శిటీకి అనుబంధం ప్రైమరీ తరగతి వరకు బాలబాలికల విద్య నిమిత్తం స్కూలు ఏర్పాటు చేయాలి. జాతి, మత, భేదం లేకుండా అన్ని జాతుల పిల్లలకు స్కూలు అందుబాటులో ఉంచాలి. వడ్రంగం, చేతిపనులు, నేత, కుండలు చేయడం వంటి పనులు నేర్పేందుకు, శిక్షణ తరగతులు స్కూలులో భాగం చేయాలి. అందరికి డబ్బు పుచ్చు కొనకనే విద్య నేర్పించాలి. అన్ని తరగతుల వారు కలసి రెండు వందలమంది భోజనం చేసేందుకు తగిన వసతి గల సత్రం నిర్మించాలి. అధమం నూరు మందికి తగ్గకుండా భోజనం పెట్టాలి. సదరు నూరు మందిలో 25 మంది బీద స్కూలు పిల్లలు ఉండాలి. ప్రతీరోజు కొంతమంది బ్రాహ్మణ పిల్లలకు భోజనం పెట్టాలి. బ్రాహ్మణుల చేతనే వంట చేయించాలి. కాయకూరలు లేని ఆహారం సత్రంలో పెట్టరాదు. పై ఉదహరించిన 25 మంది కాక, ఇకనొక 12 గురు బ్రాహ్మణులకు రోజు వకటింటికి అధమం రెండు గంటల కాలం వేదాధ్యయనంలో ఉంటే అన్నం పెట్టవచ్చును.
దేవాలయాలలో నిత్యం ఒకటింటికి రెండు పర్యాయములు పూజ జరగాలి. కావలసినంత మంది నౌకరులను, అర్చకులు, గాయకులు దేవాలయానికి ఉండాలి.
పై ధర్మకార్యక్రమాలే కాకుండా, మా ధర్మకర్తలు ఒక మద్రాసు ‘హిందువును’ ఉన్నత విద్య కోసం గాని, పారిశ్రామిక విద్య కోసం, యూరోప్, అమెరికా, జపాన్ లేక మరి ఇతర దేశానికి ప్రతి సంవత్సరం పంపాలి.
ధర్మ కర్తృత్వపు సొమ్ము ఈ దిగువ నుదహ రించిన ఏ ఆస్తుల మీదనైనా వినియోగించవచ్చును.
- ఇండియా గవర్నమెంటు బాండ్ల మీదను.
- రైల్వే డిబెంచర్ల (తాకట్టు) మీదను, పోర్టుట్రస్టుల మీదను, ఇండియా, బర్మాలలోని మున్సిపాలిటీలపైన.
- రంగూన్, కలకత్తా, బొంబాయి, మద్రాసుల లోని ఫ్రీ హోల్డ్ ఇళ్ల ఆస్తుల మీదను.
- మద్రాసు ప్రెసిడెన్సీలోని, బర్మా ప్రావిన్సుల లోని వ్యవసాయ భూముల మీదను, ఫలములనిచ్చు తోటల మీదను, బర్మాలోని వ్యవసాయపు భూములు కొన్న యెడల దయాళు గ్రాంట్ భూములు మున్ముం దుగా ఎంచుకోవాలి. వ్యవసాయ భూముల మీద ఐదు లక్షల రూపాయలు, మిగితా రెండు లక్షల నితర ఆస్తుల మీదను, వినియోగపరచాలి. ఏ కారణం చేతనైనా భూముల మీద పెట్టుబడి ఐదు లక్షలు ఎప్పుడూ తీసుకోకూడదు. అట్టి సొమ్ము ఇతర ఆస్తుల మీద వినియోగించకూడదు.
పైన ఉదహరించిన ధర్మకార్యాలు, దిగువ కనపరిచిన రీతిగా తరగతులుగా విభజించాలి.
- స్కూలు నెలకొల్పడం 2. విద్యార్థులను ఉన్నత విద్యలకుగాని, పారిశ్రామిక విద్య నిమిత్తం గాని పంపించడం (3) దేవాలయాల నిర్మాణం (4) బీద జనులకు అన్న వసతి. అన్ని ధర్మములకు తగినంత రాబడి, ధర్మాస్థివల్ల రాకుంటే రోజు వకటింటికి 40 మందికి అన్న వసతి కల్పించాలి.
ఈ సంస్థ ధర్మ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటైన ఒక పాఠశాలలో 350 మంది బాలురు చదువుతున్నారు. సత్రంలో విద్యార్థులకు 100 మందికి పైగా ప్రతీపూట భోజనం పెడతారు. సంగమేశ్వర స్వామి ఆలయం ఈ సంస్థ వారే నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ వారి సహాయముతో విదేశాలకు పోయి అక్కడ వివిధ రకాల విద్యలనభ్య సించినవారిలో చవుటుపల్లి నారాయణరావు, వై.వి.కృష్ణారావు (వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్లు), బి.శంకర్రావు నిరోది, మద్రాసు గవర్నమెంటు కన్నడ ట్రాన్స్‌లేటర్, యల్లాప్రగడ సుబ్బారావు వైద్యులు, లంక సుందరం (పత్రికా విలేకరి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్), చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి (ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్), పి.ఆర్. కులశేఖరం నాయకర్, కే.ఎస్. మూర్తి, మాగంటి బాపినీడు (పార్లమెంటరీ ప్రచురణ శాఖ) మరెందరో ప్రముఖులు ఎమ్.ఎస్.ఎన్. చారిటీస్‌లో చదువుకున్నవారే (1943లో “ఆంధ్ర సర్వస్వము” తయారైన వివరాలు).
పైన ధర్మకార్యక్రమాలు వరస క్రమంలో నిర్వ హించాలి. ఆ మాత్రపు సంఖ్యకైన అన్నం పెట్టడానికి నిధులు చాలకుంటే, పారిశ్రామిక విద్య కోసం విద్యార్థులను విదేశాలకు పంపడం విరమించవచ్చు. లేదా మరొక మార్పు కూడా చేసుకోవచ్చు.
ఎమ్.ఎస్.ఎన్. చారిటీస్ అనేది 1915లో మల్లాడి సత్యలింగం నాయకర్ స్థాపించారు.
మన ఆంధ్రులలో త్యాగబుద్ది, ధర్మచింత గల ప్రజాహితైక జీవులు, ప్రజా సంస్థలకు దానం చేయ డానికి రాసిన మరణ శాసనాలలో వారి చిత్తవృత్తి విశాల హృదయం, పరోపకార పరాయణత ప్రతిబింబిస్తాయి. అట్టి మహనీయులలో మల్లాడి సత్యలింగ నాయకర్ ఒకరు. ఇది వారి మరణ శాసనంలో (వీలునామా) ముఖ్య భాగం మాత్రమే.
నాయకర్ వివిధ పాఠశాలలకు ధర్మ సంస్థలకు ఆదాయవనరుగా 1258 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. నాయకర్ చనిపోయి 110 సం॥లు అయినా ఎమ్.ఎస్.ఎన్. చారిటీస్ నేటికి ధార్మిక కార్యక్రమాలను నిర్విఘ్నంగా సాగిస్తున్నది.
మూలం:
ఆంధ్ర సర్వస్వము బై మాగంటి బాపినీడు పేజీ. 93-96 86,87,91 -99

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు