ప్రపంచం మీద మరొకసారి మూడో ప్రపంచ యుద్ధ భయం అలుముకున్నది. చమురు మీద ఆధిపత్యం కోసం పోటీ భూగోళాన్ని మందుపాతరలా మారుస్తున్నది. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ఆధునికయుగంలోను మతం ఆధారంగా, మత సూత్రాల ప్రాతిపదికగా దేశాన్ని పాలిద్దామన్న ఆలోచన అటు అగ్రరాజ్యాల దూకుడుకు ఆస్కారం కల్పిస్తున్నది. దేశంలో మసకబారుతున్న ప్రతిష్టకు ఊపిరి పోయడానికి అగ్రరాజ్యం యుద్ధాలను ఆశ్రయిస్తున్నది. అలాగే దశాబ్దాల నాటి పాత పగలు కూడా ఈ దాడులకు దోహదం చేస్తున్నాయి. కారణాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రతి విశ్లేషణ కొస మూడో ప్రపంచ యుద్ధ భయం వద్దనే ఆగుతున్నది. ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ మధ్య రావణకాష్టంలా మండుతున్న ఘర్షణ మరొక భీకర యుద్ధాన్ని ప్రపంచం మీద రుద్దబోతున్నదన్న అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఈసారి ఆ రెండు దేశాలు ఇరాన్ మీద చేసిన భీకర దాడిలో ‘సర్వోన్నత నేత’ (సుప్రీం లీడర్) అయితుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఆయనతో పాటే ఆ దేశ రక్షణ రంగ, పాలనా యంత్రాంగాలలోని 48 మంది పెద్ద తలలు కూడా రాలిపోయాయి. దీనితో ఒక కొత్త సంక్షోభం పురుడు పోసుకుంది. ఫిబ్రవరి 28, 2026 వేకువన ఇజ్రాయెల్, అమెరికాలు చేసిన సంయుక్త క్షిపణి దాడిలో 86 ఏళ్ల ఖమేనీ తన కార్యాలయంలోనే మరణించారని వార్తలు వచ్చాయి. వీటిని ఇరాన్ ధ్రువీకరించింది. దీనితో 36 ఏళ్ల పాటు సాగిన ఖమేనీ ఏకాఛత్రాధిపత్యం అంతమైంది. ఇస్లామిక్ విప్లవ నాయకుడు గ్రాండ్ అయితుల్లా ఇమామ్ సయ్యిద్ అలీ ఖమేనీ అమెరికా, జియోనిస్ట్ పాలకులు (ఇజ్రాయెల్) కలిపి చేసిన దాడిలో మరణించారని ఆ దేశ వార్తా సంస్థ ఇర్నా, మరొక చిన్న వార్తా సంస్థ టానిమ్ వెల్లడించాయి. ఖమేనీ మృతికి 40 రోజులు సంతాపదినాలుగా పాటిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. కాగా, ఇరాన్ ప్రతిదాడులకు దిగడం, అమెరికాతో చర్చలకు మొదట సుముఖంగా ఉన్నా, తరువాత మొండికేయడం, రష్యా, ఉత్తర కొరియా అమెరికాకు ప్రతికూలంగా స్పందించడం, ప్రతీకార చర్యల పేరుతో ఆసియాలోని అమెరికా దౌత్యకేంద్రాల మీద ఇరాన్ దాడులకు దిగడం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ వంటి దేశాల మీద క్షిపణులు కురిపించడం, చర్చల ప్రక్రియ ముగిసే వరకు దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించడం యుద్ధం విస్తరించక తప్పదన్న సంకేతాలను, భయాలను భూతలం మీద పరుస్తున్నాయి. ఎప్పుడు గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు ఆవరించినా భారత్ నిండా గుబులు అలుముకుంటుంది. మనవారు అక్కడ అంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక చమురు ఓడలో భారతీయులు ఇరాన్ దాడి కారణంగా గాయపడ్డారన్న వార్తలు వచ్చాయి.
రాజధాని టెహ్రాన్‌లోనే తన కార్యాలయంలో పని చేసుకుంటూ ఉండగా దాడులకు గురై ఖమేనీ మరణించారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటిం చారు. అంతకు ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఆ దేశ అధికార టెలివిజన్‌లో ఇదే విషయం వెల్లడించారు. ఖమేనీ మతదేహం ఆచూకీ కూడా తెలిసిందని కొన్ని వార్తా సంస్థలు తెలియచేశాయి. ఈ దాడులలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు కూడా మరణించారు. రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా వేకువనే సైనిక చర్యలు ఆరంభించాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన 12 రోజుల యుద్ధానికి కొనసాగింపుగానే ఇది జరిగింది. ఒకవైపు చర్చలు, కాల్పుల విరమణలు అంటూనే ఈ వైరిరాజ్యాలు యుద్ధ వ్యూహాలను కొనసాగించాయి. రాజధాని టెహ్రాన్, ఇస్పహాన్, కోమ్, కరాజ్, కర్మన్‌షా లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. వీటి గురించి ఒక నెల నుంచి ఆ రెండు దేశాలు యోజన చేస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి ఖమేనీ, ఆయన అనుచరుల కదలికలను గమనిస్తున్న అమెరికా గూఢచారి సంస్థ అదను చూసి సంకేతం ఇచ్చింది. ఆ ముందురోజు జరగవలసిన దాడులు, మరునాటికి వాయిదా వేశారు. ఆ రోజు వేకువనే ఖమేనీ, అధికారుల భారీ సమావేశం జరుగుతున్నదని వైరిపక్షం ఉప్పు అందించడంతో ఇదంతా సాధ్యమైంది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతుండగానే ఈ దాడులు జరగడం విశేషం. ఇరాన్ షియా ముస్లిం దేశం. దీనితో అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో ఖమేనీ మరణిం చడం పట్ల ప్రపంచంలోని చాలా దేశాలలో షియాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో లక్నో, హైదరాబాద్, జమ్ముకశ్మీర్‌లలో నిరసనలు జరిగాయి. ఒకటి వాస్తవం. మొత్తం ముస్లిం దేశాలన్నీ ఇరాన్ వెనుక లేవు. ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ ప్రతిదాడులు చేసిన దేశాలలో దుబాయ్ వంటి ముస్లిం దేశాలు ఉన్నాయి. ఇరాన్ మీద దాడి పథకం వెనుక ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే కాదు, సౌదీ అరేబియా కూడా ఉందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది. తమ దాడులు వారం పాటు కొనసాగుతా యని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రాంతంలోని అమెరికా కేంద్రాలపై ఇరాన్ దాడుల” చేసింది. ఈ దాడులు పూర్తయ్యే లోపున తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవల సిందని ట్రంప్ ఇరాన్ ప్రజలకు సూచించారు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన పాలకుడని ముద్ర వేశారు. అణ్వాయు ధాలు ఉన్న దేశం అలాంటి దుర్మార్గుడి చేతిలో ఉండడం ప్రపంచానికి ముప్పు అని తేల్చారు. ఈ క్షణం మీకు స్వేచ్ఛ దక్కిందని అన్నారు. ఒక సైనిక స్థావరానికి సమీపంగా ఉన్న ప్రాథమిక పాఠశాల మీద క్షిపణులు పడడం వల్ల వందమంది బాలికలు మరణించారని ఇరాన్ అధికారులు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో 200 మంది వరకు మరణించారని, 700 మంది గాయపడ్డారని ఇరాన్‌లోని రెడ్ క్రాస్ శాఖ వెల్లడించింది.
అమెరికా తన ఆధిపత్యానికి అడ్డులేని ప్రపంచం కోసం పాటు పడుతూ ఉంటుంది. అగ్రరాజ్యానికి ఎదురుతిరిగిన వారు లేకపోలేదు. కానీ వారంతా (ఫైడల్ కాస్ట్రో వంటి మినహాయింపులు తప్ప) కూడా స్వదేశంలో గొప్ప మద్దతు ఉన్నవారు కాదు. అమెరికాతో పోటీ పడగల సత్తా కూడా వాటికి లేదు. ఈ రెండు అంశాలే అమెరికాకు సాధారణంగా సానుకూలాంశాలుగా ఉంటాయి. కల్నల్ ఖడాఫీ, సద్దాం హుసేన్ అమెరికా మీద ధ్వజమెత్తారు. కానీ వీరు స్వదేశం మీద ఉక్కుపాదం మోపి తీవ్ర వ్యతిరేక తను మూటగట్టుకున్నవారే. అయితుల్లా ఖమేనీ అనుభవము ఇదేû. ఆయనకు దేశంలో గొప్ప మద్దతు లేదు. హిజాబ్ ధారణ మీద, మహిళ హక్కుల మీద ఆయన వైఖరి శత్రువుల సంఖ్యను పెంచింది. ఖమేనీ మరణవార్తతో కొందరు ఆక్రోశించారు. అటు కొందరు హర్షాతిరేకాలు ప్రదర్శించారు. ఒకటి వాస్తవం. ఖమేనీ కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలని శతథా ప్రయత్నించి చతికిల పడిన ముస్లిం నియంత లకు కొనసాగింపు. ఖమేనీ ఇరాన్‌ను పశ్చిమా సియాలో బలమైన అమెరికా వ్యతిరేక శిబిరంగా రూపొందించాలని కలగన్నారు. ఇందులో తప్పు పట్టవలసిందేమీ ఉండదు. కానీ తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి ఇరాన్‌ను ఇనుప పిడికిలిలో బిగించారు. ఈ మొత్తం రాజకీయంలో, ప్రయత్నంలో తాను మరణించినా ఆశ్చర్యపోనక్కరలేదని ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టు భావించాలి. ఎందుకంటే, ఈ ఉద్రిక్తతల నడుమ తన తదనంతరం ఇరాన్ స్వరూప స్వభావాలు, పాలన ఎలా ఉండాలో ఆయనకు ఒక కల్పన ఉంది. తన అధికారాలను బదలీ చేసే ఉద్దేశంలోనే ఆయన ఉన్నారని వార్తలు వచ్చాయి. నిజానికి ఆయన వయసు కూడా 86 సంవత్సరాలు.
ఇరాన్‌కు ఈశాన్య భాగంలో ఉన్న ‘పవిత్ర నగరం’ మషహద్‌లో ఆయన పుట్టారు.నేపథ్యం, స్వస్థలం ఆయన వ్యక్తిత్వాన్ని మలిచాయి. వారిది మత గురువుల కుటుంబం. ఇరాన్ షా మీద జరిగిన తిరుగుబాటులో కీలకంగా ఉన్న ప్రదేశమది. తన కంటే ముందు దేశాన్ని పాలించిన ఖొమేనీ నిర్వ హించిన మత విద్యా సంస్థలోనే ఖమేనీ చదువుకు న్నారు. షా మీద తిరుగుబాటులో పాల్గొన్నారు. జైలుకు వెళ్లడం, అజ్ఞాతంలో గడపడం రెండూ జరిగాయి. 1979లో ఖొమేనీ దేశానికి తిరిగి వచ్చిన తరువాత ఖమేనీని 1981లో విప్లవ సమితి కార్య దర్శిగా నియమించారు. ఒక ఎన్నికల సభలో మాట్లాడుతుండగా ప్రత్యర్థులు పెట్టిన బాంబు పేలి, ఒక చేయి కోల్పోయారు.1980ýలో ఇరాక్‌తో జరిగిన యుద్ధం తరువాత ఇరాన్‌లో కాస్త స్థిరత్వం తీసుకువచ్చిన ఘనత మాత్రం ఆయనకు ఉంది. అదే ఆయనను మూడున్నర దశాబ్దాలకు పైగా పాలకునిగా నిలిపి ఉండవచ్చు.
1997 నుంచి దేశంలో ఖమేనీ ఎదురుగాలి వీచడం మొదలుపెట్టింది. పార్లమెంట్‌లో సంస్కరణా భిలాషులైన రాజకీయ నేతలు ఆధిపత్యం సంపాదిం చారు. మత గురువు మహమ్మద్ ఖటామీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. విప్లవం పేరుతో (1979) దేశం మీద విధించిన ఆంక్షలను తొలగించాలని సంస్కరణా భిలాషులు కోరడం ప్రారంభించారు. సంస్కరణలు కోరుతున్న వారిని ఏకాకులను చేయాలని, ఏరివేయా లని ఖమేనీ భావించారు. మత గురువుల ప్రభావం నుంచి రాజ్యాన్ని తప్పించడం ఆయన ఉద్దేశమే కాదు.
షా, ఖొమేనీ, ఖమేనీ
ఇరాన్ షా మహమ్మద్ రెజా ఫలావీ అంతమే లక్ష్యంగా 1979లో విప్లవం ప్రారంభమైంది. దాని నాయకుడు అయితుల్లా ఖొమేనీ. షాను తొలగించి ఖొమేనీ సర్వోన్నత నేతగా అధికారం చేపట్టారు. దీనితో మధ్య ప్రాచ్య రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అలాగే అమెరికా`ఇరాన్ సంబం ధాలు దెబ్బతినడానికి లేదా రెండు దేశాల మధ్య తీవ్ర వైరానికి బీజం వేసిన పరిణామం`52 మంది అమెరికా దేశీయులను ఇరాన్ విద్యార్థులు బందీలుగా పట్టుకోవడమే. వారిని 444 రోజులు బందీలుగా ఉంచారు. ఇక ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి సమయంలో ఇరాన్ హమాస్‌ను వెనకేసుకొచ్చింది. అంతకు ముందే ఇరాన్ పాలస్తీనా మద్దతుదారు. ఇది ఇజ్రాయెల్‌కు ఆగ్రహం కలిగిస్తున్న పరిణామం. 2025`2026 కాలంలో మరొకసారి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ఘర్షణ తలెత్తింది. ఆపరేషన్ రోరింగ్ ýయన్, ఎపిక్ ఫ్యూరీ పేరుతో జరిగిన దాడులలోనే చివరకు ఖమేనీ మరణించారు. దీనితో షా పదవీచ్యుతితో ఇరాన్‌లో మొదలైన శకం ఖమేనీ మృతితో ముగిసింది.
మహమ్మద్ రెజా ఫలావీకి అమెరికా అండ దండలు ఉండేవి. కొన్ని పాశ్చాత్య దేశాలు కూడా షాకు అండగా ఉండేవి. ఆయన మీద 1970 నుంచి దేశంలో అసంతృప్తి మొదలయింది. షా మీద ప్రధాన ఆరోపణలు రెండు`ఆధిపత్య ధోరణి, షియా మత సంప్రదాయాలకు దూరంగా జరగడం. షా రహస్య పోలీసు వ్యవస్థ ‘సవాక’ ప్రతిపక్షాల నాయకులను అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టేదన్న ఆరోపణ కూడా ఉంది. ఇస్లామిక్ విలువల పట్ల షా నిర్లిప్తంగా ఉంటున్నాడనే నాడు చాలామంది ఇరాన్ దేశీయులు భావించినట్టు కూడా వార్తలు ఉన్నాయి. చమురు నిల్వలు ఉన్నా, దేశంలో నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోయాయి. ఆ సమయంలో షియా మత గురువుగా పేరు ప్రతిష్టలు ఉన్న అయితుల్లా ఖొమేనీ ప్రభుత్వ వ్యతిరేక వర్గానికి నాయకునిగా అవతరిం చారు. 1977 నుంచి షా వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేశారాయన. ఖొమేనీ 1979 నాటి ఇరాన్ విప్లవంలో ఆఖరి షా మహమ్మద్ రెజా ఫలావీని పదవీచ్యుతుని చేశారు. ఈ విప్లవం కోసం ఖొమేనీ ఫిబ్రవరి 1,1979న ప్రవాసం నుంచి తిరిగి వచ్చారు. ఖొమేనీ వచ్చిన పది రోజులకే షా ప్రభుత్వం కుప్పకూలింది. ఆ ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రజా భిప్రాయ సేకరణలో 90 శాతం మంది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ఉండాలని కోరారు. దీనితో ఖొమేనీ ఇరాన్‌ను మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మార్చి సుప్రీం నేతగా ఎదిగారు. విలాయత్ ఇ ఫకీ నిబంధన ప్రకారం ఆయనకు ఈ సర్వోన్నత అధికారం దఖలు పడింది. ఇరాన్ షియా మత రాజ్యమైంది. షరియా చట్టం అమలులోకి వచ్చింది.పాశ్చాత్య వ్యతిరేకత, మరీ ముఖ్యంగా అమెరికా వ్యతిరేకత అక్కడ రాజ్యమేలడం మొదలయింది.
నిజానికి ఖొమేనీకి, షాకు మధ్య విభేదాలు చాలా పాతవి. షా ప్రకటించిన శ్వేతవిప్లవ సంస్కరణలను వ్యతిరేకించినందుకు ఖొమేనీని 1963లో షా ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పుడే ఆయన టర్కీ పారిపోయాడు. అక్కడ నుంచి ఇరాక్, ఆపై ఫ్రాన్స్‌లలో తలదాచుకున్నాడు. 1978 నాటికి ఇరాన్ ఆందోళనలు తీవ్రమయ్యాయి. తిరిగి దేశానికి వచ్చారాయన.
జనవరి 16,1979న షా దేశం విడిచి పారిపో యారు. ఈజిప్ట్, మొరాకో, బహమాస్, మెక్సికోలలో చిరకాలం తలదాచుకున్నారాయన. ఆఖరికి క్యాన్సర్ బారిన పడి అమెరికాలోను పనామాలోను వైద్యం కోసం వెళ్లారు. ఇతడు 1979లో అమెరికా చేరినప్పుడు మరొకసారి ఇరాన్‌లో భయాందోళనలు మొదలయినాయి. షాను మళ్లీ అమెరికా ఇరాన్ పాలకుడిని చేస్తుందని వారు ఆందోళన చెందారు. ఈ భయాందోళనలే 52 మంది అమెరికన్లను బందీలుగా పట్టుకోవడానికి దారి తీసింది. కానీ వారి భయాలు నిజం కాలేదు. షా మళ్లీ ఈజిప్ట్ చేరుకుని అక్కడే జూలై 27,1980న మరణించారు.
నవంబర్ 4,1979న ఇరాన్ విద్యార్థులు కొందరు రాజధాని టెహ్రాన్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంలోకి చొరబడ్డారు. దౌత్యోద్యోగులు, పౌరులు అంతా కలిపి 52 మందిని బందీలుగా పట్టుకున్నారు. మళ్లీ 444 రోజుల తరువాత జనవరి 20,1981 విడిచిపెట్టారు. ముందే చెప్పుకున్నట్టు షా వైద్యం కోసం అమెరికా వెళితే, అతడిని అమెరికా పిలిచిందని, మళ్లీ ఇరాన్ పాలన అప్పగిస్తుందని ఇరాన్‌లో పలువురు భావించడమే ఈ చర్యకు కారణం. అంటే షా మరణవార్త విన్న తరువాత మాత్రమే అమెరికా దేశీయులను విడుదల చేశారు.
జూన్, 1989లో ఖొమేనీ మరణంతో ఖమేనీ ఇరాన్ సర్వోన్నత అధికారి అయ్యారు. ఖొమేనీని మించి దేశం మీద మత నిబంధనల పట్టు పెంచారు.
షా కాలంలో ఇజ్రాయెల్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా భావించేవారు. ఆఖరికి 1979 విప్లవం తరువాత కూడా కొంత వరకు పరిమితులలో ఆ సంబంధాలు కొనసాగాయి. నిజానికి ఇరాన్ – ఇరాక్ యుద్ధం సమయంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ ఆయు ధాలు సరఫరా చేసింది కూడా. కానీ 1991 గల్ఫ్ యుద్ధం తరువాత ఇజ్రాయెల్ పట్ల ఇరాన్ వైఖరిని మార్చింది. ఇజ్రాయెల్‌ను ‘చిన్న సైతాన’గా చూసింది. అమెరికాను ‘పెద్ద సైతాన’గా భావించింది. పాలస్తీనా, లెబనాన్ ఉగ్రవాద ముఠాలకు సానుకూల వైఖరి అప్పుడు తీసుకున్నదే. ఈ క్రమంలోనే జూన్ 13, 2025న ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో సైనిక చర్యను ఆరంభించింది. నటాంజ్, ఇస్ఫహాన్, ఫర్దోలలో ఉన్న అణు స్థావరాలు సహా వంద లక్ష్యాలను ఎంచుకుని క్షిపణి దాడులు చేసింది. అప్పుడు దాదాపు 224 మంది ఇరానియన్లు చనిపోయారు. దీనితో ఖమేనీ ఇజ్రాయెల్ మీద పగ పట్టారు. అమెరికా కూడా ఇరాన్ అణు స్థావరాల మీద దాడులకు దిగింది. మధ్యలో ఒకసారి కాల్పుల విమరణ ఒప్పందం జరిగింది. తిరిగి హఠాత్తుగా జరిపిన దాడులలో ఖమేనీ కూలిపోయారు. తరువాత ఏమిటి? ఇప్పుడు ఇరాన్ ముందున్న ప్రశ్న. మొదటి రోజు యుద్ధంలో సర్వోన్నత నేత కూలిపోయారు. యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇది ప్రపంచం దేశాలను వేధిస్తున్న ప్రశ్న.
ఖమేనీ పూర్వికులు భారతీయులే
అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణిదాడులతో మరణిం చిన అయితుల్లా అలీఖమేని పూర్వికులు ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లా, కింటూర్‌కు చెందిన వారు. సయ్యద్ అహ్మద్ మూసావి వంశీకులే అయితుల్లా రుహొల్లా ఖొమేనీ, అయితుల్లా అలీ ఖమేనీ. మూసావి 19 శతాబ్దంలో పర్షియాకు వలస పోయారు. బారాబంకీ షియా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం. ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మొహిసినా కిద్వాయ్ కూడా ఇక్కడి వారే. కాబట్టి ఆధునిక ఇరాన్ దేశ వ్యవహారాలను తీర్చిదిద్దినవారు ఖొమేనీ, ఖమేనీలే. ఖొమేనీ 1979 విప్లవంలో కీలకంగా ఉన్నారు. ఆయన వారసత్వాన్ని ఖమేనీ కొనసాగించారు. ఇరాన్‌లో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అంతా ఆ దేశ అత్యున్నత నాయకునికి, భారతదేశానికి ఉన్న బంధం గురించి నెమరు వేసుకుంటున్నారు. కింటూర్ లక్నోకు సమీపంలోనే ఉంది. ఒకప్పుడు భారతీయ వారసత్వాన్ని చూపించి ఖొమేనీ ఆధిపత్యం మీద దెబ్బ కొడదామని ప్రత్యర్థులు ప్రయత్నించారు. ఆ క్రమంలో భారత ఏజెంట్ అన్న ముద్ర కూడా వేశారు. ప్రస్తుతం ఖమేనీ మతికి లక్నో కూడా నిరసనలతో వేడిక్కినా, కింటూర్ మాత్రం ప్రశాంతంగానే ఉంది.
– జాగృతి డెస్క్