కృత్రిమ మేధ(ఏఐ) విషయంలో అంతర్జాతీయ దిగ్గజ దేశాలకు భారత్ ఏ మాత్రం తీసిపోదనే సంగతిని ఇటీవల జరిగిన ఏఐ సదస్సు తేటతెల్లం చేసింది. ఏఐను ఒక ఉపకరణంగా చేసుకొని భారత్ చేసిన అధునాతనమైన ఆవిష్కరణలు ప్రపంచదేశాలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ వారికి దగ్గరుండి మరీ చూపించారు.మొదటి ఆవిష్కరణ అమూల్ బూత్‌లో ప్రదర్శించినది. ఇది ఏఐ సాయంతో జంతువులకు చికిత్స జరుగు తున్న విధానం, రైతులు తమ పశువులు, పాడి వ్యవహారాలను ఏఐ సహాయంతో అనునిత్యం పర్యవేక్షిస్తున్న వైనాన్ని చూపించింది. ఇది పాడి రైతులకు, పశువుల సంరక్షణకు ఎంతగానే ఉపయోగపడే ఆవిష్కరణగా దేశాధినేతల మన్ననలను అందుకుంది.

రెండవ ఆవిష్కరణ భారత సంస్కృతి, వారసత్వ సంపదకు సంబంధించినది. ఏఐ సాయంతో పురాతన గ్రంథాలు, రాతప్రతులు, సాంప్రదాయ జ్ఞానాన్ని ఇది సంరక్షిస్తుంది. వాటిలో చిత్రాల నాణ్యతను మెరుగుపరచి, మెషిన్ రీడబుల్ టెక్స్ట్‌గా మార్చి, ఏఐ అవతార్ ద్వారా సులువుగా చదివేలా చేశారు. ఉదాహ రణగా ‘సుశ్రుత సంహిత’ను ప్రదర్శించారు. పురాతన జ్ఞానాన్ని ఆధునిక తరానికి అనుగుణంగా అనుసంధానం చేస్తుందన్న ఈ ఆవిష్కరణ ఏఐ సదస్సుకు వచ్చినవారిని అబ్బురపరిచింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి భారతీయ సనాతన సంప్రదా యాన్ని జోడిస్తూ దేశరాజధానిలో ఘనంగా జరిగిన ఏఐ సదస్సు భారత్‌కు సరికొత్త కీర్తి కిరీటమై శోభిల్లింది.


“ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026” పేరుతో ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు అంతర్జా తీయ కృత్రిమమేధ సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో విజయవంతంగా జరిగింది. సురక్షితమైన సమ్మిళిత, బాధ్యతాయుతమైన కృత్రిమమేధ (ఏఐ) లక్ష్యంగా ఈ సదస్సును భారత్ నిర్వహించింది. ఈ ఏడాది మనదేశంలో మరో రెండు ఈవెంట్లు, మొదటిది జనవరి 22న దేశ రాజధాని దిల్లీలో “ఎలెట్స్ ఏఐ సమ్మిట” పేరుతో ఒక సదస్సు జరగ్గా, వచ్చే అక్టోబర్ 7-9 తేదీల మధ్య బెంగళూరులో “సైఫర్ ఏఐఎంఎల” పేరుతో మరో సదస్సు జరుగ నుంది. కాగా ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగిన ఢిల్లీ సదస్సు ఏఐ విధానం, పరిశోధన, పారిశ్రామిక అనువర్తనాలు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తం 30 దేశాలనుంచి 300 ఎగ్జిబిటర్లు పాల్గొనడం విశేషం. అంతేకాదు 118 దేశాలనుంచి 100G గ్లోబల్ సీఈఓలు ఈ సదస్సులో పాల్గొని “ఏఐ ప్రభావంపై న్యూఢిల్లీ ప్రకటన”పై చర్చించారు. ఈ డిక్లరేషన్‌ను అమెరికా, చైనా, యు.కె.లతో సహా 89-91 దేశాలు ఆమోదిం చాయి. అంతేకాదు ఈ సదస్సు ద్వారా కృత్రిమ మేధలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఆవిష్కృతం కావడం విశేషం.

డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు

–   అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటు ధరలో, ప్రాథమిక ఏఐ వనరులను ఉపయోగించుకునే వీలు కల్పించేందుకు ఒక చార్టర్ రూపకల్పన.

–    ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐను మరింత విస్తరించేందుకు వీలుగా ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయడం.

–   ఏఐ ఉపకరణాల నిల్వకు అనువైన ప్రదేశాల (డేటా రిపోజిటరీ) ఏర్పాటు, ప్రామాణికతల పాటింపుతో పాటు స్థానిక సంస్కృతులకు తేలిగ్గా అనువర్తనం కాగల ఉత్తమ ఏఐ వ్యవస్థల వినియోగ విధానాలను అనుసరించడం.

250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ఈ సదస్సు సందర్భంగా మనదేశంలో ఏఐ మౌలిక సదుపాయాల కోసం 250 బిలియన్ డాలర్లు, డీప్ – టెక్ వెంచర్ ఫండింగ్‌లో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ లభించడం గొప్పమైలు రాయిగా చెప్పవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియోలు రాబోయే ఏడేళ్ల కాలంలో రూ.10లక్షల కోట్లు (120 బిలియన్ డాలర్లు)పెట్టుబడితో “మల్టీ గిగావాట్ ఏఐ-రెడీ సెంటర్ల” ఏర్పాటుతో పాటు “ఎడ్జ్ ఏఐ” మౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా కల్పించేం దుకు హామీ ఇచ్చాయి. ఆదాని గ్రూప్ దేశంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనంతో నడిచే ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును 2035 నాటికి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇక గ్లోబల్ దిగ్గజం గూగుల్ దేశంలో డేటాసెంటర్లు, సముద్రం అడుగున కేబుల్స్ నిర్మాణానికి 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ సౌత్ దేశాల్లో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్లను మరింత విస్తృతం చేయనున్నది. దేశంలో 20వేల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ)ల ఏర్పాటు చేసేందుకు ప్రణాళికా రచన పూర్తయినట్టు మనదేశం ప్రకటించింది. అంతేకాదు ఏఐ రంగంలో దేశీయ పరిశోధనలకు మరింత ఊపు కల్పించేందుకు వీలుగా దేశంలో 2026 చివరి నాటికి లక్ష జీపీయూలను నెలకొల్పాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటివరకు ఏఐ వినియోగదారు స్థానం నుంచి ఏఐ సృష్టించే దశకు మారేందుకు వీలుగా “భారత్ తయారీ” నమూనాలను ప్రభుత్వం ప్రకటించింది.

సర్వమ్ ఏఐ: దేశంలోని వివిధ ప్రాంతీయ భాషలను దృష్టిలో ఉంచుకొని 30 బిలియన్ల నుంచి 105 బిలియన్ పరామితుల్లో ప్రాథమిక నమూనా లను ఆవిష్కరించింది.

భారత్ జెన్ (పరమ్-2): ఇది 17 బిలియన్ల పరామితి కలిగి దేశంలోని 22 ప్రాంతీయ భాషలకు మద్దతునిస్తుంది. ముఖ్యంగా ప్రజాసేవలకు దీన్ని ఉద్దేశించారు.

జ్ఞాని ఏఐ: ఇందులో భాగంగా “వచన ఎస్‌టీటీ”ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎంటర్ ప్రెన్యూర్ గ్రేడ్‌కు చెందిన ఇది, ఇండో-ఆర్యన్ భాషలను గుర్తించేందుకు ఉపయోగించే నమూనా. మొత్తం ఒక మిలియన్ అవర్స్ వీడియో డేటాపై దీనికి శిక్షణ ఇచ్చారు.

కేవలం 24 గంటల వ్యవధిలో 2.5లక్షల “ఏఐ రెస్పాన్సిబిలిటీ” ప్రతిజ్ఞలు చేయించడం ద్వారా భారత్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించు కుంది. “ఏఐ బై హర” (మహిళల నేతృత్వంలో స్టార్టప్‌లు), “యువ ఏఐ” (18-31 మధ్య వయస్కులైన యువ ఇన్నోవేటర్లు) లతో పాటు “ఏఐ ఫర్ ఆల” వంటి కార్యక్రమాల ద్వారా అట్టడుగు స్థాయిలోని ఇన్నోవేటర్లకు తగిన ప్రోత్సాహం కల్పించాలన్న అంశాన్ని సదస్సు గుర్తించింది. ఈ సదస్సు సందర్భంగా టాటా గ్రూప్, ఓపెన్ ఏఐలు బహు కోణాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. మౌలిక సదుపాయాలు, సంస్థల అనువర్తనం, సామాజిక ప్రభావ రంగాలపై ఈ సహకారం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ సదస్సు సందర్భంగా ఒక గిగావాట్`స్కేల్ సామర్థ్యంతో ఏఐ మౌలిక సదుపాయాల కల్పనకు టీసీఎస్ ముందుకు రావడం గొప్ప విశేషం. ఇది దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డీల్‌గా చెప్పవచ్చు. ఇందులో భాగంగా దాదాపు పూర్తి ఏఐ డేటా సామర్థ్యం కలిగిన “హైపర్ వాలెట”ను టీసీఎస్ నెలకొల్పుతుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల కార్యకాలాపాల్లో ఆధునిక ఏఐ నమూనాలను ప్రవేశపెట్టనుంది. బ్యాంకింగ్, ఆరోగ్యం, రిటైల్, తయారీ రంగాల్లో, ఉమ్మడి వెంచర్స్ ప్రారంభించి పారిశ్రామిక పరిష్కార విధానాలను అభివృద్ధి చేయ నున్నారు. కృత్రిమమేధను కేవలం టెక్ట్స్ క్రియేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాన్ని చూపే విధంగా స్వయంచాలిత వ్యవస్థలను రూపొందిస్తారు. వీటిని “ఏజెంటిక్`ఏఐ” అని వ్యవహరిస్తారు.

ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటైన భాగ స్వామ్యాల వల్ల దేశంలో ఏఐ సామాజికంగా అందరికీ అందుబాటులోకి రాగలదు. ఇందులో భాగంగా 2వేల మంది ఇంజినీరింగేతర విద్యార్థులు ఏఐ టూల్స్‌ను ఉపయోగించి దేశీయ భాషల్లో యాప్ ప్రొటోటైప్‌లను రూపొందించడం విశేషం. ఓపెన్ ఏఐ, టీసీఎస్ సంస్థలు పదిలక్షల మంది యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం వీరికి ఏఐ, వనరులను బాధ్యతాయుతంగా ఉపయో గించుకునే అంశాలపై తగిన శిక్షణ ఇస్తారు. అంతే కాదు స్వచ్ఛంద సంస్థలకు అనుగుణంగా ఏఐ టూల్‌కిట్స్ అభివృద్ధిపై కూడా దృష్టి కేంద్రీకరిస్తారు.

భారత్యు – ఎస్ ద్వైపాక్షిక ఒప్పందం

ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్లు, ఆధునిక కంప్యూటింగ్ హార్డ్‌వేర్, క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసులకు సంబంధించి అమెరికా నాయకత్వం లోని ఫ్రేమ్‌వర్క్‌లో భారత్ చేరడం కీలకం. ఉమ్మడిగా పరిశోధన, అభివృద్ధి, తర్వాతి తరం డేటాసెంటర్ల ఏర్పాటు, నియంత్రణల విషయంలో పరస్పర సహకారం వంటి అంశాలపై భారత్`అమెరికాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. సెమికండక్టర్ల తయారీని “హై రిస్క”దేశాలనుంచి అత్యంత విశ్వసనీయ భాగస్వామి భారత్‌కు బదలాయించడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. ఏఐ చిప్‌లకు అవసరమైన గాలియం, జర్మేనియం, లీథియం వంటి క్రిటికల్ ఖనిజాల సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా జరిగేలా ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. అంతేకాదు “సెమికాన్ ఇండియా” పథకం కింద మనదేశంలో అమెరికా ఫ్యాబ్రికేషన్ యూనిట్లను నెలకొల్పుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలకు రెండు దేశాలు పెట్టుబడులు పెడతాయి. బాధ్యతాయుతమైన ఏఐ ఉమ్మడి ప్రమాణాలపై పనిచేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. జీపీయూ వంటి సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానాల దిగుమతులపై అమెరికా, భారత్‌లు ఎటువంటి టారిఫ్‌లు విధించవు (“జెడ్జె-డ్ ఒప్పం దం). ఇదే సమయంలో రెండు దేశాల్లో పనిచేస్తున్న ఏఐ స్టార్టప్‌లు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకునే వీలు కల్పించడానికి అంగీకరించాయి. సివిల్, మిలిటరీ ఎగుమతులపై ఎగుమతి నియంత్ర ణలను తొలగించేందుకు యు.ఎస్. అంగీకరించింది. “ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ” (ఐసెట్) ఛత్రం కింద భారత్‌కు వీటిని యుఎస్ ఎగుమతి చేస్తుంది.

జీపీఏఐ కొత్త అధ్యక్షురాలు సెర్బియా

ఇప్పటివరకు గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిసి యల్ ఇంటెలిజెన్స్ (జీపీఏఐ)కి అధ్యక్ష బాధ్యతలు వహించిన మనదేశం, కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికైన సెర్బియాకు ఏఐకి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను అందజేసింది. యూరోపియన్ యూనియన్‌తో పాటు మరో 29 దేశాలు జీపీఏఐలో సభ్యులుగా ఉన్నాయి. ఇదే సమయంలో న్యూఢిల్లీ డిక్లరేషన్-2026కు మద్దతిచ్చే విధంగా అమెరికా నుంచి స్పష్టమైన హామీని పొందడం విశేషం. ముఖ్యంగా అంతర్జాతీయ ఏఐ అజెండాలో గ్లోబల్ సౌత్‌కు శాశ్వత ప్రాధాన్యత కల్పించేందుకు మనదేశం అమెరికాను ఒప్పించింది. అంటే ఈ అజెండాలో గ్లోబల్ సౌత్ భాషలకు తగిన ప్రాధాన్యత కొనసాగు తుంది. మొత్తంమీద చెప్పాలంటే ఈ సదస్సు వల్ల భారత్‌లోని స్టార్టప్‌ల ఎకోసిస్టమ్ పూర్తిగా మార నున్నది. ఇదే సమయంలో మనదేశం ఏఐ వినియోగ దారుడి స్థానం నుంచి ఏఐ ఎగుమతి స్థాయికి ఎదగడానికి ఈ సదస్సు దోహదం చేసింది. అంతే కాదు దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలపై 250 బిలియన్ డాలర్ల పెట్టుబడుల హామీలు రావడంతో, 2027 నాటికి 12.5లక్షల మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

యూత్ కాంగ్రెస్ నిరసన

ఏఐ సదస్సు ప్రాంగణంలో 10-15 మంది యూత్ కాంగ్రెస్ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేయడం తీవ్ర వివాదాన్ని సృష్టించింది. వీరంతా రిజిస్టర్డ్ క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ప్రాంగణంలోకి ప్రవేశించారు. వీరు భారత్- అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, ప్రధాని మోదీ అమెరికాకు లొంగి పోయారంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 11 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 24న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లకు చెందిన ఆఫీస్ బేరర్లు ఉన్నారు. వీరిపై పోలీసులు భారతీయ న్యాయసంహిత (బీఎనఎస్)లోని 191, 196, 197 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని హిమాచల్ సదన్‌లో ఆశ్రయం పొందిన నిరసనకారులను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన ఢిల్లీ పోలీసు అధికారులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు దుమారం రేపాయి. ఇదిలావుండగా ఈ నిరసనలపై పరస్పర విరుద్ధ వాదనలు వినిపిం చాయి. భారత్`యుఎస్ ఒప్పందం, అమెరికాకు అనుకూలంగా ఉన్నదన్న కారణంగా ఈ నిరసనలు చేపట్టామని కాంగ్రెస్ వాదించగా, రాహుల్ గాంధీ వీరిని ఏకంగా “బబ్బర్ షేర” (సింహాలు) అని సంబోధించడమే కాదు, ఈ అరెస్ట్‌లు అప్రజాస్వామిక మంటూ ఖండించారు.ఈ ఒప్పందం వల్ల భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్, నిరుద్యోగ సమస్యలనుంచి ప్రజల దష్టి మరల్చడానికే ప్రభుత్వం ఈ అరెస్ట్‌లకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను చూపి ట్రంప్ చేసిన బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ఇటువంటి “నగ్న రాజకీయాలు” నెరపుతోందని బీజేపీ ఎదురు దాడికి దిగింది. సుందర్ పిచాయ్, శ్యాం ఆల్ట్‌మాన్ వంటి దిగ్గజాలు పాల్గొన్న సదస్సును అభాసుపాలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని దుయ్యబట్టింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్ ఈ కుట్రకు పాల్పడిందని పోలీసులు, బీజేపీ నేతలు ఆరోపించారు. ఇతరదేశాల్లో నిరసనల పేరుతో చోటు చేసు కున్న హింసాత్మక సంఘటనల స్ఫూర్తితోనే యూత్ కాంగ్రెస్ సభ్యులు ఈవిధంగా ప్రవర్తించారని విమర్శించారు. దేశం సాధిస్తున్న సాంకేతిక ప్రగతిపై, కాంగ్రెస్‌కు నిర్మాణాత్మక దృక్కోణం లేకపోవడాన్ని ఈ సంఘటన వెల్లడిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూత్ కాంగ్రెస్ సభ్యులు షర్ట్‌లు విప్పి నిరసన ప్రదర్శన ద్వారా అందరికీ ఆకర్షించడానికి యత్నించారన్నది మరో ప్రధాన ఆరోపణ. ఇదిలావుండగా సంయుక్త్ కిసాన్ మోర్చాతో కలిసి కాంగ్రెస్ భారత్ బంద్‌కు పిలుపునివ్వడం మరో విపరిణామం. ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింత పెంచేందుకే కాంగ్రెస్ నాయకత్వం ఈ వ్యూహం పన్నిందనేది సుస్పష్టం. యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన పని పూర్తిగా తప్పన్న సంగతి సువ్యవస్థితమైంది. కాకపోతే అంపశయ్యపై ఉన్న యూత్‌కాంగ్రెస్‌కు ఇది కొత్త ఊపిరినిచ్చిందని వాదించేవారు లేకపోలేదు. ఈ నిరసనల పై ఇండియా కూటమిలోనే విభేదాలు వెల్లడయ్యాయి. అఖిలేష్ యాదవ్, మాయావతిలు ఈ వివాదానికి దూరంగా ఉండటం గమనార్హం. ఈ నిరసనలు అవమానకరమైనవి మాత్రమే కాదు, ఎంచుకున్న సమయం కూడా ముచితమైంది కాదని వీరు అభిప్రాయపడ్డారు. వైస్ ఛాన్స్‌లర్లు, ఐఐటీ ప్రొఫెసర్లతో పాటు 270 మంది ప్రముఖ వ్యక్తులు ఈ నిరసనలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని పేర్కొంటూ ఒక లేఖపై సంతకాలు చేశారు. ఈ సంఘటన కాంగ్రెస్ “భారత్ వ్యతిరేక వైఖరి”ని స్పష్టం చేస్తున్నదంటూ బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ చేసిన పనిని సొంత కూటమిలోని పార్టీలే వ్యతిరేకించడం గమనార్హం. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతల వ్యూహం బూమరాంగ్ అయి పార్టీ ప్రతిష్ట మరింత దెబ్బతిన్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

జమలాపురపు విఠల్‌రావు,  

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE