ఆత్మ గౌరవం అంటే ఏమిటో, అస్తిత్వ భావన అవసరం ఏమిటో, దాస్యం ఎంత నీచమో, విముక్తి ఎంత అవసరమో ఒక పురాణగాథ డాక్టర్జీకి అవగాహనకు వచ్చేటట్టు చేసిందనవచ్చు. గొప్ప సంస్కృతిని అనుభవించిన ఏ దేశమైనా సామాజికమే కాదు, మానసిక దాస్యం నుంచి విముక్తి పొందడానికి కూడా పోరాడడం అనివార్యమని ఆ కథ నుంచి ఆయన గ్రహించారని భావించవచ్చు.
వాసుదేవశాస్త్రి సంగమ్‌కర్ ఒక సందర్భంలో వారి స్వస్థలం కందకుర్తి గురించి తన ఆప్తమిత్రుడు డాక్టర్జీకి కొన్ని విషయాలు చెప్పారు. మంజీరను ‘గరుడ గంగ’ అని పిలుస్తారనీ చెప్పారు. అప్పుడే మహాభారతంలోని వినత, కద్రువల గాథ, తల్లి దాస్య విముక్తి కోసం గరుడుడు పడిన తపన, చేసిన పోరాటం, చివరికి తల్లిని విముక్తం చేసిన విజయగాథని వాసుదేవశాస్త్రి చెప్పారు. గరుడుడు ఎంత బలశాలి అంటే ఒక్కసారి రెక్కలు ఆడిస్తే పర్వతాలు ఎగిరిపడతాయని పురాణాలు చెబుతాయి. గరుత్మంతుడి గాథ ఒక ప్రభంజనం మాదిరిగానే డాక్టర్జీ గుండెను తాకింది. ఆ పర్వతాల మాదిరిగానే కదిలిపోయింది.
వినత, కద్రువ దక్షుని కుమార్తెలు. వీరిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. అక్కాచెల్లెళ్లే అయినా ఇద్దరి మధ్య మాత్సర్యం, అసూయా ద్వేషాలు ఉండేవి. ఇంకొందరు భార్యలున్నా ఈ ఇద్దరూ అంటే కశ్యపునికి అనురాగం. అందుకే వరాలు కోరుకొమ్మన్నాడు. చిన్నదైన కద్రువ మొదట కోరుకుంది. మహా శక్తుమంతులైన నూర్గురు సంతానం కావాలంది. తనకు ఇద్దరు చాలు, కానీ వాళ్లు కద్రువ సంతానానికి ప్రాణాంతకంగా ఉండాలి అని కోరింది వినత. కద్రువకు నూరు నాగులు పుట్టాయి. వీరే కాద్రవేయులు. అంటే నాగజాతి. వినత గర్భం దాల్చినా ప్రసవం కాలేదు. కద్రువ మీద అసూయతో విచక్షణను మరచి తన కడుపు మీద తనే బాదుకుంది వినత. దీనితో కాళ్లు లేకుండా పై భాగంతో ఒక అసంపూర్ణ శిశువు వచ్చింది. అతడే అనూరుడు లేదా అరుణుడు. ఇతడు సూర్యునికి రథసారథిగా వెళ్లిపోతూ తల్లి అసూయాద్వేషాల పట్ల మనస్తాపంతో, ‘నీవు ఎవరి మీద ద్వేషంతో నాకు ఇలాంటి జన్మను ఇచ్చావో, ఆమెకే దాసిగా మారిపోతావు’ అని శపించాడు. అయితే, నీకు మరొక కుమారుడు పుడతాడు. మహా శక్తి సంపన్నుడు. అతడి విషయంలో ఇలాంటి తొందరపాటును ప్రదర్శించ వద్దని హెచ్చరించాడు. కొద్దికాలానికి గరుడుడు జన్మించాడు. అప్పటికి వినత తన చెల్లెలు కదృవకు బానిసగా మారిపోయింది. అదే అసలు కథ.
మహా బలశాలి, అయినా బానిస కొడుకు కాబట్టి ఇతడూ బానిసత్వంలోనే ఉన్నాడు. తనకు ఆహారంగా ఉండే పాములు ఇతడి సోదరులు. బానిస కాబట్టి వాటిని భుజాల మీద ఎక్కించుకుని విశ్వమంతా తిప్పుతూ ఉండేవాడు. కానీ సర్వశక్తి శాలికి, కారణజన్ముడికి దాస్యం ఎంత దుర్భరం? తల్లిని అడిగాడు, ఎందుకీ దాస్యం అని! ఆమె చెప్పింది.
ఒకసారి వినత, కద్రువ విహారానికి వెళ్లారు. దూరంగా ఇంద్రుడి గుర్రం ఉచ్చైశ్రవం కనిపించింది. ఎంతో తెల్లగా ఉంటుందట. అప్పుడే కద్రువ మదిలో ఒక కుయుక్తి జనించింది. ‘వినతా! ఆ తెల్లని గుర్రంలో నల్ల మచ్చ ఉంది కదా!’ అన్నది. వినతి మాత్రం ‘మచ్చ లేదు’ అంది. కద్రువ, నా మాట నిజమైతే నాకు దాసిగా ఉండాలంటూ పందెం వేసింది. ఆ పందెంలో ఓడిపోతానని కద్రువకు తెలుసు. అందుకే ఏదో పక్కదారి చూడాలి. కాద్రవేయులందరినీ పిలిచి, విషయం చెప్పింది. మీలో ఒకరు ఆ గుర్రం తోకకి చుట్టుకుని మచ్చ ఉన్నట్టు భ్రమ కల్పిస్తే నేను నెగ్గుతాను. నాకు శత్రువు వంటి వినత, మహా బలశాలి అయిన ఆమె కొడుకు గరుడుడు కూడా మనకు బానిసలవుతారు అంది.
అవి పాములే కావచ్చు. పాలు పోస్తే విషం కక్కుతాయని చెప్పుకోవచ్చు. కానీ ద్వాపరయుగం నాటి ఆ పాములు తల్లే అయినా కద్రువ కుయుక్తిని సమర్థించలేదు. ఆ పనికి ఒక్కటి కూడా అంగీకరించలేదు. మరింత అక్కసుతో కద్రువ పుత్రులను శపించింది, ‘జనమేజయుడు జరిపే సర్పయాగంలో మీరంతా కాలిపోతారు’ అని. కానీ కర్కోటకుడు అనేవాడు మాత్రం తల్లి మాటకు సరే అన్నాడు. వినత ఓడిపోయి, దాసిఅయింది. ఆమెతో పాటు గరుడుడు కూడా. ఈ దాస్యం ఇలా కొనసాగడానికి వీల్లేదు. తల్లికిన్ మనఃప్రీతి యొనర్చుచున్న గసధ భీమ జపంబునరబీ వీధికిన’ (నేను పుట్టిందే తల్లికి దాస్య విముక్తి కల్పించడానికి) అని నిశ్చయించుకున్నాడు గరుత్మంతుడు. పిన్ని దగ్గరకు వెళ్లి దాస్య విముక్తికి ఏం చేయాలో చెప్పమన్నాడు. క్షీరసాగర మథనం జరిగి అమృతం అవతరించింది. తన సంతానం చిరంజీవులుగా ఉండిపోవడానికి ఆ అమృతం తెచ్చి పెట్టు అంది. సరే అన్నాడాయన. అన్నాడే కానీ, నాగులు చిరంజీవులయితే ఎంత ప్రమాదం? అన్న శంక కలిగింది.
తప్పదు, పినతల్లి వలెనే కుయుక్తిని ఆశ్రయించాలి అనుకున్నాడు. దేవలోకం వెళ్లి ఇంద్రాదిదేవతలతో యుద్ధం చేసి అమృతభాండం తెచ్చాడు. పాములన్నీ అమృతం కోసం వచ్చేశాయి. ఇది క్షీరసాగర మథనం నుంచి వచ్చింది, పవిత్ర స్నానాలు చేసి రండి, ఇక్కడే పెడుతున్నాను, అంటూ పవిత్రంగా నది ఒడ్డున దర్భల మీద ఉంచాడు. పాములు స్నానానికి వెళ్లాయి. పినతల్లిని పిలిచి ఇదిగో అమృతం అన్నాడు. నా తల్లికి దాస్య విముక్తి అయిందా అని అడిగాడు. అయిందని చెప్పింది కద్రువ. అమృతం తెచ్చి మాట నిలబెట్టుకున్నాడు. తల్లికి దాస్యం వదిలింది. అంతే, తల్లినీ, భాండాన్ని తీసుకుని మాయమయ్యాడు. స్నానం చేసి వచ్చిన పాములు భాండం ఉంచిన ఆ దర్భగడ్డినే ఆబగా నాకేశాయట. అందుకే నాగజాతి నాలుక రెండుగా చీలిందని కథ.
ఈ కథలో ప్రతి పాత్ర అద్భుతం. వినత, కద్రువ సౌందర్యవతులు. కానీ అహంతో కొన్ని తరాల నాశనానికి కారణమయ్యారు. పాములు శక్తి సంపన్నతకు సంకేతం. ఇవన్నీ సర్పయాగంలో స్వాహా అయ్యాయి. గరుడుడు మహా బలశాలి. అయినా దాస్యంలో బందీ. బానిసత్వంలో ఉన్నామన్న సంగతిని గుర్తించడం, దానిని నుంచి విముక్తం కావాలన్న ఆకాంక్షతో ఉండడం ఈ పాత్ర గొప్పతనం. మహా సంకల్పంతో, యుక్తితో దాస్యం మీద తిరుగుబాటు చేశాడు. భారతీయ పురాణంలోని ఈ కథనం, పాత్రలు భారత చరిత్ర ప్రతి మలుపును గుర్తుకు తెస్తాయి.
అందుకే, మంజీర ఒడ్డుకు చెందిన కుటుంబంలో పుట్టినవానిగా నేను కూడా గరుత్మంతుడు తల్లిని దాస్య విముక్తి చేసిన విధంగానే మాతృభూమికి దాస్య విముక్తి కల్పిస్తాను. నేను అందుకే పుట్టాను అని ఆ క్షణంలోనే శపథం చేశారట డాక్టర్జీ.
ఈ మాటకు కలతపడ్డారు వాసుదేవశాస్త్రి. కేశవరావ్ ఆవేశం, పట్టుదల ఆయనకు తెలుసు. హెడ్గెవార్ కుటుంబీకులలో కనిపించే మాట పట్టింపు ఆయనకి తెలియనవి కావు. కానీ డాక్టర్జీ రంగంలోకి దిగిన తరువాత మనస్పూర్తిగా సహకరించారాయన.
– జాగృతి డెస్క్