తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సమయంలో, కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు కలవరపరిచే ఘటనలు చోటు చేసుకోవడం విస్తృత చర్చకు దారితీసింది. రాజకీయ, సామాజిక, ప్రజా భద్రతకు సంబంధించిన ఈ పరిణామాలు ప్రకంపనలు సృష్టించాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా ఆలయం ఆవరణలో ఒక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మరణించిన ఘటన యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతిలో ముంచింది. మరోవైపు, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి, విపక్ష నేతల నిర్బంధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఈ రెండు సంఘటనలు సామాన్యుల రక్షణ, పోలీసు వ్యవస్థ నిష్పక్షపాత వైఖరిని, ప్రజాస్వామ్య హక్కులను ప్రశ్నార్థకం చేశాయి.
ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా, కుమ్మెరలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర జరిగింది. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతరకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రజక కుటుంబానికి చెందిన చంద్రకళ, ఆమె కొడుకు గణేశ్, కోడలు మౌనిక, వాళ్ల రెండు నెలల పసిపాపతో కలిసి దైవ దర్శనానికి వెళ్లారు. గణేశ్ బీసీ వర్గానికిì, మౌనిక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. వారిది ప్రేమ వివాహం. వారికి ఇటీవలే పసిపాప జన్మించింది. 18వ తేదీ రాత్రి కుటుంబసభ్యులందరూ ఆలయం ముందు క్యూలో నిలబడినప్పుడు, క్యూ నిర్వహణలో ఉన్న స్థానికుడు ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. టికెట్ వ్యవస్థ లేనప్పుడు డబ్బులు ఎందుకు అని అక్కడున్న మహిళలు ప్రశ్నించడంతో, శ్రీనివాసరెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మౌనిక కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న మౌనిక భర్త గణేశ్ అక్కడికి వచ్చి శ్రీనివాసరెడ్డిని నిలదీశాడు.
గణేశ్‌ను గ్రామ సర్పంచ్ తుకారాంరెడ్డి సహా పలువురు కులం పేరుతో దూషిస్తూ.. దాడి చేసి, ఒక గదిలో బంధించి ఇనుప రాడ్లు, కొబ్బరి కాయలతో దారుణంగా కొట్టారు. ఆ తోపులాటలో సంగం మధురెడ్డి తమ పసిపాపను తన్నినట్లు మౌనిక రోదిస్తూ తెలియజేసింది. ఆ దాడిలో పసిపాప చలనం లేకుండా పడిపోయిందని కన్నీరు మున్నీరయ్యింది. ఈ పరిణామానికి సంబంధించి తమను వదిలేయా లని ప్రాధేయపడ్డా.. అక్కడి అగ్రవర్ణాల వాళ్లు వదిలేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే “కాళ్లు పట్టుకుంటాం, వదిలేయండి” అని మహిళలు వేడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయినప్పటికీ ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సక్రమంగా స్పందించలేదని, తమ విధులను సరిగా నిర్వర్తించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే, ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం మౌనిక తన కూతురు తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో బాధపడుతూ స్పందించడం లేదని గమనించి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి హుటా హుటిన తీసుకువెళ్లింది. కానీ, అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. ఈ దుర్వార్త రాష్ట్రమంతటా వ్యాపించడం సంచలనం సృష్టించింది. పైగా ఈ దుర్ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో జరగడం మరింత అలజడి రేపింది.
పోలీసుల వాదనలు
ఈ పరిణామం రాష్ట్రమంతటా ప్రకంపనలు సృష్టించడం, పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన లోని వివరాల ప్రకారం సంఘటన జరిగిన రాత్రే గణేశ్ రాయితో తన తలను గాయపరిచాడంటూ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదైందని పేర్కొన్నారు.
గణేశ్ కుటుంబం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా, వారి ఫిర్యాదును మొదట్లో జనరల్ డైరీలో నాన్ కాగ్నిజబుల్‌గా నమోదు చేశారు. కోర్టు అనుమతి తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన మాత్రమే కేసు నమోదు చేశారు. ఇక, రెండు నెలల శిశువు మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు.
మరణానికి కారణాలు అధికారికంగా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ హిస్టోపాథాలజీ నివేదిక కోసం నిరీక్షిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు.. ఫిబ్రవరి 22వ తేదీన పసిపాప తల్లి మౌనిక అదనపు వాంగ్మూలం ఇవ్వడంతో, SC/ST (POA) చట్టం సెక్షన్లు 3(1) (తీ), 3(1)(s), 3(2)(v) కింద అదనపు కేసు నమోదైంది. ఫిబ్రవరి 23వ తేదీన ప్రధాన నిందితులైన శ్రీనివాస్ రెడ్డి, మధు సూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీరితో పాటు.. ఈ కేసులో నిందితులైన మరో ఆరుగురు.. గ్రామ సర్పంచ్ తుకారాంరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కన్నీరెడ్డి, కటికె నరేష్, సతీష్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అంతేకాదు.. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, డీఎస్పీ శ్రీనివాస్ కుమ్మెర గ్రామాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించారని పోలీసు శాఖ వెల్లడించింది.
ప్రభుత్వం నుంచి స్పందన కరువు- మంత్రుల మౌనం
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక స్పందన గానీ, తదుపరి చర్యలపై ఆదేశాలు గానీ వెలువడకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈనెల 23వ తేదీ రాత్రి కేబినెట్ సమావేశం అనం తరం మంత్రులు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం తర్వాత విలేకరులు ప్రశ్నించి నప్పటికీ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి మౌనంగా ఈ అంశాన్ని దాటవేశారు. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం జిల్లా ఎస్పీతో మాట్లాడానంటూ ముక్తసరిగా మాత్రమే సమాధానం చెప్పారు. ఈ పరిణామంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితు లను వెనుకేసుకొస్తున్నారని, దీనికి కారణం అధికార పార్టీతో వారికున్న సంబంధాలేనని బీజేపీ సహా విపక్షాలు, సామాజికసంఘాలు తీవ్రంగా మండిపడు తున్నాయి. సర్పంచ్ తుకారాంరెడ్డి ఒక ఎమ్మెల్సీ బావమరిది అని తెలియడంతో ఆ ఆరోపణలకు బలం చేకూరింది. బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు వరుసగా 48 గంటల పాటు పెద్ద ఎత్తున నిరసన తెలిపిన తర్వాతనే ప్రభుత్వం, పోలీసులు ఆ మాత్రం కదిలారన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
జాతీయ స్థాయిలో చర్చ
ఈ పరిణామం రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో కలకలం సృష్టించింది. జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఈ ఘటనపై స్వయంగా కేసు నమోదు చేయడంతో పాటు.. సంబంధిత అధికారుల నుండి వివరణాత్మక నివేదిక కోరింది. బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి ఒత్తిడి తీసుకువచ్చారు.
ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధులు దిలీప్ ఆచారి, డాక్టర్ సోలంకి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు తదితరులతో కలిసి కుమ్మెరకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అంతేకాదు.. అంతకుముందే బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆనంద్ గౌడ్ స్వయంగా కుమ్మెరకు వెళ్లి డీఎస్పీతో మాట్లాడారు. పసిపాప మరణంపై హత్య కేసు నమోదు చేయాలని, SC/ST అట్రాసిటీ చట్టం కింద కఠినంగా కేసు నమోదు చేసి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పసిపాప మృతిపై మహిళా కమిషన్ సుమోటో కేసు నమోదు చేయాలని కూడా కోరారు.
కామారెడ్డిలో హింస, నిర్బంధం
నాగర్‌కర్నూల్ ఘటనతో రాష్ట్రం ఓవైపు.. అట్టుడికి పోతుండగానే.. కామారెడ్డిలో మరో దారుణం చోటు చేసుకుంది. కళాశాల భూమి వివాదం నేపథ్యంలో ఫిబ్రవరి 20, 21 తేదీల్లో కామారెడ్డిలో హింసాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు.. బీజేపీ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు. పోలీసులపై రాళ్లు కూడా విసిరారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడించి “జెయింట్ కిల్లర”గా ప్రజాదరణ పొందిన నాయకుడు. వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీసుపై దాడి వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ పరిణామాలతో బాధిత కార్యకర్తలను పరామర్శించేందుకు, ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపేందుకు కామారెడ్డికి బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావును ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బాన్సువాడలో గాయపడిన కార్యకర్తలను కలిసేం దుకు ప్రయాణమైన ఆయనను అడ్డుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాత్రం పోలీసుల కన్నుగప్పి కామారెడ్డి చేరుకుని, ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపి, దాడిని ఎంపీ ఖండించారు.
కేంద్ర మంత్రుల మండిపాటు
తెలంగాణలో పరిస్థితులు ఆందోళన కలిగించే విగా ఉన్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్‌లను అప్రకటిత అత్యవసర స్థితితో పోల్చారు. దాడి చేసినవారిపై చర్య తీసుకోకుండా, విపక్ష నేతను నిర్బంధించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రతిస్పందించారు.
హౌస్ అరెస్ట్ నుండి విడుదలైన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ – కరీంనగర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ బీజేపీ గెలవడం, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవడం వంటి ఎన్నికల పరిణామాలు చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ అణచివేత మార్గాన్ని ఎంచుకుందని ఆరోపించారు.
రెండు ఘటనల్లోనూ కాంగ్రెస్ మార్క్
కుమ్మెర, కామారెడ్డి రెండు చోట్లా బాధితులు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వెనుకబడిన కుటుంబాలు. అంతేకాదు.. ఈ ఘటనల్లో నిందితులకు అధికార పార్టీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. రెండు చోట్లా పోలీసులు మొదట్లో ఫిర్యా దులను తీవ్రంగా పరిగణించలేదని, బాధితులను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ప్రజల నుంచి, విపక్షాల నుంచి విమర్శలు, ఒత్తిళ్లు వచ్చిన తర్వాత పోలీసులు తూతూ మంత్రంగా స్పందించారన్న ఆరోపణలున్నాయి. ఇక, కామారెడ్డిలో పరిస్థితులు ప్రస్తుతం కొంత అదుపులో ఉన్నప్పటికీ రాజకీయంగా ఉద్రిక్తత కొనసాగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రెండే లక్ష్యాలతో నడుస్తోందని బీజేపీ ఆరోపించింది. ఒకటి ఎంఐఎంను కాపాడుకోవడం, రెండోది అవినీతిని కప్పిపుచ్చేందుకు పోలీసువ్యవస్థను ఉపయోగిం చుకోవడం. బీసీలు, ఎస్సీలు, హిందూ సమాజంపై దాడులు చేస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వమే రక్షణగా నిలబడుతోందన్న భావన ప్రజల్లో బలపడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. రెండు ఘటనల్లోనూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ రెండు పరిణామాలు కేవలం రాజకీయ వివాదానికే పరిమితం కాదని, ఇవి తెలంగాణ సమాజంలో అట్టడుగు వర్గాల భద్రత, చట్టాల అమలు, అధికార యంత్రాంగం విశ్వసనీ యత, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంబంధించిన మౌలికమైన ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి మౌనం వీడుతుందో చూడాలి.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068