ఇండియా బ్లాక్ నేత ఎవరు? ఈ ప్రశ్న జాతినేమీ వేధించడం లేదు కానీ ఒకరిద్దరిని బాగా తొలుస్తోంది. మళ్లీ వారిద్దరిలో ఎవరి బాధ వారిది. అందులో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అనే వీర తమిళుడు, శూర హిందూ వ్యతిరేకి ఒకరు. రెండోవారు మలయాళీయే అయినా ఏనాడూ అక్కడ నివసించని మణిశంకర్ అయ్యర్ అనే వ్యర్థజీవి. వీర సావర్కర్‌ని దూషించడమే కాదు, నరేంద్ర మోదీని టీ అమ్ముకునేవాడని విమర్శించిన కుసంస్కారి. త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్న తమిళనాడులో ఇప్పుడు ఉదయనిధి ఇలాంటి వాదన ఎందుకు తెర మీదకు తీసుకువచ్చారు? అలాగే ఖాళీ అయిపోయి, కాళ్లు బారజాపుకుని కూర్చున్న మణిశంకర్ కూడా అదే విషయాన్ని తెర మీదకు ఎందుకు లాక్కొచ్చారు? ఉదయనిధి బాధ, బహుశా ఎంతకాలమని ఉప ముఖ్య మంత్రిగా ఉండిపోతారు? తండ్రి ఆ కుర్చీ ఖాళీ చేస్తేనే కదా, ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతున్న ఆయన అధిరోహించగలిగేది! కాబట్టి జూ.స్టాలిన్ చక్కగా తేల్చేశారు. తన తండ్రి స్టాలిన్ తమిళనాడుకు ఎలాగూ సమర్ధుడైన నాయకుడు. అదనంగా దేశానికి నాయకత్వం వహించగల సామర్థ్యం కూడా సంతరించుకున్నాడని జాతికి ఎరుకపరిచాడాయన. ఈ ఇద్దరినీ మించిన ఘనుడు, మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ ప్రత్యేక మీడియా కార్యదర్శి సంజయ్ బారు అయితే, జాతీయ నాయకత్వానికి మమతా బెనర్జీ సరైన వ్యక్తి అని మరొక బాణం విసిరారు. మొత్తానికి అటు స్టాలిన్, ఇటు మమత పేర్లు నాయకత్వం కోసం కాసేపు హోరెత్తాయి. ఈ హోరులో ఎగిరిపోయిన పేర్లు రెండు` రాహుల్‌గాంధీ, ఆయన అపూర్వ సహోదరి, రెండు ఇంటి పేర్ల ప్రియాంకా గాంధీ వాద్రా. 


ఫిబ్రవరి 23న ఉదయనిధి తన తండ్రిని జాతీయ బరిలోకి నెట్టేశారు. దీనితో ఒక్కసారిగా ఇండీ కూటమిలో కదలికలాంటిది రాక తప్పలేదు. ఉదయనిధి కోయంబత్తూరులో మాట్లాడుతూ, ‘మా నాన్న నాయకుడు. ఆయన తమిళనాడుకు ఎలాగూ మార్గదర్శకుడే. కానీ యావత్తు భారతదేశానికి కూడా నాయకత్వం వహించగల సత్తా ఆయనకే ఉంది అన్నారు. బీజేపీ మీద ప్రజాస్వామ్య పోరాటానికి నాన్నగారే నాయకత్వం వహించాలని కొంతమంది ప్రతిపక్ష రాజకీయవేత్తలు విపరీతంగా అభిప్రాయపడుతున్నారని కూడా చెప్పారాయన. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్న సమయంలో ఉదయనిధి ఈ మాట అనడం చాలా ప్రశ్నలకు తావిస్తుంది. నిజానికి సీట్ల పంపకం అన్నంత గౌరవప్రదమైన మాట ఇక్కడ అవసరం లేదు కదా అని చాలామంది నిట్టూర్చవచ్చు. దీనిని కాదనలేం. డీఎంకే  వేసే సీట్ల ముష్టి కోసం జరుగుతున్న కాంగ్రెస్ దేబరింత అనవచ్చు. ఇండీ కూటమి నేతగా మమత బెనర్జీ అయితే మహ భేషుగ్గా ఉంటుందని గతంలోను ఒకసారి  ఒక మాట వచ్చింది. కానీ ఆ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఆ రాష్ట్ర నేతలిద్దరినీ ఒకే పదవికి (ఇండీ నాయకత్వం) ప్రతిపాదించడం ఏమిటో! ఇలాంటి ప్రతిపాదన రావడం ఎందుకో అన్న ప్రశ్న మాత్రం గట్టిగానే వినిపిస్తున్నది.

ఆ ప్రశ్నలు ఎలా ఉన్నా, కాంగ్రెస్ మాజీ ప్రముఖుడు మణిశంకర్ అయ్యర్ కూడా ఇండీ కూటమిని నడిపించగల సమర్ధ నేతను స్టాలిన్‌లోనే దర్శించడం విశేషం. ఇండీ కూటమికి ఆయన పదహారణాల సరైన నేత అని ఆయన పొగిడారు. అసలు రాహుల్ భవిష్యత్తు ఇక మీద స్టాలిన్ మీదే ఆధారపడి ఉందని కూడా తేల్చేశారు. నిజమే, రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్‌తో పొత్తంటే భాగస్వాములు హడలిపోతున్నారు. బిహార్, ముంబై కార్పొ¹రేషన్ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత ఎవరికైనా కాంగ్రెస్ వెంట వెళ్లాలంటే వణుకు పుడుతుంది. స్టాలిన్ కాస్త దయతలచి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండదు కానీ, మూడో నాలుగో సీట్లు ఇస్తాం పోటీ చేసుకోండని కరుణించారు.  మణిశంకర్ అయ్యర్ హఠాత్తుగా గళం ఎత్తారు. నేను నెహ్రూవియన్ అవుతాను. ఇందిరావియన్‌నీ అవుతాను. రాజీవీయన్‌ని అన్నా సంతోషమే. కానీ కచ్చితంగా రాహులూవీయన్‌ని మాత్రం కాదు అని కుండబద్దలు కొట్టేసి మరీ చెప్పారు. 2029 ఎన్నికలలో బీజేపీతో పోరాటానికి స్టాలిన్ వినా మరొక నేత ఎవరూ లేరని అయ్యర్ ఢంకా బజాయించారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉంది. ఉదయనిధి స్టాలిన్ చెప్పేదే తన తండ్రి జాతీయ నాయకత్వానికి ఉన్న తిరుగులేని అర్హత. దానితో వచ్చే ఫలితంలో ఎవరికీ వాటా ఉండదు. కానీ మణిశంకర్ దష్టి వేరు. ఏనాడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి వెళ్లిపోయిన ఇండీ కూటమిని బలోపేతం చేసి, రాహుల్ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేయడం. అదీ స్పష్టంగానే చెప్పారు. ఒక పూర్తి సమయం రాజకీయవేత్త వచ్చి ఇండీ కూటమికి రెండేళ్ల పాటు మందులూ మాకులూ ఇస్తే దానికి జీవంవస్తుందని ఆయన నమ్మకం మాత్రమే. తద్వారా రాహుల్ ప్రధాని అవుతారు అంటున్నారు మణిశంకర్. ఇది సాధ్యమేనా అని! ఇంతలోనే ఏమైందో,  స్టాలిన్ మీద మణిశంకర్ అభిప్రాయం నాలుగు రోజులకే మారిపోయింది. మమతా బెనర్జీకి ఇండీ కూటమి నాయకత్వం అప్పగించవలసిందని ఆయన నేరుగా రాహుల్ గాంధీకే సలహా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

ఎవరు మాట్లాడించారో గానీ, మన్మోహన్‌కి  మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు ఒక చిలిపి ప్రతిపాదన, ఒక వాస్తవ ప్రకటన చేశారనాలి. ఒకనాటి తన బాస్‌కు యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ అంటూ అరుదైన పురస్కారం ఇచ్చిన బారు చిలిపి మాట ఏమిటీ అంటే, ఇండీ కూటమి నాయకత్వానికి మమత ఒరలో కత్తిలా సరిగ్గా సరిపోతుందట. యాంకర్ మళ్లీ అడగలేదు కాబోలు. లేకుంటే ఆమె ఇండీ కూటమికి నాయకత్వం వహించడానికే పుట్టింది, మీకు తెలియదా అనేవారే. ఆమె స్వయం నిర్మిత నేత అట. ఇక వాస్తవ ప్రకటన. అలనాడు సోనియాగాంధీ`మన్మోహన్ సింగ్ ద్వయం గురించి చెప్పగానే  విజయం  తన్నుకుంటూ వచ్చి ఒళ్లో వాలినట్టు, ఇవాళ మల్లికార్జున ఖర్గే`రాహుల్ ద్వయం అన్న నినాదం వినిపిస్తే అలాంటిదేమీ జరగదని అంగీకరించారు. మరొక తర్కం కూడా బారు జాతి ముందు పెట్టారు బారు. మహిళను నాయకురాలిగా నిలపడం వ్యూహాత్మకంగా మంచి అడుగు అవుతుందట. మహిళల స్వాతంత్య్రా నికి ఆమె ప్రతీకగా నిలుస్తుందట. అంతేనా! ఇటీవలే బీజేపీ వైపు వెళ్లిపోయిన మహిళా ఓటర్లను అలవోకగా తిరిగి తెచ్చుకునే అవకాశం ఇబ్బడిముబ్బడిగా ఉంటుందట.

మణిశంకర్ చెప్పిన ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని వదిలి పెట్టడం న్యాయం కాదు. ఆయనను కాంగ్రెస్ గతంలోనే బహిష్కరించింది. నరేంద్ర మోదీని టీ అమ్ముకునేవాడు దేశానికి ప్రధాని ఏమిటి వంటి పచ్చి పొగరుమోతు వ్యాఖ్యలు చేసినవాడే ఈ మణిశంకర్. కాబట్టి ఇప్పుడు రాహుల్‌ను తిట్టినా, స్టాలిన్‌ను ఆకాశానికెత్తినా తమకేమీ అభ్యంతరం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ గాంధీ`నెహ్రూ కుటుంబం అంటే ప్రాణం ఇచ్చేస్తామని చెప్పుకునేవారు అక్కడక్కడా ఇంకా ఉన్నారు. అందులో కేరళకే చెందిన రమేశ్ చెన్నితల ఒకరు. ఆయన మణి శంకర్‌ని ‘అదో కిరాయి గొంతు’ అని ఈసడించారు. మణిశంకర్ వంటివారు కాలం చెల్లిన నాయకులు. వాళ్లకి ఇప్పుడు విలువే లేదు. పార్టీలో అసలు స్థానమే లేదని చెన్నితల అన్నారు. మణిశంకర్ మీద కాంగ్రెస్ మండిపాటుకు ఇంకొక కారణం కూడా ఉంది. కేరళలో మార్క్సిస్టుల పాలన మహాద్భుతమని, అక్కడ మళ్లీ సీపీఎం గెలిచి తీరుతుందని మణిశంకర్ కేరళ వెళ్లినప్పుడు ఒక ప్రకటన ఇచ్చారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యమంత్రికి నమూనా అనుకోవచ్చని కూడా గట్టిగా అభిప్రాయపడ్డారు. ఇది పుండు మీద కారం రాసినట్టే అవుతుందని వేరే చెప్పాలా! శశి థరూర్ సిద్ధాంతాలూ అవీ లేని కెరీరిస్టు అని విమర్శించారు. కేసీ వేణుగోపాల్‌ని ఒక రౌడీ అని తేల్చి పారేశారు. ఆ ఇద్దరూ కూడా కాంగ్రెస్ నాయకులే. కేరళ నుంచి వచ్చినవారే. రేపు సీపీఎంతో జరిగే ఎన్నికల యుద్ధంలో పాల్గొనవలసిన వారే కూడా.

అయినా ఇండీ కూటమి నాయకత్వం గురించి ఇప్పుడేమిటీ రచ్చ! అసలు కూటమి నేతల సమావేశం ఏమైనా జరిగిందా? అక్కడ ఎవరినైనా నాయకుడు అంటూ దండేసి చూపించారా  అని ప్రశ్నిస్తున్నారు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఖేలో ఇండియా పేరుతో ప్రస్తుతం గుల్‌మార్గ్‌లో జరుగుతున్న ఆటల పోటీ కోసం వచ్చిన ఒమర్ మధ్యలో ఖాళీ సమయంలో విలేకరులు ఎవరినో ఈ మాట అడిగారు. మమతా బెనర్జీ పేరు ఎక్కడ ఎవరు ఎలా చెప్పారు అని కూడా ఆయన ప్రశ్నించారు. రాహుల్ మీద ప్రత్యక్షంగా ప్రశంస కురింపి,పరోక్షంగా కోపాన్ని కూడా చక్కగా వ్యక్తం చేశారు ఒమర్. మణిశంకర్ అయ్యర్ తన సొంత అభిప్రాయమేదో అది వెల్లడించారు. దానిని ఎవరైనా ఎలా ఆపగలం అని ఎలాంటి శషభిషలు లేకుండానే అన్నారాయన. ఇది లోపలున్న కోపాన్నే తెలియచేస్తుంది. ఇంకా, నాయకుడు ఎవరు అన్నది అంతిమంగా నిర్ణయించేది ఇండీ కూటమి నేతలు. అలా నిర్ణయించిన నేతను అంతా ఆమోదించాల్సిందే నని ఒమర్ తీర్పు కూడా ఇచ్చేశారు. కానీ రాహుల్ విపక్ష నేతగా అద్భుతంగా రాణిస్తున్నారనీ, ఎవరైనా ఆ పాత్ర నుంచి ఇంకా ఏం ఆశించగలరని కూడా అన్నారు ఒమర్. ఇది ప్రశంసే కదా! బీజేపీని కలలో కూడా వదిలి పెట్టకుండా విమర్శించేవారు ఎవరూ అంటే అది రాహుల్. బీజేపీని కలలోనూ వ్యతిరేకించే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన రాహుల్ మాత్రమే. ప్రతి విషయంలోను ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న విపక్ష నేత ఎవరూ అంటే రాహుల్ ఒకడే అని ఒమర్ తీవ్ర స్థాయిలో ప్రశంసలు కురిపించారు.

ఇన్నాళ్లకి ఒక వాస్తవం విపక్షాలకు అర్ధమవు తున్నట్టుంది. గాంధీ`నెహ్రూ కుటుంబాన్ని పట్టుకుని వెళ్లడమంటే, కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమేనన్న పరమ సత్యమేదో వారి బుద్ధియందు జనిస్తున్న సూచనలు పొడసూపుతున్నాయి. అంతవరకు చెప్పుకోవచ్చు. ఇది దేశానికి గొప్ప శుభపరిణామం కావాలని ఆశిద్దాం.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE