నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సిలికాన్ చిప్ శాసిస్తోంది. ఈ నేపథ్యంలో, భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’ కింద భారీ నిధులు కేటాయిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టెక్నాలజీ కేంద్రంగా అవతరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టి భారీ రాయితీలను ప్రకటిస్తూ ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ హబ్‌గా రాష్ట్రాన్ని మార్చే ప్రస్థానానికి నాంది పలికింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అమరావతిని క్వాంటం వ్యాలీగా, విశాఖపట్నాన్ని డేటా సెంటర్ల హబ్‌గా, కర్నూలును సిలికాన్ కార్బైడ్ చిప్స్ తయారీ కేంద్రంగా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే, కాగితాల మీద అత్యద్భుతంగా కనిపిస్తున్న ఈ “సాండ్ టు సిలికాన్ టు సిస్టమ” బృహత్తర ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చాలంటే అనేక సవాళ్లను దాటాల్సి ఉంది.
రాష్ట్రంలో ఫ్యాబ్రికేషన్ యూనిట్లకు అవసర మైన అత్యంత స్వచ్ఛమైన నీరు, అంతరాయం లేని హై-క్వాలిటీ విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కొరత, నిపుణుల లేమి, విధానపరమైన జాప్యం ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలు, దేశాల నుండి ఉన్న తీవ్ర పోటీని తట్టుకుని గ్లోబల్ సంస్థలను ఆకర్షించాలంటే.. పారదర్శకమైన సింగిల్ విండో విధానం, డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లు, స్థిరమైన విధానాలతో పాటు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సా హకాలు తక్షణమే అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు పారిశ్రామికంగా, ఆర్థికంగా దన్ను లభించింది. ముఖ్యంగా మైనింగ్, ఉత్పత్తి, పరిశోధన, క్రమబద్ధీకరణను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో రేర్ ఎర్త్ áకారిడార్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్ సహా ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో సమగ్ర ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఉన్న ఈ కారిడార్.. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు 2,500 కిలోమీటర్ల మేర విస్తరించింది. అలాగే సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి ‘ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0’ కింద ఏకంగా రూ.40,000 కోట్లు కేటాయించింది. తయారీ యూనిట్లకు 50% వరకు సబ్సిడీని అందిస్తోంది. దీనికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం 20-25% క్యాపిటల్ సబ్సిడీ, తక్కువ ధరకు భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదు పాయాలను కల్పిస్తూ నూతన పారిశ్రామిక విధానా లను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో రూ.3,161 కోట్లు పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ప్రోత్సాహకాలుగా కేటాయించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నాలుగు ప్రధాన నగరాలను నాలుగు ప్రత్యేక హబ్‌లుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అమరావతిని క్వాంటం వ్యాలీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టీసీఎస్, ఐబీఎం సహకారంతో 156-క్విబిట్ సామర్థ్యం గల అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా భవిష్యత్తు సాంకేతికతకు కేంద్రంగా మారు తోంది. విశాఖపట్నాన్ని ఐటీ, డేటా సెంటర్ల హబ్‌గా అభివద్ధి చేస్తోంది. గూగుల్ వంటి సంస్థల ఆసక్తితో పాటు, 2047 వరకు పన్ను మినహాయింపు ప్రకటిం చడం ద్వారా ఇది డేటా సెంటర్ల రాజధానిగా అవతరి స్తోంది. కర్నూలును సెమి కండక్టర్ హబ్‌గా మారు స్తోంది. ఓర్వకల్లులో ఇండిచిప్ సంస్థ రూ.14,000 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్ట మొదటి ప్రైవేట్ సిలికాన్ కార్బైడ్ చిప్ తయారీ కేంద్రాన్ని స్థాపిస్తోంది. తిరుపతిని ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారుస్తోంది. ఏసీల తయారీ కారియర్ కంపెనీ రూ.1,000 కోట్లతో యూనిట్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. అలాగే ఇక్కడే రూ.468 కోట్లతో అధునాతన చిప్ ప్యాకేజింగ్ యూనిట్, ఎలక్ట్రానిక్ వస్తువుల అసెంబ్లింగ్‌కు యూనిట్ ఏర్పాటుకానున్నాయి.
ఎదురవుతున్న అడ్డంకులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల ప్రాజెక్టులు విధానపరంగా, కాగితాల మీద అత్యంత అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో రాష్ట్రం అనేక క్లిష్టమైన అడ్డంకు లను ఎదుర్కొంటోంది. మొదటిది అత్యంత ప్రధాన మైనది అత్యున్నత మౌలిక సదుపాయాల కొరత. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లకు రోజుకు లక్షలాది లీటర్ల అత్యంత స్వచ్ఛమైన నీరు, సెకను కూడా అంతరాయం లేని, వోల్టేజ్ ఒడుదొడు కులు లేని హై-క్వాలిటీ విద్యుత్ అత్యవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ స్థాయి ప్రపంచస్థాయి మౌలిక సదు పాయాలు తక్షణమే పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సవాలు. రెండవది, నైపుణ్యం గల మానవ వనరుల లేమి. రాష్ట్రంలో ఐఐటీ తిరుపతి, ఐఐపీఈ విశాఖ, ఐఐఎం విశాఖ వంటి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, సెమీకండక్టర్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫ్యాబ్రికేషన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో తక్షణమే పనిచేయగల వేలాది మంది నిపుణుల కొరత స్థానికంగా తీవ్రంగా ఉంది. మూడవది, రెడ్ టేపిజం, విధానపరమైన జాప్యం. వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రభుత్వ క్లియ రెన్స్‌లు సింగిల్ విండో విధానంలో సకాలంలో రాకపోవడం వల్ల జరిగే జాప్యం, అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సడలించి వారు వెనక్కి తగ్గేలా చేసే ప్రమాదం ఉంది. దేశీయంగా గుజరాత్, కర్ణాటక, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాలు కూడా సెమీకండక్టర్ దిగ్గజ సంస్థలను ఆకర్షించడానికి భారీ రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో తైవాన్, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడటం ఆంధ్రప్రదేశ్‌కు మరొక ప్రధాన సవాలు.
ఈ పరిశ్రమలను త్వరగా విజయవంతంగా స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పారదర్శకమైన ‘సింగిల్ విండో’ సిస్టమ్:
మొదటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం నిజమైన సింగిల్ విండో విధానాన్ని పక్కాగా అమలు చేయడం. భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులు, విద్యుత్, నీటి సరఫరా వంటి అన్ని రకాల ప్రభుత్వ క్లియరెన్స్‌ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలి. దీనికోసం వివిధ శాఖల సమన్వయంతో పనిచేసే ఒక ప్రత్యేక ‘టాస్క్ ఫోర్స’ను ఏర్పాటు చేయాలి. దరఖాస్తు చేసు కున్న గరిష్ఠంగా 30 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేసేలా జవాబుదారీతనం తీసుకురావాలి.
డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లు
కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి వంటి నాలుగు కీలక ప్రాంతాల్లో ఈ హై-టెక్ పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా మౌలిక సదుపాయా లను అభివృద్ధి చేయాలి. ఫ్యాబ్రికేషన్ యూనిట్లకు ఒక్క సెకను కూడా అంతరాయం లేని హై-క్వాలిటీ విద్యుత్ కోసం డబుల్ సర్క్యూట్ పవర్ లైన్లు ఏర్పాటు చేయాలి. అలాగే, చిప్ తయారీకి అవసరమైన స్వచ్ఛ మైన నీటి కోసం డీశాలినేషన్ ప్లాంట్లు లేదా ప్రత్యేక వాటర్ రిజర్వాయర్లను నిర్మించాలి. ముడిసరుకు తీసుకురావడానికి, తయారైన వస్తువుల లాజిస్టిక్స్ సులభతరం చేయడానికి సమీపంలోని ఓడరేవులు, విమానాశ్రయాలకు గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ కల్పించడం అత్యవసరం.
ఇండస్ట్రీ – అకాడెమియా అనుసంధానం
పరిశ్రమలకు నిపుణుల కొరతను తీర్చడానికి విద్యాసంస్థల్లో కేవలం కొత్త కోర్సుల ప్రవేశపెట్టడమే కాకుండా ప్రముఖ యూనివర్సిటీలలో నేరుగా ‘చిప్ డిజైన్ ల్యాబ్‌లను’ ఏర్పాటు చేయాలి. మారుతున్న గ్లోబల్ టెక్నాలజీ,పరిశ్రమల అవసరాలకు అను గుణంగా సిలబస్‌ను నవీకరిస్తుండాలి. చదువుకునే సమయంలోనే విద్యార్థులకు సెమీకండక్టర్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు కల్పించడం ద్వారా వారిని వీఎల్ ఎసఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ వంటి సాంకేతిక విభాగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దాలి.
స్థిరమైన విధానాలు
భారీ పరిశ్రమలు దీర్ఘకాలిక పెట్టుబడులతో వస్తాయి కాబట్టి, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాలు మారవన్న బలమైన భరో సాను పెట్టుబడిదారులకు కల్పించాలి. అవసరమైతే చట్టబద్ధమైన, న్యాయపరమైన రక్షణ కల్పించడం ద్వారా రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలి. ఈ తక్షణ చర్యలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తే, రాష్ట్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా అవతరిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రస్తుత సబ్సిడీలకు అదనంగా, పరిశ్రమలను వేగంగా ఆక ర్షించడానికి ఈ క్రింది ప్రోత్సాహకాలు అత్యవసరం:
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎలఐ స్కీమ్‌కు తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ‘స్టేట్ పీఎలఐ’ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఎలక్ట్రానిక్స్, చిప్ తయారీ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి మొబైల్, స్మార్ట్ చిప్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువు మీద మొదటి ఐదు నుండి ఏడేళ్ల పాటు అదనపు ఆర్థిక రాయితీలు అందించాలి. ఇది పెట్టుబడిదారు లకు తమ ప్రారంభ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవ డానికి విశేషంగా సహాయపడుతుంది. తద్వారా వారు గ్లోబల్ మార్కెట్‌లో పోటీపడి తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులను అందించగలుగుతారు.
సెమీకండక్టర్ ఫ్యాబ్స్, డేటా సెంటర్ల నిర్వహణకు లక్షలాది లీటర్ల అత్యంత స్వచ్ఛమైన నీరు, అలాగే అంతరాయం లేని విద్యుత్ అత్యంత కీలకం. ఈ పరిశ్రమల రోజువారీ నిర్వహణ వ్యయంలో ఇవే సింహభాగం ఆక్రమిస్తాయి. కాబట్టి, సాధారణ వాణిజ్య విద్యుత్ ధరల కంటే తక్కువ ధరకు పరిశ్రమలకు వీటిని అందించాలి. అంతేకాకుండా, రాబోయే కనీసం పదేళ్ల పాటు విద్యుత్, నీటి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్థిరమైన ధరల ఒప్పందాన్ని ప్రభుత్వం చేసుకోవాలి. ఇది కంపెనీలు తమ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను ధైర్యంగా రూపొందించుకోవడానికి భరోసా ఇస్తుంది.
సాంకేతిక రంగంలో నిరంతర పరిశోధన లేకుండా మనుగడ సాగించడం అసాధ్యం. అమరా వతి క్వాంటం వ్యాలీ, రాష్ట్రవ్యాప్తంగా చిప్ డిజైనింగ్ రంగాల్లో వినూత్న పరిశోధనలు చేసే స్టార్టప్‌లు, యువ ఇంజనీర్లు మరియు సంస్థలను ప్రోత్సహించ డానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్ అండ్ డి ఫండ్స్ కేటా యించాలి. వారు కనుగొన్న నూతన ఆవిష్కరణ లకు మేధో సంపత్తి హక్కులు నమోదు చేసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించడం లేదా వారికి ఉచితంగా చట్టపరమైన సదుపాయాలు కల్పించడం చేయాలి. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన వేలాది ఎకరాల భూమి కొనుగోలు లేదా దీర్ఘకాలిక లీజుపై 100% స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహా యింపును పూర్తిగా అమలు చేయాలి. ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నంలో డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు ప్రకటించిన స్ఫూర్తితో, కర్నూలు, తిరుపతి, అమరావతి వంటి మిగతా టెక్ హబ్‌లలో స్థాపించే మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు కూడా కనీసం 15 ఏళ్ల పాటు రాష్ట్ర వస్తు, సేవల పన్ను రీయింబర్స్‌మెంట్ కల్పించాలి. ఈ విధమైన భారీ పన్ను రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను నేరుగా ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించడానికి తిరుగులేని అస్త్రంగా పనిచేస్తాయి.
“సాండ్ టు సిలికాన్ టు సిస్టమ” అనే ప్రక్రియ రాష్ట్రంలో సాధ్యమైతే, అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. ప్రభుత్వం అడ్డంకులను వ్యూహాత్మకంగా తొలగించి, పారదర్శకమైన ప్రోత్సా హకాలను అందిస్తే రాబోయే దశాబ్దం ఆంధ్రప్రదేశ్ సాంకేతిక ప్రగతికి స్వర్ణయుగంగా మారుతుంద నడంలో ఎటువంటి సందేహం లేదు.

తురగా నాగభూషణం,
సీనియర్ జర్నలిస్ట్