రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆంగ్లేయుల చేతి కీలుబొమ్మ (స్టూజ్‌) అం‌టూ ఇందిరాగాంధీ నీచాతినీచమైన ఆరోపణకు సమాధానంగా బెంగళూరు నుండి వెలువడిన పుస్తకంలోని కొన్ని అంశాలను ‘జాగృతి’ 12.6.1972 సంచికలో సంఘ సంస్థాపకులు కీ.శే.పూజ్యశ్రీ హెడ్గేవారు స్వరాజ్య ఉద్యమంలో వహించిన పాత్రను వివరించింది. స్వరాజ్య ఉద్యమ సేవలో స్వయం సేవకలు పాత్రను ఈ సంచిక (26.6.1972)లో తెలియచేస్తోంది.

పూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెసు తీర్మానం చేయకముందే పూజ్యశ్రీ డాక్టర్‌జీ దుర్గాదేవి ఎదుట పూర్ణ స్వరాజ్య దీక్ష స్వీకరించి దేశసేవకు జీవితాన్ని అంకితం చేశారు. పూర్ణ స్వరాజ్యానికి సుసంఘటితం, శక్తిమంతం, క్రమశిక్షణాయుతమైన సమాజం ఆవశ్యకమని గుర్తించి అందుకుగాను వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘమును స్థాపించారు. ఇటు సంఘ కార్యంలో నిమగ్నులైయుండి, రెండవ ప్రక్క స్వరాజ్య ఉద్యమంలో పాల్గొనేవారు. తాము పాల్గొనడమేగాక పూర్ణ స్వరాజ్య ఉద్యమం లక్ష్యంతో అన్ని రకాల ఉద్యమాలకు సేవ చేయడం కర్తవ్యంగా స్వయం సేవకులకు ప్రబోధించేవారు.
ఒక ప్రక్క సంఘ కార్యంలో నిమగ్నులైయున్న స్వయంసేవకులు సమయ సమయాలలో స్వరాజ్య ఉద్యమానికి సేవకులుగా అండదండలిస్తుండేవారు.
విప్లవకారులు బ్రిటిష్‌వారి దారుణ దమన చర్యలకు గురిఅవుతూ నిలువ నీడలేక తిరుగుతున్న దశలో స్వయంసేవకులు వారికి అండగా నిలిచి పలు ప్రమాదాలను ధిక్కరించి వారికై ఆశ్రయములు నిర్వహిస్తుండేవారు. సత్యాగ్రహుల సేవలకు శిబిరాలు నిర్వహించేవారు. అలాంటి సేవలు స్వయం సేవకులొక ఘనకార్యంగా కాక సహజ కర్తవ్యంగా భావించేవారు.
1930లో గాంధీజీ శాసన ధిక్కార సత్యాగ్రహం ప్రకటించారు. డాక్టర్‌జీ మరి అనేకులు స్వయం సేవకులు అందు పాల్గొని జైలులో గడుపుతున్నారు.
వార్థా సంఘచాలక్‌ శ్రీ అప్పాజీజోషి మహాత్మా గాంధీకి, జమ్నాలాల్‌ ‌బజాజ్‌కు సన్నిహితులు. వారు ప్రాంత కాంగ్రెసు కార్యదర్శి కూడా. వారున్ను డాక్టరుజీతో సత్యాగ్రహానికి వెళ్లారు. అప్పట్లో సంఘం అఖిల భారత వ్యాప్తి చెందలేదు. అందువల్ల స్వయం సేవకుల సేవలు నాగపూర్‌ ‌ప్రదేశానికే ఎక్కువగా పరిమితమై యుండేవి.
త్రివర్ణ పతాక ఆవిష్కరణ
1936లో ఫైజ్‌పూర్‌లో కాంగ్రెసు మహాసభ జరిగింది. శ్రీ నెహ్రూ త్రివర్ణ పతాకను ఎగురవేయ వలసి ఉంది. అది ధ్వజం మధ్యలో చిక్కుకు పోయింది. అంత సభలోనూ, ధ్వజస్తంభాన్ని ఎక్కి సరిచేసే సాహసం ఎవరికి లేకపోయింది. వెంటనే అక్కడ ఉన్న స్వయంసేవకులు ముందుకు దూకి దానిని సరిచేసి సకాలంలో ధ్వజారోహణం జరిపించారు. వారి చొరవను ప్రశంసిస్తూ డాక్టర్‌జీ ఆ స్వయం సేవకునికి ఒక బహుమానం ఇచ్చి ‘జాతీయ ఉద్యమంలో వచ్చే ప్రతి అవరోధాన్ని అలాగే అధిగమించడం స్వయంసేవకుల లక్షణం కావాలి’ అని ప్రబోధించారు.
1940లో డాక్టర్‌జీ దేహం చాలించే వరకు దేశసేవకు అంకితమై, స్వయంసేవకులను అంకితం కావల్సిందిగా ఉద్బోధించేవారు. వేలాది యువకులు వారి ప్రేరణతో యావజ్జీవిత దీక్షలు స్వీకరించారు. డాక్టర్‌జీ మరణానంతరం కూడా అదే స్ఫూర్తితో వ్యవహరిస్తున్నారు స్వయంసేవకులు.
1942లో….
1942 వచ్చింది. ఆంగ్లేయులు దేశం వదిలిపోవాలని గర్జించింది. జాతి, స్వయంసేవకులు రణరంగంలోకి దూకారు. లాఠీలు, బుల్లెట్లు ఎదుర్కొన్నారు. కొందరు జైళ్లల్లో మగ్గారు. సంఘ కార్యం మాత్రం యధావిధిగా సాగుతుండేది.
అజ్ఞాత వీరులకు ఆశ్రయాలు స్వయంసేవకులు
అజ్ఞాతవాసంలోకి వెళ్లిన ఉద్యమకారులకు ఆనాడున్ను ఆశ్రయం ఒక సమస్య అయింది. స్వయం సేవకులు ఆ పనిని తీసుకువచ్చారు. ప్రతి ప్రముఖ కార్యకర్త నివాసము పలువురు ఉద్యమకారుల•కు ఆశ్రయం అయింది.
జయప్రకాశ్‌, అరుణా అసఫాలీలకు ఆశ్రయం
ఢిల్లీ పంజాబు ప్రదేశ సంఘచాలకులు శ్రీ లాలా హంసరాజ్‌ ‌గుప్త, ఆయన నివాసం ఎందరెందరికో ఆశ్రయమయింది. ఆయనవద్ద ఆశ్రయం పొందిన వారిలో జయప్రకాశ్‌ ‌నారాయణ, అరుణాఅసఫాలీ ప్రభృతులు కొందరు ముఖ్యులు.
అచ్యుత పట్వర్ధన్‌కు ఆశ్రయం
మహారాష్ట్రలో ప్రముఖ విప్లవకారుడు శ్రీ నానాపాటిల్‌ ‌పోటీ ప్రభుత్వం నెలకొలిపారు. ఆయనకు ఆశ్రయం కల్పించింది. ప్రఖ్యాత వేద పండితులు, జౌడ్‌ ‌సంఘచాలక్‌ శ్రీ‌పాద దామోదర సాత్వలేకర్‌, ‌వాయ్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌దత్తోపంత్‌ ‌గోఖ్లే శ్రీ కిసాన్‌వీర్‌ ‌ప్రభృతులకు ఆశ్రయం కల్పించారు. ప్రఖ్యాత గాంధేయ రచయిత శ్రీ సాణేగురూజీకి పూనా సంఘచాలక్‌ ‌బాబూసాహెబ్‌ ‌దేశముఖ్‌ ఆ‌శ్రయం ఏర్పరిచారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు శ్రీ అచ్యుత పట్వర్ధన్‌ ఆ‌శ్రయం పొందింది స్వయంసేవకుల ఇండ్లలో.ఇవన్నీ ఆంగ్లేయుల చేతి కీలుబొమ్మలైనవారు చేసే సేవలేనా?
బుడతకీచు స్థావరాల విముక్తి
స్వరాజ్య పోరాటం ఆంగ్లేయులు వైదొలగడంతో ముగిసిపోయింది. నెహ్రూ ప్రభృత కాంగ్రెసు వారికి, దేశంలోని ప్రతిభాగమూ పూర్ణ స్వరాజ్యం పొందాల నేది స్వయం సేవకుల కోరిక. అందుకే అఖండ భారత దృశ్యాన్ని వారు మనసున నింపుకొని ఆరాధిస్తారు. అందువల్లనే ఫ్రెంచి బుడతకీచు స్థావరాల విముక్తికి తహతహలాడారు స్వయంసేవకులు. బుడతకీచు స్థావరాలైన గోవాలోని దాద్రానగర్‌ ‌హవేలీలలో ప్రవేశించి బుడతకీచు పతాక స్థానంలో త్రివర్ణ పతాక నెగురవేసింది స్వయంసేవకులు. బుడతకీచు జైళ్లలో ఎందరు స్వయంసేవకులు మగ్గారో లెక్కలేదు. ఎందరెందరు సత్యాగ్రహంలో నిమగ్నులైనారో అంచనా లేదు. సత్యాగ్రహులకు ఆహార పానాది వసతులను కల్పించింది స్వయంసేవకులు. గోవా విముక్తికి అసువులనర్పించిన హేమంత సోమన్‌ ‌సంఘ కార్యకర్త. ఇట్టి స్వయంసేవకులను ఆంగ్లేయుల గులాంలు అనడానికి నోరెలా వచ్చింది ఇందిరా గాంధీకి? ఈ ఘట్టంలో స్వయంసేవకులిలా రణరంగంలో నిలువగా నెహ్రూ, ఇందిరా గాంధీలు ఏమి చేస్తున్నారు అని అడుగ వచ్చునా?
ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విషయంలో ఆంగ్లేయుల వైఖరి
సంఘం విషయంలో ఆంగ్లేయుల వైఖరి ఏమిటో కూడా ప్రస్తావించ దగినది. దాని నుండయినా ఇందిరాగాంధీ సంఘ లక్షణాన్ని గ్రహించగలదేమో! 1925 సంఘం ఆరంభం కాగా, అప్పటి నుంచి ఐదారేండ్లలోనే ఆంగ్లేయులు కంగారు పడ•జొచ్చారు. ఏనాడైనా ఇది తమకు ప్రమాదమని భావింప జొచ్చారు. అది ఆదిలోనే దీనినంతమొందించాలని ప్రయత్నించారు.
ఆంక్షలు… ఆంక్షలు
ప్రభుత్వోద్యోగులెవరూ సంఘ కార్యకలాపాల్లో పాల్గొనరాదని సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌ ‌ప్రభుత్వం 1932లోనే (డిసెంబరు 15న) ఆజ్ఞలు జారీచేసింది. చిత్రమేమిటంటే ఆనాటి బ్రిటిష్‌ ఉత్తర్వులనే ఈనాటికీ కాంగ్రెసు తన ఆజ్ఞలుగా ప్రకటించింది! ఆంగ్లేయుల అడుగుజాడలలో ఉన్నది ఎవరు?
1933లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం సంఘానికి సంబంధించి మరొక ఉత్తర్వు చేసింది – స్థానిక సంస్థల ఉద్యోగులు కూడా సంఘంలో చేరరాదని. దానితో ప్రాంతమంతా ఆంగ్లేయుల ఎడ వ్యతిరేకత చెలరేగింది. ఎన్నో మున్సిపాలిటీలు, ప్రముఖులు ఈ ఆజ్ఞలకు గర్హించారు. చివరికి సమస్యపై ప్రాంత మంత్రి వర్గమే వైదొలగవలసి వచ్చింది!
సంఘంపై ఆంగ్లేయుల రహస్య సర్క్యులర్‌
1942‌లో ఆంగ్ల ప్రభుత్వం పోలీసులకు ఒక రహస్య సర్క్యులర్‌ ‌పంపింది. ‘ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌కార్యకలాపాలపై నిఘా ఉంచండి. అది చాలా ప్రమాదకరమైన సంస్థ’’అని అందులో పేర్కొంది.
సంఘమే గనుక ఆంగ్లేయుల గులాం అయితే ఇలాంటి సర్క్యులర్లు ఎందుకు వచ్చాయి? ఇందిరా గాంధీ గుండెమీద చేయివేసుకొని ప్రశ్నించుకొనవలసిన అంశమిది. ఆమె అలా చేయకపోతే ఆమెను నిగ్గదీసి ప్రజలడుగదగిన ప్రశ్న ఇది.
1942లో ఈ కమ్యూనిష్టాదులు ఏమి చేశారు?
నేడిందిరాగాంధీ కమ్యూనిష్టాదులతో చేతులు కలిపి సంఘంపై ఇంత అసహ్యకరమైన ఆరోపణలు చేస్తున్నది. స్వరాజ్య ఉద్యమ సమయంలో సంఘం ఏమి చేస్తున్నది? అని అడుగుతోంది. ఈ చరిత్ర అంతా ఆమెకు కనువిప్పు కల్గించుగాక! అయితే ఆమె సమాధానమీయదగిన ప్రశ్నలు మరికొన్ని ఉన్నాయి. స్వయంసేవకులిలా ఉద్యమకారులకు అండగా నిలిచి ఉండగా అదే 1942లో నేటి ఇందిర మిత్రులు కమ్యూనిస్టులు ఏమిచేస్తున్నారు? ప్రస్తుతం ఆమె మంత్రివర్గంలో కూడా చేరిన మోహనకుమార్‌ ‌మంగళం ప్రభృతులు ఆనాడేమి చేస్తున్నారు? ఆనాడు ఆంగ్లేయుల ప్రక్కన చేరి ఉద్యమకారులను పట్టించిన రాజకీయ వర్గములు కమ్యూనిష్టులు కారా? ఆంగ్లేయులతో చేయి కలిపి సంఘంపై పోరాటం ఆరంభించింది కమ్యూనిష్టులు కారా? అట్టి కమ్యూనిస్టు లతోను, ఆంగ్లేయులతో లాలూచీ పడి దేశాన్ని ముక్క చెక్కలు చేసిన ముస్లింలీగ్‌తోను చేతులు కలిపిన – ఈ ముగ్గురు నేడు సంఘాన్ని కించపరచజూడడం జనవంచన కాదా?
ఈ ఆరోపణ రుజువు చేస్తారా?
సంఘం ఎడ ప్రస్తుత పాలకుల ప్రవర్తన ఆనాటి ఆంగ్లేయుల ప్రవర్తన కంటే హీనంగా ఉన్న విషయం స్పష్టం. సంఘంపై వీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి బెంగుళూరు వారి ప్రచురణలో ఇలా అన్నారు.
‘సంఘం ఆంగ్లేయుల చేతి కీలుబొమ్మ’ అనే ప్రస్తుత ప్రభుత్వ నాయకుల ఆరోపణలో నిజమే ఉంటే దానిని నిరూపించవలసిన బాధ్యత వారిపై ఉంది. ఆంగ్ల పరిపాలనా రికార్డంతా ప్రస్తుతం వీరి చేతుల్లో ఉంది. తమ ఆరోపణకు రుజువుగా ఆ రికార్డు అంతటి నుండి ఒక్క రుజువునైనా ప్రజల ముందుంచ గల్గడం వారికి న్యాయం. వీరలా చేయలేకపోతే వారి ఆరోపణలన్నీ అసత్యాలనీ, నిరాధారాలని స్పష్ట మవుతుంది.’
వృద్ధ విప్లవకారుని ప్రకటన
అధికారంలోనున్న కాంగ్రెసు వారు సంఘంపై చేస్తున్న క్రూర విమర్శలకు బాధ చెందిన వృద్ధ విప్లవకారులు శ్రీ బాబూరావ్‌ ‌హర్కారే (1972 ఫిబ్రవరి 19న) ఇలా అంటారు :
‘నేను సంఘంలోగాని, జనసంఘంలోగాని సాధారణ సభ్యుడనైనాకాదని ముందు స్పష్టం చేయ దలుస్తున్నాను. రాజకీయ పక్షాలకు తమ సిద్ధాంతా లను, మ్యానిఫెస్టోలను ప్రచారం చేసుకొనడం అవసర మనేది నిజమే. అయితే అసత్యాలాడడం ఎవరికి తగిన పనికాదు. సంఘాన్ని స్థాపించిన డాక్టర్‌ ‌హెడ్గెవార్‌ ‌దేశం కోసం సర్వస్వం త్యాగంచేసిన మహితాత్ములు. దేశభక్తి వల్ల అధికారము, పేరు, ధనము లభించే రోజులు కావనే, కష్టాలు, కడగండ్లు అవమానాలు, హింసాకాండలు- ఇవే ఆనాటి దేశభక్తులకు లభించిన బహుమానాలు. డాక్టర్‌జీని బాల్యం నుండి ప్రభుత్వ గూఢచారులు వెన్నంటేవారు. ఆయనకు ఇంట్లో కూడా భద్రత లేదు. కాంగ్రెసువారి ఉద్యమాలన్నిటిలోనూ ఆయన హృదయపూర్వకంగా పాల్గొనేవారు. వారితో నేనీ ఉద్యమాలనేకమైన వానిలో పాల్గొన్నాను. ఆయన, ఆయన సహచరులు విదేశీ పాలకులతో నిర్భయంగా పోరాడేవారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత కేవలం కాంగ్రెసుకు చెందదు. ఈ స్వరాజ్యాన్ని సంపా దించడానికి లక్షలాది మంది రక్తాన్ని అర్పించారనేది మనం మరువరాదు. నేడిలా అధికారంలో ఉన్నవారు విచ్చలవిడిగా సంఘంపై ఆరోపణలు చేస్తున్నారుగాని ప్రముఖులు పలువురు, సంఘాన్ని గురించి చెప్పిన మాటలు వారికి గమనార్హాలు.
గాంధీజీ ప్రశంస
12.2.47న మహాత్మాగాంధీ ఢిల్లీలోని భంగీ కాలనీ సంఘశాఖను సందర్శించి, ప్రసంగించారు. ఆ విషయం హిందూ పత్రిక ఇలా ప్రకటిం చింది. ‘‘గాంధీజీ అనేక సంవత్సరాల క్రితం, డాక్టర్‌జీ జీవించి ఉండగా సంఘ శిబిరాన్ని చూచారు. సంఘ క్రమశిక్షణ, అస్పృశ్యతా రాహిత్యం, నిరాండరత్వం వారి•నెంతగానో ఆకర్షించింది. నాటి తర్వాత సంఘం ఎంతగానో విస్తరించింది. సేవా, త్యాగాలపై నిర్మితమయ్యే ఏ సంస్థ అయినా అలా మహత్తరంగా బలపడు తుందని గాంధీజీ విశ్వాసం.’’
అధికారంలోని కాంగ్రెసువారికి పటేల్‌ ‌హెచ్చరిక
అదే పత్రిక 7.1.1948 సంచికలో లక్నోలో సర్దార్‌పటేల్‌ ‌ప్రసంగాన్ని ఇలా ప్రచురించింది. ‘సంఘం స్వార్థంతో ప్రేరితమైన సంస్థ కాదని పటేల్‌ ‌దృఢంగా నమ్మారు. అది ప్రస్తుతం ప్రభుత్వ హస్తాలను బలపరచాలని, శాంతిని నిలపడంలో సాయపడాలని వారి కోరిక. అధికారంలో ఉన్న కాంగ్రెసు వారికి ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు. ‘తమ అధికారాన్ని ఉపయోగించి సంఘాన్ని అణచివేయవచ్చునని పదవుల్లో ఉన్న కాంగ్రెసువారు భావిస్తున్నారు. దండప్రయోగంతో మీరే సంస్థనూ అణచలేరు. దండప్రయోగం అనేది దొంగలకు దోపిడీదార్లకు ఉద్దేశింపబడినది. స్వయంసేవకులు దొంగలూ, దోపిడీదార్లు కాదు. వారు దేశాన్ని ప్రేమించే దేశభక్తులు’అని అన్నారాయన. దొంగ తనాలు, దోపిడీచర్యలే రాజకీయాలుగా గల పార్టీలను, శక్తులను ప్రోత్సహించి వారితో చేతులు కలుపుతున్న ఇందిరా కాంగ్రెసు ఇలా దేశభక్తుల సంఘంపై దండ ప్రయోగానికి దిగాలని చూడడం కాలవైపరీత్యం!
నెహ్రూ ఉవాచ…
నెహ్రూ కూడా సంఘాన్ని వ్యతిరేకించాడు. పోరాటం చేశాడు. అసహ్యంగా నిషేధాలు కూడా చేయించాడు. కాని ఇందిర చేసినంత నీచమైన ఆరోపణ చేయలేదేమో. అయితే 1962లో చైనా దురాక్రమణ జరిగినప్పుడు స్వయంసేవకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సైనికులకు సహయ సహకారాలనందించారు. అందువలన 1963 రిపబ్లిక్‌డే పారేడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రూట్‌మార్చిని కూడా ఆయన ఆనాటి ప్రదర్శనలలో జరిపించారు. దీనిని కొందరు విమర్శించే సరికి ‘మీరు కూడా దేశభక్తులే’ అని సద్దుమణిగించాడు.
దేశ నాయకులను స్వయంసేవకులు
రక్షించిన సంఘటనలు
ఈ పుస్తకం మరొక విషయాన్ని గుర్తుచేసింది. స్వరాజ్యం వచ్చిన తొలి దినాలలో దేశంపై ముస్లిం లీగ్‌చే పెద్ద కుట్ర జరిగింది. 1947 సెప్టెంబరు 10వ తేదీన లీగర్లు భారత ప్రభుత్వ నాయకు లందరిని, హిందూ అధికారాలను, వేలాది హిందూ పౌరులను హత్యచేసి ఎర్రకోటపై పాకిస్థాన్‌ ‌జండాను ఎగురవేయాలని, యావద్దేశాన్ని వశం చేసుకోవాలనే కుట్ర అది. ఈ కుట్రను పసిగట్టి, సకాలంలో సర్దార్‌పటేల్‌ ‌ప్రభృతులకు తెలిపి•, కుట్రను ఛేదించి, దేశాన్ని రక్షించింది స్వయంసేవకులు. ఈ విషయాన్ని గురించి భారతరత్న డాక్టర్‌ ‌భగవాన్‌దాస్‌ 16.10.1949‌లో చేసిన ప్రకటన నొకదాన్ని ఈ పుస్తకం ఉదహరించింది. అందులో ఇలా ఉంది:
‘‘మహోన్నత దృక్పథము, త్యాగనిరతి కలిగిన ఈ బాలకులే ఆనాడు నెహ్రూ, పటేళ్లకు సకాలంలో సమాచారం అందజేయకపోయి ఉంటే నేడు భారత ప్రభుత్వమే ఉండేది కాదు. లక్షలకు లక్షల మంది హిందువులు హతమై ఉండేవారు. మిగిలినవారు ఇస్లాంకు మార్చబడి ఉండేవారు. లేదా బానిస బతుకులో శేషించి ఉండేవారు.’’
డాక్టర్‌ ‌భగవాన్‌దాస్‌ ‌హెచ్చరిక
ఈ ప్రకటన ముగింపులో భగవాన్‌దాస్‌జీ ఇలా హెచ్చరించారు:‘మన ప్రభుత్వం లక్షలాది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌యువకుల దేశభక్తియుత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవాలేగాని వాని సృజన శక్తిని ధ్వంసం చేయరాదు. (Should utilize and not sterilise the Patriotic energles of RSS Youth)..ఈ మాటలు నాటి కన్న కూడా ఈనాడు మరింత ఎక్కువగా వక్కాణించదగి ఉన్నాయి.

– 26.6.1972 జాగృతి సంచిక

About Author

By editor

Twitter
YOUTUBE