‌మహాభారతంలో మహాప్రస్థానానికి ద్రౌపదితో కలిసి బయలుదేరిన పంచ పాండవులలో మార్గమధ్యంలో నలుగురు వీరులు, పాంచాలి రాలిపోయారు. ఒక శునకం యుధిష్ఠిరుడి వెంట స్వర్గానికి వెళ్లింది. శుని అంటే ఆడకుక్క. సారమేయం అనే శుని తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నది. ఇంద్రుడికి అది ప్రియమైన నేస్తం. ఇంద్రుడు అహల్య పొందులో ఉన్నప్పుడు అది బయట కాపలా కాసింది. కావలిగా ఉండడమ కాదు…అవసరమైతే ప్రాణాలు ఇస్తుంది. ప్రపంచంలో కుక్కకు విశ్వాసం కల జంతువు అన్న గౌరవం అలా దక్కింది.కానీ వర్తమానంలో ప్రాణాంతకంగా మారుతున్న వీధి, పిచ్చికుక్కలపై చర్యలకు ప్రతిఘటన బాధితులను విస్తుగొలుపుతోంది.

స్వర్గారోహ పర్వంలో శునకం ధర్మానికి ప్రతీకగా ధర్మరాజుతోపాటు స్వర్గం వెళ్ల గలిగింది. అంతా బాగానే ఉంది. కాని, కనకపు సింహాసనం పైన శునకాన్ని కూచోబెట్టినా అది తన వెనుకటి గుణం మార్చుకోదని సామెత. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్న సామెతా ఉన్నది. కుక్కను నీచ జంతువుగా పరిగణిస్తారు. ఉత్తమ జీవుడయిన మానవుడితో దాని సావాసం వింతేమీ కాదు, విచిత్ర విరోధా భాసం కూడా అని కొందరు వాపోతారు. కుక్కకు, మనిషికి మధ్యన ఒక తేడా ఉంది. కుక్క చచ్చే దాకా యజమానిని వదలిపెట్టదు. మనిషి తెలివి మీరినప్పుడు సాటివాడినే మోసగిస్తాడు. అందుకే కాబోలు, విశ్వాస ఘాతకుడు మరుజన్మలో కాకపోతే మరో జన్మలోనైనా శ్వానం కావడం తథ్యం అంటారు.
అసలు విషయం ఏమిటంటే, ఇటీవల ఎక్కువైన కుక్కల బెడదను ప్రచార మాధ్యమాలు విస్తృతంగా ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు. వాటికి తిండి కరవై, తాగడానికి నీరు దొరకకపోతే పిచ్చిపడుతుంది.అలాంటప్పుడే అవి దాడులకు దిగుతుంటాయి.ఒంటికిగా బయటికి వెళితే అవి వెంటపడుతున్నాయని, శునకబాధ నుంచి కాపాడాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పురపాలక సిబ్బంది వీధి కుక్కలను పట్టి కడతేర్చడం అనాదిగా జరుగుతున్న తతంగమే. స్థానికులు పిచ్చి కుక్కల్ని కొట్టి చంపడం కన్నా, పొగ పెట్టిగాని, విషం పెట్టిగాని అంతం చేయడం కాస్త నయం. బహుసంతాన జీవుల్లో కుర్కుర జాతికి మంచి స్థానం ఉన్నమాట నిజం.
పల్లెటూళ్ల మాట పక్కన పెడితే, బస్తీలోని జీవ కారుణ్య సంఘాలు రంగ ప్రవేశం చేసి శునక ప్రియుల పక్షాన శివమెత్తి పోరాడుతున్నాయి. న్యాయస్థానాల తలుపు తడుతున్నాయి. తెలంగాణలో మూడు జిల్లాలలో ఏకంగా ఐదువందల కుక్కలను చంపేశారని, రంగారెడ్డి సర్పంచి ఇద్దరు సహాయ కులలో వంద కుక్కలను దారుణంగా చంపించారని, నేరస్తులను పట్టి చట్ట ప్రకారం శిక్షించాలని ముదవత్‌ ‌ప్రీతి జంతు సంరక్షణ సంస్థానం పట్టుపడుతోంది. ఇటీవల కామారెడ్డిలో 244 కుక్కలు, జగిత్యాల, హనుమకొండలో పెద్ద సంఖ్యలో శునకాలు ఆహుతి అయ్యాయి.అయితే అరిచే కుక్కల్లో కరిచే కుక్కల్లో కొన్ని మాత్రమే కరుస్తాయని, సాకుతో అన్నిటిని మట్టుపెట్టడం సమంజసం కాదని ఒక జీవ కారుణ్యం సభ్యురాలు వ్యాఖ్యానించారు. వాటిని ఎలా పెంచాలో, ఎందుకు చంపకూడదో కూడా ఆంగ్లంలో సుదీర్ఘంగా ప్రసంగించారు.
తెలుగు రాష్ట్రాకు చెందిన మాజీ సినీతార, ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ రాజకీయ సినీతార, జీవకారుణ్య సంస్థల వనితా ప్రతినిధులు, ఆ ఘటనలను ఖండిస్తూ ఉద్యమాలు చేపట్టారు.శునక పీడితులు న్యాయ స్థానాలను ఆశ్రయించగా, వాటిని నిర్బంధించాలని న్యాయస్థానం చేసిన సూచన శునక ప్రేమికులకు నచ్చలేదు. గతంలో ఒక ఐ.ఏ.ఎస్‌ అధికారి దంపతులు తన పెంపుడు శునకం స్వేచ్ఛగా విహరించడానికి వీలుగా, అక్కడి వ్యాయామశాలను ఖాళీ చేయించడాన్ని బట్టి కుక్కల పెంపకం పట్ల ఎంత మక్కువో బహిర్గమైంది(ఆ దంపతులు చర్య ఫ•లితంగా బదిలీకావడం వేరే విషయం). నేడు శునకాలు కన్నబిడ్డ కన్నా మిన్నగా అభిమానాన్ని చూరగొంటున్నాయి. ఒక చేతిలో చరవాణి, మరో చేతిలో కుక్క మెడకు కట్టిన గొలుసు పట్టుకుని విహారయాత్ర సాగించే వారి సంఖ్య పెరుగుతోంది.
శునక ప్రేమికుల గురించి ఆలోచించగా, రెండు ముఖ్య కారణాలు తళుక్కున మెరిశాయి. మన దేశంలో మధ్యతరగతి వర్గం అతి పెద్దది. వారిలోనూ పింఛనుదారులు, వృద్ధులు సింహభాగం కావడం మరో విశేషం. చాలా కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాలకు వలసపోయారు. భౌతికంగా అవసరానికి ఆదుకోలేకపోయినా, ధన సహాయానికి కొదువలేదు. ముసలి దంపతులు ఒంటరితనం, దొంగలదాడిని భరించలేక కుక్కలను సాకుతూ తృప్తిపడుతున్నారు. పక్షుల గూడు విడిచివెళుతున్నట్లు కడుపున పుట్టిన వారు సంపాదన కోసం వలస పోతుంటే, కుక్కలు చివరిక్షణం దాకా యజమానిని అంటి పెట్టుకొని ఉంటాయి. ‘మనిషి కన్నా కుక్క నయం’ అనే నినాదాన్ని బట్టి వాటిని కించపరచి మాట్లాడేవారు శిక్షలు ఎదుర్కొనవలసిన పరిస్థితి.
శ్రీమతి మానేకాగాంధీ ‘భైరవం’ గురించి రచించిన గంభీర వ్యాసాన్ని, ఉపన్యాసాన్ని జనవరి 20న ఉన్నత న్యాయస్థానం అభిశంసించింది. వీధి కుక్కలను నిర్బంధించాలన్న కోర్టు ఇచ్చిన ఉత్తరువు ఆచరణ యోగ్యం కాదన్న వాదనను తోసిపుచ్చింది. త్రిసభ్య పీఠం చీవాట్లు భరించలేక మనేకా తరఫు న్యాయవాది ‘అది రాజకీయ వాదపు నోటి దురద అని తేల్చివేయడం కొసమెరుపు. వీధి కుక్కల నియంత్రణ పట్ల కోర్టు జారీచేసిన ఫర్మానాను ఖాతరు చేయనందుకు ప్రభుత్వ సిబ్బందిని దుయ్యబట్టడం సమంజసమే.
కుక్కల వ్యవహారం ఇలా ఉంటే… చట్టోల్లం ఘనంతోపాటు చట్టవిరుద్ధమైన చర్యలకు దిగడం ఇటీవల ఎక్కువైంది. వీధుల్లో విరగబడడం, విధ్వంసం సృష్టిచేయడం సర్వసాధారణం అయింది. నోటికి వచ్చిందల్లా మాట్లాడడం, చేతికి దొరికిందల్లా విరచడం ఈనాటి సత్యాగ్రహపు కొత్త అవతారం. అమాయకులను నిందితులుగా నిలబెట్టి కొట్టి కాల్చి చంపడంలాంటి అమానుష చర్యల ముందు కుక్క చావుకు ఎక్కడ లేని సానుభూతి చూపడం విచిత్ర పరిణామం.

– ‌నిరామయ

About Author

By editor

Twitter
YOUTUBE