సభికులందరికీ నమస్కారం
ఒక మెరుగైన భారత్‌ను నిర్మించడానికి కలిసి కట్టుగా పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో, విశ్వాసంతో మనం అంతా ఇక్కడ సమావేశమయ్యాం. మీలో అత్యధికులు మన ఈ విశ్వాసానికి వాస్తవరూపం కల్పించే దిశగా కష్టపడి పనిచేస్తున్నారని, యావత్ జీవితాన్ని అంకితం చేసారని తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి నన్ను ఆహ్వానించడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయంగా భావిస్తున్నాను. ఇవాళ నేను ఇక్కడికి రావడం వెనుక ఒక ఉదంతాన్ని మీతో పంచుకుంటాను. వక్తగా ఆహ్వానించడం ద్వారా మోహన్ భాగవత్‌జీ నుంచి అనిర్వచనీయమైన గౌరవాన్ని పొందాను. అయితే ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడంపై కొందరు వ్యక్తులు పెడర్థాలు తీశారు. ఈ సభను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని నేను శిరసావహిస్తున్నాననే తీరుగా నన్ను చూశారు.కొన్ని సలహాలను నాకు ఇచ్చారు. కానీ వాటిని నేను పాటించలేదు. అందుకు మొదటి కారణం నేను రాజకీయ నాయకుడ్ని కాదు. అయితే నా దేశం బాగోగుల పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు ఉన్నవాడిని. కనుక దేశానికి చేయాల్సిన వాటి గురించి సభికులను ఉద్దేశించి ప్రసంగించడంలో నాకెలాంటి తప్పిదం కనిపించలేదు. అలాగే ఒక సభను ఉద్దేశించి ప్రసంగించినంత మాత్రాన సభా నిర్వాహకుల అభిప్రాయాలకు బద్ధులైనట్టుగా భావించాల్సిన పనిలేదు. ఇక రెండవది మీరంతా మన దేశం పురోగతి కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారనే సంగతి నాతో పాటుగా నా సహచరుల్లో చాలా మందికి తెలుసు. అందుకనే మీలాంటి వారితో మాట్లాడే ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. మూడవది మరీ ముఖ్యమైన కారణంగా నేను చెప్పదలుచుకున్నది మోహన్‌జీని కలుసుకున్న తర్వాత నేను అవగతం చేసుకున్న విషయం. దేశమంతటా మీలాంటి వారు చాలా మంది ఉన్నారని నాకు తెలిసివచ్చింది. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి, యావత్ జీవితాన్ని అదే పనికి అంకితం చేసిన మీరు నిజంగా అభినందనీయులు. మెరుగైన భారత్ కోసం పనిచేస్తున్నవారందరూ చేతులు కలిపే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆలోచనలు, సిద్ధాంతాలు, భావాలు భిన్నమైనవి అయినప్పటికీ చర్చలతో, సంప్రదింపులతో వాటిని ఒకే గాటన కట్టవచ్చు. అందుకనే పెద్ద సంఖ్యలో గుమిగూడిన మీ అందరి ముంగిట నేడు నేను ఉన్నాను. మెరుగైన భారత్ గురించి మాట్లాడాల్సి వస్తే మన రాజ్యాంగం ప్రతిపాదించిన భారత్ నా కనుల ఎదుట ఆవిష్కృతమవుతుంది. అది సమానత్వాన్ని, మానవత్వాన్ని, సుస్థిరతను ప్రదర్శిస్తుంది. అలాంటి ఒక భారత్ ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా తన పౌరులందరికీ ఆవాసాన్ని, పౌష్టికాహారాన్ని, కనీస వైద్యం, విద్యను అందించగలుగుతుంది. అదే సమయంలో అలాంటి ఒక భారత్ విశాల హృదయాన్ని కలిగి ఉంటుంది. మానవులు, ప్రకృతి సహా సర్వ జీవులను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటుంది. మనకు ఒక గొప్ప దేశం కావాలంటే, మన రాజ్యాంగం దృక్కోణాన్ని సాకారం చేయాలనుకుంటే మనమంతా అనేక విధాలుగా, బహుళ రంగాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక గొప్పదైన సామాజిక ప్రయోజనం కోసం ఎంతో గొప్ప పని చేస్తున్న అనేక మంది మంచి వ్యక్తులను ఉద్దేశించి ప్రసంగించడం అత్యంత గౌరవప్రదమైన విషయంగా భావిస్తున్నాను. మీరంతా ఒక చైతన్యవంతమైన పౌరసమాజంలో ఒక కీలకమైన భాగంగా ఏర్పడ్డారు. ఇలాంటి ఒక ఏర్పాటు ఏదేనీ ఒక గొప్ప దేశానికి అత్యంత అవసరమైనది. మన దేశం జాగృతమవుతుందని ఆశిద్దాం. మన రాజ్యాంగం ప్రతిపాదించిన గొప్పదైన భారత్‌ను సాకారం చేసే దిశగా మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం.
ధన్యవాదాలు.. జైహింద్..!
(ఏప్రిల్ 5, 2015న న్యూఢిల్లీలో రాష్ట్రీయ సేవా సంఘమం వద్ద చేసిన ప్రసంగం)

అజీమ్ ప్రేమ్‌జీ,
విప్రో మాజీ ఛైర్మన్