భారతీయ న్యాయవ్యవస్థ సమూలమైన మార్పునకు లోనవుతోంది. తనకు తాను కొత్త ఊపిరి పోసుకుంటోంది. ధార్మిక న్యాయ వ్యవస్థ కోసం వాదిస్తోంది. డిసెంబర్ 26, 2021న జరిగిన అఖిల భారతీయ అధివక్త పరిషత్ జాతీయ సమావేశంలో, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ మూర్తిగా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ‘వలసవాద భావజాలం నుంచి భారత న్యాయవ్యవస్థకు విముక్తి’ అనే అంశంపై ప్రసంగించారు.
ఆయన తన ప్రసంగంలో, ‘ప్రస్తుత భారతీయ న్యాయవ్యవస్థలో న్యాయ నిర్వహణలో వలసవాద మనస్తత్వం కొనసాగుతున్నది. బ్రిటిష్ వలసవాదులు పాలకులకు హక్కులను అప్పగించడం ద్వారా మాత్రమే తమ ప్రజలను రక్షించుకున్నారు. మరో మాటలో చెప్పాలంటే, న్యాయాన్ని డిమాండ్ చేయ లేము, బదులుగా ప్రభుత్వం దానిని ఒక వితరణగా అనుమతించింది. ఇది ప్రాచీన భారతీయ న్యాయ వ్యవస్థలకు విరుద్ధం. ఇక్కడ న్యాయాన్ని డిమాండ్ చేయవచ్చు. ఇది అంతర్లీనంగా ఉన్న భావన. భారత దేశ ప్రాచీన న్యాయ వ్యవస్థలకు లోబడి రాజులు సైతం న్యాయ పాలన ముందు మోకరిల్ల వలసి ఉండేదే. రాజుకు లేదా బంధువులకు వ్యతిరేకంగా కూడా న్యాయాన్ని డిమాండ్ చేయవచ్చు. ఈ విధానానికి బదులుగా, బ్రిటిష్ వలసవాదులు వదిలిపెట్టిన వలసవాద మనస్తత్వం నేడు కోర్టులో పిటిషన్లు రూపొందించే విధానంలోనూ, వాదనలను వినిపించే విధానంలోనూ, వాటిని కోర్టులు పరిష్క రించే విధానంలోనూ మరింత కనిపిస్తుంది’ అన్నారు.
‘న్యాయ వ్యవస్థ భారతీయకరణ నేటి అవసరం. అటువంటి వలసవాద మనస్తత్వాన్ని నిర్మూలించ డానికి సమయం పట్టవచ్చు కానీ, నా మాటలు మీలో కొంతమందిని ఈ సమస్య గురించి, భారతీయ న్యాయ వ్యవస్థకు వలసవాద మనస్త్తత్వం నుండి విముక్తి కల్పించడానికి తీసుకోవలసిన చర్యల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తాయని ఆశిస్తున్నాను. ఇది చాలా సమయం తీసుకునే, లోతైన కృషి అయినప్పటికీ, ఇది న్యాయ వ్యవస్థను పునరుజ్జీవింపజేసి, గొప్ప దేశపు సాంస్కృతిక, సామాజిక, వారసత్వ అంశాలతో సమలేఖనం చేయగల మరింత బలమైన న్యాయం అందించే ప్రయత్నం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను!’ అని తెలిపారు.
మద్రాస్ హైకోర్టు నుండి ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్ పిఎన్ ప్రకాశ్ న్యాయ వ్యవస్థను ‘ప్రహసనం’ అని అభివర్ణించారు. దానిపట్ల ‘బోగస్’ అనే పదాన్ని ఉపయోగించడం కఠినంగా ఉంటుందని అన్నారు. భారతీయ కోర్టులు కేవలం తీర్పులు జారీ చేస్తున్నా తప్ప, న్యాయం అందించడంలేదన్నారాయన. మన న్యాయ వ్యవస్థను ‘బోగస్’ అని పిలవడం కఠినంగా ఉన్నప్పటికీ, మన న్యాయ వ్యవస్థను ‘ప్రహసనం’ అని పిలవవచ్చని ఆయన దృఢాభి ప్రాయం. గ్రీకు నమ్మకాల ద్వారా పాశ్చాత్య దేశాల న్యాయశాస్త్రం రూపొందింది. ఉన్నది ఒకటే జీవితం, కాలం సరళ రేఖ తీరుగా సాగుతుందని గ్రీకు నమ్మక వ్యవస్థ బోధిస్తుందని తెలిపారు. అయితే, భారతీయుల మైన మనం మనకు అనేక జన్మలు ఉంటాయని నమ్ముతాం. కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాము. మనకు కాలం ఒక చక్రం తీరుగా తిరుగుతుంటుంది. అందుకే మనం అన్యాయాలను సహించం. న్యాయ వాదులు కోర్టులను బహిష్కరించడాన్ని, కేసుల పరిష్కారంలో అలవిమాలిన జాప్యాలను కూడా మనం అంగీకరిస్తాం. చివరిగా ఇవన్నీ జరగడాన్ని మన కర్మ అని సరిపెట్టుకుంటాం.‘సత్యం, న్యాయం కవల సోదరీమణులు. వ్యవస్థలో సత్యం లేనప్పుడు, మనం అందించేది న్యాయం కాదు, కేవలం తీర్పులే.’ ఎంసీ మెహతా అండ్ ఏఎన్‌ఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్‌ఎస్ కేసులో, ‘‘ఇంగ్లండ్‌లో లేదా మరే ఇతర పరాయి దేశంలోనూ అమలులో ఉన్న చట్టాన్ని ప్రస్తావించడం ద్వారా న్యాయపరమైన మన ఆలోచనావిధానాన్ని పరిమితం చేయడాన్ని మేము అనుమతించలేం. మాకు ఇకపై విదేశీ చట్టపరమైన క్రమానికి చెందిన ఊతకర్రలు అవసరం లేదు’ అని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ భగవతి వ్యాఖ్యానించారు.
గాంధీ తన ప్రసిద్ధ పుస్తకం ‘హింద్ స్వరాజ్’లో ఇలా రాశారు, ‘న్యాయవాదులు మంచి చేసిన సందర్భా లను ముందుకు తెచ్చినప్పుడల్లా, ఆ మంచివారు న్యాయవాదులుగా కాకుండా మనుషులుగా ఉండటం వల్లనే జరుగుతుందని తెలుస్తుంది. ఈ వృత్తి అనైతికతను నేర్పుతుందని మీకు చూపించడమే నా ఉద్దేశం. ఇది ప్రలోభాలకు గురిచేస్తుంది. అలాంటి ప్రలోభాల నుంచి కొంత మంది మాత్రమే అప్పుడ ప్పుడు తప్పించుకుంటారు.’ న్యాయవాదుల గురించి గాంధీజీ చెప్పినది న్యాయమూర్తులు సహా న్యాయం అందించే పక్రియలో ఉన్న వారందరికీ సమానంగా వర్తిస్తుంది.
ధర్మ ఆధారిత న్యాయ వ్యవస్థ
భారతదేశం శతాబ్దాలుగా దృఢమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. ఇది ధర్మంపై ఆధారపడి ఉంటుంది. దీనిని సమాజాలు, పంచాయతీలు, వాణిజ్య సంఘాలు, కుల, ఉపకుల సంఘాలు, స్థానిక సమూహాలు, చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు నిర్వహిస్తాయి. న్యాయవ్యవస్థకు రెండు విభాగాలు ఉండాలి. ఒకటి సైద్ధాంతికమైనది. మరొకటి దానిని అమలు చేసేది. మన సమాజంలో, ధర్మం వరుసలో చిట్టచివరి వ్యక్తి వరకు విస్తరించి ఉంది. ధర్మాన్ని , దాని దేశీయ పద్ధతులను వ్యాప్తి చేయడానికి అనుసరిస్తున్న యంత్రాంగం నిజంగా గొప్పది. వీధిలో ఒక వ్యక్తి ధర్మం గురించి మాట్లాడుతుంటే అది అద్భుతంగా ఉంటుంది. జానపద గీతాలు, జానపద కథలు, హరికథ, బుర్రకథ, ప్రవచనం, వివిధ దేవీదేవతల ఆరాధన, దేవాలయాలు మొదలైన వాటి ద్వారా ఇది సాధ్యమవుతుంది. వేదాలు, ఉపనిష త్తులు, పురాణాలు, ఇతర ధర్మ శాస్త్రాలు/గ్రంథాలలో బాగా ప్రావీణ్యం ఉన్న పండితులు సమాజంలో కీలకమైన స్థానాలలో ఉంటారు. సంక్లిష్టమైన విషయాలలో అలాంటివారి సేవలను వినియోగించు కుంటారు. ఈ వ్యవస్థ నేటికీ వాడుకలో ఉంది. స్థానికంగా వర్తించే ధర్మంతో వివాదాలు తక్షణమే పరిష్కారమవుతుంటాయి. ‘భారతదేశంలో 70 శాతానికి పైగా వివాదాలను గ్రామ పంచాయతీలు పరిష్కరించాయి, వీటిలో గ్రామంలోని ఎంపిక చేసిన సభ్యులు ఉంటారు. అంటే భారతదేశంలో సాధారణ న్యాయస్థానాల పాత్ర నామమాత్రమైనది’. 80 నుండి 90 శాతం వివాదాలు కూడా అనధికారికంగా పరిష్కారమవుతున్నాయని ఒక గ్రామస్థుడిగా నేను చెప్పగలను. అన్ని వివాదాలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం, న్యాయం అందించడానికి ఎటువంటి రుసుములు వసూలు ఉండవు.
ధర్మం అనేది దైవికమైనది. అది సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొనిపోతుంది. జస్టిస్ రామాజోయిస్ తన ‘లీగల్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఏన్ ఏన్షియంట్ లీగల్, జ్యుడీషియల్ అండ్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్’ అనే గ్రంథంలో ఈ విషయాన్ని సంగ్రహంగా చెప్పారు: ‘చట్టం’తో కూడిన ధర్మం రాజుకు కూడా వర్తిస్తుందని ప్రాచీన ధర్మశాస్త్రం ప్రకటించింది. రాజధర్మం ప్రకారం, రాజుకు చట్టాన్ని అమలు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ధర్మశాస్త్రాలు రాజుకు శాసనపరమైన ఎలాంటి అధికారాన్ని ఇవ్వలేదు, కేవలం చట్టాన్ని అమలు చేసే అధికారాన్ని మాత్రమే ఇచ్చాయి. భారతదేశంలో రాచరిక భావనకు, పాశ్చాత్య దేశాలలో రాచరిక భావనకు మధ్య ఉన్న అతి ముఖ్య మైన వ్యత్యాసం ఇది’.
పాశ్చాత్య భావనల ప్రకారం, రాజ్యానికి మూడు ముఖ్య అవయవాలు శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు రాజు పునాది. కానీ ధర్మశాస్త్రాలకు లోబడి గుర్తించిన, స్థాపితమైన రాజ్యంలో చట్టాలు ధర్మశాస్త్రాల ద్వారా నిర్దేశితమైనవి. అవి రాజుకు కొత్త చట్టాలను రూపొందించడానికి లేదా ధర్మ శాస్త్రాల నిబంధనలను సవరించడానికి అధికారం ఇవ్వలేదు. మరోవైపు, ధర్మశాస్త్రాలు రాజు స్వీయ (రాజధర్మం) ప్రవర్తనను నియంత్రించే చట్టాలను కూడా నిర్దేశించాయి.’
భారతీయ సంస్కృతిని విస్మరించిన ఆంగ్లేయులు
ఇంగ్లండ్‌ను వేర్వేరు సమయాల్లో వివిధ జాతులు ఆక్రమించాయి. ఆంగ్లేయులు సుమారు 2,000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నారు. మొదటి 1,000 సంవత్సరాలు వారు యుద్ధాలలో పాల్గొన్నారు. సుమారు 1,000 సంవత్సరాల క్రితం స్థిరపడ్డారు. వారు అనాగరికులు. వారు మెరుగైన జీవనోపాధి కోసం వెతుకుతూ ఉన్నారు. బ్రిటిష్ వారు/యూరోపియన్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు నౌకాయానం చేశారు. బ్రిటిష్ వారు దాదాపు 400 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చారు. వారు క్రూరులు, దయలేనివారు. అసంపూర్ణమైన తమ వ్యవస్థలు, జీవన విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రారం భించారు. వారికి డబ్బుపై మాత్రమే ఆసక్తి ఉండేది. వారు ఇంగ్లీష్, తరగతి లేదా ప్రామాణిక విద్యను ప్రవేశపెట్టారు. వారు ఆస్తి హక్కులను మార్చారు. ఆ పక్రియలో, మెకాలే భారత ప్రతిస్పర్థ/సాధారణ న్యాయవ్యవస్థను ప్రారంభించాడు. ప్రతిస్పర్థ/సాధారణ న్యాయవ్యవస్థలో న్యాయానికి ఆధారమైన సత్యం వెలుగులోకి రాదు. నవంబర్ 24, 2000 నాటి ఉత్తర్వు ప్రకారం వి.ఎస్. మలిమోత్ అధ్యక్షతన కమిటీ మార్చి, 2003లో తన నివేదికను సమర్పించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. నివేదికలో పేజీ 24లో, ‘భారతదేశంలో క్రిమినల్ లాను అమలు చేయడానికి అనుసరించే వ్యవస్థ బ్రిటిష్ వలస పాలకుల నుండి వారసత్వంగా పొందిన సాధారణ ప్రతిస్పర్థ న్యాయవ్యవస్థ. ప్రతిస్పర్థ వ్యవస్థలో నిజం అనేది ప్రాసిక్యూషన్ డిఫెన్స్ తటస్థ న్యాయమూర్తి ముందు సమర్పించిన వాస్తవాల సంబంధిత వెర్షన్ల నుండి ఉద్భవించాలి. ప్రాసిక్యూషన్ సహేతుకమైన సందేహానికి మించి కేసును నిరూపించగలిగిందో లేదో చూడటానికి న్యాయమూర్తి అంపైర్ లాగా వ్యవహ రిస్తారు. నిందితుడికి సంశయ లబ్ధిని చేకూరుస్తారు. తన తటస్థతను కొనసాగించాలనే ఆత్రుతలో ఉన్న న్యాయమూర్తి సత్యాన్ని కనుగొనడానికి ఎప్పుడూ ఎటువంటి చొరవ తీసుకోరు. దర్యాప్తులో లేదా కోర్టు ముందు సాక్ష్యాలను సమర్పించే విషయంలో చోటు చేసుకునే తప్పిదాలను ఆయన సరిదిద్దరు. ప్రతిస్పర్థ న్యాయవ్యవస్థ సత్యాన్ని కనుగొన డానికి న్యాయమూర్తికి ఎలాంటి విధిని విధించనందున ఆయన నిష్క్రియాత్మక పాత్ర పోషిస్తారు’ అని ఉంది. మలిమోత్ కమిటీ ప్రకారం, ప్రపంచంలో రెండు న్యాయవ్యవస్థలు ఉన్నాయి.
‘ప్రపంచంలో రెండు ప్రధాన న్యాయవ్యవస్థలు ఉన్నాయి. విచారణ వ్యవస్థ నుండి అరువు తెచ్చుకున్న ప్రతిస్పర్థ న్యాయవ్యవస్థలు ఉన్నాయి.’’ ఈ ప్రతిస్పర్థ వ్యవస్థను ఎలాంటి ఆనవాళ్లు లేకుండా తొలగించాలి. సవరణలు/ కొత్త చట్టాల ద్వారా ఎన్ని మరమ్మతులు చేసినా అది పనిచేయదు. దీనికి వలసవాదం నుంచి విముక్తి కల్పించడం మాత్రమే పరిష్కారం.
‘‘ఈ వలసరాజ్యాల న్యాయ వ్యవస్థ భారత జనాభాకు తగినది కాదనడంలో ఎటువంటి సందేహం లేదు. న్యాయవ్యవస్థను భారతీకరించడం నేటి అవసరం. ఇది విస్తృత•మైనది, సమయం తీసుకునే ప్రయత్నం అయినప్పటికీ, ఇది భారతీయ న్యాయ వ్యవస్థను పునరుజ్జీవింపజేసే, మన గొప్ప దేశపు సాంస్కృతిక, సామాజిక వారసత్వ అంశాలతో సమలేఖనం చేయగల మరింత బలమైన న్యాయం అందించేలా చేసే విలువైన ప్రయత్నం కావచ్చని నేను గట్టిగా నమ్ముతున్నాను’ – జస్టిస్ (రిటైర్డ్) ఎస్ అబ్దుల్ నజీర్
(2021లో హైదరాబాద్‌లో జరిగిన జరిగిన అఖిల భారతీయ అధివక్త పరిషత్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో)
అందరికీ న్యాయం:
మోడీ ప్రభుత్వంలో కీలక సంస్కరణలు
క్రిమినల్ లా ప్రక్షాళన
ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధికారియం (బీఎస్‌ఏ)లతో భర్తీ చేశారు.
దృష్టిని వలసవాద శిక్ష నుంచి పునరుద్ధరణ న్యాయం వైపు సారిస్తూ, భారతీయ విలువలను జోడిస్తూ సైబర్ నేరం వంటి ఆధునిక సవాళ్లను పరిష్కరించడానికి పెద్దపీట వేశారు.
టెక్నాలజీ, డిజిటైజేషన్
స్మార్ట్ షెడ్యూలింగ్, ఆటోమేటెడ్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్, వర్చువల్ కోర్టుల కోసం ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఓసీఆర్, ఎన్‌ఎల్‌పీలను అమలు చేయడం. సమన్లు జారీలో వేగం, విచారణలలో పారదర్శకత కోసం ఎలక్ట్రానిక్ పక్రియలను (ఎన్‌ఎస్‌టీఈపీ) విస్తరించడం.
ఎం. సుందరరామిరెడ్డి
న్యాయవాది