ఏదో ఒక వైకల్యంతో పుట్టిన పిల్లలను అక్కున చేర్చుకుని, వారికి నయం చేయడానికి ఉద్దేశించిన సంస్థ సక్షమ్. మారుతున్న కాలానికీ, పెరుగుతున్న వ్యాపార సంస్కృతికి బలైపోతున్న బాల్యానికి కాస్త సాంత్వన చేకూర్చడమే ఈ సంస్థ ఆశయం. లక్షలలో ఉన్న ఇలాంటి పిల్లలకి సేవలు అందించడానికి తెలుగు రాష్ట్రాలలో ఉన్న సదుపాయాలు గోరంత. అసలు వీరికి శిక్షణ ఇచ్చే సంస్థలే తెలుగు ప్రాంతంలో లేవంటే ఊహించవచ్చు. అలాంటి సేవలతో మహోపకారం చేస్తున్న సంస్థ సక్షమ్. ఆ సేవలు ఎంత ఉదాత్తమో సక్షమ్ తెలంగాణ ప్రాంత సంరక్షక్ డాక్టర్ వేదప్రకాశ్ (ప్రముఖ ఆర్ధొపీడిక్ వైద్యులు)ను అడిగి తెలుసుకుందాం.
నమస్కారం వేదప్రకాశ్ గారు
నమస్తే!
సక్షమ్ అందిస్తున్న సేవాకార్యక్రమాలు అందరికీ తెలుసు. ఇక్కడ ‘ధీమహి’ పేరుతో ఎప్పుడు ప్రారంభిం చారు? అసలు ఆశయాలు ఏమిటి?
మన చిన్నారులలో దివ్యాంగుల పునరావాసం కోసం సక్షమ్ సంస్థ ద్వారా ధీమహి కేంద్రం 2019లో స్థాపించారు. భాగ్యనగర్‌లో, తులసీనగర్ పార్క్‌లో మనకున్న ఈ ఫెసిలిటీతోనే ప్రారంభించాం. చిన్నారులు కొన్ని పరిస్థితులలో సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధికి గురి అవుతారు. సెరిబ్రల్ పాల్సీ అంటే ప్రసవ సమయంలో జరిగే ప్రమాదకర లోపం. గర్భస్థ శిశువుకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే అది రావచ్చు. సహజంగా గర్భంలో ఉన్నప్పుడు వాళ్లకి తల్లి నుంచే రక్తం ద్వారా ప్రాణవాయువు అందుతుంది. జననం అయిన వెంటనే వాళ్లు వాళ్ల ఊపిరితిత్తుల ద్వారా గాలి తీసుకోవడం మొదలుపెట్టాలి. శిశువులు నెలలు నిండకుండానే` కొన్నిసార్లు ఎనిమిదో నెలలో, ఏడో నెలలోనో జన్మించే పరిస్థితులు వస్తాయి. అలాంటి శిశువులకి ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవచ్చు. వెంటనే వాళ్లకి ఆక్సిజన్ అందిస్తారు. అవసరమైతే వెంటిలేటర్ పెడతారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోని పక్షంలో బ్రెయిన్‌కి ఆక్సిజన్ కాసేపు తక్కువగా అందు తుంది. అందువల్ల, పెద్ద వయసు వారికి బ్రెయిన్‌లో బ్లడ్‌క్లాట్ అయి పక్షవాతం వచ్చినట్టు, నవజాత శిశువులలో పుట్టుకతోనే పక్షవాతం లాంటి లోపంతోనే కళ్లు తెరుస్తారు. అలాంటి పిల్లల మెదడులో ఏ భాగమైతే ఆక్సిజన్ లేమికి లోనయిందో, అక్కడ ఫంక్షన్స్, అంటే, చేతులూ, కాళ్ల కదలికలలో, మాట రావడంలో లోపాలూ, కొందరికి బుద్ధిమాంద్యం వచ్చే అవకాశం ఉంది. అంటే అలాంటి పిల్లలకి మామూలు పిల్లలతో పోలిస్తే చాలా ఆలస్యంగా మాటలు, నడక రావడమో, చేతుల్లో కాళ్లల్లో బలం సరిగ్గా లేకపోవడమో, కొంతమందిలో సిట్టింగ్ బాలెన్స్ అంటే కూర్చునేంత శక్తి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పిల్లలకి కొన్ని రకాల థెరపీలు అవసరం. డాక్టర్లుగా మేము మందులు, ట్రీట్మెంట్ ఇవ్వడంతోపాటు ఫిజియోథెరపీ ఇస్తాం. అంటే కండరాల బలాన్ని పెంచే థెరపీలు` ఫిజియో థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ. ఇంకా బిహేవియర్, స్పీచ్ థెరపీలు. కండరాల చలనంతోనే ఇంకొకరిపైన ఆధారపడకుండా వాళ్ల పనులు వాళ్లు చేసుకో గలుగుతారు.
బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలలో ఎలాంటి సేవలు ఉన్నాయి?
ఇలాంటి పిల్లలు చాలామందిలో బుద్ధిమాంద్యం వల్ల ప్రవర్తనకు సంబంధించి సమస్యలుంటాయి. వాళ్ల మానసిక స్థితి భిన్నంగా ఉంటుంది. దానికి బిహేవియర్ థెరపీ అవసరం. అది ఇక్కడ ఇస్తాం. దీనికి ఆఖరిలో స్పీచ్ థెరపీ. మామూలుగా పిల్లలు ఒకటో సంవత్సరాని కల్లా అమ్మ, దాదా అంటారు. రెండో ఏడాదికి 100 నుంచి 300 పదాలు మాట్లాడ తారు. కానీ ఈ పిల్లల్లో దాదాపు ఏడెనిమిది సంవత్స రాలు వచ్చినా చాలా తక్కువ మాటలు వస్తాయి. ఇందుకు స్పీచ్ థెరపీ. అంటే కాళ్లకీ, చేతులకీ, బుద్ధిమాంద్యానికి కలిపి ఆ నాలుగు థెరపీలని అందచేయాలనే ఈ కేంద్రాన్ని స్థాపించాం.
సెరిబ్రల్ పాల్సీ కాకుండా ఇంకా కొన్ని రకాల జబ్బుల ద్వారా పిల్లల చలనంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో మస్క్యలార్ డిస్ట్రఫీ అనే స్థితి ఉంటుంది. పుట్టినప్పుడు సాధారణంగానే ఉన్నా, ఆ కండిషన్ తీవ్రతను బట్టి కొంతమందికి ఐదారు సంవత్సరాల నుంచి పదేళø్లలో నెమ్మది నెమ్మదిగా కండరాల్లో బలం తగ్గిపోతుంది. నడుస్తున్న బాబు, లేదా పాప క్రమంగా చిన్న వాకర్‌తో నడవడం, ఆపై వీల్‌చైర్‌కి పరిమితం కావలసి వస్తుంది. డౌన్ సిండ్రోమ్ అని, పుట్టుకతోనే కొంత బుద్ధిమాంద్యంతో, కండరాల్లో బలహీనతలతో పుడుతుంటారు. ఈ తరహా దివ్యాంగతలు ఉన్న పిల్లలకి ఈ రోజున బయట థెరపీలు ఇప్పించాలంటే సాధారణ పౌరులకు సాధ్యం కాదు. నేను చెప్పిన ఆ నాలుగు రకాల థెరపీలు దాదాపు నెలపాటు ఇవ్వాలనుకుంటే హీనపక్షం ఒక్కొక్క బాబుకి గాని, పాప పాపకి గానీ దాదాపు లక్ష వరకు ఖర్చు కాగలదు. ఒకరికి కనీసం ఐదు నుంచి పదేళ్లు వచ్చేంత వరకు ఇలాంటి థెరపీలు రెగ్యులర్‌గా ఇవ్వాలంటే ఎవరికైనా కష్టసాధ్యమే కాదు అసాధ్యం.
ధీమహిలో ఎంతమంది పిల్లలకి సేవలు అంది ఉండవచ్చు?
కొవిడ్ సమయంలో కొంత తగ్గినా ఇప్పుడు ప్రతిరోజు దాదాపుగా 35 నుంచి 40 మంది చిన్నారులను వాళ్ల తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆ నాలుగు థెరపీల్లో అన్నీ, లేదా రెండు, మూడు గాని ఇస్తున్నాం. ప్రతి చిన్నారికి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాలు వన్ టు వన్ సెషన్స్ జరుగుతాయి. అన్నీ ఉచితం. మరొక అంశం. ఇలాంటి పిల్లలతో ఉన్న తల్లులకి సామాజికంగా కొంత ఇరకాటం తప్పదు. చాలా మందిని వాళ్ల అత్తమామలే దగ్గరకు తీయడానికి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇక్కడ అసలు నడవలేని పిల్లల్ని మొదట కొంత నడక వచ్చే విధంగా తయారు చేస్తాం. గత ఆరేళ్లలో మా అనుభవం`ఒకటి రెండేళ్ల పాటు థెరపీలు అందిన తర్వాత చాలామంది పిల్లలు దాదాపుగా నడవలేని కూర్చోలేని స్థితి నుంచి స్వతంత్రంగా నడవడం గాని, కనీస సాయంతో నడవడం జరిగింది. ఆ స్థితికి చేరాక వాళ్లని కొన్ని స్పెషల్ స్కూల్స్‌కి పంపే ప్రయత్నం చేస్తాం. అలా ఏదో సమయంలో ఇలాంటి థెరపీలు తీసుకొని ఇక్కడి నుంచి తరువాతి దశకు వెళ్లిన చిన్నారులు 50 నుంచి 70 మధ్యలో ఉంటారు. ఈ సెంటర్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా 150 మంది పిల్లలకు థెరపీలు అందించాం.
ఇంత సమస్య, పైగా ఆర్థికంగా పరిపుష్టి లేనటువంటి కుటుంబాలకి ఎక్కువ సమస్య అని మీరే అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అందిస్తున్న కొన్ని వైద్యసేవలు, ఆరోగ్యశ్రీ లాంటి దాంట్లో చేర్చడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు?
వాళ్ల ప్రాధామ్యాలను బట్టి, తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ఈ దివ్యాంగులైన చిన్నారుల కోసం ప్రభుత్వాల” సాంకేతికపరంగా అందించే సేవల మీద దష్టి పెట్టలేకపోతున్నాయి. ఈ రకం సేవల స్థితి భారత వైద్యరంగంలో ఎలా ఉన్నదో మీకు అర్థమై ఉంటుంది. ఈ నాలుగు థెరపీల గురించి డాక్టర్లు సహా వినని వారు ఎందరో! తెలుగు రాష్ట్రాలలో అక్యుపేషనల్ థెరపీకి సంబంధించిన కళాశాల లేదు. దేశవ్యాప్తంగానూ తక్కువే. అయినా ఆ పిల్లలకి ఫిజియోథెరపీ, ఆపరేషనల్ థెరపీ చాలా ముఖ్యం. కాబట్టి ఈ రకమైన లోపాలు ఉన్న పిల్లల సంక్షేమాన్ని సవాలుగా తీసుకుని దేశవ్యాప్తంగా ఒక నమూనా, ఒక మోడల్ సెంటర్‌గా సక్షమ్‌ను వృద్ధి చేయాలనే ఆశయంతో స్వచ్ఛంద సేవకులు ప్రారంభించారు.
వాస్తవంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కేంద్ర (ఆర్‌బీఎస్‌కే) పేరుతో అన్ని జిల్లాలలోను ఈ సేవలు అందించాలన్న సంకల్పం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు నిపుణుల కొరత, ఇటు నిధుల కొరత వల్ల ప్రభుత్వాలు ముందడుగు వేయలేకపోతున్నాయి. ఈ కేంద్రం కన్నా ముందు నేను 2016 `17 సమయంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆర్‌బీఎస్‌కేతో కలసి పనిచేశాను. అక్కడ ఇలాంటి సేవాకేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులతో బిల్డింగ్‌లు కట్టడం, ఎక్విప్‌మెంట్ సమకూర్చడం వంటివి చేస్తున్నారు. కానీ సుశిక్షితులైన థెరపిస్టులను పెట్టుకోలేక పోతున్నారు. అది మొదటి స్థాయిలోని సమస్య. రెండో స్థాయిలో సమస్య, తల్లిదండ్రుల్ని చైతన్యవంతులని చేసి, అలాంటి పిల్లల్ని థెరపీలతో బాగుపరచొచ్చు అన్న నమ్మకాన్ని కల్పించడానికి స్వచ్ఛంద కార్యకర్తల వ్యవస్థ లేదు. ఇలాంటి పిల్లలు పుడితే, రెండు మూడేళ్లు బాధపడి తర్వాత వాళ్లని విస్మరిస్తారు. వీళ్లు ఇంతే, ఇలాగే ఉంటారని సమాజం కూడా అలాగే ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటుంది. థెరపీ కేంద్రంలో 10 మంది సిబ్బంది ఉంటే, మరొక 30-40 మంది కార్యకర్తలు నిరంతరం అలాంటి పిల్లలు ఉన్న కుటుంబాల వారిని కలుస్తూ ఉండాలి. బస్తీల్లోకి వెళ్లి వాళ్లని గుర్తించాలి. మా కేంద్రానికి పిల్లలు ఎలా వచ్చారన్న ప్రశ్న వేస్తే, ఇది రెండు మూడేళ్ల కృషి. ఈ చుట్టుపక్కల బస్తీలన్నిటిలో ఇంటింటి సర్వే చేశారు కార్యకర్తలు. ఇంటిలో ఇలాంటి పిల్లలు ఉన్న సంగతి కొంతమంది చెప్పరు. అంతా బాగున్నాం అనేస్తారు. మనమే ఇంట్లోకి వెళ్లి చూస్తే ఒక బాబు/పాప కింద పాకుతూ కనిపిస్తారు. ఇదేంటి ఇట్లా ఉన్నాడు అంటే, అదంతే అట్లాగే ఉండిపోయాడు అంటారు. అంటే తల్లిదండ్రులకు అవగాహన లేదు. అవగాహన ఉన్నా నమ్మకం ఉండదు. కాబట్టి పిల్లల విషయంలో సాయం చేసేవారు ఉన్నారన్న నమ్మకం తేవాలి. ప్రభుత్వ స్థాయిలో ఇలాంటివి చేయాలన్నా సమస్యే. ఒక అంగనాన్‌వాడీ వర్కర్ ఒక ఆశావర్కర్ ఊర్లలోకి వెళ్లి అలాంటి పిల్లలని ఎత్తుకుని తీసుకొని రావడం, దింపడం కష్టం. ఇలాంటి ప్రతిబంధకాల వల్ల ప్రభుత్వం దీన్ని అమలు చేయలేకపోతున్నది. నిధుల, నిపుణుల కొరత సరేసరి!
ఈ కోణం నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?
నిజం చెప్పాలంటే మాకు కూడా ఈ సెంటర్ నడపడానికి నిబద్ధత కలిగిన థెరపిస్టులు దొరకడం ఇబ్బందిగా ఉంది. కానీ మన కృషిని గమనించి, ఫలితాన్ని చూసి కొంతమంది థెరపిస్టులు రెగ్యులర్‌గా వస్తున్నారు. ఒకటి నిజం. రేపటితరం కోసం ఇలాంటి సేవ అవసరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలాంటి పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు చాలామంది పిల్లలను ఆలస్యంగా కంటున్నారు. 25, 27 సంవత్సరాలు వచ్చేసినా విద్యాభ్యాసం అవ్వట్లేదు. పెళ్లి అయ్యేసరికి 30 సంవత్సరాలు. మొదటి సంతానం పుట్టే సరికి 32, 33. రెండో సంతానం 35 ఏళ్లు దాటాకనే. చాలామంది దంపతులు ఐవిఎఫ్ కానీ, అసిస్టెడ్ ఫర్టిలిటీ కోసం వెళ్తున్నారు. ఈ రెండు కారణాల వల్ల ఈ ప్రిమెచూరిటీ అనేది పెరిగి పోతుంది సమాజంలో.
ఆ పరిణామం ఫలితాలు ఎలా ఉంటున్నాయి?
ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అంటాం. అంటే చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. అప్పుడు తొమ్మిదో నెల నిండే వరకు ఆగలేకపోవచ్చు. ఏడో నెల, ఎనిమిది నెలలు లేదా ఎటువంటి చిన్న సమస్య ఉన్నా ఆ క్షణంలో ప్రిమెచ్యూర్ డెలివరీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇలాంటివి పెరుగుతున్నాయి. ఇదిగో ఈ సమయంలోనే సెరిబ్రల్ పాల్సీ కేసులు పెరిగే అవకాశం వస్తున్నది. రెండవ కోణం కూడా ఉంది. పిల్లలలో ఈరోజుల్లో ఆటిజం అని, ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కైనటిక్ డిసార్డర్) అని ఉన్నాయి. ఈ రెండు డెవలప్మెంటల్ డిసార్డర్స్. ఆటిజం అంటే సోషల్ స్కిల్స్ లేకపోవడం. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్, తల్లిదండ్రులు చాలినంత సమయాన్ని పిల్లలకు ఇవ్వకపోవడం, పరికరాల మీద పిల్లలు ఎక్కువ ఆధారపడేటట్టు చేయడం, ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడం తదితర కారణాలతో కాన్వర్సేషనల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ లేక పిల్లలలో మానసిక ఎదుగుదల ఉండట్లేదు.అసలు సమాజంతో వాళ్లకి ఎలాంటి సంపర్కం లేకపోవడంతో ముఖ్యంగా ఆటిజం వస్తుంది. పిల్లలు బుద్ధిగా కనిపించినా అసలు వాళ్లకి మాటలు రాకపోవడం, మాటలు వచ్చినా సంభాషణలో ఐకాంటాక్ట్ లేకపోవడం ఉంటుంది. ఇవి కూడా సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్లకి ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ ముఖ్యం. అది కాకుండా ఏడిహెచ్‌పిడి అనేది ఇంకొకటి ఉంటుంది` అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కెనటిక్ డిసార్డర్. అంటే చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటారు పిల్లలు. పిల్లవాడు పిచ్చి గొడవ చేస్తూంటాడు, అన్ని పడేసూ ్తఉంటాడు. మన మీద పడి ఎగురుతూ ఉంటాడు. అంటే ఇది కూడా సోషల్ స్కిల్ లోపమే. వీళ్లకి కూడా ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ అవసరం. ఈ థెరపీస్‌తో పాటుగా ఈ సెంటర్‌లో మనకి ప్రతి నెల ఒక పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నందిని వచ్చి చూస్తారు. చిన్నారిని పరీక్షించడం, తల్లిదండ్రులతో మాట్లాడడం వాళ్లకి ఉన్న మానసిక సమస్యల గురించి డిస్కస్ చేస్తారు. అలాగే పిల్లల వైద్యులు వస్తారు. పిల్లలకు ఉన్న మామూలు సమస్యలుకు వైద్యం చేస్తారు. ఇలాంటి పిల్లల్లో కొంతమందికి ఎదుగుదలతో పాటు జాయింట్స్ కొంత డిస్లొకేట్ అవ్వడం, కండరాలు టైట్ కావడం, ఎముకలలో కొంత సమస్య కనిపిస్తూ ఉంటాయి. వారి కోసం ఆర్థోపెడిక్ డాక్టర్స్ వస్తారు. ఎముకల సమస్య విషయంలో సరైన స్పెషలిస్ట్లు ద్వారా క్రమం తప్పకుండా వైద్యం అందేటట్టు చూస్తాం.
ఇక్కడ వైద్య సేవలు, థెరపీలు మీరు చేస్తారు. ఇంటి దగ్గర కూడా తల్లి దండ్రుల ద్వారా, కుటుంబం ద్వారా జరగవలసిన అలాంటి సేవలు ఉంటాయా?
ఉంటాయి. తల్లిదండ్రులనే కాదు. ఎవరైతే ఆ బాబుని చూసుకుంటున్నారో` అక్క, తమ్ముడు కూడా ఉండొచ్చు. అన్నయ్య తాతయ్య, నానమ్మ అమ్మమ్మ ఎవరైనా ఉండొచ్చు. మేనత్త, మేనమామ ఎవరైనా. ఎలాగైతే మనం స్కూల్లో చెప్పినా ఇంటికి వచ్చాక హోంవర్క్ చేయించినట్టే, కొన్ని సేవలు చేయాలి. ఇక్కడ చేసిన థెరపీస్ ఇంట్లో కూడా చేయాలి. అవి ఎలా చేయాలనేది ఇక్కడి వారే నేర్పిస్తుంటారు. వీడియో ద్వారా వాళ్లు చేసింది చూస్తుంటాం. ప్రతి శిశువు పురోగతిని వచ్చిన రోజు నుంచి వీడియో ఆధారంగా అంచనా వేస్తుంటాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి డాక్టర్ రమేష్ సోలంకి (పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్) నరాలకి సంబంధించిన డాక్టర్ వచ్చి పిల్లలందరిని అసెస్ చేస్తారు. ఏ పిల్లలకి ఈ థెరపీ సరిపోయింది, ఇంకా తరువాతి దశలో థెరపీలు ఆయన సిఫారసు చేస్తారు.
ఇలాంటి కేసులు గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితి వల్ల పెరుగుతున్నాయంటారా? అందుకు కారణం ఏమిటి?
చాలా పెరుగుతున్నాయి. సెరిబ్రల్ పాల్సీ పెరగ డానికి కారణం ఇంతకుముందే అనుకున్నట్టు ఆ ప్రిమెచూర్ బర్త్‌లు. ప్రిమెచూర్ బర్త్ రేట్ పెరుగుతూ ఉంది. సిజేరియన్ సెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. అడ్వాన్స్డ్ మేటర్నల్ ఏజ్‌లో, అంటే తల్లి ఎక్కువ వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కనడం మరొక కారణం. అంటే మొదటి బిడ్డ పుట్టేసరికి చాలా వయసు మీరిపోవడం, ఐవిఎఫ్ వంటి అసిస్టెడ్ ఫెర్టిలిటీస్ వల్ల కూడా వీటన్నిటి వల్ల కూడా ఆ పెరియనేటల్ ఆస్‌ఫిక్సియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే` పుట్టుక సమయంలో ఆక్సిజన్ తగ్గడం. పెరియనేటల్ ఆస్‌ఫిక్సియా కేసులు పెరుగుతున్నాయి. అలాగే మిగతా ఏవైతే చెప్పానో నేను జన్యుపరంగా వచ్చే మస్కులార్ డిస్ట్రోఫీ గాని మస్కులర్ ఆట్రోఫీ గాని అలాంటివేమో ఒకే రకంగా ఉన్నాయండి. ఒకప్పుడు ఎంత ఉన్నాయో ఇప్పుడు అంతే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం రోగ నిర్ధారణ సౌకర్యం బాగా అందుబాటులోకి వస్తున్నది. ఒకప్పుడు అలాంటి పిల్లలను వదిలేసేవాళ్లు. ఇప్పుడు వైద్య సహాయం ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్స్ చేసి తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా, నేను చెప్పాను కదా, ఏడీహెచ్‌డీ గాని తర్వాత ఆటిజం గాని చాలా ఎక్కువగా ఉంది. 20,30 సంవత్సరాల క్రితం నాటి కేసులతో పోలిస్తే దాదాపుగా పది నుంచి ఇరవై రెట్లు పెరిగిందని కొంతమంది అంచనా చేస్తున్నారు. వాటికి సంబంధించిన వైద్యకేంద్రాలు చాలా వచ్చాయి. కానీ చాలా వాటిలో కచ్చితమైన శిక్షణ పొందినవాళ్లు చేయట్లేదు. అలాగే ఆర్థికంగా చాలా పెనుభారం. అంటే సంపాదన సరిగ్గా ఉండి ఒకే చైల్డ్ ఉండి వాళ్లని చూసుకోవడానికి అంటే మాత్రం సరిపోతుంది. దాదాపు నెలకు లక్ష రూపాయల పైన ఇలాంటి థెరపీలకT ఇవ్వడం కష్టసాధ్యం. కాబట్టి వాటి కోసం ఇలాంటి సెంటర్స్ వాలంటరింగ్ బేసిస్‌లో వచ్చి మంచి నిపుణులతో చేయాల్సిన అవసరం ఈరోజు సమాజంలో చాలా ఉంది.
ఇదంతా చూస్తుంటే భారతదేశంలో సంస్కృతి మీద పడుతున్న దుష్ప్రభావాలకీ ఈ అవాంఛనీయ పరిణామాలకీ సంబంధం ఉందని అనుకోవచ్చునా?
ఉంది. తప్పకుండా ఉంది. ఒకప్పుడు 21 నుంచి 25 మధ్యలో పెళ్లిళ్ల్లు అయిపోయేవి. 30 ఏళ్ల లోపల పిల్లలు పుట్టేవారు. ఇప్పుడు నెమ్మదిగా ఆ సంస్కృతి నుంచి ప్రజలు దూరమైపోతున్నారు. ఆలస్యంగా వివాహాలు, పిల్లలు. మన సంస్కృతికి కొంత విరుద్ధమే ఇది. ఏదో ఒక రంగంలో ఉండేవాళ్లు, పీహెచ్‌డి చేస్తున్నవాళ్లు, సైంటిస్టులు.. వీళ్లకి ఆలస్యంగా పెళ్లి జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవచ్చు. కానీ సాధారణ యువతీ యువకులు, 20 ఏళ్లు వచ్చి చదువు అయిపోయిన వాళ్లు కూడా, ఉద్యోగంలో స్థిరపడినా కూడా, ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ అనేది సడలి పోవడం మరొక అంశం. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం కదా` కేవలం తల్లిదండ్రులు, పిల్లలు అంతే. మళ్లీ దాంట్లో వన్ ఆర్ నన్ అనే ఫినామినాలోకి వెళ్లిపోవడం. పేరెంట్స్ ఇద్దరూ పనిచేయడం ఇంకా కామన్. పేరెంట్స్ లేకుండా ఒకే పిల్ల లేదా పిల్లవాడు ఇంట్లో ఉన్నప్పుడు సమస్యలు అనివార్యంగా ఉంటాయి. కాబట్టి కుటుంబం, ఈ ఉమ్మడి కుటుంబాలు, తల్లిదండ్రులు మళ్లీ తాత,నానమ్మ, అమ్మమ్మ పిల్లలకు అవసరం. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తే ఇవన్నీ చాలావరకు దూరంగా ఉంటాయి.
ఇది కేవలం ఒక వర్గం అంటే ఇప్పుడు పరిభాషలో మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక మతానికి సంబంధించిందా? అన్ని వర్గాల్లోనూ కనిపిస్తుందా?
దాదాపు అన్ని వర్గాల్లో ఉంది. అయితే జన్యు పరంగా వచ్చే కొన్ని మాత్రం, కొన్ని వర్గాల్లో ఎక్కువ. మేనరికం, సమీప బంధువులతో వివాహా లలో ఇది రివాజుగా ఉంటుంది. కొన్ని వర్గాల్లో జన్యుపరంగా వచ్చే లోపాలతో పుట్టే పిల్లలు చాలా ఎక్కువ. ఏ డీహెచ్‌డీ, ఆటిజం ఉన్నత సంపన్న వర్గాల్లో ఎక్కువగా చూస్తున్నాం. అంటే నియోరిచ్. తల్లితండ్రులు ఇద్దరూ మంచి చదువులు చదివి, ఇద్దరూ వారి తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటూ, కేవలం ఒకరో లేదా ఇద్దరు పిల్లలతో ఏకా కులుగా ఉంటూ, ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలలో కొనసాగే వారి సంతానంలో ఇవి ఎక్కువగా చూస్తున్నాం.
ఎక్కువగా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ల మీద ఉద్యోగాలు చూపే ఒత్తిడి గర్భస్థ శిశువుల మీద పడుతుందా?
అది చెప్పడం కొంచెం కష్టమే. ఉద్యోగాలతో వచ్చే తీవ్ర ఒత్తిడి ప్రభావం పడే అవకాశం లేదని మాత్రం అనలేం. వీటి గురించి కూడా ఈ రోజుల్లో మనం కొంత ముందు దృష్టితో ఆలోచించాలి. ఆర్యజనని పేరుతో రామకృష్ణ మఠం వారు, కొన్ని స్వచ్ఛంద సేవాసంస్థలు వినూత్న ప్రయోగాలు జరుపుతున్నాయి. మహాభారతం ప్రకారం, కృష్ణుడు సుభద్రతో చెప్తున్నప్పుడు అభిమన్యుడు గర్భంలోనే పద్మవ్యూహం గురించి విని, నేర్చుకున్నాడు. ఈరోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రీయంగా అందరూ అంగీకరించే పద్ధతి – మొదటి 1000 రోజులు అనే అంశం. 1000 రోజులు అంటే ఏమిటి? కడుపులో ఉన్న 270 రోజులు, బయటికి వచ్చాక రెండు సంవత్సరాలు. ఎప్పుడైతే సంయోగం జరిగి గర్భంలో పిండం ఏర్పడుతుందో అది అంతర్ ప్రపంచంలో పిండం పుట్టినరోజు అవుతుంది. బాహ్య జననం ఇంకొకటి. ఈ మధ్యకాలం కీలకం. పాశ్చాత్య సంస్కృతిలో కూడా ఆ కాలంలో గర్భిణిలు పొగ తాగడం, మద్యపానం నిషిద్ధం. ఇది శాస్త్రీయమైన పంథా. ఎందుకంటే వాటి ప్రభావం పిండం మీద ఉంటుంది. గర్భిణులుగా ఉండి బాగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్లకి ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే ఒక స్థితితో పిల్లలు పుడతారు. అది అందరికీ తెలిసిందే. తర్వాత తండ్రికి ఉండే స్ట్రెస్ తల్లీ భరించ వలసి ఉంటుంది. తల్లికి ఉండే ఒత్తిడి బిడ్డ మీద ప్రసరిస్తుంది. ఇది ఎంత అనేది చెప్పలేం. కానీ ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డేస్ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్‌ని మన భారతీయ సంస్కృతి ఆధారంగా చూసుకుంటే ఎప్పుడైతే గర్భం వచ్చిందో, ఆ రోజు నుంచి ప్రసవం వరకు కూడా పిల్లలను పెంచినట్టే. ఆ కాలమంతా వివిధ రకాల సంస్కారాలు, ఆలోచన పద్ధతిని మార్చడం, యోగా, ప్రాణాయామం, మంచి పుస్తకాలు చదవడం, చెడు అలవాట్లకు, చెడు ఆలోచనలకు కూడా దూరంగా ఉండడం చేయాలి. అప్పుడు ప్రసవ సమయంలో శిశువు మీద దుష్ప్ర భావాలు పడకుండా కాపాడే అవకాశం ఉంది.
నవజాత శిశువులకు ఇలాంటి వ్యాధులు వస్తాయి, లేదా ఉన్నాయి అని చెప్పి ప్రసవం వేళకి నిర్ధారణ అయి ఉంటుందా? ఒకవేళ ఉన్నా ఆ సమయానికి కనిపించకపోవచ్చు. తర్వాత అది బయటపడుతుంది. అలా డెవలప్ కాకుండా తల్లిపాల ద్వారా నిరోధించే అవకాశం ఉందా? ఇప్పుడు తల్లిపాలు ఇవ్వడం అన్నదీ తగ్గిపోయింది కాబట్టి ఈ ప్రశ్న.
అర్థమైంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాలు కొన్ని వందలు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే కాకుండా తల్లి బిడ్డకు పాలు ఇవ్వడంలో ఒక బాంధవ్యం ఉంటుంది. దానితో తల్లీబిడ్డల మధ్య ఉండే ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ వేరే స్థాయిలో ఉంటుంది. అలా ఇచ్చే కుటుంబానికీ, ఇవ్వని కుటుం బానికీ తేడా ఉంటుంది. అది పిల్లల ఎదుగుదల మీద ఉంటుంది. మీరడిగిన ఇంకో ప్రశ్నకి.. శిశువుకు వస్తాయనుకున్న లోపాలను మందే కనుగొన వచ్చా? కొన్ని కండిషన్స్‌ని కనుగొనవచ్చు. శిశువు చాలా అబ్నార్మల్ కండిషన్స్‌తో పుడుతుందని తెలుసుకోగలిగేవి మనకు కొన్ని ఉన్నాయి. టిఫా స్కాన్ అని, మొదటి మూడు నెలల్లోనే చేస్తారు. కొన్ని రకాల తీవ్రమైన అంగవైకల్యాలతో పుట్టే అవకాశం ఉందని ఆ స్కానింగ్‌లో తెలిసినప్పుడు, అబార్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి లోపాలు చాలావరకు ప్రసవం వేళలోనే తెలిసే అవకాశమే ఎక్కువ. తల్లిదండ్రుల ఒత్తిడిని అనుభవించిన గర్భస్థ శిశువు పుట్టిన తర్వాత తల్లిపాలు తాగడం ద్వారా బయటపడే అవకాశం ఉంది. తర్వాత పెరుగుదలలో ఇంట్లో వాతావరణం ఏడిహెచ్‌డీ, ఆటిజం దూరంగా ఉంచడానికి సాయపడతాయి. సెరిబ్రల్ పాల్సీతో పుట్టిన పిల్లలకు ఇలా ఇంట్లో మంచి వాతావరణం ఉంటే, వారిని చాలావరకు నయం చేయవచ్చు.
ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. జాగృతి పాఠకుల తరపున ధన్యవాదాలు.
లబ్ధిదారుల అనుభవాలు, ఇంకొన్ని విశేషాలు వచ్చే సంచికలో..