తమకూ ఓ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కావాలన్న ఆకాంక్ష విదేశాల్లో పెరిగిందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ అన్నారు. ఢిల్లీకి చెందిన శ్రీ విశ్వ నికేతన్‌ ‌ట్రస్ట్, ‌భాగ్యనగర్‌ ‌లో ఐదు రోజులపాటు నిర్వహించిన 7వ విశ్వ సంఘ్‌ ‌శిబిరం ముగింపు కార్యక్రమం డిసెంబర్‌ 28‌న జరిగింది.

ముగింపు ఉత్సవాన్ని ఉద్దేశించి మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రసంగిస్తూ  ‘‘ధర్మం తప్పడంతో అసమా నతలు పెరిగిపోయాయి. అతివాదం ప్రబలింది. చరిత్ర గతి తప్పింది. ఎవ్వరిలోనూ కరుణ అన్నది లేకుండా పోయింది. దీంతో అన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించాలని అందరూ అనుకుంటున్నారు. ఈ చర్చ అంతటా ఉన్నదే. మనం కూడా చేస్తున్నాం. మరి ఇది ఎలా జరగాలి?  కొలంబస్‌ అమెరికాను కనుగొన్నారని అంటారు. నిజమా? అబద్ధమా? అన్న చర్చలోకి వెళ్లడం అవసరం లేదు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాజు ఇతడి కోసం సన్మాన సభ పెట్టారు. మేధావులు కూడా వచ్చారు. అయితే… ఈ సమయంలో కొలంబస్‌పై ఇతరులకు అసూయ కలిగిందని, ఈ విషయం రాజుగారికి తెలిసింది. వారందరికీ ఓ పని అప్పజెప్పారు. కోడి గుడ్డును ప్రకృతి నియమానికి విరుద్ధంగా నిలబెట్టి చూపించాలని ఆదేశించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా కుదురుతుందని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సమయంలో కొలంబస్‌ ‌ముందుకు వచ్చి, దానిని పగలగొట్టి, అప్పుడు నిలబెట్టాడు. అప్పుడు.. మిగతా మేధావులు.. ఇలా చిన్న పిల్లవాడు కూడా చేస్తాడు. అని చెప్పగా.. మరి మీరెందుకు చేయలేదని రాజు ఎదురు ప్రశ్న వేశారు. ఎవ్వరూ చేయలేనిది కొలంబస్‌ ‌చేసి చూపించారన్నారు. ఇవన్నీ జరగాల్సిందే. కానీ ఎవరు చేయాలి? పిల్లి మెడలో గంట కట్టాలని ఎలుకలు అనుకున్నాయి. దీని ద్వారా పిల్లి పరిగెత్తితే..  గంట మోగుతుందని, అందువల్ల మనం పారి పోవచ్చని అనుకున్నాయి. కానీ.. ఎవ్వరూ పిల్లి మెడలో గంట కట్టలేదు. అందుకే పిల్లి మెడలో గంట కట్టడం ఇప్పటికీ సాధ్యపడలేదు’’ అని అన్నారు.

సేవ చేసే అవకాశమిస్తే ఐదేళ్ల వరకు కనిపించరు

దేశంలో ఏ కార్యాలైతే జరగాల్సి ఉన్నాయో.. అవి తన నుంచే ప్రారంభం కావాలని డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌తలపోశారు. తమ నుంచే కార్యాలు ప్రారంభించే వ్యక్తులను తయారుచేయాలని భావించారు. అలాంటివారే సంఘ స్వయంసేవకులు అవుతారు. వారు వారి నుంచే పనులను ప్రారంభిస్తారు. సేవా తత్పరతతోనే పనులు చేస్తారు. ‘‘శివ భావే జీవ సేవ’’ అని రామకృష్ణ పరమహంస సేవ అన్న భావనకు అర్థాన్ని నిర్వచించారని మోహన్‌ ‌భాగవత్‌ ‌తెలిపారు. సేవను అనేక రకాలుగా చేస్తారు. స్వార్థం కోసం కూడా సేవ చేస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి సేవ చేసే వారు వరదలా వస్తారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ తమకు సేవ చేసే అవకాశం కల్పించాలని పరిపరి విధాలుగా ప్రజలను ప్రార్థిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఐదు సంవత్సరాలకు గానీ కనిపించరు. వారు సేవ అంటూ ప్రతిఫలాన్ని ఆశిస్తారు. దీనిని సేవ అనరు. దీనిని ప్రతిఫలాపేక్ష అంటారు అని చెప్పారు.

పోలీసు ఉంటేనే ఎర్ర లైట్‌ ‌సిగ్నల్‌ ‌దగ్గర ఆగుతాం

కొందరు వాహనదారులు ఎర్రలైట్‌ ‌సిగ్నల్‌ ‌దగ్గర పోలీసులు నిలబడితే ఆగుతారు. లేదంటే దాటి వెళ్లి పోతారు. మనం చూస్తుంటాం. పోలీసులు లాఠీ పట్టుకొని నిలబడితేనే.. సిగ్నల్‌ ‌పాటిస్తాం. ఇది కూడా సేవ కాదు. ఇది భయభీతి. కొందరు బలవంతంగా సేవ చేస్తారు. ఇది కూడా సేవ అనిపించుకోదు. మరి కొందరు సేవ చేస్తారు కానీ.. పేరును ఆశిస్తారు. ఇతరులకు చూపించ డానికి సేవ చేస్తారు కొందరు. ఇదంతా అహంకారం. సేవ చేసే వారు కేవలం సేవ కోసమే సేవా కార్యక్రమం చేస్తారు. సేవ ద్వారా తన పాపం ప్రక్షాళన అవుతుందని మరి కొందరు భావిస్తారు అని సర్‌సంఘచాలక్‌ ‌తెలిపారు.

సేవ ఓ పవిత్ర కర్తవ్యం

సేవ ఓ పవిత్ర కర్తవ్యం, దీని బదులు ఏమీ వద్దు అని కొందరు భావిస్తారు. ప్రామాణికతతో, నిస్వార్థంగా, ఏమీ ఆశించకుండా చేసేవారు ఉంటారు. సేవే తన పరమావధిగా చేసే వారుం టారు. వారే స్వయంసేవకులు. సంఘం పెరుగుతూ ఉంటే స్వయంసేవకులు కూడా పెరుగుతుంటారు. కొందరు స్వయంసేవకులు విదేశాలకు కూడా వెళ్లారు. కానీ.. వారు తమ వ్రతాన్ని మాత్రం మరిచిపోలేదు. హిందూ దేశ సర్వాంగీణ ఉన్నతిని కానీ, హిందూ ధర్మ సంరక్షణను కానీ మరిచిపోలేదు అని మోహన్‌ ‌భాగవత్‌ ‌చెప్పారు.

ప్రపంచమంతటా ధర్మ ప్రతిష్ఠ జరగాలి

విదేశీయులు మన చరిత్రను, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మనం ఆచరిస్తున్న పద్ధతులను చూసి, ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అలా మనం బతకాలని మన పూర్వికులు నిర్దేశించారు అని సర్‌సంఘచాలక్‌ ‌తెలిపారు. మన జీవన విధానాన్ని ప్రపంచం ముందు ఉంచి, ప్రపంచంలోని ప్రతి మూల ధర్మాన్ని ప్రతిష్ఠ చేయాలి. మనం ప్రపంచానికి నేతృత్వం వహిస్తాం. కానీ మన మన పద్ధతుల ద్వారానే నేతృత్వం వహిస్తాం. మన సైనిక శక్తి ద్వారా,  ఆర్థిక సంపత్తి ద్వారా ఇతరులను అణగదొక్కి ఎదగా లని భావించం. మన జీవన పద్ధతులను ప్రపంచం ముందు ఉంచుతాం అని చెప్పారు.

విదేశాల్లో నిత్యశాఖ నిర్వహణ

విశ్వవిభాగ్‌కి సంబంధించిన మొట్టమొదటి ద్వితీయ వర్ష వర్గ బెంగళూరులో జరిగింది. విదేశాల్లో పుట్టి, పెరిగిన 34 మంది స్వయంసేవకులు వచ్చారు. వారి ముందు భేడేజీ ఓ ప్రస్తావన తెచ్చారు. హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ద్వారా హిందువులు విదేశాల్లో సంఘ పనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ శాఖలు విదేశాల్లో ఎక్కడైనా నడపవచ్చు అని మొదటి తరం నిర్ణయించింది. ఇదే కార్య పద్ధతి ప్రతి దేశ కాల, మాన పరిస్థితుల్లో నిర్వహించవచ్చని తీర్మానిం చారు. ఆ తర్వాత రెండోతరం వచ్చింది. విదేశాల్లో ఉన్నా.. భోగమయ జీవితం మధ్యలో నివసిస్తున్నా.. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిత్య శాఖకు వెళ్లాలని రెండవ తరం వారు నిశ్చయించుకున్నారు అని మోహన్‌ ‌భాగవత్‌ ‌చెప్పారు.

భారత జీవన విధానం వైపు విదేశీయుల మొగ్గు

సభికులను ఉద్దేశించి సర్‌సంఘచాలక్‌ ‌ప్రసంగిస్తూ ‘‘ఇప్పుడు మూడో తరం వారు ఇక్కడ కూర్చున్నారు. ఆయా దేశాల ప్రజలు తమకు కూడా ఓ హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ లాంటి స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఉం‌డాలనుకునే విధంగా మీరు మెలగాలి. అంతటి బృహత్తర బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది. ఎందుకంటే భారత్‌లో ఎలాగైతే సంఘకార్యం వుందో, అచ్చం అలాంటి సంఘటనే, అలాంటి జీవన విధానమే తమకు కూడా ఉండాలన్న చర్చ విదేశీ యుల్లో తీవ్రమవుతోంది. ఇది మనకు వినిపిస్తూనే వుంది. స్వయంసేవకులు వారి జీవనపద్ధతులను మాకు కూడా నేర్పిస్తారా? మాకూ శిక్షణ ఇస్తారా? అని విదేశీయులు అడుగుతున్నారు. ఈ చర్చ సాగుతోంది. అలాంటి వారికి హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అనే ఓ సంస్థ వుందని, దాని ద్వారా శిక్షణ పొందాలని మీరు వారందరికీ చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు.

సత్యానికి చిహ్నం సర్‌సంఘచాలక్‌జీ: కృష్ణ ఎల్లా

ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత్‌ ‌బయోటెక్‌ ‌వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్‌ ‌చైర్మన్‌ ‌కృష్ణ ఎల్లా భారత్‌లో జరగాల్సిన ఆవిష్కరణల గురించి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ను ‘‘సత్యానికి చిహ్నం’’ గా అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యాన్ని సంస్థలకు అతీతంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యం కంటే పెద్దది భారత్‌ అని, ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ఏదైనా చర్చింవచ్చని, అయినా.. ధర్మబద్ధంగా ఉండాలని తెలిపారు. ఇతర దేశాలపై దాడులకు దిగొద్దని భారత్‌ ‌నిర్ణయించుకుందని, ఈ నిర్ణయం నాగరికత, సాంస్కృతిక లోతుల నుంచి వచ్చింద న్నారు. వసుధైక కుటుంబకం అన్న సూత్రాన్ని భారత్‌ ఆవాహన చేసుకుందని తెలిపారు. ‘‘మన సంస్కృతి, అంతర్గత గొప్పదనం కారణంగానే మనం ఇతరులపై దాడులకు దిగలేదు’’ అని తెలిపారు.

మన సంస్కృతే మనకు అతి పెద్ద సంపద: దాజీ

గతంలో అమ్మమ్మ నానమ్మల ద్వారా మన సంస్కృతి గురించి, మంచి విషయాల గురించి నేర్చుకునే వారమని, ఇప్పుడు అది తగ్గిపోయిందని హార్ట్‌ఫుల్‌నెస్‌ ‌మూవ్‌మెంట్‌ అం‌తర్జాతీయ ఆధ్యాత్మిక మార్గదర్శి దాజీ అన్నారు. వారి మేధస్సును వచ్చే తరాలకు పంచకపోతే, పరిజ్ఞానం కనుమరుగయ్యే అవకాశం వుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతే మనకు అతి పెద్ద సంపద అని, అలాంటి సంపదను తుడిచేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నా రని, దీని ద్వారా హిందువులను ఛిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరి బాధ్యత మరింత పెరిగిందని, మన సంస్కృతి, ధర్మం గురించి అందరికీ చెప్పాలని సూచించారు. ఆత్మ పరమాత్మలో కలిసిపోతే పరమాత్మే అవుతారని కబీర్‌ ‌చెప్పారని, కైవల్యం గురించి జైనిజం కూడా బోధిస్తుందని, నిర్వాణ అంటూ బుద్ధిజం కూడా చెబుతుందని, కృష్ణుడు కూడా గీతలో చెబుతారని గుర్తు చేశారు. పతంజలి కూడా ధ్యానం గురించి చెబుతారని, కానీ ధ్యానం ఎలా చేయాలో చాలా మంది తటపటాయిస్తుంటా రన్నారు. మన చేతనావస్థను పెంచేదే ధ్యానమని, అసలైన జ్ఞానం ఏదైతే ఉందో, అటువైపు ప్రయాణింప జేసేదే ధ్యానమని వివరించారు.ఇదే విషయాన్ని వశిష్ఠుడు కూడా శ్రీరాముడికి బోధించారని, ఇలాంటి అత్యుత్తమ జ్ఞాన సంపదను భారత్‌ ‌ప్రపంచానికి ఇచ్చిందని, అదే వశిష్ఠ సంహిత అన్న పేరుతో ఉందని, దీనిని అందరూ అధ్యయనం చేయాలని సూచించారు. అత్యున్నతమైన స్థితిని వర్ణించడంలో, చెప్పడంలో సైన్స్ ‌కూడా విఫలమైందన్నారు.

పూజ్యశ్రీ గోవింద్‌ ‌గిరి మహరాజ్‌ ‌నుంచి సర్‌సంఘచాలక్‌జీ వరకు..

శిబిరంలో పాల్గొనేవారు డిసెంబర్‌ 25 ఉదయం కల్లా శాంతి వనానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ‌కోశాధికారి పూజ్యశ్రీ గోవింద దేవ్‌ ‌గిరి మహరాజ్‌ ఆశీస్సులతో శిబిరం అధికారికంగా ప్రారంభమైంది. శిబిర ప్రధాన ఇతివృత్తంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళేగారు ముఖ్య ప్రసంగం చేశారు. ‘హార్ట్‌ఫుల్‌నెస్‌ ‌మూవ్‌మెంట్‌’ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ దాజీ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విచ్చేశారు. తమిళనాడు, పంజాబ్‌ ‌రాష్ట్రాల మాజీ గవర్నర్‌ ‌బన్వరీలాల్‌ ‌పురోహిత్‌ ‌శిబిరానికి ‘శిబిరాధికారి’గా వ్యవహరించారు. డిసెంబర్‌ 28‌న జరిగిన శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రసంగించారు.

శిబిరంలో కొస మెరుపులు

  •     సర్‌సంఘచాలక్‌ ‌మూడు రోజులు, సర్‌కార్యవహ 5 రోజులు పాల్గొని  అందరితో సంభాషించారు.
  • దాజీ రెండు రోజుల పాటు అందరికీ ధ్యానంలో శిక్షణ ఇచ్చారు.
  • ఏడాది శిశువు నుంచి 92 సంవత్సరాల వయసు వారు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.
  • ఇంగ్లండ్‌ ‌శారీరక ప్రముఖ్‌ ‌సంగీతా ఠక్కర్‌ ఇక్కడ శారీరక విభాగానికి ముఖ్యశిక్షికగా వ్యవహ రించడంతో మహిళా సాధికారితకు ప్రాధాన్యత చేకూరింది.
  • ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడైన శంకరమహేదేవన్‌ ఆలపించిన ‘సర్వమంగళ మాంగల్యం’ అనే విశ్వవిభాగ్‌ ‌ప్రార్థన వీడియోను దత్తాజీ విడుదల చేశారు.
  • విశ్వవిభాగ్‌కు చెందిన 22 మంది ప్రచారక్‌లు పాల్గొన్నారు.
  • డాక్టర్‌జీపై నాగపూర్‌ ‌కళాబృందం ప్రదర్శించిన నాటకం ప్రేరణదాయకంగా ఉంది.
  • ప్రతీ కుటుంబం అత్యంత ప్రయాసతో రాకపోక లకు గాను కనిష్టంగా రూ.3 లక్షలు, గరిష్టంగా రూ.9 లక్షలు ఖర్చు చేసింది.

పరస్పర సహకారానికి వేదిక:  శ్రీకాంత్‌ ‌గుండవరపు, అమెరికా

విశ్వ సంఘ శిబిరం వేర్వేరు దేశాల నుంచి వచ్చిన వారి మధ్య పరస్పర సహకారానికి వేదికగా మారిందని అమెరికా సేవా ఇంటర్నేషనల్‌ ‌విభాగానికి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న శ్రీకాంత్‌ ‌గుండవరపు తెలిపారు. తొలిసారిగా శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తమ విభాగం తరఫున 10 మంది వచ్చినట్టు తెలిపారు. శిబిరం ద్వారా పొందిన అనుభవం అనూహ్యమైంది. అంతటా ఆధ్యాత్మిక భావన తొణికిసలాడింది. వేర్వేరు దేశాల నుంచి వచ్చిన అనేక మందిని కలుసుకునే అద్భుతమైన అవకాశం లభించింది. అందరిలోనూ కనిపించిన సేవాభావం అబ్బురపరిచింది. పరస్పరం సహకరించు కోవడంలో ఆత్మీయ భావం వెల్లివిరిసింది అని ఆనందం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో పాటిస్తున్న పని పద్ధతులను పరస్పరం పంచుకోవడం ఇక్కడే సాధ్యమైంది. అనుభవజ్ఞులైన అఖిలభారతీయ అధికారులు చేసిన ప్రసంగాల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాం అని చెప్పారు.

కెన్యాలో నీటి సమస్య.. అమెరికాలో ఆహారం, ఆరోగ్యం అభద్రత

ఇతరదేశాల నుంచి వచ్చినవారిని కలిసినప్పుడు భారతీయ విలువలకు ప్రోత్సాహం, సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహారం వంటి విషయాలను చర్చించుకున్నట్టు శ్రీకాంత్‌ ‌తెలిపారు. ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు కూడా చర్చకు వచ్చాయి. కెన్యాలో నీటి సమస్య, అమెరికాలో ఆహారం, ఆరోగ్యానికి సంబంధించిన అభద్రతపై ఎలా పనిచేయాలనే దానిపై ఒక కార్యాచరణ రూపకల్పనకు నిర్ణయించి నట్టు చెప్పారు.

సేవా ప్రాజెక్టులకు సాయం

శిబిరంలో భాగంగా దక్షిణాఫ్రికా, బాంగ్లాదేశ్‌, ‌నేపాల్‌, ‌ట్రినిడాడ్‌, ‌గయానా  వంటి దేశాల్లో సేవా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పరస్పరం సహాయం చేసుకోవాలని తీర్మానించినట్టు శ్రీకాంత్‌ ‌తెలిపారు. ఆ క్రమంలో అందివచ్చిన టెక్నాలజీని వినియోగించు కుంటూ, అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ను విస్తరించడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.

పెళ్లికి వచ్చినట్టుంది

అమెరికాలో ఉంటున్నప్పటికీ తన స్వస్థలం భాగ్యనగరమేనని శ్రీకాంత్‌ ‌చెప్పారు. శిబిరం ఒక వైపు మేధోమథనానికి మార్గం చూపుతూనే మరోవైపు వివాహ వేడుకను తలపించింది. వచ్చినవారందరితో మమేకమై వారితో మాట్లాడిన తర్వాత పెళ్లిలోలాగా బంధువులను, ఆప్తులను, మిత్రులను కలుసుకున్న అనుభూతి తనకు కలిగిందని ఆయన భావోద్వేగంతో చెప్పారు.

ఈ శిబిరంలో సహసర్‌కార్యవహలు డాక్టర్‌ ‌కృష్ణగోపాల్‌, ‌ముకుంద,అఖిలభారత సేవాప్రముఖ్‌ ‌పరాగ్‌ అభ్యంకర్‌, అఖిలభారతీయ కార్యకారిణి సదస్యులు భాగయ్య, మన్మోహన్‌ ‌వైద్య, సురేజ్‌జీ సోని, సేవికాసమితి ప్రముఖ కార్యవాహిక సీతక్క, సహకార్యవాహిక అల్కా తాయి, మహిళా సమన్వయ ప్రముఖ్‌ ‌చందా తాయి సాత్యే, ప్రజ్ఞాప్రవాహ అఖిలభారత సంయోజక్‌ ‌నందకుమార్‌ ‌మొదలగు ప్రముఖ అఖిలభారతీయ స్థాయి కార్యకర్తలు పాల్గొని మార్గదర్శనం చేశారు.


విశ్వ సంఘ శిబిరం విశిష్టత

విశ్వ సంఘ శిబిరం అనేది హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, ‌సనాతన ధర్మ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, ‌హిందూ సేవా సంఘం, సేవా ఇంటర్నేష నల్‌, ‌సంస్కృత భారతి, విశ్వహిందూ పరిషత్‌ ‌వంటి సంస్థల సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే ఒక ఆనందోత్సాహాల వేడుక. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రతినిధులు ఒకరినొకరు కలుసుకోవడానికి, పరస్పరం సంభాషించడానికి, ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవడానికి ఇది ఒక విశిష్టమైన వేదికను అందిస్తుంది. ఈ సంస్థలన్నీ సంస్కారము (విలువలు), సేవ, సంఘటన్‌ (‌సంస్థ) అనే ఉమ్మడి విలువల ద్వారా ప్రేరణ పొందినవి. అనేక దేశాలలో, భారత్‌ ‌లేదా తూర్పు ఆఫ్రికా నుండి వలస వెళ్ళిన సంఘ స్వయంసేవకులు లేదా సమాజ నిర్మాణానికి వ్యక్తిత్వ నిర్మాణమే పునాది అని నమ్మే నిబద్ధత కలిగిన హిందువుల ద్వారా ఈ సంస్థలు ప్రారంభమయ్యాయి. పైన తెలిపిన ప్రతి సంస్థ తాను సేవలందిస్తున్న సమాజంలో నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి స్వతంత్రంగా పనిచేస్తుంది. విశ్వ సంఘ్‌ ‌శిబిరాన్ని ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. మొదటి శిబిరం 1990లో బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత క్రమంగా వడోదర, ముంబై, గాంధీనగర్‌, ‌పూణే, ఇండోర్‌ ‌నగరాలలో జరిగాయి. ఇటీవల ఏడవ విశ్వ సంఘ శిబిరం డిసెంబర్‌ 25 ‌నుండి 29 వరకు భాగ్యనగర్‌ ‌సమీపంలోని కన్హా శాంతివనంలో జరిగింది.

2025 శిబిరం ప్రధాన ఇతివృత్తం ‘‘ధర్మే సర్వం ప్రతిష్ఠితమ్‌’’, అం‌టే ‘‘ధర్మమే అంతటికీ పునాది’’. వివిధ దేశాల కార్యకర్తలతో కూడిన నిర్వహణ బృందం క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌ ‌సమావేశాల ద్వారా ఈ కార్యక్రమ ప్రణాళికను రూపొందించింది. ఇందులో చిన్నారులు, బాలలు, యువత, పెద్దలు, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారికి తగిన సమావేశాలు, కార్యకలాపాలను నిర్వహించారు. ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనానికి అన్ని ఖండాలలోని 79 దేశాల నుండి 1,610 మంది కార్యకర్తలు, స్వయంసేవకులు, ప్రతినిధులు హాజరయ్యారు.

About Author

By editor

Twitter
YOUTUBE