నిద్ర లేచినది మొదలు ఆర్‌ఎస్‌ఎస్‌నీ, బీజేపీనీ పడతిట్టేవాళ్లు కోకొల్లలు. అలా అని వాళ్లకి వాస్తవాలు తెలియక పోలేదు. ఉదాహరణకి కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు దిగ్విజయ్‌సింగ్‌ ‌లేదా దిగ్గీరాజా. ఈయనది పార్టీలో రాజగురు స్థానం. రాహుల్‌ ‌గాంధీకి ఈయనే రాజగురువు అని చెబుతారు. ఆయన డిసెంబర్‌ 27‌న తన ఎక్స్ ‌ఖాతాలో ఒక ఫోటో పెట్టారు. అది బీజేపీ వారి గ్రూప్‌ ‌ఫోటో, 1990లో శంకర్‌సింహ్‌ ‌వాఘేలా గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం నాటిది. ఈ ఫోటో చూసి కాంగ్రెస్‌ అధినాయకత్వం చాలా తెలుసుకోవాలని దిగ్గీరాజా అభిప్రాయపడ్డారు. ఇదే 140 ఏళ్ల పార్టీలో కాస్త సందడి తెచ్చింది.

ఎల్‌కే ఆడ్వాణీ, వారి సతీమణి కమలా ఆద్వాణీ, ప్రమోద్‌ ‌మహాజన్‌, ‌మహాజన్‌ ‌కుమార్తె, ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌ ‌గవర్నర్‌ ఆనందీబెన్‌ ‌వంటి వారంతా కుర్చీలలో కూర్చున్నారు. నేల మీద, ఆడ్వానీ పాదల దగ్గర కూర్చుని ఉన్నారు, నల్లగడ్డంతో ఒక యువ కార్యకర్త. ఆయన నరేంద్ర మోదీ. ఆ నలుపు తెలుపు ఫోటోనే దిగ్గీరాజా తన ఎక్స్ ‌ఖాతాలో పోస్టు చేసి, దానితో పాటు ఒక సందేశం పంపారు. అది కాంగ్రెస్‌ అధిష్టానం కోసమే. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బలమైన సంస్థలని వ్యాఖ్యానించారు. ఆ పరివారంలో ఒక సామాన్య కింది స్థాయి కార్యకర్త, ఒకప్పుడు వినయంగా నేల మీద కూర్చున్న వ్యక్తి ముఖ్య మంత్రిగా, ఆపై దేశ ప్రధానిగా ఎలా ఎదగగలిగారో ఈ ఫోటో చూపిస్తుంది అని నిజం చెప్పేశారు. కోరా సైట్‌లో కనిపించిన ఈ ఫోటో నన్ను బాగా ఆకర్షించింది. కింది స్థాయి సాధారణ కార్యకర్త, నేతల పాదాల దగ్గర కూర్చున్న కార్యకర్త ముఖ్యమంత్రి అయ్యారు, ఆపై దేశ ప్రధాని కూడా అయ్యారు. ఇదే ఆ సంస్థ వ్యవస్థాగత బలం అని మెచ్చేసుకున్నారు. ఈ వ్యాఖ్యను ఎలా ముగించారని! జై సియారామ్‌ అం‌టూ ముగించారు మరి!
ఈ ఫోటో పెట్టి, దానికి నా వ్యాఖ్య జోడించా నంటే, ఆర్‌ఎస్‌ఎస్‌-‌బీజేపీలని శ్లాఘించానంటే వేరుగా అర్ధం చేసుకోవలసిన అవసరం లేదు. తాను, తన పార్టీ ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌- ‌బీజేపీలకి బద్ధ వ్యతిరేకులమే అని దిగ్గీరాజా తెగేసి చెప్పారు. మరి ఈ ఫోటోను పోస్ట్ ‌చేయడం వెనుక లక్ష్యం? రాహుల్‌ ‌గాంధీ పనితీరు, అధిష్టానం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయని గుర్తు చేయడమేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే దిగ్గీరాజా ఎక్స్ ‌ఖాతాదారులలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌, ‌ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారట. ఈ వార్తలో ప్రస్తావించకున్నా, సోనియా గాంధీ కూడా ఆ ఖాతాదారులలో ఉండే ఉంటారు. నిజానికి ఈ ఫోటో చూసి తరించాల్సింది సోనియానే.
ఈ ఫోటో పెట్టడానికి వారం ముందే దిగ్విజయ్‌ ఒక పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో అంతర్గత సంస్కరణల అవసరం కొండంత ఉంది. పార్టీ వ్యవహారాలను రాహుల్‌ ఇం‌కా శ్రద్ధగా చూసుకోవడం మరీ మరీ అవసరం అన్నదే ఆ పిలుపు సారాంశం. డిసెంబర్‌ 19‌న ఆయన కాంగ్రెస్‌ ‌మరింత ప్రజా ప్రయోజనం కోసం, వికేంద్రీకరణతో పని చేయాలి అని కూడా పిలుపునిచ్చారు. ఇంతకాలం నుంచి ఆ పార్టీలో ఉంటున్నారు కాబట్టి, అక్కడ ఏది సాధ్యమో, ఏదీ కాదో ఆయనకి తెలియకుండా ఉంటుందా? అందుకే, (రాహుల్‌) ‌గాంధీని ఒప్పించడం అంత సులభమేమీ కాదనుకోండి అంటూ ముక్తాయించారు. ఇదీ అసలు రహస్యం. రాహుల్‌ ‌జీ! మీరు సామా జిక ఆర్థిక అంశాల మీద సరైన పంథాలోనే వెళుతున్నారు. అందులో మీకు నూటికి నూరు మార్కులూ పడిపోతాయి. కానీ కాస్త భారత జాతీయ కాంగ్రెస్‌ అం‌తర్గత వ్యవహారాలు కూడా పట్టించుకోవాలి కదా? అని హితవు పలికారు దిగ్విజయ్‌. ‌వికేంద్రీకరణ అవసరం ఉంది. ప్రజలకు చేరువగా వెళ్లాలి. అయినా ఈ విషయం గురించి మిమ్మల్ని ఒప్పించడం అంత సులభమేమీ కాదు అన్నారు.
ఇలాంటి ఫోటో పెట్టి, ఇలాంటి వ్యాఖ్య రాస్తే బీజేపీ ఆడుకోకుండా ఉంటుందా? సింగ్‌ ‌వ్యాఖ్య కాంగ్రెస్‌ ‌నిరంకుశ, అప్రజాస్వామిక నాయకత్వం గురించి వెల్లడిస్తున్నదని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్‌ ‌కేశవన్‌ అన్నారు. వాస్తవం అనే ఈ బాంబు గురించి రాహుల్‌ ‌గాంధీ ప్రతిస్పందించగలరా అని ఆయన సవాలు కూడా విసిరారు. కాంగ్రెస్‌ ‌ప్రథమ కుటుంబం పార్టీని ఎంత నిర్దయగా నడుపుతున్నదో సింగ్‌ ‌పోస్ట్‌తో బట్టబయలయిందని అన్నారు. ఇంకొందరు బీజేపీ నాయకులకు కొన్నేళ్ల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి. ఆ పుస్తకంలో ఒబామా రాహుల్‌ను ఉద్దేశించి, నాయకత్వానికి పనికొచ్చే ఒక్క లక్షణం కూడా లేదని రాయలేదా?!
మొత్తానికి దిగ్గీరాజా ఫోటో, వ్యాఖ్య కాంగ్రెస్‌ ‌పార్టీకి చిన్నపాటిదే అయినా ఓ కుదుపునిచ్చాయి. మాణిక్కం ఠాకూర్‌ ‌వంటి నెహ్రూ-గాంధీ కుటుంబ భజనపరులు దిగ్గీరాజాని దుమ్మెత్తిపోశారు. దిగ్గీరాజా గురుస్థానం కోల్పోయే అవకాశం ఏమైనా ఉన్నదో ఏమో, ఆ స్థానం ఇక తనదే అయినట్టు మాణిక్కం ఇంకో మాట అన్నారు. అల్‌ ‌కాయిదా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విద్వేషాన్ని పెంచుతాయి, వాటి నుంచి మేమేమీ నేర్చుకోనక్కరలేదు అన్నారు. అయితే శశి థరూర్‌ ‌మాత్రం, దిగ్విజయ్‌కి తన మాటలు తాను చెప్పగల సత్తా ఉందని, కాంగ్రెస్‌కు కూడా క్రమశిక్షణ అవసరమని ఇంకాస్త ఆజ్యం పోసిన తీరులో వ్యాఖ్యా నించారు. భారతదేశంలో రాజకీయ సమీకరణాల తీరుతెన్నులు, సామాజిక మాధ్యమాలను కాంగ్రెస్‌ ‌నాయకత్వ మార్పు గురించి ఆ పార్టీలో జరుగుతున్న చర్చకు దిగ్గీరాజా వ్యాఖ్యలు ఇంకాస్త ఆజ్యం పోశా యని కొందరు అంటున్నారు. అలాగే వ్యవస్థీకృతంగా రాజకీయాలను నడపడంలో బీజేపీ నైపుణ్యం గురించి ఇది తెలియచేస్తున్నదని ఇంకొందరు అభిప్రాయ పడ్డారు. జైసియారామ్‌!

– ‌జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE