భారత ఎన్నికల ప్రక్రియకు పట్టిన అక్రమ ఓట్ల చీడ పరాకాష్టకు చేరింది. ఆ చీడను నిర్మొహమాటంగా ఏరివేయక తప్పదు. అప్పుడే ప్రజాస్వామ్యం నుంచి ఆరోగ్యవంతమైన ఫలితాలు దక్కించుకోగలం. నేటి ఓటర్ల జాబితాల సవరణ ఆశయం ఇదే. బిహార్‌, మరొక 12 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడితే ఇంతవరకు బయటపడిన చీడ ఓట్లు దాదాపు 8 కోట్లు. మరణించిన ఓటర్ల పేర్లు జాబితాలలోనే సుస్థిరంగా ఉన్నాయి. వలసపోయిన వారి ఓట్లు ఎవరికో ఉపయోగ పడుతున్నాయి. ఒకే ఓటరు ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు నమోదు చేయించుకున్న ఓట్లు కూడా భద్రంగా కొనసాగుతున్నాయి. నకిలీ ఓట్లు లక్షల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఇంకా చిత్రం `చొరబాటుదారుల ఓట్లు మొత్తం ఎన్నికల ప్రక్రియకే సవాళ్లు విసురుతున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలన్నీ కకావికలయినాయి. ఈ నేపథ్యంలో ఆరంభమైంది, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌). ఆ ప్రక్రియ బయటపెట్టిన విస్తుపోయే వాస్తవమే` అర్హత లేని 8 కోట్ల ఓట్లు జాబితాలలో వర్థిల్లుతున్నాయి. వాటిని అలాగే కొనసాగించాలనీ, తొలగించడం అంటే బీజేపీకి లబ్ధి చేకూర్చడమేననీ అర్థం లేని విమర్శలకు పాల్పడుతున్నాయి విపక్షాలు. ఏడు దశాబ్దాలుగా సాగుతున్న ఓటర్ల జాబితాల ప్రక్షాళనను ఇప్పుడు బీజేపీ, భారత ఎన్నికల సంఘం మధ్య లాలూచీగా విపక్షాలు నిస్సిగ్గుగా, విజ్ఞత లేకుండా ఆరోపిస్తున్నాయి. నిన్న బిహార్‌, తాజాగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోనే ఇంత చీడ బయటపడితే, ఇక తరువాతి దశలో మిగిలిన భారతావనిలో జరిగే సవరణలో ఇంకెన్ని కోట్ల అవాంఛనీయ ఓట్లు బయటపడతాయో ఊహించడం కష్టం కాదు. ఈ చీడను మరింత విస్తరించే అవకాశం ఇవ్వాలని విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. 

రాజ్యాంగంలోని 324 అధికరణం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 21(3) నిబంధన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దేశంలో ఏ మూల అయినా ఓటర్ల జాబితాలను సవరించవచ్చు. 1952లో దేశంలో తొలి ఎన్నికలు జరిగిన నాటి నుంచి 13 పర్యాయాలు ఈ ప్రక్రియ నిర్వహించారు. 1952 – 1956, 1957, 1961, 1965, 1966, 1983-84, 1987-89, 1992, 1993, 1995, 2002, 2003, 2004లలో ఆ ప్రక్రియను అమలు చేశారు. 2026లో పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించ వలసి ఉన్నది కాబట్టి భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు 2025లో ఉపక్రమించింది. అంటే రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు జాబితాల సవరణ మొదలుపెట్టారు. మొదటి దశ బిహార్‌లో విజయవంతంగా నిర్వహించారు. తరువాత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 12 చోట్ల ప్రక్రియ చేపట్టారు. కానీ కాంగ్రెస్‌, టీఎంసీ, సీపీఐ (ఎం), సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్‌జేడీ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాహుల్‌ ఈ ప్రక్రియకు ఓట్‌చోరీ అని పేరు పెట్టి బిహార్‌లో యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకుడే అయినా శశిథరూర్‌ ఓటర్ల జాబితా సవరణను స్వాగతించారు.

విపక్షాల మంకుపట్టు

అత్యంత సహజంగా, నిబంధనల మేరకు జరగవలసిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం భారత్‌లో మాటల యుద్ధాల నడుమ, న్యాయపోరాటాల మధ్య, అధికార పార్టీలే రోడ్డెక్కే విచిత్ర వాతావరణంలో సాగుతున్నది. ఇదే భారతదేశ విపక్షాల ప్రత్యేకత.

దొంగ ఓటర్లనే కాదు, పాకిస్తాన్‌, బాంగ్లాదేశ్‌ల నుంచి వచ్చి తిష్టవేసిన వారి పేర్లు ఓటర్ల జాబితాల నిండుగా లక్షల సంఖ్యలో ఉన్నాయి. విపక్షాలు చేస్తున్న ఇప్పటి మాటల యుద్ధం, న్యాయపోరాటాలు చొరబాటుదారుల పేర్లను జాబితాలలో కొనసాగించాలనే. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ విజయ వంతంగా ముగిసింది. అయినా ఎన్‌డీఏ అధికారం లోకి వచ్చింది. విపక్షాల నినాదాన్ని ప్రజలు తుంగలో తొక్కారు. ఏమైనా ఆరుమాసాలుగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ అదే – ఎస్‌ఐఆర్‌ పేరును అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు భారత రాజకీయాలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. విమర్శల నడుమ కేంద్ర ఎన్నికల సంఘం తన కార్యక్రమాన్ని సాగిస్తున్నది. ఇందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా దోహదపడినాయి. ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక రగడతో అంతిమంగా తేలేదీ, రేపటి చరిత్ర ధ్రువపరిచేదీ ఒకటే – ఈ పార్టీలు కోరుతున్నది చొరబాటుదారులు ఓటర్లుగా కొనసాగడం. భారత్‌ను ధర్మశాలగానే మిగల్చడం.

ఇది 97 కోట్ల ఓట్లు ఉన్న జాబితాల ప్రక్షాళన

బిహార్‌ తరువాత 12 చోట్ల నవంబర్‌ 4న ఎస్‌ఐఆర్‌ పని మొదలయింది. తొలిగా చేపట్టిన బిహార్‌ ఎస్‌ఐఆర్‌ని కలుపుకుంటే ఇది భారత్‌లోని 97 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్షాళన ప్రక్రియ. బిహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించవలసి వచ్చింది. తరువాత అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, కేరళ, లక్షద్వీప్‌, మధ్య ప్రదేశ్‌, పుదుచ్చేరి, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో మొదలు పెట్టారు. ఎస్‌ఐఆర్‌ పట్ల పశ్చిమ బెంగాల్‌, అక్కడి అధికార పక్షం టీఎంసీ చేస్తున్న అల్లరి, దుష్ప్రచారం దేశంలో మరెక్కడా లేదు. ఎందుకంటే టీఎంసీకి బాంగ్లా నుంచి వచ్చి దశాబ్దాలుగా తిష్ట వేసిన రొహింగ్యాలు, ముస్లింలు తదితర సంఘ వ్యతిరేక శక్తులే అసలైన బలం. తమిళనాడులో స్టాలిన్‌ కూడా మొదట కాస్త గొడవ చేసినా, చివరికి తలొంచారు. కేరళలో సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సవాళ్లు విసరాలని చూసి భంగపడ్డారు.

రెండు దశాబ్దాల తరువాత..

రెండు దశాబ్దాల తరువాత ఇప్పుడు చేపట్టిన ఎస్‌ఐఆర్‌ అసలు ఉద్దేశం ఏమిటి? ఎన్నికల ప్రక్రియలో ఉండాల్సిన పారదర్శకతకు అది ఎలా కీలకం కాగలదు? దీని మీద ప్రజాస్వామ్య మూలాలను హరించే విధంగా ఉన్న విపక్షం వాదనలు ఏమిటి? ఒకసారి చూడాలి.

18 సంవత్సరాలు నిండిన ప్రతివారిని కొత్తగా ఓటర్ల జాబితాలో చేర్చడం.

ప్రస్తుత జాబితాలో పేర్లు కొనసాగడానికి అర్హత ఉందా లేదా పరిశీలించడం.

నిజానికి ఈ రెండే కీలకం. వేగంగా పెరుగు తున్న పట్టణీకరణ, తరుచు జరిగే వలసలు, ఓటు హక్కుకు అర్హమైన యువతకు అవకాశం ఇవ్వడం  దీని ఉద్దేశమని కేంద్రం చెప్పింది. అంతేకాదు, మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించక పోవడం, కొందరు విదేశాల నుంచి వచ్చిన చొర బాటుదారుల పేర్లు చేరడం గురించి సమీక్షించడం కూడా ఇందులో ఉంది. ఈ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం తిరుగులేని తీరులో అమలు చేయడానికి పూనుకున్నది. అందుకు మొదటి అడుగుగా లక్షల సంఖ్యలో బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లను (బీఎల్‌ఓలు)నియోగించింది. ఓటరుగా నమోదు చేయించుకోవడానికి వీలు కల్పించే పత్రాలను వీరే ఇంటింటికీ తిరిగి అందచేశారు. తరువాత వీటిని డిజిటైజ్‌ చేస్తారు. ఇదంతా రెండు మాసాల ప్రక్రియ.

ఎస్‌ఐఆర్‌ ఈసీ బాధ్యత

ఎస్‌ఐఆర్‌ అక్రమం అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినవారు`ఆర్‌ఎస్‌ భారతి (డీఎంకే), పి.షణ్ముగం (సీపీఎం), సెల్వపెరుతగయ్‌ (కాంగ్రెస్‌, తమిళనాడు), డోలా సేన్‌ (టీఎంసీ), శుభంకర్‌ సర్కార్‌ (కాంగ్రెస్‌, పశ్చిమ బెంగాల్‌). కపిల్‌ సిబల్‌ వీరి తరఫున వాదించారు. తమిళనాడులో ఎస్‌ఐఆర్‌ ఇప్పుడు చేపట్టడం సరికాదని సిబల్‌ వాదన. ఎందుకు? అక్కడ వర్షాలు పడి, ఎక్కువ మంది వ్యవసాయ పనుల్లో తలమునకలై ఉన్నారట. పైగా నాలుగు రోజులు ఆగితే క్రిస్మస్‌, సంక్రాంతి కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువ మంది అందుబాటులో ఉండరు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఆ ప్రక్రియను ఎందుకు ఆపాలో కూడా సిబల్‌ సుప్రీంకోర్టుకు నివేదించారు. అక్కడ చాలా ప్రాంతాలకు రవాణా సదుపాయం లేదు. అంతిమంగా, ఈ సమస్యల గురించి ఎన్నికల కమిషన్‌ (ఈసీ)ఆలోచిస్తుంది. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తుంది. ఎస్‌ఐఆర్‌ నిర్వహించడానికి కమిషన్‌కు ఉన్న హక్కును తిరస్కరించలేం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంలో సిబల్‌తో పాటు ప్రశాంతభూషణ్‌ వంటి వారు ఎంత జుగుప్సాకరమైన వాదనలు దేశం మీద వదిలారు. అక్రమ చొరబాటుదారులకు భారత్‌లో ఉండే హక్కు ఉందన్నారు. ఆ హక్కును లాక్కోరాదట.

సరిహద్దు రాష్ట్రాలలో పెనుసవాళ్లు

 జాబితాల సవరణకు సర్వత్రా ఒకే వాతావరణం లేదు. బాంగ్లాదేశ్‌ వంటి పొరుగు దేశంతో సరి హద్దును పంచుకుంటున్న పశ్చిమ బెంగాల్‌, అస్సాం, త్రిపుర రాష్ట్రాలలో జాబితాల సవరణ ఒక సవాలని ఎన్నికల సంఘానికి తెలుసు. పశ్చిమ బెంగాల్‌ మరీ సమస్యాత్మకం. అక్కడ పొరుగు దేశం నుంచి జరిగే అక్రమ ప్రవేశాలకు సాక్షాత్తు టీఎంసీయే అనుమతి స్తున్నది. ఓటరు కార్డులు, ఆధార్‌ కార్డులు ఇచ్చి రక్షిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో ఇంతవరకు 58 లక్షల వరకు ఓట్లు తొలగించారు. ఇక్కడి పరిస్థితు లను బట్టి ఆ సంఖ్య పెరుగుతుందనే అనుకుంటు న్నారు.

ఉత్తరప్రదేశ్‌

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2.89 కోట్ల ఓట్లు తొలగించారు. ఇందులో వలసపోయిన ఓటర్లు 1.26 కోట్లు. 46 లక్షల మంది మరణించారు.  వీరి ఓట్లు ఎలాగూ తొలిగిస్తారు. 23.70 లక్షలు నకిలీ ఓట్లు. 83.73 ఆబ్సెంట్‌ (ఓటు హక్కును మెయిల్‌ ద్వారా ఉపయోగించుకునే వారు) ఓటర్లు. మరొక 9.57 లక్షలు ఇతరత్రా కారణాలతో తొలగించిన ఓట్లు ఉన్నాయి. ఇదంతా డిసెంబర్‌ 26 నాటికి అందిన సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 15.44 కోట్లు. ఇందులో ఇప్పటి వరకు 2.89 కోట్ల ఓట్లు (19 శాతం) తొలగించారు. అయినా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక్కమాట కూడా అనలేదు. ఎన్నికల సంఘానికి అడ్డంకులు కల్పించే పని అసలే చేయలేదు. తాత్కాలిక జాబితా డిసెంబర్‌ 31న విడుదల అయిందని తరువాత దాని మీద అభ్యంతరాలు తెలియచేయవచ్చునని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నవదీప్‌ రిన్వా వెల్లడిర చారు. ఆ అభ్యంతరాలను ఫిబ్రవరి 21, 2026 వరకు స్వీకరిస్తారు. తుది జాబితా ఫిబ్రవరి 28న ప్రకటిస్తారు. ఇక్కడ 2003 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా సవరణ చేస్తున్నారు. అయితే 91 శాతం ఓటర్లు తిరిగి నమోదయ్యారు. ఇదే నియమం అన్ని రాష్ట్రాలకు వర్తింప చేస్తున్నారు. వివక్ష ఆరోపణలకు ఎన్నికల సంఘం తావీయడం లేదు.

కేరళ

కేరళలో తొలగించిన పేర్లతో తాత్కాలిక జాబి తాను డిసెంబర్‌ 24న విడుదల చేశారు. ఎస్‌ఐఆర్‌ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలలో కేరళ ఉంది. ఇక్కడ 24.08 లక్షల పేర్లు తొలగించారు. మొత్తం 2,78,50,855 ఓటర్లు ఉండగా, వారిలో 2,54,42,352 మంది తమ ఎన్యూమరేషన్‌ ఫారాలు అప్పగించారు. 6.5 లక్షల మృతుల ఓట్లు ఉన్నాయి. వలస పోవడం, మెయిల్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి ఓట్లు 14,61,769. ఒకటి కంటే ఎక్కువ చోట్ల కనిపించిన పేర్లు 1,36,029.

తమిళనాడు

ఎస్‌ఐఆర్‌ తరువాత తమిళనాడులో కేవలం చెన్నై, తిరుప్పూర్‌ క్లస్టర్‌లలోనే 50 లక్షల ఓట్లు తొలగించారు. ప్రకటించిన తాత్కాలిక జాబితా ప్రకారం మొత్తం 97.37 లక్షల ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా తొలగించారు. అందులో ఆ రెండు క్లస్టర్‌లలో తొలగించినవే 50.17 శాతం. ఒక్క చెన్నై నగరం లోనే 14.25 లక్షల ఓట్లు తొలగించారు. తొలగిన ఓట్లు ఎక్కువగా అధికార డీఎంకే కంచుకోటలలోనివే. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నియోజకవర్గంలో 1.03 లక్షల ఓట్లు తొలగించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పోటీ చేసిన చెపాక్‌`తిరువల్లికేని నియోజక వర్గంలో 89,000 మంది ఓటర్ల పేర్లు తీసేశారు. ముసా యిదా జాబితాల తయారీలో లోటుపాట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరోపించారు. అర్హులైన వారి పేర్లను బీజేపీ ప్రభుత్వం తొలగించడానికి కుట్ర పన్నిందని అన్నారు. అలాంటివే ఉంటే సరిచేయించు కోవడానికి ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చారు. అది స్టాలిన్‌కు తెలియదా? మరి ఎందుకీ రగడ? బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ఇదే అల్లరి జరిగింది. కానీ రాహుల్‌ సహా ఎవరూ కోర్టులో సవాలు చేయలేదు. ఎన్నికల సంఘానికి సవరణలు అక్రమమంటూ వినతి పత్రాలు సమర్పించలేదు.

రాజస్థాన్‌ (41.85 లక్షలు), మధ్యప్రదేశ్‌ (42.75 లక్షలు), పుదుచ్చేరి (లక్ష), ఛత్తీస్‌గఢ్‌ (27.34 లక్షలు), అండమాన్‌ నికోబార్‌ (64,000), గుజరాత్‌ (73.7 లక్షలు), గోవా (లక్ష), లక్షద్వీప్‌ (1,429) ఓట్లు తొలగించారు.

అస్సాం

అస్సాంలోను ఓటర్ల జాబితాల సవరణ చేపట్టి నప్పటికీ, దేశంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌కు, ఈ సవరణకు కొంచెం తేడా ఉంది. ఇక్కడ పౌరసత్వ నిబంధనలను బట్టి సుప్రీంకోర్టు ఆదేశం, పర్య వేక్షణలతో సవరణలు చేశారు. తాత్కాలిక జాబితా నుంచి 10.56 లక్షల ఓట్లు తొలగించారు. ఇక్కడ 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 93,021 మంది పౌరసత్వం అనుమానాస్పదం కాబట్టి వారిని జాబితా నుంచి తొలగించారు. వీరిని డి`ఓటర్స్‌ అంటున్నారు. రాష్ట్రంలోని 61 లక్షల ఇళ్లకు వెళ్లి సేకరించిన సమాచారం మేరకు తాత్కాలిక ఓటర్ల జాబితా సిద్ధమయింది. 4.78 లక్షల మంది చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్ల సంఖ్య 5.23 లక్షలు. నకిలీ ఓట్లు 53,619. ఇవన్నీ తొలగించారు.

పశ్చిమ బెంగాల్‌

దేశంలో జరిగిన ఎస్‌ఐఆర్‌ తీరుతెన్నులకూ, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తీరుకు చాలా తేడా ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎస్‌ఐఆర్‌ కుదరదంటూ రోడ్డెక్కారు. బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు ఏ కారణంగా మరణించినా, అది ఎస్‌ఐఆర్‌ ఒత్తిడి వల్లనేనని దబాయించారు. అయినా ప్రక్రియ ఆగలేదు. నిజానికి  అక్కడ చొరబాటుదారులు ఎవరో నిజమైన ఓటర్లు ఎవరో తెలుసుకోవడం కష్టమే నన్నంతగా పరిస్థితి తయారు చేశారు. ఇంతకాలంగా అక్కడి ప్రభుత్వాలు అర్హత కలిగిన ఓటర్ల వల్ల ఏర్పడినాయా? చొరబాటుదారులు నెగ్గించినవా అంటే చెప్పడం కష్టమే. అక్కడ చొరబాటుదారుల సమస్య ఐదు దశాబ్దాలుగా నానుతున్నది. మొదట కాంగ్రెస్‌, తరువాత సీపీఎం, ఇప్పుడు టీఎంసీ బాంగ్లా చొరబాటుదారులకు ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో ఎర్ర తివాచీ పరిచాయి. 1971 బాంగ్లా విమోచన యుద్ధం సమయంలోనే పది లక్షల మంది భారత్‌కు చేరుకున్నారు. 1980 నాటికి అస్సాం చొరబాటు దారుల సమస్యతో అతలాకుతలం కావడం మొదలయింది. చొరబాటుదారులు కేవలం ఆశ్రయం కోసం ఇక్కడ ఉండడం లేదు. ప్రత్యేక దేశం కోరే ధోరణిలో ఉన్నారు. అంతర్జాతీయంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం పెరిగిన తరువాత చొరబాటుదారుల సమస్యకు కొన్ని కొత్తకోణాలు వచ్చాయి. అందులో మొదటిది స్థానికులను అక్కడ నుంచి తరిమివేయడం. ఇన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ దొడ్డితోవన తమ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ను అమలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. నిజానికి ఇది కోర్టుల మీద విమర్శ. కోర్టులు మెడలు విరిచిన తరువాతే ఆమె ఎస్‌ఐఆర్‌ నిర్వహణకు అడ్డు తొలిగారు. మొదట  రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ను అనుమతించేది లేదని డంబాలు పలికినా కోర్టులు మొట్టికాయలు వేయడంతోనే ఆమె తలొంచక తప్పలేదు. కానీ ఇలాంటి ఆరోపణలు ఎస్‌ఐఆర్‌లో పనిచేస్తున్న వారి ఆత్మస్థయిర్యాన్ని పోగొడతాయని, చొరబాటుదారులుగా వచ్చి ఓటర్లుగా నమోదైన వారు బోర విరుచుకుని నడిచే అవకాశం ఇస్తాయని గ్రహించాలి. కానీ కేంద్రం, సుప్రీంకోర్టు మమతా బెనర్జీ వంటి శక్తులను దారికి తెచ్చాయి. మమత, స్టాలిన్‌, అఖిలేశ్‌, తేజస్వీయాదవ్‌ వంటివారితో సహా బీబీసీ కూడా ఎస్‌ఐఆర్‌తో చొరబాటుదారులు ఎంతో అసౌకర్యానికి గురి అవుతున్నారని వాపోయింది.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ పశ్చిమ బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇది అనూహ్యం కాదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సవరణల ప్రభావం గణనీయంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 58 లక్షల మంది పేర్లను జాబితాల నుంచి తొలగిం చారు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత ఎస్‌ఐఆర్‌ పని పూర్తయింది. డిసెంబర్‌ 27న బెంగాల్‌ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కీలక దశ మొదలయింది. అదే, అధికారులు ‘అన్‌మ్యాప్డ్‌ ఓటర్స్‌’ వివరణలు వినడం. ఇంతకీ అన్‌మ్యాప్డ్‌ ఓటర్స్‌ అంటే ఎవరు? ఓటర్ల జాబితాల సవరణ 2002లో జరిగిన సంగతి తెలుసు కదా! ఆనాటి ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలకూ, తాజాగా అందుతున్న వివరాలకూ పొంతన లేని ఓటర్లు. వీరి సంఖ్య తక్కువేమీ కాదు, 32 లక్షలు. ఈ దశలో పౌరుల పత్రాలను కఠినంగా పరీక్షిస్తారు. ఇందు కోసం 4,500 మందిని నియమించారు. 3,234 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మీకు సంబంధించిన వివరాలు రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాలతో సరిపోలడం లేదు, కాబట్టి వివరణ ఇవ్వవలసిందంటూ మొదట ఆ 32 లక్షల మందికి, ఇంటింటికి నోటీసులు పంపించారు. ఈ దశ ఉద్దేశం ఒకటి అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరుగా ఎవరైనా నమోదై ఉంటే అలాంటి పేర్లు కనుగొనడం. అనర్హుల పేర్లు తొలగించడం. తండ్రి, భర్త వంటి వారి పేర్లు సరిగా లేకున్నా జాబితా నుంచి తప్పించడం. మొత్తంగా ఓటర్ల జాబితాలో పారదర్శకతను తీసుకురావడమే. ఓటర్‌గా నమోదు కావడానికి ఆధారాలుగా చూపడానికి అనుమతించిన 12 పత్రాలలో ఒకటి తప్పనిసరిగా చూపించాలి. అయితే ఆధార్‌ ఒక్కటే ఓటర్‌గా నమోదు కావడానికి పూర్తి ఆధారం కాలేదు.

2002లో చివరిగా ఓటర్ల జాబితాలను సవరించారు. వాటిలో ఇచ్చిన వివరాలు, తాజాగా డిజిటైజ్‌ అయిన, ఓటర్లే ఇచ్చిన సమాచారం మేరకు కూడా  సరిపోలడం లేదు. ఇపిఐసి నంబర్‌ (ఎలక్టర్స్‌ ఫోటో ఐడెంటిటీ కార్డ్‌ నంబర్‌), భర్త పేరును తండ్రిగా నమోదు చేయడం వంటి వాటితో పాటు, ఆనాడు ఉన్న ఓట్లు, గుట్టలు గుట్టలుగా తాజా ప్రక్రియలో కనిపించకుండా పోయాయి. వీటి మీద ఫిర్యాదు చేసే అవకాశం కూడా రెండో దశలో ప్రధాన అంశం. ఫిర్యాదులను పరిశీలించి, లోటుపాట్లు జరిగి ఉంటే సవరిస్తారు. అర్హులకు యథాప్రకారం ఓటు హక్కు తిరిగి ఇస్తారు. పశ్చిమ బెంగాల్‌లో తాజా సవరణ ప్రక్రియ ప్రకారం 7.64 కోట్ల మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు అందుకున్నారు. అందులో 41 శాతం, అంటే 3.15 కోట్ల మంది నుంచి వచ్చిన ఫారాలను డిజిటైజ్‌ చేశారు. మిగతా వాటి విషయంలోనే సమస్యలన్నీ వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం 2002 నాటి జాబితాలోని తీవ్ర తప్పిదాలు. అయినా వారిని ఇంతకాలం పోలింగ్‌స్టేషన్‌లలోకి ఎలా అనుమతించారు?

ఇది తప్పక వేసుకోవలసిన ప్రశ్న. ఇదంతా నాటి సీపీఎం ప్రభుత్వం కావాలని చేయించిన పని. అప్రజాస్వామిక విధానాలు, గూండాయిజం వంటివన్నీ సీపీఎం నుంచే నేర్చుకున్న మమతా బెనర్జీ ఓటర్ల జాబితా తప్పులను కూడా సీపీఎం పంథాలోనే ఉపయోగించుకున్నారు. ఇప్పుడైనా తొలగించిన ఓట్లు, రొహింగ్యాలు, చొరబాటుదారులు ఆ రాష్ట్రం నుంచి పారిపోయిన తరువాత తేలినవి.

బెంగాల్‌ జాబితాల నిండా వింతలే

 2002 జాబితా ఒక పార్టీ అక్రమంగా ఎన్నిక కావడానికి ఎన్ని అఘాయిత్యాలు చేస్తుందో వెల్లడిస్తుంది. దాదాపు 86 లక్షల ఓటర్లకు తండ్రి పేరు సరిపోలడం లేదు. అప్పుడొక పేరు ఉంది. ఇప్పుడు ఇంకొకటి అన్నమాట. మొత్తం బెంగాల్‌ ఓట్లలో ఇవి 11.09 శాతం. 24 లక్షల మంది ఓటర్లు తమ సంతానం ఆరుగురు కంటే ఎక్కువ మంది అని చెప్పారు. వీరిలో మళ్లీ తండ్రి, పిల్లల మధ్య వయోభేదం నమ్మేదిగా లేదు. 12 లక్షల మంది ఓటర్లలో తండ్రికీ, తల్లికీ మధ్య వయోభేదం 15 సంవత్సరాలుగా కనిపిస్తున్నది. మరొక 8 లక్షల 78 వేల ఓటర్ల తల్లిదండ్రుల మధ్య వయోభేదం 50 ఏళ్లకు పైనే. ఇంకొక రకం ఓటర్లు ఉన్నారు. వీరు 3 లక్షల 30 వేలు. ఇందులో ఓటర్‌కీ, అతడి తాతకీ మధ్య వయో భేదం నలభయ్‌ ఏళ్ల కంటే తక్కువ.

పశ్చిమ బెంగాల్‌లోనే తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలో రఘునాథ్‌పూర్‌`1 గ్రామ పంచాయతీ పరిధిలో పలువురి ఓటర్‌ గుర్తింపు కార్డుల మీద ఒకటే నంబర్‌ ఉంది. ఇంతకంటే అసంబద్ధత ఉండదు. ఓటర్‌ నంబర్‌ ఎవరిది వారికే. అది రెండో కార్డుతోనే సరిపోలదు. ఒకే ఓటర్‌ గురింపు నంబర్‌తో 200 కార్డులు కనుగొన్నామని అధికారులే చెప్పారు. అంతేకాదు, ఇదే ప్రాంతానికి చెందిన  ఇంకొందరి కార్డుల మీద ఇపీఐసీ నంబర్‌ లేదు. పశ్చిమ బెంగాల్‌లోనే కూచ్‌ బిహార్‌లోని మాగాభంగా అనే బూత్‌ పరిధిలో 2002 జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 846 మంది. కానీ తాజా ప్రక్రియలో పనిచేసిన బీఎల్‌ఓ అక్కడ 416 మంది ఓటర్ల పేర్లే ఇచ్చారు. ఉత్తర పరగణాలు జిల్లాలోని అశోక్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం, 159 బూత్‌  ఊసే లేదు. ఉత్తర పరగణాల జిల్లాలోనే ఒకచోట ఓటర్ల సంఖ్య ఆన్‌లైన్‌లో 903 వద్ద పూర్తయింది. కానీ ఫిజికల్‌ లిస్ట్‌ 984 వరకు ఉంది.

మరొక విచిత్రమైన ఉదంతం మయాననీ గోస్వామి అనే మహిళా ఓటర్‌ది. ఈ ఉదంతం గమనిస్తే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా బిత్తరపోవడం ఖాయం. ఈమె పశ్చిమ బర్ద్వాన్‌ జిల్లా, పాండబేశ్వర్‌ గ్రామానికి చెందిన గృహిణి. ఈమె పేరు ఆ చుట్టుపక్కల బూత్‌లకు చెందిన ఓటర్ల జాబితాలలో మొత్తం 44 చోట్ల నమోదై ఉంది. అయితే ఇంటిపేరు కాస్త మారింది. రాయ్‌, నాయా, మొండాల్‌ నుంచి ఘోష్‌ వరకు ఆ మార్పులు కనిపించాయి. అయినా ఈ పేర్లన్నీ మాయాననీవేనని ఎలా చెప్పారు? భర్త పేరు ఒక్కటే ఉంది. కానీ ఇందులోని విషాదం ఏమిటంటే, ఆమె వితంతువు. ఉత్తరప్రదేశ్‌లోను, బిహార్‌లోను ఓటర్ల జాబితాల అవకతవకల మీద వీరంగం వేసిన రాహుల్‌ మరొక విషయం కూడా గమనించాలి. ఇది కూడా పశ్చిమ బెంగాల్‌లోనే కనుగొన్నారు. నాదియా జిల్లా మయాపూర్‌ అనేచోట ఏకంగా 65 ఓటర్‌ గుర్తింపు కార్డుల మీద తండ్రి పేరు ఒక్కటే. ఆ పేరు జయపాథక్‌స్వామి దాస్‌. వారణాసిలో ఒక తరహా సన్యాసం వారు తమకు దీక్షను ఇచ్చిన గురువునే తండ్రిగా పేర్కొంటారు. కాబట్టి వారంతా ఆయన పేరునే ఓటర్‌ జాబితాలోను తండ్రిగా నమోదు చేయించారు. కొన్ని నెలల క్రితం ఈ విషయం మీద రాహుల్‌ చాలా గొడవ చేశారు. ఇప్పుడు మయాపూర్‌లో జరిగినదీ సరిగ్గా అదే. ఆ 65 మంది ఓటర్లు ఇస్కాన్‌ సభ్యులు. వారు కూడా గురువునే తండ్రిగా భావిస్తారు. కానీ దీని మీద బీజేపీ కాకిగోల చేయలేదు. బీజేపీ గెలిస్తే అక్రమాలు జరిగాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే అది రాహుల్‌ ఘనతగా చెబుతున్నారు. ఓటర్ల జాబితాల సవరణకు అదనంగా ఈవీఎంల మార్పు గురించి కూడా విపక్షాలు మాట్లాడుతున్నాయి. మళ్లీ బ్యాలెట్‌ బాక్సులు రావాలని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, ఆర్‌జేడీ వంటి పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇంత తిరో గమనం ఎక్కడా ఉండదు. ఈ దశలో ఎన్‌సీపీ నాయకురాలు సుప్రియా శూలే తాను నాలుగు పర్యాయాలు ఈవీఎంల ద్వారానే లోక్‌సభకు వచ్చానని, వాటిని అనుమానించనని విపక్షాల చెంప చెళ్లుమనిపించారు.

రెండు దశాబ్దాల పాటు ఓటర్ల జాబితాల నిర్వహణ సక్రమంగా లేనందున వాటి నిండా చీడ చెడ పుచ్చింది. దానిని తొలగించక తప్పదు. అది పెరిగే కొద్దీ అసలైన ఓటర్లకు చోటు తగ్గిపోతుంది. తద్వారా రాజ్యాంగ వ్యవస్థలలో అర్హులకు చోటు కూడా కుంచించుకుపోతుంది. బుజ్జగింపు రాజ కీయాలు రాజ్యమేలతాయి. మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లగా మారిపోతుంది. అసలు దేశ సరిహద్దులు మారిపోయే పరిస్థితే దాపురించవచ్చు కూడా. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, డీఎంకే, టీఎంసీ వంటి విపక్షాలు స్వార్థ రాజకీయాలు వీడి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను స్వాగతించాలి. సజావుగా సాగేందుకు సహకరించాలి.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE