తంజావూరు సరస్వతి మహల్‌ ‌గ్రంథాలయం నేటికీ ఒక అద్భుతం. ఇలాంటివి ఇంకొన్ని- చెన్నై కన్నెమరా పౌర గ్రంథాలయం, ఇండియా ఆఫీస్‌ ‌గ్రంథాలయం, బొంబాయి కేంద్ర గ్రంథాలయం, బిహార్‌ ‌ఖుదాబక్షీ ప్రాచ్య గ్రంథాలయం, అహమ్మదాబాద్‌ ‌లాల్జాయి దళపత్‌బాయి విద్యా మందిరం, ఢిల్లీ పౌర గ్రంధాలయం, వెంకటగిరి సంస్థాన గ్రంథాలయం,హైదరాబాద్‌ శ్రీ‌కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, రాజమహేంద్ర     వరం గౌతమీ గ్రంథాలయం, అనకాపల్లి శారదా గ్రంథాలయం, వేటపాలెం సారస్వత నికేతన్‌, ‌విజయవాడ రామమోహన గ్రంథాలయం, నెల్లూరు వర్ధమాన సమాజం. వీటిలో మొదట పేర్కొన్న సరస్వతి మహల్‌ ఎం‌తో చారిత్రక నేపథ్యం కలిగినది. అలాంటి జ్ఞానఖనిని ఆంగ్ల ప్రభుత్వం ప్రపంచ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టింది.

సరస్వతీ మహల్‌ అం‌టే తమిళ చోళుల, తెలుగు నాయకుల, మహారాష్ట్రుల సంస్కృతుల సమ్మేళనం. తెలుగు సాహిత్యానికి, ఆంధ్రతేజానికి నీరాజనాలెత్తిన విజయనగరం సామ్రాజ్య పతనం తరువాత ఆంధ్ర భాషామతల్లి పెనుగొండ, చంద్రగిరి మొదలైన దుర్గాలలో తలదాచుకొన్నది. కొద్దికాలంలోనే చీకటిమబ్బులు తొలగిపోగా తెలుగుతల్లి తంజావూరు  సంస్థానంలో దాదాపు రెండు శతాబ్దాల పాటు కవితా విహారం చేసింది. తంజావూరు నేలిన రఘునాథ భూపాలుడు (1600-1634), విజయరాఘవుడు (1634-1677) కవితా హృదయం కల వారేగాక, కవి పోషకులు. కృష్ణాద్వరి, చేమకూర వెంకటకవి, కవి చౌడప్ప, రంగాజమ్మ, రుద్రమాంబ మొదలైన కవులను పోషించారు. వీరి తరువాత మహారాష్ట్ర ప్రభువుల సాహిత్యసేవ చరిత్రాత్మకమైనది.

మహారాష్ట్ర ప్రభువుల్లో 1వ శహాజీ, 1వ ఏకోజీ, 2వ శహాజీ, 1వ శరభోజీ, 1వ తులాజాజి, 2వ ఏకోజీ, 2వ తులజాజీ, 2వ శరభోజీ (1797-1838) మొదలైన రాజుల కాలంలో రెండు వందల సంవత్సరాల పాటు, కావ్యాలు, ప్రబంధాలు, యక్షగానాలు, నా•కాలు, ద్విపదలు, శతకాలు, నిఘంటువులు, దండకాలు, గేయాలు వేల సంఖ్యలో వెలువడినాయి.

మహారాష్ట్ర రాజులలో చివరివాడైన 2వ శరబోజీ సంగీత సాహిత్య, నృత్య విద్యా పోషకుడు. వాటిని ప్రోత్సహించడానికి సరస్వతీ మహాల్‌ అనే కమనీయ మైన భవనాన్ని కన్నుల విందుగా తీర్చిదిద్దాడు. సుందరము, కళాత్మకము అయిన ఈ భవనంలో తన ముందుతరం వాళ్లు, తాను అనేక వ్యయప్రయాసల కోర్చి సేకరించిన రత్నఖనితో సమానమైన వ్రాతప్రతులను భద్రపరిచాడు. ఉత్తమ గ్రంథ సంకలనంలో ఆయనకు గల అభిరుచి ఈ చాటుపద్యంతో తెలుస్తుంది.

‘సంబళము చేసి నిలిపిన

నింబుననే పుస్తకంబు నెక్కడనైనా

సంభాళించుక తెచ్చెద

శంబరహర తుల్యరూప! శరభోజి నృపా!’

1820-1830 మధ్యకాలంలో శరభోజి మహారాజు కాశీయాత్ర చేశాడు. ఆ సందర్భంలో  తనకు లభించిన వ్రాతప్రతులను ధనమిచ్చి కొన్నాడట. ఆపై  పైకం నిండుకుంది. ఇంతలో ఓ పండితుడు తన వ్రాతప్రతులను రాజుకు అమ్మ జూపాడట. మెడలోని వజ్రాలహారాన్ని ఇచ్చి వజ్ర వైఢూర్యాల కంటే విలువైన గ్రంథాలను సేకరించాడట. ఆ తరువాత జాంబునాధ భట్‌ ‌లాండగాయి, పతంగ అవదూత స్వామి, కాగల్‌కర్‌, ‌ధవలేఖర్‌, ఎన్‌.‌సుబ్ర హ్మణ్యశాస్త్రి, మొదలైన మహనీయులెందరో తమ వద్దనున్న వ్రాతప్రతులను ఈ గ్రంథాలయానికి బహూకరించారట.

సరస్వతీ మహల్‌లో దాదాపు 40,000 పైగా వ్రాతప్రతులు ఉన్నాయి. అందులో సంస్కృతం 30,000. ఇంకా మరాఠీ 5000, తెలుగు 2,500, తమిళం 2000, ఇతర భాషాప్రతులు 500 ఉన్నాయి. వీటిలో ఎక్కువ తాళపత్ర గ్రంథ్రాలే. అందుకే ఎ.సి.బర్నెల్‌  ‘‌ప్రపంచంలోని వ్రాత ప్రతుల గ్రంథాలయాలలో ఇది ముఖ్యమైనదనీ, ప్రసిద్ధమైనదనీ, ఇన్ని సంస్కృత వ్రాతప్రతులు ప్రపంచంలో మరెక్కడా లేవని రాశారు. డా।। బ్లూహార్‌ అనే జర్మన్‌ ‌పండితుడు ‘అత్యంత ఉపయోగకరమైన ఇన్ని ప్రసిద్ద గ్రంథాలు ఎంత సొమ్ము వెచ్చించినా ఎక్కడా లభించవు, కళ్లారా చూడటానికైనా దొరకవు అని వ్యాఖ్యానించాడు.  నిజానికి ఆ కాలంలో కవులకు అదొక యాత్రాస్థలం.

ఇక్కడ తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, సంగీతం, శిల్పం, లలితకళలు, సిద్ధ ఆయుర్వేద వైద్య గ్రంధాలు, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, విమానశాస్త్రంపై చాలా గ్రంథాలు లభిస్తున్నాయి. ఇవిగాక మహరాష్ట్ర ప్రాంత పాలకులు రాసిన అనేక రాజపత్రాలు, పరిపాలనా వ్యవహార పత్రాలు, డైరీలు, రాచరికపు జమా ఖర్చులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి చాలా వరకు అముద్రితాలు.  వీటిపై పరిశోధనలు జరగాలి.

అపురూప ముద్రిత గ్రంథాలక• ఇది గొప్ప నిధి. శరభోజి సాహిత్య పిపాసి, సుమారు 4000 ముద్రిత గ్రంధాలను సేకరించాడు. వీటిలో ఎక్కువ ఆంగ్ల  గ్రంథాలే. ఇంకా లాటిన్‌, ‌గ్రీకు, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌ ‌భాషల పుస్తకాలను సేకరించాడు. వీటిలో ముఖ్యంగా శరీరశాస్త్రం, వృక్ష, జంతు, సముద్ర శాస్త్రాలు, దేశదేశాల చరిత్రలు, ఆచారాలపై కూడా గ్రంథా లున్నాయి. అనేక ఆంగ్ల పత్రికలు బైండు చేయించి భద్రపరిచారు.

శరభోజీ మహారాజు సేకరించిన వ్రాతప్రతులకు, ముఖ్యంగా సంస్కృత గ్రంధాలకు డా।। బర్నెల్‌ అనే జర్మన్‌ ‌పండితుడు సూచీని తయారు చేయగా, 1933లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తెలుగు గ్రంథాల వివరణాత్మక సూచీని తయారు చేశారు. తరువాత గ్రంధాలన్నిటినీ మైక్రోఫిల్మ్ ‌చేశారు. శరభోజీ కాలానికి ముందు నుండి గ్రంథాలయానికి అను బంధంగా ధన్వంతరీ మహాల్‌ ఉం‌ది. ఇందులో సర్వౌషధాలు భస్మాల రూపంలో, లేహ్యాల రూపంలో సీళ్లు వేసిన సీసాల్లో భద్ర పరిచారు. భారత ప్రభుత్వం వారి దేశీయ వైద్య పరిశోధక సంస్థ కొన్ని రోజులపాటు ఈ గ్రంథాలయంలోని వైద్య గ్రంథాలపై పరిశోధన చేయ నిశ్చయించుకున్నది. ఆయుర్వేదం, అల్లోపతి, సిద్ధ, యునాని వైద్య విధానాలపై పండితులను రప్పించి 18 సంపుటాలుగా ‘‘శరబేంద్ర వైద్య మురైగళ’’ పేరున సిద్దం చేశారు. వీటిలో క్యాన్సర్‌, ‌క్షయ, మధుమేహం వంటి దీర్ఘవ్యాధులకు నివారణోపాయాలు ఉన్నాయి.

సరస్వతీ మహల్‌కూ తెలుగు సాహిత్యానికీ మధ్య అనుబంధం గురించి తెలుసుకోవాలంటే వేటూరి ప్రభాకరశాస్త్రి రచనలను గురించి తెలుసుకోవాలి. అంతకంటే ముందు వారి జీవితం లోనికి తొంగి చూడాలి. కృషితో రుషిత్వాన్ని పొంది తమ యావజ్జీవితాన్ని సాహిత్యంనే పండించుకొని అంకితభావంతో పనిచేసిన వారి వాఙ్మయ సేవ అమోఘం.  వాఙ్మయ చరిత్రలో నిత్యస్మరణీయులు వేటూరివారు. నాడు సాహిత్యానికి, సంస్కృతికి కేంద్రం మద్రాసు.

కందుకూరి వీరేశలింగం పంతులు, వేదం వేంకటరాయశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు వంటి ఉద్దండ పండితులకు చెన్నపట్టణం నిలయం. ప్రభాకరశాస్త్రి 1906లో మద్రాసు చేరారు. ఆయన మద్రాసు వెళ్లకపోతే ఆంధ్రదేశం ఎంతో నష్టపోయేది. 22-08-1910న మద్రాసు ప్రభుత్వ ఓరియంటల్‌ ‌మాన్యు స్క్రిప్టు లైబ్రరీలో తొలుత కాపీయిస్టు (లేఖకుని) గా రూ.20-1-25ల వేతనంపై చేరారు. లేఖకుని నుండి క్యూరేటర్‌గా మారి తెలుగు పుస్తకాల కేటలాగు తయారు చేశారు. ఆ సందర్భంలోనే కొన్నేళ్లపాటు చెన్నపురి నుండి బరంపురం వరకు తెలుగు నాడు అంతటా ప్రాచీన గ్రంథ సేకరణార్ధం పర్యటించారు. ప్రాచీన గ్రంథ సేకరణార్ధం మద్రాసు ప్రభుత్వం మానవల్లి రామకృష్ణ కవిని, ప్రభాకరశాస్త్రిని ఎన్నిక చేసింది. వీరిరువురు కొన్ని సంవత్సరాలపాటు ప్రాచీన తాళపత్ర ప్రతులకై తిరిగారు. ఆ సందర్భంలోనే నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రాంతంలో దీపాల పిచ్చియ్యశాస్త్రి, దివి నరసింహాచార్యులువారు (కృష్ణాజిల్లా) శాస్త్రి గారికి బాగా సాయం చేశారు.

1916లోనే మద్రాసు ప్రభుత్వ ఆదేశానుసారం మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి సరస్వతీ మహల్‌ ‌లైబ్రరీలోని పుస్తకాల విలువల వివరాలు తేల్చడానికి కొన్ని మాసాలు పనిచేశారు. అంతకు ముందే 1914లో పరిశోధనా పిపాసతో తంజావూరు వచ్చారు.

ఇంతటి మహోన్నత గ్రంథాలయానికి బ్రిటిష్‌ ‌జాతి తలపెట్టిన హాని గురించి, ఇందులో కీలకంగా వ్యవహరించి భంగపడిన పెన్ట్‌లాండ్‌ ‌గురించి తెలుసుకోవాలి. బ్రిటిష్‌ ‌రాజకీయ నాయకుడు జాన్‌ ‌సింక్లైర్‌ 1‌వ బేరన్‌ ‌లార్డ్ ‌పెన్ట్‌లాండ్‌ను మద్రాసు గవర్నర్‌గా నియమించారు. నియామకం జరిగిన తరువాత 32 రోజులు ఓడలో ప్రయాణించి అక్టోబరు 29, 1912న మద్రాసు చేరుకున్నాడు. ఇతడు  1912-1919 మధ్యకాలంలో మద్రాసు గవర్నర్‌గా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినది అప్పుడే. ఈతడు పంబన్‌ ‌ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలుపుతూ వంతెన నిర్మించాడు. మద్రాసు పట్టణ ప్రణాళికను 1914లో చేపట్టాడు. 1వ ప్రపంచ యుద్దానికి నిధులు,  పౌరులను సరఫరా చేశాడు. దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం (ఎమ్‌&ఎస్‌.ఎమ్‌) ‌రైల్వే భవనానికి శంస్థాపన చేశాడు. రాయపురం హాస్పటల్‌, ‌స్కూలుకు 1913 డిసెంబరు 19న పునాది వేసాడు. దీనివలన ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆ సందర్భంలో తంజావూర్‌ ‌సరస్వతి మహల్‌ ‌లైబ్రరీని అమ్మడానికి ప్రయత్నించాడని ఒక వార్త ప్రజలకు తెలిసింది. దానితో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారని వెంటనే ఆలోచనను విరమించుకున్నాడని ప్రజలు అనుకునేవారు. (వాస్తవం ఇది కాదు).

వేటూరి ప్రభాకరశాస్త్రి అసంపూర్ణ ఆత్మకత ‘ప్రజ్ఞా ప్రభాకరము’ తన అనుభవాలను గ్రంథస్థం చేశారు. నాడీ గ్రంథము అనే అధ్యాయంలో ఇలా వ్రాశారు. ‘‘తంజావూరిలో పరిశీలించిన గ్రంథముల విషయమున జరుపవలసిన తర్వాతి కార్యములను జరుపుటకు మద్రాసులో మేము కొంత పని చేయవలసియుండుటచే మూడు నాలుగు నెలలు మద్రాసులోనే యుంటిమి. అప్పుడు మద్రాసు గవర్నర్‌గా పెంట్లండు దొర గారుండిరి. ఆయన్నెవరో ఇంగ్లాండు వారో, జర్మనీవారో ప్రేరేపించిరట! తంజావూరి లైబ్రరీని మాకు గొని పెట్టవలసినది’’, అందుకై ఆ లైబ్రరీ విలువ కట్టుటకు గ్రంధముల పరిశీలనము జరుపవలెనని మమ్మందుకు తంజావూరు పంపిరి. ఈ రహస్యము పైకి పొక్కినది. గవర్నరు గారు తమ తంత్రము కట్టిపెట్టిరి’’. (పేజీ 139).. ఒక విధముగా మేమక్కడికి వెళ్లి జరిపిన పరిశీలనము వ్యర్ధమైనది. కాని వారు వ్రాసిన తంజావూరు కేటలాగులు లైబ్రరీ వారు వుపయోగించుకొనిరి. పుస్తకములన్నింటిని సరిగి గుర్తించారు, గణించారు. ఈ విధంగా ఈ లైబ్రరీని కాపాడుకో గలిగారు.

శ్వేతజాతికి వ్యాపార వస్తువు కానిదేదీ లేదు.  షాజహాన్‌ ‌కట్టించిన తాజ్‌మహల్‌ను 1825లో బెంటిక్‌ అమ్మజూపాడు. కాని కొన్ని అవాంతరాలవల్ల అది ఆగిపోయింది. మరోసారి 1899లో కర్జన్‌ అమ్మజూపాడు. ఫిబ్రవరి 7, 1899 నాడు ఆగ్రా నగరంలో తాజ్‌మహల్‌ ‌వేలం వేయడానికి నిర్ణయం జరిగింది. కాని అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

  1. ప్రజ్ఞా ప్రభాకరం: వేటూరి ప్రభాకరశాస్త్రి
  2. ఇ.టి.వి. భారత్‌, ‌తేది. డిసెంబరు 9, 2025
  3. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి (1888-1950) జీవితం వాఙ్మయసేవ : డా।। ప్రొచిరాజు శేషగిరిరావు
  4. తెలుగు రాతప్రతుల వివరణాత్మక కేటలాగు (తంజావూరు మహారాజ సెర్ఫోజీ సరస్వతీ మహల్‌ ‌గ్రంధాలయం: సుందర శర్మ.
  5. The Right Honourable John Sincair, Lord PentLand G.C.S.I a memoir, by Lady Pent Land (Page 131 to 159)
  6.   ప్రసిద్ధ గ్రంథాలయాలు: వెలగా వెంకటప్పయ్య

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE