భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) అనేది శ్రమ జీవుల, కార్మికుల సంఘటన అని, దేశ ఆర్థిక రథ చక్రాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తులే శ్రమజీవులు, కర్షకులు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలె అన్నారు. ఇన్ని రోజుల తర్వాత తిరిగి తెలంగాణ ప్రాంతంలో బీఎంస్ రాష్ట్ర కార్యాలయాన్ని పునఃనిర్మాణం చేశారని, దీని వెనుక అనేక మంది కార్యకర్తల కృషి ఉందన్నారు. డిసెంబర్ 25న భాగ్యనగరంలో బీఎంఎస్ తెలంగాణ ప్రాంత కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం విశ్వకర్మ సేవాసమితి, బీఎంఎస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తాత్రేయ హొసబలె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక రంగంలో బీఎంఎస్ ప్రథమ స్థానానికి చేరుకుందని, అయితే..ఇందుకు కార్యాలయం కారణం కాదని, కార్యాలయం లేని పరిస్థితుల్లో కూడా ఆ స్థాయికి చేరుకున్నామని అన్నారు. బీఎంఎస్ కార్యకర్తలు దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమే పనిచేస్తున్నారని, వారి మనసంతా వీటిపైనే లగ్నమై ఉంటుందన్నారు. అందులో కూడా మొదట బీఎంఎస్ సంఘటనా కార్యం గురించి, శ్రామికుల గురించి ఆలోచించిన తర్వాతే, వారి వ్యక్తిగతం గురించి ఆలోచిస్తారని ప్రశంసించారు. ఇదేమీ బీఎంఎస్ నినాదం కాదని, ఇదో జీవన శైలి అని, ఇది బీఎంస్ దృష్టికోణమని వివరించారు.
త్యాగం, బలిదానమే బీఎంఎస్ చిహ్నమని, దీనిని స్థాపన నుంచే చెబుతూ వస్తున్నామని హొసబళే గుర్తు చేశారు. అయితే.. ఇదేమీ శబ్దాల ఉచ్చారణ కాదని, దీని వెనుక మహాకార్యం నడుస్తోందని, దీని కోసం చాలామంది సర్వస్వాన్నీ అర్పణ చేసిన వారున్నారని, అలాగే అహోరాత్రాలు సంఘటన కోసం, బీఎంఎస్ కోసం తపస్సు చేశారని, అంతకంటే ఓ అడుగు ముందుకు వేసి, అవసరం అనుకుంటే బలిదానం కూడా చేశారన్నారు. బలిదానం కోసం ఎన్నడూ వెనుకడుగు వేయలేదన్నారు. ఈ గుణాల న్నింటికీ సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు.
వీటన్నింటివల్లే బీఎంఎస్ 70 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా బృహత్ సంఘటనా శక్తిగా నిలబడిందని, అత్యంత పెద్ద శక్తిగా రూపాంతరం చెందిందని తెలిపారు. అయితే ఇదంతా కూడా కేవలం కార్యాలయ భవనం వల్లే కాలేదని, త్యాగం, తపస్సు, పరిశ్రమ వల్ల, దేశం కోసం పనిచేయాలన్న దృష్టి కోణంతోనే ఇంత పెద్ద పని జరిగిందని స్పష్టం చేశారు. ఇలాంటి సైద్ధాంతిక భూమిక వల్ల, పరిశ్రమ వల్లే బీఎంఎస్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలబడిందని, ఈ కారణాల వల్లే అందరూ బీఎంఎస్ చెప్పినట్లు వింటున్నారని తెలిపారు.
బీఎంఎస్ శ్రామికుల ఐక్యత, వారి ఆర్థిక పరిస్థితుల్లో అభ్యున్నతి, దేశహితం, పర్యావరణ సంరక్షణ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, భారతీయ మూలాల ఆధారంగా నిర్మితమైంది. ఆ క్రమంలో కార్యకర్తలకు శిక్షణను ఇచ్చింది. ఉద్యమాలు చేసింది. సైద్ధాంతిక భూమికపై కలిసొచ్చే వారితో ఓ జాబితా కూడా రూపొందించింది. ఈ కారణాల వల్ల కూడా ప్రపంచంలో బీఎంఎస్ గురించి కార్మికులు, శ్రామికులు, సాధారణ ప్రజలు వినడానికి ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారని వివరించారు. అలాగే బీఎంఎస్ ఉద్యమ రూపాన్ని అధ్యయనం చేయడానికి ముందుకు కూడా వస్తున్నారని తెలిపారు.
బీఎంఎస్ వ్యవస్థాపకులు దత్తోపంత్ ఠెంగ్డే చైనాలో పర్యటించారు. అక్కడ రేడియోలో ప్రసంగించారు. ఆ ప్రసంగానికి అక్కడి కరుడు గట్టిన కమ్యూనిస్టులు కూడా మంత్ర ముగ్ధులయ్యారు. బీఎంఎస్ ఇంత పటిష్ఠంగా, వేగంగా ఎలా సంఘట నాత్మక రూపం తీసుకుందో చెప్పాలని ఠెంగ్టేజీని వారు కోరారని హొసబళే గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచ వేదికలపై బీఎంఎస్ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు.
శ్రామికుల వికాసం, దేశ వికాసం, ఈ ప్రపంచంతో సమతుల్యం, సమన్వయం, అలాగే ప్రపంచంలోని వివిధ రంగాలను సమన్వయం చేయడం, సామరస్వపూర్వకంగా ఓ శ్రామిక కుటుం బాన్ని నిర్మించడం అనే భావన అత్యంత విశిష్ట మైందని, ఇతరులకు ఇది అసాధ్యమైందని, అలాంటి సైద్ధాంతిక భూమికను బీఎంఎస్ ప్రపంచానికి అందించిందన్నారు.
వీటన్నింటి నేపథ్యంతో అనేక మంది బీఎంఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని, కలిసి వస్తున్నారని అన్నారు. బీఎంఎస్ ఎదిగిన విధానం భారతీయులను కూడా ఆశ్చర్యపరిచిందని తెలిపారు. ఠేంగ్డేజీ నుంచి స్ఫూర్తి పొందిన వారు, కార్యకర్తలు బీఎంఎస్ ధ్యేయాన్ని ప్రజల ముందు ఉంచారన్నారు.
బీఎంఎస్ కార్యాచరణ కేవలం ఇటుకలు, మట్టి, రాళ్లు, సిమెంటు భవనాల ద్వారా జరగలేదని, కార్యకర్తల మనస్సు, కుశాగ్ర బుద్ధి, మనుష్యుల ప్రయత్న్ల, సైద్ధాంతికత, సమాజంలో బీఎంఎస్ సంఘట నను ప్రేమించే వారి వల్ల జరిగిందన్నారు. ప్రేమ, త్యాగం, బలిదానం, సైద్ధాంతికతే బీఎంఎస్ పునాదులు అని అభివర్ణించారు. వీటి ఆధారంగా మజ్దూర్ సంఘ్ సంఘటన నిలబడిందన్నారు.
కానీ భౌతికంగా చూసుకుంటే ఓ కార్యాలయం అత్యంత ఆవశ్యకమని అన్నారు. కార్యాలయంలో వసతులు కూడా అవసరమేనని, పని విస్తరిస్తోందని, అందుకే డాక్యుమెంటేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థ, సభ్యత్వం కూడా కావాలని, అయితే మజ్దూర్ సంఘ్‌లో ఆర్థిక దృష్టికోణం, స్వదేశీ, ఆత్మనిర్భరత లాంటి విషయాలపై కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే కార్యకర్తలకు ఎప్పటి కప్పుడు శిక్షణ ఇస్తూ ఉండాలని సూచించారు.
భారత ప్రభుత్వం తాజాగా కార్మికులకు సంబంధించి లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని తెలిపారు. వీటిని కేవలం జాతీయ స్థాయి కార్యకర్తలే కాకుండా క్షేత్ర స్థాయి కార్యకర్తలు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేవలం శారీరక శ్రమ సరిపోదని, బుద్ధి బలాన్ని ప్రద ర్శించాలని పిలుపునిచ్చారు. ప్రతి స్థాయిలో కూడా అధ్యయనం చేసే కార్యకర్తలు, ఆందోళనలు, సమావేశాలు నిర్వహించే కార్యకర్తలు కూడా కావాలని దత్తాత్రేయ హొసబళే అన్నారు.
బీఎంఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని, కొత్త కొత్త కార్యాలయాలకు భవన నిర్మాణంతో సరిపుచ్చుకో కూడదని, కార్యాచరణ కూడా విస్తరించా లని తెలిపారు. తద్వారా కార్యకర్తల నిబద్ధత, సమర్పణా భావం, విస్తరించాలని హోసబళే సూచించారు. నాలుగు అంతస్తుల కార్యాలయంలో సిద్ధాంతాన్ని పది అంతస్తుల స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యాలయ ప్రారంభోత్సవంతో ఆనందం, స్వాభిమానం : భాగయ్య
బీఎంఎస్ ప్రాంత కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం వల్ల ఆనందంతో పాటు స్వాభి మానం కలుగుతోందని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భాగయ్య అన్నారు. ఓ వ్యక్తి జీవితంలో ఇల్లు కట్టుకోగానే ఆనందంతో పాటు ఓ స్థానం ఏర్పడుతుందని, అలాగే సంస్థ జీవితంలో కూడా కార్యాలయం కట్టుకున్న తర్వాత ఓ స్థానం ఏర్పడుతుందని, బీఎంఎస్‌కి కూడా ఇదే తరహా స్థానం ఏర్పడిందన్నారు. బీఎంఎస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి, పైసా పైసా కూడబెట్టి కార్యాల యాన్ని కట్టుకున్న సందర్భంగా బీఎంఎస్ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
బీఎంఎస్ ప్రారంభం నుంచీ ప్రభుత్వంపై ఆధారపడకుండా సంస్థ మనుగడ కోసం కేవలం శ్రామికులు, కార్మికులు తమ రక్తాన్ని చెమటోడ్చి సంపాదించిన ధనంతో ముందుకు సాగాలనే సంప్రదాయాన్ని ఇప్పటికీ ఆచరిస్తోందని అన్నారు. మనకు సుఖం ఉండాలి కానీ.. సుఖంపై కోరిక ఉండకూదని సూచించారు. సుఖపడాలనే కోరికకు లొంగిపోయేవారు రాజకీయాలకు, అహంకారానికి లొంగిపోతారన్నారు. బీఎంఎస్ కుటుంబం, కార్యకర్తలు అత్యంత సుఖంగా జీవించా లని, అయితే ఒక్క పైసా కూడా వృథా చేయవద్దని కోరారు. అలాగని పిసినారులు కారాదని, అనవసర ఖర్చులు మాత్రం చేయవద్దన్నారు. సంఘటితంగా ఉన్న వారు అసంఘటిత కార్మికుల కోసం సమయం వెచ్చించాలని భాగయ్య పిలుపునిచ్చారు.
బీఎంఎస్ ఎదుగుదలలో తెలుగువారి పాత్ర: సురేంద్రన్
బీఎంఎస్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి సురేంద్రన్ మాట్లాడుతూ బీఎంఎస్ 70 సంవత్సరా లను పూర్తి చేసుకొని, 71 పడిలోకి అడుగు పెట్టిందని తెలిపారు. 1986 లో ప్రారంభమైన ఈ కార్యాలయం నేడు భవ్యంగా మారిందని, ఇందులో వేలాది కార్యకర్తల శ్రమ ఉందన్నారు. ఇది ఇప్పుడు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. బీఎంఎస్ అనేది ప్రపంచంలోనే బృహత్తరమైన సంస్థ అని అన్నారు. సంస్థ రెండుసార్లూ ప్రథమ స్థానంలోకి వచ్చిందని, ఇందులో తెలుగు రాష్ట్రాల పాత్ర కూడా ఉందని గుర్తు చేశారు.1989, 2002లో అత్యధిక సభ్యత్వాలు చేసిన రాష్ట్రం సంయుక్త తెలుగు రాష్ట్రమని గుర్తు చేశారు. బీఎంఎస్ అనేది అత్యంత పెద్ద ట్రేడ్ యూనియన్ అని, ఇందులో 5,836 యూనియన్లు బీఎంఎస్ తో కలిసి నడుస్తున్నాయన్నారు.
బీఎంఎస్ తెలంగాణ ప్రాంత కార్యాలయం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని బీఎంఎస్ జాతీయ అధ్యక్షులు హిరణ్మయి పాండ్య అన్నారు. ఇందు కోసం చాలా మంది కార్యకర్తలు చెమటోడ్చా రన్నారు. ఈ నూతన కార్యాలయం కార్యకర్తలందరికీ ప్రేరణాదాయకమని అభివర్ణించారు. నూతన కార్యాలయం ప్రారంభం కావడంతో కార్యకర్తల బాధ్యత కూడా పెరిగిందన్నారు.
(వీఎస్‌కే-తెలంగాణ సౌజన్యంతో)