అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరో విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి  తన నాలుగేళ్ల అధ్యక్ష పదవీ కాలాన్ని అంకితం చేయబోతున్నట్టు ఎన్నికల ప్రచార సమయం లోనే కాక, ఎన్నికల్లో విజయం సాధించి పదవి చేపట్టిన అనంతరం కూడా పదే పదే ప్రకటించిన ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సమర్థ తను మెరుగుపరిచే ఉద్దేశంతో డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ ‌గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డి.ఓ.డి.ఇ) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, ఆర్థికవేత్త, టెక్నాలజీ కుబేరుడు ఎలాన్‌ ‌మస్క్‌ను ఆ సంస్థకు అధిపతిగా నియమించారు. ఈ సంస్థకు అధిపతిగా మస్క్‌ను, లేదా మరో అపర కుబేరుడు, టెక్నాలజీ అధిపతి వివేక్‌ ‌రామస్వామిని నియమించా లని ట్రంప్‌ ఆలోచించి చివరికి మస్క్‌కే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు, సుమారు రెండు లక్షల అనవసర ఉద్యోగులను తొలగించడం, ఆర్థిక వనరులను సద్వినియోగం చేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. గత ఏడాది నవంబర్‌ ‌నెలలోనే ఈ సంస్థ ఏర్పాటుపై ఆర్భాటంగా ప్రకటన చేసినప్ప టికీ, అది ఈ ఏడాది జనవరి తర్వాతే ఏర్పడింది. ఈ సంస్థ 2026 నాటికి తన లక్ష్యాలను పూర్తి చేయ వలసి ఉంటుంది.

అయితే, ట్రంప్‌ ‌మనసులో ఏ పురుగు దూరిందో కానీ, మరో ఎనిమిది నెలల్లో ఈ సంస్థ తన లక్ష్యాలను పూర్తి చేయబోతోందనగా హఠాత్తుగా ఈ సంస్థను రద్దు చేశారు. ప్రభుత్వంలోని అనేక విభాగాల ఖర్చు లను గణనీయంగా తగ్గించామని, దేశ ఆర్థిక వ్యవస్థను అనేక విధాలుగా పరిపుష్టం చేశామని ట్రంప్‌ ‌ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఈ ప్రకటనలకు, ఈ నిర్ధారణలకు ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు. ప్రభుత్వ ఖర్చులు తగ్గాయనడానికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందనడానికి అనుకూలంగా ప్రభుత్వం ఇంత వరకూ గణాంక వివరాలను చూపించలేదు. అత్త మీద కోపం దుత్త మీద చూపించి నట్టుగా ఎలాన్‌ ‌మస్క్ ‌మీద కోపాన్ని ఆయన ఈ డోగ్‌ ‌సంస్థ మీద చూపించారా అన్న సందేహాలను అక్కడి అధికారులే వ్యక్తం చేస్తున్నారు. డోగ్‌ ‌సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలనన్నిటినీ ఆఫీస్‌ ఆఫ్‌ ‌పర్సెనల్‌ ‌మేనేజ్‌మెంట్‌ (ఓపీఎమ్‌)‌కు అప్పగించారు. ఈ సంస్థ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేశారు కూడా.

 ఆకస్మిక మార్పులు

ట్రంప్‌ ‌రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడుగా మెలగిన ఎలాన్‌ ‌మస్క్ ఈ ‌డోగ్‌ ‌సంస్థ ఏర్పాటుకు ట్రంప్‌ను ఒప్పించారు. ఆయన సలహా ప్రకారమే ట్రంప్‌ ‌దీన్ని ఏర్పాటు చేసి, దాని బాధ్యతలను మస్క్‌కు అప్పగిం చారు. మస్క్ ‌కూడా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం మీద కసరత్తు ప్రారంభించారు. ఇందుకు గానే అనేక కార్యక్రమాలు రూపొందించి లక్ష్య సాధనలో చాలా దూరం వచ్చారు. డోగ్‌ ‌కోసం పనిచేయడానికి ఆయన తన వాణిజ్య వ్యవహారాలు, కార్యకలాపాలను పక్కన పెట్టేశారు. మరో ఎనిమిది నెలల్లో లక్ష్యాలను పూర్తి చేసి, అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాల మీదకు ఎక్కించడానికి ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ట్రంప్‌ ‌హఠాత్తుగా ఈ సంస్థను మూసేయడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని ట్రంప్‌ ఈ ‌విధంగా అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

‘‘డోగ్‌ ‌సంస్థను మూసేశాం. ఆ సంస్థ ఇక పని చేయదు’’ అని ఆఫీస్‌ ఆఫ్‌ ‌పర్సెనల్‌ ‌మేనేజ్మెంట్‌ ‌సంస్థ డైరెక్టర్‌ ‌స్కాట్‌ ‌కూపర్‌ ‌రాయిటర్‌ ‌వార్తా సంస్థకు తెలియజేశారు. ఇది ఇక కేంద్రీకృత వ్యవస్థగా పనిచేసే అవకాశం లేదని కూడా ఆయన ప్రకటించారు. ప్రభుత్వంలో సమూల సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుందని భావించిన సంస్థ ఎటువంటి ఫలితాలూ ఇవ్వకుండానే మూత పడుతుందని ప్రభుత్వ వర్గాలు కూడా ఊహించలేదు. ప్రభుత్వం లోని అనేక విభాగాలవల్ల దేశానికి పెద్దగా ప్రయో జనం లేదని, అవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా తయారయ్యాయని, కొన్ని శాఖలను బడ్జెట్‌ ‌కేటా యింపులను కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని, కొన్ని సంస్థల బాధ్యతలను, లక్ష్యాలను మార్చాల్సిన అవసరం కూడా ఉందని ట్రంప్‌ ‌భావించారు. అందుకు తగ్గట్టు మస్క్ ‌చర్యలు రూపొందించడం ప్రారంభించారు. ఈ మధ్యనే మస్క్ ఒక సదస్సులో ప్రసంగిస్తూ, ‘‘ప్రభుత్వ శాఖలో వృథా వ్యయం అంచనాలకు మించి పెరుగుతోంది. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖకు అధిక వ్యయంతోనూ, వృథా వ్యయం తోనూ సంబంధం ఉంది. దీన్ని సమూలంగా సంస్క రించి, దేశాన్ని ఆర్థికంగా మళ్లీ అగ్ర భాగాన నిలబెట్ట డానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం’’ అని ప్రకటించారు.

అబద్ధపు ప్రచారాలు

అయితే, డోగ్‌ను మూసేసిన తర్వాత ఆ సంస్థ తరఫున ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో కోట్లాది డాలర్ల మేరకు వృథా వ్యయాన్ని తగ్గించామని ప్రకటించారు. సుమారు 214 బిలియన్‌ ‌డాలర్లను ఆదా చేయగలిగామని కూడా ఆయన తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదని ఆర్థిక నిపుణులు తెలిపారు. వచ్చే ఏడాది జూలైలో ఈ సంస్థను మూసేసేనాటికి సాధించాల్సిన లక్ష్యాలను ఇప్పటికే సాధించినట్టుగా అధికార ప్రతినిధి చేసిన ప్రకటనను ప్రభుత్వంలోని ఆర్థిక నిపుణులు సైతం గట్టిగా నిల దీస్తున్నారు. గత మే నెలలో ట్రంప్‌, ‌మస్క్‌ల మధ్య విభేదాలు తలెత్తినప్పటి నుంచి ట్రంప్‌ ‌ప్రభుత్వానికి డోగ్‌ ‌సంస్థ మీద ఆసక్తి పోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్‌ ‌ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు, ప్రోత్సాహం కరువవడంతో మస్క్ ఈ ‌డోగ్‌ ‌బాధ్యతలకు స్వస్తి చెప్పి, తన వాణిజ్య కార్యకలాపాలను తిరిగి భుజానికెత్తుకున్నారు. మే వరకూ సుమారు రెండు లక్షల మంది అదనపు ఉద్యోగులకు స్వస్తి చెప్పామని, 75 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశమిచ్చి, పరిహారం చెల్లించి పంపించేశామని డోగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు వెల్లడిం చారు.

ప్రభుత్వంలో కొత్త నియామకాలను ఆపేస్తూ డోగ్‌ ‌నిర్ణయం తీసుకుంది. దీనికి అప్పట్లో ట్రంప్‌ ‌ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. డోగ్‌ ‌సంస్థ మూతబడిన తర్వాత నియామకాల రద్దును ప్రభుత్వం సడలిం చింది. ట్రంప్‌ ‌ప్రభుత్వమే వృథా వ్యయాన్ని, అదనపు నియామకాల్ని, అవినీతిని తగ్గించడానికి చర్యలు తీసుకుంటోందని, ఇదంతా ట్రంప్‌ ‌పర్యవేక్షణలో సాగుతోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి లిజ్‌ ‌హూస్టన్‌ ‌వెల్లడించారు. గత మే నెలలో మస్క్ ఈ ‌సంస్థ నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ సంస్థ వారం రోజుల క్రితం వరకు ట్రంప్‌ ‌ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగింది. అయితే, ఇది నిర్దేశిత లక్ష్యాలను గానీ, తనకు అప్పగించిన బాధ్యతలను గానీ పూర్తి చేయ లేదు. ట్రంప్‌ ‌ప్రభుత్వం క్రమక్రమంగా ఈ సంస్థను బలహీనపరచి వారం రోజుల క్రితం పూర్తిగా మూసే సింది. కాగా, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, అదనపు ఉద్యోగులను తొలగించడం, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడం వంటి చర్యలేవీ ప్రస్తుతం ప్రభుత్వంలో అమలు జరగడం లేదని ప్రభుత్వ ఆర్థిక నిపుణులు సమావేశాల్లోనూ, చర్చలు, గోష్ఠుల్లోనూ అన్యాప దేశంగా బయటపెడుతూనే ఉన్నారు.

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించకపోగా, ట్రంప్‌ ‌చివరికి డోగ్‌ ‌మీద కూడా భారీగా నిధులు వృథా చేశారని, దాన్ని అర్థాంతరంగా మూసేయడం వల్ల లక్ష్యాలు, ఆశయాలు నెరవేరకపోగా సమయం వృథా, నిధుల వృథా జరిగిందని ఆయన రిపబ్లికన్‌ ‌పార్టీ సహచరులు విమర్శలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మేకింగ్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ (‌మాగా) అనే ఆయన నినాదం ఇంత వరకూ రూపుదిద్దుకోవడం కూడా జరగలేదని వారు విమర్శించారు. ప్రభుత్వ వ్యయాన్ని కనీసం రెండు ట్రిలియన్‌ ‌డాలర్ల మేరకు తగ్గించాలన్న సదాశయం నెరవేరే అవకాశం కనిపించడం లేదని వారు వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టడానికి లభించిన చక్కటి అవకాశానికి ట్రంప్‌ ‌తన ఈగో సమస్యలతో అర్థాంత రంగా సమాధి కట్టేశారని కూడా వారు విమర్శించారు.

జి.రాజశుక, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE