విశ్వప్రేమకు ప్రతిరూపం భగవాన్‌ సత్యసాయి బాబా అని, ఆయన  చూపిన ప్రేమ,పాటించిన  సేవాభావనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన  సత్యసాయి జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి  పవన్‌ కల్యాణ్‌లతో కలిసి ప్రశాంతి నిలయంలో బాబా మహా సమాధిని దర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  సత్యసాయి స్మారక రూ.100 నాణేలు, పోస్టల్‌ స్టాంపులను ఆవిష్కరించారు.


సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని, భక్తి, జ్ఞానం, కర్మ.. ఈ మూడు సేవలే భారతీయ నాగరికతకు మూలమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తి భూమిని, గొప్పతనాన్ని గౌరవిస్తూ ‘ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు’ అంటూ తెలుగు జాతి గొప్ప తనాన్ని, త్యాగరాజ కీర్తనలోని సారాంశాన్ని ప్రధాని గుర్తుచేశారు. పుట్టపర్తి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టడం, ప్రశాంతి నిలయంలో భగవాన్‌ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోవడం తనకు లభించిన అదృష్టంగా పేర్కొన్నారు. బాబా కేవలం ఒక వ్యక్తి కాదని, ‘విశ్వ ప్రేమకు పతిరూపం’ మని నివాళులు అర్పించారు. ‘భారతీయ సనాతన ధర్మంలో ‘సేవే పరమ ధర్మం’ అని వేల ఏళ్లుగా మన యిషులు, మునులు చెప్పిన మాటలను సత్య సాయి బాబా అక్షరాలా ఆచరించి చూపారు. భక్తి, జ్ఞానం, కర్మ అనే మూడు మార్గాల ద్వారా మోక్షం పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతుంటే, బాబా ఈ మూడిరటినీ ‘సేవ’ అనే ఒకే ఒక్క మార్గంలోకి మలచి మానవాళికి సులభమైన దారిని చూపారు. ఆయన మన మధ్య  భౌతికంగా లేకపోయినప్పటికీ, ఆయన రగిలించిన సేవా జ్యోతి, ఆయన బోధించిన ప్రేమతత్వం, ఆయన చేసిన దిశానిర్దేశం విశ్వ వ్యాప్తమై ఉన్నాయని, అవి యుగయుగాలకు తరగని ఆస్తి’ అని ప్రధాని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్‌ కళ్యాణ్‌ వంటి ప్రముఖులతో కలిసి వేదికను పంచుకోవడం, సత్యసాయి స్మారకార్థం రూ.100 నాణెం, పోస్టల్‌ స్టాంపులను ఆవిష్కరిం చడం..  బాబా సేవలను భారత ప్రభుత్వం అధికారి కంగా గుర్తించి గౌరవించడమేనని స్పష్టం చేశారు. ఈ పవిత్ర భూమికి ఒక మహత్తు ఉందని, ఇక్కడ గడిపే ప్రతి క్షణం మనసులో సేవా భావనను, దైవ చింతనను రెట్టింపు చేస్తుందని, బాబా చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధాని మోదీ భావోద్వేగంతో ప్రస్తావించారు.

గ్రామీణాభివృద్ధి, జలయజ్ఞం – విద్యా విప్లవం

భగవాన్‌ సత్యసాయి బాబా జీవితమంతా ‘లవ్‌ ఆల్‌ – సర్వ్‌ ఆల్‌’ (అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు) అనే మూలసూత్రంపైనే నడిచిందని, కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించిన మహనీయుడని ప్రధాని మోదీ ప్రశంసిం చారు. ముఖ్యంగా గ్రామీణ భారతదేశం ఎదుర్కొం టున్న కష్టాలను బాబా తన గుండెలో పెట్టుకుని, ప్రభుత్వాలు కూడా చేయలేనంత గొప్ప స్థాయిలో మంచినీటి ప్రాజెక్టులను నిర్మించడం ఒక అద్భుతమని కొనియాడారు. నీరు, విద్య, వైద్యం అనేవి వ్యాపార వస్తువులు కాకూడదని, అవి మానవుని మౌలిక హక్కులని బాబా బలంగా విశ్వసించారని, అందుకే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని వేలాది కరవు పీడిత గ్రామాలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించి ‘సత్యసాయి గంగ’ను పారించారని గుర్తుచేశారు. ఈ నీటి ప్రాజెక్టులు నేటికీ కోట్లాది ప్రజల దాహార్తిని తీరుస్తూ, వారికి జీవనా ధారంగా నిలుస్తున్నాయంటే బాబా దూరదృష్టి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక విద్యా రంగంలో బాబా సృష్టించిన విప్లవం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని పేర్కొన్నారు. పుట్టపర్తి మొదలు కొని వైట్‌ ఫీల్డ్‌, ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా ఎల్‌.కే.జీ నుంచి పీ.జీ వరకు, పరిశోధనల వరకు పూర్తిగా ఉచితంగా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద పిల్లలు, ఆదివాసీ బిడ్డలు బాబా విద్యాసంస్థల్లో చదువుకుని, ఉన్నత స్థాయికి ఎదిగి, తమ కుటుంబాల తలరాతలను మార్చుకున్నారని, విద్యాదానం కంటే గొప్పదానం మరొకటి లేదని బాబా నమ్మిన సిద్ధాంతం వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషించారు. ఈ విద్యా సంస్థలు కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, సంస్కారాన్ని, మానవీయ విలువలను నేర్పిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నాయని మోదీ ప్రశంసించారు.

ఆరోగ్య సంరక్షణలో నిస్వార్థ సేవ  – నైతిక పునరుజ్జీవనం

ఆరోగ్య రంగంలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవలను వర్ణించడానికి మాటలు చాలవని, అది మానవ సేవా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయ మని ప్రధాని మోదీ అభివర్ణించారు. నేటి కార్పొరేట్‌ ప్రపంచంలో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన తరుణంలో, పుట్టపర్తి, బెంగళూరు, నాందేడ్‌ వంటి చోట్ల బాబా స్థాపించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు పేదలకు ఆశాదీపాలుగా నిలుస్తున్నాయని అన్నారు. గుండె ఆపరేషన్లు, కిడ్నీ మార్పిడి, కంటి శస్త్ర చికిత్సల వంటి అత్యంత ఖరీదైన వైద్యాన్ని కూడా ఏ విధమైన రుసుం లేకుండా, పూర్తిగా ఉచితంగా అందించడం బాబా దివ్యత్వానికి నిదర్శనమని చెప్పారు. ‘జీవితాన్ని రక్షించడం కన్నా గొప్ప సేవ లేదు’ అనే బాబా మాటలే ఈ ఆసుపత్రుల నిర్మాణా నికి పునాది రాళ్లని, ఇక్కడ వైద్యం పొందిన లక్షలాది మంది పేదల ఆశీస్సులే ఈ సంస్థలను ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. కేవలం భౌతికమైన సేవలే కాకుండా, మనిషి ఆంతరంగిక పరివర్తనపై బాబా చేసిన బోధనలు సమాజానికి అత్యవసరమని మోదీ గుర్తుచేశారు. ‘‘మనిషి మారితేనే ప్రపంచం మారు తుంది’’ అనే బాబా సిద్ధాంతం, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, ధర్మం, నిజాయతీ అనే నాలుగు స్తంభాలపై సమాజాన్ని నిర్మించాలనే ఆయన ఆశయం నేటి తరానికి ఆచరణీయమని చెప్పారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, ప్రేమ, సహనం, త్యాగం వంటి గుణాలు ప్రతి ఇంటిలో వెల్లివిరియాలని బాబా కోరుకున్నారని, ఆయన పండుగలు, వేడుకల్లో ఇచ్చిన ప్రతి ప్రసంగం మానవతా విలువల పరిమళాలను వెదజల్లిందని, అందుకే దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఈ సిద్ధాంతాలకు ఆకర్షితులై సేవా మార్గంలో నడుస్తున్నారని ప్రధాని విశ్లేషించారు.

సామాజిక బాధ్యత, మహిళా సాధికారత – వికసిత్‌ భారత్‌ లక్ష్యం:

బాబా ప్రేరణతో ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రధాని ప్రస్తావిస్తూ, సామాజిక భద్రత, మహిళా సాధికారతలో సత్యసాయి ట్రస్ట్‌ పాత్రను ప్రత్యేకంగా అభినందించారు. ‘సుకన్య సమృద్ధి యోజన’ కింద వేలాది మంది పేద బాలికలకు ట్రస్ట్‌ ఆర్థిక సాయం అందించడం, ఆడబిడ్డల భవిష్య త్తుకు భరోసా ఇవ్వడమేనని అన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల సుకన్య సమృద్ధి ఖాతాల్లో రూ. 3.25 లక్షల కోట్ల నిధులు జమ కావడం వెనుక ప్రజల భాగస్వా మ్యంతో పాటు, ఇటువంటి సేవా సంస్థల కృషి కూడా ఉందని గుర్తుచేశారు. గోమాతను పూజించడమే కాకుండా, పేదలకు జీవనోపాధి కల్పించేందుకు శ్రీసత్యసాయి ట్రస్ట్‌ వంద గిర్‌ జాతి ఆవులను పంపిణీ చేయడం, రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ లక్ష్యాలకు ఊపిరి పోస్తోందని అన్నారు. వారణాసిలో, రువాండాలో గిర్‌ ఆవుల పెంపకం ద్వారా వచ్చిన ఆర్థిక మార్పును ఉదహరిస్తూ, గోదానం అనేది ఆర్థిక స్వావలంబనకు ఒక మార్గమని వివరించారు. ‘‘వికసిత్‌ భారత్‌’’ లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో, ప్రజలందరూ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ (స్థానిక ఉత్పత్తుల వినియోగం) మంత్రాన్ని పాటించాలని, తద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌ సాకారమవుతుందని పిలుపు నిచ్చారు. చివరగా, బాబా చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సేవా మార్గంలో ప్రతి పౌరుడు నడిస్తే, భారతదేశం విశ్వగురువుగా మారడం తథ్యమని, సత్యసాయి ప్రేరణతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, సేవలో తరించాలని ప్రధాని మోదీ ఈ శత జయంతి వేదికగా జాతికి ఉద్బోధించారు.

సేవే బాబా మార్గం:చంద్రబాబు నాయుడు

ఈ భూమిపై మనం చూసిన దైవ స్వరూపం భగవాన్‌ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ‘లవ్‌ ఆల్‌-సర్వ్‌ ఆల్‌’ అనే బాబా సిద్ధాంతం విశ్వవ్యాప్తమైందని, మానవ సేవే మాధవ సేవగా ఆయన జీవించారని గుర్తుచేశారు. సత్యసాయి ట్రస్ట్‌ ద్వారా 102 విద్యా సంస్థలు, ఆసుపత్రుల ద్వారా ఉచిత సేవలు అందు తున్నాయన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడ్డ బాబా సంకల్పం గొప్పదని, తద్వారా 1600 గ్రామాలకు తాగునీరు అందుతోం దని చెప్పారు. బాబా స్ఫూర్తిని, సేవా మార్గాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు.

బాబా కీర్తి విశ్వవ్యాప్తం:పవన్‌ కళ్యాణ్‌

సత్యసాయి బాబా గొప్పతనం మనకంటే విదేశీయులకే బాగా తెలుసని, ఆయన కీర్తి విశ్వవ్యాప్త మని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సింగపూర్‌లో, హాలీవుడ్‌లో బాబా పట్ల ఉన్న భక్తిని చూసి ఆశ్చర్యపోయానని, తన సోదరుడు చిరంజీవి కూడా బాబాను దర్శించుకున్నారని గుర్తుచేశారు. రాయలసీమ కరువును చూసి ప్రభుత్వాలు ఆలోచించక ముందే సొంత నిధులతో బాబా తాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, ఇది నేటి ‘జల్‌ జీవన్‌ మిషన్‌’కు అంకురార్పణ అని కొనియాడారు. సచిన్‌ టెండూల్కర్‌ వంటి ఎందరో ప్రముఖులను, ఐఏఎస్‌లను బాబా సేవా మార్గంలో నడిపించారని, ఆ సేవా స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని పవన్‌ స్పష్టం చేశారు.

సేవలోనే దైవత్వం – నారా లోకేశ్‌

ప్రశాంతి నిలయం శాంతికి చిరునామా అని, ఇక్కడ బాబా తనను ‘బంగారూ’ అని పిలిచిన అనుభూతి కలుగుతుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంతకాలం బాబా మన మధ్యే ఉంటారని, ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే ఆయన సూక్తి ఆచరణీయమని చెప్పారు. సత్యసాయి ఆసుపత్రులు లక్షలాది మందికి పునర్జన్మనిస్తున్నాయని, విద్యాసంస్థలు యువతలో నైతిక విలువలు పెంచుతున్నాయని ప్రశంసించారు. కులమతాలకు అతీతంగా సేవా మార్గంలో నడవడమే బాబాకు నిజమైన నివాళి అని, స్మారక నాణెం విడుదల చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

నా విజయం బాబా ఆశీస్సులు: సచిన్‌

తన చిన్నతనంలో అందరూ తనను ‘బాల సత్యసాయి’ అని పిలిచేవారని, బాబాతో తనకు దైవిక అనుబంధం ఉందని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గుర్తుచేసుకున్నారు. 1990లో బాబాను కలిసినప్పుడు అడగకముందే తన సందేహాలు తీర్చారని, 2011 ప్రపంచ కప్‌ సమయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న తనకు బాబా పంపిన పుస్తకం ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. ఆ విజయానికి బాబా ఆశీస్సులే కారణమని, ఆయన బోధనలు తన మానసిక ఆరోగ్యాన్ని కాపా డాయని అన్నారు. బాబా మన వెంటే ఉన్నారనే భావన భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుందని సచిన్‌ ఉద్వేగంగా చెప్పారు.

5డి లతో జీవన మార్గం:ఐశ్వర్యరాయ్‌ 

బాబా భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తి కోట్ల హృదయాల్లో ఉందని నటి ఐశ్వర్యరాయ్‌ అన్నారు. బాబా బోధించిన డిసిప్లిన్‌, డెడికేషన్‌, డివోషన్‌, డిటర్మినేషన్‌, డిస్క్రిమినేషన్‌ జీవన గమనా నికి దిక్సూచి అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవగా బాబా స్థాపించిన ఉచిత ఆసుపత్రులు, విద్యాసంస్థలు ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలే బాబా జీవితమని, ఆయన చూపిన కరుణ, సేవా మార్గం ప్రపంచానికి వరమని ఆమె అభివర్ణించారు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE