‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

చాగంటి ప్రసాద్‌

నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. భరించలేని నిశ్శబ్దం విసుగు తెప్పిస్తోంది. గదిలో గడియారం కూడా నిశ్శబ్దం పాటిస్తూ ముళ్ల శబ్దాన్ని గొంతులోకి నొక్కేసింది. కిటికీలోంచి బయటకు చూశాను. తెల్లని మంచు అవని మీద ముగ్గులు పెడుతోంది. ఎడతెరిపిలేకుండా పడుతున్న మంచుని కప్పుకున్న రోడ్డు, మొద్దు నిద్రలో ఉన్న శ్వేతనాగులా ఉంది. రోడ్డు పక్కన తెల్లరగ్గు కప్పుకున్న చెట్లు, దెయ్యాల్లా నిలబడి ఉన్నాయి. బాత్‌ ‌రూమ్‌ ‌కుళాయిలో నుంచి టప్‌ ‌టప్‌మంటూ ఆగాగి పడుతున్న నీటి చుక్కల శబ్దం డాల్బీ సౌండ్‌ ‌లా వినబడుతోంది. బయటకు వెళ్లాలని ఉన్నా, ఈ భయంకరమైన చలి, మంచులో కాలు కూడా బయటకు పెట్టలేని పరిస్థితి. వైదేహి దగ్గరకు వెడుతూంటే, ‘‘అసలే ఆస్త్మా ఉంది మీకు. బయటకు వెళ్లద్దు’’ అని గట్టిగా చెప్పింది రాధి. ఇన్ని రోజులు ఒంటరిగా ఇంట్లో ఉండడం నరకమే. చలి తగ్గాకా, ఎట్టి పరిస్థితిలో న్యూయార్క్ ‌సెంట్రల్‌ ‌పార్క్ ‌కి వెళ్లాలి. ఏకాంత్‌, ‌గాయత్రీలను కలవాలి. ఏమైపోయారో?.. విచిత్రంగా పరిచయమయ్యారిద్దరూ.. ఆరోజు.

పార్క్లో  పిల్లలను ఆడిస్తున్న జంటలను చూస్తూ కూర్చున్నాను. వరుణ్‌, ‌వైదేహిలను ఇలాగే ఆడించేవాళ్లం. వాళ్ల బాల్యపు జ్ఞాపకాల పరిమళం నా గుండెను మళ్లీ తాకింది. అప్పుడే వాళ్లిద్దరూ పెళ్లిళ్లు చేసుకుని దేశంలో చెరో మూల స్థిరపడి పోయారు. కాలానికి ఎంత కంగారు. దాని పని ఏదో దానిదే గాని మనల్ని పట్టించుకోదు కదా! కాస్త ఆగితే ఏం కొంప మునిగిపోతుందో ? కాలమా ఆగిపో? అంటూ ఎవరో కవి గారు రాసిన పాట గుర్తుకు వచ్చింది. గ్రేట్‌ అమెరికాలో తెలుగు పాటలు గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదని నా మనసు చెప్తోంది. ఈ మధ్య ఇక్కడ ఉన్న తెలుగు వాళ్లకు తమ భాష మీద మక్కువ పెరిగింది. ఇక్కడ స్థిరపడి పాతిక సంవత్సరాలు అయ్యింది. అస్తిత్వం మాత్రం ఎక్కడో ఉందని మనసు గుర్తుచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. రాధి పక్కన ఉంటే, కనీసం ఏవో నాలుగు మాటలు, దెబ్బలాటలూ ఉండేవి. అలాగైనా కాస్త కాలం గడుస్తూ ఉండేది. ఆలోచనల్లో పడి, పక్కన ఎవరు కూర్చున్నారో గమనించలేదు. బాగా పెరిగిన జుట్టు, గుబురు గెడ్డం, లోతైన కళ్ల క్రింద నల్లటి వలయాలు. బలహీనంగా ఉన్న ఒక యువకుడు బెంచీ చివర కూర్చున్నాడు. నాకేసి చూసి, మోహమాటంగా నవ్విన నవ్వు అతని మొహంలో కనిపించి మాయమయ్యింది. సభ్యత కోసం నేనూ నవ్వాను. అతని నవ్వులో జీవం లేదు. అయినా నాకెందుకు? పరాయివాళ్లను పరిశీలించడం సభ్యత కాదు, ఎవరు ఎలాంటివారో తెలియదు. అమెరికాలో నేర్చుకున్న మూతి బిగింపు అలవాటు వలన, అతణ్ణి పలకరించలేదు. హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించి నాలుగు పేజీలు చదివి, పుస్తకం పక్కన పెట్టి, పార్క్ అం‌తా పరికించి చూస్తూ, యధాలాపంగా పక్కనున్నతన్ని మళ్లీ చూశాను. అరచేతులతో ముఖం కప్పుకుని, ముందుకు వంగి మోకాళ్ల మధ్య తలదాచుకున్నాడు. అతని ప్రవర్తన నాకు చిత్రంగా అనిపించలేదు. న్యూయార్క్ ‌లో చాలా చోట్ల ఎందరో డ్రగ్స్ ఎడిక్టర్స్, ‌హోమ్‌లెస్‌ ‌వాళ్లు అలా ప్రవర్తిస్తూ కనిపిస్తారు. వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఎన్నో ఏళ్ల అనుభవం.పక్కన కూర్చోవడమే ప్రమాదం, కానీ ఇతను ఏదో బాధల్లో ఉన్నట్టుగా అనిపించి పలకరిద్దామని అనుకున్నాను, కానీ మనసులోని భయం నా గొంతు నొక్కేసింది.

చిన్నగా చీకటి కమ్ముకుంటోంది. ఇంక లేద్దామనుకునేలోపు,.. హఠాత్తుగా అతను బెంచీ మీద నుంచి నేలమీద బోర్లా పడిపోయాడు. కంగారు పడుతూ అతని దగ్గరకు వెళ్లి నాతో తెచ్చుకున్న బాటిల్‌ ‌లోంచి కాసిని నీళ్లు అతని మొహం మీద జల్లాను. కాసేపటికి నెమ్మదిగా కళ్లు తెరిచాడు. చెయ్యి ఆసరా ఇచ్చి పైకి లేపి బెంచ్‌ ‌మీద కూర్చోబెట్టాను. చెయ్యి చాలా వేడిగా ఉంది. జ్వరం వచ్చినట్టుంది.

‘‘వాట్‌ ‌హ్యాపెండ్‌ ‌మిస్టర్‌!’’ అడిగాను అతని కేసి కంగారు పడుతూ చూస్తూ..

‘‘నథింగ్‌ ‌సర్‌.. ‌జస్ట్ ‌గిడ్డి నెస్‌ ‌థాంక్‌ ‌యు’’ అన్నాడు. అతని మొహం చూస్తే జాలేసింది. ఇంతలో నా ఫోన్‌ ‌రింగ్‌ అయ్యింది. ..రాధి..

‘‘ఎంత సేపు కూర్చుంటారు పార్క్‌లో? చీకటి పడింది త్వరగా రండి’’.

‘‘వచ్చేస్తున్నా’’.. అన్నాను.

‘‘మీరు తెలుగువారా?’’ అడిగాడు స్వచ్ఛమైన తెలుగులో.

‘‘అవును’’ అన్నాను… అతని మొహంలో కాస్త వెలుగు.

‘‘ఏం చేస్తూ ఉంటారు మీరు?’’ తప్పని పరిస్థితుల్లో మాటలు కొనసాగించాను.

‘‘నా పేరు ఏకాంత్‌ ‌సర్‌! ఎం.ఎస్‌ ‌చేశా. రిసెషన్‌ ‌తీవ్రంగా ఉండడం వలన జాబ్‌ ఓపెనింగ్సు లేవు’’.. అంటూ మొదలు పెట్టి, ఉన్న ఒక్క ఇల్లు బ్యాంక్‌లో తాకట్టు పెట్టి తండ్రి వద్దన్నా వినకుండా, అమెరికాలో చదువుకి రావడం, చదువు తర్వాత ఉద్యోగం రాకపోవడం, రెండు వారాల్లో జాబ్‌ ‌వస్తేనే అతను అమెరికాలో ఉండగలడని చెప్పాడు. చదువుకి ఇచ్చిన వీసా గడువు టైము కూడా అయిపోవచ్చిందిట. ఉద్యోగం వస్తే, లోన్‌ ‌తీర్చగలడట. తాను •పడుతున్న పాట్లు అన్నీ ఏకరవు పెట్టాడు. దక్షిణ ఆసియా దేశాల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి చదువులకు, ఉద్యోగాల కోసం వచ్చిన ఎందరినో నేను ఎరుగుదును. వాళ్లకు దిన దిన గండం. ఒక రోజు కనిపించిన వాళ్లు మర్నాడు కనిపించేవారు కాదు. ఈ దేశం అందర్నీ బాగా వాడుకుని అది ఎదుగుతూ ఉంటుంది. అవసరం తీరిపోయాక ఏదో ఒక రూలు చూపించి నిశ్శబ్దంగా బయటకు గెంటేస్తుంది. ఇలా ఎందరో? రేపు ఇతని పరిస్థితి కూడా ఇంతేనా? మాటల్లో భోజనం సరిగ్గా చేయడం లేదని చెప్పాడు. మరో ఆలోచన చేయకుండా, వెంటనే అతణ్ణి దగ్గరలో ఉన్న మెక్సికన్‌ ‌హోటల్‌ ‌టాకో బెల్‌కి తీసుకువెళ్లాను. రైస్‌ ‌బౌల్‌ ‌తెప్పించాను. నాలుగు మాటల ధైర్యం చెప్పిన తర్వాత, ఆకలిగా ఉందేమో తల ఎత్తకుండా గబగబా తిన్నాడు. హోటల్‌ ‌లోంచి బయటకు వచ్చి, మ్యాన్‌ ‌హాట్టన్‌ ‌రోడ్డు మీద నడుచుకుంటూ వెడుతున్నాము.

‘‘థాంక్యూ సర్‌. ‌భోజనం పెట్టించారు. నా మీద నాకే సిగ్గేసింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు సర్‌. అమెరికా వచ్చి భోజనం అడుక్కుంటున్నాను’’.. అతని కంటి నిండా నీళ్లు. మాటలు పెగలడం లేదు.

‘‘బాధపడకు! ఆకలికి అమెరికా అయితే ఏమిటి? ఇండియా అయితే ఏమిటి? నీ కడుపుకి తెలుస్తుందా ఆ విషయం!’’.. అంటూ ఓదార్చాను.

‘‘ఇంటినుంచి మెయింటెనెన్స్ అమౌంట్‌ ‌రావడం ఆగింది. చదువుకునేప్పుడు పార్ట్‌టైమ్‌ ‌చేసి సంపాదించేవాడిని. ఇంటి నుండి మెయింటెనెన్స్ ‌కూడా తెప్పించు కోకుండా మ్యానేజ్‌ ‌చేసుకున్నాను. ఇప్పుడు రోజు గడవడం చాలా కష్టంగా ఉంది. ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌కీ ఫోన్‌ ‌చేశాను. ఎవ్వరూ హెల్ప్ ‌చేయలేకపోయారు. ఇంత కాంపీటేషన్‌ ఈ ‌మధ్య కాలంలో లేదుట సర్‌. ‌మా సీనియర్స్ ‌చెప్తున్నారు. హోటల్స్‌లో వెయిటర్‌ ఉద్యోగానికి కూడా చాలా పోటీ ఉంది సర్‌’’ అం‌టూ వాపోయాడు.

‘‘నేను కూడా అమెరికా వచ్చిన కొత్తలో కొంతకాలం కష్టపడ్డాను. కానీ అప్పటి పరిస్థితి వేరు. చాలా తక్కువ మంది అమెరికా వచ్చేవారు. ఉద్యోగాలు కూడా బాగానే ఉండేవి. ఇప్పుడు వేలల్లో వస్తున్నారు. దానికి సరిపడా ఉద్యోగావ కాశాలు లేవు. అదీగాక ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ అనే కొత్త భూతం తరుముకు వస్తోంది. అది ఎన్నో ఉద్యోగాలను మింగేస్తోంది. ఆ భూతాన్ని లొంగ దీసుకోవాలి.’’ అన్నాను.

 నా మాటలకు సమాధానం చెప్పకుండా నాకేసి అభావంగా చూశాడు. అనవసరంగా అమెరికా వచ్చానేమోననే బాధ అతని మొహంలో కనబడింది. ఇటువంటి విషయాలు మాట్లాడితే మరీ డీలా పడిపోతాడు. ధైర్యం చెప్పాలి అనుకుంటూ, ‘‘ఏదో ఒక ఉద్యోగం వస్తుందిలే కంగారు పడకు’’అని భుజం తట్టాను. ‘‘థాంక్యు సర్‌! ఉం‌టాను’’..  అంటూ నాకు షేక్‌ ‌హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోయాడు. అలాగే గాయత్రి పరిచయం కూడా విచిత్రంగా జరిగింది.

                                                                                               *     *     *

ఆరోజు సాయంకాలం పార్కులో జనం పల్చగా ఉన్నారు. బెంచ్‌ ‌మీద కూర్చుని పుస్తకం చదువుతున్నా, కళ్లు మాత్రం పార్క్‌లో అటూ ఇటూ తిరుగు తున్నాయి. ఇంతలో హఠాత్తుగా జరిగిందది. ఒక రెండేళ్ల పాప నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పార్క్ ‌మధ్యలో ఉన్న లేక్‌ అం‌చు వరకు వెళ్లిపోయింది. నాలుగు అడుగులు వేస్తే నీళ్ళల్లో పడిపోయే ప్రమాదం ఉంది. గట్టిగా అరిస్తే, కంగారు పడి నీళ్లల్లో పడిపోతుందని, నెమ్మదిగా నడుచు కుంటూ వెళ్లి పాపను ఎత్తుకుని, పాప తాలూకు వాళ్లు ఎవరా! అని చుట్టూ చూసాను. ఎవరూ కనబడలేదు. కొద్దిగా దూరంగా ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయి పుస్తకం చదువుకుంటోంది. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ‘‘ఎక్స్క్యూజ్‌ ‌మీ! ఈ పాప మీ పాపా? నేను చూడకపోతే లేక్‌లో పడిపోయి ఉండేది అన్నాను, కాస్త గట్టిగా. నా మాట వినగానే ఆ అమ్మాయి ఉలిక్కిపడి నా చేతిలో ఉన్న పాపకేసి కంగారు పడుతూ చూసి, చదువుతున్న పుస్తకం పక్కన పడేసి, ఓమై గాడ్‌ అం‌టూ, నా చేతిలోంచి పాపను లాక్కుని గుండెలకు హత్తుకుంది. థాంక్‌ ‌యు సర్‌.. ‌థాంక్‌ ‌యు సర్‌.. అం‌టూ పిల్లను ముద్దులు పెట్టుకుంటోంది.

‘‘పాపను ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారేంటీ’’ … కోపంగా అడిగాను..

‘‘సారీ సర్‌.! ‌పుస్తకం చదువుతూ లీనమై పోయాను. ఎంత ప్రమాదం తప్పిందీ’’ అంటూ గుండెల మీద ఆ పాపను హత్తుకునే, నన్ను కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ ‘‘పాపను నీటి ప్రమాదం నుంచి, నన్ను పెను ప్రమాదం నుంచి కాపాడారు సర్‌! ఈ ‌పాపకు ఏమైనా జరిగి ఉంటే నేను జైల్లో ఉండే దాన్ని. మీకు ఎన్ని సార్లు థాంక్స్ ‌చెప్పినా తక్కువే’’ అంటూ నా చేతులు పట్టుకుని ఏడ్చేసింది. తర్వాత నేను అడగకుండానే తన వివరాలు చెప్పింది. బెంగళూర్‌ ‌లో ఒక పెద్ద హాస్పిటల్‌లో నర్సుగా పని చేసి, అడ్వాన్స్ ‌నర్సింగ్‌ ‌కోర్సు చేయడానికి ఇక్కడకు వచ్చిందిట. తప్పదు గనుక నానీగా పార్ట్ ‌టైమ్‌ ఒకరింట్లో చేస్తోందిట. ఖాళీ దొరికినప్పుడు చదువు కుంటున్నానని తన దగ్గర ఉన్న పుస్తకం చూపించింది. ఆమె తపన చూసి, ‘‘వెరీ గుడ్‌’’ అం‌టూ అభినందించాను.

ప్రతి వీకెండ్‌, ‌పార్కులో గాయత్రి కలిసేది. కొన్ని రోజులకు ఏకాంత్‌ ‌కూడా మాతో కలిసాడు. ముగ్గురం ఒకే బెంచ్‌ ‌మీద కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఈ వయసులో నాకు కూడా బాగా కాలక్షేపం అయ్యేది. టైము తెలిసేది కాదు. చాలా కాలం తర్వాత నాలో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. కానీ ఏకాంత్‌ ‌మాత్రం బాగా టెన్షన్‌గా ఉండేవాడు. మరి కొద్ది రోజుల్లో వీసా టైం అయిపో తుందనే భయం అతన్ని వెంటాడుతూ ఉండేది. డిప్రెషన్‌లోకి వెళ్లకుండా గాయత్రి ధైర్యం చెప్తూ ఉండేది. నా చిరకాల మిత్రుడు ఒక కంపెనీలో డైరెక్టర్‌ ‌హోదాలో ఉన్నాడు. వాడికి చెబుతామని అనుకున్నాను. కానీ ఏదో భయం నన్ను ఆ పని చెయ్య నివ్వలేదు. అదీగాక, ఏకాంత్‌ ‌మామూలు పరిచయస్తుడు. బాంధవ్యం ఏమీ లేదు. పరాయివాళ్ల విషయంలో జాగ్రత్త పాటించడం మంచిదని అమెరికా నేర్పిన భయం. కొన్ని రోజులు పార్క్‌కి వెళ్లడం మానేశాను. కానీ ఏకాంత్‌ ‌దీనమైన మొహం తరచు గుర్తుకు వస్తోంది. ఉద్యోగం వచ్చిందో లేదో పాపం! ఉండబట్టలేక అతనికి చాలా సార్లు ఫోన్‌ ‌చేశాను, ఎత్తడం లేదు. ఫీల్‌ అయినట్టున్నాడు. దానికి కూడా నేనే కారణం. అతను క్రిందటి వారం చాలా సార్లు ఫోన్‌ ‌చేశాడు. ఉద్యోగం కోసం నన్ను రికమెండ్‌ ‌చెయ్యమని అడుగుతాడనే భయంతో ఫోన్‌ ఎత్తలేదు. ఎందుకు ఫోన్‌ ‌చేశాడో? బయటకు వెళ్లలేని పరిస్థితి. న్యూయార్క్‌లో చలి పులి తన కోరలతో చీల్చి చెండాడుతోంది. కాలం మందంగా సాగుతోంది..

                                                                                               *     *     *

కొన్ని రోజుల తర్వాత చలి తగ్గు ముఖం పట్టింది. రాధి కూడా వచ్చేసింది. వెచ్చనిఎండ శరీరానికి హాయిగొల్పుతోంది. పార్క్ ‌లో అడుగు పెట్టాను. సూర్య కిరణాల కాంతిలో అరుదుగా కనబడే ఇండిగో బాంటింగ్స్ ‌పక్షులు, అమెరికన్‌ ‌రాబిన్‌ ‌పక్షులు పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్నాయి. గాయత్రి, ఏకాంత్‌ ‌కనబడతారేమోనని ఆశగా చుట్టూ చూశాను. వాళ్ల జాడ లేదు.. నాలుగు రోజులు గడిచాయి. ఇంతలో ఎలెక్షన్స్ ‌రిజల్టస్ ‌వచ్చాయి. అమెరికా అధికార పగ్గాలు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. దేశంలో ఉన్న అక్రమ వలసదారులను శిక్షిస్తారని, అనధికా రంగా అమెరికా ఉండే వారిని వారివారి దేశాలకు పంపించే స్తారని వార్తల్లో వస్తోంది. నా గుండెలో ఏదో తెలియని బాధ మెలిపెడుతోంది. నిద్ర కరువైంది. ఏకాంత్‌ ‌పరిస్థితి ఎలా ఉందో? గాయత్రికి ఫోన్‌ ‌చేశాను. జవాబు లేదు. ఏ సమాచారం తెలియలేదు.

కొన్ని రోజుల తర్వాత టీవీలో ఆ వార్త చూసి, గుండె గొంతుకలో కొట్టాడింది. వలసదారులను సంకెళ్లు వేసి విమానాలు ఎక్కించడం చూసి తట్టుకోలేకపోయాను. గాలిలో స్వేచ్ఛగా ఎగురుతూ ప్రపంచ నలుమూలలా తిరిగే పక్షుల జీవితాలు మెరుగు. జ్ఞానమున్న మనిషికి మాత్రం తన గమనానికి ఎన్నో అడ్డంకులు. మనసు వికలమైపోయింది. ఆశ చావక మళ్లీ ఏకాంత్‌కి ఫోన్‌ ‌చేశాను.. రిప్లయ్‌ ‌లేదు. దుఃఖం పెల్లుబికింది. అన్యమనస్కంగా ఉన్న నన్ను రాధి గమనించి నట్టుంది. నా భుజం మీద చెయ్యి వేసి, ‘‘ఏమైందండి రెండు రోజుల నుంచి డల్‌గా ఉన్నారు’’ .. అనునయంగా అడిగింది. చెప్పాను.. ‘‘అయ్యో పాపం ! మన పిల్లలకో, మీకు తెలుసున్న వాళ్లకో.. ఎవరికైనా రిఫర్‌ ‌చెయ్యవలసింది కనీసం అతను నిలదొక్కుకునే వరకు’’ అంది. ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటో పాపం ఇప్పుడు?అతను ఉండే ప్లేస్‌ ‌తెలుసా? వెళ్లి చూద్దామా?’’ ఆతృతగా అడిగింది. ‘‘అతను ఉండే ప్లేస్‌ ‌తెలుసుకుని వెళ్లడం పెద్ద పని కాదు. కానీ వెళ్లినా ఏం సాయం చేయగలం? అంతా అయిపోయింది’’ .. నిరాశగా అన్నాను.

ఇంతలో గాయత్రి నుండి ఫోన్‌. ‌వెంటనే ఎత్తి, మాట్లాడి ఫోన్‌ ‌పెట్టేయగానే, రాధి ఆతృతగా ‘‘ఎవరండీ!ఫోన్లో’’… అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా బయటకు నడిచాను.

                                                                                               *     *     *

మేము ఎప్పుడూ కూర్చునే పార్క్ ‌బెంచ్‌ ‌మీద గాయత్రి కూర్చుని ఉంది. ఏకాంత్‌ ‌గురించి ఏం చెప్తుందోఅన్న ఆలోచనవలన గుండె వేగంగా కొట్టు కుంటోంది. ‘‘చెప్పు గాయత్రీ ! వెంటనే రమ్మన్నావు ఏమిటి విషయం’’ ‘‘ఫ్యూ మినిట్స్ అం‌కుల్‌! ‌చెప్తాను’’.. అంటూ నన్ను ఆపుతోంది. మనస్సు పరిపరి విధాలా పోతోంది. ఏమై ఉంటుంది ఏకాంత్‌కి ? మా ఇద్దరి మధ్య మౌనం తాండవిస్తోంది. ఆతృతను అదిమిపెట్ట లేక, లేచి నిలబడి అటూ ఇటూ తిరుగుతున్నాను. గాయత్రి మొహంలో కూడా ఏ భావాలు కనబడడం లేదు. దీక్షగా పుస్తకం చదువుతోంది. ఇంతలో చేతులు ప్యాంట్‌ ‌జేబులో పెట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న ఏకాంత్‌ ‌కనబడ్డాడు. దగ్గరకు వచ్చాక అతని మొహంలోకి చూశాను. ప్రశాంతంగా ఉంది. నా గుండె వేగం తగ్గింది. ‘‘సారీ గాయత్రి! నిన్ను వెయిట్‌ ‌చేయించినట్టు న్నాను ’’.. అంటూ నాకేసి చూసి, ‘‘నమస్తే అంకుల్‌’’ అం‌టూ విష్‌ ‌చేశాడు. ఇంతలో గాయత్రి హఠాత్తుగా బెంచ్‌ ‌లోంచి లేచి గంతులేస్తూ, గట్టిగా అరుస్తూ .. ‘‘ఏకాంత్‌ని కంగ్రాట్‌ ‌చేయండి అంకుల్‌ ‌తనకి జాబ్‌ ‌వచ్చింది’’ అంది. ఆ మాట వినగానే, నాకు కలిగినది ఆనందమో, అపరాధ భావమో తెలియలేదు. కాసేపు నోట్లోంచి మాట రాలేదు. ఇద్దరూ నాకేసి చూస్తున్నారు నా స్పందన కోసం. వెంటనే తేరుకుని, ‘‘రియల్లీ వండర్‌ ‌ఫుల్‌ ఏకాంత్‌ ! ‌హౌ దిస్‌ ‌మిరాకిల్‌ ‌హ్యాపెండ్‌’’ అం‌టూ ఏకాంత్‌ ‌చెయ్యి పట్టుకుని ఊపేశాను.

‘‘దిస్‌ ‌మిరాకిల్‌ ‌వాజ్‌ ‌పాజిబుల్‌ ‌బై వన్‌ ‌యాంజిల్‌ ఆన్‌ ‌ద ఎర్త్’’ అం‌టూ గాయత్రిని చూపించాడు.అర్థం కానట్టు మొహం పెట్టాను. ‘‘ఈ అభినందనలు తనకే చెందాలి, తను పనిచేసే ఇంటి వాళ్లకు ఒక స్టార్ట్అప్‌ ‌కంపెనీ ఉంది. వాళ్లకు నా పరిస్థితి చెప్పింది’’.. చెప్తుంటే అతని కళ్లు చెమర్చడం గమనించాను.

‘‘నువ్వు తెలివైన వాడివి, ఇంటర్వ్యూ కూడా బాగా చేశావుట, అందువలనే ఉద్యోగం వచ్చింది. నాదేముంది జస్ట్ ఒక మాట సాయం అంతే’’ అని మనోహ రంగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో తెలియని దివ్యత్వం కనిపించింది నాకు. వాళ్లిద్దరిని అభినందిం చాను. ‘ఏకాంత్‌ ‌చాలా డిప్రెషన్లో ఉన్నాడు వీసా లాప్స్ అయిపోయేలోపులో అతనికి చిన్న ఉద్యోగం దొరికితే బావుణ్ణు’ గాయత్రి అన్నప్పుడు నా ఫ్రెండ్‌కి ఫోన్‌ ‌చెయ్యడానికి ఉపక్రమించి చివరి క్షణంలో మనసు మార్చుకున్నాను. నేను చేయలేని పని వయసులో చిన్నదైనా, పెద్ద మనసుతో గాయత్రి చేసింది. చిన్నబోయిన మొహంతో నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చి పడ్డాను.

About Author

By editor

Twitter
YOUTUBE