‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
మత్తి భానుమూర్తి
ఆరోజు రాజప్రాసాదంలో ఓ విందు సంబరం.. మేనత్త కూతురు వింజమాంబ గర్భవతి అయిన సందర్భంగా జరగుతున్న సీమంతం సంబరాలు.. విందు వినోదాలు. నిజంగానే ఆ సంబరం మతి పోగొట్టేసింది.
ఇలాంటి సంబరాలు, సమావేశాలు, పండుగలు ఆనందాలు.. తన పెళ్లి వేడుకల వరకు ఎన్నెనో చూశాడు కాని ఇది ప్రత్యేకం. ఆయా బంధువుల హోదా, ఆడంబరాలు, బహుమానాలను ఇప్పుడు గణపతి చూసే దృష్టికి ఓ దృక్కోణం ఉంది. అది ఆర్ధిక దృక్కోణం. మూడు రాజ్యాల మధ్య సామ్యాలు.. వైరుధ్యాలు!
సంధ్యవేళ నుండి అతిథుల రాక ఆరంభ మయ్యింది. వాళ్లను వివరంగా చూడటమే గణపతి పని.
అంబరాన్ని చుంబించే ఆ మహా మందిరాన్ని రెండురోజుల ముందు నుండే అలంకరించసాగారు. ఆ మహాకుడ్యాలకు ఎన్నెన్నో దీపాలు.. మరెందరో దీపకాంతలు నెత్తిన నూనెదీపాలతో మందిరమంతా కదలుతుంటే అక్కడికక్కడ చీకటి పరుగెత్తి పారి పోతోంది. ఆ వెలుగులో వస్తోన్న ఒక్కొక్క అతిథీ.. బంధుమిత్ర సపరివారంగా లోపలికి వస్తోంటే మతిపోయి చూడసాగాడు గణపతి.
రాజులో.. మహారాజులో.. సామంతులో.. మంత్రులో.. సైన్యాధ్యక్షులో.. వన్నెవన్నెల పట్టుపంచలపై కళ్లు జిగేలుమనిపించే కంచుకాలు.. బంగారు కిరీటాలు.. లేకుంటే రంగురంగుల పట్టు ఉష్నీషములు.. తలపాగాలయినా ఎంత అబ్భురంగా ఉంది ఆ అలంకరణ.. నడబందంలో రంగురంగుల వస్త్రాలు.. వాటిపై బంగారు వొరలో వజ్రాలు పొదిగిన బంగారు పిడులున్న చురకత్తులు.. ఓయమ్మో ఆ వజ్రాలు ఎంత ఖరీదైనవో.. ఎక్కడ కొనుగోలు చేశారో.. ఏ పరదేశీ వర్తకుడు కొని తెచ్చాడో.. ఆ కంచుకం ఎంత అద్భుతంగా ఉంది.. దానిపై మెరుస్తు న్నది కెంపు కావచ్చు.. ఎంత ధర ఉంటుందో..
ప్రక్కన పిల్లవాళ్లు కొడుకులు కావచ్చు.. ఒక్కొక్కడి దుస్తులు లక్షల ధరలో ఉంటాయి.
ఆ ఆడవాళ్లను చూద్దామా.. రెండు కళ్లూ చాలవ్.
పొడగరులు, కోలమోములు, విశాలనేత్రాలు.. కాటుక కన్నులు, పద్మాక్షులు, మధిరాక్షులు, కామాక్షులు..
అందచందాలకేమి తక్కువలేదు. సరే.. ఆ ఆభరణాలు.. రత్నాలు పొదిగిన జడకుచ్చులు, బంగారుకుప్పెలు, తలపై మాణిక్య నాగాభరణాలు, వజ్ర నక్షత్రాభరణాలు, ముత్యాల పాపిటబొట్టు, గోమేధిక చామంతి పూలు, కంకణ, కేయూర, హార, మేఖల నూపురాలు.. తయారు చేసిన మణికారులు ఎవరో.. లెస్స లెస్స.. తయారీకి ఎన్ని నాణాలు పుచ్చుకున్నారో.. భూములు, గ్రామాలు దానం తీసుకున్నారేమో.. అసలు ఆ బంగారం, ఆ వన్నెచిన్నెల రాళ్లు.. ఎక్కడివో.. ఎలా కొన్నారో.. ఎవరు అమ్మారో..చేతులు మారినప్పుడల్లా ధరలు పెరుగు తాయి కదా..
ఆ పట్టుచీరెలు.. ఆ మిరుమిట్లు గొలిపే కోకలు.. కశ్మీర కుంకుమ వన్నెలు గరుడ పచ్చకంచుకం,
చెంపలకు పుప్పొడి అద్దిన కస్తూరి, కుంకుమ మకరికపత్ర, రత్న కర్ణికలు, కస్తూరితో చందనంతో పునుగు జవ్వాజులతో.. కుంకుమ పువ్వుతో.. కాశ్మీరు సరుకులు అవన్నీ.. ఎవరు దిగుమతి చేసుకుంటున్న వణిజులు.. కోమటి శేట్లా.. బలిజ వర్తకులా..
ఆ పాదాలకు.. ఓయమ్మా.. లత్తుకతో అలంకరి చారు. ఎంత బాగా ఉంది ఆ అలంకరణ.. అసలు ఆ లత్తుక ఎక్కడిదో.. అది గోరింటా.. మరేదైనా దేశం నుండి దిగుమతి చేసుకున్న విదేశీ లత్తుకా..
అత్తమ్మ కూతురు విజమాంబ అందుకుంటున్న బహుమతులు చూస్తుంటే గణపతికి మతిపోతోంది.
వేడుక పూర్తయ్యి అతిథులందరూ వెళ్లిపోయేసరికి అర్ధరాత్రి దాటుతోంది. బహుమతులను పాతికమంది పరిచారికలు ఆపసోపాలు పడుతూ మోసుకుపోతుంటే నోరు తెరచి రెప్పవెయ్యకుండా చూస్తుండిపోయాడు.
మరునాడు అంతఃపురంలో అత్తమ్మను, మామ కోటమహరాజును వీడ్కోలు అడిగాడు.
వెళ్లవద్దు.. మరి కొన్ని రోజులు ఉండమని చెప్పడానికి వారికి కారణం కనిపించలేదు.
అప్పుడే గణపతి తను వచ్చిన కారణం వారి ముందు ప్రస్తావించాడు.
‘‘మామా.. నేను ఇక్కడికి ఇప్పుడు రావడానికి ఓ బలీయమైన కారణం ఉంది. అది.. అది..’’
‘‘అడుగు గణా. అయినా కాకతీయ మహా మండలేశ్వరునివి. నువ్వు మమ్మల్ని అడగడమా.. ఆజ్ఞాపించు. శిరసావహిస్తాను..’’ అన్నాడాయన నవ్వుతూ. మధురంగా వింటూ చూస్తోంది మేనత్త నాగమాంబ.
‘‘నాకేమీ అభ్యర్ధించవలసినవి లేవు కానీ.. అక్క మైలమాంబ.. వాళ్ల రాజ్య పరిస్థితి ఏమీ బాగా లేదు మామా.. ఈ ఏడాది వర్షాలు లేక పంటలు పండక రైతులు.. అందువల్ల ఇతర వృత్తులవాళ్లు.. పన్నులు వసూలు కాక రాజ పరిపాలనా వ్యవస్థలు అన్నీ దీనాతిదీనమైనస్థితిలో ఉన్నాయి. వాళ్లకు తగిన ధాన్య సహాయం..’’
వింటూనే అక్కడున్న పల్యంకంలో కూలబడి ముఖాన్ని చేతులలో దాచుకుని రోదించసాగింది నాగమాంబ.
‘‘నా తల్లి.. మైలమా.. నీకెంత కష్టం వచ్చేందే తల్లి..’’ ఆమె ఏడుస్తోంది.
మేనకోడలు రాజ్యస్థితి ఆమెను తీవ్రంగా బాధ పెట్టినట్లు అక్కడున్న అందరూ గుర్తించారు.
‘‘అందుకే వదిన నా వేడుకకు రాలేదు బావా..’’ వింజమాంబ కూడా ముక్కులు ఎగబీలుస్తోంది.
‘‘ఎందుకు రాలేదోనని నేను పరిపరి విధాలా మథనపడుతున్నాను గణా! నన్ను అడగలేక మైలాంబ, బేతయ్య ఎంత కుమిలిపోతున్నారో కదా..’’
కోటమహరాజు మామ కూడా ఎంతో బాధపడసాగాడు.
‘‘నువ్వేమీ బాధపడకు గణా. వారి ధాన్యాగారాన్ని పూర్తిగా నింపేభారం నాది. నువ్వు నిశ్చంతగా అనుమకొండ వెళ్లు. నతవాడికి నేనున్నాను.. ఈ ధరణికోట రాజ్యముంది..’’ ప్రతిజ్ఞలా చెప్పాడు మామ.
తృప్తిగా ఆనందంగా తిరిగి అనుమకొండ చేరాడు గణపతిదేవుడు.
జరిగింది తల్లులతో పంచుకున్నాడు. ఇద్దరూ గణపతిని అభినందించి మురిసిపోయారు.
నతవాడి రాజ్యం.. చాగిరాజ్యం.. ధరణికోట రాజ్యం..
మూడు రాజ్యాల స్థితిగతులు.. ముఖ్యంగా ఆర్ధిక స్థితిగతులు గణపతిదేవుని ఆలోచనా విధానాన్ని, దృక్కోణాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఏవో హద్దులు ఉన్నాయి కాని అందరూ ప్రజలే. అందరి ఆకలిదప్పులు, అవసరాలు, సౌకర్యాలు, సుఖసంతో షాలు ఒక్కటే. రాజ్యపాలకులు వేరైనంత మాత్రాన ప్రజలెందుకు బాధ పడాలి.. ఇందుకు నివారణ ఏవిటి..? ఈ నేలపై అందరూ ఒక్కలాగే జన్మించారు కదా! మరెందుకు కొందరికి బంగారు పళ్లెరంలో షడ్రసోపేతమైన భోజనం.. కొందరు ఎందుకు మన్నులో నీళ్లు కలుపుకుని తినడం.. కొందరెందు కు పస్తు పడుకోవడం.. ప్రజలు అలా ఉంటే ఈ పాలకులు ఏమి చేస్తున్నారు.. దేవుళ్లతో పోల్చుకుంటూ ఎందుకు ఈ భోగభాగ్యాలు..
ఇందుకు తనేదైనా చెయ్యాలి.. ఏమి చెయ్యాలి..?
అప్పటికప్పుడు ఏమీ తోచలేదు.
ముందు సింహాసనం అధిష్టించాలి.. పాలనా పగ్గాలు చేతపట్టాలి.
పితృసమానులు రేచర్ల రుద్రయ సేనాని, మహాప్రధాన గంగాధరమంత్రిని తన మందిరానికి రావలసినదిగా ఆజ్ఞాపించాడు. ఇద్దరూ పరుగు పరుగున వచ్చి వాలారు.
‘‘ఎప్పటినుండో అడగాలనుకుంటున్న ప్రశ్న. మీరు నిర్వహిస్తున్న మీ నియోగాల వల్ల వేతనం.. అదే ఆదాయం ఎంత పొందుతున్నారు?’’
ఇద్దరూ అర్థం కానట్లు చూసి అర్థమయ్యాక కొయ్యబారి చూడసాగారు.
చరిత్రలో ఏ మహారాజు తన మహాప్రధానిని, మహా సైన్యాధ్యక్షుని ఇలా అడిగి ఉండడు. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఆయనకు వివరించవలసిన వాళ్లం మనమే కదా అన్నట్లు ఇద్దరూ ఏకీభావం ప్రకటించుకున్నారు ఆ చూపులో.
గంగాధర మంత్రి చెప్పాడు. ‘‘మేమిద్దరం మండ లేశ్వరులమే కదా మహారాజా. నేను సబ్బినాడుకు, రుద్రయ పిల్లలమర్రికి మండలేశ్వరులం. అంటే మా మండలంలో వసూలు చేసే పన్నులలో మాకు వాటా ఉంటుంది. కొంత మహామండలేశ్వరులైన మీకు.. అంటే కాకతీయ రాజ్యకోశాగారానికి వస్తుంది. మా కోశాగారానికి లభించే ఆదాయమే మా ఆదాయం. ఏ మహారాజుకయినా అంతే. వసూలయ్యే పన్నులలో వాటా నిర్ణయిస్తారు. అదే వారి ఆదాయం.’’
‘‘తమరు పాలనాపగ్గాలు చేపట్టి అన్ని నియోగా లను పరిశీలిస్తే పూర్త్తి అవగాహన వస్తుంది. అదే మా విన్నపం.’’
తల పంకించాడు గణపతి. తర్వాత సంభాషణ పొడిగించకుండా మౌనంగా ఉండిపోయాడు. చేసేది లేక వాళ్లు వెళ్లిపోయారు.
దీర్ఘంగా ఆలోచిస్తూ చేతులు వెనక్కు కట్టుకుని నడుస్తూ కనిపించిన మొదటి దౌవారకుడ్ని అడిగాడు గణపతి.
‘‘నీ పేరేమిటి?’’ తల వాల్చుకుని వడివడిగా వెళుతున్నవాడు ఉలిక్కిపడి లిప్తకాలం ఎవరినో అన్నట్లు వెనక్కు ముందుకు చూసి మహారాజు తననే చూస్తుండటం గమనించి.. అడుగుతున్నది తననే అని గుర్తించి స్థాణువై నిలబడి పోయాడా దౌవారికుడు.
‘‘నిన్నే.. చెప్పు. అడిగింది చక్రవర్తి.’’
‘‘క్షమించండి ప్రభు.. నాపేరు రౌరవయ.. ప్రభు’’
‘‘ఈ.. నీ వేతనం ఎంత.. మాసానికే కదా పంపిణి చేసేది?!’’
వాడు మళ్లీ బిక్కచచ్చిపోయాడు.
‘‘ఔ ..ఔ.. ఔను ప్రభు. మాసానికి పది కార్షాపణాలు. వర్షానికి రెండు తూములు ధాన్యం..’’
జవాబు లేదు. వాడు తలెత్తి క్రీగంట చూశాడు. చక్రవర్తి గారు వ్రేళ్లపై లెక్కలు వేస్తున్నాడు. వాడు మెల్లగా పిల్లిలా కదిలి మాయమయ్యాడు.
అది మొదలు.. రాజప్రాసాదంలో కనపడిన ప్రతివాడిని.. ప్రతి ఉద్యోగిని.. ఒకే ప్రశ్న, ‘‘నీ వేతనం ఎంత?’’
ఎవరు ఆశ్చర్యపోయినా.. తల్లులు, భార్య, రుద్రయ, గంగాధరమంత్రి.. లాంటి పెద్దలందరూ నోరు తెరచి ఉండిపోతున్నారే గాని ఓ మహామండ లేశ్వరుడు ఇలాంటి ప్రశ్నలు అడగరాదు అని అనడం లేదు. కాని మండలేశ్వరుడు ఎవ్వరూ ఇలా అడగడం వాళ్ల ఎరుకలో లేదు.
చివరగా, రాజ్యప్రధాన గణికుడు మహాసంప్రతిని అడిగాడు.
‘‘మొత్తంగా మాసానికి వేతనాల వ్యయం ఎంత.. వర్షానికి అంటే ఏడాదికి ఎంత.. చెప్పండి మహా సంప్రతి గారూ..!’’
ఆయన కొత్త అంటువ్యాధి సోకిన కోడిలా కంగారుతో ఊగిపోయాడు కాని వెంటనే చెప్పలేక పోయాడు. అప్పుడన్నాడు గణపతిదేవుడు, ‘‘నేను చెప్పనా??’’
సంప్రతి ఏదో సణిగాడు కానీ చెప్పలేనట్లు ఆయన ముఖం పాలిపోయింది.
గణపతిదేవుడు చెప్పబోయాడు కాని అప్పుడే అంతఃపుర పరిచారిక మహావేగంగా వచ్చి, ‘‘శుభవార్త మహారాజా.. పెద్దమ్మగారు తమరికి తెలియజేయ మన్నారు..’’ అంటూ ఓ వార్త ప్రకటించింది.
సంప్రతి ఆనందంతో వెర్రికేక వేయగా గణపతిదేవుని ముఖంలో రకరకాల భావనలు కదలాడి అంతిమంగా ఓ ఆనంద భావన అతని ముఖంలో నుండి పోలేక నిలిచిపోయింది.
ఆమె ప్రకటించిన వార్త: ‘‘తమరు తండ్రి కాబోతున్నారు!!’’
* * *
దేవగిరి రాజప్రాసాదం..
రాజప్రాసాదం ముందు పరివారంతో తరలి వచ్చిన కాకతీయ మహారాజు గణపతిదేవుని పల్లకి ఆగింది. అప్పటికే దేవగిరి మహారాజు జైత్రపాలుడు, పట్టపురాణి చిల్లాదేవి, యువరాజు సింఘణదేవ దంపతులు, ఇతర యువ రాజులు, ప్రధాన పరిపాల కులు, మహామంత్రులు, సేనాధ్యక్షులు.. అంతా గణపతిదేవ దంపతులకు అఖండ స్వాగత మిచ్చారు. తల్లి కాబోతున్న తమ ఆడపడుచు పట్ల సేవుణ రాజవంశం, కుటుంబం, ప్రభుత్వం ఆప్యాయతతో మురిసిపోతూ లోపలికి ఆహ్వానించారు.
తాను దేవగిరికి అల్లుడయినా.. జైతుగి కాళ్లు కడిగి కన్యాదానం చేసినా.. వివాహానంతరం అందరూ శత్రుత్వం మరచి గణపతిదేవునికి పూర్తి స్థాయి అతిథిమర్యాదలు జరిపి.. అనేకానేక బహుమతులతో ఆడపడచునిచ్చి అనుమకొండకు పంపారు. అయినా తాను ఇక్కడ బందీగా ఉన్నానన్న సంగతి ఎప్పుడూ గణపతి మర్చిపోలేదు. మళ్లీ మళ్లీ దేవగిరి వెళ్లడం ఆతనికి ఏమాత్రం ఇష్టం లేదు.
కవ్వల.. ఆమె గుర్తొస్తే గుండె బరువెక్కుతుంది. ఇప్పుడామె తన ప్రేయసి అనే భావన కంటే తన వల్లనే చనిపోయిన ఓ అమాయకురాలైన ఆడపిల్లగా అతనిలో మనోఫలకం మీద నిలిచిపోయింది. తను ప్రక్కన ఉండగానే ఆ అమాయకురాలిని అతి దారుణంగా చంపేశారు.. అది మరింత బాధాకరం గణపతికి.
అది ఎవరో.. ఎందుకు చంపవలసివచ్చిందో.. తెలుసుకోవాలి!!
చిన్న ఆశతో సోమలదేవిని ఆమె పుట్టింట దించడం అనేది ఓ మిషగా దేవగిరిలో మరో మారు కాలుపెట్టాడు.
ఈ ముచ్చట తెలిసిననాడు అంతఃపురం పరవశించిపోయింది. అమ్మలు అయితే చెప్పనక్కర లేదు వాళ్ల ఆనందం. రాజప్రాసాదం కూడా మురిసి పోయింది. పట్టాభిషిక్త మహారాజుగారి భార్య.. పట్టపురాణి గర్భవతి కావడం రాజకుటుంబాలలో నిజంగా పండుగరోజు.
లేలేత యువకుడైన గణపతి అర్ధంకాని ఓ మహాదానంద సందోహ తరంగాలలో తెలియాడాడు. క్రమంగా సోమలదేవిపై పేరుకున్న మంచు లాంటి చెడ్డ అభిప్రాయం ఆ నీరెండలాంటి సంతోషపు వెచ్చదనంతో మెల్లమెల్లగా.. కాదు హఠాత్తుగా కరిగిపోయింది. కవ్వల అతని గుండెకు బంధం కావచ్చు కాని అతడు సోమలను బాధపెట్టాలనుకో లేదు. ఆమె తాను భార్యను అనే అధికారంతో బలిష్టంగా తనను ఆక్రమించుకోవడం.. అందువల్లనే తను కూడా విధిలేక సహకరించడం.. ఫలితం.. తను తండ్రి కావడం కావచ్చు కాని తను తండ్రి కావడం ఆమె వల్లనే అనే ఓ అనుబంధ మధురోహ అతనికో మనోహరమైన తృప్తిని మిగిల్చింది.
దేవగిరి కోటలో.. రాజప్రాసాదంలో ఒంటరిగా తిరుగాడాడు గణపతి. అక్కడ తను.. దాదాపు సంవత్సర కాలం గడిపిన కారాగారం.. రాజప్రసాదం లోపలి కారాగారం లాంటి గది. అక్కడ తనకు నిత్యం కనపడీ కనపడ కుండా కాపాడిన నాగతిస్య.. అక్కడినుండి ఆ నడవా వెంట వెళితే ఆ బయలు ప్రదేశం.. వ్యాయామశాల.. అశ్వ శిక్షణశాల, అప్పటి సంఘటనలు.. కవ్వల.. కేయూర..
అవును.. కేయూర? కేయూర ఏమైనట్లు?
పెళ్లిసంబరాల వద్ద కూడా కనపడలేదు. తను మహారాజు అయితే అతనికి తగిన గౌరవం, హోదా, స్థాయి ఇవ్వమని అడిగిన బంగారు మిత్రుడు.. ఏమైనట్లు.. ఎవరు ఏమి చేశారో.. కవ్వల కోసం వెళ్లిన పెళ్లి మండపంలో కనపడ్డాడు చివరిసారి. ఏదో చెప్పాడు.. జాగ్రత్త అని హెచ్చరించాడు. ఏం చెప్పాడు.. కవ్వల పిచ్చితో కన్నూ మిన్నూ కానక తిరుగుతున్న తనను హెచ్చరించడం గుర్తొచ్చింది.. ఆమెను సింఘణ కోరుకుంటున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను తల్లిదండ్రుల వద్ద ప్రకటించినట్లు కదూ కేయూర చెప్పింది?!
అయితే.. అయితే..??
సింఘణే చంపించి ఉంటాడు!!
ఈ కొత్త తలంపుతో చెమట బిందువు జుట్టు నుండి కారి చెంపను తాకింది.
ఆ రాత్రి యువరాజు సింఘణదేవుని కలిశాడు.
సోమల వివాహం అనంతరం దేవగిరి రాజ్యంలో, సేవుణ వంశంలో వెంట వెంటనే చాలా మార్పులు జరిగాయి. హఠత్తుగా జైత్రపాలుడు అస్వస్థుడయ్యాడు. గుండె బలహీనపడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన వెంటనే సింఘణ వివాహం జరిపించి అతన్ని యువరాజుగా ప్రకటించి, అనంతరం మిగిలిన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు కూడా చేసేసి నిశ్చింతగా మంచమెక్కి ఉన్నాడు.
గణపతిని కలిసినప్పుడు కాబోయే మహారాజైన సింఘణదేవుడు మహా ఆనందంలో హత్తుకున్నాడు. గణపతి నిర్ఘాంతపోయాడు. అప్పట్లో వ్యాయామ శాలలో సేవణ యువకులంతా గణపతి ప్రతిభను గుర్తించి వెంట తిరుగుతున్న రోజుల్లో సింఘణదేవుడు గణపతి పట్ల అంటీ ముట్టనట్లుండేవాడు.
అలాంటిది ఇప్పడు బావమరిదిగా, అభిషిక్త యువరాజుగా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముచ్చట్లు చెబుతూ ఆలింగనం చేసుకుని బావగారూ అంటూ వెంట నడుస్తుంటే గణపతి చకితుడయ్యాడు. అప్పట్లో కొంత బిడియంగా దూరంగా ఉన్నా ఇప్పుడు అతని మాటలు, గౌరవం, ప్రవర్తన చూస్తుంటే కవ్వలను చంపించేటంత దుర్మార్గం అతనిలో లేదనిపించింది. సందేహాలు లోపలే ఉంచుకుని అతనితో కబుర్లు చెప్పాడు గణపతి.
మరోరోజు కోట లోపల ఇతర భవనాలు.. ఆరోజు వివాహం జరిగిన ప్రాంగణం, చుట్టూ ఉన్న్న వివిధ భవనాలు, ఆ అర్ధరాత్రి కాకతీయుల మెరుపు దాడి వల్ల తగులబడిన భవనాలు.. చూస్తూ చూస్తూ.. ఏదో భవనాన్ని వెదుకుతూ వెదుకుతూ పోతుంటే.. అప్పుడు కనబడింది.
గుర్తించాడు.. అదే.. ఆ భవనమే.. కొట్టారువు గిడ్డంగి.. శిథిల కోష్టాగారం!
ఆగిపోయాడు. అవతలగా కారాగార భవనాలు.. ఈవలగా ఈ భవనం.. అవును ఇదే.. ఇక్కడే తామిద్దరూ తొలి యవ్వనోల్భణంతో రెండుశరీరాలు అణువణువూ స్పృశించడంతో ఆ స్పర్శ సుఖాన్ని అనుభవంలోకి తీసుకున్న రాత్రి.. ఇక్కడే.. ఆ మైమరపు పల్లవిస్తుండగానే.. మరి కొన్నినిమిషాల అనంతరం ఆమె.. ఖండఖండాలుగా..
నడుస్తున్నవాడల్లా ఆగిపోయి చటుక్కున వెనుదిరిగాడు.
ఎవరో తనను చాటుగా అనుసరిస్తున్నట్లు.. చురుగ్గా చూస్తూ అటూ ఇటూ పరుగులు పెట్టాడు. ప్చ్. ఎవ్వరూ కనపడలేదు. కేవలం వస్తూ పోతున్న పరిచారికలు, భటులు.. ఇతర పనివాళ్లు.. సాధార ణంగా అంతా తల వొంచుకుని పోతుంటారు. అలాగే పోతున్నారు. ఎవ్వరిమీదా సందేహం కలగలేదు.
తిరిగి రాజప్రాసాదం లోపలికి వెళ్లబోతూ గతంలో కవ్వలను కలిసిన పెళ్లిమండపం వైపు దృష్టి పోయింది.
అక్కడ కనపడిన వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు.
మహాదేవుడు!! మూడవ బావమరిది. అక్కడి నుండే గణపతి కదలికలు పరిశీలిస్తున్నాడు.
గణపతి చూడటం గుర్తించి నవ్వుతూ చేతులు ఊపాడు. వేగంగా దగ్గరకొచ్చాడు.
అతనేదో అనబోయేలోగా గణపతి అడిగాడు, ‘‘మహాదేవా.. ఏవిటి.. అక్కడ? ఏమి చేస్తున్నావ్??’’
‘‘మా రెండో తాతగారి మూడో అబ్బాయి జ్యేష్ఠ కుమార్తె వివాహం బావగారు. మండప అలంకరణ నాకు పురమాయించారు తండ్రిగారు. ఏవిటి కోట అంతా తిరుగాడుతున్నారు? పాత జ్ఞాపకాలు.. తిరుగాడిన ప్రదేశాలు.. చూస్తున్నారా?!’’ అన్నాడు చనువుగా.. ఆహ్లాదంగా.
అప్పట్లో తనవెంట అతి సామీప్యంలో ఉండే వాడు మహాదేవుడు. అందుకే అతనంటే గణపతికి కాస్త అభిమానం జాస్తి. కాబట్టి సందేహం నాస్తి!!
పదిరోజులుండి తిరుగు ప్రయాణమయ్యాడు గణపతిదేవుడు.
మళ్లీ రాజప్రాసాదమంతా వీడ్కోలు చెప్పింది.
సోమలను వదలలేక వదిలాడు గణపతి. తుది వీడ్కోలు వేళ ఆమె కనుకొలుకులలో కదలాడిన బాష్పాలు చూసి విచలితుడయ్యాడు. ఆ తడికన్నులతో ఆమె చూసిన చూపులు తిరిగి అనుమకొండ వెళ్లే వరకూ దారి బత్తెంగా.. దారంతా పూలు పరచినట్లు!
* * *
‘గురిందల స్థల’ సమయశెట్టి, మహాజనుల సమావేశం.
ఆ భవనం కిటకిటలాడుతోంది. మందిరం అంతా మెత్తని ఓరుగల్లు తివాసీలు పరచి ఉన్నాయి. వాటిపై బాసింపట్టు వేసుకుని కూర్చుని అందరూ ముచ్చట్లు చెప్పుకోసాగారు.
ప్రతిగ్రామంలో ప్రతి వృత్తికి ఓ శెట్టి ఉంటాడు. అంటే ఆ వృత్తి నాయకుడన్నమాట. అలా ఆ గ్రామంలోని అన్ని వృత్తుల నాయకులతో ఏర్పడిన సంఘమే సమయం. దీనికి మళ్లీ ఓ శెట్టి ఉంటాడు. అతడే ఆ గ్రామ సమయ శెట్టి. అతని మాటే శాసనం. అందరూ పాటించి తీరాలి. అది కట్టుబాటు.
‘మహాజనులు’ అంటే గ్రామంలో బ్రాహ్మణుల సమయం.
ఈ రోజు ఇక్కడ దాదాపు వందమంది గ్రామ సమయశెట్టిలు, దాదాపు అంతేమంది మహాజన పెద్దలు సమావేశమయ్యారు. సమావేశ నిర్వాహకుడు మంచి భట్టోపాధ్యాయుడు చాలా హడావిడిగా ఒక్కొక్కరి ముఖాలు చూసి గుర్తిస్తూ పలుకరిస్తూ ఆహ్వానం పలుకుతూ ఎవరెవరు వచ్చారో ఓ అంచనాకు వస్తున్నాడు.
‘‘ఇంకా ఎవరు రావాలి భట్టూ! సమావేశం ప్రారంభించు మహానుభావా!’’ అన్నారెవరో.
సభంతా ఘోల్లున నవ్వులు. ఆ నవ్వుల మధ్య మంచిభట్టు ముందువరుసలో కూర్చున్న ఓ వ్యక్తి వద్ద ఆగి ఆయనను ప్రసంగించవలసినదిగా కోరాడు. ఓ స్పురద్రూపి లేచి నవ్వుతూ అందరిని కలయజూశాడు. ఆయన కనిపించగానే అందరూ మందస్మితంతో ఆయనను తేరపారి చూడసాగారు. ఆయన ఆహార్యం సమున్నతంగా ఉంది. ఆయన బ్రాహ్మణుడేమో అన్నట్లున్నాడు. కాని పూర్తి బ్రాహ్మణ ఆహార్యంలో లేడు. క్షత్రియుడేమో అన్న ట్లున్నాడు కానీ క్షత్రియుడు కాదు. శూద్రునిలా ఉన్నాడు కాని శూద్రుడు కాదు. మొత్తంగా ఓ సాధారణ పౌరునిలా కాక.. అసాధారణ పౌరునిలా అందరూ చేతులెత్తి నమస్కరించేలా ఉన్నాడు.
శ్రీ రమణీ గృహాంగణము చెన్ను వహింప నలంకరింపగా / దోరణముం ప్రదీపమును దోహలి యై యొడుగూర్చే నాదగం
జేరి యురంబు నందు దులసీవనమాలయు గౌస్తుబంబు నో / ప్పారగ నుల్లసిల్లు హరి యన్నమ తిక్కని ధన్యుజేయుతన్
(లక్ష్మీకాంత చక్కగా అలంకరించిన గృహ ప్రాంగణానికి తోరణంగా తులసిమాల.. గృహంలోని దీపంలా మెడలో కౌస్తుభమణి కలిగిన శ్రీహరిలా ప్రకాశిస్తున్న మన అన్నమాంబ పుత్రుడు తిక్కన ధన్యుడు కదా!)
సభలో ‘ఆయనే తిక్కన’..‘తిక్కనార్యుడు’.. ‘తిక్కన పండితుడు’.. ‘తిక్కన మహామాత్యుడు’.. ‘తిక్కన సోమయాజి’.. ‘హరిహర తత్త్వవేత్త తిక్కనయ్య’.. తలోమాట గుసగుసగా అంటూ ఆయనవైపు చేతులెత్తి నమస్క రిస్తున్నారు.
తెలుగుభాష సామ్రాజ్య స్థాపించాల్సిన సమయం ఆసన్నమైనదని గుర్తించి మొదట ప్రకటించిన వాడు తిక్కనార్యుడు. అందుకు తగిన ప్రాతిపదిక ఏర్పరచడానికి నడుం కట్టవలసినవాడు కూడా తానేనని భావించి తెలుగు రాజ్యాలన్నీ విసృతంగా పర్యటిస్తూ తన భావాలను అంగీకరించిన మిత్రులతో ప్రచార బృందాలను ఏర్పాటు చేసుకుంటూ అవిశ్రాంతంగా సాధారణ సమాజంలోకి చొచ్చుకుపోతున్నాడు.
మాట్లాడటానికి సిద్దమైన ఆయన గొంతు సవరించుకున్నాడు. అంతా నిశ్శబ్దం.
‘‘తెలుగుజనులారా.. నా పేరు తిక్కన. నేను తెలుగువాడిగా పుట్టినందుకు.. సంపూర్ణమైన, స్వచ్చ మైన తెలుగుభాష మాట్లాడుతున్నందుకు గర్విస్తున్నాను. నేను విక్రమసింహపురం నుండి వచ్చాను. ఎప్పుడో అనాది నుండే తెలుగుభాష ఉంది, ప్రాకృతంలోనే తెలుగుమాటలున్నాయి, ఆరవ శతాబ్దిలోనే ఆ మహా రాజెవరో తెలుగులోనే శాసనం వేశాడు. ఎప్పటినుండో తెలుగులో పాటలున్నాయి. నృత్తాలున్నాయి. గాసట బీసట రచనలున్నాయి.. మౌఖిక సాహిత్యముంది.. లిఖిత సాహిత్యం కూడా ఉంది. ‘మా తాతగారి భోషాణప్పెట్టే నిండా ఆయన రాసిన తాళపత్ర గ్రంథాలున్నాయి..’ అని చాలామంది నాతో చెబుతుంటారు. అలాంటి మాటలు ఎప్ప టినుండో నేను వింటున్నాను. అన్ని నిజమే.
కానీ మనమంతా ఇప్పుడు ఇక్కడ స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి. అదేమంటే ఇప్పుడు ఈ కాలానికి స్వచ్ఛమైన తెలుగుభాష జన జీవనంలో పూర్తిగా ఎదిగి ప్రతి పండితుని, ప్రతి వణిజుని, ప్రతి సాధారణ గ్రామీణుని నాలుకపై కూడా నడయాడుతోంది. కాబట్టి మన రాజ్యం తెలుగురాజ్యం. ఇప్పటివరకు అన్ని కలగూరగంపలా సంకర భాష, సంకర పాలన, సంకర జీవితాలు మనవి. వొద్దు.. చాలు!! రాచరిక వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, సామాజిక జీవన చట్రం మూడు పూర్తిగా తెలుగు భాషా పూరితం అయ్యాయి. ఇక మన భాష.. మన జీవనం.. మన ప్రభుత్వం.. సమస్తం తెలుగుమయం కావాలి. ఇంతకాలం మనం మరచిపోయిన లేదా వాడుకలోలేని మన జాతి పదం ఆంధ్రం. మనం ఆంధ్రులం. అంధ్రులం.. నేను తెలుగుచేస్తున్న భారతం కూడా మహాంధ్రభారతం. ఆంధ్ర శబ్దమే ముందు. ఎప్పుడో మౌర్యసామ్రాజ్య కాలానికే ఆంధ్రులకు ముప్పై కోటలున్నాయని అందరికి తెలుసు. ఆ గ్రీకువాడెవరో రాశాడు కూడా.’’
అందరూ అక్షరం కూడా కోల్పోకూడదన్నట్టు చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ఆయన మాటల్లో ఒక్క కన్నడ మాట, ఒక్క తమిళ మిశ్రమ పదం దొర్లకపోవడం, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో ఆయన మాట్లాడటం వారందరినీ ఉత్సాహ పరుస్తోంది.
అందరిని స్పందనను పరకాయించి చూస్తూ.. గుర్తిస్తూ తన వాదనను చెబుతున్నాడు తిక్కనార్యుడు.