భూగోళం మీద ప్రతి దేశాన్ని మృత్యుభయంతో నింపినదే కొవిడ్‌ 19. ఒక చిన్న క్రిమితో ప్రపంచదేశాలన్నీ యుద్ధం చేశాయి. ఆదిలో ఔషధమనే ఆయుధం లేకుండా వైద్యులు యుద్ధం చేశారు. ప్రపంచమంతా రణరంగమైంది. మనుషులు పిట్టల్లా రాలిపోవడం అంటే ఏమిటో చరిత్ర చూసింది. కరోనా మృతుల ముందు రాలిన కన్నీటి చుక్కలకీ వైరస్‌ అం‌టుకుంటుందేమోనన్నంత వెరపు. కార్యాలయాలు, కర్మాగారాలు, పాఠశాలలు, మైదానాలు బూజుపట్టాయి. ప్రపంచంలో చాలా చోట్ల వినిపించిన మంత్రం-లాక్‌డౌన్‌. ‌చేతులు కడుక్కోవ డమూ, శానిటైజర్‌ ‌పూసుకోవడమూ ఇదే అందుబాటులోని మందయింది. కషాయాలూ, ఆయుర్వేద గుళికలు ప్రాణదాతలయ్యాయి. తరువాత పీపీఈ కిట్లు, ఆపై వ్యాక్సిన్‌ల వెనుక దాక్కొంది లోకం. మొత్తానికి ప్రకృతి ప్రకోపిస్తే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమని రుజువు చేసి వెళ్లింది కరోనా. ఇదంతా ఆరేళ్ల క్రితం. కరోనా ఏం నేర్పింది? మనం ఏం నేర్చుకున్నాం?

కరోనా నుంచి మనిషి నేర్చుకుని తీరాలి. ప్రపంచంలో దాదాపు 71 కోట్ల మందికి వైరస్‌ ‌సోకింది. 71 లక్షల మంది చనిపోయారు. అరవై కోట్ల మందిపైగా కోలుకున్నారు. ఎలాంటి ఔషధం లేదని కరోనా పుట్టిన తరువాత తెలిసింది. కొత్త వ్యాక్సిన్‌ ‌కోసం అన్వేషణ సాగుతుండ గానే అన్ని లక్షల మంది కన్ను మూశారు. నమోదు కాని మరణాలు ఎన్నో ఉండవచ్చు.

కొవిడ్‌ 19 ‌మహమ్మారి లేదా కరోనా వైరస్‌ ‌తొలి కేసులు అధికారికంగా డిసెంబర్‌ 31, 2019‌న చైనాలో నమోదయ్యాయి. కానీ నవంబర్‌లోనే అక్కడే ఈ వైరస్‌ ‌లక్షణాలు ఉన్నవారు కొద్దిమంది ఆసుపత్రులలో చేరారు. ఆ డిసెంబర్‌లోనే చైనాలోని వూహాన్‌ ‌పట్టణంలో ఉండే శాస్త్రవేత్త లీవెన్‌లియాంగ్‌ ఒక చర్చా కార్యక్రమంలో కొందరు ఒకే వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులలో చేరారని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలోని వూహాన్‌లో కొన్ని న్యూమోనియా కేసులు నమోదైనట్టు ప్రకటించినప్పటికీ జనవరి 7, 2020న చైనా అధికారులు వాటికి కరోనా వైరస్‌ ‌కేసులని పేరు పెట్టారు. ఇది జరిగిన కొన్ని వారాలకే కొవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచాన్ని శరవేగంతో ఆక్రమిస్తున్నదని ఆ జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ పిడుగు వంటి వార్తను ప్రపంచం మీద విసిరింది. ఇది జరిగిన కొన్ని వారాలకు మాత్రమే అంటే ఫిబ్రవరి 11, 2020న ఆ అంటువ్యాధికి కొవిడ్‌ 19 (అసలు పేరు సార్స్-‌సీఒవి-2 కరోనా వైరస్‌) అని పేరు పెట్టారు. ఇది చైనాలో పుట్టినప్పటికీ తొమ్మిది రోజుల తరువాత ఫిబ్రవరి 20న అమెరికా సెంటర్స్ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌ అం‌డ్‌ ‌ప్రివెన్షన్‌ (‌సీడీసీ) తమ దేశంలో కొవిడ్‌ 19‌తో ఒక వ్యక్తి మరణించినట్టు ప్రకటించింది. యాభయ్యో పడిలోని ఆ వ్యక్తి వాషింగ్టన్‌కు చెందినవాడు.

కొవిడ్‌ ‌పేరు వినపడింది గాని, అది ఎలా విస్తరిస్తుంది, జనజీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయాల మీద ప్రపంచ దేశాలకు, ఆరోగ్య సంస్థలకు అవగాహన లేదు. కొవిడ్‌ 19‌ను ఎదుర్కొనే చర్యల కోసం మార్చి 1,2020న ఐక్య రాజ్య సమితి 15 మిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లు విడుదల చేసింది. ఇది జరిగిన ఒక్క వారానికే అంటే మార్చి 7 నాటికే కేసుల సంఖ్య లక్షకు చేరింది. మార్చి 11న కొవిడ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారి (అంటే ప్రపంచాన్ని చుట్టబెట్టే అంటువ్యాధి)గా ప్రకటించారు. ఇటలీలో మార్చి 12-13 మధ్య ఒక్కసారిగా 250 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు. అదే రోజు అమెరికా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

మనుషుల మధ్య దూరం ఉండాలన్నారు. చేతులు కడుక్కోమన్నారు. అయితే ఇవి వైరస్‌ ‌వ్యాప్తిని కాస్త తగ్గించగలవు. ఈ మహా విపత్తును అధిగమించాలంటే వ్యాక్సిన్‌తోనే సాధ్యమని శాస్త్రవేత్తలకు వెంటనే అర్థమయింది.మార్చి 17,2020న వ్యాక్సిన్‌ను కనుగొనే క్రమంలో తొలి ప్రయోగం జరిగింది. దాని పేరు మోడెర్నా ఎంఆర్‌ఎన్‌ఏ ‌వ్యాక్సిన్‌. ‌మనుషుల మధ్య దూరం, లేదా చేతులు తరచు కడుక్కోవడంతోనే మహమ్మారిని నివారించలేమని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రజలెవరూ ఇల్లు వీడి రావొద్దని మార్చి 26న యూకే ప్రకటించింది.అదే సమయంలో పలు ఐరోపా దేశాలు తమ అనుకూలతలను బట్టి లాక్‌డౌన్‌లు ప్రవేశపెట్టాయి. ఏప్రిల్‌ 2, 2020‌కి కొవిడ్‌ ‌కేసులు ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలకు చేరాయి. దీనితోనే ప్రపంచంలో వణుకు మొదలైంది. వ్యాక్సిన్‌ ‌వచ్చే లోగా తాము ఏం చేయవచ్చునో అన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రారంభించాయి.అప్పుడే ఏప్రిల్‌ 6‌న ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్క్ ‌ధారణను ప్రవేశ పెట్టింది. తీసుకున్న జాగ్రత్తలతో ఆ వేసవిలో మహమ్మారి కాస్త శాంతించి నట్టే కనిపించింది. ఆసుపత్రులకు వచ్చే కేసులు తగ్గాయి. కానీ వర్షాకాలం ఆరంభంలో అంటే ఆగస్ట్‌లో లాంబ్డా వేరియంట్‌ ‌రంగ ప్రవేశం చేసింది. దీనిని మొదట పెరూ దేశంలో కనుగొన్నారు. అప్పటికే అది 29 దేశాలకు వ్యాపించినట్టు కనుగొన్నారు.

సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో అల్ఫా వేరియంట్‌ ‌బయటపడింది. మళ్లీ కేసులు విజృంభించాయి. సెప్టెంబర్‌ 29 ‌నాటికి పది లక్షల మంది రాలిపోయారు.

వ్యాక్సిన్‌ల పరిశోధన పని చాలా ప్రగతి సాధించింది. నవంబర్‌ 9 ‌నాటికి ఫైజర్‌, ‌బయోఎన్‌టెక్‌ ‌వ్యాక్సిన్లు 90 శాతం ప్రభావవంతమైనవని రుజువైంది. మోడర్నా కూడా ప్రభావవంతమైనదని తరువాత వెల్లడైంది. నవంబర్‌ 23‌న యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్ ‌రూపొందించిన ఆస్ట్రాజెనికా కొవిడ్‌ 19 ‌వ్యాక్సిన్‌ ‌కూడా ప్రభావవంతమైనదని తెలిసింది.

ఆ డిసెంబర్‌లోనే భారత్‌కు ప్రత్యేకంగా పిడుగులాంటి వార్త వినిపించింది. డెల్టా వేరియంట్‌ ‌పేరుతో కొత్త వైరస్‌ ‌భారత్‌లోనే బయటపడింది. విస్తరించడంలో ఈ వేరియంట్‌కు ఉన్న వేగాన్ని బట్టి చాలా దేశాలు మరొకసారి లాక్‌డౌన్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.

డిసెంబర్‌ 31, 2020‌న ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగం కోసం ఫైజర్‌, ‌బయోఎన్‌టెక్‌ ‌వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ విధంగా కొవిడ్‌ 19 ‌వాక్సిన్‌ ఇక అందరికి అందుబాటులోకి వస్తుందన్న భరోసా వచ్చింది. ఏప్రిల్‌ 27, 2021 ‌నాటికి ఒక బిలియన్‌ ‌డోసులు అందచేశారు.

భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30, 2020న కేరళలోని త్రిశ్శూర్‌లో నమోదయింది. వూహాన్‌లో వైద్యశాస్త్రం చదువుతున్న ముగ్గురు భారతీయ విద్యార్థులు అక్కడ నుంచి తెచ్చారు. కేరళలో మొదటిగా లాక్‌డౌన్‌ను మార్చి 23 ప్రకటించారు. దేశమంతటా మార్చి 25 నుంచి అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదైన రెండవ దేశం (అమెరికా తరువాత) భారత్‌. ఇక్కడ 45,056,126 కేసులు అధికారికంగా నమోదైనాయి. 5,33,847 మృతుల సంఖ్యతో అమెరికా, బ్రెజిల్‌ ‌దేశాల తరువాత కరోనా మరణాలో భారత్‌ ‌మూడవ స్థానంలో ఉన్నది. రెండో వేవ్‌ ‌మార్చి 2021న మొదలయింది. ఏప్రిల్‌ 30, 2021‌వ తేదీ భారత్‌ను గడగడలాడించింది. ఆ ఒక్కరోజే (24 గంటలలో) నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో జనవరి 16,2021 నుంచి వ్యాక్సినేషన్‌ ‌మొదలయింది. ఆస్ట్రాజనికా (కోవిషీల్డ్), ‌దేశీయంగా తయారైన కోవాక్సిన్‌ ఇక్కడ ఇచ్చారు. జనవరి 30, 2022 నాటికి దేశంలో డెబ్బయ్‌ ‌కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఆరేళ్ల తరువాత ఆ రోజులను ఒక్కసారి మనసుతో మళ్లీ అంచనా వేద్దాం.


కూర్చుని ఆలోచిస్తే, ఆవేదన తన్నుకొస్తుంది.

జీవితంలో ఇన్ని రోజులు ఇంట్లో కూర్చున్నది లేదు. ఆలోచనలను కమ్మేస్తున్న అవేశం. అనగనగా అని అనడానికి అంత పాత విషయాలు కావు. అలాగని నిన్న గాక మొన్న అనడానికి అంత దగ్గర విషయాలూ కావు.

మనిషి ప్రతి చిన్న కదలికకు తాళం బిగించిన దృశ్యం మొదటిసారి కనిపించింది. కరోనా అనే చిన్న అణువు, ప్రపంచం మీద ఏకకాలంలో ఎర్ర జెండా ఎగరేసింది.

మనిషి ఎంతటి శక్తిమంతుడో, తెలివైన వాడో అని పొగుడుకుంటూ వస్తున్నా, ఒక్కసారిగా ‘లాక్‌డౌన్‌’ అనే పదం అతని దర్పాన్ని చెదరగొట్టింది. విమానాలు ఆగిపో యాయి, రైళ్లు స్తంభించాయి, బస్సులు బంద య్యాయి. అసలు కదిలితే కదా! వాహనాల చప్పుడు దాదాపు లేకుండా నిశ్శబ్ద చిత్ర దృశ్యాలు రాజ్యమేలాయి.

నేను పదవ తరగతిలో ఉండగా, నా భాగ్యనగరం ఎంతో బాగుండేది. నేను మాట్లాడుతున్నది 1981 సంవత్సరం, హైదరాబాద్‌ ‌గురించి. ఇంతా చేస్తే, గట్టిగా నలభై సంవత్సరాల వెనుకటి మాట. బడికి ఎప్పుడూ త్రాగునీరు వెంట తీసుకెళ్లడం తెలియదు. నల్లాలలోనూ స్వచ్ఛమైన నీరు త్రాగిన రోజులవి.

గతాన్ని తలచుకుంటే, నలభై ఏళ్ల క్రితం జీవితం ఎంత సాదా సీదాగా ఉండేదో గుర్తుకొస్తోంది. పచ్చని వాతావరణం, ప్రకృతిలో అన్నీ సహజంగా లభించేవి. పిల్లల ఆటలూ సహజసిద్ధమైనవే-గిల్లి డండా, కిత కిత, బంతిపోటు, అడ్డాంగోళి లాంటి ఆటలు ఆడుతూ మనం పెరిగాం. కానీ క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, కాలుష్యం పెరిగింది, సంబం ధాలు క్షీణించాయి, చివరికి కరోనా లాంటి మహమ్మారి మనపై దాడి చేసింది.

రోడ్లమీద అతి కొద్ది మందే ఉండడంతో, ఒంటరిగా నడవాలంటే భయం, సాయంత్రం ఏడు గంటలకే చాలా ఆలస్యమైందని భయపడేవాళ్లం. జనాభా అదుపులో ఉన్న రోజులు. పెద్దగా జాతి మత భేదాల గురించి అంతగా తెలీన రోజులవి. హిందువు అంటే గౌరవం, క్రిస్టియన్స్ అం‌టే అభిమానం, ముస్లిమ్‌ ‌లంటే సోదరులని చిత్తశుద్ధితో నమ్మిన రోజులవి. భారతీయులకి అందరినీ గౌరవించడం వెన్నతో పెట్టిన విద్య. అన్ని భాషల వారినీ ఆప్యాయంగా చూసేవాళ్లం.

స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అంటే మహా ప్రాణం.

దేవుడంటే భయభక్తులు, పురాణాలంటే నీతి కథలు, గురువంటే అపర సరస్వతి, గూగులే. ఇంకా, ఆనాడు, ఎవ్వరి దగ్గరా ఫోన్లు పెద్దగా ఉండేవి కాదు. కొద్ది మంది ఇళ్లల్లో ఉండేవి. పాల పాకెట్స్ అప్పుడే మొదలయ్యి, ప్లాస్టిక్‌ ‌ప్రపంచంలోకి విజృంభిస్తున్న రోజులవి.

అలాగే ఫ్రిడ్జి, టీవీ, ఏసీ ఇలాంటివన్నీ కొంత మంది ఇళ్లల్లోనే ఉండేవి. దూరదర్శన్‌ ‌చానల్‌ అం‌టే ఎంతో మమకారం, ప్రైవేట్‌ ‌ఛానెల్స్ ‌లేవు. రేడియో అంటే ఎంతో అభిమానం.

ఇంటికి ఒక్కరైనా అమెరికాలో స్థిరపడ్డ రోజులు అప్పుడే మొదలయ్యాయి.

చాలా మటుకు ఇండిపెండెంట్‌ ఇళ్లు, అతి కొద్దిగా ఫ్లాట్‌ ‌సిస్టమ్‌, అదికూడా ముచ్చటగా మూడు ఫ్లోర్లు.

మున్సిపల్‌ ‌నీరు, ఓవరహెడ్‌ ‌టాంక్‌ ‌లోకి అవే పంపయ్యేవి. ఎక్కడో మోటర్‌ ‌సిస్టమ్‌ ‌కూడా అరుదుగా చూసేవాళ్లం.

పిచ్చుకలు ఫ్యాన్‌ ‌కప్పులలో గూళ్లు కట్టుకునేవి.

మధ్యాహ్నం అందరూ పోస్టుమాన్‌ ‌కోసం ఎదురు చూసేవారు.

అతి కొద్ది కార్లు, ఒక మోస్తరుగా బజాజ్‌ ‌చేతక్‌ ‌స్కూటర్లు, ద్విచక్ర వాహనాలు, చాలా మటుకు సైకిల్స్ ఉం‌డేవి.

హోటళ్లు, మాల్స్, ‌పెద్ద పెద్ద సూపర్‌ ‌మర్కెట్స్, ‌ఫంక్షన్‌ ‌హాల్స్ ‌కూడా తక్కువే. రోడ్డుప్రక్క తిను బండారాలు అంటేనే చులకనగా చూసే రోజులవి. బ్యూటి పార్లర్స్, అప్పుడప్పుడే మొదలైన రోజులు. బొటీక్‌ అన్నపదం చాలామందికి తెలియదు.

పాశ్చాత్య అనుకరణ అప్పుడే మొదలయ్యిందని చెప్పవచ్చు.

మరి ఇన్నివిషయాలలో ప్రపంచం ఇంత త్వరగా మారిపోయింది. అంటే నలభై ఏళ్ల క్రితం లేని జనాభా సమస్య, నీటి కొరత, టెలిఫోన్స్ ఇం‌కా కమ్యూనికేషన్‌ అభివృద్ధి, వాహనాలు, సబ్‌ ‌వేస్‌, ‌రెస్టోరెంట్స్, ‌మాల్స్, ‌మెట్రో ఫ్లయ్‌ఓవర్స్, ‌కార్పొరేట్‌ ‌స్కూళ్ళు, ఆసు పత్రులు, ఆన్‌ ‌లైన్‌ ‌షాపింగ్‌, ‌జొమాటో, స్విగ్గీ, బ్లింక్‌ ఇట్‌ ఇం‌కా ఎన్నెన్నో.

ఇన్ని మార్పులు గట్టిగా నలభై ఏళ్లక్రితం నుంచి జరిగినవే కదా! వీటి వెనుక ఉద్దేశం, మనిషి సంతోషంగా జీవించాలనే కదా!

మరి మన అభివృద్ధిని తారుమారు చేసి, కనీ వినీ ఎరుగని రోగాలకు గురి అవుతున్నాం. చిత్ర విచిత్ర రోగాలతో, సతమత మయిపోయాము కానీ, కరోనాలాంటి భయంకరమైన పరిస్థితి మొదటిసారి ఎదురుకున్నాం. అదికూడా ప్రపంచం మొత్తాన్ని ఏకంచేసి, క్రుంగదీసి ప్రతీ మనిషినీ ఏకాకిని చేసేసింది.

కానీ… కరోనా నేర్పిన పాఠాలు ఎన్నెన్నో,

ఆరోగ్యం కన్నా గొప్ప సంపద లేదని తెలుసు కున్నాం. డబ్బు ఉన్నా, వైద్యం లభించని పరిస్థితులు చాలామంది ఎదుర్కొన్నారు. ఇంటివాళ్లతో గడిపే సమయం, అంతకు ముందు బిజీ జీవితంలో కుటుంబం మర్చిపోయాం. కరోనా ఆ పోకడని ఆపి, మనల్ని మళ్లీ కలిపింది.

మనిషి సహజంగా కలిసిమెలిసి జీవించేవాడు, కానీ ఈ వైరస్‌ ‌మనల్ని దూరంగా నెట్టేసింది.

స్వచ్ఛత, చేతులు కడుక్కోవడం, మాస్క్ ‌ధరించడం, శుభ్రతపై శ్రద్ధ పెట్టడం మన సంస్కృతిలో ఒక కొత్త అలవాటు అయిపోయింది.

సహజ వనరుల విలువ, లాక్‌డౌన్‌ ‌సమయంలో పక్షుల కిలకిలరావాలు, ఆకాశం నీలిరంగు, నదులు స్వచ్ఛంగా ప్రవహించడం అందరం గమనించాం. మనిషి కాళ్ల ముద్రలు తగ్గగానే ప్రకృతి ఎలా పునరుద్ధరించుకుందో చూశాం.

కరోనా ఒక రోగం మాత్రమే కాదు. అది ఒక సామాజిక విప్లవం. పెళ్లిళ్లు, వేడుకలు సాదాసీదాగా జరిగాయి. దూరపు బంధువులు వీడియో కాల్స్‌లోనే పాల్గొన్నారు. పాఠశాలలు మూతపడి, ఆన్‌లైన్‌ ‌విద్య ప్రారంభమైంది.

కార్యాలయాలు ఖాళీగా మారి, వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌సాధారణమైంది. పెద్ద పెద్ద ఉద్యోగ, వ్యాపార స్థలాలు జనాలు లేక, వెల వెలలాడిపోయాయి.

అంతేకాదు, ఆ సమయంలో వలస కార్మికుల కష్టాలు, ఆకలి బాధలు మనసును కలచివేశాయి. నడిచి వందల కిలోమీటర్లు వెళ్లిన వారి దుఃఖగాథలు చరిత్రలో నిలిచిపోయాయి. కమ్యూనికేషన్‌, ‌ఫోన్లు మన చేతిలోకి వచ్చి అన్నీ తెలుసుకుని బాధ పడే పరిస్థితి నుండి ఎవ్వరం తప్పించుకోలేక పోయాం.

గత నలభై ఏళ్ల క్రితం నుండీ మనిషి చేసిన కాలుష్యం, జీవజంతువులపై, భూమిపై, వాతా వరణంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందో తలచుకుంటే ఎంత, శోచనీయవిషయమో కదా!!

ప్రపంచంలో జరిగిన వాతావరణ కాలుష్యం, మనిషి విచ్చలవిడితనం, ఇంకా భయంకరమైన మార్పులతో భూమాతకు భారం అయిపోయామా!!

భూమి మీది ప్రతీ మనిషీ, వల వలా కన్నీరు కార్చి, తమ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన తరుణమిది కాదా మరి!

ఇన్ని రకాల సమస్యలు జనాభా అదుపు తప్పడం వల్లే కదా!

నిజంగా, మనం జనాభాని అదుపులో ఉంచు కుంటే, ఈరోజు కరోన మనలని ఇంత భయపెట్టేది కాదేమో! ఎంతమంది వారి కన్నవారిని, కన్నపిల్లలని, తోబుట్టువులని, బంధుబలగాన్ని, ఆత్మ బంధువులను కోల్పోయామో!

ఇంకా మనం, కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నాం. నాకు తెలిసిన గత ఇన్ని సంవత్సరాలలోనే ఇంత వినాశనం జరిగితే, మరి మరో నలభై సంవత్స రాలకి ప్రపంచం ఎటు పోతుందో ఊహించు కోటానికే సాధ్యం కాదు.

ఈనాడు అన్ని సదుపాయాలు, సంతోషకరమైన వాతావరణం కోసం, వాట్సాప్‌, ‌ఫేస్‌బుక్‌, ఎక్స్, ‌యాహూ, గూగుల్‌, ఇం‌కా ఎన్నెన్నో, కానీ ప్రేమలు లేని పలుకరింపులు, సంబంధం లేని బంధాలు, నటీనటులను మించిన నటనలు, ఎదిగేమా, నేలకి ఓరిగామా, ఆలోచించాలి మరి!

పిల్లల గురించి చెప్పుకుంటే, కరోనా కాలంలో వారంతా ఇంటికే పరిమితమయ్యారు. ఆడుకోవడం, స్నేహితులతో కలవడం, పాఠశాలలో గడిపే ఆ అనుభవం మొత్తం లేకపోవడం వల్ల వారి బాల్యానికి గణనీయమైన లోటు ఏర్పడింది. శారీరిక చలనం తగ్గిపోవడం, మొబైల్‌ ‌ఫోన్లు, టెలివిజన్‌, ఆన్‌లైన్‌ ‌తరగతులకే పరిమితమవ్వడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, అధికంగా ఆధారపడే స్వభావం పెరిగింది. ఆటపాటలతో కూడిన సహజ వాతా వరణం దూరమై, వారిలో సామాజిక నైపుణ్యాలు ఎంతో దెబ్బతిన్నాయి.

ఒక విధంగా చూస్తే మనల్ని మనం ప్రశ్నించుకో డానికే నాలుగు గోడలలో బందీలయ్యామే మోననిపిస్తుంది.

ఆర్థిక పరిస్థితిపై దెబ్బ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది.

పరిశ్రమలు మూతపడ్డాయి, చిన్న వ్యాపారులు అప్పుల్లో కూరుకుపోయారు. రైతులు తమ పంటను అమ్ముకోలేక ఇబ్బంది పడ్డారు. రవాణా లేక, పర్యాటకం మునిగిపోయింది.

ఇకపోతే, వైద్యరంగం, అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంది. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిజమైన దేవుళ్లుగా మారారు.

భావోద్వేగాలపై ప్రభావం వల్ల, ఇంట్లో నలుగురు ఉన్నా, ఒంటరితనం చుట్టుముట్టింది.

భయం, అనిశ్చితి, ఆందోళన, ఇవన్నీ మన మనసును వేధించాయి.

ఎప్పుడూ పరిగెత్తే మనిషి, ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల తన అంతరంగాన్ని పరిశీలించే అవకాశం లభించింది.

కొంతమంది ధ్యానం, యోగా, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటి మార్గాలలో శాంతిని వెతికారు.

కానీ మరికొందరు నిరాశ, డిప్రెషన్‌లో కూరుకు పోయారు.

మన మనుగడ కోసం మారాలి, లేకపోతే మరెన్ని కరోనా జబ్బుల బారిన పడాలో ఊహించుకొలేం. ప్రపంచం మొత్తం భారత దేశం కుప్పకూలిపోతుందని ఎదురుచూసిన తరుణంలో, భారతదేశం అన్నింటినీ ఎదుర్కొని, అగ్రరాజ్యాల స్థాయికి ఎదిగి, ఎన్నో దేశాలకు దిక్సూచిగా మారింది. ఎంతో గొప్పగా మందులను సహితం అందజేసి చేయూతగా నిలిచింది. ఈ విషయం భారతీయులుగా మనం హర్షించేదే అయినా మన తప్పులను కూడా తెలుసుకోవాలి.

కరోనా మనకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది.

మనిషి ఎంతటి శక్తిమంతుడైనా, ప్రకృతి ముందు బలహీనుడే.

అందుకే మనం చేయవలసింది, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ, స్థానిక ఆహారం, స్థానిక ఉత్పత్తుల వినియోగం, కాలుష్యంపై అదుపు, క్రమ శిక్షణ, అనాదిగా మనకున్న కట్టుబాట్లు.

చిత్తశుద్ధితో ఆలోచించి, ఆత్మశుద్ధి చేసుకునే తరుణమిది. కరోనా మహమ్మారి మన జీవన విధానంపై, మనసుపై, సమాజంపై చూపిన ప్రభావా లను మరింత లోతుగా వెళ్లి అర్ధం చేసుకోవాల్సిన అవసరం మనందరిది. మతం, రాజకీయాలు, మనసుల మధ్య దూరాలు, కరోనా మనల్ని విభజన చేసింది, మరో వైపు ఏకం చేసి చూపించింది.

మతం, జాతి పేరుతో నిందారోపణలు జరిగాయి. కానీ వైరస్‌ ఎవ్వరినీ వదలలేదు- ధనిక, పేద, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ ఎందరో అందరికీ ఒకే శిక్ష విధించింది.

ఇది ఒక సార్వత్రిక సత్యాన్ని, మనం అందరం ముందుగా మనుషులమేనని గుర్తు చేసింది.

కరోనాని అదిగమించాం, కానీ కలవర పరిచే మన చిత్ర విచిత్ర అలవాట్లు, మతం పేరుతో చేసే దారుణాలు, దేశం, ప్రపంచం, వాతావరణంలో కాలుష్యం. ఇవన్నీ మనం అరికట్టక పోతే, మనం ఏమై పోతామో, మన మనుగడ, భావితరాల భద్రత ఎటు పోతుందో ఆలోచించాల్సిన తరుణమిది.

 పిల్లలు, విద్య, మానవ మనస్తత్వంపై కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా కుదిపేసి, మనిషి జీవన విధానం, ఆర్థికవ్యవస్థ, విద్యారంగం, కుటుంబ సంబంధాలు అన్నిటిపై ప్రభావం చూపింది. ఇవన్నీ గమనించాలి.

విద్యారంగంలో కరోనా చేసిన మార్పులు విశేషంగా చెప్పుకోవాలి. పాఠశాలలు, కళాశాలలు మూతపడి ఆన్‌లైన్‌ ‌విద్య ప్రధానంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సదుపాయాలు లేక పోవడం వల్ల విద్యలో పెద్ద అంతరాయం ఏర్పడింది. పేద విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు లేక, ఇంటర్నెట్‌ ‌లేక పాఠాలు కోల్పోయారు. దీనివల్ల విద్యా అసమానతలు మరింత పెరిగాయి. మరోవైపు, ఆన్‌లైన్‌ ‌క్లాసులు కొనసాగించినా, ప్రత్యక్ష బోధనలో ఉండే అనుభవం, గురువుల సమక్షంలో ఉండి నేర్చుకునే పక్రియ లోపించింది. ఇది విద్యార్థుల మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపింది.

మానవ మనస్తత్వం విషయంలో కరోనా చేసిన మార్పులు గమనించదగ్గవే. అనిశ్చితి, భయం, ఒంటరితనం మనిషిని వదల్లేదు. చాలా మందిలో ఆందోళన, నిరాశ, భవిష్యత్తుపై భయం పెరిగింది. ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య భయం కుటుంబాలలో ఉద్రిక్తతలు పెంచాయి. చాలా మంది మానసికంగా బలహీనపడగా, కొందరు కొత్త మార్గాలను వెతికి పట్టుదలతో ముందుకు సాగారు. కరోనా మానవ సహనశక్తిని పరీక్షించింది.

కరోనా తర్వాత జీవితం కుంటుతూ మొదలై య్యింది.

క్రమంగా వ్యాక్సిన్లు వచ్చాయి, చికిత్సలు అభివృద్ధి చెందాయి.

ప్రజలు మళ్లీ బయటకు రావడం మొదలు పెట్టారు.

కానీ జీవితం పూర్వం లాగానే లేకుండాకొత్త నిబంధనలతో సాగింది.

మాస్క్ ‌మన జీవితంలో ఒక భాగమైంది.

హ్యాండ్‌ ‌సానిటైజర్‌ ‌జేబులో స్థానం సంపా దించుకుంది. పెద్ద సమావేశాలపై నియంత్రణలు వచ్చాయి. పెళ్లీపేరంటాలు కొత్త రకం మార్పులతో చక్కబడ్డాయి.

ఇంకా, మనం నేర్చుకోవలసినది చాలా ఉంది.

కరోనా మానవజాతికి ఒక హెచ్చరిక, ప్రకృతిని జయించలేవు, ప్రకృతిని గౌరవించు, సహజ సమ తుల్యతను కాపాడు, లేకపోతే మరిన్ని మహమ్మారులు వస్తాయని హెచ్చరించింది.

ప్రతి వ్యక్తి స్వీయ నియంత్రణ, సమాజం పట్ల బాధ్యత, భూమి పట్ల గౌరవం చూపాలి.

అప్పుడే భావితరాలకు సురక్షిత భవిష్యత్తు లభిస్తుందన్న గొప్ప సందేశాన్ని అందించింది.

చివరిగా,

అయితే, ఈ మహమ్మారి కొన్ని సానుకూల మార్పులను కూడా తెచ్చింది. కుటుంబ సభ్యులు కలిసి గడపడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, పరిశుభ్రతను అలవాటు చేసుకోవడం వంటి మంచి అలవాట్లు పెరిగాయి. విద్యలో సాంకేతిక వినియోగం పెరగడం వలన, డిజిటల్‌ ‌విద్య మరింత బలపడింది. మానసిక ఆరోగ్యం, ధ్యానం, యోగ వంటి విషయాలపై చైతన్యం పెరిగింది.

మొత్తానికి కరోనా మన జీవితాన్ని కొత్త దారుల్లో నడిపించింది. పిల్లల అభివృద్ధి, విద్యావిధానం, మానవ మనస్తత్వంపై దీని ప్రభావాలు దీర్ఘకాలం మనతోనే ఉండబోతున్నాయి. ఈ అనుభవం మనకు ఒక పాఠం నేర్పింది – ఆరోగ్యమే మహాభాగ్యం. మానసిక స్థైర్యం ఉంటేనే అన్ని కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుందని తెలియచేసింది.

నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి మనల్ని మనం ప్రశ్నించుకునే అవకాశం ఇచ్చింది కరోనా.

మనం ఎంత దూరం వచ్చామో, ఎంత తప్పు దారిలో పయనించామో ఆలోచించమని బోధించింది.

ఈ మహమ్మారి మనల్ని భయపెట్టినా, అదే సమయంలో మనిషి హృదయంలోని మానవత్వాన్ని మళ్లీ వెలిగించింది.

డాక్టర్లు, పోలీసులు, స్వచ్ఛంద సేవకులు వారి త్యాగం మరువలేనిది.

మనందరం కలసికట్టుగా ముందుకు సాగితేనే, రాబోయే కాలంలో మరిన్ని విపత్తులను తట్టుకోగలుగుతాం.

వసుధైక కుటుంబం అన్న మన నినాదాన్ని యావత్‌ ‌ప్రపంచానికి తెలియచేసి, భారతదేశానికి గౌరవాన్ని సంపాదించింది కరోనా. కాలం తెచ్చిన కష్టాలతో పాటుగా, మనకు ఎన్నో సదవకాశాలను కూడా కల్పించింది కరోనా, వాటిని సద్వినియోగం చేయవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది.

డా।। జె.పి. భారతి కాజా

7989053047

About Author

By editor

Twitter
YOUTUBE