కొబ్బరిచెట్టును భూలోక కల్పవృక్షమని భక్తిగా పిలుచుకుంటారు. ఏ శుభకార్యం జరిగినా అక్కడ పగిలేది కొబ్బరికాయే. నారికేళానికి భారతీయ సంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో సంపద సృష్టిలోను ఆ ఫలానికి ఉన్న చోటు అంతే విశేషమైనది. అలాంటి అద్భుత వృక్షానికి నిలయమే కోనసీమ. బంగాళాఖాతమే అంచుగా, గోదావరి రెండు పాయలకు మధ్యలో ఉండే అందాల భూమి కోనసీమ. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు విస్తరించి ఉంటుంది. కొడుకు కంటే కొబ్బరిచెట్టు మేలని, కొబ్బరిచెట్టు కుటుంబానికి పెద్ద కొడుకు వంటి నానుడులు వినిపించే చోటు అది. కోనసీమ పేరు చెబితే కొబ్బరితోటలు కళ్ల ముందు కదలాడతాయి. కానీ ఇందుకు తగ్గట్టుగా కొబ్బరి రైతుకీ, సాగుకీ ప్రోత్సాహం ఉన్నదా? రక్షణ ఉన్నదా? అంటే లేదనే సమాధానం వస్తుంది. కోనసీమ నుంచి కొబ్బరి అంతమయ్యే పరిస్థితులు ఉన్నా జాగ్రత్త పడే సూచనలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. సహజవాయువు వెలికితీత కార్యకలాపాలు, ఆగిపోయిన డ్రెయిన్ పనులు, రొయ్యల సాగు కోనసీమ జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేసే స్థాయికి చేరాయి. ఆ అందాల సీమ, కొబ్బరిచెట్ల నిలయం ఉనికికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
జాతీయ స్థాయిలోని కొబ్బరి అభివృద్ధి మండలికి ఈ దుస్థితి తెలియదని అనుకోలేం. ఈ సంవత్సరం జనవరిలోనే మండలి 45వ వ్యవస్థాపక దినోత్సవాలు రావులపాలెంలోనే జరిగాయి. దానికి బోర్డు జాతీయ అధ్యక్షుడు శుభా నాగరాజ్ హాజర య్యారు. సంకర జాతి రకాల అభివృద్ధి, ఉత్పత్తి పెంచడం, రైతుల సంక్షేమం కోసం బోర్డు ప్రయత్ని స్తున్నదని చెప్పారు. పంట పరిరక్షణ, అందుకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం వంటి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కొబ్బరి అభివృద్ధి మండలిని 1981లో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కొచ్చిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇంకా బెంగళూరు, చెన్నై, గౌహతి, పట్నాలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కొబ్బరి దిగుబడిలో దేశంలోనే కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రాష్ట్ర కార్యాలయం మాత్రమే ఉంది. అభివృద్ధి మండలి పూర్తిస్థాయి సేవలు కోనసీమ కొబ్బరి రైతుకు ఎప్పుడు అందుబాటులో వస్తాయో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్- కోనసీమ-కొబ్బరి
కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో నాల్గవ స్థానం. కర్ణాటక, కేరళ, తమిళనాడు పై స్థానాలను ఆక్రమించాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లేదా ప్రస్తుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గజానికో కొబ్బరి చెట్టు కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒక అంచనా ప్రకారం ఈ జిల్లాలో 38,983.32 హెక్టార్‌లలో కొబ్బరి సాగు ఉంది. పెద్ద కాయ, నూనె కూడా కూడా అధికంగా రావడం వల్ల దీనికి దేశంలోనే కాకుండా, కొన్ని ఆసియా దేశాలలోను గిరాకీ ఉంది. దేశంలోనే ఎంతో ఖ్యాతి ఉన్న కోనసీమ కొబ్బరి 2016లోనే చైనా, జపాన్, దుబాయ్, పాకిస్తాన్‌లకు కోనసీమ కొబ్బరి వెళ్లిందని 2016లోనే ది హిందూ ఒక నివేదిక వెలువరించింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి దిగుబడిలో 50 శాతం కోనసీమ నుంచే. తరువాత పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖ పట్నం జిల్లాలు కూడా కొబ్బరి ఉత్పత్తికి ఎంతో దోహదం చేస్తున్నాయి. అయితే కోనసీమను ఆంధ్ర కొబ్బరిదేశం అంటారు. తేమ వాతావరణం, మంచి వర్షపాతంతో కల్పవృక్షంగా జనం పిలుచుకునే కొబ్బరికి కోనసీమ ఆవాసమైంది. ఇది ఆ ప్రాంత ప్రజల ప్రధాన ఆదాయ వనరు కూడా. కాయ ఒక్కటే కాదు, కాయపైన పీచు, కాండం, ఆకులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. కోనసీమలోని 16 మండలాలలో కొబ్బరిసాగు ఉంది. వ్యవసాయదారు లకు సరే, నూనె గానుగలకు, కొబ్బరి పీచు పరిశ్రమ, స్వర్ణకారులు ఇలా మొత్తం 15 వివిధ వృత్తులకు ఇదే ఆధారం. కోనసీమలో కొబ్బరిచెట్టుకు ఉన్న సామర్ధ్యం, ఉత్పాదనా శక్తి మిగిలిన చోట్ల కనిపించదు. ఏడాదికి ఒక చెట్టు దాదాపు 220 కాయలు ఇస్తుంది. కల్పరక్ష అనే కొబ్బరి రకం ఇక్కడ వాతావరణానికి ఎంతో అనుకూలంగా ఉండి, అదే రాజ్యమేలుతున్నది.
గిరాకీ ఉంది, గిట్టుబాటు లేదు
కొబ్బరికాయకు నిత్యం గిరాకీ ఉంటుంది. పట్టణాలలో, నగరాలలో దీని ధర ఆకాశంలో ఉంటుంది. కానీ కోనసీమ కొబ్బరిరైతు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలకు తోడు, దళారీ వ్యవస్థ కూడా కొబ్బరిని ముప్పెరగొన్నాయి. కొబ్బరిసాగు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

తుపానులతో
చమురు`సహజవాయువు అన్వేషణ పనులతో 1980 దశకం నుంచి కోనసీమ కొబ్బరికి చేటుకాలం ప్రారంభమైందనవచ్చు. 1996 నాటి కోనసీమ కిల్లర్ తుపాను (సైక్లోన్ 07బి) 50 లక్షల కొబ్బరిచెట్లను కూల్చింది. ఒక మాదిరి తుపాను వచ్చినా చెట్టు నుంచి మూడు`నాలుగేళ్లు దిగుబడిని ఆశించనక్కర లేదు. తరువాత 2010, 2011 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ను తాకిన వరస తుపానులు ఇంకొన్ని వేల చెట్లను నేలమట్టం చేశాయి. ఎక్కువ నష్టం కోనసీమకే. ఇంకా, యానాం, కోటిపల్లి కూడా నష్టాన్ని చవిచూశాయి. తుపానుల తరువాత వచ్చే ఎర్ర చుక్క తెగులు కొబ్బరికి విశేషంగా హాని చేస్తూ ఉంటుంది. ఇవన్నీ దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపేవే. అప్పుడు కొబ్బరిసాగుకు, పరిశ్రమకు తగిలిన దెబ్బ ఎంత తీవ్రమైనదో అంబాజీపేట ఎగుమతిదారుల సంఖ్యలో వచ్చిన దారుణ పతనం సూచిస్తుంది. అమలాపురం పట్టణానికి సమీపంగా ఉన్న అంబాజీపేట అంటే దేశంలో రెండో కాలికట్. అంబాజీపేట కొబ్బరి ఎగుమతి మార్కెట్‌గా కళకళలాడిపోతూ ఉండేది. 2005 సంవత్సరానికి ఇక్కడ దాదాపు 160 మంది కొబ్బరి ఎగుమతి దారులు ఉండేవారు. కానీ 2015 నాటికి ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రధానంగా మిగిలారు. తాజా లెక్కలు ఇంకాస్త కలవరపెడుతున్నాయి. శంకరగుప్తం డ్రెయిన్ ద్వారా ముంచెత్తుతున్న ఉప్పునీరు వల్ల 250 హెక్టార్లలో కొబ్బరి సాగు పాడైంది. ఇది 2022` 2023 ప్రాంతంలో అధికారికంగా జరిపిన సర్వేలో తేలిన విషయం. అది ఇప్పుడు ఇంకా పెరిగి ఉండాలి. ఈ రెండేళ్లలోనే ఆ ప్రాంతంలో నశించిన చెట్లు 45,000 నుంచి 50,000 వరకు ఉంటాయని మరొక అంచనా. మొత్తంగా ఆ సమస్యతో పది పదకొండు ఏళ్లలోనే దాదాపు లక్ష చెట్లు నాశనమై నాయి. మలికిపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాలలో ఒక దశాబ్దం క్రితం వరకు వారానికి ఒక గ్రామం నుంచి లక్ష నుంచి రెండు లక్షల కొబ్బరి కాయలు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు నెల రోజులు వేచిచూసినా లక్ష కాయలు పోగవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితి నిజంగా కన్నీరు తెప్పిస్తుంది. పుష్కరం క్రితం వరకు ప్రతి నెల మొదటి తేదీన కొబ్బరి దిగుబడి అయ్యేది. దీనినే గోదావరి జిల్లాలలో ‘దింపు తీయడం’ అంటారు. ఇప్పుడు రెండు నెలలకు కూడా దిగుబడి ఉండడం లేదని రైతుల అనుభవం. ఆలస్యంగా వస్తున్న దిగుబడీ పూర్తి స్థాయిలో లేదు.
పొగ పెట్టిన సహజవాయువు
ఉమ్మడి తూర్పుగోదావరిలో 1980 దశకం నుంచి చమురు, సహజవాయువు అన్వేషణ మొదల యింది. అది కొబ్బరినీ, పచ్చదనాన్నీ ఇంత ఘోరంగా నశింప చేస్తుందని ఆరోజున ప్రజలు ఊహించలేదని అనిపిస్తుంది. అదంతా చూసిన నిన్నటి తరం రైతులు కొబ్బరికి అనువైన ఈ నేలను ఆ చర్యలే ధ్వంసం చేశాయని చెప్పేవారు. ఇదంతా నేల లోపలి పరిస్థితి గురించి. నేల పైన కూడా దాని ప్రభావం ప్రతికూలం గానే ఉంది. సహజ వాయువు పంపిణీ కోసం వేసిన పైపులు తరుచు పగిలి, మంటలు ఎగసిపడి చెట్లకు నష్టం చేస్తున్నాయి. 2014 నాటి వివరాల ప్రకారం ఆ ఒక్క సంవత్సరమే 60 పర్యాయాలు పైప్‌లైన్‌లు పగిలిన సంఘటనలు జరిగాయి. కోనసీమ కొబ్బరికి చేటు చేస్తున్న కారణాలలో ఇదీ ప్రధానమైనదే. తాటిపాక, అడవిపాలెం, పొన్నమండ ప్రాంతాలలో ఓఎన్‌జీసీకి చెందిన 40 చమురు, సహజవాయువు క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చమురు సంస్థలు (2014 లెక్కల ప్రకారం) 30 లక్షల క్యుబిక్ మీటర్ల సహజవాయువును వెలికితీస్తాయి. ఈ వాయువునే పైప్‌లైన్‌ల ద్వారా సేకరణ కేంద్రాలకు పంపుతారు. ఈ ప్రాంతంలోని 275 గ్రామాలకు గాను 150 గ్రామాల గుండా పైప్‌లైన్‌లు వెళుతూ ఉంటాయి. 2001లో ఇక్కడ ఓఎన్‌జీసీ, కైరన్ వంటి సంస్థలు కోనసీమలో 21,000 చదరపు కిలోమీటర్ల సాగరతీరంలో సహయవాయువు నిక్షేపాలను వెలికి తీయడం ఆరంభించారు. వాయువు కోసం డ్రిల్లింగ్ చేసిన ప్రతి స్థలంలోను 50 గజాల మేర నేల నిస్సారమవుతుందని నిపుణులు చెప్పారు. ఇవన్నీ కలసి కోనసీమ సహజ వాతావరణాన్ని దెబ్బ తీశాయి.
శంకరగుప్తం డ్రెయిన్‌తో పెను ముప్పు
స్వర్గానికి కిందుమెట్టుగా పిలిచే కోనసీమకు ప్రత్యేక ఆకర్షణ, కేశనపల్లి. ఈ గ్రామం, చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఇప్పుడు తారుమారయింది. మలికిపురం మండలంలోని తీరప్రాంత గ్రామాలు కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గొల్ల పాలెం, గూడపల్లి, గూడపల్లిపాలెం, గుబ్బలపాలెం, శంకరగుప్తం, కాట్రేనిపాడులలోని కొబ్బరితోటలలో నికి భారీగా ఉప్పునీరు ప్రవేశించడంతో దాదాపు వెయ్యి ఎకరాలలోని సుమారు లక్ష కొబ్బరి చెట్లు పాడై రైతుల ఆదాయానికి గండిపడిరది. చింతల మోరిలో ప్రారంభమై కరవాక వద్ద సముద్రంలో కలుస్తున్న శంకరగుప్తం మేజర్ డ్రెయిన్, అందులో కలిసే గోగన్నమఠం మరొక 11 డ్రెయిన్లు ఇందుకు కారణం. ఇవన్నీ అన్యాక్రాంతం కావడంతో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో వాటిలోని ఉప్పునీరు గట్లపై నుంచి ప్రవహించి, ఆ గ్రామాల లోని కొబ్బరితోటలలోకి ప్రవేశించడంతో, అవి ఉప్పునీటి కయ్యలుగా మారి, చెట్లు వెర్రితలలు వేస్తున్నాయి. సముద్రంలోని ఆటుపోట్లతో ఉప్పునీరు గట్లపై నుంచి పెద్ద ఎత్తున కొబ్బరి తోటలలోనికి పారుతుంది. ఆ డ్రెయిన్ చింతలమోరి, మెండిపాలెం వద్ద సున్న కిలోమీటరు వద్ద ప్రారంభమై 22 కిలో మీటర్ల మేర విస్తరించి, కరవాక వద్ద సముద్రంలో కలుస్తుంది. దీని పరిధిలోని 30 వేల ఎకరాల ఆయకట్టులో సార్వా సీజన్‌లో 5వేల ఎకరాలు, దాళ్వాలో 12 వేల ఎకరాలలో మాత్రమే వరి సాగు అవుతోంది. అంటే కొబ్బరి నష్టానికి ఇది అదనం. గతంలో ఈ డ్రెయిన్ డ్రెడ్జింగ్‌కు నిధులు మంజూరు కాగా, 8.5 కిలోమీటర్ల మేర అంటే కేశనపల్లి వరకూ తవ్వకం పని పూర్తయింది. అక్కడి నుంచి కత్తిమండ వరకూ పనులు సాగకపోవడం ఉప్పునీటి రాకకు కారణం. దీనికితోడు గోగన్నమఠం డ్రెయిన్ పూర్తి ఆక్రమణకు గురై 110 అడుగులు వెడల్పు డ్రెయిన్, 10 అడుగులకు కుంచించుకు పోయింది.
శంకరగుప్తం మేజర్ డ్రెయిన్‌గా ఉండగా పొన్న మండ 1,2,3 డ్రెయిన్స్, కాట్రేనిపాడు, కూనవరం, నామనపాలెం, చింతలపల్లి, బి.సావరం, గూడపల్లి మెయిన్ డ్రెయిన్, కత్తిమండ, అంతర్వేది డ్రెయిన్లతో పాటుగా గోగన్నమఠం మధ్యతరహా డ్రెయిన్ కూడా శంకర్‌గుప్తం డ్రెయిన్‌కు అనుసంధాన మవుతాయి. డ్రెయిన్ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేకపోవడం రైతులకు శాపంగా మారింది. గతంలో డ్రైయిన్‌గట్లు ఎత్తు చేయడానికి రూ. 2.10 కోట్లు మంజూరయినా పనులు కార్యరూపం దాల్చలేదు. 2017లో కేశనపల్లి వరకూ డ్రెడ్జింగ్ పూర్తి అయింది. అయితే 2018`19 సంవత్సరాల మధ్య కాలంలో గోగన్న మఠం డ్రెయిన్ కూడా ఆక్రమణల పాలైన నేపథ్యంలో పైన పేర్కొన్న తొమ్మిది గ్రామాల పరిధిలోని కొబ్బరిచెట్లు చనిపోవడం ప్రారంభించాయని ఆయా ప్రాంతాల రైతులు చెబుతున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జలవనరుల శాఖ ఎస్.ఇ. గోపీనాథ్, ఈఈ కిషోర్, డి.ఈ.ఈ.లు జి.శ్రీనివాస్, ఆర్.నాగా ర్జున, ఏ.ఈ. రమేశ్‌బాబులతో కలసి డ్రెయిన్ స్థితిగ తులపై అధ్యయనం చేశారు. డ్రెయిన్ పరీవాహక ప్రాంతంలో రెండు వైపులా గట్లు ఎత్తు చేయడం ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని, ఆ దిశలో అధికార యంత్రాంగం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
22.9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రెయిన్‌లో మెరకలు తొలగించి గట్లు పటిష్టం చేసేందుకు రూ. 9.5 కోట్ల విలువగల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెప్పారు. కేశనపల్లి పరిసర గ్రామాలలో కొబ్బరి పంట పాడైనట్టు ఫిర్యాదులు అందాయని, ఈ విషయమై, రాజోలు ఎమ్మెల్యే తగిన కృషి చేస్తున్నారని, రైతులను ఆదుకొనేందుకు తమ వంతు కృషి చేస్తామని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు హామీ ఇచ్చారు. అలాగే డ్రెయిన్ ఆక్రమణలపై ప్రత్యేక సర్వే నిర్వహించి, ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు ఇచ్చిన వివరాల ప్రకారం ఒక హెక్టార్‌లో అత్యధికంగా 15,965 కాయల దిగుబడి ఉంటుంది. గోదావరి మధ్య డెల్టాలోని 9 గ్రామాలలో ఉప్పునీటి వల్ల దాదాపు లక్ష కొబ్బరిచెట్లు చనిపోయాయి. 2019 నుంచి ఇది గడచిన ఆరేళ్లలో జరిగినది మాత్రమే. మొత్తంగా చూస్తే 13 గ్రామాలలో కొబ్బరి తోటలు ఉప్పునీటితో నాశనమయ్యాయి. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం వాటిలో ఉన్నాయి.ఉప్పునీరు చేరిన ఫలితంగా పాత చెట్లు నశిస్తున్నాయి. అక్కడ కొత్తవి అంటే సూదమొక్కలు నాటినా ప్రయోజనం ఉండదు. అవి బతకవు.
ఆక్వా సాగుతో మారిన జీవ వైవిధ్యం
మారుతున్న వాతావరణ పరిస్థితులు, తుపానులు, శంకరగుప్తం డ్రెయిన్ ముప్పులకు తోడు రొయ్యలసాగు కూడా కోనసీమ కొబ్బరి ధ్వంసానికి తన వంతు పాత్ర నిర్వహిస్తున్నది. రొయ్యల సాగు లేదా ఆక్వా కల్చర్‌తో రసాయనాలు, ఫేడ్, యాంటీ బయాటిక్స్ వినియోగంతో నేల, నీరు కలుషిత మవుతున్నాయి. పర్యావరణ సమతౌల్యానికి విఘాతం ఏర్పడుతోంది. గ్రామాలకు అతి దగ్గరలోనే సరైన అనుమతులు లేకుండా రొయ్యల సాగు చేపట్టుతుండడంతో ఆయా ప్రాంతాలలోని బావులు పాడై, బావినీరు త్రాగే అదృష్టాన్ని గ్రామస్థులు కోల్పోయి ఫ్యూరిఫైడ్ వాటర్ కొనుగోలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిరది. వరిచేలు, రొయ్యల చెరువులు పక్కపక్కనే ఉంటు న్నాయి. దీనితో వరిపొలానికి, పొలం చుట్టూ ఉండే కొబ్బరితోపులకు కూడా జమిలిగా చేటు జరుగుతున్నది.
ఇసుక భూములతో, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ భూములలో, పంట పొలాల మధ్య, ఊరికి ఆనుకుని ఉన్న పొలాలలో సామూహిక స్థలాలలో ఆక్వా సేద్యానికి అనుమతి లేదు. వీటన్నింటినీ తుంగలో తొక్కి, వేలాది ఎకరాలలో రొయ్యలసాగు చేస్తూ పర్యావరణానికి గండి కొడుతున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి కమిటీల ద్వారా అనుమతులు పొందిన వారు మాత్రమే రొయ్యలసాగు చేయాలి. ఒకవేళ అనుమతులు ఉన్నప్పటికి, అనుమతించిన ఆ స్థలాలకు మరిన్ని భూములు జతచేర్చి ‘కోస్టల్ ఆక్వాకల్చర్ అధారిటీ’ చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు లేకుండా ఆక్వా సేద్యం సాగుతున్న పరిస్థితి.
ప్రభుత్వ ఆక్వాజోనింగ్ లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 39,000 ఎకరాలలో ఆ సాగు ఉంది. అయితే ఎన్జీటీ కమిటీకి జిల్లా మత్స్యశాఖ అందించిన వివరాల ప్రకారం కేవలం చేపల చెరువుల విస్తీర్ణం 44,000 ఎకరాలు ఉంటే, ఉప్పునీటి రొయ్యల సాగు విస్తీర్ణం 20,000 ఎకరాలు ఉంది. గ్రామం నుండి 300 నుండి 500 మీటర్ల దూరంలో మాత్రమే చెరువులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా, పలు ప్రాంతాలలో నివాస ప్రాంతాల ప్రక్కనే ఆక్వా సాగు దురదృష్టకరం. అంతేకాకుండా కొంతమంది రైతులు చేపల చెరువులు పేరుతో అనుమతులు తీసుకొని రొయ్యల సాగు చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. వంద ఎకరాలలో రొయ్యల చెరువుల విస్తరిస్తే, నూట పాతిక ఎకరాలలో కొబ్బరి విస్తీర్ణం తగ్గినట్టే.
ఉప్పునీటితో సాగే రొయ్యలసాగు పరిస్థితి ఇలా ఉంటే, చేపల చెరువుల గురించి 2020లో తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టంలో ఉన్న నియమాల ఆధారంగా ఎక్కడ చేపల చెరువులు తవ్వవచ్చో ఉంది. లోతట్టు ప్రాంతాలు, చవుడు భూములు, ఆక్వా చెరువుల మధ్య ఉన్న పొలాలు, వ్యవసాయానికి పనికిరాని భూములలో మాత్రమే చేపల చెరువులు తవ్వుకోవాలి. అయితే ఈ నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా ఆక్వాకల్చర్ చేస్తూండడంవల్ల పర్యావరణ పరిరక్షణ జరగడంలేదు.
చెరువు మొత్తం విస్తీర్ణంలో 60 శాతం భూమిలో మాత్రమే ఆక్వా సాగు చేయాలి. మిగతా భూభాగాన్ని మురుగు నీటి శుద్ధికి, చెట్లకి ఇతరత్రా అవసరాలకు కేటాయించాలి. అయితే రైతులు మొత్తం విస్తీర్ణంలో సాగు జరుపుతూ, నియమావళికి నవిరుద్ధంగా 5 హెక్టార్లకు పైబడి ఉన్న చెరువుల నుంచి మురుగు నీటిని పంటకాలువ లోనికి, ఏరుల్లోకి వదిలి వేస్తూండడంతో పర్యావరణానికి భారీగా నష్టం జరుగుతున్నది. చట్టం మేరకు చెరువుకీ, చెరువుకీ మధ్య ఉండవలసిన దూరాన్ని కూడా పాటించకుండా సాగుచేయడం విచారకరం. ‘కాదేది ఆక్రమణకు అనర్హం’ అనే రీతిలో ఆక్వాసురులు కొన్నిచోట్ల శ్మశానాలను, మరికొన్ని చోట్ల నదీ గర్భంలోనూ, డ్రెయిన్స్‌ను ఆక్రమించి ఆక్వాసాగు చేస్తున్నారు.
ఈ పైన పేర్కొన్న అన్ని అంశాలపై ప్రభుత్వం, సంబంధిత శాఖాధికారులు పట్టించుకోక పోవడంతో ఒక ప్రైయివేటు వ్యక్తి ఈ అంశాలను క్రోడీకరిస్తూ ఎన్జీటీని ఆశ్రయించడంతో, ఎన్జీటీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసి, ఈ ప్రాంతానికి భారీ ఊరట కలిగిస్తూ, అనుమతులు లేని చెరువులను ధ్వంసం చేయడం, భారీ యెత్తున నష్టపరిహారం అందజేశారు కూడా.
ఆక్వాకల్చర్ వల్ల పంటలతో పోలిస్తే ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఐస్‌ప్లాంట్లు వంటి అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. కోనసీమ నుండి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతు న్నాయి. నిజమే కావచ్చు. కానీ పర్యావరణా నికి తూట్లు పడే విధంగా రసాయనాలు, ఫేడ్, యాంటీ బయటిక్స్ వలన, నేల, నీరు కాలుష్యమవు తున్నాయి. ఇది భవిష్యత్తులో కోనసీమ ఉనికికే భంగం వాటిల్ల చేసే విధంగా ఉందంటే అతిశయోక్తి కాదు. చెరువుల కోసం మడ ప్రాంతాలు, చెరువుల అంచులు నాశన మనవుతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గుతోంది. ఇది శాంతిభద్రతల సమస్యగా కూడా మారి పోయింది. భూవివాదాలు, నీటి వినియోగంపై గ్రామస్థుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. కొందరు పెద్ద రైతులు లేదా వ్యాపారులు లాభాలు పొందుతుండగా, చిన్న రైతులు నష్టపోతున్నారు. కాలుష్యంవల్ల తాగునీటి నాణ్యత తగ్గిపోతోంది. దుర్వాసన, దోమల సమస్యలు పెరుగుతున్నాయి. అన్నిటికీ మించి ఇది కొబ్బరికి చేస్తున్న హాని మరీ ప్రమాదకరమైనది.
రుచి కోల్పోయిన నూతి నీరు
2014కు ముందు చాలా బావులలో త్రాగునీరు లభ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఆ బావులన్నీ ఉప్పు నీటితో నిండిపోయాయి. కోనసీమలోని ఆయా ప్రాంతాలలోని ఏడు మండలాలలో 15,000 ఎకరా లలో వరి రైతులు కూడా నష్టపోతున్నారు. ఆ నష్టం రూ.60 కోట్లని అప్పటి అంచనా. అక్కడ పంటకు అనువుగా లేకపోవడం వల్ల సముద్రానికి దగ్గరగా ఉన్న పొలాలు రొయ్యల చెరువులుగా మార్చక తప్పడంలేదన్న వాదన ఉంది. 113 గ్రామాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొనడం మొదలయింది.
వాల్యూ యాడెడ్ పరిశ్రమలు లేక…
ఇక్కడి పరిశ్రమను కుంగదీస్తున్న మరొక ప్రధాన సమస్య వాల్యూ యాడెడ్ (విలువను జోడిరచడం` ఒక ఉత్పత్తి లేదా సేవను మెరుగు పరచడం ద్వారా దానికి అదనంగా ఏదైనా జోడిరచడం, విలువ పెంచడం కూడా) పరిశ్రమలు ఇక్కడి దిగుబడి సామర్ధ్యానికి తగినట్టు రాకపోవడం కూడా. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు చిరకాలం సికింద్రాబాద్‌లో ఉండిపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే దాని సేవ కోనసీమకు ఇంకా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్‌కు అందని ద్రాక్షగానే చిరకాలం మిగిలిపోయింది. ఈ కారణంగా అటు ప్రోత్సా హమూ లేక, ఇటు సమస్యలకు సమాధానాలు లభ్యం కాక కొబ్బరితోటలు రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారిపోయాయి. ఇంకా ప్రమాదకరంగా వరిచేలు రొయ్యల చెరువులుగా మారి, ఆ చేల చుట్టూ కోటలా ఉండే కొబ్బరిచెట్లు అక్షరాలా పోకచెట్ల రూపునకు వచ్చాయి. ఈ పరిస్థితులను బట్టి వెయ్యి కాయల ధర రూ 10,000 పలకగా, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కాయ ధర వేయికి రూ 4,500 పలికింది. అయితే కోనసీమ రైతులు కొబ్బరి బొండాలుగా, అంటే నీళ్లు తాగే అవసరాల కోసం తమ ఉత్పత్తుల వినియోగపడాలని అనుకోరు. ఆ అవసరాలకు తక్కువ ఉత్పత్తి మాత్రమే వెళుతుంది. కాయలు పూర్తిగా ముదిరిన తరువాతనే దింపు లేదా దిగుబడిని ఆశిస్తారు.
కామన్ ఫెసిలిటీ కేంద్రం ఆదుకుంటుందా?
కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాజోలు శాసనసభ నియోజక వర్గంలోని పెదపట్నంలంకలో ఒక కామన్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతు న్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ సెప్టెంబర్‌లోనే అసెంబ్లీలో ప్రకటించారు. రూ.9.96 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే కేంద్రం పరిధిలోకి కోనసీమలోని తూర్పుపాలెం, ఉప్పల గుప్తం, పెదపట్నంలంక గ్రామ సముదాయాలు వస్తాయి. ఈ మూడు సముదాయాలలోనే 25,000 ఎకరాలలో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఏటా 30 నుంచి 40 కోట్ల కాయల వరకు దిగుబడి ఉంటుంది. దీనితో స్థానికంగానే పీచు ఆధారిత ఉత్పత్తులు (డోర్మేట్లు, తాళ్లు వంటివి), చిప్ప నుంచి బొగ్గు ఉత్పత్తి, కొబ్బరి నూనె, కొబ్బరి నీటితో ఉత్పత్తులు, కొబ్బరి పొడి ఉత్పత్తి చేసుకునే వీలు కలుగుతుందని కూడా మంత్రి చెప్పారు. ఇప్పటికే ఒక్క రాజోలు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే 170 కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఇవి తగిన సామర్ధ్యంతో లేవు. ఈ పరిస్థితులన్నీ కొబ్బరికి ఆలవాలమైన కోన సీమకు తమిళనాడు, కేరళల నుంచి కొబ్బరి దిగుమతి అవుతున్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టమే.
కొబ్బరి ఉత్పత్తి సంస్థలు రావాలి: ఎంపీ హరీష్ బాలయోగి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జీవనోపాధిగా సాగుతున్న కొబ్బరి పంటల ఉత్పత్తుల ద్వారా రైతులకు మేలు చేసేందుకు జిల్లాలో కొబ్బరి ఉత్పత్తి సంస్థలు నెలకొల్పాలని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి పార్లమెంట్‌లో కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కొబ్బరి ఉత్పత్తిలో దాదాపు సగం వాటా కోనసీమదేనని చెప్పవచ్చన్నారు. అనేక జిల్లాల్లో గణనీయ స్థాయిలో ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతులు తమ ఉత్పత్తులను పూర్తి విలువను పొందడానికి స్థానికంగా అవసరమైన మద్దతు లేదన్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటైన కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు (జూ), సమాఖ్యలు (జూఖీ), కంపెనీలు (జూజ), సామూహిక మార్కెటింగ్,వ్యయ సామర్థ్యం, ఉత్పత్తి విలువను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గత అయిదు సంవత్సరాలలో కేవలం సీపీఎస్‌లు మాత్రమే నమోదైనాయని, వాటిలో ఒక్కటి కూడా పనిచేయడం లేదన్నారు.2019 నుండి ఒక్క సీపీఎఫ్, సీపీసీ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొబ్బరిచెట్ల పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల మంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి అభివృద్ధి బోర్డు సంస్థలను ఏర్పాటు చేసి విధంగా చర్యలు తీసుకుంటే కొబ్బరి రైతుల ఆదాయం పెంచడంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుంటుందని సభాపతిని హరీష్ బాలయోగి కోరారు.
8 కిమీ పూడిక తీయడం, గట్లు బలపరచడం…
ఆదివారం సాయంత్రం (3.8.2025) కేశనపల్లి పరిసర గ్రామాల కూటమి నాయకులతో కలసి వెళ్లి, ఇరిగేషన్ మంత్రిగారిని పాలకొల్లులో వారి ఇంటివద్ద కలిసాము.శంకరగుప్తం డ్రైన్ పూడిక పనులు 8 కిమీ మేరకు గతంలో ఎప్పుడూ చేపట్టకపోవడం, గట్లు బలంగా లేకపోవడం వలన డ్రెయిన్ పొంగి ఊరి మీద పడుతున్నది, ఉప్పునీటి ప్రభావం వలన లక్ష కొబ్బరి చెట్లు చనిపోయాయని మంత్రిగారికి విన్నవించాం.
– దేవ వరప్రసాద్, రాజోలు ఎమ్మెల్యే
శంకరగుప్తం మేజర్ డ్రెయిన్‌ను పూర్తి స్థాయిలో డ్రెడ్జింగ్ చేయడం ద్వారా లోతు పెంచి గట్లు పటిష్టం చేస్తాం. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సూచనల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
– ఆర్.నాగార్జున, డీఈఈ, జలవనరుల శాఖ
శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఉప్పునీటి సమస్య పరిష్కారానికి రైతులు అయిదేళ్లుగా ఉద్యమిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ద్వారా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లాం. గట్లను ఎత్తుచేయడం, ఈ డ్రెయిన్స్‌లోనికి అనుసంధాన మైన డ్రెయిన్‌కు స్లూయిజ్‌లు నిర్మించి, అటు బంగాళా ఖాతంలోనికి, ఇటు వైనతేయ నదిలోనికి వెళ్లే స్ట్రెయిట్‌కట్‌ను ఆధునీకరించడం ద్వారా పరిస్థితిని మెరుగుపరచవచ్చు.
– యెనముల నాగు, సర్పంచ్, కేశనపల్లి
కేశనపల్లి తదితర గ్రామాలలో ప్రధాన జీవనా ధారమైన కొబ్బరి పంట ఉప్పునీటితో పాడైపోయి రైతుల ఆదాయానికి గండి కొట్టింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే కొబ్బరి రైతుల భవిష్యత్తు అంధకారమే. రైతును ఆదుకొని, కొబ్బరిపంట పూర్వస్థితికి వచ్చేలా కృషి చేయాలి.
– యర్రంశెట్టి సుబ్బారావు, కొబ్బరి రైతు కేశనపల్లి
కోనసీమలో కేశనపల్లి కొబ్బరికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు ఆ పరిసర గ్రామాలలో కొబ్బరి పంట ఉనికికే ప్రమాదం వాటిల్లింది. రైతుల సమస్య పరిష్కారానికి యంత్రాంగం కదలి రావాలి.
– అడబాల రాజప్ప, కొబ్బరి రైతు, కేశనపల్లి
ఉప ఉత్పత్తులు ఎన్నో
కోకోనట్ మిల్క్, కోకోనట్ స్కిమ్డ్ మిల్క్, స్ప్రే డ్రైడ్ కోకోనట్ మిల్క్ పౌడర్, కోకోనట్ క్రీమ్ వంటివి భారతదేశంలో కొన్ని చోట్ల తయారు చేస్తున్నారు. ఇటాంటవన్నీ కోనసీమకు తేవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇంకా కోకోనట్ బర్ఫీ, చాకొలెట్, క్యాండీ, బిస్కెట్లు తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. తయారవుతున్నాయి కూడా. కొబ్బరిపొడి, మైదా కలిపి బిస్కెట్లు తయారు చేస్తారు. ఇది లోకేలరీలు, మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారం. లేదా చిరుతిండి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఆసియా పసిఫిక్, అమెరికా, ఐరోపా దేశాలు, తూర్పు ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా దేశాలు వీటిని ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాయి. క్యాండీని కొబ్బరి పాలతో చేస్తారు. కోకోనట్ చిప్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కోకోనట్ స్క్వాష్, వెనిగార్ కొబ్బరి నీళ్ల నుంచి తయారు చేస్తారు. ఇక కొబ్బరి నూనెలు అనేక రూపాలుగా వస్తాయి. ఒంటికి, తలకి రాసుకునేవి, వంటనూనెగా కూడా దీనికి ప్రసిద్ధి ఉంది. ఇది కొలస్ట్రాల్‌ను పెంచదు.
కొబ్బరికాయలో చిప్పకు కూడా ప్రాధాన్యం ఉంది. ఈ చిప్పలను ప్రత్యేకమైన పద్ధతిలో కాలుస్తారు. ఇటుకలు కాల్చే పద్ధతిలో చిప్పలు కుప్పవేసి వాటి మీద మట్టి కప్పి, గాలి పరిమితంగా అందేటట్టు చేసి, కాలుస్తారు. చిప్పలు బూడిద కాకుండా బొగ్గులా తయారవుతాయి. ఇది స్వర్ణకారులకు అత్యవసరం.

కేసనపల్లి కొబ్బరి స్థితిగతులపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు విజ్ఞాపన పత్రం అందిస్తున్న రాజోలు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ అడబాల రాంబాబు బీజేపీ కోనసీమ జిల్లా నేత మాలే శ్రీనివాస్ నగేష్
– గోపరాజు జవహర్, సీనియర్ జర్నలిస్ట్