సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు మార్గశిర శుద్ధ చవితి  – 24 నవంబర్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఎన్‌డీఏకు భారీ ఓట్లూ, సీట్లూ అన్న గణాంకాల కోణం నుంచి బిహార్‌ ఫలితాలను చూడడం హ్రస్వదృష్టి అనిపించుకుంటుంది. 243 స్థానాలకు గాను ఎన్‌డీఏకు 202 స్థానాలు ఇచ్చిన బిహార్‌ ఓటర్‌, విపక్షానికి 35 స్థానాలు పడేసి నోరెత్తకుండా చేశాడు. ఎన్నికలు సర్వేలు వేసిన అంచనాలకు ఫలితాలు సుదూరంగా ఉన్నాయి. కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ చెట్టపట్టాలేసుకుని నడిపిస్తున్నది మహాగఠ్‌ బంధన్‌. కానీ అందులో లేనిదే బంధం. ఢిల్లీ పీఠం రాహుల్‌కీ, బిహార్‌ పీఠం తేజస్వీకీ దక్కాలన్న ఒకే ఒక్క దురాశ తప్ప మరొక ఎజెండా దుర్భిణీ వేసినా కానరాదు. ఈ అవినీతి కూపాలకి, ఈ రాజకీయ పాపాల కలయికకి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం మరొక వికృతి. ఇవన్నీ ప్రగతిశీల శక్తులట!

ఫలితాలకు ముందు ఓట్‌చోరీ, అవి వెలువడినాక ఓట్‌చోరీ. ఆ పాచి పాటే పాడుతున్నారు బీజేపీ వ్యతిరేకులు. నిజం ఏమిటి? కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ బిహార్‌ను మూడు దశాబ్దాలు వెనక్కి నెట్టాయి. అయోధ్య రథయాత్రను రాష్ట్ర సరిహద్దులలో నిలిపివేసిన వీర సెక్యులర్‌నని అనుకోవడం మొదలు, ఈ ఎన్నికల ప్రచార వేళ ఛాత్‌పూజను విమర్శించడం వరకు ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ బుజ్జగింపు బురదను బాహాటంగా పూసుకుంటూ తమాషా చేస్తూనే ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో జేపీ సంపూర్ణ విప్లవంలో పాల్గొని, తరువాత సంపూర్ణ అవినీతిపరుడిగా నిలబడిన అధమాధమ రాజకీయవేత్త లాలూ. ముస్లిం – యాదవ కూడికతో అధికారం సాధించడం శాశ్వత సూత్రమని నమ్ముకున్నమూఢుడు. ఈయన రాజకీయ వారసుడే తేజస్వీ యాదవ్‌. కాంగ్రెస్‌ వంటి జాతీయ తోక పార్టీ కూడా తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి బేజారెత్తిపోయిందంటేనే వీళ్ల ఘనత అర్థమవుతుంది. తేజస్వీ రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా జనం నమ్మలేదు. బిహార్‌ ఓటరు సరైన నిర్ణయం తీసుకోలేదంటూ కాంగ్రెస్‌ తింగరి మాటలు మాట్లాడినా బిహార్‌ ఓటర్లకు వారి భయం వారికి ఉంది. ఇప్పటికే ‘ఉద్యోగానికి` భూమి’ కేసు నడుస్తున్నది. లాలూ తనయుడే కాబట్టి రేపు కూడా ప్రతి ఉద్యోగానికి భూమి అడిగి తీరతారని గాఢంగా నమ్మినట్టే ఉంది బిహార్‌ జనత. మద్య నిషేధం తొలగిస్తానని ప్రకటించిన ఘనుడు కూడా తేజస్వీయే.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘జంగిల్‌ రాజ్‌ను ఎన్నుకుంటారా? తుపాకీ రాజ్యం మళ్లీ తెచ్చుకుంటారా?’ అంటూ సంధించిన ప్రశ్న ఓటర్లను ఎక్కడ తాకాలో అక్కడే తాకింది. పొరపాటున ఆర్‌జేడీ నెగ్గితే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశాలు ఉన్నది తేజస్వీకే.  కానీ భూమికి ఉద్యోగం, దాణా అవినీతి వంటి ఎన్నో కేసులలో ఇప్పటికీ తేజస్వి సహా, ఆయనను కన్న పుణ్యదంపతులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ, రబడీదేవి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినా వీళ్లకే ముఖ్యమంత్రి పీఠం అర్హత ఉందని మిగిలిన చిల్లర పార్టీలు నమ్మడానికి కారణం, బీజేపీ ఎడల వారికి ఉన్న గుడ్డి  వ్యతిరేకత. ఇంకా, అడ్వాణీ రథయాత్రను ఆపేసిన వీర సెక్యులరిస్టులని నమ్మడం. పార్లమెంట్‌లో, అసెంబ్లీలో లాలూ కూసిన కూతలు, పదవులలో సాగించిన మేతలు జనం మరచిపోరు. ‘గడ్డి’ తిన్నందుకు లాలూకు ఐదేళ్లు, మరొక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ప్రముఖుడు జగన్నాథ్‌ మిశ్రా, జేడీయూ మాజీ ఎంపీ జగదీశ్‌ శర్మకు నాలుగేళ్ల వంతున జైలు శిక్ష పడిరది. అయినా బెయిల్‌ మీద బయటకు వచ్చి నిస్సిగ్గుగా రాజకీయాలు నడుపుతున్నారు లాలూ. మహిళా బిల్లులో జరిగిన దారుణ జాప్యానికి కారణం పార్లమెంటుకు నరకం చూపించిన యాదవ ద్వయం (లాలూ, ములాయం) కారణమని ఎవరైనా చెప్పగలరు.

నిజానికి బీజేపీ గెలుపుపై ధీమాతో మాత్రమే ఉంది. కానీ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి పార్టీ ఓటమి గురించి ఉన్న అంచనాలు బీజేపీ గెలుపు ధీమా కంటే వేయి రెట్లు ఎక్కువగా కనిపించాయి. ఓట్‌చోరీ అంటూ ఆయన వేసిన వీరంగం ఎంత జుగుప్సాకరం! ఈ సంవత్సరం ఆగస్ట్‌ 17న మొదలుపెట్టి 17 రోజుల పాటు, 20 జిల్లాల వరకు ఈ ఓట్‌ చోరీ యాత్ర లేదా ఓటర్‌ అధికారి యాత్ర నిర్వహించారాయన. ఎన్ని నీచమైన ఆరోపణలు చేశారు? ఇంత చేసినా కనీసం ఒక్క ఓటరు కూడా ఆయన ఆయాసాన్ని గమనించనే లేదని ఫలితాలు ఢంకా బజాయిస్తున్నాయి. కాంగ్రెస్‌ లేదా మహాగఠ్‌ బంధన్‌  విజయం సాధించలేవు కాబట్టి, రాష్ట్రంలో బిహార్‌ యువత జెన్‌జెడ్‌ అల్లకల్లోలం ఆలస్యం లేకుండా దిగుమతి చేయాలని, చేస్తారని దింపుడు కళ్లం ఆశతో చూసిన పచ్చి భారత వ్యతిరేకి రాహుల్‌. ఎస్‌ఐఆర్‌ను ఎందుకు ప్రతిఘటిస్తు న్నారో ఈనాటికీ స్పష్టమైన వివరణ ఇవ్వలేని కిరాయి ఆందోళనకారుడు. తన భారత వ్యతిరేక ధోరణిని ప్రజలు గమనించలేదని రాహుల్‌ అనుకుంటూ ఉంటే, అదెంత పొరపాటో ఈ ఎన్నికలు మళ్లీ రుజువు చేశాయి. గాంధీ`నెహ్రూ కుటుంబ మహోన్నత వారసత్వం తీసుకున్న రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ చూసిన 95వ ఓటమిగా బిహార్‌ ఫలితాలు వినుతికెక్కాయి.

భారీగా పారితోషికాలు స్వీకరించి రాజకీయ పార్టీలకు అలవోకగా గెలుపు చిట్కాలు రాల్చగలరే గానీ, సొంత పార్టీ జనసురాజ్‌ నెగ్గడానికి ప్రశాంత్‌ కిశోర్‌ పథకాలు రచించలేకపోయారు. ఆయన నిబద్ధత వజ్రసదృశ మైనదని భావించాలి. తన పార్టీ గెలుపు కోసం తనకు తాను పారితోషికం సమర్పించుకోలేరు కాబట్టి గెలుపు వ్యూహాలు ఊడిపడలేదనే అనుకోవాలి.

ఈ ఎన్నికలు అవినీతి బురద గుంటలకీ, నదుల స్వచ్ఛత ఉద్యమానికీ నడుమ జరిగిన పోటీ. ఆటవిక న్యాయానికీ, అందరికీ న్యాయం నినాదానికీ మధ్య జరిగిన సమరం. కుటుంబమే పరమావధిగా ఉన్న యాదవ – ముస్లిం ఓట్ల బావి కప్పలకీ, ఆకాశమే హద్దుగా దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న శక్తులకీ నడుమ జరిగిన సమరం. ఇందులో కులోన్మాదశక్తులు, దేశ వ్యతిరేక శక్తులు మట్టి కరిచాయి. ఇది చాలదని అనిపిస్తున్నది. రాహుల్‌కు ఇంతకు మించి, ఇంతకంటే భిన్నమైన గుణపాఠం అవసరం. రాహుల్‌ ఓట్‌చోరీ తమాషాలు కట్టిపెట్టి నిజమైన విపక్షనేతగా వ్యవహరించడం మొదలుపెట్టాలి. బిహార్‌లో ఎన్‌డీఏ విజయం నిర్మాణాత్మకమైనదని గుర్తించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE