సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు భాద్రపద బహుళ నవమి – 15 సెప్టెంబర్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ఇది కొన్ని సామాజిక మాధ్యమాలను నిషేధించినందుకు జరుగుతున్న నిరసన అనగలమా? పార్లమెంట్‌ను తగలబెట్టడం ఏమిటి? కేవలం 48 గంటలలో ప్రభుత్వం దిగిపోవడం ఏమిటి? మంత్రుల ఇళ్ల దహనకాండ ఏమిటి? ఇప్పుడు నేపాల్ గురించిన ప్రశ్నలు ఇవే. అసలే పేదరికం. ఆపై వామపక్ష ఉగ్రవాదం దెబ్బ. దిగుమతి చేసుకున్న రాజకీయ సిద్ధాంతాల పోటు, రాచరిక పునరుద్ధరణ ఉద్యమం, ఇది కాకుండా హిందూ దేశంగా తిరిగి అవతరించాలన్న డిమాండ్, వీటికి తోడు తుర్కియే వంటి ముస్లిం దేశాల కన్ను అన్నీ కలిపి నేపాల్ అనే ఆ చిన్న దేశాన్ని ప్రయోగశాలగా మార్చాయి. 1996 నుంచి దేశాన్ని కకావికలు చేసిన వామపక్ష తీవ్రవాదం మొదలు, జూన్ 1, 2001లో రావు బీరేంద్ర రాజ కుటుంబం హత్య వరకు అన్నీ ఆటుపోట్లే. ఈ నేపథ్యానికి తాజా అల్లర్లు తోడయ్యాయి. కొన్ని సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం నిషేధించడం, అందుకు నిరసనగా యువతరం జెన్ జడ్ ఉద్యమించిందని చెబుతు న్నారు. కానీ ఆ నిషేధం నాలుగు రోజులలోనే ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రధానమంత్రి కేపీ ఓలి శర్మ, మంత్రులు రాజీనామాలు సమర్పించారు. కాల్పులు జరిగి, 20 మంది వరకు చనిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఓలి శర్మ దేశం వీడి వెళ్లడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి (ఓలి సైనికాధికారి ఆదేశాలతో రాజీనామా చేశారని వార్త). అయినా అల్లర్లు ఆగకపోవడం అనుమానాలకు తావిచ్చేదే.
సెప్టెంబర్ 4న నిషేధించిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్ వంటి 26 సామాజిక మాధ్యమాలు నాలుగు రోజులలోనే, సెప్టెంబర్ 8వ తేదీ రాత్రికే నేపాల్‌లో తిరిగి ప్రత్యక్షమైనాయి. రిజిస్ట్రేషన్ కోసం విధించిన గడువు కూడా ముగిసినా ప్రభుత్వం మాటను ఖాతరు చేయనందుకే వాటి మీద ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. అందుకు దేశాన్ని తగలబెట్టడానికి ‘యువతరం’ ఉరకలేయడమే విశేషం. రిజిస్టర్ చేసుకోవడానికి ఆయా సంస్థలకు భారత్‌లో లేని అభ్యంతరం నేపాల్‌లో ఎందుకు అన్న ప్రధాని ప్రశ్న సబబే. ఆ నిషేధానికి నిరసనగా సెప్టెంబర్ 8వ తేదీన జడ్ జెన్ (కొత్తతరం) ఒక్కసారిగా వేల సంఖ్యలో వీధులలో పోరాటం ఉధృతం చేసింది. ఇందులో ప్రధాన పాత్ర పాఠశాల విద్యార్థినీ విద్యార్థులదే. నిరసనలో పాల్గొన్న వారిలో అత్యధికులు 20 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్నవారే. వీళ్లంతా యూనిఫారాలతోనే వీధులలోకొచ్చారు. అందుకే దీనికి జన్ జడ్ ప్రదర్శన అని పేరు పెట్టారు. కొంతమంది నిరసనకారులు పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించడంతో అల్లర్లు తారస్థాయికి చేరాయి. పోఖారా, బత్వాల్, భైరాహవా, భరత్‌పూర్, ఇతాహరి, దామక్ ప్రాంతాలకు అల్లర్లు విస్తరిస్తున్నాయి. ఇంకా కలాంకి, చాపాగాన్ వంటి ప్రాంతాలకు కూడా 9వ తేదీన అల్లర్లు బయలు దేరాయని కఠ్మాండు పోస్ట్ పత్రిక తెలియచేసింది.
సామాజిక మాధ్యమాల మీద విధించిన నిషేధం ఎత్తేశారు. ప్రభుత్వం కూలింది. కానీ అల్లర్లు ఆగడం లేదు. భక్తపూర్‌లోని ప్రధాని నివాసం మీద ఉద్యమకారులు రాళ్లు రువ్వారు. అక్కడ కాల్పులు జరిపితే ఇద్దరు గాయపడ్డారు. నయికాప్ వద్ద హోం మంత్రి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టారు.అల్లరిమూకలు మాధేశ్ ప్రాంత ముఖ్యమంత్రి సతీశ్‌కుమార్ నివాసం మీద రాళ్లు రువ్వారని వార్తలు వచ్చాయి. మాజీ ప్రధాని, నక్సలైట్ ఉద్యమంతో రాచరికాన్ని దించిన పుష్పకుమార్ దహాల్ (ప్రచండ) ఇంటినీ వదలలేదు. మరొక మాజీ ప్రధాని షేర్‌బహదూర్ దేవ్‌బా ఇంటిని (కఠ్మాండు) కూడా లక్ష్యంచేసుకుని రాళ్లు రువ్వారు. ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న కమ్యూనికేషన్‌ల మంత్రి పృథ్విసుబ్బా గురంగ్ సొంత ఇంటికి కూడా ఉద్యమకారులు నిప్పు పెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడ్వాల్‌ను నడివీధిలోనే తన్నారు.
ఈ అల్లర్లు శ్రీలంక, బాంగ్లాదేశ్‌లో అల్లర్లను గుర్తుకు తెస్తున్నాయి. డీప్‌స్టేట్ కుట్రల నేపథ్యంలో ఇవాళ ప్రతి ఉద్యమాన్ని నమ్మడానికి లేదు. అవన్నీ స్థానికులే లేవదీసిన ఉద్యమాలని కచ్చితంగా చెప్పలేం. బాంగ్లాలో ఇదే ఇదే రుజువైంది. నేపాల్ అలజడి స్వరూప స్వభావాలు, కారణాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. కేవలం నాలుగైదు రోజులలోనే దేశాన్ని అతలాకుతలం చేసే విధంగా ఉద్యమం రగిలింది. పార్లమెంట్ మీద దాడి వరకు ఆందోళన కారులు పెట్రేగిపోతున్నారు. నేపాల్‌లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి 36 ఏళ్ల సుదాన్ గురంగ్.ఇతడికి హమి నేపాల్ పేరుతో ఎన్‌జీవో ఉంది. విద్యార్థులు యూనిఫారాలతో, చేతిలో పుస్తకాలతో వచ్చి ఉద్యమంలో చేరవలసిందిగా పిలుపునిచ్చినవాడు ఇతడే. ఎక్కడ రోడ్లను దిగ్బంధనం చేయాలి? ఎక్కడ నిరసనలు జరగాలి అనేవి సామాజిక మాధ్యమాల ద్వారా ఇతడే సూచించాడు. ఇలాంటివి చూస్తుంటే, సామాజిక మాధ్యమాల పెత్తనాన్ని మెచ్చాలో, ఎన్నికైన ప్రజా ప్రభుత్వాల భవిష్యత్తు ఏమిటని తలపట్టుకోవాలో అర్ధంకాని పరిస్థితి.
నేపాల్ ఆందోళన భారత్‌కు తలనెప్పి కాకుండా ఉండదు. అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు కేంద్రం సూచించింది. మన చుట్టూ ఉన్న చిన్న దేశాల మీద చైనా ప్రభావం సుస్పష్టం. కాబట్టి మీ ఇలాకాలలోను గలభా సృష్టించడం మాకు పెద్ద పనేమీ కాదు అని అమెరికా చెప్పదలుచుకుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటికే నేపాల్ మీడియా అల్లర్ల వెనుక సీఐఏ ఉండవచ్చునని అనుమానిస్తున్నది. నేపాల్‌లో చైనాకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఓలి కూడా చైనా మద్దతుదారేనన్న అభిప్రాయం. ఆయన ప్రచండ మాజీ అనుచరుడే. ప్రపంచంలో మళ్లీ ప్రచ్ఛన్నయుద్ధం బాపతు వాతావరణం తేవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నదన్న వాదనకు నేపాల్ తాజా ఉదాహరణ అవుతుందేమో కూడా. ఓటర్ల తొలగింపు పేరుతో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండీ కూటమి భారత్‌లో చేస్తున్న అల్లర్లు అలాంటి వాతావరణం కోసమేనన్న అనుమానాలు కూడా కొందరికి ఉన్నాయి. నిజమే, అమెరికా అధ్యక్ష పదవి ఇప్పుడు ఒక పిచ్చివాడి చేతిలో రాయి కదా!