సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు భాద్రపద బహుళ పాడ్యమి –  08 సెప్టెంబర్‌ 2025, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అది కాంగ్రెస్‌ ‌పార్టీ. ఘనతల కంటే, చీకటికోణాలే కోకొల్లలుగా ఉన్న చరిత్ర దాని సొంతం. స్వాతంత్య్రోద్యమంలో బాలగంగాధర తిలక్‌, ‌సుభాశ్‌చంద్ర బోస్‌, ‌వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌వంటి జాతీయవాదుల కంటే ఆంగ్లేయులనీ, ముస్లిం మతోన్మాదులనీ భుజాలకెత్తుకుని పూజించి, పునీతమైన పార్టీ కూడా. స్వతంత్ర భారతదేశంలో సర్దార్‌ ‌పటేల్‌, ‌పురషోత్తమదాస్‌ ‌టండన్‌ ‌వంటి వారి చరిత్రలు, నిజానికి అసలు సిసలు త్యాగధనులందరి చరిత్రలను కనిపించకుండా చేయడానికి శతథా ప్రయత్నించిన పార్టీ. ఇక రాహుల్‌ ‌కాంగ్రెస్‌. అది భారతదేశాన్ని విదేశీ గడ్డల మీద అవమానిస్తుంది. ఇక్కడి కోర్టులను గౌరవించదు. రాజ్యాంగ వ్యవస్థలను మన్నించదు. భారతీయ సంస్కృతిని అణుమాత్రమూ సహించదు. భారతమాత అనే మాట వింటేనే తేళ్లూ, జెర్రిలూ పాకినట్టు ఉంటుంది దానికి. కాబట్టే ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి స్వర్గీయ హీరాబెన్‌ ‌విషయంలో ఇంత నీచాతినీచంగా వ్యవహరించింది. ఏనాడూ రాజకీయాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోని, ఇప్పుడు మన మధ్య కూడా లేని వృద్ధురాలిని అంత కుసంస్కారంగా దూషించే నీచత్వం ఆ పార్టీకి మాత్రమే చెల్లుతుంది. ఇంత జరిగినా క్షమాపణ చెప్పే కనీస సంస్కారం చూపకపోవడం ఆ పార్టీని నడుపుతున్న రాహుల్‌ ‌గాంధీకే సాధ్యమవుతుంది. అతడి కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు, కుసంస్కారంలో, దిగజారి మాట్లాడడంలో తాము కాంగ్రెస్‌ ‌పార్టీకి ఏమాత్రం తీసిపోమని జాతికి వెల్లడించిన మరొక పార్టీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌. ‌కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షాను ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా ఏమన్నారు? తల నరికి బల్ల మీద పెట్టాలట. ఇదీ ఈ దేశంలో విపక్షాల రోత వైఖరి. ఈ దేశ ప్రధాని పదవి నెహ్రూ-గాంధీ కుటుంబంలోని వ్యక్తి తప్ప అన్యులు తాకరాదన్నది కాంగ్రెస్‌ ‌నమ్మే శాశ్వత సూత్రం. హిందూత్వాన్ని పెకలించి, ముస్లిం మతోన్మాదుల సాయంతో తామే బెంగాల్‌ను శాశ్వతంగా ఏలాలన్న వికృత సిద్ధాంతం ఆ కాంగ్రెస్‌ ‌తానులో ముక్క తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ది.

ఇందిర, రాజీవ్‌ ఏలుబడి కాలాల నుంచి పరిశీలించండి! కాంగ్రెస్‌ ‌పార్టీ దేశంలో ఎక్కడ ఏ పేరుతో ప్రదర్శన నిర్వహించినా, ఊరేగింపు తీసినా గాయాల జాడలు మిగిలేవి. ఇప్పుడు బిహార్‌లో ‘ఓటర్‌ అధికార్‌ ‌యాత్ర’ పేరుతో రాహుల్‌ ‌విన్యాసం చేస్తున్నారు. పక్కన తేజస్వీ యాదవ్‌ అనే ఒక గంథోళీగాడు కూడా ఉన్నాడు. ఇద్దరిదీ ఒకటే చింత. రాహుల్‌ ‌వ్యాకులత-గాంధీ-నెహ్రూ కుటుంబానికి అవతలకి పోయిన ప్రధాని పదవి ఇంకా తమ వశం కావడం లేదని. తేజస్విది బిహార్‌ ‌ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి తాను ఇంకా ఎంతకాలం ఆగాలన్న ప్రశ్న. ఈ ఇద్దరూ కలసి చేస్తున్న యాత్రలోనే దర్భంగా పట్టణంలో ప్రధాని మోదీనీ, ఆయన తల్లినీ వేదిక మీద నుంచే ఒకడు అక్షరాలా బూతులు తిట్టాడు. ఆ తిట్లు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. ఆ ద్విపాద జంతువు పేరు మహమ్మద్‌ ‌రిజ్వి/రజా. దర్భంగాలోనే సింఘ్వారా అనే ప్రాంతం వాడు. ఇతడిని ఆగస్ట్ 29‌న అరెస్టు చేశారు. ఆగస్ట్ 27‌న రిజ్వి ఈ కూతలు కూశాడు. దీనితోనే పట్నాలో కాంగ్రెస్‌, ‌బీజేపీ కార్యకర్తలు బాహాబాహీ తలపడవలసి వచ్చింది. పట్నా ఘర్షణ మీద రాహుల్‌ ‌స్పందిస్తూ, మా పార్టీ ఎంతటి హింసనైనా అహింసాయుతంగానే ఎదుర్కొంటుందని తింగరి మాటలు చెప్పారే తప్ప, ఒక వృద్ధురాలిని నీచంగా దూషించడం తప్పని మాత్రం అనలేకపోయారు. ఇంతకంటే నీచం, కాంగ్రెస్‌ ‌నాయకుడు పవన్‌ ‌ఖెరా జుగుప్సను దంచిన మాటలే దేశం మీద ఉమిశారు. బీజేపీయే తమ ఏజెంట్‌ ‌చేత అలా తిట్టించిందట. దర్భంగా యాత్ర నిర్వాహకుడు యువజన కాంగ్రెస్‌ ‌నాయకుడు మహమ్మద్‌ ‌నౌషాద్‌ ‌క్షమాపణ చెప్పినా, ఆ సమయంలో తాను అక్కడ లేనని తప్పించుకున్నాడు. అలాగే కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా ఈ ఉదంతంతో తమకు సంబంధం లేనట్టే మాట్లాడింది. రాజకీయాలు ఇంత జారిపోయాయా అంటూ బీఎస్‌పీ అధినేత్రి ప్రశ్నించడం ఇందుకే మరి! చాలా పార్టీలు నోరే ఎత్తలేదు. మహిళా సంఘాలు నోళ్లు కుట్టేసుకున్నాయి.

తమ పార్టీ మూల సంస్థ కాంగ్రెస్‌ ‌ప్రధాని పట్ల అంత అవమానకరంగా వ్యవహరిస్తే, తాము కొంతయినా అవమానించాలి కదా అన్నట్టు వ్యవహరించింది టీఎంసీ. ఇది కేంద్ర హోం మంత్రిని లక్ష్యంగా చేసుకుంది. అమిత్‌ ‌షా తల నరకేయాలని ఆగస్ట్ 26‌న నాడియాలో విలేకరుల ఎదుట ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా విషం కక్కారు. పశ్చిమ బెంగాల్‌లోకి చొరబాటుదారులు రాకుండా ఆయన విఫలమయినందుకు ఆ మాత్రం శిక్ష విధించాలని మహువా మహిళామణి చిరుకోరిక. చొరబాట్ల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో జన సమీకరణలు మారిపోయాయన్న వాస్తవాన్ని ఆగస్ట్ 15‌న ఎర్రకోట నుంచి ప్రధాని వెల్లడించడం ఆమెకు పరమ దుర్భరంగా ఉంది. అక్కడ సరిహద్దు భద్రతాదళాలు కాపలా కాస్తున్నా చొరబాట్లు ఎందుకు జరిగాయంటూ మహువా చొప్పదండి ప్రశ్న కూడా సంధించారు.

ప్రధాని కన్నతల్లిని దూషించినా కాంగ్రెస్‌ ‌వాస్తవ అధినేత రాహుల్‌ ‌ఖండించరు. కేంద్ర హోం మంత్రి తల నరకేయాలని తమ పార్టీ ఎంపీ వాగినా తృణమూల్‌ ‌నేత మమతా బెనర్జీ పెదవి విప్పలేదు. ఈ ఉదంతాల మీద కేసులు నమోదు కావచ్చు. కేసులు విచారణకు రావచ్చు. కోర్టు వారు వీళ్లని శిక్షంచ వచ్చు. లేదా అలా మాట్లాడడం భావ ప్రకటనా స్వేచ్ఛగా పరిగణించి, మర్యాదగా సభ్య సమాజంలోకి తిరిగి పంపవచ్చు. కానీ సభ్య సమాజం మీద, నాగరికత మీద, రాజకీయాల మీద, ప్రజాస్వామ్యం మీద ఈ ధోరణి తన విషపు గోళ్లను ఎంత లోతుకు దింపుతున్నదో మర్యాద తెలిసిన వారంతా ఆలోచించాలి. వీళ్లు రాజకీయాలను బూతుమయమో, హింసాత్మకమో చేస్తున్నా రనడం చిన్న మాట. ఒకరు సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని కలుషితం చేస్తున్నారు. మరికొందరి తలలు తాలిబన్‌ ‌తరహా ఆటవిక ప్రవృత్తితో నిండి పోయాయి. ఐదేళ్లు.. పదేళ్లు.. లేదా పాతికేళ్లు.. పదవులలో ఉండగలిగే ఇలాంటి పశు ప్రవృత్తి కాలపరీక్షకు నిలిచిన విలువలపై కాలు దువ్వుతుంటే, ధ్వంసం చేస్తుంటే పౌరులు ఇంకా మౌన ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం ఏమిటి?

About Author

By editor

Twitter
YOUTUBE