రచన అంటాం, రచయిత్రీ అని పిలుస్తాం.
కళ అంటూ ఆరాధిస్తాం. కళాకారిణిగా గౌరవిస్తాం.
శాస్త్రం పేరిట ప్రత్యేకతనిస్తాం. మహిళా శాస్త్రవేత్తగా పరిగణిస్తాం.
సాహిత్యం, కళలు, శాస్త్రాలు, వీటన్నింటికీ ఉన్న అంతర్లీన లక్షణం వ్యక్తీకరణ. అభివ్యక్తం చేయడం. ఎంత ప్రభావంతంగా వ్యక్తపరిస్తే, అంతగా జనస్పందన.
‘నాట్యం’లో సాహిత్యం, సంగీతం, మరెన్నో కలగలిసి ఉంటాయి.
నర్తకిని తిలకిస్తే రచనల, కళల, శాస్త్రాల సమాహారం కనిపిస్తుంది.
మరి బాలనర్తకీమణులను చూస్తే సంస్కృతి ప్రత్యక్షమైనట్లే!
ఇప్పుడు మనం చూపు సారిస్తోంది ‘బాల సరస్వతి’కి సంబంధించి…
తమిళనాట పుట్టిన నృత్యకారిణి బాలసరస్వతి. నృత్యం చేసే వారందరికీ తెలుగు ధారాళంగా వచ్చి ఉండాలని అంటారామె. అందుకేనేమో ‘నాట్యలోక రాణి’గా ప్రశంలు అందుకున్నారు.ఎ.ఎస్. రామన్ (అవధాన సీతారాముడు) అనే ఒక ఆంగ్ల వార పత్రిక సంపాదకుడి (భారతీయ మొదటి సంపాదకుడు) వల్ల ఆమె పేరు విశ్వవ్యాప్తమైంది. ఆయనతో ‘బాలమేధావి’ అనిపించుకోవడమే ఆమె ప్రత్యేకత. ‘పద్మవిభూషణ్’ పురస్కారం అందుకొని బాలసరస్వతికి ఇది స్వర్ణోత్సవ సందర్భం!
కర్ణాటక సంగీ తానికి, దాని ప్రభావం ఉన్న భరతనాట్యానికి తెలుగు భాషతో పరిపూర్ణత సాధించడమే ఆమె విలక్షణత.
తంజావూరు పేరు విన్నారు కదా! తమిళనాడులోని ఊరు. పండిత, కళాకారుల నిలయం.
తమిళుల తర్వాత అధిక సంఖ్యలో ఉండేది తెలుగువారే అక్కడ. అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ గుర్తించిన ‘ప్రపంచ వారసత్వ’ ప్రదేశాలో ఒకటి. విశ్వవిఖ్యాత ‘సరస్వతీ మహల్’ ఉంది కూడా ఇక్కడే! వేలాది చేతిరాత ప్రతులు ఉన్నాయక్కడ.
అటువంటి సాహిత్య, సంగీత, నాట్యకళాకారుల వంశం. జయమ్మాళ్, వీనధనమ్మాళ్•, సుందరమ్మాళ్, రుక్మిణమ్మ… వీరంతా కళాకారిణులే. ఈ వారసత్వమే బాల సరస్వతికీ లభించింది.
మొట్టమొదటి నాట్య ప్రదర్శన కాంచీపురంలో….అటు తర్వాత మద్రాసులో.
అనంతర కాలంలో జపాన్ వేదికపైన కూడా! ఒక సందర్భంలో కోల్‌కతాలో నర్తించారు.
వారణాసిలో ప్రదర్శించినపుడు ప్రేక్షకుల్లో ఉన్న రవీంద్రనాథ ఠాగూర్ చూసి ముగ్ధులయ్యారు. శాంతినికేతన్‌కు ఆహ్వానించడంతో.. ఆమె జైత్రయాత్ర మరింత వేగాన్ని అందుకుంది.తంజావూరు బాలసరస్వతి ఖ్యాతి మరెంతో విస్తరించింది.ఇంగ్లండ్‌లో వరసగా అనేక రోజులపాటు నృత్య ప్రదర్శణలు.
దేశవిదేశాల్లో ఇచ్చిన ప్రత్యేక ప్రదర్శన ‘జనగణమన’ ఆ గీతాన్ని ‘తత్వబోధిని’ పత్రిక ప్రచురించింది అప్పట్లోనే.
శీర్షిక : భారత విధాత.
ఠాగూర్ విరచిత గీతంలోని భాగాల సమాహారం ప్రదర్శిస్తున్నపుడు ఎంతగానో పొంగి పులకించే వారామె. దేశభక్తికి, భాషాభివృద్ధికి అనుదిన బంధం ఉంటుందనేవారు.
ఆమె అభిప్రాయం ప్రకారం….మన చరిత్ర, సంస్కృతి, భాషల పరంగా అభిమాన గౌరవాలు, సంప్రదాయాలు, ఆచారాల గురించిన నిబద్ధత. విధేయతను కనబరిచే తత్త్వం. రాజీపడని వర్తనం. వీటన్నింటి కలయికే దేశభక్తి తత్పరత. తత్వరత. ఏ ప్రదర్శనకైనా, కళాత్మకతకైనా ఇదే ప్రాతిపదిక. అందుకే ఆ భక్తిభావాన్ని ఎంతగానో అభివ్యక్తం చేసేవారు.
భారతీయ నాట్యరీతుల్లోని సంప్రదాయ విలువల పరిరక్షణకు ఎంతగానో పరితపించారు. భరతముని ‘నాట్యశాస్త్రం’లోని అభినయ ప్రాధాన్యాన్ని విశదీకరించేవారు.
భావం, రాగం, తాళం…ఇవే అంతర్గత విశేషాలు. వీటిని బాల్యం నుంచే నేర్పిస్తే కళాకారిణుల సత్వరం రాణిస్తారు. ముఖ, హస్త, పాద కదలికలతో భంగిమలను కనబరుస్తారు. ప్రత్యేకించి భరతనాట్యం గురించిన విశేష శిక్షణ వారికి ఎంతైనా వన్నె తెస్తుందంటూ తన అనుభవాలను వివరించేవారు బాలసరస్వతి.
కాంచీపురంలోని దేవీమందిరంలో బాలికగా ఆమె అభినయ చాతురి ప్రేక్షకులందరినీ పరివశింపచేసింది. అప్పటికి తనకి ఏడేళ్ల వయసు. అభినయం అనేసరికి మనోభావాల ప్రదర్శన ఉంటుంది. భావోద్వేగాలను వ్యక్తీకరించడం ప్రస్ఫుటమవుతుందనీ తన అనుభవాలు నిరూపించాయి. మద్రాసుకు చెందిన మ్యూజిక్ అకాడమీ సౌజన్యంతో బాలసరస్వతి నృత్య విద్యాలయాన్ని ప్రారంభించారు. అనేకసార్లు అమెరికా సందర్శించారు.అక్కడి విశ్వవిద్యాలయాల విద్యార్థినులకు భారతీయ నృత్య సంప్రదాయ అంశాలను విపులీకరించారు. మన కళలకు ఎంత ప్రాచుర్యం కలిగించారో మాటల్లో చెప్పలేం.
సంగీత నాటక అకాడమీ ఆమెకు జాతీయస్థాయి పురస్కృతిని అందజేసింది. సంగీత కళానిధి బిరుదూ ఆమెనే వరించింది. రవీంద్రభారతి (శాంతినికేతన్) డాక్టరేట్ పట్టా ప్రదాచేసింది. ఇలా ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్నారు.
భరతనాట్యాన్ని అభ్యసించడం కోసమే తెలుగును నేర్చుకొని, నిపుణత సంతరించుకొని, ఆదర్శప్రాయులయ్యారు. శబ్దం, వర్ణం, పదం, జావళీలు, థిల్లానాలు, జతిస్వరాలు వీటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పరిశోధించడం కళారంగానికి అనంత ప్రయోజనాన్ని చేకూర్చింది.
బాలనర్తకుల కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కళాసంస్థలవారు, ప్రభుత్వాల పరంగా ఏం జరగాలన్నది అంశాలవారీగా తెలిపారు ఆమె. వాటిని క్రోడీకరించి చూస్తే:
- బాల్యం అనేది అపురూపం. అప్పుడు కలిగే ఏ భావనైనా బాలికల జీవితాన్ని ప్రభావితం చేసి, ఎన్నో విధాలుగా తీర్చిదిద్దుతుంది. ప్రోత్సాహం ముందుగా ఇంటినుంచి కావాలి, రావాలి, తల్లిదండ్రులే బాధ్యతవహించి ఉత్సాహపరచాలి.
- గురు ముఖఃత శిక్షణ ఎంతో కీలకం. భాష, భావం, వ్యక్తీకరణ పక్రియల్లో శిష్యులను ముందుకు తీసుకెళ్లేది గురువులే. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే శిష్యులు రూపుదిద్దుకుంటారు అంటూ తన బాల్యానుభవాలను ఇలా గుర్తుచేసుకున్నారు. ‘నాది ఆసక్తినింపిన మనస్తత్వం. తెలియనివి తెలుసుకోవాలని ఉంటుంది. తెలిసినవాటిని వ్యక్తీకరించాలనీ అనిపిస్తుంటుంది. మెళకువలు తెలియాలంటే గురుప్రోత్సాహం ఉండి తీరాల్సిందేకదా! నా గురువులు నన్ను తీర్చిదిద్దారు. ఆలోచనలకు వారే పదునుపెట్టారు. ఎన్ని ప్రశ్నలడిగినా ఓపికగా సమాధానాలు చేప్పేవారు. ప్రదర్శన అవకాశాలనీ వారే కల్పించారు.’
ఈ మాటలు సదా మననీయాలు. ప్రస్తుత విద్యావిధానం పరీక్షలకే పరిమితమవుతోంది. మార్కుల కోసమే బాల్యమంతా హరించుకుపోతోంది. సృజనను వెలికిదీసే వాతావరణమే కనుమరుగవుతోంది. పిల్లల ఇష్టాలకంటే పెద్దల నిర్బంధ ధోరణులే ఎక్కువవుతున్నాయి. దీనికి భిన్నంగా ఉత్సాహపూరిత వాతావరణం కావాలిప్పుడు.
ఆబాలగోపాలాన్నీ కళాభివ్యక్తితో ఆకట్టుకున్న బాలసరస్వతిని తరతరాలూ గుర్తు చేసుకుంటాయి. ఆమె జ్ఞాపకాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.అందులో భాగంగా ప్రత్యేక తపాలా బిళ్ల విడుదలైంది. ఆ ఆవిష్కరణ సందర్భంలో దేశ రాజధాని వేదికగా ఏర్పాటైన బాల నర్తకీమణుల నృత్య ప్రదర్శనలు అపూర్వ అనుభూతినిచ్చాయి.
ఆమె వారసత్వం కళాజ్యోతిని తలపిస్తోంది.తనయ లక్ష్మి ఆ బాటలోనే నడిచారు. మనుమడు ప్రత్యేకంగా సంస్థను స్థాపించి, బాలల నాట్యజీవితాలను తీర్చిదిద్దుతున్నారు. బాల సరస్వతి జీవిత అనుభవాలకు ఆమె అల్లుడు అక్షర రూపమిచ్చారు. ఆమె వారసులు ఆమె ఆశయాలను పరిరక్షిస్తూ,విస్తృత ప్రాచుర్యానికి తెస్తున్నారు. బాల్యదశనుంచే ప్రధానంగా ఆడపిల్లల కళాత్మకత, సృజన శక్తులను వెలికితీసే లక్ష్యంతో బాలనర్తకి’ అనే విభాగాన్ని రూపొందించారు.
తెలుగుతల్లి మెడలో పూలమాలికలు
బంగరు భవితకు పలికలు
చిన్నారి బాలికలు.
వారి ఆలోచనను గుర్తించి
సృజనశీలతను గ్రహించి
నర్తనాది రంగాల్లో ప్రోత్సహిస్తే చాలు.
అదే అన్ని విధాలా మేలు.
కళా సరస్వతికి నవోదయ నీరాజనాలు!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్