వేసవిలో, హిమాలయాలలో మంచు కరిగి నీరుగా మారడం, శీతాకాలంలో మంచుకొండలు తిరిగి ఏర్పడడం ప్రకృతి మనకిచ్చిన వరం, ప్రకృతి ధర్మం. అయితే దీనికి భిన్నంగా, గత కొన్ని దశాబ్దాలుగా, మంచుకొండలు కరుగుతున్నంత వేగంగా, అంతే పరిమాణంలో తిరిగి మంచుకొండలు హిమాలయాలలో ఏర్పడకపోవడం, భారతదేశాన్ని ముఖ్యంగా లద్దాఖ్‌ ‌ప్రాంతాన్ని కలవరపెడుతున్న అంశం. దీన్నే శాస్త్రీయంగా ‘‘గ్లాసియల్‌ ‌మెల్టింగ్‌ & ఇరోజన్‌’’ అనవచ్చు. దీనిమీద అనేక మంది స్వదేశీ, విదేశీ శాస్త్రవేత్తలు, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చేస్తున్న పరిశోధనలు, తద్వారా విడుదల చేస్తున్న నివేదికలను చూస్తుంటే విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.

హిమాలయాల్లో హిమానీనదాలు అత్యంత వేగంగా కరిగిపోతూ, తత్ఫలితంగా దాదాపు 200 కోట్ల జనాభాకు భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడొచ్చని, అందులో ముఖ్యంగా లద్దాఖ్‌ ‌ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి కావచ్చని ఐక్యరాజ్యసమితి-ఐరాస నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇలా మంచు ఎక్కువ పరిమాణంలో కరిగి, ప్రమాదకరమైన వరదలు సంభవించడం, తత్ఫలితంగా నీరు నదులద్వారా పల్లపు ప్రాంతాలకు పారి, భవిష్యత్తులో లద్దాఖ్‌ ‌ప్రాంతంలో నీటి కొరత పూర్తిగా ఏర్పడే ప్రమాద ముందని అంచనా. దీనికి ముఖ్య కారణం ఆ ప్రాంతం హిమానీనదాల నుంచి మంచు కరుగగా వొచ్చే నీటి పైనే ఆధారపడటం. ఎందుకంటే లద్దాఖ్‌ ‌లో వర్షపాతం తక్కువ, నీటి ఆవిరి వేగం ఎక్కువ, చెట్లు చేమలు ఎక్కువ లేకపోవడం. అందుకే దానిని ‘‘ఎక్కువ ఎత్తులో చలితో కూడిన ఎడారి(హైకోల్డ్ ‌డెజర్ట్)’’ అం‌టారు. అందుకే ఈ ప్రాంతంలో ఏర్పడే వాతావరణ అసమతుల్యత ముఖ్య జీవనాధారమైన వ్యవసాయాన్ని దెబ్బతీస్తోంది. ప్రజల జీవనం దుర్భరమౌతోంది. దీన్నే వాతావరణ సంక్షోభం (క్లైమేట్‌ ‌క్రైసిస్‌) అనొచ్చు.

హిమానీనదాలు వేగవంతంగా కరిగిపోవడానికి ముఖ్య కారణాలు:
1. వాతావరణ మార్పులు- పెరుగుతున్న ఉష్ట్నోగ్రతలు
భూతాపం ద్వారా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. మంచు అతి వేగంగా కరిగిపోతుంది. తిరిగి అంతే పరిమాణంలో మంచు పేరుకుపోదు. ఇది హిమానీ నదాల తరుగుదలకు ఒక ముఖ్య కారణంగా పేర్కొనచ్చు.

2. హిమానీనదాల అరుగుదల
ఇది భౌతిక పక్రియ.ఇది రెండు విధాలుగా జరుగుతుంది. మొదటిది రాపిడి వల్ల. మంచులో ఉన్న రాతి ప్రదేశాలు/ రాతి ఉపరితలాలు, మంచు గుట్టలు ఒకదానితో ఒకటి వొరుసుకొనిపోతాయి. మంచు ముక్కలైపోతుంది. పడిపోతుంది. కరిగి పోతుంది. రెండవది విడివడడం. మంచు పదే పదే కరుగుతూ, తిరిగి గడ్డకడుతూ, విడివడిపోయి, పడిపోయి, హిమానీనదం ద్వారా దూరంగా కొట్టుకు పోవడం.

మంచు కరగడం, కుంచించుకుపోవడం వల్ల వచ్చే దుష్ఫలితాలు
మంచు కరగడం వల్ల హిమాలయ పర్వత ప్రాంతాల్లో భూమి, వృక్షసంపదలో మార్పులు సంభవిస్తాయి. జీవుల మనుగడకు విఘాతం ఏర్పడుతుంది. వ్యవసాయ భూముల స్థితిగతులలో మార్పు వస్తుంది. భూమి కోతకు గురవుతుంది. భూమి మీద కరిగిన నీరు నిల్వ ఉండిపోతుంది. వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గిపోతుంది. రవాణా మార్గాలు దెబ్బ తింటాయి. నీరు నదుల ద్వారా సముద్రానికి చేరుకుంటుంది. సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పోతుంది. తుఫానులు, సునామీలు సంభవిస్తాయి. తీరప్రాంతాలు క్రమేణా కోతకు గురవుతాయి. తీరప్రాంతాలలోని జనావాసాలు, నగరాలు సముద్రంలో ముంపునకు గురికావడం వంటి విపత్తులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.

హిమనీనదాల అరుగుదల/కుచించుకు పోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
హిమానీనదాలు కుచించుకు/సుష్కించుకుపోవడం వల్ల గుర్రపునాడ ఆకారపు లోయలు ఏర్పడుతాయి. మంచు పర్వతాల మధ్య పాత్ర ఆకారంలో ఖాళీలు ఏర్పడుతాయి.పర్వతాలు బీటలువారుతాయి. పర్వతాల్లో కొమ్ములు లాంటి కోసైన శిఖరాలు ఏర్పడుతాయి. ఒకప్పుడు దట్టంగా ఉన్న పర్వత భాగం కరిగి కృశించిపోయింది అనేందుకు ఇది ఒక నిదర్శనం. దీని కారణంగా హిమనీనదం ఉపరితలం నున్నగా అయిపోతుంది. మంచు పేరుకుపోదు. మంచు ఉపరితలం పై గీతలు పడే అవకాశాలున్నా యని పరిశోధనలు వెల్లడించాయి. ఫలితంగా లోతైన లోయలు ఏర్పడుతాయి. పర్వతప్రాంతంలో కరిగిన మంచు ఈ లోయల్లోకి చేరుతుంది. ఘనీభవిస్తుంది. అది గడ్డకట్టి/ సరస్సుల రూపంలో అక్కడే ఉండి పోతుంది. పీఠభూమి ప్రాంతాలకు ప్రవహించదు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో నీటి కరువు ఏర్పడే ప్రమాదం ఉంది.
అలాగే అనుబంధ లోయలు- హ్యాంగింగ్‌ ‌వ్యాలీస్‌ ఏర్పడతాయి. వీటి వల్ల ఆ ప్రదేశాలలో నదుల ప్రవాహం మారుతుంది. నీటి ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది. జలచరాల మనుగడపై ప్రభావం చూపుతుంది. కరిగిన మంచు ప్రవహించడం వల్ల రాతి భాగాలు రాపిడికి గురై, రాతి చూర్ణం మంచు ప్రాంతాలలో పేరుకుపోవడం లాంటివి జరిగే ప్రమాదముంది. నిజానికి పటిష్టమైన హిమానీనదాలు నీటి నిల్వలుగా ఉపయోగపడతాయి. ఇవి వేసవి కాలంలో కరిగి పల్లపు ప్రాంతాలకు నీటిని అందిస్తాయి. అలాంటి పటిష్టమైన హిమానీనదాలు మానవాళి ఆధునిక పోకడలతో, వాతావరణంలో మార్పులు ఏర్పడి, అధికంగా కరిగి, నీరు నష్ట పోవడం మానవాళి ఎదుర్కొంటున్న పెను ముప్పుగా భావించవచ్చు.

లద్దాఖ్‌పై ప్రభావం:
దాదాపు 1980 నుంచి లద్దాఖ్‌ ‌ప్రాంతం నీటి కరువును ఎదుర్కుంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనికి కారణం హిమానీనదాలు కరిగి పోవడం/కుంచించుకుపోవడం. ప్రస్తుతం అక్కడ నమోదవుతున్న వర్షపాతం సంవత్సరానికి 50 నుండి 70 మి.మి.లు మాత్రమే అని గణాంకాలు చెప్తున్నాయి. పైగా 80 శాతం వరకు ఇక్కడి ప్రజలు వర్షాధార వ్యవసాయం పైనే ఆధార పడుతున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ ప్రాంత సమస్య ఎంత గంభీరమైనదో అంచనా వేయవచ్చు. 2000 – 2024 మధ్యకాలంలో ఈ ప్రాంతం చాలా హిమానీనదాల పరిమాణాన్ని నష్ట పోయింది. దీనివల్ల మంచు పర్వతాలలో ప్రతికూల అసమతుల్యత ఏర్పడింది. ఇక్కడి హిమానీనదాల సాంద్రత ఒక ఏడాదికి 0.35 నుంచి 0.37 మీటర్ల నీటి పరిమాణం వరకు తగ్గిపోయింది. తూర్పు లద్దాఖ్‌ ‌ప్రాంతంలో ఈ తగ్గుదల 0.21 నుంచి 0.33 మీటర్లుగా ఉంది.
పార్కాచిక్‌ ‌హిమానీనదం 1971-1999 మధ్యకాలంలో సగటున సంవత్సరానికి 2 మీటర్లు సన్నగిల్లింది. 1999-2021 మధ్య కాలంలో సగటున 12 మీటర్లకు సన్నగిల్లింది. జన్సార్‌ ‌ప్రాంతంలోని డ్రాంగ్‌ ‌డ్రంగ్‌ ‌హిమానీనదం సగటున ఒక మీటరుకు సన్నగిల్లిపోతోంది. క్రీస్తు శకం 1600తో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ దాదాపు 40% హిమానీనదాలు కనుమరుగైపోయాయి. పాంగోంగ్‌లో 1990-2019 మధ్యకాలంలో 87 హిమానీనదాలు 6 నుంచి 7 శాతం సన్నగిల్లాయి.
లద్దాఖ్‌కు ముంచుకొస్తున్న నష్టాలు

  • మంచు నీటి నిల్వల పరిమాణం క్రమేణా తగ్గిపోవడం
  • ఆకస్మిక వరదలు
  • వ్యవసాయానికి నీటి అలభ్యత
  • ఎడారి ప్రాంతంగా మారిపోవడం
  • పర్యాటక రంగం దెబ్బతినటం
  • ప్రజల జీవనం దుర్బరం కావటం
  • స్థానికులు వలస పోవటంనష్టనివారణకు ప్రభుత్వ చర్యలు
  • హిమాలయాలలో పర్యావరణ స్థితిగతులను, హిమానీనదాల పరిమాణాలను నిరంతరంగా పర్యవేక్షించడం
  •  హిమానీనదాల పరిరక్షణకు నిర్దేశించిన విధానాలను అభివృద్ధి చేయడం, అమలు పరచడం
  • శాస్త్రవేత్తలతో నిరంతరం అనుసంధానమై, సంబంధిత విజ్ఞానాన్ని వృద్ధి చేయడం
  • హిమాలయాలు ఉన్న రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి వాతావరణ విభాగాలను ప్రోత్సహించడం
  • వాతావరణ మార్పుల వల్ల వచ్చే సవాళ్లను, నష్టాలను అంచనా వేయడం
  • సవాళ్లను, నష్టాలను తట్టుకోవడానికి, అధిగ మించడానికి, తప్పకపోతే అలవాటుపడడానికి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేయడం.
  • జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికరణ సంస్థ- ఎన్డీఎంఏ నిపుణులతో కలిసి హిమానీనదాల సరస్సుల నుంచి అకస్మాత్తుగా ఉద్భవించే వరదల కారణంగా వచ్చే విపత్తును సమర్థమంతంగా ఎదు ర్కోవడానికి, ఆస్తి, ప్రాణ నష్టాలను నిలువరించడానికి అవసరమైన మార్గదర్శకాలను జాతీయ స్థాయి తయారు చేస్తుంది.
    క్షేత్రస్థాయి కార్యాచరణలో కొన్ని ప్రాజెక్టులు
  • మంచు స్థూపాలు – వీటి ద్వారా నిల్వ చేసిన నీటితో వ్యవసాయ అవసరాలు తీర్చడం.
  • వ్యవస్థీకృత నీటి నిల్వ నిర్వహణ
  • బిందు సేద్యం
  • చెక్‌ ‌డాముల నిర్మాణం
  • సాంప్రదాయక ఇంధన వనరుల వినియోగం
  • ఉపగ్రహం ద్వారా పరిసరాలలో మార్పులను గమనించడం
  • క్షేత్ర స్థాయి పరిశీలనలు, పరిశోధనలు
  • అడవుల పెంపకం
  • వ్యర్థాల సమర్థ నిర్వహణ
  • కరువు పరిస్థితుల నిర్వహణ
  • కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కృషి ఇలాగే కొనసాగి లద్దాఖ్‌ ‌ప్రాంతం ఈ విపత్తునుంచి గట్టెక్కాలని ఆశిద్దాం.
                                                              ‘‘సర్వేజనాః సుఖినోభవంతు’’

       -మహావాది రామకృష్ణ

About Author

By editor

Twitter
YOUTUBE