పూలతో దేవతలను అర్చించడం సహజం. కానీ పూవులనే దేవతగా సంభావించడం బతుకమ్మ పండుగలోని ప్రత్యేకత. ప్రకృతిని ఆరాధించే అతి పెద్ద పండుగ. బతుకమ్మగా, బతుకునిచ్చే అమ్మగా, ఇంటింటి ఆడబిడ్డగా నవరాత్రలు వేళ నడచి వస్తుంది. తమ బతుకులు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఏరేరి తెచ్చిన పూలతో అలకరించి జరుపుకొనే సంబరం. బతుకమ్మ సంతానాన్ని, బతుకును ఇచ్చే దేవత అని జానపదుల/పల్లెప్రజల భావన.తమ పిల్లలు సుఖసంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ పండుగ సందర్భంగా వారికి దుస్తులు, గాజులు, నగలు కానుకలుగా ఇస్తారు. వీటన్నిటికి అవసరమైన ధనాన్ని ఇచ్చేది శ్రీలక్ష్మీదేవి కనుక, బతుకమ్మ శ్రీలక్ష్మి అవతారమని నమ్మకం.హైటెక్‌/ఆధునిక యుగంలోనూ అత్యంత ఆదరణ పొందుతున్న పండుగ అనడంలో అతిశయోక్తిలేదు. రాష్ట్రేతర, ప్రవాసాంధ్రులు ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.

ప్రకృతి అందాలను చాటి చెప్పే పండుగ ఇది. భాద్రపద అమావాస్య నుంచి ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు పండుగను ఎంతో సంబరంగా చేసుకుంటారు. ఈ పండుగ భాద్రపద అమావాస్య నాడు ఆరంభవుతుంది. దీనికి పెత్తరామాస, పెద్దల అమాస అని పేర్లు. చివరి రోజు పండుగను ‘పెద్ద బతుకమ్మ’ లేదా ‘సద్దులు’ అంటారు. ఆరవనాటి పండుగను ‘అర్రెం’ అంటారు. ఆరోజు బతుకమ్మలు పేర్చడం గానీ, ఆడడం గానీ ఉండదు.మొదటి రోజు మొగ్గలను సేకరించి పెదవులతో ఊది బతుకమ్మను పేరుస్తారు కనుక దీనిని ‘ఎంగిలి పూలు’ అంటారని జానపదులు భావిస్తారు కాని దీనిని ‘తొలి’అనే అర్థంలో వాడతారు.

బతుకమ్మ పండగ వస్తూందంటే పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది. దానిని పెద్ద సంబురంగా భావించి, ఇళ్లను  శుభ్రపరచి, చక్కగా అలంకరించు కుంటారు. అత్తింటి నుంచి  ఆడపిల్లలను పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు అత్తింటి వారు కృత్రిమ (కాగితపు)పూలతో చేసిన బతకమ్మను వాయనంగా పంపుతారు.

బతుకమ్మను బతుకునిచ్చే అమ్మగా,‘త్రిమాత’ల స్వరూపంగా పూజిస్తారు. ప్రకృతిని ఆధారం చేసుకుని భక్తి పారవశ్యంతో బతుకమ్మ తల్లిని కొలుస్తారు. ఈ పండుగ రోజులలో ప్రతి రోజు (ఆరవ రోజు మినహా) వెదురు లేదా దుసేరు తీగలతో అల్లిన సిబ్బిలో గుమ్మడి పూవులు పరచి దానిపై తంగెడు, పైడి తంగేడు, గునుగు, నువ్వు, రుద్రాక్ష, కట్ల, గట్టు గొరిమిడి, కాకర,సొర,బీర, గన్నేరు, పొట్ల, కట్టాయి తదితర పువ్వులతో బతుకమ్మను పేర్చి దానిపై గౌరమ్మ (పసుపు ముద్ద)ను నిలుపుతారు. పసుపు కుంకుమలతో అర్చించి దేవుడి గదిలో చెక్క పీటపై ఉంచుతారు. సాయంవేళ పెద్దలు, పిన్నలు ఆలయ ప్రాంగణంలోనో, ఊరి బయట చెరువు/కాలువ దగ్గరనో గుమిగూడి ఆడి పాడతారు. ఈ పాటలు మాత్రాఛందస్సులో సాగుతూ ద్విపద కవితకు దగ్గరగా ఉంటాయి. మామూలు పాటల్లా కాకుండా చిన్నచిన్న ఇతి వృత్తాలు, పౌరాణిక, చారిత్రక సంబంధిత పురాణగాథలతో, నీతిసూత్రాలతో సాగుతూ, ప్రతి పాదం చివరలో కోల్‌ ఉయ్యాలో, చందమామ, గౌరమ్మ మొదలైన పదాలు,పదబంధాల్లో ఏదో ఒకటి వస్తుంది. ఉదాహరణకు…

‘శ్రీరాముని తల్లి ఉయ్యాలో…

శ్రీమతి కౌసల్య ఉయ్యాలో

ప్రేమతో శాంతను ఉయ్యాలో

పిలిచి దగ్గరకు ఉయ్యాలో…’

అంటూ కౌసల్యను స్మరించుకొంటూ, ఆడపిల్లలు పెరిగి, అత్తింట్లో మెలగవలసిన తీరును వివరిస్తుంది.

‘తంగేడు పూవుల్లా చందమామ

మల్లెసండొస్తవు చందమామ

గునుగీయ పూవుల్ల చందమామ

బత్కమ్మ పోతుంది చందమామ….’

అంటూ… పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లే కూతురిని కానుకలతో పంపినట్లే, బతుకమ్మను దుర్గాష్టమి నాడు సాగనంపుతారు.

వాడుకలోని చిన్నచిన్న మాటలతో ఎంతో సారాన్ని ఇమిడ్చుకున్న సామెతలు కూడా ఈ పాటల్లో విరివిగా కనిపిస్తాయి. ప్రతీపాట ఒక కథ చెబుతున్న ట్లుంటుంది. జీవితంలో ఒడుదొడుకులను అధిగమించి, జీవితాన్ని చక్కదిద్దుకునే తీరును ఈ పాటలు వివరిస్తాయి.

తొలి రెండు రోజులు బొడ్డెమ్మగా, మూడోనాడు మహాలక్ష్మిగా, నాలుగవ రోజు గౌరమ్మగా, అయిదో రోజు అట్ల బతుకమ్మగా, ఆరో రోజు అలిగిన బతుకమ్మగా (అందుకే ఆ రోజు ఆడరు), ఏడవనాడస్త్ర వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు బతుకమ్మగా, తొమ్మిదో నాడు సుద్దుల బతుకమ్మగా కొలుస్తారు. నైవేద్యాల పరంగా చూస్తే…

తొలిరోజు (ఎంగిలి బతుకమ్మ)న నువ్వులు, నూకలు, బియ్యం పండితో నైవేద్యం సమర్పిస్తారు. రెండవ నాడు (సప్పిడి బతుకమ్మ)సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో; మూడవ నాడు (ముద్దపప్పు బతుకమ్మ) ముద్దపప్పు, పాలు, బెల్లంతో; నాలుగవరోజు (నాను బియ్యం బతుకమ్మ) నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో; ఐదవనాడు (అట్ల బతుకమ్మ) అట్టు/దోశలు; ఆరవనాడు (అలిగిన బతుకమ్మ) ఆడరు, నైవేద్యం పెట్టరు. ఏడవ రోజు (వేపకాయల బతుకమ్మ) బియ్యం పిండిని బాగా వేయించిన వేపకాయల ఆకారంలో నైవేద్యం తయారు; ఎనిమిదో నాడు (వెన్న ముద్దల బతుకమ్మ) వెన్న, నువ్వులు, బియ్యం మిశ్రమం; తొమ్మిదో రోజు (సద్దుల బతుకమ్మ) ఐదు రకాల పదార్థాలు..పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నంతో పాటు వివిధ రకాల పిండి పదార్థాలు నైవేద్యంగా పెడతారు.

ఈ పండుగ పుట్టుకకు సంబంధించి ఎన్నో సామాజిక, చారిత్రిక గాథలు/కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఊరికోసమో, తన వారి కోసమో తమ జీవితాలను చెరువుల వద్ద తృణ ప్రాయంగా త్యాగం చేసిన వీర నారీమణుల ప్రతిరూపం బతుకమ్మ అని భావిస్తారు. ఒక కథనం ప్రకారం, చోళరాజ్యంలో ధర్మాంగద, సత్యవతి దంపతుల నూరుగురు పుత్రులు యుద్ధంలో మరణించగా, సత్యవతి కఠోర తపస్సు ఫలించి లక్ష్మీదేవి ఆమెకు కూతురుగా జన్మించి, ఎందరో బతుకులకు దారి చూపే దేవతగా ‘బతుకమ్మ’గా ప్రాచుర్యంలోకి వస్తుందని ఆమె అవతరించడానికి మునుపే మునులు ఆశీర్వ దించారట. ఆ స్ఫూర్తితోనే ప్రజాకవి కాళోజీ, ‘గుమ్మడి పూలు పూయగా బ్రతుకు/తంగెడి పసిడి చిందగ బ్రతుకు/గునుగు తురాయి కులకగ బ్రతుకు/కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు/బ్రతుకమ్మా బ్రతుకు/అమ్మని మరువని సంతానము గని/బ్రతుకమ్మా బ్రతుకు..’ అని రాశారు. భూస్వాముల దాష్టీకాలను ప్రతిఘటించి బలైపోయిన ఒక గ్రామీణ మహిళ స్మృత్యర్థం ఈ పండుగను జరుపు కుంటున్నారని మరో కథనం. ఈ పండుగను కాకతీయరాణి రుద్రమదేవికి అన్వయించారు సాహితీవేత్తలు. ఆమె తమ దయాది, దేవగిరి (మహారాష్ట్ర) రాజుపై విజయం సాధించి ఓరుగల్లు చేరిన వెంటనే విజయ సూచికగా బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించిందని ఆచార్య తిరుమల రామచంద్ర పేర్కొన్నారు.

 తమ పిల్లలు సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ పండుగ సందర్భంగా వారికి దుస్తులు, గాజులు, నగలు కానుకలుగా ఇస్తారు. వీటన్నిటికి అవసరమైన ధనాన్ని ఇచ్చేది శ్రీలక్ష్మిదేవి కనుక, బతుకమ్మ శ్రీలక్ష్మి అవతారంగా పరిగణిస్తారు. ఈ పండుగ సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. ఇతర రోజుల్లో నిత్య వ్యవహారాల్లో నిమగ్నమవుతూ, కలుసుకోలేని మహిళలు ఈ తొమ్మిది రోజులు కలసి ఆటపాటలతో ఆనందిస్తారు.

జానపదుల నమ్మకాలతో పురుడు పోసుకొని, ‘పూల దేవత’గా పూజలందుకొంటున్న బతుకమ్మ పండుగ ఇక్షాకులు,విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు కాలంలో పరిఢవిల్లి నేడు రాష్ట్ర పండుగగా అవతరించింది. బతుకమ్మ పూవనరు లలోని ప్రధానమైన ‘తంగేడు’ రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందింది. నల్లగొండ జిల్లా వాడపల్లిలో బతుకమ్మకు సంబంధించిన స్పష్టమైన శాసనాధారం లభించిం చింది. కృష్ణా-మూసీ నదుల సంగమ ప్రదేశంలో సాధారణ శకం 1211 నాటికి ‘బ్రతుకేశ్వర స్థానం’ ఉండేదని ఆ శాసనం పేర్కొంటోంది. దీనిని బట్టి అక్కడ (కృష్ణానదిలో) బతుకమ్మ నిమజ్జనం చేసేవారని తెలుస్తోంది. మేలుగుంటు సోదరులు సుమారు అక్కడ బతుకమ్మ గుడిని నిర్మించారు.

బొడ్డెమ్మ

బతుకమ్మ పండుగకు పూర్వం తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. ఇది మహాలయామావాస్యతో పూర్తి అవుతుంది. ఇది పిల్లల పండుగ. తెలంగాణ ప్రాంతంలో ‘బొడ్డి’ అంటే చిన్నపిల్ల అని అర్థం. మంచి భర్త లభించాలని కోరుతూ పెళ్లీడు పిల్లలు భాద్రపద బహుళ పంచమి లేదా దశమి నుంచి మహాలయ అమావాస్య వరకు ‘బొడ్డెమ్మ’ ఆడతారు (అధిక ఆశ్వయుజంలో నిజమాసం తిథుల ప్రకారం కార్యక్రమం ఆరంభ, ముగింపులు ఉంటాయి). బొడ్డెమ్మను పసుపుతో చేయడం ఒక పద్ధతికాగా, పుట్టమన్నుతోనూ చుట్టూ పందిరి వేస్తారు. దీనిని ‘పందిరి బొడ్డెమ్మ’ అంటారు. చిన్న గుంతతీసి,దాని చుట్టూ పుట్టమన్నుతో గోపురం ఆకారంలో నిర్మిస్తారు. లేదా…చెక్కపై పుట్ట మన్నుతో ఐదు లేదా ఏడు దొంతర్లుగా గోపురం ఆకారంలో తీర్చిదిద్ది, దానిపై తులసి మొక్కను అలంకరిస్తారు. చాలా గ్రామాలలో బొడ్రాయి వద్ద లేదా ఆలయాల వద్ద బొడ్డెమ్మను ఆడతారు. బతుకమ్మ పండుగ లప్పుడు పాడే పాటలను ఈ బొడ్డెమ్మ పండుగలోనూ పాడతారు.

‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో/బిడ్డాలెందారే వలలో

బావిలో పడ్డవారికి వలలో/వారిద్దరమ్మా వలలో

నిద్రపో బొడ్డెమ్మ వలలో/నిద్రబోవమ్మా వలలో

నిద్రకు నూరేండ్లు వలలో/ నీకు వెయ్యేండ్లు వలలో

నిను గన్న తల్లికి వలలో/నిండు నూరేళ్లు వలలో…’

అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE