విద్వాంసులు, మహాత్ములు రాజకీయాలకు దూరంగా ఉండాలని చాలామంది చెబుతుంటారు. అయితే రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసే పండితులు మాత్రం ఉండాలి. సమర్థ రామదాసు, చాణక్యుడు వంటివారిని ప్రశంసిస్తూనే వారు చేసిన మహాకృత్యాలను విస్మరిస్తూ ఉంటారు. ఈ ప్రజాస్వామ్యయుగంలో విద్వాంసులు రాజకీయాలను ప్రభావితం చేయాలని శ్రీకరపాత్రీ స్వామి సందేశమిస్తున్నారు.
‘జానాతి ఇచ్ఛతి అధి కరోతి’ అనేది ప్రసిద్ధమైన క్రమం. జ్ఞానం నుంచి ఇచ్ఛ పుడుతుంది. ఇచ్ఛ నుంచే క్రియ పుడుతుంది. ‘యః క్రియావాన్ స పండితః’ (సుభాషిత మంజరి) అని చెప్పడం కూడా ప్రసిద్ధంగా వినిపిస్తుంది. ప్రయోగహీనమైన శిల్పవిజ్ఞానం – శాస్త్రాది విజ్ఞానం వలెనే ప్రయోగహీనమైన రాజనీతి విజ్ఞానం కూడా వ్యర్థమైపోతుంది. క్రియాహీనమైన తర్కవితర్కాలు – జ్ఞానవిజ్ఞానాలు, బుద్ధి వ్యవసాయ మాత్రంగానే మిగిలిపోతాయి.
రావణుని పాలన కాలంలో జ్ఞాన- విజ్ఞాన యుక్తులైన రుషులకు ఏ మాత్రమూ కొదవ లేదు. అయినప్పటికీ రుషి వధ కొనసాగుతూనే పోయింది. వారి రక్తంతో నింపిన పాత్రలను తాగడానికి ఇచ్చినా కూడా రావణునికి సంతృప్తి కలగలేదు. రుషుల ఎముకలు కొండలంతగా పోగుపడ్డాయి అని తులసీదాస్ రామచరిత మానస్‌లో రచించారు.
ఆ సమయంలో సక్రియాపరుడైన విశ్వామిత్రుని రాజనీతి సఫలం అయింది. ఆయన వల్లనే రాముడు రణరంగంలోకి దిగాడు. దుష్టుల దర్పాన్ని అణిచి వేశాడు. దాంతో వేదరక్ష కలిగింది. సాధు సత్పురుషుల పోషణకు వేదరక్షణ ఆవశ్యకమైంది. ఎక్కడైతే రాజనీతిని సక్రమంగా బోధించే వాడు… ప్రయోగసాధనాలు లభిస్తుంటాయో అక్కడ… విద్వాంసులు ఉపదేశాలకు మాత్రమే పరిమితంగా ఉండిపోగలుగు తారు. అలాకాకుండా చెప్పేవారు, చేసేవారు లేనప్పుడు వాటి అన్వేషణ, నిర్మాణం కూడా విద్వాంసుల పనే అయి ఉంటుంది.
రాజులేని సమయంలో అందరికీ ‘ఉత్తరదాయి త్వము’ (సమాధానం చెప్పడానికి యోగ్యులైనవారు) కలిగిన విద్వాంసులకే ఆ పని అప్పచెప్పవలసి ఉంటుంది. చాణక్యుడు ఇటువంటి పనులే చేశాడు. సమర్థరామదాసు కూడా అలాగే చేశాడు. శుక్రుడు, బృహస్పతి మొదలైన వారు కూడా అనేక విధాలుగా సక్రియా రూపమైన రాజనీతిని బోధించారు. నిజమే విద్వాంసులు రాజ్యాధికారమనే ప్రలోభంలో పడి చదువు మానివేశారు. కానీ చదువు వారికి అత్యవ సరం. వారు చదవడం ఆపివేస్తే, రాజ్యంలో సరైన రాజనీతిని పాటించకపోతే… వేదము… అందులో బోధించిన ధర్మము సంకట గ్రస్థాలైపోతాయి.
సాధు సత్పురుషులు లేకపోతే పాలనలో విశృం ఖలత చోటు చేసుకుంటుంది. గూండాలే రాజ్యం చేస్తారు. అప్పుడు ధార్మికులైన వారు రంగ ప్రవేశం చేస్తేనే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. సచ్చిక్ష లేదా సద్విద్యను ప్రచారం చేయడం ద్వారానే సద్బుద్ధి కలుగు తుంది. సద్బుద్ధి నుంచి సదిచ్ఛ… దానినుంచి సప్ర యత్నం… దాని నుంచి అన్ని రకాలైన సాఫల్యము కలుగుతాయని చెబుతుంటారు. ఇది సరైనదే. కానీ ఈరోజున బోధన కూడా స్వతంత్రులైన అధ్యాపకుల చేతిలో ఉండడంలేదు. పాలనాధికారం ఎవరి చేతిలో ఉంటుందో… వారి విధానాలను సమర్థించే పాఠ్యాం శాలే నేడు అందరికీ బోధింపబడుతున్నాయి. స్వతంత్రులైన ఉపాధ్యాయులు, వారి విద్యార్థులు కూడా స్వాతంత్య్రం కోల్పోయి ప్రభుత్వాల అధికార పరిమితికి లోబడుతున్నారు.
కవులు, పీఠాధిపతులు కూడా నేడు ప్రభుత్వాలను కొనియాడడంలోనే తమ లాభాలను వెతుక్కుంటు న్నారు. ఘోరనాస్తికులు, విశృంఖలులైన మంత్రులను, వివిధ పదవులలో ఉన్నవారిని కూడా విద్వాంసులు, మహంతులు, మండలేశ్వరులు ప్రశంసిస్తూనే ఉంటు న్నారు. అందువల్ల నాస్తికులైన వారి చేతుల నుంచి రాజకీయ అధికారాన్ని రక్షించడానికి, యోగ్యులైన, ధార్మికులైన శీలవంతులైన వారి చేతిలో అధికారాన్ని ఉంచడానికి… మేధావి వర్గం ప్రయత్నాలు చేయాలి. మహాభారతంలో ఇదే విషయాన్ని ఇలా స్పష్టంగా చెప్పారు.
ప్రమాదాలనుంచి దేశాన్ని రక్షించడానికి, పరమ నిరక్షేప వృత్తిలో నిలిచేవారు, విరక్తులు అయిన విద్వాంసులు పాలనలో కలగ చేసుకోవాలి. అంతేకాదు, ఎప్పుడైనా వేనుడివంటి అన్యాయవర్తను లైన అధికారంలోకి వస్తే… బుజ్జగించి, భయపెట్టి చెప్పినా వినిపించుకోకపోతే… అతడిని పదవి నుంచి దింపివేసి లేదా హతమార్చి… వాని స్థానంలో యోగ్యుడైన పాలకుడిని నియమించాల్సి వస్తుంది. విద్వాంసులు చేయాల్సిన పనులకు ఇదొక ఉదాహరణ.
రాజనీతిజ్ఞులుగా ప్రపంచ ప్రసిద్ధులైన పాలకులం దరూ తమ పాలన పగ్గాలను తపఃపునీతులు, లోకహితైషులు, రాగద్వేష రహీతులు అయిన రుషుల చేతిలో ఉంచడం చరిత్రలో మనకు అనేకసార్లు కనిపిస్తుంది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు తన రాజనీతిని దేవగురువైన బృహస్పతి చేతుల మీదుగా నిర్వహిస్తాడు. దైత్యరాజు బలి తన రాజనీతిని మహర్షి శుక్రాచార్యుని యందు నిలిపాడు. అలాగే రామ చంద్రుడు వశిష్ఠుని కనుసన్నలలో నడిచాడు. ధర్మరాజు తన ధౌమ్యుడు, వ్యాసుడు, శ్రీకృష్ణుడు, విదురుల సలహా మేరకు పాలించాడు. చంద్రగుప్తుడు తన పాలన పగ్గాలను మహర్షి చాణక్యు నికి అందించాడు. అలాగే శివాజీ తన గురువైన సమర్థ రామదాసు మాటను జవదాట లేదు. అంకుశం లేకపోతే ఏనుగు, పగ్గాలు వేయకపోతే గుర్రమూ ఎంతటి ప్రమాదకారకం అవుతాయో… అలాగే అంకుశము లేదా నియంత్రణ లేకపోతే ప్రభుత్వం కూడా హానికారకం అవుతుంది.
రాజ్యశ్రీ సంపన్నులైన రాజులపైన కూడా అంకుశం ఉండితీరాలి. ఈ అర్థంలోనే రాజైనవారు ధర్మాన్ని పాటించాలని పెద్దలు చెప్పారు. బృహదా రణ్యకం ప్రకారం, ‘క్షత్రస్య క్షాత్రమ్’ (1.4.14) ధర్మనియంత్రితమైన రాజధర్మాన్ని సిద్ధాంతీకరించారు. ధర్మం, కర్మ, సంస్కృతి, ధార్మిక సంస్థల రక్షణ అనేవి… ధర్మనియంత్రితుడైన రాజు ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. అలా కాకపోతే విశృంఖలుడైన రాజు రాజ్యాన్ని ప్రమాదంలో పడ దోస్తాడు.
హిందీమూలం : కరపాత్రీ స్వామి
అనువక్త : నేతి సూర్యనారాయణశర్మ