పరిచయం:

భారతదేశం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తన ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి కేవలం 33 సంవత్సరాలుగా ఉన్న మనిషి సగటు ఆయుర్దాయం 2023 నాటికి 72 సంవత్సరాలకు పెరిగింది. మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ప్రపంచ సగటుతో పోలిస్తే, భారతదేశం నేడు ఆరోగ్య ప్రమాణాలలో గణనీయంగా వెనుకబడి ఉండటం మాత్రం విచారకరం. దీర్ఘకాలిక వ్యాధులకు, మానవులకు ప్రాణాంతకమైన మధుమేహం, క్షయ, నాడీ సంబంధిత వ్యాధులకు, చివరకు క్యాన్సర్‌కు ప్రపంచ రాజధానిగా భారత్‌ను పరిగణిస్తు న్నారు. అల్లోపతి అనేక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో వ్యాధుల నిర్ధారణలో గణనీయంగా ముందుకు సాగింది, కానీ దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో విఫలమైంది. భారత్‌ తనదైన సమగ్ర ఆరోగ్య విధానం`ఆయుర్వేదాన్ని ఒక గొప్ప సంప్రదాయ సంపదగా కలిగి ఉంది. ఆయుర్వేదం నేడు దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు ఏవైనా పరిష్కారాలను అందిస్తుందా?

ముందుగా.. ఆయుర్వేదం, దాని పరిణామ క్రమం, ముఖ్య సిద్ధాంతాలను పరిశీలిద్దాం.

ఆయుర్వేదం ఒక పురాతన హిందూ వైద్య విధానం. క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్ది నాటి అథర్వ వేదం ప్రకారం ఇది బ్రహ్మ నుంచి ఉద్భవించింది. దక్షప్రజాపతి, ఇంద్రుడు, భరద్వాజుడు, ఆత్రేయుడు, అగ్నివేశుడు (రుషులు), చివరికి వైద్య దేవుడిగా పూజించే ధన్వంతరి వంటి వారి ద్వారా సంక్రమిం చింది. ధన్వంతరి శిల్పం 12వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయంలో ఉందని తెలుసుకోవడం ఆసక్తికరం. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆయుర్వేదం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు` చరక, సుశ్రుత, వాగ్భట్ట. ‘సుశ్రుత సంహిత’ను క్రీ.శ. 8వ శతాబ్దంలో అరబిక్‌లోకి అనువదించుకున్నారు. తరువాత ఐరోపా దేశాలకు వెళ్లింది. సుశ్రుత సంహితలో 125 శస్త్ర చికిత్సా పరికరాల జాబితా ఉంది. వాటి తయారీ, సంరక్షణతో సహా వివరాలు ఉన్నాయి. తక్షశిల తవ్వకాల్లో బయటపడిన శస్త్రచికిత్సా పరికరాలను అక్కడి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. బౌద్ధ సాహిత్యంలోని ఆయుర్వేద సమాచారం ప్రకారం జీవక ఖోమరబచ్చ తక్షశిలలో ఆయుర్వేదంలో శిక్షణ పొందాడు. ఆయన మగధ రాజు బింబిసారుడు, బుద్ధ భగవానుడికి సమకాలీనుడని పేర్కొన్నారు. ఆయన రోగుల తల, శరీరంలోని ఇతర భాగాలకూ శస్త్ర చికిత్సలు చేసినట్లు చెబుతారు. తలపై శస్త్ర చికిత్సకు ఆయన రెండు వేల పణాలను వసూలు చేశారు. ఆయుర్వేద వైద్యులు ముక్కుకు చేసిన మరో ముఖ్యమైన శస్త్రచికిత్సగా చరిత్రకెక్కింది. అక్రమ లైంగిక సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో కత్తిరించిన ముక్కును సరి చేయడానికి శస్త్రచికిత్స చేశారు.

బ్రిటిష్‌ శస్త్ర వైద్యులు వీక్షించిన ఆయుర్వేద వైద్యుల ప్లాస్టిక్‌ సర్జరీ

1792లో బ్రిటిష్‌ సైన్యంలో వాహన చోదకుడు కోవాస్జీని, నలుగురు సిపాయిలను టిప్పు సుల్తాన్‌ సైన్యం అపహరించింది. వారి ముక్కులను కోసివేసింది.

1793లో, పూనా సమీపంలోని ఆయుర్వేద వైద్యులు ఈ ఐదుగురు వ్యక్తులకు రైనోప్లాస్టీ చేశారు.ఈ ప్రక్రియను బ్రిటిష్‌ వైద్యులు థామస్‌ క్రూసో, జేమ్స్‌ ఫైండ్లే స్వయంగా చూశారు. ఈ వార్త మద్రాస్‌ గెజిట్‌లో, అక్టోబర్‌ 1794 నాటి లండన్‌ నుంచి వెలువడిన ‘జెంటిల్‌మన్‌’ మ్యాగజైన్‌లో ప్రచురిత మైంది. ఆ సమయంలో భారతదేశంలో ఈ శస్త్ర చికిత్సలకు పూనాతో పాటు కాంగ్రా ప్రసిద్ధి చెందాయి.

సిద్ధ నాగార్జునుని రచనలు:

ఆయుర్వేద వైద్యులు కొన్ని వ్యాధుల చికిత్సలో ఔషధాల వాడటం మరొక ముఖ్యమైన అంశంగా పరిగణించాలి. సిద్ధ నాగార్జునుడు ఔషధాలను ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందినవాడు. రసేంద్ర మంగళం, రసరత్నాకర, కక్సపుట వంటి పుస్తకాలు రాశాడు. ఇంకా చాలా మంది రసవాదం, రసాయనిక ఔషధాలపై రాశారు. పురావస్తు శాస్త్రవేత్త కృష్ణశాస్త్రి 1960లలో యెల్లేశ్వరంలో తవ్వకాలు చేపట్టారు. సిద్ధ నాగార్జునుడికి చెందినదిగా భావించే రసాయనిక ప్రయోగశాలను కనుగొన్నారు. డెబ్బై సంవత్సరాల క్రితం నా వైద్య శిక్షణ సమయంలో, రక్తపోటుకు మొదటి ఔషధం సెర్పాసిల్‌. అదే సెర్పాగంధి అనే ఆయుర్వేద ఔషధం. పార్కిన్సన్స్‌ వ్యాధికి 1970 నుంచి ఉపయోగిస్తున్న మరొక ప్రామాణిక ఔషధం ూ-ణూA. ఈ వ్యాధి వణుకును పుట్టిస్తుంది. జడత్వాన్ని కలిగిస్తుంది. ముంబైలోని నాడీ వైద్యులు పూనా సమీపంలోని ఆయుర్వేద వైద్యులు వణుకు చికిత్స కోసం తరతరాలుగా ఒక ఔషధాన్ని ఉపయో గిస్తున్నారని, అది ూ-ణూA ముడి రూపం తప్ప మరొకటి కాదని కనుగొన్నారు.

గతంలో ఆయుర్వేద అంశాలను వెల్లడిరచే ఎంపిక చేసిన శాసనాల గురించి క్లుప్తంగా`

పురాతన వైద్య పద్ధతులను వెల్లడిస్తున్న అశోకుడి శిలా శాసనాలు, శాసనాలు:

  1. అశోకుడి రెండవ శిలాశాసనం: ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఉంది. దీనిని మొదటిసారిగా 1928లో ఎ. ఘోష్‌ కనుగొన్నారు. హెచ్‌. హార్గ్రీవ్స్‌ జూన్‌ 11, 1929న పత్రికలలో ప్రకటించారు. ఈ శిలాశాసనం గురించి మల్లంపల్లి సోమశేఖర శర్మ, వెంకటరమణయ్య సెప్టెంబర్‌, 1929 భారతి సంచికలో వివరించారు. బి.ఎం. బారువా అశోకుడి శాసనాలపై రాసిన పుస్తకంలో దీనిని వివరించారు. డి.సి. సిర్కార్‌ ఎపిగ్రాఫియా ఇండికా 1957-58 సంచికలో దీని గురించి వివరణాత్మక కథనాన్ని ప్రచురించారు.

ఆర్‌.సుబ్రహ్మణ్యం 1975లో తెలుగులో ‘అశోకుని యెర్రగుడి శిలాశాసనములు’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ శాసనం క్రీ.పూ. 244-245లో వేసినది. రాజు ఔషధాలను సమకూర్చాడని, అవసరమైన చోట ఔషధ మొక్కలను పెంచాడని శాసనం పేర్కొంది.

  1. తుమ్మలగూడెం రాగి ఫలక రాజశాసనం: విష్ణుకుండినుల రాజు గోవిందవర్మన్‌ సంస్కృతంలో రాజ శాసనాన్ని జారీ చేశాడు. ఇది క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందినది. రాజు ఇంద్రపురలో తన రాణి ఏర్పాటు చేసిన విహారంలోని భిక్షులు, తదితరులకు వైద్య సంరక్షణ కోసం ఏర్పాట్లు చేశాడు.
  2. సైదాపురం శాసనం: పశ్చిమ చాళుక్య రాజు జయసింహ II (క్రీ.శ. 1042) కాలం నాటి సంస్కృతంలో ఉన్న ఒక శిలాశాసనం, జైన పండితుడు కూడా అయిన అగ్గలయ్య అనే శస్త్రవైద్యుడి గురించి ప్రస్తావిస్తుంది. అతడికి అతను ‘శస్త్ర శాస్త్ర కుశల’, ‘వైద్యరత్నాకర’ అనే బిరుదులు ఉన్నాయి. అగ్గలయ్య ఇతరులు నయం చేయలేని వ్యాధులను నయం చేశాడని చెబుతారు. అతడు కొన్ని వ్యాధులను నయం చేయడంలో శస్త్రచికిత్సను, ఔషధాన్ని రెండిరటినీ మేళవించాడు. మంచి ఫలితాలను రాబట్టాడు. చికిత్సలో ఔషధం, శస్త్రచికిత్స రెండిరటినీ మిళితం చేయాలనే భావన అద్భుతమైనది. నా వృత్తి జీవితంలో నేను అదే పద్ధతిని అనుసరించాను.
  3. తిరుమక్కడల్‌ శాసనం: చోళరాజు వీర రాజేంద్ర II (క్రీ.శ. 1154-1167) జారీ చేశాడు. ఈ శాసనం సంస్కృతంలో ఉంది. రాజు ఒక వైద్యుడు, ఒక శస్త్రవైద్యుడితో 15 పడకల ఆసుపత్రి` ఆరోగ్యశాలను స్థాపించినట్లు ఇది తెలిపింది. కొన్ని పడకలు పిల్లల సంరక్షణ కోసం కేటాయించారని పేర్కొంది.
  4. మల్కాపురం శాసనం: కాకతీయరాజు గణపతిదేవుడు క్రీ.శ.1261 జారీ చేసాడు. ఇదీ సంస్కృతంలోనే ఉంది. రాజ గురువు పశుపత సాధువు విశ్వేశ్వర శివాచార్యుడు అవసరమైన సిబ్బందితో ఆసుపత్రి, ప్రసూతి గృహం `ప్రసూతి ఆరోగ్యశాలను నెలకొల్పాడని పేర్కొంది.
  5. కొండవీడు శాసనం: రాజు సదాశివరాయ, హరిహరుడు II ఆయుర్వేద వైద్యులైన బ్రాహ్మణులకు గ్రామాలను దానం చేసినట్లు ఈ శాసనంలో ఉంది.
  6. అనితల్లి శాసనం: రాజమహేంద్రవరానికి చెందిన కాటయ వేమారెడ్డి కుమార్తె. ఆమె క్రీ.శ.1423లో పరహితాచార్య అనే వైద్యుడికి కలువచేరు అనే గ్రామాన్ని దానమిచ్చింది. పరహితాచార్య పూర్వికులు ప్రఖ్యాత వైద్యులు, వేద పండితులుగా పేరొందారు.

ఇలాంటి అనేక ఇతర శాసనాలు పరహితులని పేర్గాంచిన ఆయుర్వేద వైద్యుల గురించి ప్రస్తావి స్తాయి. చాలా శాసనాలు దేవాలయాలు, ప్రజలకు వైద్య సేవలు అందించిన ప్రదేశాలకు చేసిన విరాళాలను సూచిస్తున్నాయి.

మన దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు:

  1. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం.
  2. క్షయ = అనేక ఔషధాలను ఈ వ్యాధి తట్టుకోవడం, మొదలైనవి.
  3. మధుమేహ మహమ్మారి.

4.హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌

  1. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు.
  2. నిర్దేశిత ప్రాంతాలలో ఫ్లోరోసిస్‌, మూత్రపిండాల వ్యాధులు.

క్షయవ్యాధి తాకిడి:

భారత్‌ ప్రపంచానికి క్షయవ్యాధి రాజధానిగా నిలిచింది.

ప్రతి సంవత్సరం కొత్తగా 19 లక్షల కేసులు బయటపడుతున్నాయి.

దేశాల వారీగా, ప్రపంచంలో అత్యధిక కేసులు భారతదేశంలోనే ఉన్నాయి.

(202 దేశాల డేటా ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ`డబ్ల్యూహెచ్‌వో నివేదిక).

భారతదేశంలో ఏ సమయంలోనైనా సుమారు 38 లక్షల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు.

ప్రతి సంవత్సరం 3,25,000 మంది భారతీయులు ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో క్షయ వ్యాధితో మరణిస్తున్న ప్రతి ఐదవ వ్యక్తి భారతీయుడే.

క్షయ వ్యాధి అనేక ఔషధాలకు లొంగకపోవడం దేశంలో తీవ్రమైన సమస్యగా మారింది.

మధుమేహం వ్యాప్తి:

భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో ఒకటగా నిలిచింది.

హైదరాబాద్‌ నగరవాసుల్లో 18% మందికి మధుమేహం ఉంది.

2025 నాటికి, 5.72 కోట్ల భారతీయులు ఈ వ్యాధి బారిన పడతారని అంచనా. దేశం ప్రపంచం లోనే అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కొంటోంది. అయితే దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేదు.

ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు మధుమేహం చికిత్స కోసం ఎటువంటి సదుపాయాలు లేవు.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌:

50 లక్షలకు పైగా భారతీయులు హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. ఇది ఆరు రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. ఇక్కడ ఇది ఇతర రాష్ట్రాల కంటే 4-5 రెట్లు ఎక్కువగా ఉంది.ఆంధ్రప్రదేశ్‌ దేశంలో అధిక ప్రాబల్యం రేటు ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. 2006లో రాష్ట్రంలోహెచ్‌ ఐవీ ప్రాబల్యం 1.26%గా ఉంది. ఇది ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ.

కేన్సర్‌:

మొత్తం కేసుల్లో 80% చివరి దశలో ఆసుపత్రులకు వస్తాయి. అప్పుడు వ్యాధి నుంచి ఉపశమనం(పాలియేటివ్‌ కేర్‌) కలిగించడం మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి వ్యాధిని ముందుగా గుర్తించడం ఒక్కటే పరిష్కారం. ఇది ప్రాథమిక సంరక్షణ వైద్యుల సేవల్లో నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పాలియేటివ్‌ కేర్‌ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం మంచిది కాదు.

ప్రపంచవ్యాప్తంగా నాడీ సంబంధిత

వ్యాధులతో మరణాలు:

నాడీ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.67 కోట్ల మంది మరణించారు (2002).

ఈ వ్యాధులు భారతీయులలో అమెరికన్ల కంటే 3-4 రెట్లు ఎక్కువగా, చైనీయుల కంటే 6 రెట్లు, జపనీయుల కంటే 20 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.

ఎక్కువగా భారతీయ యువత 12-13% మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. పాశ్చాత్య దేశాలలో ఇది 5%గా ఉంది. భారతదేశ రోగుల్లో 40% మంది 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

చివరిమాట:

అల్లోపతి వ్యాధి నిర్ధారణ పద్ధతుల్లో గణనీయంగా ముందుకు సాగింది, నేడు అనేక రకాల రోగనిర్ధారణ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల, పురాతన రోగ నిర్ధారణ విధానాలకు కాలం చెల్లింది. పురాతన వ్యవస్థలు సమగ్రమైనవి, వ్యాధి నివారణకు గణనీయమైన ప్రాధాన్యతనిస్తాయి. ఇప్పుడు మానవులకు ప్రాణాంతకమైనవిగా హృద్రోగాలు, ప్రధాన నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. వీటి వెనుక మధుమేహం, పోషకాహారలోటు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆయుర్వేదం ఆరోగ్యకరమైన జీవన సూత్రాలను, వ్యాధులను నివారించే మార్గాలను నొక్కి చెబుతుంది. దీనికి రోజువారీ ప్రవర్తనా నియమావళిని అనుసరించాలి. అవి పరిశుభ్రత, శారీరక వ్యాయామం ఆవశ్యకతను ప్రస్తావిస్తాయి. దీర్ఘకాలిక జీవితాన్ని ప్రోత్సహిస్తాయి. ఇందుకు నిషేధిత కార్యకలాపాల జాబితాను వివరిస్తాయి. సంగం యుగం అనంతర ఆయుర్వేద పండితుడు తిరువల్లువర్‌ మెరుగైన జీవితాన్ని ప్రోత్సహించడానికి తిరుక్కురల్‌ను ప్రపంచానికి అందించారు. ఆయన ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? ఏమి తినాలి? అనే దానిపై దృష్టి పెట్టారు. అందువల్ల, మన పురాతన వైద్య వ్యవస్థల అధ్యయనం మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే ముఖ్యమైన దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన పురాతన వైద్య శాస్త్రాలను మరింత శాస్త్రీయంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.

తిరువల్లువర్‌ తిరుకురల్‌ ద్వారా ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? ఏమి తినాలి? అనే విషయాలను చాలా కాలం క్రితమే చెప్పారు.

– డా॥ దేమె రాజారెడ్డి,  ప్రఖ్యాత న్యూరో సర్జన్‌, ఫ్లోరోసిస్‌ నిపుణులు, హైదరాబాద్‌

About Author

By editor

Twitter
YOUTUBE