మన భారతీయ దేవాలయాలు, వాటిలోని శిల్పసంపద ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నదనీ, భారతీయుల సంస్కృతి, సంప్రదాయం, జీవనాలకు ఆటపట్టు దేవాలయమేనని బృహత్ ద్విసహస్రావ ధాని పద్మశ్రీ గ్రహీత మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. ఏఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సప్తసింధు-2025 పేరిట హైదరాబాద్ టి-హబ్‌లో ఇటీవల అంతర్ కళాశాల విద్యార్థుల కోసం నిర్వహించిన ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు-ప్రదర్శనకు ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. మన కళలైన శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం, నాట్యం అంతర్లీనంగా ఆధ్యాత్మికతత్వంతో ఉంటాయని, ఇవి లేకుండా భారతీయ విద్యలేవీ లేవని నాగఫణిశర్మ స్పష్టం చేశారు. ఎంతో ప్రాచీనమైన మన సంస్కృతిలో అడుగడుగునా సంప్రదాయం నిబిడీకృతమై ఉందన్నారు. ఇంత విశేషమైన, విలక్షణమైన కార్యక్రమంలో యువతకు భాగస్వామ్యం కల్పించడం గొప్ప పని అని కొనియాడారు.
సప్తసింధు ఆలయ నమూనాల రూపకల్పన పోటీలలో పలు కళాశాలల నుంచి విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ సలహాదారు, సీనియర్ స్థపతి డాక్టర్ ఎస్ సుందరరాజన్, మంథా అసోసియేట్స్ ఎండీ రమేశ్ మంథా, సమతామూర్తి (ముచ్చింతల్) రామానుజుల విగ్రహ ప్రధాన స్థపతి డిఎన్‌వి ప్రసాద్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
కర్ణాటక రాష్ట్రం, శృంగేరి శ్రీ విద్యాశంకర ఆలయ నమూనాను రూపొందించిన జోగినపల్లి భాస్కర్ రావు ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థి బృందం మొదటి బహుమతిగా రూ.50 వేలు గెల్చుకుంది.
గుజరాత్ రాష్ట్రం మొతేరాలోని సూర్యదేవాలయం నమూనాను తయారు చేసిన శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థి బృందం రెండవ బహుమతిగా రూ.30 వేలు గెల్చుకుంది.
తెలంగాణలోని సుప్రసిద్ధ రామప్ప ఆలయ నమూనాను ప్రదర్శించిన హైదరాబాద్ జేఎన్‌ఎఫ్‌ఏయూ విద్యార్థి బృందం మూడవ బహుమతిగా రూ.20 వేలు గెల్చుకుంది.
బహుమతి ప్రదానం సందర్భంగా స్థపతి శ్రీ డిఎన్‌వి ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీల్లో బహుమతులు పొందినవారు మాత్రమే గాక ఇందులో పాల్గొన్న విద్యార్థులందరూ విజేతలేనంటూ అందరినీ అభినందించారు. కేవలం కొలమానాల మేరకు విజేతలను నిర్ణయించడం జరిగింది తప్ప నిజానికి ఆలయ నమునాల రూపకల్పనలో విద్యార్థులంతా అద్భుతమైన ప్రతిభను కనబరిచారని మెచ్చుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడమే విద్యార్థులందరి విజయ మన్నారు. దేవాలయ నిర్మాణ శాస్త్రం లుప్తమైపోతున్న తరుణంలో సప్తసింధు కార్యక్రమం ద్వారా ఏఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయ మన్నారు. భారతీయ కళలు, శాస్త్రాలంటే చిన్నచూపు ఉన్న ఒకనాటి పరిస్థితులు గత పదేళ్ల కాలంలో మారాయన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుందరరాజన్ స్థపతి, రమేశ్ మంథాల ప్రత్యేకతలను సభకు తెలిపారు.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తమ ప్రసంగంలో పురాతన భారతీయ ఆలయ వైభవాన్ని, శిల్పకళా సంపదను టీ-హబ్‌కు తీసుకువచ్చారని ప్రశంసించారు. దేవాలయాల ద్వారా నాటి శిల్పులు ప్రదర్శించిన కళా నైపుణ్యాన్ని, భారతీయ కళలు, శాస్త్రాల విశిష్టతను తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఆర్కిటెక్చర్ విద్యార్థులను అభినందించారు.
సోషల్ మీడియా ప్రముఖుడు సురేష్ కొచ్చాటిల్ ప్రసంగిస్తూ దేశంలోని వివిధ ఆలయాల సంప్రదా యాలు, ప్రత్యేకతలను వివరించారు. మన దేశంలోని ఆలయాలను సందర్శించేందుకు ఒక జీవితకాలం సరిపోదన్నారు. ఇస్లామిక్ విధ్వంసాలలో దెబ్బతిన్న హిందూ ఆలయాలను పునరుద్ధరిస్తున్న పురావస్తు శాస్త్రవేత్త కేకే మహ్మద్ తమ పూర్వికులు చేసిన పాపాలకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని చేసిన వ్యాఖ్యలను సురేశ్ గుర్తు చేశారు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ హయాంలో జరిగిన ఆలయ విధ్వంసం, నేటి కాలంలో జరుగుతున్న ఆలయ భూముల కబ్జా గురించి అప్రమత్తం చేశారు.
ఆలయాల పునరుద్ధరణ ఉద్యమకారిణి, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ మాట్లాడుతూ అద్భుతమైన కట్టడాలతో విలసిల్లుతున్న మన భాగ్యనగర (హైదరాబాద్) చరిత్రను కేవలం 400 సంవత్సరాలకు పరిమితం చెయ్యడం సరికాదని, ఈ నగరానికి వేల ఏళ్ల ఘన చరిత్ర ఉన్నదని, అందుకు నిదర్శనంగా ఎన్నో ఆనవాళ్లు మనకు మిగిలి ఉన్నాయని చెప్పారు.
సామాజిక కార్యకర్త, పర్వతారోహకురాలు, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రేఖారావు మాట్లాడుతూ దేశంలో మన ఆలయాలలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం సమ్మిళితమై ఉందన్నారు. తాను సందర్శించిన పలు ఆలయాల ప్రత్యేకతలను, ప్రత్యేకించి జమ్ము-కశ్మీర్ ప్రాంతంలోని మందిరాల సాంకేతిక విశేషాలు, ప్రత్యేకతలను తెలియజేశారు.

ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ అనంతలక్ష్మి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీతా రెడ్డి, వ్యాపారవేత్త-సామాజిక కార్యకర్త అవ్నికాంత్ పాండే, కాలమిస్ట్-టీవీ ప్యానలిస్ట్ పేకేటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతీయ ఆలయాల వైభవంపై చరిత్రకారుడు, రచయిత సురేంద్ర నాథ్ బొప్పరాజు ప్రదర్శించిన స్లయిడ్ షో విశేషంగా ఆకట్టు కుంది. భారతీయ దేవాలయాల్లోని సాంకేతిక, కళా నైపుణ్యాలను ఆనాటి శిల్పుల ప్రజ్ఞను ఇందులో వివరించారు.
కార్యక్రమ నిర్వాహకుడు, ఏఈ ఫౌండేషన్ డైరక్టర్ సంగీతా మిశ్రా మాట్లాడుతూ, తమ సంస్థ విద్యార్థులు, మహిళలు, భారతీయ వారసత్వ సంపద-సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్నా మన్నారు. ఆర్కిటెక్చర్ అంటే వంతెనలు, విమానాశ్రయాలు, భవనాలు వంటివాటిని నిర్మించడం మాత్రమే కాదని, భారతీయ నిర్మాణ రంగానికి వేల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఆ వైభవాన్ని ముందుకు తెచ్చేందుకే విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. విద్యార్థులు రూపొందించిన ఈ ఆలయ నమూనాలను 10 రోజుల పాటు టీ-హబ్‌లో ప్రదర్శిస్తారని తెలిపారు.
సప్తసింధు-2025 నిర్వహణలో తమకు తోడుగా నిలిచిన బృహత్, నెక్స్ వేవ్, వర్మ ఫౌండేషన్ సంస్థలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు
జి. శ్రీనివాస కుమార్
డిజిటల్ ఎడిటర్, జాగృతి