జయము జయము భరతావని, సకల భువన పావనీ!

స్వేచ్ఛాప్రియ జనతా సంజీవనీ!

స్వతంత్రభారతి, స్వరాజ్యభారతి నమోస్తుతే

సువర్ణ భారతి, సుపర్వభారతి జయోస్తుతే

సత్య విభాసిని, నిత్య సువాసిని విశ్వపూజితే!

అదిగో మన జయపతాక, ప్రియపతాక

ధగధగమని నిగనిగమని ఎగురుతోంది గగనాన

మువ్వన్నెల సొంపులతో, ముద్దులొలికే వంపులతో!

భారతమాతకు జేజేలు పలుకుతున్నాం మనమంతా. ఇంత ఘన స్వతంత్రకు అక్షరయాత్ర సాగించిన వనితలు ఎందరెందరో! ఈ శుభ సందర్భంలో వారందరికీ వందనాలు.

దుర్గాబాయమ్మ – సమరయోధ.

వరలక్ష్మమ్మ – నారీ చైతన్య సాధకురాలు.

కమలావతి – స్వరాజ్య నిర్వచన కర్త.

అన్నపూర్ణ – సత్యాగ్రహ సమరాన ముందు వరస నేత.

దువ్వూరి సుబ్బమ్మ- ఉద్యమ వేళన చెరసాల పాలైన క్రియాశీలి.

కనకమ్మ- పోరాట పథంలో అగ్రస్థానాన నిలిచిన పడతి.

వీరు కొందరే. స్ఫూర్థిప్రదాతలు ఇంకెందరో!

వీరంతా భవ్యభారతికి అక్షరార్చన చేసినవారే. కావ్యకర్తలుగా, కార్యకర్తలుగా విశిష్టపాత్రను పరిపోషించిన నారీమణులే.

అది స్వాతంత్య్ర ఉద్యమ కాలం.

చైతన్యరథం సాగుతోంది. జనమనోరథం విస్తారమవుతోంది.

‘మోగించు దిగంతాల జయభేరి’ అంటోంది వనితాసాహితి. వీరదుందుభుల ధణంధణ. జాగృత కింకిణుల ఘణంఘణ.

ఆ సంవత్సరం 1940. అప్పట్లో ఓ పద్యకవిత కాంచనపల్లి కనకమ్మ మనోగతాన్ని ప్రభావంతంగా ఆవిష్కరించింది.

భరతఖండంబునందున ప్రజలు బక్కచిక్కియుండగ

ఇట్లుండిరొక్కొ… ఇతర దేశములను

స్వతంత్రులై లేశమేని కొరత లేకుండనున్నారొక అరయగ!

అదీ భావన! గుంటూరు ప్రాంతాన జనించారామె. తెలుగులో, సంస్కృతంలో దిట్ట. ఉద్యోగరీత్యా నెల్లూరు, మద్రాసు నగరాల్లో ఉన్నారు.

అతి పెద్ద విద్యా సంస్థల గురించి తెలుగు పుస్తకాలు రాశారు. ఎన్నెన్ని పక్రియల్లోనో పటిమ కనబరిచారు. పాండవోదంతం అనే గద్యకావ్యం, హంస విజయం పేరిట నాటకం రచించారు.

ఆ రోజుల్లోనే ఆమె తెలుగు పాఠ్యగ్రంథ నిర్ణయ సమితిలో పనిచేశారు. అదీ మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉండి. ప్రత్యేకించి భారత స్వాతంత్య్ర సాధనకు ఎంత చేయాలో అంతగానూ పరిశ్రమించారు. కవితా విశారద అనిపించుకున్నారు.

దువ్వూరి సుబ్బమ్మకు ‘దేశబాంధవి’ అనే పేరు ఉంది. ఉద్యమ నగారా మోగించి, ఊరూ వాడా ప్రతిధ్వనించేలా నినదించి, ఆఖరికి కారాగారవాసమూ చేసిన ధీరోదాత్త ఆమె.

సంపూర్ణ స్వాతంత్య్రం కోరుకుని ఉద్యమించారు. మాటలతో పాటు పాటల్లోనూ మేటి. సభల్లో ఆమె పాడుతుంటే, శ్రోతలు ఉర్రూతలూగేవారు.

ఉన్నదున్నట్లు మాట్లాడటం ఆమె అలవాటు. ‘రాజీ’ అనేది ఆమె నిఘంటువులో లేని పదం!

ఒక సందర్భంలో నిర్బంధంలోని ఆమెను ఆంగ్లేయ అధికారులు మరింత బెదిరించారు. లేనిపోని ఆశపెట్టాలని వృథాయత్నాలు చేశారు.

‘ఎందుకు ఇదంతా? నువ్వు స్త్రీవి. మమ్మల్ని ఎదిరించలేవు. మాతో వ్యవహారం ఎవరికైనా కష్టతరం! ఈ పోరాటాలూ, ఆందోళనలూ మానుకో. మమ్మల్ని క్షమాపణ కోరు. సురక్షితంగా బయటపడతావు’ అనడంతో ఆ పరపాలకుల్ని దడదడలాడించారు సుబ్బమ్మ. అదరగొట్టారు మాటలతోనే!

‘మీ నంగనాచితనం కట్టిపెట్టండి. ఏమనుకున్నారు భారత స్త్రీ అంటే? స్వాతంత్య్రం అనేది మా అందరి హక్కు. మీరు దయతలచి ఇస్తే వచ్చేదికాదు… మేమంతా ఉద్యమించి సాధించుకునేది! క్షమ కోరడమా? అస్సలు జరగదు. నా కాలి గోరు కూడా మీ అదిరింపులకు దడవదు’ అనడంతో మారు మాట్లాడలేక తోకముడిచారు ఆంగ్ల అధికారులు.

అదీ ఆమె ఘనచరిత.

మాగంటి అన్నపూర్ణాదేవి సమర రంగంలోనే కాక, సమాజ సేవలోనూ మిన్న. తెలుగునాటనే కాకుండా కోల్‌కతా ప్రాంతాన కూడా పేరొందిన మగువ. ఆమె ఉన్నత విద్యాభ్యాసానికి దోహదపడినవారు కోల్‌కతా నివాసులే! అందుకే ఆమె సహజ సిద్ధంగా తెలుగు, బెంగాలీలో సైతం ప్రవీణత సంపాదించారు.

బెంగాలీ నుంచి ఈ తెలుగుభాషలోకి పుస్తకాలెన్నింటినో అనువదించారు. స్వాతంత్య్రోద్యమ ప్రముఖులు అరవింద ఘోష్‌ ‌రాసిన లేఖలను తెనిగించింది అన్నపూర్ణమ్మే!

అరవింద ఘోష్‌ ‌జాతీయవాది. ఆధ్యాత్మిక విలువల పరంపరతో సమాజాన్ని ప్రభావితం చేసిన ధీశక్తి. ప్రధానంగా వందేమాతరం గేయ అనువాదకులు. అదే వందేమాతరం పత్రికకు సంపాదకత్వం వహించినవారు.

హిందీ, గుజరాతీ, సంస్కృతంతోపాటు ప్రియభాష బెంగాలీలో ఆయనది అఖండ పాండిత్యం. ఆ దర్శనతత్వం విశిష్టం.

అటువంటి అరవిందుడి రచనలకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన గొప్పదనం అన్నపూర్ణమ్మదే!

జాతి నేతల పర్యటన సమయంలో విరాళంగా తన మెడలోని గొలుసును ఇచ్చేశారు. చేతిగాజులనూ ఉద్యమ నిర్వహణకి సహకారంగా సమర్పించారు. ఆమె ఆదర్శనీయ.

స్థాపించు స్వరాజ్య దీక్షా ధ్వజం

కలిగించు నవ్యభారత మహోదయం

నిండించు నీ అఖండ సంస్కృతి జగతి

పండించు ప్రజల హృదయాల ప్రగతి!

అనేలా వనితోద్యమం రూపుదిద్దుకుంది. విఖ్యాతి అందుకుంది.

పులపర్తి కమలావతీదేవి ‘గృహలక్ష్మి’ స్వర్ణ కంకణ గ్రహీత. వీరభారత కథామంజరి పుస్తక రచయిత్రి.

జన జాగృతికి ప్రణాళికలనేకం రూపొందించి, ఆచరించి, సమీక్షించి, పర్యవేక్షించిన దక్షురాలు ఆమె.

ఇప్పటికి దరిదాపు శతాబ్ది కిందటి మాట. ఆనాడు రాజమహేంద్రవరాన సేవాసదనం అనే సంస్థ వార్షిక ఉత్సవసభ ఏర్పాటైంది. అధ్యక్షురాలు కమలావతే!

ఇంటా బయటా అంతగా శోభించిన ఆమె ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉద్యమ సారథ్యం వహించారు. ఆమెలోని దేశభక్తి తత్పరతకు ‘విజయభాస్కర విజయం’ నిదర్శనం. ఆ గ్రంథంలో అనేకానేక ప్రయోగాలు చేశారామె.

ఎన్ని రచనలు చేసినా, మరెన్ని కార్యక్రమాలు నిర్వహించినా, ఇంకెన్ని బాధ్యతలు నిర్వర్తించినా ఆ అన్నింటి మూలం స్వతంత్ర భారతికి నమస్సుమాలు అందించడమే!

మణిమేఖల కావ్యరచనలో సైతం కమలావతి నిబద్ధత ప్రతీ అక్షరానా ప్రత్యక్షమవుతుంటుంది.

‘శారద రేఖలు’ పుస్తకకర్త కనుపర్తి వరలక్ష్మమ్మ. మా ఊరు అనే శీర్షికతోనూ మాతృభూమి గురించిన అనురక్తిని కనబరచారు. వ్యాసాలెన్నింటినో వెలయించిన ప్రజ్ఞావతి ఆమె.

మహిళా మహోదయం, నమో ఆంధ్రమాతా పేరిట భక్తి తత్పరతను విపులీకరించారు. తన రచనలు చాలామటుకు తమిళ, కన్నడ భాషల్లో అనువాదమయ్యాయంటే, అదే విశిష్టత!

జీవితమంతా ఖద్దరు ధరించిన వనితామణి వరలక్ష్మమ్మ. విదేశీ వస్తు బహిష్కరణ లక్ష్యంగా ఒక కథ రాసి, అపార జనాదరణకు పాత్రురాలయ్యారు. ఓటు పురాణం అనే పుస్తకరచనా ఆమెదే.

ఆమె స్థాపించిన సంస్థ ‘స్త్రీ హితైషిణీ మండలి’. మండలి కార్యక్రమాల్లో భాగంగా పలు ప్రాంతాలు సందర్శించారు. పలువురితో సంభాషించారు. అలనాడు ఆంధ్రమహిళా సభకు అధ్యక్షురాలూ ఆమే!

అప్పట్లోనే భారతి, వినోదిని వంటి పత్రికల్లో కనుపర్తి భావనలు వ్యక్తమై విస్తృత ప్రచారాన్ని సొంతం చేసుకున్నాయి. జాతీయోద్యమంలో అంతర్లీనంగా ఉన్న వనితా జాగృతిని ప్రత్యక్షం చేశారామె.

గుమ్మడిదల దుర్గాబాయమ్మ అందరికీ చిరపరిచిత దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ‌నేతృత్వం వహించిన ఆంధ్రమహిళ పత్రికకు సంపాదకు రాలు. మరెంతో విభిన్నత – ఆనాడు ఒక పత్రికలో వెలువడిన ఆమె కథాశీర్షిక. అది ‘నే ధన్యనైతిని’. ఆమె మాదిరే వనితలెందరో ధన్యత అందుకోగలిగారంటే… అదంతా దుర్గాబాయి నిర్వహణ దక్షత!

ఆమెదంతా స్వయంకృషి. ఒక బోధనా సంస్థను స్థాపించి, అన్ని వయసులవారికీ నేర్పించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను సాధించారు. రచనల్లో, న్యాయవాదనల్లో ఘటికురాలు.

విద్యావికాసాలే స్వాతంత్య్ర ప్రాప్తికి కారణాలని ఆమె గట్టి నమ్మిక. ఆ కారణంగానే మహిళా విద్య గురించిన జాతీయ మండలికి మొదటి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. అనురాగమయిగా ఎందరెందరి జీవితాల్లోనో వెలుగుపూలు పూయించారు. ఆ సేవా నిరతికి గుర్తింపుగానే, భారత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తపాలా బిళ్ల!

తన ఆత్మకథలో దుర్గాబాయి అన్నట్లు ‘స్వతంత్రత, నిబద్ధతలే దేశప్రగతిని, వనితల పురోగమన స్థాయిని నిర్ణయిస్తాయి’.

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE