భారతదేశాన్ని రెండు శతాబ్దాలకు పైగా పాలించినా, ఇంగ్లిష్‌ ‌వారి ఆధిపత్యానికి ఎప్పుడూ సవాళ్లే. 19వ శతాబ్దం మధ్యకాలం నుండే ఆ పరి పాలనపై తిరుగుబాటు జ్వాలలు రేగటం కన్పిస్తుంది. అహింసాయుత పోరాటంతోనే స్వాతంత్య్రం రాదని, సాయుధ పోరాటమే మార్గమని ఎందరో యువకులు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు. చంద్రశేఖర ఆజాద్‌, ‌రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌, అష్పఖుల్లాఖాన్‌, ‌భగవతీ చరణ్‌వోహ్రా, భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, బటుకేశ్వర్‌దత్‌ ‌వంటి ఎందరో క్రియాశీలక పాత్రను పోషించి తమ ప్రాణాలను అర్పించారు. వారిలో రామప్రసాద్‌ ‌బిస్మిల్‌ అతని మిత్రులది ప్రత్యేక స్థానం.

బిస్మిల్‌ ఇలా అంటారు.

‘‘చింతలేదు మా గురించి మాకు, బాధ పడతాం

భారతమాత విపత్తులు తలుచుకున్నప్పుడల్లా

దేశ స్వాతంత్య్ర ఘడియలు ఎప్పుడు చూచేది మేమిక/

జాతి దుస్థితి మాటిమాటికి కలతపెడుతున్నది మమ్ముల/

మా మనుగడలను మట్టిలో కలిపేందుకే ఇక ఎదురుచూస్తాం.’’

పండిత్‌ ‌రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌ (‌బిస్మిల్‌-‌కలం పేరు) వంటి విప్లవవీరుల త్యాగం మరువరానిది. ఈ రోజు విప్లవ వీరుల త్యాగాలను స్మరించుకునే వారు తగ్గినా, కాలం మీద వారి ప్రభావం తగ్గదు. స్వతంత్ర భారతం, ఈ నేలలోని ప్రతీ రేణువు పండిత్‌ ‌రాంప్రసాద్‌ ‌బిస్మిల్‌కు, అతని తోటి విప్లవ కారులకు ఎప్పటికి రుణపడి ఉంటుంది.

ఆయనను బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఉరి తీసింది. ఆ అంతిమ క్షణాలకు ముందు రాసిన కవిత సారాంశం. ‘ప్రభూ నీ చిత్తం నెరవేరాలి నువ్వు అద్వితీయుడివి / (భరతమాత) నీ కన్నీళ్లు నేను కూడా భరించలేను / నా చివరిశ్వాసవరకు నా చివరి రక్తపుబొట్టు వరకు నేను నిన్ను / తలచుకుని నీ సేవలో మునిగి పోయేలా నాకు వరం ప్రసాదించు’. ఎందుకు ఉరిశిక్ష పడింది? సరిగ్గా వందేళ్ల నాటి కాకోరి రైలు దోపిడీ కేసుతోనే.

కాకోరి (ఉత్తరప్రదేశ్‌) ‌లక్నోకు 10 మైళ్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో రైల్వేలకు వచ్చిన మొత్తం ఆదాయాన్ని లక్నో స్టేషన్‌లో జమ చేసేవారు. కాబట్టి లక్నో ముందు గల కాకోరి పట్టణంలో రాంప్రసాద్‌ ‌బిస్మిల్‌, 10 ‌మంది విప్లవ కార్యకర్తల బృందానికి నాయకుడుగా ఆగస్టు 9, 1925న ఆ రైలును దోపిడీ చేశారు. వీరంతా హిందూస్థాన్‌ ‌రిపబ్లికన్‌ అసోషియేషన్‌ (‌హెచ్‌ఆర్‌ఎ) ‌సభ్యులు. సాయుధ తిరుగుబాటుతో భారతదేశాన్ని బ్రిటిష్‌ ‌పాలన నుండి విముక్తి చేయడానికి అంకితమైన దేశభక్తి సంస్థ. కానీ ఈ కేసులో పట్టుబడ్డ వారు అష్ఫఖుల్లా ఖాన్‌, ‌రాజేంద్రనాద్‌ ‌లాహిరి, చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌మన్మథ్‌నాథ్‌ ‌గుప్త, శచీంద్రనాథ్‌ ‌బక్షి, మురారీలాల్‌, ‌కేశవ చక్రవర్తి, బన్వారీలాల్‌, ‌ముకుందీలాల్‌. ‌వీరిలో ముగ్గురికి మరణశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధించారు. ఈ నలుగురిని రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే బ్రిటిష్‌ ‌వైశ్రాయి వీరి పిటిషన్‌ను తిరస్కరించగా, డిసెంబరు 19,1927లో ఉరి తీశారు. ముగ్గురు సహచరులు ఇలా పాడుతూ ఉరికంబం వైపు నడక సాగించారు.

దిల్‌ ‌సే నికలేగీ న మర్‌ ‌కర్‌ ‌భీ వతన్‌కి ఉల్పతే / మేరీ మిట్టీ సే భీ ఖుశ్‌బూ- ఎ-వతన్‌ ఆయేగీ (మరణించిన తరువాత కూడా హృదయం నుండి దేశప్రేమ బయటకు పోదు, నా మట్టి కూడా దేశపు సువాసనతో గుబాళిస్తూనే ఉంటుంది). ఈ విప్లవ వీరులు రాసిన లేఖలు వారి జ్ఞాపకాలుగా మిగిలాయి (వాటి అనువాదాలు వచ్చాయి). రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌ ‌సెప్టెంబరు 13, 1925న మీరట్‌లో అనాథ శరణాలయంలో సమావేశం కావాలంటూ సెంట్రల్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు, జిల్లా సంఘ కార్యకర్తలకు రాశాడు.

ప్రియ మిత్రమా,

మేము క్షేమము, మా పితామహుని శ్రాద్ధకర్మ ఈ నెల 13వ తేదీన (ఆదివారం) జరగనున్నట్లు మీకు బహుశ తెలిసే ఉంటుంది. మీరు తప్పక హాజరు కావాలి. నిర్ణయించిన సమయానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేయవలసినదిగా ప్రార్థన.

                             ఇట్లు

                           మీ రుద్ర

(రుద్ర, మహాంత్‌, ఆనంద్‌, ‌ప్రకాశ్‌, ‌పరమ హంస్‌- ‌రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌ ‌మారుపేర్లు).

గమనిక: దయచేసి ఈ నెల 11వ తేదీన ఢిల్లీకి బయలుదేరండి. అక్కడ నుండి మీకు సులువుగా బండి దొరుకుతుంది. కౌన్సిల్‌ ‌నిర్ణయం ప్రకారం పెద్ద నగరాల్లోని పోస్టు ఆఫీసులు దోచుకోవాలి. అయితే అది జరక్కముందే సెప్టెంబరు 26 రాత్రి కలకత్తా, ఢిల్లీల మధ్య సుమారు 36 మంది అరెస్టు అయ్యారు.

 కాకోరి కేసులో రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌కు మరణ దండన విధించినప్పుడు భగత్‌సింగ్‌ ఇలా రాశాడు.

‘‘చూడడానికి కూడా చాలా అందంగా ఉండే వాడు. ఎంతో యోగ్యుడు. బాగా ఎరిగినవారు అనేదే మిటంటే మరో ప్రాంతంలో లేదా మరో దేశంలో పుట్టి ఉంటే ఆయన సైన్యాధిపతి అయి ఉండేవాడని. ఈ ఆ కుట్రకంతటికి నాయకుడుగా భావించబడ్డాడు. ఎక్కువగా చదువుకున్నవారు కాకపోయినా, పండిట్‌ ‌జగత్‌ ‌నారాయణ (క్రిమినల్‌ ‌లాయర్‌) ‌లాంటి వాడిని కూడా తికమక పెట్టేవాడు. చీఫ్‌ ‌కోర్టులో తన అపీల్‌ ‌తానే రాసుకున్నాడు. ఇది చూసిన జడ్జీలు, ఎంతో తెలివితేటలు, యోగ్యత గలవారు తప్ప ఇతరులు ఇది రాయలేరని అనవలసి వచ్చింది’’.

రామ్‌‌ప్రసాద్‌ను ఉరి తీయడానికి ఒకరోజు ముందు (డిసెంబరు 18, 1927)న తల్లి చివరిచూపు కోసం వెళ్లింది. ఆమెని చూశాక ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ ఆ మాతృమూర్తి ఉరికొయ్యకు వేలాడబోతున్న కొడుక్కి ధైర్యం చెప్పింది. హరిశ్చంద్రుడిని, దధీచిని గుర్తు చేసుకొమ్మన్నది. దానికి సమాధానంగా, ‘‘నేను మృత్యువుకు భయపడను, విచారం, పశ్చాత్తాపం నాలో లేవు, ఎందుకంటే నేను ఏ పాపం చేయలేదు కనుక. కాని అగ్నికి సమీపంలో ఉన్నప్పుడు వెన్న కరుగుతుంది. తప్పదు నీకు నాకు మధ్య బంధమే అలాంటిది. చూడగానే నీళ్లు తిరిగాయి’’ అన్నారు రామ్‌‌ప్రసాద్‌.

‌చివరి కోరిక ఏమిటని అడగ్గా, ‘బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం పతనం’ నా ఆఖరి కోరికని చెప్పాడు. 1928 జనవరిలో భగత్‌సింగ్‌ ‌కాకోరీ మృత వీరుల గురించి ‘కీర్తి’ అనే పత్రికకు విద్రోహి అనే పేరుతో వ్యాసం రాశాడు దానిలో బిస్మిల్‌ ‌రాసిన లేఖను ఉటంకించాడు.

‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. 19వ తేదీ ఉదయం ఏమి జరగబోతుందో దానికి తయారుగా ఉన్నాను. దేవుడు తగినంత శక్తినిస్తాడు. ప్రజలకు సేవ చేయడానికి త్వరలోనే మళ్లీ జన్మిస్తాననే నమ్మకం నాకుంది. అందరికి నా నమస్కారాలు తెలుపు. దయచేసి మరో పనికూడా చెయ్యి. పండిట్‌ ‌జగత్‌ ‌నారాయణ (బిస్మిల్‌కు ఉరిశిక్ష పడటానికి కారకుడు)కు నా ఆఖరి నమస్కారం తెలియచేయి. మన రక్తంతో తడిసిన రూపాయలతో ఆయనకు సుఖనిద్ర వచ్చుగాక. వృద్ధుడయిన ఆయనకు దేవుడు సద్బుద్ధినిచ్చుగాక’.

బిస్మిల్‌ ‌రాసిన ‘నా జీవన మేఘామాల’ అనే వ్యాసం గోరక్‌పూర్‌ ‌నుండి వెలువడే ‘స్వదేశీ’ పత్రికలో అచ్చయింది, దానిలోని ముఖ్య విషయాలు.

బిస్మిల్‌ను ఉరి తీయడానికి 19వ తేదీ (డిసెంబర్‌ 1927) ఉదయం ఆరుగంటల ముప్పయి నిమిషాల సమయం నిర్ణయమైంది. అందులో విచారించాల్సిం దేమీ లేదు. దేవుని దయతో నేను మాటిమాటికి జన్మనెత్తుతూ ఉంటాను. దీనిలో నా ఉద్దేశం ప్రపంచంలో పూర్తి స్వాతంత్య్రం నెలకొని ఉండటానికి ప్రకృతి సంపదలపై అందరికీ సమాన హక్కు ఉండటానికి ఎవరూ ఇతరులపై పెత్తనం చేయ కుండా ఉండటానికి అన్నిచోట్ల ప్రజలు పంచాయితీ రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి పాటు పడటమే… కోర్టులో మరణ దండన నిందితులు తరుపున అపీలు చేశారు. అయితే దీనికన్నా ముందే గవర్నర్‌కు అర్జీ పంపారు. కానీ జడ్జీలు వీటిని పట్టించుకోలేదు, పైగా ‘రామ్‌‌ప్రసాద్‌ ‌చాలా ప్రమాదకరమైన విప్లవవాది అని, విడుదల అయితే మళ్లీ అదే పని చేస్తాడని’ అన్నారు.

పండిట్‌ ‌మదన్‌మోహన్‌ ‌మాలవ్యా కొందరు పెద్దలను తీసుకుని వైస్రాయిని కలిశారు. కానీ ప్రయోజనం లేదు. ఉరికి తేదీ ఖరారైంది. ఆ టెలిగ్రాంను రామ్‌‌ప్రసాద్‌కు చదివి వినిపించారు, అధికారులు. దానికి సమాధానంగా ఇలా అన్నాడు. ‘సరే, మీ పని మీరు చేయండి!’ శ్రేయోభిలాషుల ఒత్తిడితో క్షమాభిక్ష కోరుతూ చక్రవర్తికి, ప్రీవీ కౌన్సిల్‌కు, వైస్రాయికి ఒక టెలిగ్రాం పంపాడు. ఫలితం, ముందు అనుకున్నదే. అప్పీలు కొట్టివేశారు.

కాకోరీ విచారణ ఒకటిన్నర సంవత్సరం జరిగింది. ప్రభుత్వం తరుపున 300 మంది సాక్షులు హాజరయ్యారు. ‘ఈ రోజు ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు అవి వృథా అయ్యాయనే నిరాశ నాకు కలగలేదు. త్యాగాలు ఎప్పుడూ వృథా పోవు. మా వంటి వారి చల్లని విశ్వాసాల పరిణామం గానే లార్డ్ ‌బుర్కిన్‌ ‌హెడ్‌ ‌బుర్రలో భారతీయుల సంకెళ్లను మరింత బిగించాలనే ఆలోచన రావడం, దానివల్ల రాయల్‌ ‌కమిషన్‌ను పంపడం, దాన్ని బహిష్కరించేందుకు హిందువులు, ముస్లిమ్‌లలో మళ్లీ ఐకమత్యం ఏర్పడుతూ ఉండటం, ఇవన్నీ జరిగాయేమో? ఎవరు చెప్పగలరు? దేవుని దయవలన వీళ్లకు త్వరగా సద్బుద్ధి కలిగి అందరూ ఒక్కటయితే బాగుంటుంది.’ బిస్మిల్‌ ఇలా రాశాడు.

‘‘నొప్పి తెలిసిన వారినడుగు – ఆపదల తీపేమిటో! /

ప్రాణాలర్పించే వారినడుగు – ఆత్మాహుతి వలన సుఖమేమిటో!

నిరీక్షించే కళ్లనడుగు – దర్శినాభిలాష ఎట్టిదో!

కాలి నశించే మిడతనడుగు – తాపమంటే ఏమిటో!

కాకోరీ కుట్ర కేసులో రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌ ‌ముఖ్య అనుచరుడు రాజేంద్రనాద్‌ ‌లాహిరీ. ఈయన బెనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఎ. ‌విద్యార్ధి. ఆయనకూ ‘ఉరి’ ఖాయమైంది. క్షమాభిక్షనూ తిరస్కరిం చారు. శిక్ష అమలుకు ముందు తన అన్నకు ఉత్తరం రాశాడు. ఆ లేఖ-

ప్రియమైన అన్నయ్యకు!

నా క్షమాభిక్ష పత్రాన్ని వైస్రాయ్‌ ‌తిరస్కరించాడని సూపరింటెండ్‌ ఈ ‌రోజు చెప్పాడు. జైలు నియమాల ప్రకారం నన్ను ఒక వారం రోజుల్లో ఉరి తీస్తారు. నీవు నాకోసం బాధపడనవసరం లేదు. ఎందుకంటే నేను నా పాత శరీరాన్ని వదిలి ఒక కొత్త జన్మ ఎత్తబోతున్నాను. నన్ను కలుసుకోవడానికి మీరు ఇక్కడకు రానవసరం లేదు. ఎందుచేతనంటే కొద్దిరోజుల క్రితమే మీరు నన్ను కలిసి వెళ్లారు. నేను లక్నోలో ఉన్నప్పుడు అక్క రెండుసార్లు వచ్చి కలుసుకుంది. అందరికీ నా నమస్కారాలు తెలపండి. పిల్లలకు నా ప్రేమాశీస్సులు.

                   మీ ప్రియమైన తమ్ముడు

                   రాజేంద్రనాథ్‌ ‌లాహిరి


భగత్‌సింగ్‌ను లాహిరి బాగా ప్రభావితం చేశాడు. తన చివరి తమ్మునికి రాజేంద్ర అని పేరు పెట్టాడు. 1928 జనవరిలో ‘కీర్తి’ పత్రికలో ‘విద్రోహి’ పేరుతో రాసిన వ్యాసంలో, ‘ఆయన (లాహిరి) బెనారస్‌ ‌హిందూ యూనివర్శిటీలో ఎమ్‌.ఎ. ‌విద్యార్థి. 1925లో కలకత్తా దగ్గర దక్షిణేశ్వర్‌లో బాంబులు తయారు చేసే కార్ఖానా పట్టుబడింది. అందులో ఈయన కూడా ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అక్కడి నుండే ఈయన్ని లక్నోకు తీసుకువచ్చి కాకోరీ కేసులో ఉరిశిక్ష వేశారు. ఈయనను బారాబంకీ, గోండా జైళ్లలో ఉంచారు. ఈయన ఎదురుగా నిలిచిన మృత్యువును చూసి కూడా భయపడే వాడు కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.’

లాహిరి అక్టోబరు 6, 1925 వ్రాసిన ఉత్తరంలో- ‘నేను ఆరు నెలల కాలం బరాబంకీ, గోండాలలోని దట్టమైన చీకటికొట్లలో ఉన్న తరువాత వైస్రాయ్‌ ‌నా (క్షమాభిక్ష) అర్జీని తిరస్కరించాడు. నన్ను ఒక వారంలో ఉరి తీస్తారని ఈ రోజు నాకు చెప్పారు. ఇప్పుడు నాకోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన మిత్రులకు (ఇక్కడ వారి పేర్లున్నాయి) కృతజ్ఞతలు తెలపడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మీరు నా ఆఖరి నమస్కారాన్ని స్వీకరించండి. మాకు చావడం, బ్రతకడమనేది పాత బట్టలు మార్చుకోవడానికి మించి ఏమీ కాదు (ఇక్కడ జైలు అధికారులు కొన్ని మాటలు కొట్టి వేసినందువలన చదవడం ఎంతమాత్రం వీలు కావడం లేదు). మృత్యువు సమీపిస్తున్నది. నవ్వుతూ, నవ్వుతూ ఎంతో కోరికతో ఆపేక్షతో దాన్ని గాఢంగా ఆలింగనం చేసుకొంటాను. జైలు నిబంధనల ప్రకారం ఇంతకు మించి ఏమీ రాయలేను, మీకు నా నమస్కారాలు. దేశంలోని సానుభూతి పరులందరికి నా నమస్కారములు. వందేమాతరం.

                                                      మీ

                                             రాజేంద్రనాద్‌ ‌లాహిరి


డిసెంబర్‌ 14‌న మిత్రునికి మరో ఉత్తరం రాశాడు.

‘‘ప్రీవీ కౌన్సిల్‌ ‌నా అప్లికేషన్‌ ‌త్రోసిపుచ్చినట్లు నిన్ననే నాకు తెలిసింది. మీరందరు మమ్మల్ని రక్షించడానికి చాలా ప్రయత్నించారు. కానీ దేశపు బలిపీఠం మీద మా ప్రాణాలు బలి ఇవ్వడమే ఇప్పుడు జరగవలసిన పని అని నాకు అనిపిస్తుంది. మృత్యువు అంటే ఏమిటి? అది జీవితానికి రెండవ పార్శ్వమే తప్ప మరేమీకాదు. అలాంటప్పుడు భయపడాల్సిన పని ఏమిటి? ప్రాతఃకాలమున సూర్యుడు ఉదయించడం ఎంత సహజమైన సంఘటనో, ఇదీ అంతే సహజమైంది. చరిత్ర తారుమారు అవుతుంది అనే మా మాట నిజమైతే మా త్యాగం వృధా పోదని నేను భావిస్తాను.

నమస్కారం, అందరికి ఇదే నా ఆఖరి నమస్కారం.

                                                                                                                                                                                   మీ                           

 రాజేంద్రనాథ్‌ లాహిరి


లాహిరిని రెండురోజులు ముందే ఉరి తీశారు. తన త్యాగం వృధా పోదనే లాహిరి నమ్మకం.

లాహిరికి అష్పఖుల్లా కుడి భుజం వంటివాడని ప్రభుత్వం నిర్ధారించింది. అష్పఖుల్లా ఆచారపరుడైన ముస్లిం, అయినా రామ్‌‌ప్రసాద్‌ ‌లాంటి ఆచారపరుడైన ఆర్య సామాజీకునికి విప్లవంలో కుడిభుజం కాగలిగాడు. అందుకే దేశంలోని ఇతర హిందూ ముస్లింలు స్వాతంత్య్రం కోసం తమ చిన్న చిన్న స్వార్థాలను మరచిపోలేరా అని ప్రశ్నించేవాడు. అష్ఫఖుల్లా స్వాతంత్య్ర సమరంలో ఉరి కంబం ఎక్కిన మొట్టమొదటి ముస్లిం.

లోకమంతా శత్రువయినా రండి, ఎదిరిద్దాం! పోరాడదాం! జీవించేది కొద్ది ఘడియలే! ప్రియసోదరా ఇక తెల్లవారినప్పటి దీపాన్ని, ఆరిపోబోతున్నాను. నా చుట్టూ గాలిలో వ్యాపించి ఉంటుంది. చింతనా విద్యుత్తు నశ్వరమౌ ఈ పిడికెడు మట్టి ఉన్ననేమి? లేకున్ననేమి? మరి సెలవు. దేశ సౌభాగ్యమా, సంతోషంగా ఉండు, ఇక ప్రయాణం సాగిస్తాం! ధైర్యంగా ఉండు, నమస్తే!

 భగత్‌సింగ్‌

‌సోర్సు : జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా (అమరవీరుల ఉత్తరాలు)

 పేజీ నెం.22 టు 32, తొలిపలుకులు అనువాదం జె.లక్ష్మీరెడ్డి పేజీ.-132

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE