జాతి గుండెలలో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికితే, జైళ్లు నిండిపోక తప్పదు. దేశం ఆత్మ విస్మృతిని వదలించుకోవాలన్న క్షణంలోనే దేహం మీద సంకెళ్లు బిగుసుకుంటాయి. రెండు శతాబ్దాల పాటు విదేశీ పాలన మీద సాగిన భారత స్వాతంత్య్ర సమరంలో అక్షరాలా ఇదే జరిగింది. వలస పాలన నుంచి భారతావని విముక్తమయిందంటే అందుకు చెల్లించిన మూల్యం అనన్య సామాన్యమైనది. కొన్ని వందల జీవితాలు ఆ యజ్ఞంలో ఆహుతయ్యాయి. వందల మంది ఉరికొయ్యలు ఎక్కారు. కొన్ని వేల జీవితాలు ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య మగ్గిపోయాయి. కానీ వారి జీవితాలే కాదు, వారి సాహసం, దృఢదీక్ష, స్వాతంత్య్ర పిపాస, దేశభక్తిలోని గాఢత అన్నీ జైలు గోడల మధ్య బందీ అయిపోయాయి. స్వరాజ్య సమరం వేళ విప్లవకారుల, కొందరు యోధుల రెండో నివాసం కారాగారమే అయింది. పరాయి పాలనలో దేశభక్తులను అణచివేయడానికి ప్రత్యేక నిర్బంధ కేంద్రాలే ఏర్పాటయ్యాయి. అలీపూర్‌ (బెంగాల్‌), నైని (ప్రయాగ్‌రాజ్‌), అండమాన్‌ సెల్యులార్‌ జైలు (దక్షిణ అండమాన్‌ జిల్లా), కడలూరు అలాంటివే. ఇవే కాదు, దేశం నలుమూలలా జైళ్లు వెలిశాయి. అక్కడ సమర యోధులను, నేరగాళ్లను ఒకే తీరులో చూశారు. అది మరీ విషాదం. అక్కడ ముగిసిపోయిన ఎన్నో జీవితాలు చరిత్ర పుటలకు చేరలేదు. అంటే వారి త్యాగాలు గాలిలో కలసిపోయాయి. అసలు దేశభక్తి భావననీ, దేశభక్తులనూ కాలగర్భంలోకి నెట్టివేయాలన్న పాశవిక ఆలోచనతో ఇక్కడ కారాగారాలే నిర్మించారు. కానీ వాటి వల్ల స్వాతంత్య్ర కాంక్ష తీవ్రమైంది. ఆగస్ట్‌ 14 అఖండ భారత దివస్‌ సందర్భంగా ఆ హుతాత్మలకు ఒక్క కన్నీటి బొట్టు అయినా రాల్చాలి.


భారత భూభాగం నుంచి నెలల కొద్దీ సముద్రం మీద ఓడలలో ప్రయాణించి అక్కడికి చేరుకునేవారు స్వాతంత్య్ర సమరయోధులు. మెడ నుంచి చేతులూ కాళ్లూ కలిపి బంధించే ఇనుప సంకెళ్లతోనే దిగేవారు`ద్వీపాంతర శిక్ష అనుభవించ డానికి. సీలమండల మీద సంకెల చర్మాన్ని చీల్చినా, రక్తమోడుతున్నా అడుగులు వేగంగానే పడాలి. కాస్త సురక్షితంగా ఉండే ఇతర మార్గాలు ఉన్నా, చిత్తడి నేల మీద ఆ భయానక కారాగారం వైపు నడిపించే వారు. అదే అండమాన్‌ సెల్యులార్‌ కారాగారం. ఆ దారంతా తేళ్లు, పాములు, జలగలు, విష కీటకాలు. వాటిని తప్పించుకుందామని క్షణం ఆగినా ఒంటి మీద లాఠీలూ, తుపాకీ మడమలూ చెలరేగిపోయేవి. అలా, అండమాన్‌లో అడుగు పెట్టడమంటే నరకంలో ప్రవేశించినట్టేనన్న దృఢాభిప్రాయానికి ఖైదీలను తెచ్చేవారు. దేశానికి స్వాతంత్య్రం కావాలని గొంతెత్తి, శిక్షకు గురైన ఆనాటి దేశభక్తులు ఆ ద్వీపంలో అడుగు పెట్టిన ఆ తొలి క్షణమే భయానకం. ఆపై ప్రతి నిమిషం ప్రాణాంతకం. ఎక్కడో అండమాన్‌ దీవులలో ఈ జైలు నిర్మాణం వెనుక ఉద్దేశం – జాతీయ పోరాటాలను మొగ్గలోనే తుంచడం. స్వాతంత్య్రం కోసం నోరెత్తితే ఆ గొంతు శాశ్వతంగా వినిపించ కుండా వందల మైళ్ల అవతల ఆ ద్వీపంలో బంధిం చడం. కుటుంబాలకు, సంస్కృతికి సుదూరంగా విసిరివేయడం.

అండమాన్‌ జైలు ప్రతి ఇటుక ఒక విషాదగాథను చెప్పగలదు. మానసిక శారీరక హింసతో కునారిల్లిన జీవితాలను ఆ గోడలు చూశాయి. కడుపు కాలుస్తూ, కాళ్లకు సంకెళ్లతో నడిపించిన బ్రిటిష్‌ రాక్షస జాతి అమానుషత్వాన్ని దశాబ్దాల పాటు పరికించాయవి. అవమానాలతో ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ల ఆక్రోశాలకే కాదు, తిరుగుబాటు తత్త్వాన్ని వీడలేక చావును కొని తెచ్చుకున్న వారి వీరత్వానికి కూడా పావురాల గూళ్ల వంటి ఆ జైలు గదులే సాక్ష్యం. సంకెళ్లలోనే ఉన్నా మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రతి క్షణం తపించిన భారత యోధుల స్థితప్రజ్ఞతకు జైలును చుట్టి ఉన్న ఆ సాగరమే ప్రత్యక్ష సాక్షి.

సెల్యులార్‌ జైలు ఎందుకు?

 భారతదేశంలో శాశ్వతంగా తిష్ట వేయవలసిందే నని 18వ శతాబ్దం చివరికి ఈస్టిండియా కంపెనీ నిర్ధారించుకుంది. ఒక వ్యాపార సంస్థ ప్రభుత్వ అవతారం ఎత్తింది. ఇక్కడి ప్రజలను తమ దేశ శిక్షా స్మృతుల ఆధారంగా విచారించి శిక్షలు విధించింది. అందులో సర్వసామాన్యమైన శిక్ష, కారాగారమే. అలీపూర్‌, ప్రయాగ్‌రాజ్‌లతో పాటు పట్నా, ఆగ్రాలలో అందుకోసమే ప్రత్యేక కారాగారాలు నిర్మించారు. 1857 నాటికి దేశంలో వలస పాలకులు నిర్మించిన కారాగారాలు దాదాపు వంద. ఎన్ని తిరుగుబాట్లు జరిగి ఉంటాయో మరి! ఏవీ ఆ చరిత్రలు!

 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఉధృతికి శ్వేతజాతి తల్లడిల్లిన మాట నిజం. ఎందరో విప్లవ కారులను కంపెనీ మూకలూ, కంపెనీ అధికారులను సిపాయీలూ ఊచకోత కోశారు. అయినా భారత్‌నీ, ఇక్కడి సంపదనీ సమూలంగా దోచుకోకుండా వెళ్లిపోవడం ఆ జాతికి సుతరాము ఇష్టం లేదు. అందుకు అది ఆశ్రయించిన మార్గం అణచివేత. దీనికి ఇక్కడి అనైక్యత కూడా ఉపయోగపడిరది. ఆత్మ విస్మృతి తోడ్పడిరది. ఇంగ్లిష్‌ వాడి మీద తిరగబడిన ప్రతి భారతీయుడిని ఆ సమాజానికి సుదూరంగా ఉంచడం, దారుణంగా హింసించడం మొదలు పెట్టారు. ఈ దుశ్చర్యలకు ఎంతో అనువైనవిగా వాళ్లకి కనిపించినవే అండమాన్‌ నికోబార్‌ దీవులు. ఈ ద్వీప సమూహం బంగాళాఖాతంలోనిది. ఉద్యమకారులను ఏకాకులను చేసి, స్వాతంత్య్ర కాంక్షను అంతం చేయాలన్న ఆలోచన ఈస్టిండియా కంపెనీకి 1789 నుంచే ఉంది. కానీ స్థానిక గిరిజన తెగలతో పొంచి ఉన్న ప్రమాదం కారణంగా ఆ ఆలోచనకు విరామం వచ్చింది. నిధుల లేమీ కారణమే. కానీ 1857 ఉదంతం అలాంటి జైలు నిర్మాణం అవసరాన్ని తీవ్రం చేసింది. ఒక పక్క ప్రథమ స్వాతంత్య్ర సమరజ్వాలలు ఎగసిపడుతూ ఉండగానే, ఒక పటిష్ట, విశాల ‘శిక్షా స్థావరం’ (పీనల్‌ సెటిల్‌మెంట్‌) నిర్మాణం గురించి ఈస్టిండియా కంపెనీ యోజన చేసింది. అందుకు అండమాన్‌ సరైనదని దాని అభిప్రాయం. అలాంటి స్థావరం ఏర్పాటు ప్రతిపాదనల కోసం ఒక సంఘాన్ని నియమించింది. డాక్టర్‌ ఫ్రెడ్రిక్‌ జాన్‌ మూవాత్‌ దాని నాయకుడు. సహాయకులుగా లెఫ్టినెంట్‌ జేఎస్‌ హీత్కోట్‌, డాక్టర్‌ జీఆర్‌ ప్లేఫెయిర్‌లను నియమిం చారు. జనవరి 15,1858న ఈ కమిటీ నివేదికను ఇచ్చింది. కంపెనీ ఆలోచనలకు తగినట్టు శిక్షా స్థావరం ఏర్పాటుకు దక్షిణ అండమాన్‌ సరైనదేనని తేల్చింది. శ్వేతజాతి పాలన మీద, అకృత్యాల మీద ఎవరు నోరెత్తినా, ఎన్ని తిరుగుబాట్లు జరిగినా వారం దరినీ కూడా వారి సమాజం నుంచి వేరు చేసి ఇక్కడ బంధించే సామర్థ్యం ఆ జైలుకి ఉండాలన్నది ప్రధాన ఆశయం. అలాగే అప్పటి బ్రిటిష్‌ వలసలు సింగపూర్‌, మారిషస్‌లలో అరెస్టయిన భారతీయు లను కూడా ఇక్కడే ఉంచాలన్న ఆలోచన ఉంది.

నాంది పలికిన ‘రాస్‌’

డాక్టర్‌ ఫ్రెడ్రిక్‌ ప్రతిపాదనలకు బలమైన నేపథ్యం ఉంది. ఇదంతా రాస్‌ అనే ద్వీపం కేంద్రంగా మొదలయిందని గుర్తుంచుకోవాలి. స్వాతంత్య్ర సమరయోధులను ఆ దీవికి తీసుకెళ్లి బందీలుగా ఉంచే ప్రక్రియ సెల్యులార్‌ జైలు కట్టక ముందే ఉంది. మార్చి 10, 1858న రెండు వందల మందిని జేమ్స్‌ పట్టిసన్‌ వాకర్‌ పర్యవేక్షణలో మొదటిసారి తీసుకుపోయినది అండమాన్‌ దీవులలోని రాస్‌కే. వీరంతా ఎవరు? కరుడగట్టిన హంతకులో, గజదొంగలో, సముద్రపుదొంగలో కాదు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరంలో పాల్గొని ఓడినవారు. అలా వచ్చిన వారి సంఖ్య కేవలం మూడు మాసాలకే 773కు పెరిగింది. ఆ వీరులలో 309 మంది పేరు అక్కడ పెట్టిన శిలాఫలకాల మీద ఉన్నాయి. జూన్‌ 16,1858న వీరంతా కలసి ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేశారు. సెప్టెంబర్‌ 28,1858 నాటికి ఇక్కడకు బందీలుగా తరలించుకువచ్చిన వారి సంఖ్య 1,330కి చేరింది. రెండేళ్లలోనే, అంటే 1858, 1860 మధ్య భారతదేశం నలుమూలల నుంచి ఇక్కడకు తీసుకువచ్చిన విప్లవకారుల సంఖ్య రెండు నుంచి నాలుగు వేల మధ్య ఉంటుందని అంచనా. ఇంత చైతన్యాన్ని బంధించే జైలు కోసమే కంపెనీ యోచించింది. ఆ జైలు నిర్మాణానికి 1857 పోరాటయోధులతోనే బాటలు నిర్మింప చేశారు ఆంగ్లేయులు.

సెల్యులార్‌ జైలు నిర్మాణానికి నాంది పలికినది రాస్‌. 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ పాలనలో ఆ ద్వీపానికి రాస్‌ పేరు పెట్టారు (దీనికే 2018లో ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ సుభాశ్‌ చంద్ర బోస్‌ ద్వీప్‌ అని పేరు మార్చారు). రాస్‌ అసలు పేరు`చోంగ్‌ ఎకీ బూద్‌. డేనియల్‌ రాస్‌ అనే సర్వేయర్‌ ఇక్కడికి వచ్చాక అతడి పేరు వచ్చింది. 1789 తరువాత లెఫ్టినెంట్‌ ఆర్చిబాల్డ్‌ బ్లెయిర్‌ (మరొక సర్వేయర్‌, బొంబాయి నౌకదళం) వచ్చాడు. ఇతడు రాస్‌ ద్వీపాన్ని ఆంగ్లేయుల అడ్డాగా మార్చేశాడు. ఓడదొంగలను అదుపు చేయడం, ఓడలు మునిగితే సిబ్బందిని వాళ్లు చంపకుండా కాపాడడం కూడా ఇతని బాధ్యత. ఆ విధంగా రాస్‌ భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకమైనదని వారికి అర్దమైంది. బ్లెయిర్‌ ఒక ఆసుపత్రి, ఒక శానేటోరియం బ్లెయిర్‌ స్థాపించాడు. అండమాన్‌ సముద్రం మీద ఆంగ్లేయులకు ఆధిపత్యం వచ్చింది. ఆర్చిబాల్డ్‌ బ్లెయిర్‌ పేరుతోనే పోర్ట్‌బ్లెయిర్‌ పట్టణాన్ని నిర్మించారు. నేటి రాజధాని ఇదే. ఇప్పుడు శ్రీవిజయ పురం అని పిలుస్తున్నారు.

సెల్యులార్‌ జైలు నిర్మించడానికి ముందు నుంచి, అంటే 1860 నుంచి తెల్లజాతి పాలకులు అండమాన్‌కు పంపించిన తమను వ్యతిరేకులైన భారతీయుల సంఖ్య 80,000. ఖైదీలతో వలసలను విస్తరించడం కంపెనీకి అలవాటే. బెన్‌కూలెన్‌ పెనాంగ్‌, మలక్కా, సింగపూర్‌, టానాస్సెరి, మౌల్‌మీన్‌ వంటి తీర ప్రాంతాలను కూడా అలాగే అభివృద్ధి చేశారు. వీరిలో అధికారుల జాత్యహం కారానికి బలైనవారు, పారిపోతూ పట్టుబడి చనిపోయినవారు, ఆ అణచివేతను, హింసను, శారీరక శ్రమను, అవమానించే తీరును భరించలేక బలవన్మరణాలు చేసుకున్నవారు వేలల్లో ఉంటారని అంచనా. ఇంత చేసినా ఎందుకో 1796లో ఈ విస్తరణను నిలిపివేశారు. కానీ 1857 సమరం తిరిగి ఆ ద్వీపాలను శిక్షా స్థావరాలుగా మార్చవలసిన అవసరాన్ని కంపెనీ గుర్తించింది.

పదేళ్లు సాగిన నిర్మాణం

కానీ వేలాదిగా తరలించిన విప్లవకారులు, ఉద్యమకారులను కాపలా కాయడం 1860 ప్రాంతానికే భరించలేనంతగా మారింది. దీనితో చాల్స్‌ జేమ్స్‌ లేయాల్‌, ఏఎస్‌ లెథరిడ్జ్‌ తయారు చేసి ఇచ్చిన తనిఖీ నివేదిక ప్రాతిపదికగా పోర్ట్‌బ్లెయిర్‌ పట్టణానికి దగ్గరగా సెల్యులార్‌ జైలు నిర్మాణానికి పూనుకున్నారు. 1896 నుంచి 1906 వరకు విశాల జైలు నిర్మాణం సాగింది.19వ శతాబ్దం ఆఖరున భారతీయులలో జ్వలిస్తున్న జాతీయ భావనల ఉధృతిలో ‘మహా అత్యవసర పథకం’ పేరుతో సెల్యూలార్‌ జైలు నిర్మాణం చేపట్టారు. నాటి ఖర్చు రూ. 5,17,352. మూడంతస్తుల ఈ జైలు బండిచక్రంలో ఆకుల మాదిరి ఆకృతితో కనిపిస్తుంది. బ్రిటన్‌ జైళ్ల తరహా నిర్మాణమిది. 696 సెల్స్‌ (4.5 బై 2.7 మీటర్లు) ఉన్నాయి. నేల నుంచి మూడు మీటర్ల ఎత్తులో కిటికీ ఉంటుంది. ఇంత చిన్న చిన్న సెల్స్‌ ఉంటాయి కాబట్టే దీనికి సెల్యులార్‌ జైలు అన్న పేరు వచ్చింది. ఇంత పెద్ద కారాగారం చుట్టూ ఉండే గోడ ఏ కోట గోడనో మరిపిస్తుందనుకుంటే పొరపాటు. తక్కువ ఎత్తులోనే ఉంటుంది. కానీ గోడ దాటినా అవతల ఉన్న భారత భూభాగంలోకి వెళ్లలేరు. జైలుకీ, భారత భూమికీ నడుమ బంగాళా ఖాతం. దూరం వేయి మైళ్లు. కొంత భాగం అడవి. దాని నిండా అడవి పందులు, పులులు. వీటి నుంచి తప్పించుకున్నా జారవాస్‌ అనే స్థానిక గిరిజనుల బారి నుంచి తప్పించుకోలేరు. ఆగంతకుడు కనిపిస్తే శరసంధానం జరిగిపోతుంది. దీనికి తోడు విపరీతమైన వర్షాలు.

అండమాన్‌ ఆంగ్లేయుల శిక్షా స్థావరంగా మారిన 80 ఏళ్లకు జనావాస కేంద్రం మారింది. బ్రిటిష్‌ పట్టణాన్ని మరిపించింది. అధికారుల ఆవాసాలు, బేకరీలు, క్లబ్‌ హౌస్‌లు, చర్చ్‌, స్మశాన వాటిక వంటివన్నీ అమరాయి. ఒక బహిరంగ వేదిక, అందులో బాల్‌రూమ్‌ నృత్యాలు వగైరా కూడా వచ్చాయి. టెన్నిస్‌, క్రికెట్‌, కొలనులలో ఈత వంటి క్రీడలు కూడా మొదలయినాయి. పారిస్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అన్న పేరు వచ్చింది. అయితే 1941లో వచ్చిన భూకంపం ఈ వైభవాన్ని తుడిచిపెట్టేసింది. ఆ మరుసటి సంవత్సరమే 1942లో నేతాజీ సుభాశ్‌ చంద్ర బోస్‌ రాస్‌ ద్వీపానికి వచ్చారు. త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అప్పుడే అండమాన్‌ను జపాన్‌ ఆక్రమించి, 1945 వరకు తన అధీనంలో ఉంచు కుంది. ఆ సమయంలో జపాన్‌ తవ్విన కందకాలు ఇప్పటికీ ఉన్నాయి. తరువాత ఈ కారాగారాన్ని మ్యూజియంలు, పురావస్తు కట్టడాల రక్షణ చట్టం 1958 పరిధిలోకి తీసుకువచ్చారు. కానీ జపాన్‌ ఇక్కడి ఖైదీలను తన పరమ శత్రువైన బ్రిటిష్‌ ఖైదీలుగా చూసి, హింసించింది. 44 మంది పౌరులను కాల్చి చంపింది.

నేల మీద నరకలోకాలు

రాస్‌ శిక్షా స్థావరం మొదలు, అప్పటికే ఉన్న కారాగారాల వల్ల ఆంగ్లేయుల ఆధిపత్యానికి రక్షణ ఏర్పడిరది. కానీ అవన్నీ మొదటి నుంచి అమానుష త్వానికీ, అకృత్యాలకు ఆలవాలంగానే ఉన్నాయి. 1815లో అలీపూర్‌ జైలులో ఖైదీలు పని చేయడానికి నిరాకరిస్తూ సమ్మె చేశారు. కారణం, కింది కారాగారాల కంటే ఇందులో ఇచ్చే కూలీ తక్కువ. 1834లో అదే జైలులో ఖైదీలు తిరుగుబాటు చేసి జైలర్‌నీ, సూపరింటెండెంట్‌నీ చంపేశారు. 1840 ప్రాంతంలో నిరాహార దీక్షలు చాలా జైళ్లలో సర్వసాధారణం. ఈ కేంద్రాలకు ఖైదీలను తీసుకు రావడం వెనుక వారి కుటుంబాలకే కాదు, వారి సంస్కృతీ సంప్రదాయాలకు సుదూరంగా ఉంచడం ఉద్దేశం. అందుకే స్థానిక ప్రజలకు వీరంటే సాను భూతి ఉండేది. 1845`46లలో అర్రా న్యాయస్థానం మీద సాధారణ పౌరులు జరిపిన దాడి ఇలాంటి నేపథ్యం ఉన్నదే.

సిపాయీలకు బాసటగా

కారాగారాలతో జాతీయ భావాన్ని బంధించాలని చూసినా చాలా సందర్భాలలో అవే తిరుగుబాటుకు ఆసరాగా నిలిచాయి. 1857లో మీరట్‌ పట్టణంలో పోరాటం జరిగిందంటే అందుకు వెనుక ఉన్నది అక్కడి కారాగారమే. కంపెనీ అధికారుల ఆదేశాలు ధిక్కరించారన్న అభియోగంతో 85 మంది సిపాయీ లను సంకెళ్లతో ఈ జైలులోనే బంధించారు. ఆవు కొవ్వు, పంది కొవ్వు తూటాలకు ఉపయోగిస్తున్నారన్న మాట బయటకు రావడంతో అటు హిందువులు, ఇటు ముస్లింలు కూడా తిరగబడిన సంగతి తెలిసిందే. సిపాయీలను అంత అవమానకరంగా చూడడం పట్ల సాటి సిపాయీలే కాకుండా. మీరట్‌ పట్టణ వాసులు కూడా ఆగ్రహించారు. తరువాత ప్రజలు, సిపాయీలు కలసి తిరుగుబాటు చేసి, ఆ జైలును దగ్ధం చేశారు. ఈ కారాగారంలో ఉన్న దాదాపు 700 మంది సిపాయీలు ఆఖరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫార్‌ను కలుసుకోవడానికి ఢల్లీి బాట పట్టారు. ఉత్తర భారతదేశంలో ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి. తిరగబడ్డ సిపాయీలకు స్థానికులు తోడుగా వచ్చి బందీలందరినీ విడుదల చేసేశారు. ఇలాంటి సన్నివేశం ఫైజాబాద్‌లోనూ జరిగింది. సంకెళ్లలో ఉన్న సిపాయీలను కమ్మరులు విముక్తం చేసేవారు. కానీ అందరికీ ఇలాంటి అవకాశం రాలేదు. కొందరిని అండమాన్‌, మాండలే వంటి జైళ్లకు తరలించారు.

పదునెక్కిన జాతీయ భావాలు

1857 తరువాత వందేమాతరం ఉద్యమం, లేదా స్వదేశీ లేదా బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్య మంతో భారతీయుల స్వేచ్ఛా కాంక్ష కొత్త రెక్కలు ధరించింది. సామాన్యుల నేతృత్వంలో సాయుధ సమరం తెరమీదకు వచ్చింది. ఢల్లీి, బెంగాల్‌, రాజస్తాన్‌ వంటి ప్రదేశాలలో యువతరం ప్రాణాలకు తెగించి తుపాకీ పట్టింది. ఇందులో ముఖ్యుడు బరీంద్రకుమార్‌ ఘోష్‌ (అరవింద ఘోష్‌ తమ్ముడు). ఈయనను ఆలీపూర్‌ బాంబు కుట్రకేసులో అరెస్టు చేసి 1909లో అండమాన్‌ జైలుకు పంపారు. ఆయన అక్కడ 11 ఏళ్లు ఘోర శిక్షను అనుభవించారు. తన జ్ఞాపకాలను ‘ది టేల్‌ ఆఫ్‌ మై ఎక్సైల్‌’ పేరుతో అక్షరబద్ధం చేశారు కూడా. మనుషులతో కలవ కుండా చేసి మానసికంగా హింసించడం, క్షణం కూడా విరామం ఇవ్వకుండా దారుణమైన శ్రమ చేయించడం ఎంత బీభత్సమో ఆయన రాశారు. ఘోష్‌ సన్నిహితుడు ఉపేంద్రనాథ్‌ బెనర్జీని కూడా అక్కడే బంధించారు. ఈయన రాసిన ‘నిర్బాసితర్‌ ఆత్మకథ’లో తన అనుభవాలను నిక్షిప్తం చేశారు. అలీపూర్‌ కారాగారంలో శిక్ష అనుభవించిన అరవిందులవారు ‘కారా కహానీ’ పేరుతో అక్కడ తను అనుభవించిన శిక్ష ఎంత ఘోరమో వర్ణించారు. ఆనాటికి ఉన్న అంతర్జాతీయ జైలు నిబంధనలను బట్టి ఖైదీలను అంత దారుణంగా హింసించరాదు. కానీ బ్రిటిష్‌ జాతి ఆ నిబంధనలు లేనట్టే ప్రవర్తిం చింది. అయినా పలు పంథాలలో ఖైదీలు తమ హక్కుల రక్షణకు సాహసోపేతంగా ప్రయత్నించేవారు. 1929లో మియాన్‌వాలి, లాహోర్‌ జైళ్లలో భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌దత్‌ చేసిన నిరాహార దీక్షలు ఇలాంటివే. వీరి సమ్మె దాదాపు మూడు మాసాలు సాగింది. దేశమంతటా ఆ వార్త వ్యాపించింది. కేవలం నిబంధనల మేరకు తిండి, బట్ట ఇవ్వాలని, ఖైదీలపై హింస తగ్గాలని, పుస్తకాలు, వార్తాపత్రికలు అందుబాటులో ఉంచాలని మాత్రమే వారు కోరారు. ప్రభుత్వం క్రూరమైనది. దిగి రాలేదు. అంత తీవ్ర నిరసన చేపట్టక తప్పలేదు. తూర్పు భారతంలో జాతీయవాదాన్ని అణచివేయడానికి అలీపూర్‌ జైలు నుంచి దాదాపు 100 మంది విప్లవకారులను 1933లో అండమాన్‌ జైలుకు తరలించారు. వీరూ పాత ఖైదీలు కలసి అండమాన్‌లో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షతో కొంత మార్పు వచ్చింది.

కాలాపానీ… త్యాగమూర్తుల నిలయం

అండమాన్‌ సెల్యులార్‌ జైలు లేదా కాలాపానీ పేరు చెప్పగానే వెంటనే ఒక పేరు గుర్తుకు వస్తుంది. అదే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. ఆయన అన్నగారు బాబూరావ్‌ సావర్కర్‌ కూడా ఇదే జైలులో కఠిన శిక్ష అనుభవించారు (మరొక సోదరుడు నారాయణరావ్‌ సావర్కర్‌, స్వాతంత్య్ర సమర యోధుడు. వైద్యుడు. ఈయనను గాంధీజీ హత్య నేపథ్యంలో అహింసా వాద కాంగ్రెస్‌ వాదులు రోడ్డు మీదకు లాక్కొచ్చి కొట్టి చంపారు). ఇంకా భాయి పరమానంద్‌, బటుకేశ్వర దత్‌, త్రైలోక్యనాథ్‌ చక్రవర్తి, సోహన్‌సింగ్‌,బరీంద్రకుమార్‌ ఘోష్‌, ఉల్లాస్కర్‌ దత్‌, సచీంద్రనాథ్‌ సన్యాల్‌, హరేకృష్ణ కోనార్‌, సుబోధ్‌ రాయ్‌, లాధారామ్‌, ఇందుభూషణ్‌ రాయ్‌, పృథ్వీసింగ్‌ ఆజాద్‌, పులీన్‌దాస్‌, గుర్ముఖ్‌సింగ్‌, మోతీలాల్‌ వర్మ, బాబూ రామ్‌హరి, పండిత్‌ ప్రేమానంద్‌, ఫజల్‌ ఏ హక్‌ ఖైరాబాదీ, యోగేంద్ర శుక్లా ఇక్కడ శిక్ష అనుభవించారు. బరీంద్రనాథ్‌ ఘోష్‌ ఇంతటి పటిష్టమైన జైలు గోడల నుంచి 1915లో తప్పించు కున్నారు. తప్పించుకుని బయటపడే అదృష్టం దక్కిన ఏకైక స్వాతంత్య్ర సమరయోధుడు బరీన్‌. ఉల్లాస్కర్‌ దత్‌కు బ్యాటరీ సాయంతో (ఆ జైలులో రాత్రి దీపాలు ఉండేవి కావు. విద్యుత్‌ ఎలాగూ లేదు) విద్యుదాఘా తాలు ఇచ్చేవారు. అవి ప్రత్యేకంగా బెంగాల్‌ నుంచే తెప్పించిన బ్యాటరీలు కావడం విశేషం.

బెంగాల్‌ వీరులే ఎక్కువ

అండమాన్‌ సెల్యులార్‌ కారాగారంలో 1909 నుంచి 1938 వరకు శిక్ష అనుభవించినవారిలో 68 శాతం విప్లవకారులు ఉమ్మడి బెంగాల్‌ ప్రాంతం వారే. ఈ విషయం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది (ఫిబ్రవరి 13, 2025). పైన పేర్కొన్న ఆ రెండు సంవత్సరాల నడుమ ఆ కారాగారానికి 585 మందిని తరలించారు. అందులో బెంగాలీలు 398 మంది. తరువాత స్థానం పంజాబీలది. 95 మంది పంజాబీలు అదే సమయంలో అక్కడ ఉన్నారు. అయితే ఈ అంకెలతో విభేదించేవారు ఉన్నారు. ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని చెప్పడం వాస్తవం.. 1909`1931 మధ్య ఆ జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన వాడే డేవిడ్‌ బేరీ. బేరీ బుచర్‌ అని పిలిచే వారు. నీవు ఇక్కడ ఉన్నంత కాలం నేనే నీకు దేవుడిని అని చెప్పేవాడు, ఖైదీలకు.

సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తే…

బ్రిటిష్‌ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసినట్టు కనిపించిన ఏ విప్లవకారుడినైనా ఆంగ్ల ప్రభుత్వం అండమాన్‌ తరలించేదన్నది నిజం. అలీపూర్‌ బాంబు కేసు, నాసిక్‌ కుట్ర కేసు, గదర్‌ పార్టీ లాహోర్‌ కుట్ర కేసు, బెనారస్‌ కుట్ర కేసు, ఇంటర్‌ ప్రోవెన్షియల్‌ కేసు, చిట్టగాంగ్‌ ఆయుధాగారం కుట్ర కేసు, గయా కుట్ర కేసు వంటి వాటిలో పట్టుబడిన వారందరినీ ఇక్కడికే తరలించారు.

వీరిని అరాచకవాదులు, ఉగ్రవాదులు, దేశద్రోహులు పేరుతో విభజించేవారు. ‘ఎస్‌’ అన్న అక్షరం చొక్కా మీద ఉంటే వాళ్లు సెడిషనిస్టులు. అంటే దేశద్రోహులు. ‘సి’ అని ఉంటే కాన్‌స్పిరసీ (కుట్ర) కేసు వారు. ప్రమాదకరమైన వారు అన్న బ్యాడ్జిలు రాజకీయ ఖైదీలకు పెట్టేవారు. అంటే ‘డి’ అక్షరం ఉండేది. సావార్కర్‌ చొక్కా మీద ఇదే ఉండేది. సావార్కర్‌, ఉల్లాస్కర్‌, బరీంద్రనాథ్‌ భాయి పరమానంద్‌ వంటివారు ఈ విభజనను నిలిపి వేయించేందుకు పోరాడారు.

గొడ్డు చాకిరితో చంపేవారు

సెల్యులార్‌ జైలుకు వచ్చిన ఖైదీలతో పని చేయించేవారు. అక్షరాలా గొడ్డు చాకిరి. అంతటి దేశభక్తులను పశువుల్లా చూసేవారు. అడవులు కొట్టడం, గానుగ ఆడిరచి కొబ్బరి నూనె తీయడం, కొబ్బరి పీచును వినియోగంలోకి తేవడం వంటి పనులే కావచ్చు. కానీ నిర్దేశించిన రీతిలో ఉత్పత్తి జరగకపోతే మళ్లీ ఉప శిక్షలు పడిపోయేవి. నిరంతరం నీటి ఎద్దడి ఉండేది. ‘మా ఊరిలో ఎద్దులు మాత్రమే గానుగ లాగుతాయి. ఎంతో అలవాటు ఉన్న ఆ పశువులతోనే రోజుకు 16 పౌనుల ఆవనూనె ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ సెల్యులార్‌ జైలులో మరో ఇద్దరు తోటి ఖైదీలతో కలసి నేను గానుగ తిప్పేవాడిని. నిత్యం సాయంత్రానికల్లా 80 పౌనుల కొబ్బరినూనె ఉత్పత్తి చేయవలసి వచ్చేది. అంత ఉత్పత్తి సమయానికి పూర్తి కావడానికి జమాదారులు మమ్మల్ని పరుగెత్తించేవారు. వేగం తగ్గినప్పుడల్లా దారుణంగా కొట్టేవారు. కింది పడిపోయినా కొడుతూనే ఉండేవారు. ఇది నిత్యం జరుగుతూనే ఉండేది’. ఇది అలీపూర్‌ కుట్ర కేసులో శిక్షపడి వచ్చిన ఉల్లాస్కర్‌ దత్‌ చెప్పిన ఒక అనుభవం మాత్రమే. గానుగ తిప్పించడం పరమ కఠోరమైన శిక్ష. ఈ శిక్ష అనుభవిస్తూనే చాలామంది చనిపోయారు. బేరీ బుచర్‌ సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్ల గదర్‌ వీరుడు బాబా భాన్‌సింగ్‌ చనిపోయాడు. ఇందు భూషణ్‌ రాయ్‌, నరీంగున్‌ సింగ్‌ ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో ఉన్నారు. వీరు టోర్న్‌ కుర్తా పేరుతో పిలిచే ఒక శిక్షను భరించలేక ఉరి వేసుకుని చనిపోయారు. నిజానికి ఈ జైలులో శిక్ష అనుభవించడం కంటే, చచ్చిపోవడమే మేలన్న అభిప్రాయానికి వచ్చేవారు. పంజాబ్‌ నుంచి వచ్చిన రామ్‌ రఖా అనే దేశభక్తుడు ఉపవాసాలతో చనిపోయాడు. ఇతడు ఆమరణ నిరశన పాటించాడు. తన యజ్ఞోపవీతాన్ని అవమా నించినందుకు ఆయన ఆత్మహత్యను ఆశ్రయించాడు. నిరాహారదీక్ష కొనసాగినా చావు తప్పేది కాదు. ఆ దీక్షను భగ్నం చేయాలని అధికారులు భావించినా చావు తప్పేది కాదు. దీక్షను భగ్నం చేయడానికి బలవంతంగా పాలు తాగించేవారు. అవి ఊపిరి తిత్తులలోకి వెళ్లి ఖైదీ కన్ను మూసేవాడు. ఇలా చనిపోయిన వారు మహావీర్‌ సింగ్‌, మోహన్‌ కిశోర్‌ నామ్‌దాస్‌, మొహిత్‌ మొయిత్రా (వీరు భగత్‌సింగ్‌ అనుచరులు). వీరికి పాలు ఊపిరితిత్తులలోకి వెళ్లి న్యుమోనియా వచ్చింది. పూర్తిగా ఏకాంతంలో ఖైదీలను ఉంచే గదులలో ఏమీ సౌకర్యాలు ఉండేవి కావు. ఆఖరికి కాలకృత్యాలకు కూడా. రాత్రి కూడా ఇదే పరిస్థితి. ఖైదీలకు రెండు మట్టి కుండలు ఇచ్చేవారు. ఒకటి నీరు తాగడానికి, ఆహారం కోసం. రెండోది మలమూత్రాల కోసం. అది ఆ గదిలో ఒక మూల ఉంచేవారు. అది నిండిపోయినా, ఆ దుర్గంధాన్ని భరిస్తూ వేకువ వరకు వేచి ఉండాల్సిందే. ‘కొందరు ఖైదీలు మలమూత్రాలను ఆపుకోలేక సెల్‌లోనే విసర్జించేవారు. వాటిని విసర్జించిన వైపే తలపెట్టి పడుకోవలసిన పరిస్థితి ఉండేది’ అని వినాయక్‌ దామోదర్‌ సావార్కర్‌ తన ‘ది స్టోరీ ఆఫ్‌ మై ట్రాన్స్‌పోర్టేషన్‌ ఫర్‌ లైఫ్‌’లో రాసుకున్నారు.

ఇందుభూషణ్‌ రాయ్‌, ఉల్లాస్కర్‌ దత్‌ల ఆత్మహత్యలతో ఆ జైలులో ఏం జరుగుతున్నదో, అదెంత దారుణమో భారతదేశానికి తెలిసింది. నిరాహార దీక్ష చేస్తున్న యోధుల నోటిలో ఆహారం కుక్కే తీరు దారుణం. ఖైదీలను ఇనుప కడ్డీలతో బాదేవారు. 1937లో రెండు వందల మంది యోధులు నిరాహార దీక్ష చేయడం, అది 36 రోజులు సాగడంతో దేశం కదిలింది, రవీంద్రనాథ్‌ టాగూర్‌, గాంధీజీ, కాంగ్రెస్‌ కమిటీ కదిలింది. అప్పుడు కొంతమందిని విడుదల చేశారు కూడా. కొంత కాఠిన్యం కూడా తగ్గింది.

మనుషులు ముట్టలేని తిండి

దేశభక్తులను పశువుల కంటే హీనంగా చూసేవారు. అది ఆహారం దగ్గర కనిపించేది. అది ఏమాత్రం పరిశుభ్రంగా ఉండేది కాదు. మనుషులు ముట్టలేని తిండి. అది కూడా చాలినంత ఉండేది కాదు. ‘ది టేల్‌ ఆఫ్‌ మై ఎక్సైల్‌’లో బరీంద్రనాథ్‌ ఆ దారుణ అనుభవాన్ని నివేదించారు. తుప్పు స్పష్టంగా కనిపించే ఒక ఇనుప కంచంలో, ఇనుప పాత్రలో వాళ్లకి గంజి వంటివి ఇచ్చేవారు. ఒక నిక్కరు, ఒక చొక్కా మాత్రమే ఇచ్చేవారు. లోపల లంగోటి ఉండేది. సిగ్గుతో చచ్చిపోతూ కళ్లు మూసుకుని స్నానాలు చేసేవారు. అంతా పురుషులే అయినా కౌరవ సభలో ద్రౌపది అనుభవించిన పరిస్థితి గుర్తుకు వచ్చేదని ఆయన రాశారు. ఇలాంటి అనుభవాలు, వేలాదిగా అక్కడ శిక్ష అనుభవించిన ఖైదీల జీవితంలో లక్షలలో ఉంటాయి.

త్యాగధనులను మరచిపోయిన జాతిగా ప్రపంచం భారతదేశాన్ని వేలెత్తి చూపించే కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరించడం క్షంతవ్యం కాదు. ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగింది. వారంతా చనిపోయి ఉండవచ్చు. కానీ వారి సేవలు గుర్తుంచు కోవలసిన బాధ్యత దేశానికి ఉంది. స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని నెహ్రూ సైతం వీరి త్యాగాలను స్మరించకపోవడం గొప్ప విషాదమని పెద్ద విమర్శే ఉంది. ఈ విమర్శను కాదనలేం. సావర్కర్‌ వంటి ధన్యజీవిని విమర్శించడానికి అజ్ఞానం లేదు. ఇన్నివేల మంది స్వాతంత్య్ర పోరాటయోధులను, హుతాత్మలను కనీసం ఆగస్ట్‌ 15న గుర్తుకు తెచ్చుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా జాతిలో నాశనం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఏ పంథాలో దేశం కోసం పోరాడినా వారంతా మహనీయులే. మన తరం సంకెళ్ల మధ్య జన్మించకుండా చేసిన వారందరికీ మనం ఎప్పటికీ కృతజ్ఞత చూపాలి. వారి ఏ ఒక్కరూ ఏనాడూ స్వతంత్ర భారతాన్ని ఏలాలన్న కోర్కెను ప్రకటించ లేదు. వందల ఏళ్ల బానిసత్వం నుంచి, విదేశీ పాలన నుంచి భారతావనిని విముక్తం చేయాలని మాత్రమే వారు కోరుకున్నారు. అలాంటి అమరవీరులందరికీ, త్యాగధనులందరికీ ఇదే మా నివాళి.


ఆ అక్క, చెల్లెలు..

బహుశా చాలామందికి తెలియని విషయం – బలవన్మరణాలకు అతి సులభంగా ప్రేరేపించే బీభత్స వాతావరణం కలిగిన, కఠిన శిక్షలకు ఆలవాలమైన అండమాన్‌ జైలులో మహిళలను ఉంచడానికి కూడా ఆంగ్లేయులు వెనుకాడ లేదు. బీణాదాస్‌ (భౌమిక), కల్యాణి దాస్‌ (భట్టాచార్జీ) అనే ఇద్దరు ఇక్కడ శిక్ష అనుభవించారు. ఈ ఇద్దరు విప్లవోద్యమంలో పనిచేసిన వారే. వందేమాతరం పిలుపు ఎందరో మహిళలను కూడా కదిలించింది. బెంగాల్‌లో అరెస్టు చేసి, అండమాన్‌కు తీసుకు పోయారు. బ్రహ్మ సమాజ ప్రముఖుడు, సంఘ సంస్కర్త, జాతీయవాది బేణీ మాధాబ్‌ దాస్‌, సరళాదేవి కుమార్తెలే ఆ ఇద్దరు. హింసాయుత పంథాలో పోరాడుతూ బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించారన్న అభియోగంతో వీరికి శిక్ష పడిరది. కల్యాణి దాస్‌ ‘జీబన్‌ అధ్యయన’ అన్న రచనలో తన అనుభవాలు ప్రచురించారు. ఫిబ్రవరి 6,1932వ తేదీన బీణాదాస్‌ నాటి బెంగాల్‌ గవర్నర్‌ సర్‌ స్టేన్లీ జాక్సన్‌ను కాల్చి చంపడానికి ప్రయత్నిం చారు. కలకత్తా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ భవన్‌లో గవర్నర్‌ మీద బీణాదాస్‌ ఐదుసార్లు కాల్చారు. చిట్టగాంగ్‌ వీరుల బృందానికి చెందిన ఆ అక్కాచెల్లెళ్లు తమ నాయకుడు సూర్యసేన్‌ను నిర్బంధంలోకి తీసుకున్నందుకు ఈ ప్రతిచర్యకు ఉపక్రమించారు. ఆమెకు తొమ్మిదేళ్లు కఠిన కారాగార శిక్ష పడిరది. ఇదే కేసులో ఆమె అక్కగారు కల్యాణీ దాస్‌కు జీవిత ఖైదు విధించారు. కలకత్తాలోనే ప్రెసిడెన్సీ జైలులో ఆమెను ఏకాంత వాసంలో ఉంచారు. కల్యాణి తన రచనలో శోభారాణి అనే ఆమె పేరు ప్రస్తావించారు. పోలీసుల హింసతో ఆమెకు పక్షవాతం వచ్చింది. చివరి జీవితం దయనీయంగా గడిచింది. ఈమె పుస్తకాన్ని ఏ స్టడీ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో ఆంగ్లానువాదాన్ని కుమారుడు జయభారత భట్టాచార్జీ ముద్రించారు. ప్రెసిడెన్సీ జైలులో కూడా నిర్బంధం పరమ ఘోరంగా ఉండేదని ఆమె స్వీయానుభవాలను అందించారు. కురచగా ఉండే జైలు యూనిఫారాలను ధరించడానికి స్త్రీలు నిరాకరిస్తే ఎంత యుద్ధం జరిగిందో ఆమె రాశారు. అమ్మమ్మ వయసు వారిని కూడా ఆ దుస్తులు వేసుకోవాలని బాధించారు.


అండమాన్‌లో మన్యం వీరులు, తెలుగువారు

విశాఖ మన్య విప్లవంలో పాల్గొన్న ఎనిమిది మంది కూడా ఇందులో శిక్ష అనుభవించారు. అల్లూరి శ్రీరామరాజుతో పనిచేసిన అగ్గిదొర (వేగిరాజు సత్యనారాయణరాజు), మరొక పన్నెండు మంది కూడా ఇక్కడ శిక్ష అనుభవించారు. తగ్గి వీ(బీ)రయ్యదొర, లచ్చమయ్య, బోనంగి పండు పడాలు, బోనంగి పాండు పడాలు, పుట్టయ్య పేరుతో ఇద్దరు, పోతయ్య కొరబు, కోటయ్య కొరబు, కుంచెట్టి సన్యాసి, గులివేల సన్యాసి, చిన్నయ్య, లింగయ్య పేర్లు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ శిక్ష అనుభవించి, అనుభవాలు కూడా రాసిన ప్రతివాద భయంకరాచారి కూడా తెలుగువారే. ముస్తఫా అలీ అనే పోలీసు అధికారిని చంపడానికి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భయంకరాచారి, ఆయన అనుచరులు ఏప్రిల్‌, 1933లో ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. అమర్చిన బాంబులు మాత్రం పేలి కుట్ర బయటపడిరది. ఏడేళ్ల ద్వీపాంతర శిక్ష విధిస్తూ సెప్టెంబర్‌ 26,1935న మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అక్కడికి పంపారు. కానీ 1931లో ప్రాంతీయ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచినప్పుడు భయంకరాచారి విడుదలై వచ్చారు.


ఆ ఆరుగురు…

ఆరుగురు ఖైదీల గురించి భారత జాతి ప్రత్యేకంగా స్మరించుకోవలసి ఉంటుంది. ఫిబ్రవరి 17,1934న బీర్భూమ్‌ కుట్ర కేసులో అరెస్టయిన హరిపాద భట్టాచార్జీని కూడా ఇక్కడే ఉంచారు. అప్పటికి ఆయన వయసు 15 సంవత్సరాలు. ఈ జైలుకు వచ్చిన పిన్నవయస్కుడు. ఇంకా ఆనందప్రసాద్‌ గుప్తా , సాహేరామ్‌ దాస్‌ ఫకీర్‌ చంద్రసేన్‌ (చిట్టగాంగ్‌ ఆయుధాగారం మీద దాడి కేసు, 1930) సుధేందు బికాశ్‌ దాస్తిదార్‌, హరిమోహన్‌ చటర్జీలను కూడా అండమాన్‌ జైలులో ఉంచారు. వీరంతా 18 సంవత్సరాలలోపు వారు.

About Author

By editor

Twitter
YOUTUBE