ఆగస్ట్ 23 టంగుటూరి జయంతి
దేశభక్తిలోను, ప్రజాసేవలోను లజపత్‌రాయ్, మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్, దేశపాండే, సర్దార్ పటేల్, శ్రీనివాస అయ్యంగార్‌ల కోవకు చెందినవారు ప్రకాశం. నేడు జీవించి ఉన్నవారిలో రాజాజీతో పోల్చదగినవారు. ధైర్యంలో ఆయనను స్వామి శ్రద్ధానందతోను, లజపత్‌రాయ్ తోను పోల్చవచ్చు. జాతీయోద్య మానికి తన సర్వస్వాన్ని ఒడ్డడంలో సి.ఆర్.దాస్‌తో పోల్చవచ్చు.
స్వరాజ్యం తర్వాత ఆయన మద్రాస్ ప్రాంతం లోను, ఆంధప్రాంతంలోను అత్యున్నత పదవులను అందుకున్నారు. మన ఎన్నికలలోని గెలుపోటములను, ఆశాభంగాలను, శైశవదశలో ఉన్న భారత ప్రజాస్వామ్య సమస్యలను ఆయన చవిచూచారు.
ఆయన ఆగష్టు 23, 1872న జన్మించారు. నలభై సంవత్సరాలు ఆంధ్ర రాజకీయ రంగంలో మహానాయకుడుగా రాణించి, మే 20, 1957న చనిపోయారు. నేటికి ఆంధప్రజల హృదయాలలో, స్మృతిలో ఆంధ్ర కేసరిగా జీవించి ఉన్నారు.
రాజమండ్రి పురపాలక సంఘ అధ్యక్షులుగా అధికారానుభవం
1901లో రాజమండ్రి పురపాలక సంఘ అధ్యక్షు లుగా ఎన్నికై, ప్రకాశం ప్రజల నుండి ఉద్భవించే అధికారాన్ని చవి చూచారు. ఆనాడే ఆయన బ్రిటిషు అధికారులతో తలపడి, వారిని అదుపు చేయడం నేర్చుకున్నారు. ఆయన ఇంగ్లండు వెళ్లి, న్యాయశాస్త్రం చదివారు. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. న్యాయ వాదులలో అగశ్రేణిని అందుకున్నారు. న్యాయ మూర్తులకు, ప్రభుత్వానికి సింహస్వప్నం అయినారు. ఇట్టి న్యాయవాద వృత్తిని వదులుకొని, రాజకీయాలలో ప్రవేశించాలని ఆయన నిశ్చయించారు.
ఆంధ్రలోని ఆయన సహచర బృందం కూడా దేశభక్తి, ప్రజాసేవానుభవం కలిగినట్టిది. దేశభక్త కొండ వెంకటప్పయ్య, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు, డాక్టర్ పట్టాబి •సీతారామయ్య, బులుసు సాంబమూర్తి, డాక్టర్ సుబ్రహ్మణ్యం, జి. సీతారామ శాస్త్రి, జోగయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యలు వారిలో కొందరు.
బహుభాషా ప్రాంతం మద్రాసులోని గాంధేయ వాదులలో ప్రకాశంగారికి శ్రీనివాస అయ్యంగార్‌తో గాఢమైత్రి ఏర్పడింది. ఆయన అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా ఇచ్చి సహాయ నిరాకరణో ద్యమంలో చేరారు. అయితే రాజాజీతో మాత్రం ఆయనకు అట్టి గాఢమైత్రి ఏర్పడలేదు. తర్వాతి కాలంలో ఇది ఉభయుల సంబంధాలలో క్లిష్టస్థితులకు దారితీసింది. 30 ఏండ్ల గాంధేయ శకంలో ఉభయుల ధోరణులకు అవకాశాలకు అంతరాన్ని సృష్టించింది.
స్వరాజ్య పత్రిక కోసం లక్షల ధనం సేకరణ
ఆంధ్రపత్రికను ప్రారంభించడంలో నాగేశ్వరరావు గారి దూరదృష్టిని ప్రకాశం గుర్తించారు. గాంధేయ ఉద్యమంలోను, స్వరాజ్య సమరంలో ఆంధ్ర ప్రజల పాత్రను ప్రచారం చేయడానికై ‘స్వరాజ్య’ అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించ నిశ్చయించారు. అయితే ఆయనకు నాగేశ్వరరావుగారికున్న వ్యాపార లక్షణం లేదు. వ్యాపారానుభవం గడించిన నాగేశ్వరరావు గారికి దాని నిర్వహణను అప్పగించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ‘స్వరాజ్య’ం పై వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికై ఆయన కూనూరులోను, మద్రాసు లోను ఇతర స్థలాలలోను తన భవంతులను, భూము లను, ఇతర ఆస్తులను అమ్మివేయవలసి వచ్చింది. బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని పదునుగా, నిర్భయంగా, జాగరూకంగా, నిర్దాక్షిణ్యంగా విమర్శించే ఆ పత్రిక అంతులేని దాహాన్ని తీర్చడానికి ఆయన ఆంధ్రలోను, భారతదేశంలోను, ప్రపంచంలోను లక్షలకొలది ధనం విరాళాలుగా సేకరించారు.
జి.వి.కృపానిధి, పున్నారావు, రామారావు, ఖాసాసుబ్బారావులవంటి దేశభక్తి పూరితులైన రచయితలు స్వరాజ్య పత్రికలో పనిచేసి స్వరాజ్య సమరంపై చెరుగని ముద్రవేశారు. తర్వాతి కాలంలో వారు పాత్రికేయరంగంలో ప్రముఖులుగా రూపొందారు.
కేంద్ర శాసనసభకు ప్రకాశం ఎన్నిక
ప్రకాశంగారికి మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్‌ల రాజకీయాల పట్ల ఎక్కువ ఆసక్తి, సాన్నిహిత్యం ఏర్పడ్డాయి. ‘కౌన్సిల్ బహిష్కరణ’ను నిలిపివేసి, శాసనసభా రంగంలో కూడా బ్రిటిష్‌వారితో పోరాడాలనే వారి నిర్ణయం ఆయనకు నచ్చింది.
ఆయన స్వరాజ్య పార్టీలో చేరారు. కేంద్ర శాసన సభకు, ఎన్నికై మోతీలాల్ నెహ్రూ మదన్‌మోహన మాలవ్య ప్రభృతుల సాహసకృషికి దోహదం చేశారు. ఆయన ప్రగతిశీలత, స్వతంత్ర ప్రవృత్తి జిన్నా అభిమానాన్ని చూరగొన్నాయి. కనుక శాసనసభ కార్యకలాపాలలో అనేక కీలక సందర్భాలలో సమైక్య కృషికి, సమైక్యంగా ఓటువేయడానికి జిన్నా సమర్థనను పొందడంలో మోతీలాల్ నెహ్రూకు ఆయన చక్కని ఆసరా అయ్యారు.
జవాహర్‌లాల్ కళాకళలు, మధ్య మధ్య బహిష్కరణలకు పిలుపులు ఆయనకు నచ్చేవి కావు. కనుక 1929-30లో వైస్‌రాయ్ ఇర్విన్‌తో సంప్రదింపులు విఫలం కావడంతో కాంగ్రెసు శాసన సభ నుండి ఉపసంహరించ డానికి నిర్ణయించినప్పుడు ఆయన శాసనసభా రంగాన్ని వదలడానికి అంగీకరించలేదు.
ఆయన అందరితోపాటు రాజీనామా చేశారు. కాని తిరిగి ఎన్నికై బ్రిటిషు పాలకులతో పోరాటం సాగించారు. బడ్జెట్ చర్చలో గాంధీగారి ఉప్పు సత్యాగ్రహంపై ఆయన గంటసేపు మహోద్రేకంగా చేసిన ప్రసంగం శాసనసభా చరిత్రలో అవిస్మరణీయ మైనది.
ఉప్పు సత్యాగ్రహంలో నాయకత్వం, జైలుశిక్ష
సత్యాగ్రహ సమరంలో అగ్రేసరుడుగా నిలవాలని నిర్ణయించుకొని ఆయన శాసనసభకు రాజీనామా ఇచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, జైలుకు వెళ్లి, జైలులో తోటి దేశభక్తుల సాహచర్యంలో ప్రశాంతిని, సంతృప్తిని పొందారు.
సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించి, ఆయన సామాన్య ప్రజలందరి, కాంగ్రెసువాదులందరి గౌరవాన్ని చూరగొన్నారు. ఇది ఆయనకు కార్యరంగంలో స్వేచ్ఛ నిచ్చింది.
ప్రకాశం సింహగర్జన
ఆ సంఘటన నాకు బాగా గుర్తుంది. ఆ రోజు సాయంత్రం మద్రాస్ బీచ్‌లో లక్షలాదిగా సమావేశమైన ప్రజానీకాన్ని ప్రభుత్వపు ఆశ్విక దళాలవారు చెదరగొడు తున్నారు. వేదికపైఉన్న ప్రకాశంగారు ‘‘దౌర్జన్యాలను ఆపండి’’ అంటూ సింహగర్జన చేశారు. పోలీసులు వేదికను సమీపించి ప్రకాశంగారిపై తుపాకులు గురిపెట్టారు. ప్రకాశంగారు ఆ తుపాకులకు తన ఛాతీని ఎదురొడ్డి ‘మీకు రక్తదాహం ఉంటే నన్ను కాల్చి చంపండి కాని, ప్రజలను మాత్రం హింసించండి’ అని సవాల్ చేశారు. ఆ బ్రిటిషు ఆఫీసరు ప్రకాశంగారి సాహసానికి, సింహగర్జనకూ దిగ్భ్రాంతి చెంది, తన పోలీసు బలగాన్ని ఉపసంహరించుకున్నాడు.
జమీందారీల రద్దుకు ప్రకాశంగారి నివేదిక
1931లోను, 1941-42లోను ప్రకాశంగారితోను, రాజాజీతోను జైలు జీవితం గడిపే భాగ్యం నాకు కలిగింది. ఆ రెండు సూదంటురాళ్ల చుట్టూ రాజకీయ ఖైదీలమంతా చేరేవాళ్లం. సామ్రాజ్యవాదులను వెళ్లగొట్టడానికై కార్యరంగంలో అవిక్రపరాక్రమాన్ని ప్రదర్శించే దేశభక్తులకు ప్రకాశంగారు కేంద్రమయ్యారు.
1937-39లో కాంగ్రెసు రాజకీయాలలో మంత్రివర్గా లలో చేరాలనే వాదం బ్రలంగా ఉండేది. ‘‘ప్రో ఛేంజర్’’ల నాయకుడు సి.ఆర్.దాసును ఓడించిన ‘‘నో ఛేంజర్’’ నాయకుడు రాజాజీ 1936-37 నాటికి ‘‘ప్రోఛేంజర్’’గా మారి మద్రాసు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాడు. శాసనసభా పక్షంలో అధిక సంఖ్యాక బలాన్ని పొందజాలక పోయిన ‘‘ప్రోఛేంజర్’’ ప్రకాశం క్రమశిక్షణ పాటించి రెవెన్యూ మంత్రిగా ఆ మంత్రివర్గంలో రెండవ స్థానాన్ని స్వీకరిం చారు. జమీందారీల రద్దుకు సుదీర్ఘం, ఏకగ్రీవమునయిన నివేదిక తయారుచేశారు. రాజాజీ ప్రకాశం నివేదికను ఆమోదించారు.
1946లో మద్రాసు కాంగ్రెసుపార్టీ మరోసారి నాయకుణ్ణి ఎన్నుకోవలసి వచ్చింది. కాని ప్రకాశంగారు నాయకుడు కావడం గాంధీజీకి అంత ఇష్టం లేదు. ప్రకాశంగారు నాయకత్వానికి అభ్యర్థిగా నిలబడకూడదని ఆయన కబురు పంపాడు. ప్రకాశంగారు దాన్ని లెక్కచేయ లేదు. నాయకత్వానికి పోటీచేసి, నెగ్గి, ముఖ్యమంత్రి అయ్యారు.
గాంధీజీ సలహాను కాదని తనను నిస్సంకోచంగా సమర్ధించిన వారినే మంత్రులుగా నియమించే పొరపాటు చేశారు ప్రకాశంగారు. ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడుగా, అసంతృప్తివర్గం వారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోమని నేను సలహా ఇచ్చాను. కాని ఆయన తన పట్ల వారి అవిశ్వాసాన్ని క్షమించలేదు. ఇది మంత్రివర్గం పతనానికి దారితీసింది.
హరిజనోద్ధరణకు కోటిరూపాయల పథకం
ముఖ్యమంత్రిగా ప్రకాశంగారు ఇతర ప్రాంతాలకు దారిచూపిన ఎన్నో చర్యలు తీసుకున్నారు. గ్రామాభివృద్ధి పథకాలకు ఏడాదికి ఒక కోటి రూపాయలు హరిజనోద్ధరణకు మరో కోటి రూపా యలు. ఖాదీ అభివృద్ధికి మరో కోటి రూపాయలు మంజూరు చేశారు. రైతులకు తన పంట అమ్మకాలపై ప్రత్యేక బోనసు ఇవ్వడం ద్వారా కొనుగోలయ్యే మిగులు పంటను అత్యధికం చేయడానికి ప్రోత్సహించారు. రైస్ మిల్లర్లుచే రైతుల దోపిడీని నివారించడానికై ఉత్పత్తి దారుల కొనుగోలు దారుల సహకార సంఘాలు ప్రారంభ మయినాయి. ప్రజలను ఇబ్బంది పెట్టే కంట్రోళ్లకు, నిర్బంధ లెవీలకు ఒక నిర్మాణాత్మక మైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి ఆయన ఆ సహకారసంఘాల ద్వారా యత్నించారు.
ఈ దశలో ఆయనపై విశ్వాస రాహిత్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయవద్దని ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడుగా నేను శాసన సభ్యులను కోరాను. నేను సర్దార్ పటేల్‌కి, జవాహర్ లాల్‌జీకి నచ్చజెప్ప యత్నించాను. కాని ప్రయోజనం లేకపోయింది. అయినా కాంగ్రెస్ శాసనసభ్యులు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు. అలా వారిని ప్రకాశంగారిని గద్దె దించడానికి అనుమతించి నట్టు, ప్రోత్సహించినట్టు అయింది.
మంత్రుల అవినీతిపై ధ్వజమెత్తిన ప్రకాశం
ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఏడాదిలోపల ప్రకాశంగారి వ్యక్తిత్వం ఉన్నత శిఖరాలను అందుకున్నది. ఆయన పలువురు మంత్రులపై అవినీతి, బంధుప్రీతి, బాధ్యతారాహిత్యములు ఆరోపణలతో ఒక ఛార్జిషీట్ తయారుచేసి, దానిపై బహిరంగ విచారణ జరగాలని కోరడం ద్వారా ఒక క్రొత్త రికార్డూను స్థాపించారు. అట్టి విచారణ జరిపించమని ఆంధప్రాంత కాంగ్రెసు సంఘం కాంగ్రెసు కేంద్ర కార్యవర్గాన్ని అభ్యర్థించింది. అట్టి విచారణవల్ల మంత్రుల స్థైర్యం సన్నగిల్లుతుందనీ, కాంగ్రెసు మంత్రివర్గాల పట్ల ప్రజల విశ్వాసం క్షీణిస్తుందనే మిధ్యావాదంతో జవాహర్లాల్‌జీ దాన్ని వ్యతిరేకించారు. ప్రకాశంగారు శాసనసభలో ప్రతిపక్షానికి మారి, విశ్వాస రాహిత్య తీర్మానాన్ని ప్రతిపాదించారు; తన ఆరోపణలకు సమర్థనగా గంటల తరబడి, రోజుల తరబడి ప్రసంగిం చారు. ఆయన ఆనాడు మాకు వారన్ హేస్టింగ్స్‌పై అభియోగం నడుపుతూన్న ఎడ్మండ్ బర్క్‌ను గుర్తుకు తెచ్చారు. మంత్రుల అవినీతిపై ధ్వజమెత్తిన మొదటి నాయకుడయ్యే ఘనత ప్రకాశంగారికి దక్కింది. స్వతంత్ర భారతం ఈ సేవకై ప్రకాశంగారికి ఎంతో రుణపడి ఉంది.
జవహర్లాల్‌జీ, రాజెన్‌బాబు, సర్దార్‌పటేల్, మౌలానా ఆజాద్, రాజాజీలు ప్రకాశంగారిపై క్రమశిక్షణ చర్య తీసుకొనదలచారు. కాని ప్రకాశంగారి రుజువర్తన నుండి, నైతిక ఔన్నత్యం నుండి స్ఫూర్తి పొందిన నేను దానిని వ్యతిరేకించాను. రాజాజీ నా వైఖరిని అభినందించారు.
ఆంధప్రాంతానికి మొదటి ముఖ్యమంత్రి
ఆంధ్ర ప్రాంతం ఏర్పడినప్పుడు శాసనసభలో కమ్యూనిస్టులు పెద్ద పార్టీగా ఉన్నారు. తమ పార్టీ అధికారంలోకి రావడమెలా అని జవాహర్‌లాల్ ఆలోచనలో పడ్డారు. ప్రజాపార్టీ నాయకులు ప్రకాశం గారిని మంత్రివర్గం ఏర్పరచడానికి ఆహ్వానిస్తే, ఆ మిశ్రమ మంత్రివర్గంలో చేరమని మా కిసాన్‌పార్టీకి సలహా ఇస్తానని నేను జవాహర్‌లాల్‌కి సూచించాను. జవహర్‌లాల్‌జీ స్వభావానికి విరుద్ధమైన సూచన అది. అయినా ఆయన దానిని స్వీకరించి ప్రకాశంగారు ముఖ్యమంత్రి కావడానికి అంగీకరించారు.
1955లో కమ్యూనిష్టు సవాల్‌ను ఎదుర్కొని సమైక్య కాంగ్రెసును- జవాహరాల్‌ల్‌జీ కాంగ్రెసు మాత్రమే కాదు, గెలిపించడానికి 80 ఏండ్లకు పై బడిన వయస్సు ఉన్నా ప్రకాశంగారు మాతో కలిశారు. మరి రెండేండ్ల తర్వాత ఆంధప్రదేశ్ అవతరణను కూడా ప్రకాశంగారు దర్శించారు.
ఉదారతకు మారు పేరు
ప్రకాశంగారు వ్యక్తిగత జీవితంలోను, రాజకీయ రంగంలోను అతి ఉదారతను చూపేవారు. స్వరాజ్య పత్రిక అవసరాలకోసం నిధులు సేకరిస్తూనే మరో ప్రక్క కష్టాలలో ఉన్న ఎందరో కాంగ్రెసు వాదులకు ఆర్థిక సహాయం అందజేసేవారు. ఆయన స్నేహితులకు ప్రాణమిచ్చేవారు. చిరునవ్వుతో సహచరుల కృషిని అభినందించేవారు.
ఆయన పైకి గంభీరంగా, పట్టుదల కల వ్యక్తిగా కనబడేవారు. కాని ప్రజల బాధలను చూచినప్పుడు ఆయన హృదయం వెన్నవలె కరిగి పోయేది; ఆయన కన్నీరు కార్చేవారు. ఆయన తన ఉపన్యాసాలతో ప్రజలలో భావోద్రేకాన్ని కలిగించేవారు. వానిలో పదాడంబరంకాని, ఉపమా నాలుగాని, అలంకారాలు కాని ఉండేవి కావు. అయితే ఆయన ఆచితూచి వాడే మాటలలోని పదును, తీక్షణత, శ్రోతలను కదిలించివేసేవి.
భరతమాతను శ్రద్ధాభక్తులతో అర్పించిన ఈ ఉదాత్త చరితుని వీరగాథలను, మన విజయాలను, మహత్తర సందేశాలను దేశమంతా స్మరిస్తోంది; ఆయనకు, వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
– ఎన్.జి.రంగా
‘జాగృతి’ 21.8.1972