1947-48 ‌సంవత్సరాలలో గాంధీజీ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అదే ఆయన ఆఖరి దీక్ష. జనవరి 18, 1948న ఆ దీక్ష ముగిసింది. ఆ నెల 30న ఆయనను నాథూరామ్‌ ‌గాడ్సే కాల్చి చంపాడు. అహింసావాదంతో ఉద్యమాలు నిర్వహించిన గాంధీజీ నిరశన దీక్షను ఆయుధంగా ఉపయోగించుకున్నట్టు ఆయన జీవితం చూస్తే అర్థమవుతుంది. 1913 నుంచి 1948 మధ్య ఆయన చేసిన ముఖ్యమైన నిరాహార దీక్షలు 18 వరకు ఉన్నాయి. జనవరి 13, 1 948న ఆయన హిందూ-ముస్లిం ఘర్షణలను ఆపాలని కోరుతూ చివరిసారి నిరాహార దీక్ష చేశారు.

ఆగస్ట్ 15, 1947- ‌భారతదేశం నుంచి పాకిస్తాన్‌ ‌విడిపోయింది. పాకిస్తాన్‌ను విభజించడమే కాదు, 565 స్వదేశీ సంస్థానాలు తమ ఇష్టం మేరకు ఇటు భారత్‌ ‌లేదా అటు పాకిస్తాన్‌లో చేరవచ్చునని విభజన చట్టం అవకాశం కల్పించింది. ఇదే ఒక పెద్ద కుట్ర. పాకిస్తాన్‌ ‌చీలిపోగా భారత్‌కు మిగిలిన భూభాగంలో 46 శాతం ఉన్న స్వదేశీ సంస్థానాలకు స్వేచ్ఛ కల్పించడమంటే కుట్ర కాక మరేమిటి?1947 నాటి దేశ విభజన ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద విషాద ఘటన. అఖండ భారత్‌ ‌కోసం స్వరాజ్య సమరం సాగింది. అంతేకాని, ఇప్పటి భూభాగం కోసం మాత్రమే కాదు. అందులో ఎన్ని ప్రాణాలు ఆహుతి అయ్యాయో అందరికీ తెలుసు. ఎన్ని జీవితాలు నాశనమైనాయో కూడా తెలుసు. సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన, క్విట్‌ ఇం‌డియా అన్ని ఉద్యమాలలో ఎందరో రాలిపోయారు. ఇక తీవ్ర జాతీయ వాద ఉద్యమంలో ఎన్ని ప్రాణాలు పోయాయో తెలియదు. కానీ ఎర్రకోట మీద నుంచి ప్రథమ ప్రధాని చేసిన ప్రసంగంలో వీరికి నిజమైన నివాళి వినిపించలేదు. అయినా మనం ఆగస్ట్ 15‌వ తేదీని జరుపుకోవలసిందే. కానీ ఆ రోజు తలుచుకోవలసిన అంశాలో సమరయో ధుల త్యాగాలు, ఆత్మార్పణలే కాదు, పాకిస్తాన్‌కు భారతదేశం ఎంత చెల్లించిందో, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో కూడా గుర్తు చేసుకోవాలి.

భారత్‌-‌పాక్‌ ‌విభజనే ఆదరాబాదరా జరిగింది. సెరిల్‌ ‌రాడ్‌క్లిఫ్‌ అనే బ్రిటిష్‌ ‌మేధావి, ఆయన ఏర్పరిచిన ఇతర సంఘాలు దేశ విభజన పని పూర్తి చేశాయి. రాడ్‌క్లిఫ్‌కు కాలంచెల్లిన భౌగోళిక పటాలు ఇచ్చారు. సరిహద్దులలోని ఒక ఇల్లు సగం పాక్‌లో, సగం భారత్‌లోకి వచ్చింది. అంత అధ్వానంగా విభజన పూర్తి చేశాడు. ఇది సరిహద్దు దగ్గర పూర్తి చేసిన కాకి లెక్క అంటే అతిశయోక్తి కాదు.

ఆ తరువాతి ఘట్టం-స్వతంత్ర భారతదేశ తొలి రోజులలో గాంధీజీ చేసిన నిరాహార దీక్ష. ఈ దీక్ష మీద రెండు వాదనలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దీక్ష పాకిస్తాన్‌ ‌పునర్‌ ‌నిర్మాణం కోసం భారత్‌ ఇవ్వడా నికి అంగీకరించిన రూ. 55 కోట్లు చెల్లించేటట్టు ఒత్తిడి చేయడానికి చేపట్టినది మాత్రమేనని కొందరు వాదిస్తారు. కానీ గాంధేయవాదులు దీనిని అంగీకరిం చరు. మత సామరస్యం కోసమే గాంధీజీ దీక్ష పూనారని వారి వాదన. ఆ ముందురోజు, అంటే జవవరి 12 సాయంత్రం ప్రార్థన సమయంలో కూడా గాంధీజీ పాకిస్తాన్‌కు ఇవ్వవలసిన డబ్బు గురించి ప్రస్తావించలేదట. కానీ కశ్మీర్‌ ‌మీద దాడి నేపథ్యంలో స్వతంత్ర భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇవ్వవలసిన కొంత సొమ్మును నిలిపివేసిన మాట నిజం. విభజన ఒప్పందం మేరకు పాకిస్తాన్‌కు ఇస్తామన్న ధనాన్ని భారత్‌ ఆపిన సంగతి సాక్షాత్తు లార్డ్ ‌మౌంట్‌బాటన్‌ ‌గాంధీజీకి తెలియచేశారు. భారత ప్రభుత్వ నిర్ణయం ఆయనకు నచ్చలేదు. ముందు అనుకున్న ఒడంబడిక మేరకు చెల్లింపులు జరగడం నైతిక బాధ్యత అని భావించారు. పాకిస్తాన్‌కు ఇస్తామని చెప్పిన రూ.55 కోట్లు చెల్లిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించగానే జనవరి 13న ఆరంభించిన దీక్షను 18వ తేదీన విరమించారు. అన్ని నిరాహార దీక్షల మాదిరిగానే ఇది కూడా విజయవంతం అవుతుందని గాంధీజీ మొదటే నమ్మారు. దీక్షను ఆరంభించిన తరువాత మౌంట్‌బాటన్‌, ఎడ్వినా బాటన్‌ ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. అప్పుడు గాంధీజీ అన్న మాట చాలా ప్రసిద్ధం. తాను దీక్షకు కూర్చుంటే కొండే మహమ్మద్‌ ‌వద్దకు వస్తుందని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడుతున్న దేశం కాబట్టి పునర్నిర్మాణానికి రూ. 55 కోట్లు భారత్‌ ఇవ్వాలని విభజన ఒడం బడికలో అంగీకరించిన మాట వాస్తవం. అది వివాదంలో పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇదొక్కటే ఎక్కువమందికి తెలిసినా దాయాది దేశాల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. భారత్‌-‌పాక్‌లుగా విడిపోయినా రెండు దేశాలకు ఒకే కేంద్ర బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సేవలు అందించేది. 1948 సెప్టెంబర్‌ ‌వరకు పాకిస్తాన్‌ ‌వ్యవహారాలు కూడా ఆర్‌బీఐ చూసింది. అయితే రూ 55 కోట్లు పాకిస్తాన్‌కు ఇచ్చే విషయంలో వివాదాలు వచ్చి ఆ ప్రభుత్వంతో ఆర్‌బీఐ సంబంధాలు చెడిపోయాయి. ఆ క్రమంలోనే రూ. 55 కోట్లు చెల్లింపు వ్యవహారం అత్యంత వివాదా స్పదంగా మారింది. విభజన జరిగిన నాటికి రిజర్వు బ్యాంకు నిధులు రూ 375 కోట్లు. చర్చల తరువాత ఆ రూ. 375 కోట్లలో రూ 75 కోట్లు పాకిస్తాన్‌ ‌వాటాగా కేటాయించారు. ఆగస్ట్ 15, 1947‌న భారత్‌ ‌నుంచి తొలిదఫాగా రూ 20 కోట్లు చెల్లించారు. అయితే రూ 55 కోట్లు వేరు. ఇవి పాకిస్తాన్‌ ‌పునర్ని ర్మాణం పేరుతో ఇవ్వడానికి అంగీకరించినది. కానీ తరువాత పరిణామాలు, అంటే కశ్మీర్‌పై దాడి నేపథ్యంలో, ఈ మొత్తం పాకిస్తాన్‌కు చెల్లించడానికి ఆఖరికి నెహ్రూ ఇతర కాంగ్రెస్‌ ‌ప్రముఖులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. పారిశ్రామికవేత్త ఘనశ్యామ్‌ ‌బిర్లా కూడా (గాంధీజీ హత్య జరిగిన ఢిల్లీలోని బిర్లా భవన్‌ ఆయనదే), పాకిస్తాన్‌కు రూ 55 కోట్లు ఇస్తే అవి భారత్‌పై దాడికి అవసరమైన ఆయుధ సంపత్తికి వినియోగిస్తుందని చెప్పారని ఫ్రీడమ్‌ ఎట్‌ ‌మిడ్‌నైట్‌ ‌రచయితలు పేర్కొన్నారు.

కొన్ని ఆస్తుల పంపకం సజావుగానే జరిగింది. ఇంకొన్నింటి పంపకం, సిబ్బంది కేటాయింపు కూడా చిత్రంగానే జరిగింది. ఒక ఉదాహరణ: అప్పటిదాకా వైస్రాయ్‌ ఉపయోగించిన గుర్రపు బగ్గీ ఉంది. అది పాకిస్తాన్‌కు చెందాలా? భారత్‌కా? అన్న విషయం తేలడానికి బొమ్మ బొరుసు వేశారు. అదృష్టవశాత్తు భారత్‌ ‌గెలిచింది. అంటే తనకు రావలసిన ఆస్తులలో చిల్లిగవ్వ కూడా వదలకూడదన్నదే పాకిస్తాన్‌ ‌నిర్ణయంలా కనిపిస్తుంది. తరువాత అదే బగ్గీని స్వతంత్ర భారత రాష్ట్రపతి అధికార లాంఛనంగా కొద్దికాలం ఉపయోగించారు.

ఆస్తుల పంపకం కోసం విభజన సంఘం ఏర్పాట యింది. ఇందులో సర్దార్‌ ‌వల్లభభాయి పటేల్‌, ‌బాబూ రాజేందప్రసాద్‌ ‌భారత జాతీయ కాంగ్రెస్‌ ‌తరఫున సభ్యులుగా నియమితులయ్యారు. ముస్లిం లీగ్‌ ‌తరఫున లియాఖత్‌ అలీ ఖాన్‌, అబ్దుర్‌ ‌రబ్‌ ‌నిష్తార్‌ ‌ప్రాతినిధ్యం వహించారు. తరువాత నిష్తార్‌ ‌స్థానంలో మహమ్మద్‌ అలీ జిల్లా వచ్చారు. విభజన సంఘం, విభజన మండలిగా మారింది. ఈ మండలి ఆస్తుల పంపకం కోసం నిపుణుల సంఘాలను నియమించింది.

ఆస్తుల పంపకంలో 17.5 శాతం పాకిస్తాన్‌ ‌కేటాయించారు. అప్పటికి భారత్‌ ఆస్తుల విలువ రూ. 4 బిలియన్‌లు. పాకిస్తాన్‌కు వెళ్లినది రూ. 75 కోట్లు. ఆ సంధికాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం పాకిస్తాన్‌కు రూ. 20కోట్లను ఇంతలోనే కశ్మీర్‌ ‌వివాదం రావడంతో భారత్‌ ‌నిలిపివేసింది. 1947 అక్టోబర్‌ ‌నుంచి పాకిస్తాన్‌ ‌కశ్మీర్‌ ‌మీదకు గిరిజనుల దాడి పేరుతో సైన్యాన్ని పంపడమే ఇందుకు కారణం. కశ్మీర్‌ ‌సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ రూ. 75 కోట్లు చెల్లించడం జరగదని భారత్‌ ఆనాడే తేల్చి చెప్పింది. ఈ విషయం ప్రథమ హోంమంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ‌స్వయంగా ప్రకటించారు. అందుకు పాకిస్తాన్‌ ‌కూడా అప్పటికి ఏమీ గొడవ చేయకుండా అంగీకరించింది. కానీ రెండు మాసాలకే మాట మార్చి (డిసెంబర్‌ 22, 1947) ‌కశ్మీర్‌ ‌సమస్యకు, మొదట అనుకున్న చెల్లింపులకు ముడిపెట్టరాదని, రూ. 55 కోట్లు తక్షణమే చెల్లించాలని గగ్గోలు పెట్టింది. రూ. 55 కోట్లు చెల్లించడానికి భారత్‌ అం‌గీకరించడం లేదన్న విషయం గాంధీజీకి తెలిసింది. ఆయన ఆ సొమ్ము పాకిస్తాన్‌కు వెంటనే చెల్లించాలని నిరాహార దీక్షకు పూనుకున్నారని కొందరైనా గాఢంగా నమ్మడానికి వెనుక ఉన్న కారణం అదే. గాంధీజీ జోక్యంతో జనవరి 15, 1948న రూ 55 కోట్లు పాకిస్తాన్‌కు చెల్లించిం దన్న మాట కూడా చాలామంది నమ్ముతారు.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE