ప్రధాని నరేంద్ర మోదీ ఆ చిన్న దేశాలకు వెళ్లారు? ప్రపంచపటంలో అంతగా కనిపించని దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రశ్నించాయి. ఇలా ప్రశ్నిస్తున్నవారు ప్రధాని మోదీ తాజాగా సాగించిన ఐదు దేశాలా పర్యటన గురించి తెలుసుకోవాలి. బ్రెజిల్‌లో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జులై 2-9 తేదీల మధ్య 8 రోజుల పాటు 5 దేశాల్లో-ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా- పర్యటించారు మోదీ. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తిరంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ప్రధాని దృష్టి సారించారు. 3 దేశాల పార్లమెంట్లలో ప్రసంగించడంతో పాటు 4 దేశాల అత్యున్నత పౌరపురస్కారాలను అందుకున్నారు. అన్ని దేశాల్లో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
ఆ దేశాలు చిన్నవిగా అనిపించవచ్చు. వీటిలో మూడు దేశాల మొత్తం జనాభా హరియాణా జనాభా కన్నా తక్కువే. అయినా, వ్యూహాత్మకంగా భారత్‌కు వీటి అవసరం ఎక్కువ. ‘మేము గ్లోబల్ సౌత్ గురించి మాత్రమే మాట్లాడటం కాదు, మేమే దాని నాయకులం కూడా’ అనే సందేశాన్ని ఇచ్చింది భారత్. గత మూడు దశాబ్దాల్లో ఒక భారత ప్రధాని ఘనాలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.
భారత్‌కు మద్దతుగా నిలిచే దేశం ఘనా. పశ్చిమ ఆఫ్రికాలో నైజీరియా తర్వాత ఘనా రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ దేశ జనాభా సుమారు 3.38 కోట్లే అయినా మనకు చాలా ముఖ్యమైన దేశం. పశ్చిమ ఆఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఘనా ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద గమ్యస్థానం. ఘనా నుంచి దిగుమతుల్లో బంగారం 70 శాతానికి పైగా ఉంది. 15 దేశాల ప్రాంతీయ కూటమి అయిన పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం- ఈసీఓడబ్ల్యుఏఎస్‌లో ఘనా కూడా కీలక సభ్యురాలు. ఘనాతో భారతదేశ సంబంధాలు 1957లో ఘనా స్వాతంత్య్రం పొందటానికి చాలా కాలం ముందు నుంచి ఉన్నాయి. ఘనా స్వాతంత్య్ర పోరాటానికి ఐక్యరాజ్యసమితిలో భారత్ మద్దతు ఇచ్చింది. ఘనాలో దాదాపు 15,000 మంది భారతీయులు నివసిస్తు న్నారు. జనవరిలో ఘనా అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ మహామా, 2015లో ఇండియా-ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కోసం భారతదేశాన్ని సందర్శించారు. ఇప్పటికే భారత్ ఘానాలో హెల్త్, ఐటీ, విద్య రంగాల్లో ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది.
ఆఫ్రికాలోని మరో ప్రధాన దేశం నమీబియా. వజ్రాలు, యురేనియం, లిథియం, కోబాల్ట్, నాన్-ఫెర్రస్ ఖనిజాలు, నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. మన దేశం ఎలక్ట్రిక్ కార్లు, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, రక్షణ లక్ష్యాలకు ఈ వనరులు కీలకం. వజ్రాలు సానపెట్టే పరిశ్రమకు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రం. అనేక భారతీయ వజ్రాల ప్రాసెసింగ్ సంస్థలు ఇప్పటికే నమీబియాలో పనిచేస్తున్నాయి. ప్రపంచంలో యురేనియం ఉత్పత్తి చేసే మూడు అగశ్రేణి దేశాలలో నమీబియా ఒకటి. మన పౌర అణు కార్యక్రమాన్ని విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా 2009లో నమీబియాతో యురేనియం సరఫరా ఒప్పందం జరిగినా అది పూర్తి స్థాయిలో ముందు సాగలేదు.
అట్లాంటిక్ మహా సముద్రంలోని ద్వీపదేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ దేశంలో 37.6% భారతీయ మూలాలు ఉన్నవారే నివసిస్తున్నారు. అతి పెద్ద జన సమూహం వీరిదే. ఎక్కువగా బిహార్ నుంచి వెళ్లిన వారే. భోజ్‌పురి భాషలో మాట్లాడతారు. బ్రిటిష్ వారి పాలనలో అక్కడి చెరుకు తోటల్లో పని చేయడానికి వెళ్లిన భారతీయులు అక్కడే స్థిరపడిపోయారు. మాతృదేశాన్ని వదిలి వచ్చినా తమ భారతీయ ఆత్మను మాత్రం వదులుకోలేదు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా వారు గంగా, యమున నదుల నుంచి దూరంగా వచ్చారు గానీ రామాయణాన్ని హృదయంలోనే నిలుపుకున్నారు. ప్రవాస భారతీయులు కేవలం వలసదారులు కాదు. గొప్ప నాగరికతకు దూతలు. నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి గొప్పగా జరుపుకుంటారు. ట్రినిడాడ్‌లోని కొన్ని వీధులకు భారతీయ నగరాలైన బనారస్, పట్నా, కోల్‌కతా, ఢిల్లీ పేర్లు ఉన్నాయి.
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిసెసార్ పూర్వికులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారు. ప్రధాని మోదీ ఆమెను ‘బిహార్ కీ బేటీ’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా కమలా పెర్సాద్ బిసెసార్ రికార్డుకెక్కారు. ఆమె 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.
ఘనాతో సహ ప్రయాణం
ప్రధాని మోదీ ఈసారి తన విదేశీ పర్యటనను ఘనాతో ప్రారంభించారు. కొటోకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. స్థానిక ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులు హైందవ భక్తి గీతాలు, జయహో నినాదాలతో ప్రధానిని ఆహ్వానించడం విశేషం.
భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టు లలో 200 కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. ఫిన్‌టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
ఘనా పార్లమెంట్‌లో కూడా ప్రధాని మోదీ ప్రసంగిం చారు. దక్షిణార్థ గోళ దేశాల (గ్లోబల్ సౌత్) గొంతుకకు బలం, విలువ ఇవ్వకపోతే ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ప్రపంచ పరిణా మాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ పాలనా విధానంలో విశ్వసనీయమైన, ప్రభావవంతమైన సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరమైన భారత ప్రజాస్వామ్యం ఒక ఆశారేఖగా వెలిగిపోతోందని హర్షం వ్యక్తంచేశారు.
టీ అండ్ టీ – రక్త సంబంధం
ప్రధాని నరేంద్ర మోదీకి కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో (టీ అండ్ టీ)లో అపూర్వ స్వాగతం లభించింది. దేశ ప్రధాని కమలా పెర్సాద్ బిస్సేసర్ సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమలా పెర్సాద్ భారతీయ సాంప్రదాయ చీర ధరించి విశేషంగా కనిపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కౌవా పట్టణంలో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రసంగించారు. భారత్‌కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధ బాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసునని అన్నారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించిందని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బిహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా మోదీ రాసిన పుస్తకంలోని ‘ఆంఖ్ కా ధన్యా చే’ పద్యాన్ని కమల పెర్సాద్ ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత్ నుంచి తీసుకొచ్చిన అయోధ్య రామమందిర నమూనా, సరయూ నది జలాలను, మహాకుంభమేళా జరిగిన త్రివేణి సంగమం నీటిని మోదీ ఆమెకు బహుకరించారు. ఈ పవిత్ర జలాలను ఇక్కడి గంగాధారలో చల్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్నందుకు అధ్యక్షు రాలు కంగాలూను ప్రధానమంత్రి అభినందించారు. ఆరోగ్యం, ఐసీటీ, సంస్కృతి, క్రీడలు, వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, న్యాయం, చట్టపరమైన వ్యవహారాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో విస్తృత, సమ్మిళిత, భవిష్యత్ దృక్పథంతో కూడిన భాగస్వామ్యాలను నెలకొల్పడంపై ఇద్దరు నేతలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
అర్జెంటీనాతో పరస్పర సహకారం
ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాని మోదీకి బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎజీజా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం గత 57 ఏళ్లలో ఇదే మొదటి సారి. అనంతరం అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మార్జిన్ స్మారకం వద్ద మోదీ నివాళులర్పించారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో భారత ప్రధాని మోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని.. రక్షణ, ఇంధనం, అరుదైన ఖనిజాలు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలనే అంగీకారానికి వచ్చారు.

భారత్-అర్జెంటీనా మధ్య గత 75 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఐదేళ్ల క్రితం ఈ సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి వృద్ధి చెందాయని గుర్తుచేశారు. వ్యవసాయ రంగంలో మరింతగా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ, మిల్లీ అభిప్రాయపడ్డారు. ఒక దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను మరో దేశంలో ప్రజలకు సులువుగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీనివల్ల ఇరుదేశాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వారు పేర్కొన్నారు. ఇందుకోసమని ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఆ దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు.
వాణిజ్యం, రక్షణ, అరుదైన ఖనిజాలు, చమురు, గ్యాస్, అణు ఇంధనం, వ్యవసాయం, సాంస్కృతికం, టెక్నాలజీ వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరస్పరం సహకరించు కుంటున్నాయి.
ఉగ్రవాదంపై ఒకే మాట
ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ సంయుక్త సమరనాదం చేశాయి. బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన రియో డి జనీరోలోని గలేవో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు ముగిసిన తర్వాత రాజధాని బ్రసిలియాలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వాతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ ఆలోచనా ధోరణి ఒకేలా ఉందంటూ వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పెహల్గావ్ ఉదంతం తర్వాత భారత్‌కు సంఘీభావం తెలిపినందుకు బ్రెజిల్‌కు, డసిల్వాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
వాణిజ్యం, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, ఆహారం, ఇంధన భద్రత, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ప్రజా వసతులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితర కీలకాంశాలపై మోదీ, డసిల్వా లోతుగా చర్చించారు. కీలకమైన ఖనిజాలు, అధునాతన, నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లు అంశాల్లోనూ సహకారం పెంపొందించుకోవడంపై చర్చించారు. 1200 కోట్ల డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో 2000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంధనం, వ్యవసాయం, డిజిటల్ రూపాంతరీకరణ, ఉగ్రవాదంపైపోరుపై సంయుక్త సహకారం కోసం ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
నమీబియా అభివృద్ధికి సహకారం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరిదైన నమీబియాకి ప్రధాని మోదీ జులై 8 తేదీన వెళ్లారు. తొలుత స్టేట్‌హౌస్‌లో నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది ఎన్‌డైత్వాతో మోదీ సమావేశ మయ్యారు. నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు ఆమెను అభినందించారు. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని బోధిస్తోందన్నారు. ఒక
నిరుపేద గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనని వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి అయ్యానంటే అందుకు తమ రాజ్యాంగమే కారణ మన్నారు. అధికారం, ఆధిపత్యం ద్వారా కాకుండా భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయిం చేందుకు భారత్, నమీబియా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ నమీబియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు.
ఇండియా-నమీబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 80 కోట్ల డాలర్లకు చేరిందని, ఇది క్రికెట్ గ్రౌండ్‌లో వార్మప్ మాత్రమేనని, ఇకపై మరింత వేగంగా పరుగులు చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై భారత్, నమీబియా సంతకాలు చేశాయి. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో సహకారంతోపాటు నమీబియాలో ఆంటప్రెన్యూ ర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్, సీడీఆర్‌ఐ ఫ్రేమ్‌వర్క్, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి.
మోదీకి పురస్కారాలు
ప్రధాని మోదీకి ఈ ఐదు దేశాల పర్యటనలో అపూర్వమైన గౌరవం దక్కింది. తమ దేశాల అత్యున్నత పురస్కారాలతో ఆయా దేశాధినేతలు గౌరవించారు. ఈ పురస్కారాలను 140 కోట్ల భారతీయుల తరపున వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామా ప్రధాని మోదీకి ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’పురస్కారం ఇచ్చి సత్కరించారు. ప్రశంసనీయమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించడంతోపాటు ప్రపంచ స్థాయి నేతగా ప్రభావం చూపుతున్నందుకు గాను మోదీని ఘనా ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ని మోదీకి ప్రధానం చేసింది. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా ప్రధాని మోదీ నిలిచారు. బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ని ప్రధానం చేసి సత్కరించారు. ‘నాకీ అవార్డ్ దక్కడం గర్వంగా, ఉద్వేగంగా ఉంది. ఇది నాకు మాత్రమేకాదు 140 కోట్ల భారతీయులకు దక్కిన పురస్కారం’ అన్నారు మోదీ. నమీబియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియెంట్ వెల్వివిషియా మిరాబిలిస్’ అందుకున్నారు.
గ్లోబల్ సౌత్‌కు అన్యాయం
భారత ప్రధాని బ్రెజిల్‌లోని రియో డీజనీరోలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నింంచారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నఈ దేశాలు కీలక నిర్ణయాలు, ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత అభివృద్ధి తదితర అంశాలపై ప్రపంచ సంస్థల నుంచి గ్లోబల్ సౌత్ దేశాలకు కనీస సహకారం ఉండటం లేదన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు లేకుండా ఈ సంస్థలన్నీ సిమ్‌కార్డు ఉన్నా.. నెట్‌వర్క్‌లేని మొబైల్‌ఫోన్ల లాంటివని వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను తక్షణం సంస్కరణల బాట పట్టించి దక్షిణార్ధ గోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ‘కృత్రిమమేధ యుగంలో సాంకేతికత వారం వారం తాజాగా మారుతోంది. అలాంటప్పుడు 80 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ అంతర్జాతీయ సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరగాల్సిందే. 20వ శతాబ్దినాటి టైప్‌రైటర్లతో 21వ శతాబ్దంలోని అధునాతన సాఫ్ట్‌వేర్ నడవదు. స్వీయ ప్రయోజనాలకంటే కూడా భారత్ మానవాళి ప్రయోజనాలకే పట్టం కడుతుంది. బ్రిక్స్‌దేశాలతో కలిసి సమష్టిగా అన్ని రంగాల్లో నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం వహించేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం’ అని మోదీ అన్నారు.
‘‘సమకాలీన ప్రపంచం, కాలానికి తగ్గట్లుగా మేం మారతాం అని ప్రస్ఫుటంగా తెలియజెప్పేందుకే బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తున్నాం. మా బాటలోనే ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి అభివృద్ధి బ్యాంక్‌లు సంస్కరణ లను తీసుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటాలి’’ అని మోదీ హితవు పలికారు.
ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని మోదీ పిలుపు నిచ్చారు. పెహల్గావ్‌లో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్ర మూక జరిపిన పాశవిక దాడిని మరోసారి ఖండించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయన్నారు. మరోసారి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా పాక్‌కు మర్చిపోలేని రీతిలో సైనికంగా గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్ర మూలాలను పెకిలించివేయనిదే ప్రపంచ శాంతి అసాధ్యమన్నారు. వచ్చే ఏడాది జరగ నున్న బ్రిక్స్ సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది. ఆ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను బలోపేతం చేయనుంది.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్