జిహాద్‌లు ఎన్ని రకాలు? చెప్పడం కష్టమే. కర్ణాటకలో ఇప్పుడు పెళ్లి జిహాద్ గాని నడుస్తున్నదా? విశాల్‌కుమార్ గోకావి విషయం చూడండి! ఇతడు గడగ్ జిల్లాకు చెందినవాడు. నా పెళ్లాం నన్ను బలవంతంగా మతం మార్చేసింది బాబోయ్ అంటూ గోల పెడుతున్నాడు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తహ్‌సీన్ హోసామని అనే అమ్మాయితో కలసి ఇతడు మూడేళ్లు సహజీవనం చేశాడు. చివరికి నవంబర్ 2024న రిజిస్టర్డ్ వివాహం కూడా చేసుకున్నాడు. అయితే రిజిస్టర్డ్ పెళ్లేమిటి? సంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లాడదాం అందట తహ్‌సీన్. అయితే చిక్కేమిటీ అంటే, ఆ పెళ్లి ముస్లిం సంప్రదాయంలో జరగాలంది. వైవాహిక జీవితంలో గొడవలెందుకు అనుకున్నాడు కుమార్. సరే అని మాత్రమే అన్నాడు. ఆ మేరకు ఈ సంవత్సరం ఏప్రిల్ 25న పెళ్లి జరిగింది. కానీ కుమార్ పేరు కాస్తా ముస్లిం పేరుగా మారిపోయింది. మౌల్వీ మతం మార్చినట్టు కూడా చెప్పేశాడు. హోసామని వివాహం ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగింది, ఇదిగో రుజువు అంటూ ఒక వీడియో దేశం మీద పడింది. జరిగితే జరిగిందిలే అనే గోకావి అనుకున్నాడు. కానీ ఇతడి కుటుంబం ఒత్తిడి మేరకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలన్నాడు. అందుకు జూన్ 5న ముహూర్తం కూడా నిశ్చయించారు. ముందు సరేనన్న హోసామని తరువాత ఆమె కుటుంబ సభ్యుల ఒత్తిడితో కుదరదని చెప్పింది.
ఇంతకీ మతం మార్చుకుని ఇస్లాంలోకి రాకపోతే నువ్వు నాపై లైంగిక దాడికి పాల్పడ్డావని కేసు పెడతానని బెదిరించిందట. ఇంకా ఏమిటంటే, ఇతడి భార్య, ముస్లిం అత్తగారు బేగం బాను క్రమం తప్పకుండా నమాజ్ చేయమని, జమాత్‌కు హాజరు కావాలని బలవంత పెడుతున్నారు. ఇక తప్పేదేముంది? పోలీసు వారు కేసు నమోదు చేశారు. అంచేత ప్రేమ గుడ్డిదేమో కాని, మతం లేనిదయితే కాదు. తస్మాత్ జాగ్రత్త. నిన్నగాక మొన్న ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టయిన చాహంగూర్ బాబా కేసు ఇంకా జనం మరవక ముందే ఇది బయటపడింది. అన్నట్టు ఆ బాబా మత మార్పిడి వ్యవహారం ఇటీవలి చరిత్రలోనే అతి పెద్దదట.