గగన్‌దీప్‌సింగ్ బేడీ
సుస్మిత, ఐశ్వర్య.
ఈ ముగ్గురూ ఎవరు? ప్రసార మాధ్యమాల్లో ప్రముఖులు. ముఖ్యంగా ఇప్పుడు. ఏ విధంగా ప్రసిద్ధులయ్యారు? ఆశావాద దృక్పథంతో పేరొందారు వీరంతా. స్వరాష్ట్రం తమిళనాడు పేరును జాతీయస్థాయి అగ్రభాగాన నిలిపిన ఘనత వీరిదే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ / పోలీసు సర్వీసులకు తలమానికంగా వెలుగొందుతున్న ఈ ముగ్గురిలో గగన్‌దీప్ చాలా సీనియర్. మిగిలిన ఇద్దరి మధ్యనా వయసు తేడా ఏడాది మాత్రమే! నిర్వహణ అవకాశం లభిస్తే వనిత = దక్షత. ఇంకా వివరించాలంటే…
అది కడలూరు. తమిళనాడులోని జిల్లాల్లో ఒకటి. సరిహద్దు ప్రాంతాలు – విల్లుపురం, నాగపట్నం, పెరంబలూరు. విద్య, వైద్య సంస్థల నెలవు కడలూరు… కూడలూరుగా విఖ్యాతం. సంగమ స్థలి అని అర్థం. నాలుగు నదుల సంగమ ప్రదేశం. గార్డెన్ హౌస్ సైతం ఇక్కడిదే. అలనాటి కలెక్టరు రాబర్ట్‌క్లైవ్ అధికారిక నివాసం.
అదే జిల్లాలో ఉంది మరుంగూరు. చిన్నపాటి పల్లెటూరు. పర్వతాలు ఎక్కువ. అక్కడే ఒక కొండమీద సుబ్రహ్మణ్య ఆలయం. అదిగో – ఆ ప్రాంతాన అతి సాధారణ కుటుంబంలో పుట్టారు సోదరీమణులిద్దరూ.
సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఒకనాడు విరుచుకుపడింది సునామీ. తీర ప్రాంతమంతా దెబ్బతింది. కడలూరు పరిసరాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నాలుగువందలకు పైమాటే! కడలూరు నుంచి కన్యాకుమారి వరకు వందలాది కుటుంబాలు నిలువనీడ కోల్పోయాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతాన్నీ నాడు ఆ ఉత్పాతం దడదడలాడించింది. ఎటు చూసినా నష్టం, కష్టం.
అంతెందుకు – చెన్నైలోని మెరీనా బీచ్ ప్రాంతమూ కకావికలమైంది. సునామీ భారీ అలలు తీరప్రదేశాలన్నింటినీ భయకంపితం చేసేశాయి.
అండమాన్ మొదలు ఆంధప్రదేశ్ వరకు అతలా కుతలం. తమిళనాడు తీరంలో అందులోనూ కడలూరు ప్రాంతంలో మృత్యుఘోష! అంతటి విలయ తరుణంలో సేవా సహాయ సహకారాల చిరునామాగా విస్తరించిందో పేరు. అప్పటి తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ సీనియర్ ఉన్నతాధికారి గగన్. గ్రామీణ అభివృద్ధి విభాగంలో ఉండేవారు.
కడలూరు సంక్షోభ బాధితులకు ఎంత అండగా ఉండాలో అంతగా ఉన్నారు. పంజాబీ అయినా, తాను పనిచేసిన తమిళనాడు పైనే మక్కువ ఎక్కువ. ‘నేను ఎక్కడ ఉంటే అదే నా స్వస్థలం. ఇది నాది- నాది ఈ ప్రాంతం అనుకు నేలా సేవ చేస్తుంటాను. సేవ అనేది ఇంకెక్కడి నుంచో ఊడిపడేది కాదు. నా విధుల్ని నేను మనస్ఫూర్తిగా పాటించడమే సేవాభావన’ అంటుండేవారు. అనడమే కాదు, ఆచరించి చూపించారు.
తమిళనాడు కేడర్. 1993 బ్యాచ్. ఐఏఎస్ అకాడమీ ముస్సోరీలో దృఢతర శిక్షణ. సివిల్,పోలీస్ అధికారులను రూపుదిద్దే కేంద్రస్థానం అది. ఉత్తరాఖండ్‌లోనిది. లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఆల్ రౌండ్ బెస్ట్ ఫెర్మార్నెన్స్ గగన్‌దే. స్వర్ణపతక విజేత.
2003-2007 మధ్య కడలూరు జిల్లాకు కలెక్డ్టర్‌గా గగన్ ఎంతగానో ఖ్యాతి పొందారు. సునామీ పీడిత తీరప్రాంతంలో పునర్ నిర్మాణ పనులకు సర్వశక్తులనూ వినియోగించారు. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, అమెరికా అప్పటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ప్రత్యక్ష ప్రశంసలను అందుకున్నారు.
2007-2010 సంవత్సరాల నడుమ తమిళనాడు గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా గగన్‌ది నిరుపమాన సేవానిరతి. ఎంత అంటే – ‘కలెక్టర్ ఆఫ్ హీరోస్’ అని అదివరకే ‘ఔట్‌లుక్’ వ్యవస్థ నుంచి బిరుదు పొందేంత! సహాయక చర్యల పర్యవేక్షణ కార్యదర్శిగా ఆ దీక్షాదక్షతలను కొనియాడుతూ ‘అత్యుత్తమ సేవ’ పురస్కృతీ గగన్‌నే వరించింది. ఇదంతా ఇద్దరు సోదరీమణులకు స్ఫూర్తి.
అప్పటికి సుస్మిత, ఐశ్వర్య బాల్యదశలో ఉన్నారు. ఆ రోజుల్లో ఆ ఐఏఎస్ ఆఫీసర్ సేవలను చూశారు. ఆరాధన భావనను ఎంత గానో పెంచుకున్నారు. ‘ఉంటే గగన్‌లా ఉండాలి. అదే చదవాలి. అలాగే పనిచేయాలి. మేమూ ఐఏఎస్ కావాలి’ అనుకున్నారు. పాలన, పోలీసు సర్వీసులనే మనసు నిండా నింపుకొన్నారు ఇద్దరమ్మాయిలూ!
వారి తండ్రి రామనాథన్. తల్లి పేరు ఇలవరసి. మరుంగూరులో నివాసం. తల్లితండ్రులు తమ పిల్లలను అల్లారుముద్దగా పెంచారు. ఎంత చదువుకుంటే అంతగా చదివిస్తామన్నారు. ఇంకేం… స్టడీస్‌లో దూసుకెళ్లారు అక్క, చెల్లెలు. ఉభయులూ అన్నా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యారు.
స్వర్ణోత్సవాలకు సంసిద్ధమవుతున్న విఖ్యాత విద్య సంస్థ అన్నా వర్సిటీ. చెన్నైలోని నాలుగు ప్రసిద్ధ సాంకేతిక వ్యవస్థల సమాహారం. నిరుడు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ కేటగిరీలో రాజధాని పరంగా పప్రథమ స్థానం. అంటే, ర్యాంకింగ్స్‌లో సాటిలేని మేటి. అటువంటి చోట డిగ్రీలు అందుకున్నారు ఆడపిల్లలిద్దరూ.
రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరిలో ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్. వాటిని సాధించితీరాలని కంకణం కట్టుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధమయ్యారు. అహోరాత్రులూ చదివారు. గతానికి సంబంధించి స్మృతి. భవితను సూచించేది మతి. ప్రస్తుతాన్ని వెల్లడించేది బుద్ధి. ఆ మూడింటికీ, కాలాలన్నింటికీ వర్తించేది ప్రజ్ఞ. వెల్లివిరిస్తే అపార ప్రతిభ. వ్యుత్పత్తితో కలగలిస్తే శక్తి సంపత్తి. వీటితోనే కదా ఎవరైనా శక్తియుతులూ యుక్తిపరులూ అయ్యెదీ!
దీనినే నిరూపించారు ఆ మహిళామణి రత్నాలు. కఠోర శిక్షణ అందుకుని, విజయ •రీటాన్ని సొంతం చేసుకుని, స్ఫూర్తి పతాకాలను వినువీధిన ఎగురవేశారు. సుస్మిత ఆంధప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్ హోదాలో గోదావరి ప్రాంతాన పోలీసు ఉన్నతాధికారిణి. ఐశ్వర్య తమిళనాట ఉన్న తూత్తుకుడికి అదనపు కలెక్టర్. త్వరలోనే ఒక జిల్లాకు ఎస్పీగా, మరొక జిల్లాకు కలెక్టరుగా ఉభయులూ అధికార బాధ్యతలు చేపడతారు. కుటుంబంలో ఇద్దరు వనితలు.
‘అన్నింటికంటే ప్రబలశక్తి ప్రకృతి. దాన్ని మనం పరిరక్షిస్తే అదీ మనల్ని రక్షిస్తుంది. ఎంతో బాధ్యతాయుతంగా ఉండే ప్రకృతి ఒక్కోసారి ఆగ్రహిస్తుంది. ఆ ఫలితంగానే సునామీ వంటి ఉత్పాతాలు. తీవ్రత ఎంతటిదో చిన్నపుడు మేమూ చూశాం. ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సేవాభావానికి ఎంతగానో ముగ్ధులమయ్యాం. మేమూ అలా జిల్లాల అధికారులం కావాలని అనుకున్నాం. అయ్యాం. సంకల్పమే మమ్మల్ని నడిపించింది, గెలిపించింది.
ఆర్థిక అవరోధాలు, చుట్టుముట్టే కష్టనష్టాలు, ఎదురయ్యే అవాంతర పరిస్థితులు ఏవీ ఉక్కు సంకల్పాన్ని తాకలేవు. అందుకు మేమే నిదర్శనం!. ఉక్కు అనగానే ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభభాయి పటేల్ గుర్తుకొస్తారు. శక్తియుక్తులకు వ్యక్తిరూపం. భారతరత్నగా సార్ధక నామధేయులు. భాగ్యనగరంలోని పోలీసు అకాడెమీ ఆ పేరుతోనే! దేశరాజధాని నగరంతోపాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహరాష్ట్రల్లో ఆ పేరుతోనే కదా అనేకానేక విద్యా సంస్థలున్నాయి. పరిపాలన, సాంకేతిక వ్యవస్థలు సైతం చోటు చేసుకున్నాయి. గుజరాత్‌లోనే ఉందికదా… సర్దార్ పేరున ఐక్యతా ప్రతిమ! నర్మదా నదీ ప్రాంతానికి శిఖరాయమానంగా నేటికీ నిలుస్తోంది. వందలాది అడుగుల ఎత్తున, వేలాది చదరపు కిలోమీటర్ల వ్యాసార్థాన అలరారు తోంది. ఆ మహనీయ మూర్తిమత్వాన్నే మేము ఆదర్శంగా భావిస్తున్నాం. సమైక్యత, సమగ్రతల భారతావనిని మనసారా ఆశిస్తున్నాం? అంటు న్నారు ఈ వనితారత్నాలు. జిల్లాల అధికారులుగా నెరవేర్చాల్సిన కర్తవ్యాలు ఇంకెన్నో ఉన్నాయంటు న్నారు. ఇద్దరిదీ ఒక మాట, ఒకటే బాట.
వయసులో పిన్న అయిన ఐశ్వర్యది అఖిల భారత స్థాయిన మంచిర్యాంకు. మొదట్లో ఎంపికైంది రైల్వే అకౌంట్స్ సర్వీసుకి. ఆ దిశనుంచి మళ్లీ యూపీఎస్‌సీ రాసి ఇంకా మేలిమి ర్యాంక్ సాధించారు. అంటే తన రెండో ప్రయత్నం లోనే 44వ ర్యాంకును కైవసం చేసుకోగలిగారు. కేడరుకు అధికారిణిగా ఎంపికైనపుడు ఆమెకు 22ఏళ్లు. పట్టుదలకు పేరు మోసిన అక్క సుస్మిత కూడా ర్యాంకులో పట్టును నిలబెట్టుకున్నారు.
ఉభయుల్లో ఎవరిని పలకరించినా, మాట్లా డించినా, బాగున్నారా అన్నా-చేస్తున్న పనితోనే సమాధానం చేప్తుంటారు. ఏమైనా కానీ, ఎదురేది రానీ నిద్రే నీకొద్దు, నీంగే నీ హద్దు అన్నట్లు ఉంటుంటారు. విధి నిర్వహణ సందర్భాల్లో…
‘రానున్న విజయాన్ని పిడికిట్లో చూడాలీ
ఆ గెలుపు చప్పట్లే గుండెల్లో మోగాలీ
నుదుటి రేఖలమీదనే సంతకాలు చేయాలీ
ఎదనిండా చిరునవ్వుల చిరునామాలై ఉండాలీ’
అనేలా రోజువారీ పనుల్లోనూ ఉత్సాహ ప్రోత్సాహాలు కనబరుస్తుంటారు.
‘నువ్వు పాడగలిగితే వెదురు వేణువు; నువ్వు చెక్కగలిగితే శిల ఇక శిల్పం’ (తిరునగరి)ని గుర్తు చేస్తూ ఉంటారు ఇద్దరు అమ్మాయిలూ కూడా.
మనదేశాన ఐఏఎస్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పటేల్ మాటల్లోనే చెప్పాలంటే – నాయకుడు/అధికారి తన పాలనలోని ఉత్తమ అంశాలను జన బాహుళ్యంలోకి తీసుకురావాలి. వారు అనుకున్నవాటికన్నా, సాధ్యం ఎంతవరకు అనేదానికన్నా ఉదాత్తతను సాధించగలగాలి. ఈ రీత్యా ఐఏఎస్, ఐపీఎస్ విజేత యువత భుజస్కంధాల పైన ఎన్నెన్నో బాధ్యతలున్నాయి. వాటిని చిరునవ్వుతో నిర్వర్తిస్తున్నందుకే కడలూరు సోదరీమణులు ఇప్పుడు వజ్రవైఢూర్యాలను తలపిస్తున్నారు. ప్రజల ఆశీస్సులను వినమ్రంగా స్వీకరిస్తున్నారు.
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్