పాశ్చాత్య విధివిధానాలు, విద్య అలవరచుకుంటున్న నేటి తరం భారతీయ సంస్కృతికి, విలువలకు దూరం అవుతున్న వాస్తవం మనందరికీ తెలిసిన విషయం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైన తర్వాత పిల్లలకు మన పురాణ, ఇతిహాసాల గురించి, అందులో ఉన్న విలువలు, నీతి గురించి చెప్పేవారు కూడా కరవవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు మన పురాణేతిహాసాలు, ధర్మంలోనే ఉన్నాయన్నది నిర్వివాదం. నైతిక వర్తన, ధర్మబద్ధత, క్రమశిక్షణ, సత్యం, న్యాయం, క్షమ, సహనం వంటి విలువలకు మన పురాణేతిహాసాలే చుక్కాని వంటివి. అందులోని సారాంశం కేవలం కథలు కాదు, ఒక వ్యక్తి నడవవలసిన ధర్మ మార్గానికి నిర్దేశకాలు. మన పురాణేతిహాసాలు, సంస్కృతి, ఆచారవ్యవహారాలకు సంబంధించిన విద్యను ఆధునిక విద్యతో పాటుగా అందించడం నేటి అవసరం.
ముఖ్యంగా ఆదికావ్యమైన రామాయణంలో రాముడిని అభివర్ణించేటప్పుడు ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ అంటారు. అంటే ధర్మం మూర్తీభవించిన స్వరూపం రాముడు. ఒక కుమారుడిగా, భర్తగా, రాజుగా ఎలా జీవించాలో ఆచరించి చూపిన వ్యక్తి ఆయన. రామాయణంలో కుటుంబ సంబంధాలు, సామాజిక బాధ్యతలు, సామాజిక నేపథ్యంలో ధర్మాన్ని అనుసరించడానికి సంబంధించిన నైతిక విలువలు కనిపిస్తాయి. సోదరుల మధ్య ఉండవలసిన ప్రేమను, విశ్వాసాన్ని, గౌరవాన్ని, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని, రాజుగా చేయవలసిన విధులను, నమ్మకమైన బంటు ఎలా ఉండాలనే దానికి ఉదాహరణగా రామాయణంలో పాత్రలు కనిపిస్తాయి. లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, హనుమ, సుగ్రీవుడు, విభీషణుడు వంటి సానుకూల పాత్రలతో పాటు రావణుడు వంటి ప్రతికూల పాత్రలు ఈ ఆది కావ్యంలో కనిపిస్తాయి. వ్యక్తి ఎలా జీవించకూడదో, ఎంత విద్యను, ఐశ్వర్యాన్ని సంపాదించినా, అహంకార పూరితంగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పేదే రావణుడి పాత్ర. నైతిక పరిధులను అధిగమించి, అధర్మంగా వ్యక్తి వ్యవహరిస్తే ఏం జరుగుతుందో శూర్పణఖ, రావణుడి జీవితాలు చెప్తాయి. ఇలా వ్యక్తి జీవనంలో అన్ని కోణాలనూ ఆవరించి, పరిశీలించి అతడు జీవించవలసిన విధానానికి మార్గదర్శనం చేస్తుంది కాబట్టే రామాయణానికి అంతటి ప్రాధాన్యత. అందుకే, అది కొన్ని యుగాలుగా భారతీయ జీవన స్రవంతిలో భాగంగా ఉంటూ, భారతీయుల జీవితాలను ప్రభావితం చేస్తూ వచ్చింది.
ఆధునిక కాలంలో వచ్చిన జీవన వేగంతో నేటి తరం వాటిని విస్మరించి జీవిస్తున్న నేపథ్యంలో వాటిని తిరిగి గుర్తు చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. చిన్న వయసు నుండే పిల్లల మనస్సులో విషయాలు ప్రస్ఫుటంగా ముద్ర వేస్తాయి కనుక, మన భారతీయ సనాతన వైదిక ధర్మ జీవన విధానం ఏమిటనేది పిల్లలకి తెలపడం, నిత్య జీవన విధానంలో అలవాటు చేయడం, మనస్సులో ధర్మం పట్ల అభిమానం, గౌరవం ఉండేలా పోషించడం చాలా అవసరమైంది.
నేటి కాలానికి ఇతిహాసాలు
భారతీయ పురాణేతిహాసాలు ఏ కాలానికైనా వర్తిస్తాయి. అమెరికాలో పుట్టిన వ్యక్తికైనా, ఆఫ్రికాలో పుట్టినవారికైనా అవి వర్తిస్తాయి. అవి కుటుంబ విలువలు, సామాజిక విలువలతో పాటు రాజకీయంగా నాయకులు ఎలా ఉండాలనే అంశాలను వివరిస్తాయి. కుటుంబం, సమాజం పట్ల బాధ్యత, నీతి, నిజాయతీ, సంయమనం, సహనం, ప్రేమతో కూడిన జీవనం అన్నవి సార్వత్రిక విలువలు. అందుకే, భవిష్యత్ తరాలకు వాటిని బోధించడం ద్వారా రామరాజ్యాన్ని స్థాపించుకోవచ్చు. రామ రాజ్యం అంటే మతపరమైన అంశం కాదు, పైన పేర్కొన్న విలువల ఆచరణను కలిగిన ఆదర్శ సమాజం. కాబట్టి, భారతీయ పురాణేతిహాసాలను కేవలం ధర్మ గ్రంథాలుగా కాక, వ్యక్తిత్వ నిర్మాణ గ్రంథాలుగా చూడటం నేటి అవసరం.
శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల
అటు సమకాలీన ఆధునిక విద్యతో పాటు, రామాయణంపై ప్రత్యేక దృష్టి పెట్టి మన సంస్కృతి, వారసత్వాలను కలిపి సమగ్ర విద్యగా నేటి తరానికి అందిస్తూ, నేటి విద్యావిధానంలో ఉన్న లోటుపాట్లను తొలగించి పరిపూర్ణత కలిగించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల.
శ్రీ కంచి ఆచార్యుల ఆశీర్వచనంతో స్థాపితమైన శ్రీ ప్రత్యక్ష ఛారిటబుల్ ట్రస్ట్ (రిజిస్టర్డ్) విద్య, వేదం, వైద్య సేవలను దేశవ్యాప్తంగా అందిస్తోంది. ఈ ట్రస్ట్ ప్రారంభించిన ప్రముఖ సంస్థలలో ఒకటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల. చెన్నై-బెంగళూరు ప్రధాన రహదారిపై నజరత్పేట్, పూన మల్లెలో ఉన్న ఈ పాఠశాల, ప్రస్తుత విద్యాసంవత్స రానికి (2025-2026) అడ్మిషన్లను ఆహ్వానిస్తోంది. ఈ పాఠశాలలో 12వ తరగతి వరకు దీ•జు విద్యావిధానాన్ని అనుసరిస్తారు. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.
పాఠశాలలో విద్యార్థులకు పరంపరాగత విలువలతో పాటు ఇతిహాసలను బోధిస్తారు. రామోదంతం, చంపూ రామాయణం, రఘువంశం వంటి కావ్యాల పాఠనంతోపాటు, రామ భుజంగ స్తోత్రం, రఘువీర గద్యమ్, హనుమాన్ చాలీసా, సంక్షేప రామాయణం వంటి స్తోత్రాల అధ్యయనం జరుగుతుంది. వాల్మీకి రామాయణంలోని ప్రముఖ భాగాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తారు. రామాయణ ప్రవేశికను వివిధ భాషలలో తులసీ రామాయణ (హిందీ), కంబ రామాయణం (తమిళం) మొదలైన వాటిలో పరిచయం చేస్తారు. విద్యార్థులు సాత్త్విక జీవనశైలిని అలవాటు చేస్తూ, సంధ్యా వందనం, సమీదాధానం, బ్రహ్మయజ్ఞం వంటి నిత్య కర్మలను పాఠించేందుకు శిక్షణ ఇస్తారు. ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విజ్ఞానంగా కంప్యూటర్ సైన్స్ వంటి విషయాలలోనూ పాఠాలు నేర్పిస్తున్నారు.
భారతీయ సంస్కృతి, వేద పరంపరల పరిరక్షణకు అంకితమైన ఈ పాఠశాల, ఆధునిక విద్యతో పాటు సనాతన విలువలతో కూడిన సమగ్ర విద్యను అందిస్తోంది. చేరే వారికి కొన్ని షరతులు వర్తిస్తాయి.
మరిన్ని వివరాల కోసం డాక్టర్ వి. నాగరాజన్ (9894641226) లేదా రమేష్‌ను (94442 10338) సంప్రదించవచ్చు.