భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

గోపరాజు వెంకట సూర్యనారాయణ

సాయంకాల సమయం! హైదరాబాద్‌ ‌సిటీలోని ఒక గేటెడ్‌ ‌కమ్యూనిటీలో ఒక పక్క గుబురుగా పెంచిన చెట్ల మధ్య పచ్చని పచ్చికతో చిన్న పార్కు. చల్లని వాతావరణంలో సేద తీరడానికి కాలిబాట పక్కగా ఏర్పరిచిన సిమెంటు బెంచీపై, ఒంటరిగా కూర్చుని ఉంది యాభై ఏళ్లకు పైబడిన అమృతవల్లి. ఒంటరితనం అనుభవిస్తూ, తన గడిచిన జీవితం నెమరు వేసుకోసాగింది! ఈ ఒంటరితనం తనను వీడక ఎప్పుడూ వెన్నంటి ఉంటున్నదే!! ఈరోజుకీ.. వదలక తీరని మనోవేదన కలిగిస్తున్నదే!

 మధ్య తరగతి ఉద్యోగస్థులైన దంపతులకు తను ఒక్కగానొక్క కూతురు. తన బాల్యం, మరో తోబుట్టువు తోడు లేకుండానే గడిచింది! అమ్మా నాన్నా ఆఫీసులకు వెళితే, బిక్కు బిక్కుమంటూ, ఇంట్లో ఒంటరిగానే గడిపేది!! స్కూల్లో స్నేహితురాళ్లు, తమతమ కుటుంబాల్లో జరిగే సరదా ఆటలు, మాటల కబుర్లు చెబుతూ ఉంటే,… అలాంటి అనుభవాలు, అనుభూతులు తనకు లేవే అని, ఎంతో దిగులుపడేది! తనకు ఇంటి కంటే, స్కూలులోనే కాలక్షేపం బాగా జరిగేది!! అందుకే.. స్కూలు ఎప్పుడూ మానకుండా, శ్రద్ధగా చదువు సాగించింది. ఆపైన డిగ్రీ, బీఈడీ కూడా పూర్తిచేసి, తనకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరింది! అలా.. నలుగురి మధ్యలో స్కూలు వాతావరణంలో, పిల్లల మధ్య ఇష్టంగా గడుపుతూ, చాలా ఆనందంగానే గడిపింది, అప్పటి ఆ దినాలు!

ఆ తర్వాత,.. యుక్తవయసులో కెమికల్‌ ఇం‌జనీర్‌ ‌కరుణాకరరావుతో వివాహం అయిన తర్వాత అయినా.. భర్త సాహచర్యంలో, సంసార జీవితంలో నైనా.. ఒంటరితనం విముక్తి కోసం కన్నకలలు, ఆశలు ఎండమావిగానే ముగిశాయి! భర్తకు నైట్‌ ‌డ్యూటీలు, ఆఫీస్‌ ‌టూరులు… తనకేమో.. పగటి పూట ఉద్యోగంతో జీవితం అనాసక్తంగా సాగింది తప్ప తానాశించిన విధంగా దాంపత్య జీవితం లేదు! భర్త కూడా, సంసార జీవితం అంటే.. యాంత్రికంగా గడపాడేకానీ బాంధవ్య బంధాల పట్ల పెద్దగాఆసక్తి, అనురక్తి కలిగిననుట్ల ఎన్నడూ ప్రవర్తించలేదు! ఎలాంటి అనుభూతులు లేకుండానే, ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది! కొడుకు వివేక్‌ను అల్లారు ముద్దుగా, ప్రాణప్రదంగాపెంచి పెద్ద చేసింది.

కొడుకుకు ఏడెనిమిది ఏళ్ల వయసున్నప్పుడు జరిగిన ఒక సంఘటన తనకు బాగా జ్ఞాపకం!అది తన బతుకులో మరో మలుపునకు కారణమయ్యింది!! వివేక్‌ ‌చదువుతున్న కార్పొరేట్‌ ‌స్కూలు ప్రిన్సిపాల్‌ ‌తనను పిలిచి చెప్పిన విషయం-

 ‘‘వివేక్‌ ‌తరగతి సోషల్‌ ‌టీచర్‌, ‘కుటుంబం’ అనే పాఠం బోధించే సందర్భంగా, ఫ్యామిలీ ఫోటో తీయించుకు రమ్మంటే.. మీ చిన్నారి వివేక్‌ ‌చెప్పిన సమాధానం –

‘కుదరదు టీచర్‌!.. ‌మా నాన్నకు నైట్‌ ‌డ్యూటీలు! అమ్మకు పగలు ఆఫీసు!.. సోమవారాల్లో సెలవు, నాన్నకు బుధవారాలు ఆఫ్‌!.. ‌మరి నాకేమో ఆదివారం సెలవు’ అంటూ.. మీ ఇంటి పరిస్థితిని వివరిస్తూ, అమాయకంగా తెలియ జేసాడు!… అలా అయితే పిల్లవాడి భవిష్యత్తు ఎలా?!’’అంటూ.. విషయం విశదపరిచి, బాగోగులు నచ్చజెప్పి, తనకు కనువిప్పు కలిగించింది!

వెనువెంటనే బాధ్యతగా భావించి, తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇంటికీ, కొడుకు వివేక్‌ ‌బాగోగులు, పెంపకానికే పూర్తిగా అంకితం అయ్యింది ఆ తర్వాతంతా! వివేక్‌ను మంచిగా చదివించి, సాంకేతిక పట్టభద్రుడై పెద్ద కంపెనీలో మంచి జీతంతో స్థిరపడే వరకు, వెన్నుదన్నుగా నిలచి పెంచింది, తన భర్తకు ఏమంత తీరిక, వీలు చిక్కక పోయినాఅతన్ని అనుకోవలసిన పని మాత్రం ఏముంది! అతని ఉద్యోగ విధులు, ధర్మం, బాధ్యతలు అలాంటివి!! డ్యూటీ షిఫ్టులు, తరచూ టూర్ల ప్రయాణాలతో, కాలక్రమేణా.. అతని ఆరోగ్యం కూడా దెబ్బతింటూ వచ్చింది! ఆర్థికంగా ఎంత ఎదిగినా, ఆస్తులు కూడబెట్ట గలిగినా, పదవీ విరమణ వయసు వరకూ కొనసాగలేక పోయాడు. అనేక ఆరోగ్య సమస్యలు, రుగ్మతలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పిన్న వయస్కుడు గానే.. కొడుకును తనను ఒంటరులను చేసి వెళ్లిపోయాడు. అటుపైన తనది మళ్లీ ఒంటరి జీవితం! కొడుకు పైచదువులకై, వేరే చోటికి యూనివర్సిటీ కాలేజీకి వెళ్లినా తిరిగి ఒంటరితనం భరించలేక, కాలక్షేపం కోసమని ఎప్పుడో మానేసిన ఉద్యోగంలో చేరి, ఏడాది క్రితం వరకు బాధ్యతగా విధులు నిర్వర్తించింది.

 ఏడాది క్రితమే.. కొడుకు వివేక్‌ ‌తోటి ఉద్యోగస్తురాలు మాధురిని ఇష్టపడితే, ప్రేమ వివాహం కూడా జరిపించి ఒక ఇంటివాడిని చేసింది! దంపతులు తమ కొత్త కాపురానికి హైదరాబాదులో, ప్రస్తుతం ఇప్పుడుంటున్న కమ్యూనిటీలోని, ఒక బహుళ అంతస్థుల భవనం పదవ అంతస్తులో, మూడు పడక గదుల ఫ్లాట్‌ ‌తీసుకొన్నారు. తనను కూడా వచ్చేయమని కోరితే, కాదనలేక కొడుకు సంసారానికి సహాయంగా ఉండొచ్చని వచ్చి చేరింది. కొడుకు కోడలు డ్యూటీకి వెళ్లిన తర్వాత తనకు ఒంటరిగా ఇంట్లో ఉండి గడపటం తప్పటం లేదు!

 ఇలా.. ఆలోచనలు, పాత అనుభవాల జ్ఞాపకాలు మనసులో సుళ్లు తిరుగుతూ,చూస్తుండగా, పొద్దువాలి చీకటి పడిపోయింది! కొడుకు కోడలు వచ్చే వేళయ్యిందని, హడావిడిగా లిఫ్ట్ ‌వైపు నడిచింది అమృతవల్లి, ఆనాటికి దినచర్య సాయంత్రం వాహ్యళి ముగించుకొని!!

ఫ్లాట్‌లోకెళ్ళి కాఫీ ఫలహారాలు సిద్ధం చేసి, కొడుకు, కోడలు రాకకోసం ఎదురుచూడసాగింది! వాళ్లు రాగానే కాఫీ తాగి, తిరిగి ఫ్రెష్‌ ‌గా తయారయి అరగంటలోనే, హడావిడిగా బయటకు వెళుతూ.. వివేక్‌ ‌తల్లితో

‘‘అమ్మా! మేం బయట చిన్న పార్టీకి వెళుతున్నాం! తిరిగి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు!! నువ్వు భోంచేసి పడుకో! మాకోసం ఎదురుచూడకు!’’ అని చెప్పి,.. మారు మాటకైనా ఎదురు చూడకుండా వెళ్లిపోయారు.

ఇదేమీ కొత్త అనుభవమేమీ కాదు తనకు! వాళ్లు ఆఫీసు నుంచి వస్తారు, స్థిమితంగా నాలుగు కబుర్లు, ముచ్చట్లతో కలిసి భోజనాలు చెయ్యొచ్చని తాను ఎదురుచూడడం, అదేమీ పట్టనట్టుగానే.. రాగానే, రెడీగా ఉన్న ఫలహారం కాఫీ కానిచ్చి, వారి గదిలోకెళ్లి, వారివారి సొంత పనుల్లో మునగడమో, విశ్రమించ టమో తప్ప, తనతో తీరిగ్గా కలిసి ముచ్చటిస్తూ గడిపిన సందర్భాలు, వేళ్ల మీద లెక్కించుకోవలసిందే!

అసలు తప్పంతా తనదే! కొత్త సంసారం వాళ్లంతట వాళ్లు కుదుటపడి స్థిరపడకుండానే వాళ్లు ‘వచ్చేయ్‌’ అనగానే, రావడం మొదటి పొరపాటు! కొడుకుతో కలిసి ఉండొచ్చు కదా అనే ఆశతో, అక్కడి తన ఒంటరి జీవితం ఉద్యోగం వదలి ఇక్కడి కొచ్చి ఇంటి బాధ్యతనంతా తలకెత్తు కోవటం మరో తప్పు!! అదే అదనుగా చూసి.. కోడలు పిల్ల తన ఇంటి బాధ్యత, పూర్తిగా విస్మరించి ప్రవర్తించటం తనకు నిత్యం వేదననే మిగులుస్తోంది.

 మరోపక్క కోడలు మాధురి, అత్తగారనే మర్యాదైనా చూపకపోగా, కనీస మన్నన ఆప్యాయత కూడా కనబరచకపోవటం మరింత ఎక్కువ బాధిస్తోంది. దానికితోడు.. తనతో అవసరమైన ప్పుడల్లా, భర్త ద్వారానే తెలియపర్చడం, మధ్యవర్తిగా వివేక్‌తోనే కబురు పంపడం లాంటివి, చాలా చిరాకు, చికాకు కలిగిస్తున్నాయి! వంట ఇంటి బాధ్యతలో కొంతైనా కోడలికివ్వాలనే తలంపుతో, ఉదయం పూట ఆఫీసులకు తీసుకెళ్లే టిఫిన్‌ ‌బాక్సుల వ్యవహారం చూడ్డం, అంత తొందరగా తన వల్ల కావటం లేదని చెపితే.. ‘‘సరే అయితే! అలాగేలే! అని, ఆరోజు నుంచి ఆఫీసు కాంటీన్‌లోనే తింటున్నారు. కోడలు మాధురి వంటిల్లు వైపు చూసింది లేదు. తన కోసమైనా ఇంట్లో ఒంటరిగా వంట చేసుకొనే శ్రమ, రోజంతా ఒంటరిగా గడపటం తప్పటం లేదు. అందుకే.. తానిలా బయటి ప్రపంచం, వాతావరణం చూడ్డానికైనా వీలవు తుందనే, సాయంత్రాలు కిందకి దిగి, కాసేపు పార్కులో గడపటం అలవాటు చేసుకుంది!

ఒక రోజు పార్కుకు రావటం కొంచెం ఆలస్యం అయ్యింది! తాను రోజూ విశ్రమించే బెంచీ మీద వేరే ఎవరో కూర్చుని ఉండడం చూసిన తాను అల్లంత దూరంలోనే ఆగిపోయింది. అది గమనించిన ఆ పెద్ద మనిషి, ‘‘ రండి కూర్చోండి! రోజూ ఈ స్థలంలో మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను! ఆలస్యమైతే ఈరోజు రారనుకున్నాను!’’ అంటూ సాదరంగా ఆహ్వానించి లేచి నిలబడ్డాడు.

దానికి తబ్బిబ్బయి, ‘‘లేదు లేదు! మీరు కూర్చోండి!’’

‘‘నేనా పక్కగా కూర్చుంటానులెండి’’ అంటూ.. మొహమాటంగా ఇంకోవైపు చివర ఒదిగి కూర్చుంది.

నా నడక ప్రదక్షిణాలు ఇప్పుడే పూర్తయ్యాయి!

నేను కొన్నాళ్లుగా రోజూ.. ప్రతి ప్రదక్షిణలోనూ మిమ్మల్నిక్కడ ఒంటరిగా కూర్చోని ఉండడం చూస్తూనే ఉన్నాను. మీరు, ఇక్కడకు కొత్తగా వచ్చారా?’’ అంటూ వివరం అడిగాడు.

‘‘అవునండీ! కొన్ని నెలల క్రితమే మా అబ్బాయి వివేక్‌ ‌దగ్గరకు వచ్చాను. రెండవ బ్లాకు పదవ అంతస్తులో ఉంటున్నాము.’’ చెప్పింది.

‘‘అలాగా.. నేనూ మీ వెనకే, నాలుగో బ్లాకులో ఆరో అంతస్తుల•నే ఉంటాను ఒంటరిగా! నా పేరు ఆనందరావు, రిటైర్డు ఫిజిక్స్ ‌లెక్చరర్ని. మూడేళ్లుగా భార్యా వియోగిని. పిల్లలిద్దరకూ పెళ్లిళ్లయిపోయి అబ్బాయి అమెరికాలో, అమ్మాయి ఢిల్లీలో ఉంటారు. ఇదండీ! క్లుప్తంగా నా పరిస్థితి!’’ అంటూ తన వివరణ ఇచ్చాడా పెద్ద మనిషి. ఇన్నాళ్లకు స్నేహపాత్రంగా మాట్లాడే ఒక వ్యక్తి తారసపడినందుకు తన మనసు ఎంతో సంతోషపడింది ఆనాడు.

అప్పటినుంచీ అక్కడే ఆయన తరచు తారసపడుతూ పలకరించి మాట్లాడుతూనే ఉన్నాడు కలుపుగోలుగా! మనిషి మర్యాదస్తుడు, గౌరవించి స్నేహపూర్వకంగా మాట్లాడే మనిషి కావడంతో, తను కూడా సంభాషణ కొనసాగిస్తోంది కాలక్షేపంగా! సాయంత్రాలు అలా మరో వ్యక్తితో మాటామంతి సాగడంతో, తన ఒంటరితనానికి ఒకింతసేపు ఎంతోకొంత ఆటవిడుపు దొరికినట్టయ్యి, సంతోషంగానే వుంది.

వారాంతాల్లో.. శని ఆదివారాలలో కూడా, కొడుకు కోడలు తనతో గడిపేది తక్కువే! వారికి జంటగా గడిపే, విలాస విహార పోగ్రాములే ఎక్కువ!! తాను ఇంటిలో ఒంటరిగా ఉంటానన్న ధ్యాసే, వారికి ఉన్నట్టు తోచదు! తాను ఇంటికి ఒక కాపలాదారుగా గడపవలసి వస్తోంది ఇన్నాళ్లుగా!

అలా ఒంటరితనం భరించలేక, ఉండబట్టలేక ఒకరోజు కొడుకు వివేక్‌ ‌తో.. ‘‘బాబూ! వివేక్‌!.. ‌రోజంతా ఒంటరిగా గడపటం నావల్ల కావటం లేదురా! నలుగురితో గడిపే వ్యాపకం ఏదైనా చూడరా నాకోసం! ’’ అడిగింది.

 ‘‘అమ్మా! నీకు ఈ వయసులో ఇంకా ఏమి వ్యాపకం అమ్మా! విశ్రాంతిగా గడపాలిగాని! అయినా,.. రోజంతా ఇంట్లో పనే సరిపోతుంది కదమ్మా నీకు! ’’ అంటూ విషయాన్ని దాట వేశాడు ముద్దుల కొడుకు తమ సేవలోనే తరించమన్నట్టుగా సూచిస్తూ!

 అమృతవల్లికి అర్థ్ధమయ్యింది! తన ఒంటరితనానికి అక్కడ విముక్తి లేదని, తన ఆశ వారితో నెరవేరదని! అందుకు తన ప్రయత్నమేదో తానే చేసుకోవాలని కృత నిశ్చయానికొచ్చింది! అదే ఆలోచనతో వార్తా పత్రికలో తనకు అనుకూలమైన ప్రకటనలకై దృష్టి సారించటం మొదలుపెట్టింది. ఏదో ఒక అవకాశం దారి దొరక్క పోతుందా అని! వయసు మీరిన కారణంగా ఉద్యోగ ప్రయత్నాలేవీ ఫలించ లేదు!

 కానీ, పేపర్లోని ఒక ప్రకటన తనను బాగా ఆకర్షించింది! రెండు మూడు రోజులు తనలో తాను తర్జనభర్జన పడి, మనసు నిశ్చయ పర్చుకొన్న తర్వాత,.. కొడుకు కోడలు ముందుకు ఆ ప్రస్తావన తెచ్చింది!

అమృతవల్లి చేసిన ఆ అనుకోని,ఊహించ ప్రస్తావనకు కొడుకు కోడలు విస్తుపోయారు! అది విడ్డూరంగా తోచిన ఇద్దరూ వెంటనే తీవ్రంగా స్పందిస్తూ కోడలు మాధురి తీవ్రమైన స్వరంతో, భర్తతో, ‘‘ఇక మన పరువేం కావాలి? నలుగురికీ మనం ఏం జవాబు చెప్పుకోవాలి?’’అంటూ రుసరుసలాడుతూ లోనికి వెళ్లిపోయింది.

కొడుకు వివేక్‌ ‌కూడా,.. ‘‘అమ్మా! ఇప్పుడు నీకు ఇక్కడ ఏం తక్కువైంది? ఇలా ఈ విధంగా ప్రవర్తించడానికి!’’అని ఆవేశంగా విరుచుకు పడ్డాడు.

అంతే ధీటుగా అమృతవల్లి, సమాధానం ఇచ్చింది.

‘‘తక్కువైంది.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, కలుపుగోలుగా కలిసిమెలిసి మెలగడం. అన్నీ తక్కువై నేను ఏకాకిగా, ఒంటరి భావనతో మసల వలసి రావడం నాకు చాలా కష్టంగానే ఉంది! అందుకే ఈ సన్నాహ ప్రయత్నం!’’ అంటూ.. చేతిలో, అడ్రెసు కాగితాన్ని మరోసారి చూసుకుంటూ,.. ఆ వయోజన పరిచయ వేదిక, ‘తోడు నీడ’ నగర సాంస్కృతిక పరిషత్‌ ‌హాల్‌ ఉన్న ప్రదేశం చేరుకోడానికి బయలుదేరింది.

                                                                                                  ***

స్నేహాన్ని ఇతరులతో పంచుకోడానికి, ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడానికి, మనోపాజ్‌ ‌లేదుగా మరి!!

అమృతవల్లి వేదిక వద్దకు చేరేసరికి, అప్పటికే.. ఎంతోమంది ఆడ మగ వయోజనులు చేరి, సభలో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకుని కూర్చొని ఉ•న్నారు. తనుకూడా పేరు నమోదు చేసుకున్న కాసేపటికే వేదిక మీద ఒక్కొక్కరి స్వీయ పరిచయాల కార్యక్రమం మొదలయ్యింది.

 మొదట.. పరిచయ వేదిక లక్ష్యాలు, ప్రాధాన్యాలు సమావేశకర్తలు వివరించిన తర్వాత, కార్యకర్తలు ఒక్కొక్కరిని పిలుస్తూ స్వీయ పరిచయం చేసుకొమ్మని కోరారు సభ్యులను.

అమృతవల్లికి ఆశ్చర్యంగా, ఆ సభలో అంతకు ముందు తనకు పరిచయం ఉన్న ఆనందరావు గారు కూడా ఎదురు పడ్డారు! ఇద్దరూ కాస్త బిడియ పడుతూనే ఒకరినొకరు పలకరించుకున్నారు.

 వేదిక మీద అందరి స్వీయ పరిచయాలు అయిపోయిన తర్వాత, స్నేహపూర్వక ఇష్టాగోష్టిగా ఒకరినొకరు విడివిడిగా సన్నిహితంగా మాట్లాడు కొనేందుకు వీలుగా, ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు వీలుగా టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ఆనందరావుతో ముందే కొంత పరిచయం ఉండడంతో అక్కడ అలా కలుసుకోవడం ఇద్దరికి కొంత వింతగానే అనిపించినా…మరింత చనువుగా, ఆప్యాయంగా అన్యోన్యంగా, అరమరికలు లేకుండా తమ పరిస్థితులు, శేష జీవితంపై తమకున్న ఆశలు, ఆకాంక్షలనన్నీ వివరంగా మాట్లాడుకొని, ఒకరినొకరు అర్థ్ధం చేసుకునే వీలు కల్పించిందా సమావేశం!

తిరుగు ప్రయాణంలో, ఇద్దరూ కలిసే కమ్యూనిటీకి చేరుకున్నారు! ఆనందరావు గారు మొదటిసారిగా తన ఇంటికి తీసికెళ్లి స్వయంగా ఆతిథ్యమిచ్చారు.

ఒంటరివాడైనా ఇల్లు చాలా శుభ్రంగా ఉంది! ఇంట్లో ఫర్నీచరు, గోడల మీది అలంకరణ ఆయన జీవనశైలిని అభిరుచిని తెలియజేస్తూ, ఎక్కడివక్కడ అమర్చినట్టుగా ఉన్నాయి! వాటినన్నిటినీ ఆకర్షణీయంగా నిత్యం కాపాడుతున్న రావుగార్ని అభినందించకుండా ఉండలేకపోయింది అమృతవల్లి!

దానికి రావుగారు సమాధానంగా

‘దానిదేముందండీ! ఒంటరిగాణ్ణి! ఇంట్లో ఉన్న చాలా వాటిని రోజూ ఉపయోగించేదే తక్కువ! ఏదో ఒక మూల ఏకాకిగా, పాత జ్ఞాపకాలతో కాలక్షేపం చేయడంతోనే సరిపోతుంది నాకు! నా భార్యాపిల్లలు ఉండగా, ఇల్లు కళకళ లాడుతూ సందడిగా ఉండేది! ఈ వయసులో…ఈ పరిస్థితి నుండి బయటపడి మళ్లీ మంచితోడు సంపాదించి గడపాలనే ఆలోచనతో అక్కడికి వచ్చాను! ఈ ఆధునిక యుగంలో.. ఇది నా ఒక్కడి సమస్యే కాదని, నాలాగే పలు సమస్యలతో ఒంటరితనం నుంచి విముక్తి కోరేవాళ్లు చాలామందే ఉన్నారని, అక్కడికొచ్చిన వారి గోడు వింటుంటే అర్థమైంది.!!

‘‘సారీ!.. క్షమించండి! నా ధోరణిలో చెప్పుకుపోతున్నాను. ఉండండి! కాఫీ ఇస్తాను!’’ అంటూ లేచాడు ఆనందరావు.

‘‘ఆగండి! వంటిల్లు చూపించండి! ఆ ప్రయత్నం నేను చేస్తాను’’అంటూ లేవబోయింది అమృతవల్లి.

‘‘భలేవారే! నేను కూడా, వంటొచ్చిన మగాడినేనండీ!! నా ఈ ‘తోడునీడా’ ప్రయత్నం, తాపత్రయం తిండీతిప్పలు తీర్చుకునేందుకే అనుకునేరు! నా చేతి వంట, కాఫీ రుచి చూశారంటే, మీరే మెచ్చుకుని మరో కప్పు కావాలని అడుగుతారు!’’ అంటూ.. ఆమె చొరవకు బ్రేకులు వేసి, తనే వంటింటి వైపు నడిచాడు.

కాసేపాగి వంటింటిలోని ఏర్పాట్లు కూడా చూడాలనే కుతూహలంతో, వెనకాలే వెళ్లింది అమృతవల్లి. వంటింటిని ముచ్చటగా ఉన్న తీరు చూసి మురిసి, రావుగార్ని మరోసారి నిండా అభినందించ కుండా ఉండలేకపోయింది!

 వెంటనే ‘రావుగారూ! మీరు చూపిస్తున్న ఈ ఆప్యాయతకు, మీరిచ్చిన ఈ ఆతిథ్యానికి ధన్యవాదాలు! రేపటి ఆదివారం.. మీరు కూడా, దయచేసి మా ఫ్లాట్‌కి వస్తే, మా వాళ్లను కూడా పరిచయం చేస్తాను. మా ఇంటికి మీరు తప్పక భోజనానికే రావాలి! సరదాగా అందరం కలిసి గడపొచ్చు! అప్పుడే.. అక్కడికక్కడే, మన విషయమై కూడా, మావాళ్ల ముందరే, ఒక నిర్ణయానికీ రావచ్చు!’’ అంటూ.. ఆత్మీయంగా ఇంటికి భోజనానికి ఆహ్వానించింది.

                                                                                                  ***

ఆ రోజు రాత్రి భోజనాల తర్వాత, కొడుకు కోడలికి ‘తోడు నీడ’ పరిచయ వేదికలో జరిగిన విషయాలన్నీ వివరించి, కమ్యూనిటీలోనే ఉన్న ఆనందరావు గురించి కూడా చెప్పి, ఆదివారం ఆ పెద్దమనిషిని వారికి పరిచయం చేసేందుకు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించినట్లు కూడా తెలియజేసింది.

ఆ ఆదివారం ప్రొద్దున్నే ఫోన్‌ ‌చేసి శుభోదయం చెప్పారు రావుగారు అమృతవల్లికి! ఆయన ఇంటికి వచ్చే సమయం నిర్ధారణ చేసుకుని విందు ఏర్పాట్లకు వంటింట్లో నిమగ్నమైంది. రావుగారు వస్తానన్న సమయం చెప్పి, ఇంట్లో వాళ్లను తయారుగా ఉండమని ఎలర్ట్ ‌చేసింది. తల్లి హడావిడికి కాస్త చిరాకుగానైనా, ముభావంగా ఆయన రాక కోసం ఎదురుచూస్తూ గడిపారా భార్యాభర్తలు.

సరిగ్గా చెప్పిన సమయానికి వచ్చి తలుపు తట్టారు రావుగారు. వివేక్‌ ‌తలుపు తీసి, నిండైన పెద్దమనిషిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు.

‘హలో! వివేక్‌! ‌నిన్నిలా కలవడం చాలా సంతోషం! మీ అమ్మగారు మీ విషయాలన్నీ చెప్పారు, మంచి స్థితిలో ఉన్నావని. నా కొడుకు తరుణ్‌ ‌వయసు వాడివే! నిన్ను చూస్తుంటే వాడే గుర్తుకొస్తున్నాడు! వాణ్ణి చూసి ఏళ్లు గడుస్తున్నాయి! వాళ్ల అమ్మ పోయినప్పుడు మూడేళ్ల క్రితం వచ్చాడు అమెరికా నుంచి. మళ్లీ రాలా! అంటే, ఏవేవో సాకులు చెపుతాడు’’అంటూ దూరంగా ఉన్న కొడుకును గుర్తుచేసుకున్నారు రావుగారు. ఆయన మాట్లాడే ఆప్యాయత ధోరణికి వివేక్‌కు కూడా, తన తండ్రి గుర్తుకు వచ్చాడు ఒక్క క్షణం! కాసేపు కుశల ప్రశ్నలు, ఆఫీసు కబుర్లతో ముచ్చటించాక, కాస్త చనువు ఏర్పడ్డాక…

‘‘చూడు వివేక్‌! ‌నా ఈ మాటలు శ్రద్దగా పూర్తిగా ఆలకించు. ప్రస్తుతం నేను, మీ అమ్మగారు ఒకే పరిస్థితిలో, ఎటూకాని వయసులో, మాట్లాడే తోడు లేక ఒంటరి జీవితాలు గడుపుతున్నాం! మీ దంపతులకా ఆఫీసులతో నిండా పని! పైగా.. వయసులో తరాల భేదం!, జీవన వ్యత్యాసం! మీ అమ్మగారిని చాలా రోజులుగా సాయంకాలాలు కింద పార్కులో ఒంటరిగా ఆలోచిస్తూ దిగులుగా ఉండడం చూస్తున్నాను. నా పరిస్థితి కూడా అంతే! లంకంత కొంపలో ఒంటరిగా కాలక్షేపం! ఆప్యాయంగా మాట్లాడే తోడులేక దిగులు! మీ అమ్మగారితో పరిచయంతో, మొన్న ‘తోడునీడ’ వేదికలో కలిసినప్పుడు ఇద్దరం వివరంగా మాట్లాడుకొన్నాం! మా సమస్యకు ఒకరికొకరం తోడైతే పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాం!

 ఇలా రావుగారు కొడుకుతో ముచ్చటిస్తుండగా, వంటింటిలోంచి పని తెముల్చుకుని అమృతవల్లి కోడలు సహా హాలులోకి వచ్చి, రావుగారికి నమస్కరిస్తూ, వారితో చేరారు.

రావుగారు అందరినీ పరికించి చూసి కొనసాగింపుగా

‘మరో విషయం! నా పిల్లలతో పాటు నిన్నూ సమంగా భావించి, నీకు తండ్రి సమానంగా అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటానని భరోసా ఇస్తాను! అలా అని.. నా బరువు బాధ్యతలేవి నీమీద మోపను సరికదా.. ఇక మీదట మీ అమ్మగారి పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. ఇదీ.. సూక్ష్మంగా నేను చేస్తున్న ప్రతిపాదన! ఈ విధంగా మన రెండు కుటుంబాలు కలిసి ఒక్కటవుతాము. మా ఇరువురి శేష జీవితాలలో వెలితి తీరినట్లవుతుంది! మాకీ ఒప్పందం ద్వారా, అనుక్షణం ఒకరికొకరం తోడునీడగా మెలిగే అవకాశం కలుగుతుందని మేమిద్దరం గట్టిగా నమ్ముతున్నాము. మీ అందరి సమ్మతి సహకారం కూడా ఉంటే, మా సహజీవనం సంతోషంగా సాగగలదని మా నమ్మకం! ఈ రోజు మీ సమ్మతి తెలుసుకున్న మీదట, వీలయినంత త్వరలోనే మా అమ్మాయి, అబ్బాయిని కూడా రమ్మంటాను. వాళ్లు కూడా వచ్చిన తర్వాత మనమందరం ఏకకుటుంబ సముదాయమవుదాం!’’ అని ముగించి, వివేక్‌ అభిప్రాయం కోసం ఎదురు చూసారు రావుగారు.

సుదీర్ఘమైన రావుగారి వివరణాత్మక భాషణ విన్నాక, వివేక్‌కు తల్లి పడుతున్న ఒంటరితనం ఆవేదన, కష్టం అర్థమయ్యాయి. ఇన్నాళ్లూ ఇలాంటి సమస్యకు ఇంత మంచి పరిష్కారం, అవకాశం ఉంటుందని ఊహించలేదు. తనను తీర్చిదిద్దడంలో తల్లి పాత్రను ఎరగనివాడు కాదు. అలాంటి తల్లి, ఒంటరితనం భరించలేక, విముక్తిని కోరుకుంటూ, తానే ఒక దారి ఎంచుకుంటే, ఎలా కాదనగలడు? పైగా ఒక సహృదయుడు తానై ఆ బాధ్యతను తీసుకుంటానని ముందుకొస్తే, కాదనేదేముంది?

వివేక్‌ ‌నిదానంగా మౌనం వీడి, ‘సరేనండీ! తండ్రిలాంటి మీరు ఇంత చెప్పిన తర్వాత, మాకు మాత్రం అమ్మ సంతోషం కంటే మించి, కోరుకునే దేముంది? అమ్మ, మీరు శేషజీవితాన్ని స్నేహితులుగా తోడునీడై సంతోషంగా గడపగలరని మీ మాటలతో నమ్మకం కుదిరింది! నేను మీ ఇద్దరి ఒప్పందాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ, మిమ్మల్ని మా కుటుంబంలోకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాను!’’ రావుగారికి వంగి నమస్కరించాడు వివేక్‌.

‌మాధురి కూడా, మరో మాట లేకుండా అంగీకారంగా, చిరునవ్వుతో అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసింది!

ఆపైన అందరూ కలిసి సరదా కబుర్లు చెప్పుకుంటూ అమృతవల్లి చేతివంట విందు భోజనం ఆరగించారు.

 చాలా కాలం తర్వాత సకుటుంబంగా, ఆనందంగా తృప్తిగా భోజనం చేసిన అనుభూతి కలిగింది అందరికి! ‘‘మనమిలాగే సందడిగా ఆప్యాయంగా ముందంతా గడపాలని ఆశగా ఉంది!’’ అంటూ.. ఆనందం వ్యక్త పరుస్తూ రావుగారు అప్పటికి సెలవు తీసుకున్నారు.

ఆ మరునాడే ఆనందరావు గారు అమెరికాలోని కొడుకుకి, ఢిల్లీలోని కూతురుకు ఫోన్లు చేసి, ‘‘అత్యంత అవసరంగా మాట్లాడవలసిన, సంప్రదించ వలసిన విషయాలున్నాయి’’ అని, పూర్తిగా విషయం విశదీ కరించకుండా, కుటుంబ సమేతంగా వీలయినంత తొందరగా, పది రోజులు ఉండేటట్లుగా రమ్మని హుకుం జారీ చేశారు.

తండ్రి ఇలా.. అత్యవసరంగా రమ్మనటానికి కారణం ఏమిటో ఊహించలేక, ఒంటరి తండ్రికి ఏమయ్యిందోనన్న ఆదుర్దాతో, అన్నాచెల్లెలు ఒకరినొకరు ఆదరాబాదరా సంప్రదించుకొని, కుటుంబాల సమేతంగా హైదరాబాదు చేరుకున్నారు. తండ్రి ఆరోగ్యంగా ఉండడం చూసిన తర్వాత, మనసు కుదుట పర్చుకున్నారు.

‘నాన్నా! మీరు ఈ హైదరాబాదు వదిలి రమ్మంటే రారు! కనీసం ఒక వంటమనిషినైనా కుదుర్చుకోక పోయారా?’’ అంటూ.. వాపోయింది కన్నకూతురు మీనాక్షి.

‘‘అవును మావగారు.. మీరే ఇలా ఒంటరిగా చేయి కాల్చుకోవటమెందుకూ? మీ అమ్మాయి చెప్పినట్లు ఎవరినైనా కుదుర్చుకోక పోయారా?’’ వంత పాడాడు అల్లుడు విశ్వనాథ•ం.

‘‘అవును నాన్నా! అమెరికా అయితే మా తిప్పలు మేము స్వయంగా పడక తప్పదు ఎంత దర్జా వెలగబెట్టినా! ఇక్కడ అది సమస్య కాదుగా?’’ వరస కలిపాడు.. పుత్రరత్నం తరుణ్‌.

‘నాకు.. వంట, తిండి, పెద్ద సమస్యలు కాదురా! ఇంతకాలం అందరితో సందడిగా గడిపినవాడిని! ఇంట్లో మాట్లాడే తోడు లేకుండా, ఒంటరిగా గడపటం ఒక్కటే, నాకున్న ఏకైక కష్టం’’ అని చెప్పి, అప్పటికి అందరిని సమాధానపరిచారు రావుగారు.

అన్నాచెల్లెళ్ల కళ్లు చెమర్చాయి. తల్లి ఉన్న రోజులు, వారి మనసుల్లో మెదిలి!

రెండు రోజుల తర్వాత అందరికి ప్రయాణ బడలికలు తీరాక, ఆ ఆదివారం కమ్యూనిటీలో పరిచయస్తులైన ఒక సన్నిహిత కుటుంబాన్ని, తమ ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు రావుగారు. తండ్రి వ్యవహార శైలి తెలిసిన వారందరూ, ‘ఎవరా కొత్త మిత్రులు’ అనుకొంటూనే, ఆరోజు కోసం ఆసక్తిగా ఎదురుచూడక తప్పలేదు.

ఆ ఆదివారం రావుగారు, మంచి హోటల్‌ ‌నుంచి విందుకు ఘనంగానే ఆర్డర్‌ ‌చేసి తెప్పించారు మొత్తం అన్నీ, వంటకై ఇంట్లోవాళ్ల నెవ్వరినీ కష్టపెట్టకుండా, శాంతిగా సావకాశంగా ఉండేందుకు వీలు కల్పిస్తూ!

అమృతవల్లి కుటుంబం ఇంటికి రాగానే, రావుగారు ఎదురేగి లోనికి తీసుకువచ్చి, తన కుటుంబ సభ్యులనందరిని పేరు పేరున పరిచయం చేశారు వారు ఆశీనులు అయిన తర్వాత, తన వాళ్ల వైపు తిరిగి, ‘‘మన కుటుంబంలోనివారి అందరి గురించిన వివరాలు ముందుగానే వారికి చెప్పాను. వచ్చిన అతిథుల గురించే మీకు నేను చెప్పాలి వివరంగా!’’ అంటూ మొదలు పెట్టారు

‘‘ఈవిడ పేరు అమృతవల్లి! నాకు కొన్నాళ్లుగా కింద పార్కులో పరిచయం! రోజూ సాయంత్రాలు ఒకే సమయంలో ఒంటరిగా చూస్తుండడంతో నెమ్మదిగా మా పరిచయం పెరిగింది! ఇద్దరం ఏకాకులం కావటంతో మాటామాట కలసి స్నేహాభావం కుదిరింది. ఆత్మీయంగా కొద్దిసేపయినా రోజూ కలుస్తూ ఉండడంతో మా మాటలు కలిసాయి! ఇద్దరికీ కూడా మాటలాడే తోడు లేనివారం కాబట్టి, ఒకరిపై ఒకరికి సానుభూతి స్నేహం పెరిగాయి’’.

‘‘ఈ మధ్యే ఒకనాడు.. ఇక్కడ సిటీలోని ‘తోడు నీడ’ అనే వయోజన పరిచయ వేదిక వద్ద, అనుకో కుండా తారసపడ్డాం. ముందే ఉన్న పరిచయంతో, అరమరికలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకొని, ఒక నిర్ణయానికి వచ్చాము. మీ అందరినీ ఇక్కడకు రప్పించడానికి ముందే ఒకనాడు అమృతవల్లి గారి ఇంట్లో ఈ విషయం చర్చించి వారి కుటుంబ సభ్యులతో కూడా ఒక అవగాహనకు వచ్చాను. ఆ తదుపరి పర్యవసానమే, మిమ్మల్ని ఫోన్లు చేసి, ఇక్కడకు పిలవడం, ఈ రోజు ఇక్కడ మన సమావేశ ముఖ్యోద్దేశం కూడా!

‘‘చూడండి! నేను మీ అందరికీ, ఒక్క విషయం తేటతెల్లం చెయ్యదల్చు కున్నాను! ఈ విషయంలో ఎలాంటి ఆస్తుల ఒడంబడికలు లేవు!మేం మీలో ఎవరిపైనా, సరికొత్తగా మోపబోయే బరువుబాధ్యతలు కూడా ఏమీ లేవు.

 మేమిద్దరం ఒంటరితనం నుంచి విముక్తికై కోరుకొంటున్న సరికొత్త శేషజీవితం! ఈ చర్యతో.. రెండు కుటుంబాలు కలసి, ఒక విస్తృత సకుటుంబ మయ్యే అవకాశం. మేమిద్దరం అందుకు సంసిద్ధులమై ఉన్నాం! మీరంతా మనస్ఫూర్తిగా పూర్తి అంగీకారం తెలుపుతారన్న విశ్వసిస్తున్నాం’’ అంటూ..తమ నిర్ణయాన్ని విస్పష్టంగా, నిర్మొహమాటంగా ప్రకటిం చారు రావుగారు.

తండ్రి సుదీర్ఘ వివరణను ఆకళింపు చేసుకున్న రావుగారి పిల్లలు, ఒంటరిగా ఉంటున్న తమ తండ్రి, ఒంటరితనం వల్ల అనుభవిస్తున్న మనోవేదనను అర్థ్ధం చేసుకుని, దూరంగా ఎక్కడో ఉంటున్న తాము చేసే ఉపశమనం మరేదీ లేదని గ్రహించి, ఆయన విజ్ఞతతో తీసుకున్న నిర్ణయానికి అభినందనల రూపంలో తెలియజేశారు.

తేలికపడిన వాతావరణంలో, రెండు కుటుంబాలు కలిసి, కలివిడిగా పరిచయాలు, కబుర్ల మధ్య విందు భోజనం ఆరగిస్తూ, సంతోషంగా ఆనందంగా గడిపారు.

ఆనందరావు గారి పిల్లలు ఉన్నంతకాలం ఇరు కుటుంబాల సభ్యులంతా, ఒకే చోట కలసి సరదా ముచ్చట్లతో, కులాసాగా కాలక్షేపం చేశారు సందడిగా పాత రోజులను నెమరువేసుకుంటూ!!

ఆ తర్వాతి రోజుల్లో, అమృతవల్లి ఆనందరావుల సహజీవనం.. పరిణతి చెందిన వారిరువురి మధ్య, ఎలాంటి ఒడుదొడుకులు, పొరపొచ్చాలు లేకుండా, సాఫీగా సాగింది. ఒకరినొకరు వొద్దికగా మన్నించు కొంటూ, ఎన్నడూ ఏకవచన సంబోధనలకు ఆస్కారం లేకుండా వ్యక్తిత్వాలను గౌరవించుకుంటున్నారు. వారు, బాల్కనీ ఊయలమంచం నుంచి వారి మొదటి సమాగమం పార్కు బెంచీని వీక్షిస్తూ, సాయం సమయాలు, సరదా ముచ్చట్లతో గడుపుతున్నారు హాయిగా!

About Author

By editor

Twitter
YOUTUBE