సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి కార్తిక బహుళ దశమి – 25 నవంబర్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలనా విభాగంలో తిష్ట వేసుకున్న హిందూయేతర ఉద్యోగుల పీడ ఎట్టకేలకు తొలగబోతున్నది. ఇది హిందువులకు శుభవార్తే. ఇలాంటి వారిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తామని నవంబర్‌ 18న టీటీడీ వెల్లడించింది. కొత్త పాలక మండలి చైర్మన్‌ బొల్లినేని రాజగోపాలనాయుడు అధ్యక్షతన నిర్వహించిన తొలి సమావేశంలో దీనితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వు పదార్థాలతో కలుషితమైందన్న ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత బోర్డు సమావేశం కావడం ఇదే మొదటిసారి. సమావేశం తరువాత కొత్త చైర్మన్‌ బోర్డు నిర్ణయాలను వెల్లడిరచారు. తిరుమల శ్రీవారి పరిపాలనా విభాగంలో ఎంతమంది హిందూయేతర ఉద్యోగులు ఉన్నారో త్వరలోనే వివరాలు సేకరించి వారిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తామని తేల్చి చెప్పారు. 2018లో సేకరించిన వివరాల ప్రకారం ఇతర మతాలకు చెందిన 44 మంది తిరుమల పరిపాలనా విభాగంలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. టీటీడీ ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. 6000 మంది శాశ్వతోద్యోగులు సహా, 22000. ఈ సిబ్బంది సేవలను సక్రమంగా వినియోగించుకోవడంలో బోర్డు సఫలం కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు చైర్మన్‌. ఇది సరైన మాట.

టీటీడీ పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ. కాబట్టి ఇందులో హిందూయేతరులు ఉద్యోగులుగా ఉండడం సరికాదని బోర్డు భావించిందని చైర్మన్‌ చెప్పడం సబబే. వీరి భవిష్యత్తు గురించి తగు నిర్ణయం తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. వీరికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కూడా కల్పిస్తున్నారు. అవన్నీ పాలనా పరమైన లేదా, మానవతా దృక్పథంతో తీసుకుంటున్న చర్యలే అయినా, టీటీడీలో హిందూయేతరులు ఉండడం ఏ విధంగాను సమర్ధనీయం కాదు. లడ్డులో వినియోగించిన నెయ్యిలో కొవ్వు పదార్థాల కల్తీ జరిగిందన్న ఆరోపణ నిజంగానే కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరిచింది. అందుకే లడ్డుతో పాటు, ఇతర అన్నప్రసాదాల నాణ్యతా ప్రమాణాల రక్షణకు ఒక సంఘాన్ని నియమించాలని కూడా బోర్డు సమావేశంలో తీర్మానించారు. నిత్యాన్నదాన పథకాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏ రాజకీయ పార్టీ అయినా తిరుమల కొండ మీద రాజకీయ ప్రకటనలు చేయడాన్ని కూడా బోర్డు నిషేధించాలని నిర్ణయించింది. మరొక మంచి, కీలక నిర్ణయం శ్రీవారి అన్ని నగదు నిల్వలను ప్రైవేటు బ్యాంకుల నుంచి జాతీయ బ్యాంకులకు బదలీ చేయబోతున్నారు.

స్వామివారి దర్శనానికి ఒక్కొక్క సందర్భంలో 20 నుంచి 30 గంటల వరకు సమయం తీసుకుంటూ ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఈ సమయాన్ని రెండు మూడు గంటలకు తగ్గించడానికి ఉన్న వీలు గురించి బోర్డు నిపుణులతో చర్చించాలని నిర్ణయించింది. శ్రీవాణి పథకాన్ని రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. బ్రేక్‌ దర్శనం పేరుతో భక్తుల నుంచి రూ. 10,000 వసూలు చేసి, ఆ నిధులను రాష్ట్రంలోని పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించాలని ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఆలోచించింది. ఈ పథకం కొనసాగుతుంది కానీ, అది వేరే రూపంలో ఉంటుంది. ఇంతవరకు శ్రీవాణి పథకం కింద వచ్చిన సొమ్మును టీటీడీ ఖాతాలో జమ చేస్తారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అలిపిరి వద్ద రాష్ట్ర పర్యాటక శాఖకు జరిగిన 20 ఎకరాల భూ కేటాయింపును, విశాఖ శారదా పీఠానికి చేసిన భూకేటాయింపును కూడా బోర్డు రద్దు చేసింది.

టీటీడీలో హిందూయేతరులను నియమించడమే తప్పిదం. హిందూ ధార్మిక సంస్థగా టీటీడీ నిలబడాలంటే హిందువులే ఉండాలి. అంతేకాదు, వారు ఆస్తికులు కావాలి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొత్త బోర్డు చేసిన ప్రతిపాదనలు కూడా స్వాగతించదగినవి. హిందూయేతరులు తిరుమలలో చొరబడడం వల్ల భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. ఇటీవలి కాలంలో టీటీడీ పని తీరు మీద, అక్కడి వ్యవహార సరళి మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణ వాటికి పరాకాష్ట. తిరుమలకు ఏడుకొండలు అవసరం లేదు, రెండు కొండలు చాలునన్న నికృష్ట నినాదం, శ్రీవారి ఆధ్యాత్మిక పత్రిక ‘సప్తగిరి’లో క్రైస్తవ ప్రచారం, రాధామనోహర్‌ దాస్‌ వంటి వారి మీద చేయి చేసుకోవడం, ఓ దేవస్థానం ఉద్యోగి, సంస్థ కారు మీద చర్చ్‌కు వెళ్లడం, పరకామణి చోటు మార్చడం, సూతకంలో ఉన్న ఉన్నతోద్యోగి విధులకు హాజరు కావడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచినవే. ఇందులో పరమత ఉద్యోగుల నిర్వాకాలు కొన్ని అయితే, పరమత ముఖ్యమంత్రి వీర విధేయ హిందువుల అపరాధాలు ఇంకొన్ని. నిజానికి ఇలాంటి దుర్గతిని ఎదుర్కొన్నది కేవలం టీటీడీ ఒక్కటే కాదు. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఇలాంటి అవకతవకలతో, అపచారాలతో బాధపడుతున్నాయి. వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. హిందూ పుణ్యక్షేత్రాలలో, జాతరలలో, ఉత్సవాలలో పరమత ప్రచారానికి తెగబడేవారిని కఠినంగా శిక్షించడం అవసరమే. హిందువుల ఇంట పిండివంటకాలను కూడా ప్రసాదం పేరిట నిరాకరించే సిలువ అభిమానులు తిరుమలలో ఎందుకు కాలు మోపాలి? స్వామివారి ఆదాయం నుంచి వేతనం ఎందుకు తీసుకోవాలి? ఏమైనా టీటీడీ తరహా నిర్ణయాలు అక్కడితో ఆగరాదు. ఇంతటితో అగవలసనవీ కాదు. తిలక ధారణ సహా, ఏ ఒక్క హిందూ మనోభావాన్ని గౌరవించడానికి సిద్ధంగా లేని ప్రభుత్వాలూ, అధికారులూ అక్కడ ఎందుకు?

About Author

By editor

Twitter
YOUTUBE