‘భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను’ అని సంకల్పం చెప్పుకునే సంప్రదాయం మనది. హిందూ జీవన విధానానికీ, పర్యావరణ పరిరక్షణకూ అవినాభావ సంబంధం ఉంది. నదినీ, అడవినీ, చెట్టునీ, పుట్టనీ అన్నిటిని కాపాడుకోమంటుంది మన ధర్మం. ఆ ధర్మంలో విఘ్నాధిపతిగా, తొలి పూజలు అందుకునే దైవంగా కొలిచే వినాయక వ్రతంతో ప్రకృతి కలుషితమయ్యే పరిస్థితులు తలెత్తడం కించిత్‌ బాధాకరమే. అందుకే పర్యావరణ హితమైన తీరులో వినాయక చవితి నిర్వహించుకోవలసిన అవసరం ఏటా పెరుగుతూనే ఉంది. హిందూ సమాజం ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. అటు సామాజి కంగాను, ఇటు కుటుంబ పరంగాను కూడా చేసుకునే పండుగ. కానీ కూడళ్లలో ప్రతిష్ఠించే ప్రతిమలకు, కుటుంబం చేసుకునే వ్రతం కోసం పెట్టుకునే ప్రతిమకు అలంకారం కోసం కొన్ని అవాంఛనీయ పదార్థాలు కలసిన వస్తువులను ఉపయోగిస్తున్నారు. అందులో మొదటి స్థానం ప్లాస్టిక్‌దే. థెర్మాకోల్‌, రసాయనాలు కలిపిన రంగులు పర్యావరణకు హాని చేస్తున్నాయి. భారీ విగ్రహాల తయారీలో కీలకంగా ఉండే ప్లాస్టిర్‌ ఆఫ్‌ పారిస్‌ నీటిని కలుషితం చేస్తూ, జలచరాల మీద దుష్ప్రభావం చూపుతోంది. అందుకే వీటి స్థానంలో కాగితం, గుడ్డ, పూలు, జనుము వంటి పదార్థాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం అవసరం. ఇక్కడే మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. గణేశ్‌పూజ, నిమజ్జనం ఇవన్నీ కలసి పర్యావరణ హితంగా ఉండాలని నిజంగా చెబుతున్నారా? లేదంటే ప్రతి హిందూ పండుగలోను వాతావరణ కాలుష్యాన్ని చూపుతూ మన ధర్మాన్నీ, జీవన విధానాన్నీ పెడతోవ పట్టించేవారు చెబుతున్నారా? అన్నది తప్పక పరిశీలన చేసుకోవాలి. వినాయక చవితి వ్రతం, నిమజ్జనం భారతీయమైన పర్యావరణ పరిరక్షణ దృష్టితో నిర్వహించాలి.

కాలం మారి ఉండవచ్చు. గ్రామాలలో సాధ్యమై నట్టు పట్టణాలలో, నగరాలలో ఆచార వ్యవహారాలను పాటించడం సాధ్యం కాదన్న ఒక వాదన ఉండవచ్చు. అలా అని ఒక ఆచారం లేదా సంప్రదాయం మూల స్వరూపాన్ని, స్ఫూర్తిని విస్మరించడం సరికాదు. అలాగే ఆ పండుగ మౌలిక ఉద్దేశాన్ని మరచిపోకూడదు. మన ప్రతి ఆచారానికీ, సంప్రదాయానికీ స్పష్టమైన శాస్త్రీయ పునాది ఉంది. పురాతన గ్రంథాలలో వాటి ప్రస్తావన ఉంది. వాటిని పరిశీలించవలసి ఉంటుంది. ఉదాహరణకి గణేశ్‌ విగ్రహం సిద్ధం చేసుకునే విధానం. మూడు రోజుల నుంచి 11 రోజుల పాటు ఉండే గణేశ్‌ ప్రతిమను తీర్చిదిద్దు కోవడం వెనుక పూర్తి శాస్త్రీయ దృక్పథం ఏర్పరిచారు. ఈ దృక్పథాన్ని అనుసరించినట్టయితే ఆధ్యాత్మికంగా కూడా పరిపూర్ణత సాధించవచ్చునంటారు పెద్దలు. కానీ ఇవాళ గణేశ్‌ విగ్రహాలను చూస్తే బాధ కలిగే రీతిలో రూపొందిస్తున్నారు. నిజమే, అంత కష్టపడి విగ్రహాలు రూపొందిస్తున్నారు. వాటిని ఎంతో ధనం పోసి ఉత్సవాల నిర్వాహకులు కొంటున్నారు. కానీ వాటిలో ధార్మికసూత్రాలు మృగ్యమై పోతున్నాయి. గణేశ్‌ విగ్రహ నిర్మాణంలో పాటించ వలసిన విధులు వదిలిపెట్టి, ఎవరి పైత్యం మేరకు వారు రూపొందిస్తున్నారన్నది చేదు నిజం. ఆ క్రమంలో క్రికెట్‌ ఆడే వినాయకుడు వంటి ఆకృతులు చూడవలసి వస్తున్నది. మన అభిరుచి వేరు. మన ధర్మం వేరు. అది చెప్పే సూత్రాలను ఉల్లంఘించడం ధర్మాన్ని గౌరవించడమో, ఆచరించడమో కాలేదు.

మట్టే మిన్న

వినాయకుని జననం ఒక రమణీయ గాథ. పార్వతి అమ్మవారు నలుగు పిండితో బొమ్మను చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. మన వినాయక వ్రత కల్పం మట్టి వినాయకుడిని చవితి పూజకోసం తీసుకోమని చెబుతుంది. లేదా రజతం, స్వర్ణం. సామర్థ్యాన్ని బట్టి, స్తోమతను బట్టి వాటితో ప్రతిమ చేసుకోమని సూచిస్తుంది. ధర్మశాస్త్రాలు కూడా ఇదే చెబుతున్నాయి. ధర్మసింధు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకోమని చెబుతుంది. స్మృతి కౌస్తుభ కూడా స్వర్ణం, రజతం, లేదా మట్టిని తీసుకుని ప్రతిమను తీర్చిదిద్దుకోమని సూచించింది. కాబట్టి మరే ఇతర పదార్థంతోటి గణేశుడి ప్రతిమ చేయడం ధర్మ విరుద్ధమనే అనాలి. మట్టి వినాయకుడిని నిర్మించుకోవడం, పూజించడం సర్వశ్రేష్టమన్నదే వీటన్నిటి భావం. మట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. మట్టి వినాయకుడిని కూడా మూసల ద్వారా రూపొందించడం సరికాదన్న వాదన ఉంది. అంటే దుకాణాలలో రెడీమేడ్‌ ప్రతిమ కొనడానికి ఉరకవద్దు. ఇంట్లో పిల్లల చేత ఈ బొమ్మ చేయించాలి. ఇప్పుడు పిల్లలతో మట్టితో రకరకాల ఆకృతులు చేయించే ఒక పద్ధతి ఎలాగూ వచ్చింది కూడా. పిల్లలు వినాయకుడిని రూపొందించడానికి మంచి ఇదొక మంచి ఆవకాశం. చిన్నారులే రూపొందిస్తే వినాయకుడి భావనతో వారు మమేకం కాగలరు.

ఇంట్లోగాని, సామాజికోత్సవాలలో గాని భారీ విగ్రహాలు పెట్టే ప్రయత్నం సరికాదన్నదే పెద్దల మాట. భారీ విగ్రహాలు అట్టహాసంగా నిమజ్జనం నిర్వహించే రీతులు 1980 దశకంలోనే వచ్చాయి. అంతకు ముందు ఏ ప్రతిమ అయినా ఐదు అడుగులకు మించేది కాదు. ఇప్పుడు 11,21,51 అడుగుల ప్రతిమలను కూడా తయారు చేయిస్తున్నారు. ఎప్పుడైతే భారీ విగ్రహాల పద్ధతి ప్రవేశించిందో అప్పుడే మట్టితో రూపొందించే పద్ధతి వెనుకపడిరది. కొందరు మట్టి విగ్రహం పేరుతో లోపల గడ్డి, ఆకులు పెట్టి పైన మట్టి మేగుతున్నారు. ఇది అపచారం కాదా! పెద్ద విగ్రహాల కోసం ఇనుపతీగలు, వెదురు ఉపయోగించవలసి ఉంటుంది. విగ్రహాలలో ఇలాంటి పదార్థాలు వాడడం సరికాదు. నిమజ్జనం తరువాత ఇనుపతీగల కోసం విగ్రహాల మీదకు ఎక్కి వాటిని పగలగొట్టడం వంటి పనులు మన కళ్లతో చూడవలసి రావడం బాధాకరమే.

మట్టితో చేసుకున్నా, తరువాత నిమజ్జనం చేసినా చవితి వినాయకుడి ప్రతిమకు కూడా ఒక శాస్త్రం ఉంది. ప్రముఖుల ఆకృతినో, మానవ ఆకృతినో వినాయకునిలో ప్రతిబింబింప చేయడం సరైన భక్తిమార్గం అనిపించుకోలేదు. పురాణాల వివరణ మేరకే, వర్ణనలను అనుసరించే వినాయకుడిని రూపొందించుకోవాలి. ఆధునికత పేరుతో కొన్నిచోట్ల వికారాలకు కూడా పోతున్నారు. దీనిని నివారించాలి. 1950లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు కూడా ఇవ్వవలసి వచ్చింది. వినాయకుడి మంటపం కాని, అందులో ఆయన ప్రతిమ కాని మన వినోదం కోసం కాదు. జనాన్ని విస్మయపరచడానికి కూడా కాదు. ఆధ్యాత్మిక విజ్ఞానం చెబుతున్న దాని ప్రకారం ప్రతి దేవతా విగ్రహానికి ఒక్కొక్క సూత్రం ఉంది. ఆ సూత్రం మేరకు దేవీదేవతల విగ్రహాలు రూపొందిస్తేనే మనం కోరుకుంటున్న ఆధ్యాత్మికతకు అర్థం ఉంటుంది.

ఏకదంతముపాస్మహే

గణపతి అంటే మనిషి శరీరం. ఏనుగు తల. గజాసురుని కథలో ఈ వివరం ఉంటుంది. గణేశుని ప్రతిమకు ఒకే దంతం ఉంటుంది. ప్రతిమను ఇలా రూపొందించడమే శాస్త్రీయమని అంటున్నారు పెద్దలు. అలాగే నాలుగు చేతులు ఉండాలి. చతుర్భుజుడన్నమాట. ఆ దంతం ఒక చేతిలో ఉంటుంది. మరొక చేయి వరముద్రలో ఉండాలి. అంటే ఆశీస్సులు అందించే చేయి. మిగిలిన రెండు చేతులలో గొడ్డలి, బంధం ఉంటాయి.

ఆసీనుడైన గణపతి

పూజ కోసం సిద్ధం చేసుకున్న గణేశుని ప్రతిమ ఆసీనుడైన భంగిమలో ఉండడమే సంప్రదాయం. ఇందుకు పెద్దలు చక్కని కారణం చెప్పారు. మనం విఘ్ననాయకుడిని మన ఇంటికి ఆహ్వానించి, ఆవాహన చేసుకున్నాం. ఒక అతిథిని, అందునా విఘ్ననాయకుడిని అతిథిగా ఆహ్వానిస్తే ఆయనను నిలబెట్టి ఉంచగలమా? కాబట్టి గణేశ ప్రతిమ ఆశీసునుడై ఉండే భంగిమలో ఉండడం ఉత్తమం. వివిధ ప్రాంతాలలో విస్తుగొలిపే విగ్రహాలు కూడా ఉంటాయని చదువుతాం. హిమాలయాలలో కొన్నిచోట్ల శిరస్సులేని వినాయకుని విగ్రహాలు ఉంటాయట. అంటే పార్వతి అమ్మవారు చేసిన నలుగుపిండి బొమ్మకు శివుడు తల తొలగించిన దృశ్యం గుర్తుకు వస్తుంది. ఎక్కువగా పద్మాసనస్థితిలో గణపతి విగ్రహాలు ఉంటాయి. అరుదుగా తాండవ గణపతి బొమ్మలు కనిపిస్తాయి. అయితే చాలా కొద్ది మాత్రమే నిలబడి ఉన్న వినాయకుని ప్రతిమలు చూస్తాం. వీటి సంఖ్యను కూడా తగ్గించడానికి మార్పు తీసుకురావాలి. ఇంట్లో పూజకోసం చేసిన విగ్రహం విషయంలో కాకున్నా, సామాజికోత్సవాలలో పెట్టే భారీ విగ్రహాలను తయారు చేయడానికి కళాకారులు కొన్ని నియమాలను పాటించాలని విగ్రహశాస్త్రం చెబుతుంది. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు అందులో ముఖ్యం. చెప్పులు ధరించరాదు. తాను బయటకు పంపుతున్న ఒక విగ్రహానికి వేలాది మంది పూజలు చేస్తారన్న స్పృహ కళాకారుడికి ఉండాలి. వృత్తే అయినా, దానినొక పవిత్ర కార్యంగా అతడు భావించవలసి ఉంటుంది. సాధారణంగా మట్టి రంగులోనే, అంటే ఏనుగు చర్మం రంగులోనే మనం వినాయకుడిని చూస్తాం. కానీ హరిద్రగణపతి, ఊర్ధ్వగణపతి పసుపు రంగులో ఉంటారు. పింగళ గణపతి పచ్చరంగులోను, లక్ష్మీగణపతి శ్వేతవర్ణం లోను దర్శనమిస్తారు.

వినాయక ప్రతిమలలో అందిరినీ ఆకర్షించేది తొండం. ఆ తొండం కుడివైపు చూస్తే ఒక పేరుతోను, ఎడమవైపు చూసే తొండం ఉంటే వేరొక పేరుతోను వినాయకుడిని పిలుస్తారు. తొండం కుడివైపు వంపు తిరిగితే దక్షిణముఖమూర్తి లేదా దక్షిణాభిముఖిమూర్తి అంటారు. దక్షిణ అంటే కుడివైపునకు చూపిస్తుంది. దక్షిణ దిశ యమలోకాన్ని సూచిస్తుంది. కుడి దిక్కు సూర్యనాడిని కూడా చూపుతుంది. అందుకే కుడిదిశకు తొండం తిరిగి ఉన్న వినాయకుడిని జాగృత్‌ అని కూడా అంటారు. అటు యముడు, ఇటు సూర్యుడిని కూడా ఇది సూచిస్తుంది. తొండం ఎడమవైపునకు తిరిగి ఉంటే వామముఖి శ్రీగణపతి అంటారు. అంటే చంద్రనాడిని చూపుతుంది. అంటే ప్రశాంతత. ప్రధానంగా తొండం ఎడమవైపు తిరిగి ఉంటే ప్రతిమలనే పూజలో ఉంచుతారు.

ఇంట్లో వినాయక ప్రతిమను చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. లేదంటే, చక్కని ప్రతిమను తెచ్చుకుందామనుకుంటే మీ గ్రామంలో లేదా మీకు దగ్గరలో ఉండే ఒక కుంభా కారుని ఇంటికి వెళ్లి ఆయన దగ్గర నుంచి ఒక మట్టి బొమ్మను తెచ్చుకోండి. పూజకు వాడే పసుపు, కుంకమ, పత్తి అన్నీ దేశీయమైనవే, అంటే సేంద్రియ ఉత్పత్తులు అయి ఉండేలా జాగ్రత్త పడదాం. పల్లె ప్రాంతాలలో నివసించేవారు రైతుల దగ్గర కొనుగోలు చేసి పట్టణాలలో, నగరాలలో ఉన్న బంధువులకి, ఇతర కుటుంబ సభ్యులకి పంపే ప్రయత్నం చేయడం ఇంకా ఉత్తమం. మన మట్టితో వినాయకుడిని చేసుకుందాం. మన ప్రతి పండుగ మనవైన ఉత్పత్తుల తోనే జరుపుకుందాం. విదేశీ దిగుమతులను పరిహ రిద్దాం. ప్లాస్టిక్‌, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వంటి పదార్థాలను దేవుళ్లకు, పూజలకు దూరంగా ఉంచుదాం. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ బొమ్మలు, వాటికి పూసే రంగులు ఆకర్షణీయంగానే ఉంటాయి. అందులో కళాత్మకత ఉంది. కానీ అది పర్యావరణకు చేటు.

నిజానికి మట్టి వినాయకుళ్ల ఆరాధన చాలాచోట్ల మొదలయిందనే అనాలి. పలువురు నాయకులు, సంస్థలు కూడా మట్టి ప్రతిమలను ప్రజలకు అందించే పనిని ఏటా చేపడుతున్నారు. కర్ణాటక ఈ విషయంలో ఆదర్శంగా నిలిచిందని కొన్ని వార్తలను బట్టి అర్ధమవు తుంది. అక్కడ కళాకారులు కృత్రిమ రంగులు వేయని మట్టి వినాయక ప్రతిమలనే చేయడం ప్రారంభిం చారు. కొన్ని ప్రభుత్వేతర సంస్థలు మట్టి విగ్రహాల వినియోగంపై కార్యశాలలను కూడా నిర్వహిస్తు న్నాయి. ఎంఐఎస్‌ ఇంటర్నేషన్‌ స్కూల్‌ 2022లో పర్యావరణహిత వినాయకుల తయారీకి పోటీయే నిర్వహించింది. మట్టి, ఫైబర్‌, కాగితం తదితర పర్యావరణ హిత పదార్థాలతో విద్యార్థుల చేత ప్రతిమలు చేయించారు. పౌర సమాజమే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ప్రతిమలను బహిష్కరించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ చేసే చేటును దృష్టిలో ఉంచుకుని ఆ పదార్థంతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిం చడం బెంగళూరు నగర పాలక సంస్థ నిషేధించింది కూడా. మంచి ఆచారం ఇలా పెడతోవకు వెళ్లినప్పుడు కఠినచర్యలు తప్పవు. తమకు మట్టి ప్రతిమలు చేస్తే కలిగే తృప్తి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ బొమ్మలు చేస్తే కలగదని కొందరు వయసులో పెద్దవారైన కళాకారులు స్పష్టంగా చెబుతున్నారు.

 అసలు ప్లాస్టిక్‌ వాడకుండా వినాయక చవితితో పాటు ప్రతి హిందూ పండుగ చేసుకుందాం. గణేశ్‌ నిమజ్జనం పేరుతో కొన్ని అవాంఛనీయ పోకడలు ప్రవేశించిన వాస్తవాన్ని సహృదయతతో అర్ధం చేసుకుని వాటిని నిలిపివేద్దాం. మనకు ధర్మ రక్షణ ఎంత ముఖ్యమో, ఆచార సంప్రదాయాలను ఆచరించడం ఎంత ప్రధానమో పర్యావరణను రక్షించుకోవడం అంతే ముఖ్యం. ఈ మాట ఎందుకు చెప్పవలసిన వస్తున్నది? మహారాష్ట్ర గణేశ్‌ ఉత్సవాలకు ప్రసిద్ధి. భారతీయ సమాజాన్ని చైతన్య పరిచినవిగా, హిందువులలో ఐక్యత తెచ్చినవిగా వీటికి చరిత్ర ఉంది. అయినా పర్యావరణ విషయం వచ్చేసరికి కొన్ని నిబంధనలను మనం గౌరవించాలి. ఏటా ఆ ఒక్క రాష్ట్రంలోనే 150 మిలియన్‌ గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అంచనా. నదులలో, సముద్రంలో, సరస్సులలో వాటిని నిమజ్జనం చేస్తారు. వాటిలో ఎక్కువ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసినవే. ఇవి నెలల తరబడి ఉండి పోతాయి. అవన్నీ రంగులు వేసినవే. ఆ రంగుల నిండా రసాయనాలు. లెడ్‌, నికిల్‌, కాడిమియమ్‌, మెర్క్యురి వంటి లోహాలు కూడా కలుస్తాయి. మట్టి వినాయకుడి ప్రాధాన్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలలో ప్రజలలో చైతన్యం తేవడానికి ఆగస్ట్‌ 22న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష మట్టి ప్రతిమలను, 32 జిల్లాలలో 64,000 ప్రతిమలను తెలంగాణ స్టేట్‌ పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు పంచిపెడుతుందని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. హిందూధర్మం లోకకల్యాణాన్ని కాంక్షిస్తుంది. ప్రతి జీవి ఉనికిని గుర్తిస్తుంది. అలాంటిది మన సంప్రదాయంలో భాగంగా చేసుకునే ఏ పండుగ అయినా లోకకల్యాణం అనే పంథాను అతిక్రమించ కూడదు. పర్యావరణానికి కాస్త కూడా హాని చేయకూడదు. ఆ దృష్టితోనే పండుగలు జరుపుకుందాం. అది విఘ్నాధిపతి వ్రతంతో ఆరంభిద్దాం కాబట్టి సహజ రంగులు వేసిన మట్టి వినాయకుడిని ఇంటికి తెచ్చుకుందాం. సాధ్యమైనంత చిన్న ప్రతిమను ప్రతిష్టించుకుందాం. పండుగ పేరుతో పర్యావరణ కాలుష్యమే కాకుండా, శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిద్దాం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE