డాక్టర్‌ మన్నవ గంగాధరప్రసాద్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌

1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి తక్షణ కారణం ఒకటి ఉంది. సిపాయిలు (ఆంగ్లేయుల సైన్యంలో భారతీయులని అలా అనేవారు) ఉపయోగించవలసిన తూటాలకు కొవ్వు పూసారన్న ఒక్క మాట ఈస్టిండియా కంపెనీని నేలమట్టం చేసిన చరిత్రాత్మక సంగ్రామానికి దారి తీసింది. తూటాల మీద పందికొవ్వు పూత అన్న మాట ముస్లింలను, ఆవు కొవ్వు పూసారన్న మాట హిందువులను అంత తీవ్ర తిరుగుబాటుకు ప్రేరేపించింది. అది ఇరుమతాల వారి మనోభావాలను అంత లోతుగా గాయపరిచింది. అయితే హిందువుల మనోభావాలను నేడు కూడా అదే స్థాయిలో, అంతే దారుణంగా గాయపరిచిన ఘటన జరిగింది. అది కూడా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో జరగడం మరింత కలచివేసింది. ఇంతకు ముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం, టీటీడీ పాలకులు శ్రీవారి లడ్డులో ‘బీఫ్‌ టాలో’ ఉపయోగించారని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించడం సంచలనం సృష్టించింది. సెప్టెంబర్‌ 18వ తేదీన ప్రకటించిన ఈ అంశం హిందువుల పాలిట శరాఘాతమే. బీఫ్‌ టాలో, లేర్డ్‌ అనే పదార్థాలు పంది కొవ్వు నుంచి వచ్చేవే. అంతేకాదు, ఆవు నెయ్యి పేరుతో వచ్చిన పదార్థంలో చేపనూనె కలిసింది.

YS Jagan Fails to Thwart CBN's Management of That System? | cinejosh.comఇంతకు ముందు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హయాంలో శ్రీవారి లడ్డులో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన ఎన్‌డీడీబీ కాఫ్‌ లిమిటెడ్‌ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. లడ్డూల తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని ఆ సంస్థ నివేదిక చెబుతున్నది. నెయ్యిలో కల్తీ జరిగిందని, పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (ఫారిన్‌ ఫ్యాట్స్‌) ఉపయోగించారని నివేదిక తెలియచేసింది. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక అనుమానం వచ్చి లడ్డూ నాణ్యతా ప్రమాణాల మీద  వచ్చి పరీక్షల కోసం నమూనాలను ఎన్‌డీడీబీ కాఫ్‌కు పంపించారు. దీనికి కొన్ని మినహాయింపులు ఉండ వచ్చునని ఆ సంస్థ పేర్కొన్నప్పటికీ, వైఎస్‌ఆర్‌ సీపీ హయాంలో జరిగిన కొన్ని చర్యలను, బట్టి అధికారులు ఇష్టారాజ్యంగా చేసిన పనులను బట్టి ప్రసాదాల పవిత్రత దెబ్బ తినే అవకాశం కచ్చితంగా ఉన్నట్టే అంతా భావించవలసి వస్తున్నది. అందుకే దేశమంతా గగ్గోలు మొదలయింది. అయోధ్య సాధుసంతుల నుంచి, రమణ దీక్షితులు, రంగరాజన్‌, తిరుమల అవకతవకలమీద చిరకాలంగా పోరాడుతున్న రాధామనోహర్‌ దాస్‌ వంటివారంతా భగ్గుమంటున్నారు. విశ్వహిందూ పరిషత్‌, అయోధ్య అర్చక స్వాములు ఇంకా ఎందరో ఈ దురాగతం మీద నోరు విప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నివేదిక కోరింది. నాణ్యమైన ముడి సరుకులు వాడకపోవడం ఒకటి, పవిత్రతకు భంగం వాటిల్లే పదార్థాలు వినియోగించడం మరొకటి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే ఆ దుస్థితినుంచి తిరుమలను తమ ప్రభుత్వం ఇప్పటికే తప్పించిందని, నాణ్యతా ప్రమాణాలను తిరిగి ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. ఈ అంశాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజకీయ విమర్శగానే పరిగణిస్తూ, వెంటనే ఖండిరచారు. చంద్రబాబు రాజకీయలబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు. దుర్గ గుడిలో రథం సింహాలను ఎత్తుకుపోతే ఏమిటి? ఆంజనేయుడి విగ్రహం చేయి విరిగితే ఏమైంది? అంతర్వేది రథం దహనమైతే ఏం కొంప మునిగింది? ఇంకొకటి తయారు చేయిస్తాం వంటి సమాధానాలే ఇప్పుడు కూడా వైఎస్‌ఆర్‌ సీపీ గణాలనుంచి రావడం అత్యంత శోచనీయం.

వైఎస్‌ జగన్మోహనరెడ్డి పాలనలో హిందూ వ్యతిరేక చర్యలు చాలా జరిగినప్పటికీ, ఈ స్థాయిలో నీచత్వానికి పాల్పడతారని మాత్రం ఊహించలేదని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ విమర్శించారు.

శ్రీవారి లడ్డు వివాదం క్షణాలలో సుప్రీంకోర్టుకు చేరింది. ఆ వివాదం మీద దర్యాప్తునకు ఆదే శించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలైంది. ఈ చర్యతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఒక న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ఆరోపించారు. ఇది హిందువుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అంశం కూడానని ఆయన విశ్లేషిం చారు.

శేషాద్రివాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. కోట్లాది భక్తుల ఆరాధ్య మూర్తి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సేవలు, ఉత్సవాలు, ప్రసాదాలు హిందూ భక్తుల మనోభావా లకు అనుగుణంగా సంప్రదాయ రీతిలో, ఆగమ నిబంధనల మేరకు కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా తిరుమల ఆలయానికి సంబంధించిన అనేక అంశాలు భక్తులకు ఆవేదన కలిగిస్తున్నాయి. మనోభావాలను గాయ పరుస్తూనే ఉన్నాయి. కొండపై జరుగుతున్న ఆచార వ్యవహారాల నిర్వహణ లోపాలు వెలుగులోకి వచ్చి సమాజంలో కలకలం సృష్టిస్తున్నాయి. అటువంటిదే తాజాగా తిరుపతి లడ్డు తయారీలో వినియోగించే ఆవు నెయ్యి ప్రామాణికంగా లేదని, లోప భూయిష్టమైన నెయ్యి వినియోగిస్తున్నారన్న అంశం విశ్వవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల ప్రసాదాలలో చోటు చేసుకున్న సంప్రదాయ విరుద్ధ విధానాన్ని ప్రస్తావించడంతో దీని తీవ్రత మరింత పెరిగింది.

చరిత్ర

తిరుమల ఆలయానికి సంబంధించి సాధారణ శకం 666లో, 965`1801 మధ్య 1300 దాకా శాసనాలను ఆలయ గోపురాళ్లపైన, గోడల పైన, రాగి రేకుల పైన గుర్తించారు. అయితే ఎక్కడ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా పేర్కొంటున్న ఈ లడ్డు, ప్రసాదంగా మొదలైనది ఎప్పుడు అనే విషయం అధికారికంగా లభించడం లేదు. కొన్ని ఆధారాలు దొరికినా వాటి మీద లోతైన పరిశోధన జరగలేదనే అనుకోవాలి. సాధారణ శకం 1193లో అప్పటి తిరుపతి ప్రాంత పాలకుడు వీరరాక్షస యాదవరాయలు వేయించిన శాసనంలో శ్రీవారికి వినియోగించే నైవేద్యాలలో నెయ్యి వినియోగించాలనే నిబంధన విధించాడు.

ఎన్టీ రామారావు మొదటిసారి(1983) ముఖ్య మంత్రి పదవి చేపట్టిన తర్వాత తిరుమల ఆలయంలో భారీ ఎత్తున సంస్కరణలు మొదలయ్యాయి అప్పటికి నెలకొన్న మిరాశి వ్యవస్థను ఆయన రద్దు చేశారు. అప్పటి వరకు ఈ లడ్డు సహా ప్రసాదాలు ఇతర నైవేద్యాల తయారీని ఆలయానికి చెందిన మిరాశి కుటుంబాల శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ బాధ్యత శ్రీవారి ఆలయ నిర్వహణ అధికారి, పాలకమండలి చూసుకుంటూ ఉంది. వంటశాల(పోటు)లో తయారీ మాత్రమే శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు నిర్వహిస్తున్నారు.

ఇది ఇలాఉండగా, శ్రీవారికి సమర్పించిన లడ్డులలో వినియోగించిన నెయ్యిలో జంతు సంబంధ నూనెలు కలిశాయంటూ గత వారం వార్తలు వెలువడ్డాయి. వెంటనే దీనిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహనరెడ్డి ఖండిరచారు. అదే సమయంలో ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఈవో గా బాధ్యతలు చేపట్టిన జె.శ్యామలరావు కూడా మీడియా సమావేశంలో తిరుపతి లడ్డూల వివాదానికి సంబంధించిన అంశాలను ప్రపంచానికి వివరిం చారు. దీనితో ఈ అంశం రాజకీయంగానే కాక, హిందూ ధార్మిక సమస్యగా కూడా ప్రాధాన్యం సంత రించుకుంది. కల్తీ నెయ్యితో, జంతువుల కొవ్వు పదార్థాలతో లడ్డు తయారయ్యిందన్న విషయం దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. కేంద్ర ప్రభుత్వం మొదలుకొని, అనేకమంది రాజకీయ ప్రముఖులు, స్వాములు, మఠాధిపతులు, సామాన్య ప్రజలు, భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారికి జరిగిన అపచారాన్ని సరిదిద్దాలని, అందుకు కారణ మైన వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేశారు.

వివాదానికి మూలం

తిరుమల ఆలయంలోనూ, రాష్ట్రంలోని ఆలయాలలో వినియోగించే పదార్థాలను నాణ్యమైన విధానంలో పారదర్శకంగా కొనుగోలు చేయడానికి 2019కి ముందు ప్రభుత్వం జీవో 418 ద్వారా విధి విధానాలను నిర్దేశించింది. 2019లో ప్రభుత్వం మారడంతో తిరుమలలో అమలవుతున్న విధానాలు కూడా రద్దయ్యాయి. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో అప్పటి టీటీడీ అధికారులు కొనుగోళ్లకు సంబంధించి అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అంతవరకు కర్ణాటక సహకార పాడి రైతుల నిర్వహణలోని నందిని మార్కు నెయ్యి వినియోగాన్ని నిలిపివేసి, తమిళనాడుకు చెందిన ఒక కంపెనీకి తక్కువ ధరకు ఆవు నెయ్యి కొనడానికి కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల కాలంలో తిరుమలలో భక్తులకు అందజేస్తున్న ప్రసాదాలలో నాణ్యత లోపించిందని, ముఖ్యంగా లడ్డు నాణ్యత దారుణంగా పడి పోయిందని, ఉచిత మధ్యాహ్న భోజనంలో కూడా లోపం జరుగుతోందని, నాణ్యమైన భోజనం అందజేయడం లేదని పలువురు భక్తులు పలుమార్లు మీడియా ముందు అభిప్రాయపడ్డారు. నందిని నెయ్యిని నిలుపుదల చేసి తక్కువ ధరకు బయట వారినుంచి కొనడానికి టీటీడీ నిర్ణయించిన సమయంలో అంత తక్కువ ధరకు నాణ్యమైన ఆవు నెయ్యిని ఎవరు అందివ్వలేరని, నాణ్యతలేని పదార్థా లను టీటీడీ కొనడానికి నిశ్చయించుకున్నట్లు తెలు స్తోందని అప్పటి నందిని నెయ్యి తయారీదారుల సంఘం అధ్యక్షులు ప్రకటించారు. ఈ అంశాన్ని నాటి పాలకులు పెడచెవిన పెట్టారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బంధువు ధర్మారెడ్డి టీటీడీ కార్యనిర్వహణాధికారిగా, తిరుపతి శాసనసభ్యుడు కరుణాకర్‌ రెడ్డి పాలకమండలి అధ్యక్షులుగా ఉండగా గత మార్చి 13వ తేదీన నెయ్యి కొనడానికి దేవస్థానం టెండర్లను పిలిచింది. కిలో ఆవు నెయ్యి రూ.320లకు కొనడానికి అంగీకరిం చింది. మే 8 వ తేదీన టెండర్లను ఖరారు చేసింది. అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ నెయ్యి సరఫరా చేస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో జె. శ్యామలరావు జూన్‌ మొదటి వారంలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలువురు భక్తులతో ముచ్చటించిన సమయంలో ప్రసాదాలలోనూ, లడ్డు నాణ్యతలోను లోపాలు ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీనితో ప్రసాదాలు, భోజన పదార్థాలలోని ముడి సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఇలా ఉండగా జూలై ఆరవ తేదీన రెండు ట్యాంకర్లు, 12వ తేదీన రెండు టాంకర్ల నెయ్యి తిరుమలకు చేరగా, వాటి నాణ్యతను పరీక్షించడం కోసం ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ఎన్‌డీబీ ల్యాబ్‌కు నమూనాలను పంపించారు. నెయ్యిలో కల్తీ పదార్థాలను గుర్తించినట్టు గత జూలై 16 వ తేదీన నివేదిక అందింది. దాంతో టీటీడీ ఆ నాలుగు ట్యాంకర్ల ఆవు నెయ్యిని తిప్పి పంపించే సింది. అంతేకాకుండా 22వ తేదీన ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను బ్లాక్‌ లిస్టులో చేర్చింది. ఈ వివాదం తర్వాత కొన్ని ప్రైవేటు సంస్థల నుంచి నాణ్యమైన నేతిని కొనుగోలు చేస్తున్న టీటీడీ, 2024 -25 సంవత్సరానికి గాను 350 మెట్రిక్‌ టన్నుల నందిని నెయ్యిని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. వీరికి కిలో రూ.478 చెల్లించడానికి అంగీకారం కుదిరింది.

 లడ్డూలు మాత్రమే కాదు

తిరుమలలో సాధారణంగా రోజుకు మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తారు. ఇది కాక అనేక రకాల ప్రసాదాలలోనూ, నైవేద్యాలలోనూ నెయ్యిని విరివిగా వినియోగిస్తారు. ఇందుకు సుమారు రోజుకు 11 వేల కిలోల నెయ్యి అవసరమవుతుంది. స్వామి వారి నివేదనకు రోజూ పదుల సంఖ్యలో ప్రసాదాలు తయారవుతాయి. ఆయా ఆర్జిత సేవలు చేయించు కున్న భక్తులకు దోసెలు, అప్పాలు, జిలేబి, పొంగలి, పులిహోర, దద్ధ్యోజనం వంటి అనేక ప్రసాదాలను అందజేస్తారు. వీటిలో కూడా నెయ్యి విరివిగా వినియోగిస్తారు. అలాగే స్వామివారి గర్భాలయంలో జరిగే దీపారాధనలో కూడా నేతిని వాడుతారు. అఖండ దీపం ఆవునేతితోనే వెలిగిస్తారు.

శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డూలలో వినియోగించే నేతిలో జంతు అవశేషాలతో తయారైన నూనెలో కల్తీ జరిగిందన్న వివాదం నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమయ్యింది. అనేక జాగ్రత్తలను తీసుకోవడం మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి శ్రీవారి ఆలయంలోని ప్రధాన అర్చకుల బృందం, ఆగమ సలహాదారులతో కూడా దేవస్థానం ఈవో తదితర అధికారులు సమావేశం అయ్యారు. సెప్టెంబరు 23 ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ ఆలయంలోని విమానప్రాకారం వద్ద శాంతి హోమం నిర్వహించారు. పంచగవ్య ప్రోక్షణ చేయించారు.

తిరుమల ఆలయంలో వినియోగిస్తున్న కల్తీ నేతికి సంబంధించిన ల్యాబ్‌ టెస్టింగ్‌ రిపోర్టులను దేవస్థానం ఈవో శ్యామలరావు పత్రికలకు విడుదల చేశారు. పాత టెండర్‌ ప్రకారం కొనుగోలు చేసిన నేతిని పరిశీలించినప్పుడు లభించిన సమాచారం, తాజాగా వినియోగిస్తున్న నేతిని పరిశీలించినప్పుడు వెలువడిన వివరాలను ఎక్స్‌ వేదికగా దేవస్థానం బహిర్గత పరిచింది. జూన్‌ మాసం తరువాత అత్యంత ప్రామాణికమైన విధానంలో సేకరించిన ఆవు నేతిని మాత్రమే దేవస్థానం వినియోగిస్తున్నందున భక్తులు చింతించవలసిన అవసరం లేదని వివరణ ఇచ్చింది. అలాగే గత పాలకమండలి సేంద్రియ పదార్థాల పేరుతో కొనుగోలు చేసిన ఆహార పదార్థాలను వినియోగించకుండా ఉచిత భోజన పథకంలో కూడా నాణ్యమైన కూరగాయలు, బియ్యం, పాలు వంటివి నిబంధనల మేరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రసాదాలు, నైవేద్యాలు ఉచిత భోజనం, లడ్డులలో దేనిలోనూ నాణ్యత విషయంలో రాజీపడడం లేదని దేవస్థానం ప్రకటించింది.

ఈ కల్తీ పదార్థాల వినియోగంపై అటు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ అంశంపై స్థానిక నేతలతో మాట్లాడారు. మరో ఇద్దరు కేంద్రమంత్రులు కూడా ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ పదార్థాల వినియోగానికి సంబంధించిన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించాలని వాదనకు మద్దతు పలికారు. గత పాలకమండలి అధ్యక్షుడు, కార్యనిర్వహణ అధికారిపై కేసును నమోదు చేయాలని, పైస్థాయి వ్యక్తుల నుంచి సామాన్య భక్తుల వరకు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి అపచారం మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రతిభక్తుడు ఆశిస్తున్నాడు.

సిట్‌తో దర్యాప్తు

తిరుమల ఆలయంలో జరిగిన వివాదాస్పద నేయి, ముడిపదార్ధాల వినయోగం పై దోషులను గుర్తించడానికి ఐజి స్థాయి అధికారి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్త బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రసాదాల పదార్థాలలో కల్తీ నివారణకు దేవస్థానం తీవ్ర చర్యలకు ఆదేశిం చింది. ఈ ఏడాది కర్ణాటకలోని నందిని సంస్థ నుంచి కొనుగోలు చేయవలసిన నేతిని రవాణా చేసే వాహనాలకు అత్యాధునికమైన ఎలక్ట్రానిక్‌ లాకింగ్‌ సిస్టం జీపీఎస్‌ సిస్టం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మార్గమధ్యంలో కల్తీ జరగడానికి వీలు లేకుండా గట్టి చర్యలను చేపట్టింది.

ఎందుకు ఆందోళన ?

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గత పాలకుల చర్యలపై అనేక వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడంతోపాటు ఫిర్యాదులు రావడం మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే టీటీడీలో కూడా గత ఐదేళ్లలో అనేక అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీనితో దేవస్థానం వ్యవహారాల పైన అధ్యయనం చేయ వలసిందిగా ప్రభుత్వం ఈవోని ఆదేశించింది. ఆయన విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. అయితే ఈ విజిలెన్స్‌ విచారణ జరగకుండా నిలుపుదల చేయాలని గత పాలకమండలి సారథులు విఫల ప్రయత్నం చేశారు. చివరకు రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో కేసు వేసి విజిలెన్స్‌ విచారణను అడ్డుకోవాలని అప్పటి పాలకమండలి అధ్యక్షులు, ఆనాటి ముఖ్యమంత్రి సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. వీటన్నిటికంటే అర్హత లేకపోయినప్పటికీ దొడ్డిదారిలో దేవస్థానం ఈవోగా పదవి చేపట్టిన ధర్మారెడ్డి నిర్ణయాలపై గత ఐదేళ్లలో అనేకమంది అనేక సందర్భాలలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం అయినా నాటి పాలకులు పెడచెవినబెట్టారు. సరిదిద్దే చర్యలేవీ చేపట్టలేదు. ధర్మారెడ్డి కుమారుడు  వివాహం జరగడానికి కొన్నిరోజుల ముందు అనుమానాస్పదంగా మరణించారు. ఆ సూతకంలోనే ధర్మారెడ్డి కొండపై విధులకు హాజరయ్యారు. గుడిలోకి వెళ్లారు. దీనిపైనా వ్యతిరేకత వ్యక్తమైనా ఎవరూ పట్టించుకోలేదు.

2019లో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తిరుమల ఆలయానికి సంబంధించి అనేకమైన వివాదాలు చోటుచేసు కున్నాయి. శ్రీవారి బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం రుణంత తీసుకోవాలనుకోవడం, శ్రీవారి నిధులను వారికి ఇష్టమైన ప్రైవేటు బ్యాంకులకు తరలించి అక్కడ వారి నుంచి ప్రభుత్వానికి రణాలు తీసుకోవాలని అనుకోవడం, తిరుమల బస్సు టికెట్లపై ఏసుక్రీస్తుకు సంబంధించిన సమాచారం ముద్రణ, ఏకంగా టీటీడీ వెబ్‌ సైట్‌లో ఏసయ్య ప్రత్యక్షం కావడం వివాదాలలో కొన్ని. ఈ హిందూ ధర్మ వ్యతిరేక చర్యలు ప్రజలను తీవ్రంగా కలచి వేసాయి.

ఇంత జరిగినా…!

తిరుమల ఆలయానికి సంబంధించి ఆచార వ్యవహారాలను రోజువారీ విధానంలో పర్యవేక్షించ డానికి జీయర్‌ వ్యవస్థ అనాదిగా ఉంది. తిరుమల లోనే ఉండే పెద్ద జీయర్‌, చిన్నజీయర్‌ తదితర స్వాములు ఆలయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలలో రోజు పాల్గొంటూ ఉంటారు. అలాగే శ్రీవారి అర్చకులకు సంబంధించిన పెద్ద బృందమే తిరుమలలో ఉంటుంది. వీరిలో రమణ దీక్షితులు (పూర్వ ప్రధానార్చకుడు), ప్రస్తుతం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షీతులు తదితరుల పర్యవేక్షణ ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో జరుగుతున్న విపరీత పోకడలను ఈ జీయర్‌ వ్యవస్థగాని, ఆలయానికి సంబంధించిన ఆగమ సలహామండలిలోని పెద్దలు గాని ప్రశ్నించక పోవడమే విచారకరం. వీరంతా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఎందుకు అధికారుల మాటలకు మడుగులొత్తుతున్నారు? ఏ కారణంగా తిరుమలలో అర్చకస్వాములు, జీయర్‌ స్వాములు, వేద పండితులు, ఆగమ సలహాదారులు, పాలక మండలి తీసుకునే తీవ్ర చర్యలను నివారించలేకపోతున్నారో తెలియరావడం లేదు.


మూడు వందల ఏళ్ల చరిత్రకు కళంకం

శ్రీవారి లడ్డు లేదా తిరుపతి లడ్డుకు ఘన చరిత్ర ఉంది. ఈ అద్భుత ప్రసాదం లేని తిరుమల తిరుపతి యాత్ర, ఏడుకొండలవాడి దర్శనం అనూహ్యమే. యావన్మంది భక్తులు లడ్డూ ప్రసాదం తమ వరకే కాకుండా, స్వస్థలంలో బంధుమిత్రులకు ఇవ్వడం కూడా ఆచారంగా వస్తున్నది. అప్పుడే తిరుమల యాత్ర, దర్శనం పూర్తి తృప్తిని ఇస్తాయి. అందుతున్న చరిత్ర ప్రకారం శ్రీవారి లడ్డును భక్తులకు అందించే ఆచారం 1715లో ఆరంభమైంది. అంటే మూడు వందల ఏళ్ల చరిత్ర. ఈ కాలమంతా ఒకే పరిమాణంలో లడ్డు లేకపోవచ్చు. ఆ ప్రసాదం పట్ల భక్తిప్రపత్తులు మాత్రం అలాగే ఉన్నాయి. లడ్డుకు జియోగ్రఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌ ఉంది. కాబట్టి ఈ ప్రసాదం తయారీకి ఒక్క తిరుమలకే పరిమితం. శ్రీవారి లడ్డు గుబాళింపు ఏడుకొండలకే కాదు, తెలుగు ప్రాంతాలకే కాదు, ఆఖరికి భారతదేశానికే పరిమితం కాదు. అది ప్రపంచ దేశాలకు తెలిసిన గుబాళింపు. విశ్వవ్యాప్తమైన రుచి. తోమాల వడ, శర్కర పొంగలి, దధ్యోజనం, జిలేబీ వంటి ఇతర ప్రసాదాలు కూడా తిరుమలలో ఉన్నా, అటు స్వామివారికి ఇష్టమైనదీ, ఇటు అత్యధికంగా భక్తకోటి ఆస్వాదించేది లడ్డుయే. ఏడుకొండలు చేరి, గంటల తరబడి స్వామివారి దర్శనానికి వేచి ఉండే క్రమంలో ఏర్పడిన నలత లడ్డు ప్రసాదంతో మటుమాయం అవుతుందని భక్తుల విశ్వాసం.

నిత్యం 3.5 లక్షల లడ్డులు సిద్ధమవుతాయి. ఒక్క లడ్డు ధర రూ.50. ఏటా కోట్లలో లడ్డూలు తయారవు తాయి. అంతా శ్రమ విభజనతో సాగుతుంది. కల్యాణం లడ్డు (ఒకప్పుడు 720 గ్రాములు, ఇప్పుడు బహుశా 700 గ్రాములు), చిన్న లడ్డు (178 గ్రాములు ఇప్పుడు 174 గ్రాములు)అని రెండు రకాలు. వీటి నుంచి వచ్చే వార్షిక ఆదాయమే రూ. 500 కోట్లు. అంటే లడ్డూ ప్రసాదం ఒక సామ్రా జ్యమే. ఈ సామ్రాజ్య నిర్మాత కల్యాణం అయ్యంగార్‌ అంటారు. లడ్డూ తయారీకోసం ఏటా టీటీడీ ఐదు లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తుంది. ఇందుకు ఆరు మాసాలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు. గడచిన ఒకటిన్నర దశాబ్దంపాటు నెయ్యిని సరఫరా చేసిన కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ నుంచి సంవత్సరం క్రితం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కొనుగోలు ఆపేసింది. ప్రసాదాల కోసం వినియోగిస్తున్న ఆవు నెయ్యి నాణ్యమైనది కాదని కొన్నేళ్ల క్రితమే తాను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని వేంకటేశ్వర స్వామి అర్చకులు రమణ దీక్షితులు లడ్డూ వివాదం నేపథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు.


కావాలనే మనోభావాలను దెబ్బతీశారు : వీహెచ్‌పీ

అత్యంత పవిత్రమైనది, అందరికీ ఆదరణీయ మైన తీర్థస్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానంలో భక్తులకు పంచుతున్న లడ్డు ప్రసాదాలలో అపవిత్ర పదార్థాలను కలిపారని నివేదిక రావడంతో పూర్తి హిందూ సమాజం ఆగ్రహంతో, ఆక్రోశంతో ఉంది. హిందువుల మనోభావాలను కావాలనే దెబ్బతీశారు. ఇప్పుడే కాదు, ప్రతీసారి హిందువుల మనోభావాలను గాయపరుస్తూనే ఉన్నారు. ఇక హిందూ సమాజం సహించదు.

తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం అత్యంత హేయం. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేస్తున్నది. ఏ వ్యక్తి లేదా అధికారి ఇటువంటి క్రియకు పాల్పడుతున్నాడో లేదా బాధ్యత వహిస్తున్నాడో అటువంటి వ్యక్తి మీద చర్యను తీసుకొని కఠిన శిక్ష విధించాలని వీహెచ్‌పీ కోరుతున్నది.

హిందూ దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉండకూడదనీ, సమాజం ద్వారా నడవాలనీ విశ్వహిందూ పరిషత్‌ చాలాకాలంగా చెబుతున్నది.

మందిరాలపై ప్రభుత్వ ఆధిపత్యం వల్ల రాజకీయం ప్రవేశిస్తుంది, హిందూయేతరులు ఉద్యోగస్థులుగా చేరడం వల్ల ఇటువంటి అపవిత్రత మందిరాలలో చోటు చేసుకుంటుంది. ఈ వాస్తవానికి తిరుపతి ఘటన మరింత బలం చేకూరుస్తున్నది.

హిందూ పుణ్యక్షేత్రాలన్నింటినీ ప్రభుత్వ అజమాయిషీ నుంచి తొలగించి సమాజానికి అప్పజెప్పాలని విశ్వహిందూపరిషత్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నది. హిందువుల మనోభావాలను దెబ్బ తీయరాదని, తీర్థస్థలాల పవిత్రతను కాపాడాలని ఆశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై చర్య తీసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, హిందువుల తీర్థ స్థలాల పవిత్రతను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నది.

– బజ్రంగ్‌లాల్‌ బాగ్డా, సెక్రటరీ జనరల్‌, విశ్వహిందూ పరిషత్‌, ఢిల్లీ


మిగిలిన గుడుల మాటేమిటి?

తిరుమల లడ్డును భక్తులు సాక్షాత్తు స్వామివారి వరప్రసాదంగా భావిస్తారు. అటువంటి తిరుమల తిరుపతి స్వామివారి పవిత్ర లడ్డు ప్రసాదం విషయంలో (జంతువుల కొవ్వు కలవడం) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రకటన హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది.

గత ప్రభుత్వం స్వామివారి లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో చేసిన నూనెలు వాడారని సభాముఖంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇది హిందువుల మనసులను కలిచివేస్తోంది. ముఖ్యమంత్రిగారు ఇలాంటి ప్రకటన చేసినారంటే వారివద్ద కచ్చితమైన ఆధారాలు ఉంటాయని విశ్వహిందూపరిషత్‌ భావిస్తోంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవ, అవాస్తవాలు హిందూ సమాజం ముందు ఉంచాలి. అలా కాని పక్షంలో తమ రాజకీయ క్రీడలకు హిందువుల పవిత్ర ఆలయాలను ఉపయోగించుకుని అపచారం చేసినట్లే అవుతుందని విశ్వహిందూపరిషత్‌ హెచ్చరిస్తోంది.

ముఖ్యమంత్రిగారు ప్రకటించినట్లు జంతువుల కొవ్వుతో చేసిన నూనెలు తిరుమల లడ్డులో వాడినది నిజమని తేలితే రాష్ట్రంలోని మిగిలిన ప్రముఖ దేవాలయాల ప్రసాదం విషయంలో కూడా ఏమి జరిగిందో దర్యాప్తుచేయాలని విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేస్తున్నది.

ముఖ్యమంత్రి చెప్పినట్లు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంతటి దుర్మార్గమైన, దైవద్రోహం జరిగి ఉంటే దానికి బాధ్యులు అయినవారు ఎంతటి వారైనా ప్రతీ ఒక్కరు శిక్షార్హులే అని విశ్వహిందూ పరిషత్‌ తెలియజేస్తున్నది.

ప్రభుత్వం వెంటన్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటుచేసి అత్యంత వేగంగా దర్యాప్తును పూర్తి చేసి నిందితులు ఎంతటివారైనా వారిని శిక్షించాలని, హిందువుల మనోభావాలను కాపాడాలని విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేస్తున్నది.

– తనికెళ్ల సత్యరవికుమార్‌, విశ్వహిందూపరిషత్‌ కార్యదర్శి, ఉత్తరాంధ్ర


సమగ్ర విచారణ జరపాలి: ప్రహ్లాద్‌ జోషి

శ్రీవారి లడ్డులో కల్తీ వాస్తవమని గుజరాత్‌ సంస్థ వెల్లడిరచిన దృష్ట్యా దీని మీద దర్యాప్తు చేయించాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వెల్లడిరచిన అంశాలు చాలా తీవ్రమైనవని, వాటి మీద దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. జోషి ఈ అంశాన్ని ప్రపంచ ఆహార క్రమబద్ధీకరణ అంశం మీద జరుగుతున్న గోష్టి నుంచి వెల్లడిరచడం విశేషం.


‘సిట్‌’ దర్యాప్తు అవసరం: బీజేపీ

శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ పదార్థాలు, జంతువుల కొవ్వు ఉన్న పదార్థాలు వాడడం తీవ్ర అపచారమనీ, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఈ అంశాల మీద ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జి. భానుప్రకాశ్‌రెడ్డి కోరారు. తిరుపతి పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎల్‌. సుబ్బారాయుడికి ఆయన ఇచ్చిన ఫిర్యాదులో ఈ అంశం పేర్కొన్నారు. తిరుమల పవిత్రకు భంగం కలిగించిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


క్షమార్హం కాదు: అయోధ్య అర్చకులు

శ్రీవారి లడ్డు తయారీలో ఇలాంటి అకృత్యాలకు పాల్పడినవారు, ‘తీవ్ర నేరం చేశారనీ, దేశద్రోహమని’ అయోధ్య ప్రధాన అర్చకుడు అచార్య సత్యేంద్రదాస్‌ వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర నేరపూరిత చర్యగా పరిగణించాలని ఆయన అన్నారు. తిరుపతి లడ్డుకు ఎంతో ప్రశస్తి, పవిత్ర ఉన్నాయని అలాంటి ప్రసాదం విషయంలో ఇంతటి దుశ్చర్యకు పాల్పడడం క్షమార్హం కాదని అన్నారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని చెప్పారు.


పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష

ఇంతకు ముందు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షను సెప్టెంబర్‌ 22న ఆరంభించారు. ఆఖరికి అయోధ్యకు కూడా కల్తీ పదార్థాలతో చేసిన లడ్డూ ప్రసాదాన్నే నాటి టీటీడీ బోర్డు పంపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో 219 ఆలయాలు ధ్వంసమైనాయని చెప్పారు.అంతకుముందు ఇలాంటి దుర్ఘటన చర్చిలో లేదా మసీదులో జరిగితే జగన్‌ ఇదేతీరులో స్పందించగలరా? అని ప్రశ్నించారు పవన్‌. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డ్‌ ఏర్పాటు చేయవలసిన సమయం వచ్చిందని పవన్‌ పిలుపునిచ్చారు. లడ్డూ వివాదం నేపథ్యంలో ట్విటర్‌ (ఎక్స్‌)లో ఆయన ఈ సూచన చేశారు. ఆ బోర్డు దేశంలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని ఆయన కోరారు. సనాతన ధర్మానికి ఎలాంటి హాని జరిగినా నిరోధించడానికి మనమంతా ఏకం కావలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. టీటీడీ జరిగిన అవకతవకలు తనను కలచివేశాయని చెప్పారు.


కర్ణాటక ప్రసాదాలకు పరీక్ష

శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విశిష్ట నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో పంపిణీ చేస్తున్న ప్రసాదాలను పరీక్ష చేయించనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి సెప్టెంబర్‌ 21న తెలియచేశారు. కర్ణాటకలో 34,000 దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నాయి. ఇందులో 205 ఆలయాలు ఏ గ్రేడ్‌గా విభజించారు. వీటి వార్షిక ఆదాయం రూ. 25 లక్షలు. బి తరగతిలో 193 దేవాలయాలు ఉన్నాయి. వీటి వార్షిక ఆదాయం రూ 5లక్షల నుంచి రూ. 25 లక్షలు. మిగిలినవన్నీ సి తరగతిలోకి వస్తాయి. ఇవన్నీ రూ. 5 లక్షల లోపు ఆదాయం వచ్చే గుడులు. ఇందులో ప్రతి దేవాలయం పూజ తరువాత భక్తులకు ప్రసాదం అందిస్తుంది. రాష్ట్రంలోని దేవాలయాల ప్రసాదం మీద ఫిర్యాదు ఏమీ లేకున్నా, భక్తులకు సందేహాలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలియచేశారు.  కర్ణాటక దేవాలయాలలో పంచుతున్న ప్రసాదాలను పరీక్ష చేయించవలసిందిగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సూచించారు కూడా.  ప్రసాదాల తయారీలో కర్ణాటక పాల సంఘాల సమాఖ్య నుంచి నందిని నెయ్యినే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE