ఇద్దరు రచయిత్రులను ఇప్పుడు మనం గుర్తు చేసుకుని తీరాలి.
ఒకరు – గోవిందరాజు సీతాదేవి. మరొకరు – శివరాజు సుబ్బలక్ష్మి.
ఇద్దరి పేర్లలోనూ ‘రాజు’. రచనా వ్యాసంగాన ఉభయులూ మహారాణులే! అప్పట్లో వారి ప్రతీ రచనా అంతగా వెలిగింది.
ఎన్నెన్నో కథలు రాశారు. నవలలు రచించారు.
పొందిన పురస్కారాలు, అందుకున్న సత్కారాలు లెక్కకు మిక్కిలి.
సెప్టెంబరు అనగానే ఇద్దరూ మనోనేత్రాల ముందు నిలుస్తారు. మనో యవనిక మీద ప్రత్యక్షమవుతారు. ‘చదువరులారా! బహుపరాక్’ అని కలం హెచ్చరికలు జారీచేసింది ఈ నెలలోనే.
ప్రత్యేకించి వీరు చూపు సారించింది పాఠకుల మీదనే. ‘ఏది చదవాలో నిర్ణయించుకో వాల్సింది మీరే! మీ ఆ నిశ్చయానికి వెన్నుదన్ను సంప్రదాయ, ఆధునికతలను జోడించిన రచయిత్రులే’ అనేలా వ్యవహరించారిద్దరూ.
మరింత వివరంగా గుర్తు చేసుకుందాం.
అమ్మ, గోరంత దీపం, జీవన సంగీతం… ఈ శీర్షికల్లో సంప్రదాయతత్వం ప్రతిఫలిస్తుంది. ఈ కాలపు పిల్లలు ఇంతే, కొత్త బంధం, చట్టాన్ని గౌరవించాలని తెలుసు కానీ… ఈ పేర్లున్న రచనల్లో ఆధునికత ధ్వనిస్తుంది.
‘తాతయ్య గర్ల్‌ఫ్రెండ్’.. నవలలో అత్యాధునికత పరిమళిస్తుంది. ఇవన్నీ గోవిందరాజు సీతాదేవి సృష్టి.
తెలుగునాట కృష్ణాజిల్లా ప్రాంతం తన స్వస్థలం. అస్తమయం దశాబ్దం కిందట హైదరాబాద్‌లో, దాదాపు 82 వసంతాల జీవితకాలం.
మూడొందలు దాకా కథలు, ఇరవైకి పైగా నవలలు రాశారన్న సమాచారం ఉన్నప్పటికీ; వాస్తవ సంఖ్య అంతకుమించే ఉంటుంది. ఎందుకంటే, ప్రచురితం కావాల్సిన రచనలూ ఇంకా అనేకం ఉన్నాయి కాబట్టి.
‘అంతరాత్మ’ అని ప్రచురిత కథ ఒకటుంది. పైకి చూస్తే – ఆధ్యాత్మిక, తాత్విక, మానసిక రీతిగా అనిపిస్తుంది. కానీ-లోలోపల మాత్రం దాంపత్య బంధమే కీలక ఇతివృత్తం.
‘నాకో చిన్న ఉద్యోగం కావాలి జలజా! నీ దగ్గర ఉండి ఈ ఊళ్లో ఎక్కడన్నా ప్రయత్నిస్తాను. నాకు ఉద్యోగమనేది చాలా అవసరం’ అంటుంది మిత్రురాలు. అటు తర్వాత పరిణామాలు ఎంత వేగంగా మారాయన్నదే ఉత్కంఠ. కథనం, శైలిపరంగా మచ్చుకు…
మానవ జీవితం క్షణభంగురం. ఇది తెలుసుకోవడం ప్రతివారికీ అవసరం. అంతరాత్మను చంపేసుకోకుండా బతకం ఇంకా అవసరం!
ఇలా సులువైన మాటలతో, అర్థమయ్యే భావాలతో సాగిపోతాయి సీతాదేవి రచనలన్నీ.
‘చెల్లీ! రైలెక్క కమ్మా!!’ ఇది మరో కథ. దీని ఎత్తుగడ ఎంత చదివించేలా ఉందో చూడండి.
కుటుంబరావు కుంటి పడక కుర్చీలో కూర్చుని కళ్లజోడు సరిచేసుకుంటూ ఇంటాయన జాలి తలచి ఇచ్చిన దినపత్రికని ఆత్రంగా చదవబోతూ… తల తిప్పి చూడకుండానే… ‘నిన్నే ఓసారి ఇలా తగలడు’ అన్నాడు.
ఈ తొలి వాక్యంతోనే కుటుంబరావు నైజమేమిటో చదువరికి తెలిసిపోతుంది.
‘ఏమిటా గావుకేకలు, నేను డన్‌లప్ పరుపుమీద నిద్దరోతున్నానా’ అంటూ వచ్చింది భార్య లక్ష్మీ నర్సు. ఆవిడ ప్రతీ మాటా-భర్త అడ్డదారుల్లో డబ్బు సంపా దించలేని ‘చవట’ అనే ధ్వనితో వినిపిస్తుంటుంది.
ఈ విధంగా ప్రతీ వాక్యాన్నీ పదాన్నీ సందర్భశుద్ధితో రాయడమే సీతాదేవి ప్రత్యేకత.
ఆకట్టుకునే ధోరణి ఇంతగా ఉంటే, పాఠకులు చివరిదాకా చదవకుండా ఎలా ఉంటారు?
ఇంతకీ ఎవరా చెల్లి? రైలెక్క వద్దని అనడంలో ఉద్దేశమేమిటి? వీటన్నింటినీ తెలుసుకునేందుకు ఎంతో ఉత్సుకత చూపుతారు చదువరులు (ఈ కథ ప్రచురితమై ఇప్పటికి సరిగ్గా అర్ధశతాబ్ది).
థ్రిల్ అనే ఆంగ్ల శీర్షికతో ఆధునిక కథను రాశారామె. ఇది 1983 నాటి మాట. ఇందులో సంభాషణ ఎలా ఉందంటే….
‘అవును! నా మనవడే దొంగతనం చేశాడు. దొరలా పెంచుతున్నా ఆ పని చేశాడు. ఎందుకూ? తల్లిదండ్రుల ఆత్మీయత కరువైందా? లేదు. దరిద్రమా కాదు. తన అవసరాలు తీరకనా? అదీ కాదు. అజ్ఞానమా? అది కూడా కాదేమో. మరెందుకు? ఎందుకు చేశాడు దొంగతనం? వాడి మాటల్లోనే చెప్పాలంటే….?
ఈ రకంగా కొనసాగుతుంది కథన విధాన మంతా.
‘దేవుడు బతికాడు, రానిక నీ కోసం, ఆశల వల’ వంటి రచనలూ గోవిందరాజు సీతాదేవి కలం బలాన్ని చాటి చెప్తున్నాయి. అవును మరి. తాను యద్దనపూడి సులోచనారాణి సోదరీమణి.
జీవనజ్యోతిని వెలిగించే చమురు… డబ్బు కాదు. అనురాగ ధార అంటారు ఒకచోట. కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన బంధాన్ని అంత బాగా విశద పరిచారు.
2014 సెప్టెంబరు 11న ఆమె వెళ్లిపోయారు. తన రచనలతో ఇప్పటికీ మనతోనే ఉన్నారు. పాఠకులను తనతో పురోగమింపచేసిన మేటి సీతాదేవి.
రాయడంతోపాటు చిత్రాలు గీయడంలోనూ సాటిలేని వనిత శివరాజు సుబ్బలక్ష్మి. పుట్టింది సెప్టెంబరు 17న. సాహితీవేత్త బుచ్చిబాబుతో వివాహం.
గృహలక్ష్మి స్వర్ణకంకణం, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, నాటి ఆంధప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కృతి ఆమెను ఏరికోరి వరించాయి.’
తన కథల సంకలనాల్లో ప్రధానంగా చెప్పాల్సింది ‘కావ్యసుందరి’ గురించే. అదృష్టరేఖ నవలతోనూ సుప్రసిద్ధులయ్యారు.
అన్నట్లు… ఇది ఆమె శతజయంతి వసంత సందర్భం. తెలుగువారి భాగ్యం. బెంగళూరులో ఉండటంతో, కన్నడవాసుల అభిమాన భాగ్యాన్నీ అందుకున్నారు.
‘తీర్పు, మగత జీవిత చివరిచూపు, ఒడ్డుకు చేరిన ఒంటి కెరటం, మనోవ్యాధికి మందుంది, నీలంగేటు అయ్యగారు…’ ఇంకా ఎన్నెన్నో వెలయిం చారు ఆమె. ఎందరెందరో ప్రసిద్ధుల ప్రస్తావనలూ చేశారు. జ్ఞాపకాలన్నింటినీ పంచి పెట్టారు. తన ఇంటిని సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దుకున్నారు.
ఎనిమిదన్నర దశాబ్దాల వయసులోనూ పరంపరగా రాస్తూ వచ్చారు. ప్రచురణకు పంపింది మాత్రం కొన్నింటినే!
ఉత్సాహానికి చిరునామాలా ఉండేవారు. రాసినా, బొమ్మలు వేసినా తనదైన ముద్రనే కొనసాగించారు. అచ్చమైన భావసంపద. అమ్మాయిల అంతరంగ మథనానికి అక్షర రూపమిచ్చారు.
‘మట్టిగోడల మధ్య గడ్డిపోచ’ మరో రచన. కాలం వేసిన ఎగుడు దిగుడు బండలమీద జీవితం సాగుతోంది వంటి వర్ణలు చేశారు.
తొమ్మిదిన్నర దశాబ్దాల వయసులో ‘తరలివెళ్లిన’ భ•ర్త బుచ్చిబాబు జ్ఞాపకాలనూ పాఠక లోకానికి అందించారు. సంస్కృతం, ఆంగ్లం, ఇతర భాషా సాహిత్యాలను ఆయన నుంచే పుష్కలంగా అంది పుచ్చుకున్నారు.
వృద్ధాప్య సమస్యల గురించి అంతకుముందు ఎవరో ప్రస్తావిస్తే ‘వయసు అనేది గణాంకం మాత్రమే. ఉండాల్సింది మనసు, అందులో శక్తి’ అంటూ భావస్ఫూర్తితో బదులిచ్చారు సుబ్బలక్ష్మి.
ప్రకృతిని, మానవ ప్రకృతిని ఇష్టంతో అధ్యయనం చేశారామె. బుచ్చిబాబుతో కలిసి చిత్రించిన వందలాది వర్ణచిత్రాలను పుస్తకంగా రూపొందించి చదువరులకు, రసహృదయులకు సమర్పించారు.
మరుగుపడిన ఆత్మీయత, మూతపడని కన్ను వంటి శీర్షికలు ఆమె పరిశీల నాసక్తి, పరిశోధనా శక్తిని చాటి• చెప్తాయి.
‘అప్పట్లో ఇప్పట్లా మనుషుల్ని డబ్బుతో విలువ కట్టేవారు కాదు, సామాన్యులను కూడా ఆప్యాయంగా ఆదరించే మంచి మనసులు. తన ఘనతను మరచి మరీ దరికి చేర్చుకునేవారు.’
నిత్యసత్యాలే కదా ఈ అన్నీ!
మూడు దశాబ్దాల కాలంలో తెలుగునాట కలిగిన పరిణామాలన్నింటినీ జ్ఞాపకాలుగా వెల్లడించారామె. ఆ పరామర్శనే పుస్తకరూపంగా చూడవచ్చు మనం.
ఏ అంశాన్నయినా అక్షరబద్ధం చేయటం ఆమె నుంచే నేర్చుకోవాలి. సాటివారి వ్యక్తిత్వాలను ఎంతో తెలివిగా అంచనావేసేవారు. అక్షరీకరించేవారు కూడా.
కాలం మారింది. మారుతోంది. మారుతూనే ఉంటుంది. మనస్తత్వాలు మారాయా, మారుతు న్నాయా, మారతాయా? ఈ ప్రశ్నలకు జవాబులనీ ఆమె ఇచ్చారు.
ఎందరెందరో సాహితీమూర్తులు వారి ఇంటిని దర్శించేవారు. ఆ జ్ఞాపకాలన్నింటినీ అక్షరబద్ధం చేశారు సుబ్బలక్ష్మి. ఆ తీరూ తెన్నూ చదువరులను అలరిస్తూనే ఉంది.
క్రియాపరత్వం, సృజనశీలతకు తాను మారు పేరు. తాత్వికత ఉన్నప్పటికీ, అంతకుమించిన ఆచరణాత్మకత, సాహిత్య, చిత్రలేఖనలతో పాటు సంగీతంలోనూ అభినివేశం ఉండేది.
మరో విలక్షణత-శివరాజు సుబ్బలక్ష్మిలోని పఠన శీలత. విస్తృతంగా చదివారు. విస్తారంగా ఆలోచనలు సాగించారు.
పాత్రల పరిశీలనతో ఆరితేరారు. విస్పష్ట అభిప్రాయాలకు పట్టం కట్టారు. ఎంత వైవిధ్యం ఉండాలో అంతటి వైవిధ్యాన్నీ తన రచనల్లో ప్రతిఫలింప చేశారు.
నక్షత్రం తాను వెలుగుతుంది. ఆ వెలుగునే చుట్టూతా విస్తరింపచేస్తుంది. దంపతులూ అదే విధంగా ఉండాలి. ఆ జాడలతోనే జీవితాలు పరి పూర్ణమవుతాయి. సుబ్బలక్ష్మి దంపతులే ఉదాహరణలు.
ఆమె అనుభవాలు సుదీర్ఘాలు. జ్ఞాపకాలు అసంఖ్యాకం. వాటన్నింటినీ పుస్తకంగా తేవడం సాహసమే. ఆ సాహసిక ప్రవృత్తితోనే ముందు నిలిచారామె.
పల్లెల పంట పొలాలు, నగరాల ఆకాశభవనాలు. ఆ అంతరాలనీ తరచి చూడగలిగారు. చూసినవాటిని రాశారు. రాసినవాటిని పుస్తక రూపానికి తెచ్చారు. అందుకే ఆ జ్ఞాపకాలు, వ్యాపకాలు ఈనాటికీ పాఠక ప్రపంచాన్ని ఆకర్షితం చేస్తున్నాయి.
కళకోసమే పుట్టి, కళతోనే పెరిగి, ఆ కళనే జీవితంగా మలుచుకున్న ప్రతిభాశాలిని తాను.
అందువల్లనే-సాహితీ కళామూర్తులైన సీతాదేవిని, సుబ్బలక్ష్మిని గుర్తు చేసుకోవాలి. చదువరులు ఏం చదవాలో, జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలో, వాటివల్ల ఫలితమేమిటో నిర్దేశించారు ఆ ఇద్దరూ! రచనల రాణులు.
-జంధ్యాల శరత్‌బాబు