ఈశాన్య భారతం ప్రాంతం కొండా, కోనా బ్రిటిష్ వ్యతిరేక పోరాటం కూడా చేసినవే. కానీ నిన్న మొన్నటివరకు వారికి భారతదేశం అంటే వేరే దేశమేనన్న భావన ఉంది. ఈశాన్య భారతమంటే, ఈ దేశంలో భాగం కాదనే పరిస్థితికి వేర్పాటువాదులు, క్రైస్తవ మిషనరీలు, వామపక్ష తీవ్రవాదులు ఈశాన్య భారత వాసులను తయారు చేశారు. కానీ మూలాలను నిర్మూలించడం సాధ్యం కాదు. రక్తపాతంతో సాగుతున్న వేర్పాటువాదాన్ని, అందుకు సహకరిస్తున్న విద్రోహ పూరిత వాతావరణాన్ని భారతీయ చింతనతో ఓడిరచింది విశ్వహిందూ పరిషత్. ఈ రోజున అక్కడ కాషాయ ధ్వజాన్ని ఎగురవేసినటువంటి ఘనత విశ్వహిందూ పరిషత్‌కు దక్కింది. విశ్వహిందూ పరిషత్ కావచ్చు, వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, రామకృష్ణమిషన్ కావచ్చు` ఇవన్నీ ఈ రోజున ఈశాన్య భారతాన్ని రక్షించి, మన భారతావనిని ఒకే ఖండంగా ఉంచే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ప్రేరణదాయకమైన ఆ వాస్తవాలను విహెచ్‌పి అఖిల భారతీయ సంయుక్త కార్యదర్శిగా 2023 వరకు పనిచేసి, ప్రస్తుతం అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులుగా బాధ్యత నిర్వహిస్తున్న వై. రాఘవులు చక్కగా చెప్పారు. 59 సంవత్సరాలుగా ధర్మానికీ, దేశానికీ సేవచేస్తూ పునీతమైన జీవితం వారిది. ఇది ఒక వీహెచ్‌పీ కార్యకర్త సాధించిన అద్భుత విజయం. ఆ కార్యకర్త సాగించిన ప్రయాణం. శిలువెక్కిన ఈశాన్య భారతం వేర్పాటువాదంలో కూరుకుపోయి, విభజన బాట పట్టినప్పుడు మిగిలిన భారతదేశానికీ, ఈశాన్యానికీ వంతెన నిర్మించిన ఘనత నిస్సందేహంగా వీహెచ్‌పీదే. ఆ విషయాలు ఈ ముఖాముఖీలో.
ప్రపంచ హిందువులందరినీ ఏకం చేయడానికి ఏర్పడిన సంస్థ విశ్వహిందూపరిషత్. నిజానికి ఆ పని భారతదేశంలోనే ఎక్కువ అవసరమని మొట్టమొదటి గ్రహించిన సంస్థ అదే అనాలి. జాతీయత, జాతీయ భావాల నుంచి పూర్తిగా దూరమైపోయిన ప్రాంతం ఈశాన్య భారతం. అక్కడ వీహెచ్‌పీ విజయం సాధించింది. జాతీయభావాలనేవి పౌరులలో ఉండాలి. మతమేదైనా కావచ్చు, వారి ఆచరణ విధానమేదైనా కావచ్చు, పూజా విధానమేదైనా కావచ్చు, మేమూ భారతమాత బిడ్డలం, ఈ భూమి బిడ్డలమన్న దృక్పథం ఉండాలన్న ఆశయంతో పనిచేస్తున్న సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్. కాబట్టి వేర్పాటువాదంతో కునారిల్లిన ఈశాన్య భారతావనిలో జాతీయవాదానికి, ఆధ్యాత్మిక చింతనకి మధ్య వీహెచ్‌పీ అనుబంధాలన్ని ఏర్పర చడంలో చేసిన కృషి ఎలాంటిది? భారతీయులు వెళ్లిపోవాలి అన్న నినాదం వినిపించిన వారికి మరచిపోయిన మట్టివాసనను ఎలా గుర్తు చేసింది?
1947లో స్వాతంత్య్రం వచ్చినా 1972 వరకు బ్రహ్మపుత్ర నది మీద వంతెన లేదు. బ్రహ్మపుత్ర దాటితేనే మనకు ఈశాన్య భారత్ కాంటాక్ట్ అవుతుంది. అప్పటివరకు గౌహతి యూనివర్సిటీ కూడా లేదు. పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రాంతమని అర్థం చేసుకోవచ్చు. ఇదే అదనుగా క్రైస్తవ మిషన రీలు, ముస్లింలు` అంటే బాంగ్లాదేశ్ మహమ్మదీయ శక్తులు, కొన్నిచోట్ల మావోయిస్టులు తొట్ల పడవలలో అక్కడికి చేరారు. భారతీయత, భారతీయ సంస్కృతి, దేశభక్తి, ఆధ్యాత్మికత` ఇలాంటి పూర్వులు తయారుచేసిన వ్యవస్థలు ఏవి ఉన్నాయో, అవే కొంత మిగిలాయి. ఉదాహరణకి శంకర్‌దేవ్ (1449` 1569). నామ్‌ఘర్ పేరుతో చిన్న గుడిసెలాగా ఉంటుంది. కృష్ణభక్తులుగా వాళ్లను తయారుచేసి, భాగవతాన్ని నిత్యం పఠించే సంప్రదాయం ఆయనే తీసుకొచ్చారు. కామాఖ్యాదేవి మందిరం ఉంది అస్సాంలో. శక్తిపీఠం, అమ్మవారి యోని పడిన ప్రదేశం. కాబట్టి అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నట్టు ప్రజల్లో బలమైన భావన ఉంది. ఇప్పటికీ సంవత్స రానికొకసారి నాలుగురోజులు మందిరంలో రక్తం కనిపిస్తుంది. ఆ సమయంలో నాలుగు రోజులు దేవాలయం తెరవరు. ప్రతి ఒక్కరు అమ్మవారు బహిష్టు అయినట్టుగా భావించి నేల దున్నరు, గుళ్లు తెరవరు. భాగవత పఠనం, కామాఖ్య ఆరాధన ఈశాన్యంలో, కనీసం అస్సామైనా మత మార్పిడులకు బలికాకుండా చాలా వరకు కాపాడాయి. పర్వత ప్రాంతాలు`మిజోరం, నాగాలాండ్, మణిపూర్ ఇవన్నీ క్రైస్తవులకు ఆటపట్టుగా మారాయి. అస్సాంతో సంబంధం ఉన్నవి కొన్ని మిగిలిపోయాయి. వాటిలో మేఘాలయ ఒకటి.
నీఫాకు అరుణాచల్ ప్రదేశ్ అన్న పేరు సూచించిన వారు పుట్టపర్తి సత్యసాయిబాబా గారని విన్నాం. ఆ వివరాలు చెప్పండి.
నేటి అరుణాచల్ ప్రదేశ్ నీఫా`నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ ఏరియా పేరుతో ఉండేది. ఇది క్రైస్తవుల వశం కాకుండా ఉంచడానికి ఇందిరాగాంధీ గట్టి ప్రయత్నం చేశారు. ఆవిడ రాజన్ అనే తమిళుడిని గవర్నర్‌గా నియమించారు. నాగాలాండ్, మిజోరం లాగా అది కూడా క్రైస్తవపరం కాకుండా కాపాడండి అని పంపించింది. నీఫా అనే పేరు మార్చమని ఆమే చెప్పారు. రాజన్ సాయిబాబా భక్తుడు. స్థానిక జనజాతులవారు నలుగురిని తీసుకొని పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు వచ్చారాయన. బాబా ఉదయాచల, అరుణాచల, ఉత్తరాంచల` మూడు పేర్లు చెప్పారు. దాంట్లో అరుణాచల్ పేరును అందరూ ఇష్టపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్ అని ఇందిరాగాంధీ ప్రకటించారు. కొంత హిందుత్వం కాపాడాలని కోరికతో ఇన్నర్‌లైన్ పర్మిషన్ పెట్టమని చెప్పింది. అంటే క్రిష్టియన్స్ ఎవరూ రాకూడదు. అయితే క్రైస్తవులు అరుణాచల్‌ప్రదేశ్‌కి సరిహద్దులో, అస్సాంకి చెందిన లఖింపూర్‌లో స్కూలు, కాలేజీ, హాస్పిటల్స్‌ను కట్టి అరుణాచల్‌ప్రదేశ్ నుంచి పిల్లలను తీసుకొచ్చేవారు. క్రిష్టియన్‌గా మార్చి ఊర్లకి పంపేవారు. వాళ్లందరూ మళ్లీ అక్కడ క్రిస్టియానిటీ మొదలుపెట్టారు.
ఇంకొక విషయం మనందరికీ తెలియాలి. నాగాలాండ్ విషయమది. వాళ్లు నాగాస్, పక్కా జనజాతి. క్రిష్టియానిటినీ వేటినీ నమ్మేవారు కాదు. వాళ్ల జనజాతి పద్ధతిలో జీవించేవారు. అది ఒకరకంగా హిందుత్వం. మూడు చెట్టుకొమ్మలు పెట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పూజించేవారు. అలాంటి చోటికి ఈ ఫాదరీస్ పోయి ఒకతని కాళ్లకి చెక్కర పానకం పోసి ఆరబెట్టి, ఈయన ఏసు దగ్గర నుంచి వచ్చాడు, ఈయన కాళ్లు కడిగిన నీరు తియ్యగా ఉంటుందని ప్రచారం చేశారు. కాళ్లు కడిగిన నీళ్లు తియ్యగా ఉన్నాయి. వాళ్లందరు మాంసాహారులు. కాళ్లే ఇంత తియ్యగా ఉంటే మనిషి ఇంకెంత తియ్యగా ఉంటాడో అని చంపేసి తినేశారని చెప్పుకుంటారు. అయినప్పటికీ మిషనరీలు పట్టు వదలలేదు. నాగాలాండ్‌లో నేడు 80 శాతం క్రిస్టియానిటీ.
అవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు. అరుణాచల్‌ప్రదేశ్ జనాభా 11 లక్షలు, మిజోరాం 10లక్షలు. ఇక్కడి జిల్లాతో కూడా సమానం కాదు. ముఖ్యంగా త్రిపురకు వచ్చేసరికి కమ్యూనిష్టులు. మాణిక్‌సర్కార్ ఇలాంటివారు కమ్యూనిజాన్ని ప్రేరేపించడం మొదలుపెట్టారు. బాంగ్లాదేశ్‌తో టచ్ ఉన్న అస్సాం భాగాలలో మహమ్మదీయ ప్రభావం పెరుగుతూ వచ్చింది. చివరికి సంఘ ప్రవేశం, దానితోపాటు వివిధ క్షేత్రాల ప్రవేశంతో ఈ రోజు అటు దేశభక్తి, ఇటు ధార్మిక చింతన వంటి వీటన్నింటిలో మనం ముందుకు నడుస్తున్నాం. తప్పనిసరిగా ఈ విషయాలలో మనం చాలా ప్రగతిని సాధించాం.
ఇప్పుడున్న పరిస్థితినిబట్టి, ఈ వేర్పాటువాదం వంటి వాటిని బట్టి, జాతీయవాదం, భారతీయతకు సంబంధించిన ధార్మికచింతన ఎలా కలిసి నడవాలి?
మూలతః ప్రతి ఒక్కరి హృదయంలో మన సంస్కృతి పట్ల ప్రేమ ఉంది. కానీ దాని పట్ల ప్రతి 20 కిలోమీటర్లకు అవగాహన మారుతుంటుంది. భాష కూడా ప్రతి 20 కిలోమీటర్లకు రూపు మార్చుకుంటుంది. సుమారు సంవత్సరం క్రితం నరేంద్రమోదీ నిఫూ అనే ప్రదేశంలో ఏర్పాటు చేసిన సమ్మేళనానికి వెళితే మూడు లక్షలమంది హాజరయ్యారు. ఆయన చేస్తున్న పనిపట్ల వాళ్లకున్న మంచి భావనకు అది నిదర్శనం. ఆయన తీసుకున్నటువంటి చొరవ, వీళ్లందరు నా వాళ్లు, 140 కోట్ల కుటుంబానికి సేవకుడిగా పుట్టానని చెప్పడం, ఎక్కడికి పోయినప్పటికీ ఆ భాషలో నాలుగు మాటలను చెప్పడం, నావాళ్లు, మావాళ్లు అన్న భావన వాళ్ల హృదయాల్లో నిండి ఉంది.
కొన్ని ప్రభుత్వాలే ప్రజలను సిలువ వేయడానికి ప్రయత్నించాయి కదా!
2000 సం॥లో మిజోరం గవర్నమెంటు 45 వేలమంది రియాంగ్ గిరిజన జాతి వారిని బయటికి పంపించింది. క్రైస్తవులుగా మారడానికి నిరాకరించ డమే వారు చేసిన నేరం. రియాంగ్‌లు అంటే మన చెంచులు, కోయలు వంటివారు. వాళ్లు ఎక్కడికి పోవాలి? సరిహద్దు దాటి త్రిపురకు వచ్చారు. అప్పుడు త్రిపురలో మాణిక్ సర్కార్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. వీళ్లను పట్టించుకోలేదు. కేంద్రం ఈ 45 వేలమందికి 9 క్యాంపులు ఏర్పాటు చేసింది. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 రూ., 400 గ్రాముల బియ్యం ఇవ్వడం మొదలుపెట్టింది. వీహెచ్‌పీ కార్యకర్తగా నేను 2010లో వాళ్లున్న ప్రాంతానికి వెళ్లాను. పాపం! రూ. 2లు, 400 గ్రాముల బియ్యంతో బతికేది ఎలా? సరైన బట్ట లేదు, తిండి సరిగాలేదు, ఇల్లులేదు, పొలం లేదు, చదువు లేదు. అప్పుడు నేను ఇంటర్నేషనల్ ఇస్కాన్ చైర్మన్ మధుపండితదాస్ గారిని బెంగళూరులో కలిశాను. అక్షయపాత్ర స్కీమ్ నిర్వ హిస్తున్నారు. ఈయన ఐఐటి మ్యాన్.16 రాష్ట్రాలలో 18 లక్షల మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టే పథకం. మీరు పట్టణాలలో ఉన్న పిల్లలకి పెడుతున్నారు, బాగుంది. కానీ ఒకపూట కూడా భోజనానికి నోచుకోని వారి గురించి ఎందుకు ఆలోచించకూడదు అన్నాను. ఎవరు, ఎక్కడ అన్నారాయన. ఆయనను అగర్తలకు ఫ్లైట్‌లో తీసుకెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 300 కిలోమీటర్ల అవతల వాళ్లున్న చోటికి తీసుకెళ్లాను. వాళ్లను చూడగానే ఆయనకు కన్నీళ్లు వచ్చాయి. వెంటనే ప్రకటన చేశాడు, ఇక్కడ భోజనశాల ఏర్పాటు చేస్తాను. అమ్మాయిలకు వీవింగ్ సెంటర్ పెడతాను, అబ్బాయిలకు మోటార్ డ్రైవింగ్ స్కూల్ పెడతాను, చిన్నపిల్లలకు స్కూల్ పెడతాను, దేవాలయం కట్టిస్తానని తక్షణమే ప్రకటించారు. అక్కడి నుంచి మరొక 8 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్లాను. అది బంగ్లాదేశ్ సరిహద్దు. 15 ఏండ్ల కిందట నలుగురు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులను బాంగ్లాదేశ్ మిలిటెంట్స్ కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. సమయానికి ఇవ్వలేదని నలుగురిని చంపేశారు. దానికి దగ్గరగా పరిషత్ తరఫున అనాథ శరణా లయం నడుపుతున్నాం. ఆ అనాథ శరణాలయంలో బెంగాలీ అయిన పన్నాదేవద అనే గిరిజన మహిళ పనిచేస్తున్నది. ఆమెకు చెప్పాను. ఆమె బాగా ప్రయత్నం చేసి రెండువేలమందిని తెచ్చింది. ఇంత దట్టమైన అడవిలో ఇంతమంది ఉంటారా? అని ఈయన ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ అంచనావేసి ఈ స్కూల్‌కు ఎంత ఖర్చయితే అంతా నేను భరిస్తాను అని అక్కడ ప్రకటన చేశాడు. అక్కడ నుంచి సౌత్ అస్సాంకు తీసుకెళ్లా. అక్కడ 500 మంది పిల్లలతో మన హాస్టల్, స్కూల్ నడుస్తున్నది. ఇవన్నీ చూసాకా చెప్పాడు, మీరు ఇంకేమీ చూపించే ప్రయత్నం చేయద్దు, మీరు ఏం చెబితే అది నేను చేస్తాను. ఏసీ కార్లు, ఏసీ ఇండ్లలో బతకాను తప్ప ఈ అడవులలో నివసించే ప్రజల గురించి తెలియదు. కండ్లు తెరిపించారు అని చెప్పి 3 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు పెట్టి 20 వేలమందికి రోజూ భోజనం పెట్టడానికి అనుమతి తెచ్చాడు. అన్నట్టే దేవాలయం కట్టించాడు. వెయ్యి మంది పిల్లలకి స్కూల్ ఏర్పాటు చేశాడు. మన స్కూల్‌కి కూడా సహకారమందించడం మొదలుపెట్టాడు. ఎందుకు చెబున్నానంటే, ఆ తర్వాత అక్కడ కృష్ణభక్తి వెల్లువిరిసింది. ఆ ప్రాజెక్టు పరిసరాలలోని నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మేల్యేలుగా మారిపోయారు. ఇదంతా వీరి కోసం చేయలేదు. సేవను మనం ఆధారంగా చేసుకున్నాం. ఆ సేవ ఆధ్యాత్మికతను కూడా తట్టి లేపగలిగింది. ఈ రోజు త్రిపుర బీజేపీ కిందికి వచ్చింది. ఇంద్రసేనా రెడ్డి గవర్నర్. నెలరోజుల కిందట ఆయనకు ఈ విషయాలన్నీ చెప్పాను. అంటే మానసికంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే దానికి కదిలించేటటువంటి వ్యవస్థ లేనినాడు, వాళ్లు దూరంగా ఉండిపోయారు. ఇవాళ మనం వాళ్లను కదిలిస్తే, చాలా చక్కని భారతీయతను నిర్మాణం చేసుకోగలిగారు.
వేర్పాటువాదం, హిందూ వ్యతిరేకత కలసి నడిచాయా?
ఇంకొక విషయం`2001 నాటిది. అగర్తలా పట్టణంలోనే శాంతికాళీ మహారాజ్ అని ఒక స్వామి ఉన్నారు. ఆయనకు 14 ఆశ్రమాలున్నాయి. త్రిపుర, గిరిజన జాతికి చెందిన ధర్మాచార్యులు. మన అన్ని సమ్మేళనాలకు వచ్చేవారు. ఆయన ఆశ్రమానికి ఎన్‌ఎల్‌ఎఫ్‌టి (నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, క్రిస్టియన్ మిలిటెంట్ సంస్థలు) వాళ్లు ఈయన దగ్గరకు వచ్చి మీ ఆశ్రమంలో కాళీపూజ ఆపేయాలి, మీ ఆశ్రమం మీద శిలువను నిలబెట్టాలి, నెలరోజులు సమయ మిస్తున్నాం… చేయకపోతే చంపేస్తామని చెప్పి వెళ్లారు. ఆయన మారలేదు, ఆయన కాళీపూజ చేస్తున్న సమయంలో దేవాలయం లోపలికి వచ్చి గన్‌పాయింట్ మీద కాల్చేశారు. దీనితో 35 లక్షల మంది జనాభా కలిగిన త్రిపుర మొత్తం నైతిక స్థైర్యం కోల్పోయింది. 14 ఆశ్రమాల అధిపతికే రక్షణ లేకపోతే మన గతి ఏమిటి? అన్న ప్రశ్న వచ్చింది. ఆ సమయంలో మాననీయ అశోక్ సింఘాల్‌జీ నాకు చెప్పారు ` నువ్వు వెళ్లి, అక్కడ కూర్చో అని. వెళ్లాను.
మీరు ఇండియా నుంచి వచ్చారా? అన్న ప్రశ్న మీకు ఎదురైందా?
అప్పటికి రెండుమూడేళ్ల ముందే నాకు నార్త్ ఈస్ట్ బాధ్యత వచ్చింది. ఎక్కడికన్నా వెళితే మీరు ఇండియా నుండి వచ్చారా? అని అనేవారు. అంటే ఇండియా వేరు, త్రిపురవేరు. అంత భేదభావాన్ని తయారుచేసి పెట్టారు. సరే వీళ్లని భారతదేశానికి కనెక్ట్ చేయడం ఎట్లా? అని ఆలోచించి 35మంది గిరిజన నాయకులను కలిశాను. భారతదేశం ఎట్లా ఉంటుందో మీకొకసారి చూపించాలని కోరికగా ఉంది. మీరు ఒక్కపైసా ఖర్చు పెట్టుకోవద్దు, మిమ్మల్ని నేను తీసుకెళతానని వాళ్లకు చెప్పాను. అపుడు త్రిపురకు రైలు లేదు. గౌహతి నుంచే ప్రయాణం చేయాలి. గౌహతి టు గౌహతి సర్క్యులర్ టికెట్ తీసుకొని, మొత్తం దక్షిణ భారతం పూర్తిగా తిరిగి గౌహతి చేరుకున్నారు. ఆ సమయంలో కోటేశ్వరశర్మ గారు కూడా కొన్నిచోట్ల నాతోపాటు ఉన్నారు. పుణ్య క్షేత్రాలు, పవిత్ర చారిత్రక ప్రదేశాలు చూపించాను.
మొదటి రోజు అనుభవమేమిటంటే – వాళ్లు అంతవరకు రైలు చూడలేదు. ఏమండీ రైలు ఇంత పొడవుగా ఉంటుందా? ఇంత పొడుగు రైలు ఎవరు నడుపుతారండి? అని అడిగారు. దక్షిణాదిన సముద్రాన్ని చూశారు. ఇన్ని నీళ్లలో ఉప్పు ఎవరు కలిపారు? అని అడిగారు. రామేశ్వరం, కన్యా కుమారి, పూరీ జగన్నాథ్ వంటివన్నీ చూపిస్తూ సత్యసాయిబాబా ఆశ్రమానికి తీసుకెళ్లాను. ఎక్కడికి తీసుకెళ్లినా ధర్మశాలలు, హోటల్స్ అలాంటివి కాకుండా ఇళ్లలోనే వసతి. అప్పుడు వాళ్లకని పించింది, ఇంత గొప్ప భారతదేశ సంతానమా మనం? అంటూ ఆశ్చర్యమూ, ఆనందమూ.
వీరంతా తిరిగి వెళ్లాక పరిణామం. జమాత్య అక్కడి ఒక వర్గం. రియాంగ్ వంటిదే. జమాత్యలు క్షాత్రధర్మం కలిగిన గిరిజన జాతికి చెందిన విక్రమ్ బహద్దూర్ జమాత్య ఒక నాయకుడు. మూడు వందల గ్రామాలలో ఆయన మనుషులుంటారు. ఆ అన్ని గ్రామాలలో కాళీపూజ చేయించాడు. ఎన్‌ఎల్‌ఎఫ్‌టి వాళ్లకు కోపం వచ్చింది. ఒకచోట పూజ ఆపిస్తే మూడు వందల చోట్ల ప్రారంభించాడే, కాబట్టి చంపాలని ప్రకటించారు. విక్రమ్ బహదూర్ జమాత్యను తల తెచ్చినవారికి లక్ష రూపాయల బహుమానం ఇస్తాం అని ఎన్‌ఎల్‌ఎఫ్‌టి ‘టెలిగ్రాఫ్’ పత్రికలో ప్రకటన ఇచ్చింది. అతడు భయపడలేదు కానీ, అతని 26 మంది అనుయాయులను కిడ్నాప్ చేశారు. నా దగ్గరకు వచ్చి ఇప్పుడేం చేయమంటారు అన్నాడు. నీవు ఏమి చేయగలవో చెప్పు అన్నాను. ఐదు వందలమందిని వెంట తీసుకెళుతాను. వాళ్ల క్యాంప్ మీద దాడి చేసి, మా వాళ్లను వెనక్కి తెచ్చు కుంటాను అన్నాడాయన. మరి చేయి అన్నాను. ఈ ఐదు వందలమంది నా వెంట వస్తే వాళ్లకు తిండి పెట్టలేను, ఆర్థిక సహకారం ఇవ్వండి అని అన్నాడు. అపుడు అశోక్‌జీతో మాట్లాడి అతనికి కావలసిన భోజన వసతి ఏర్పాటు చేశాను. అతడు ఫిజికల్‌గా మూడొందల మందిని తీసుకెళ్లి ఆ ఎన్‌ఎల్‌ఎఫ్‌టి కార్యకర్తల తల్లిదండ్రులు ఎవరో గుర్తించి వాళ్లను చితకబాది మీ పిల్లలను చూపించండని తీసుకెళితే, ఆ క్యాంపుల మీద దాడి చేసి తన మనుషులను వెనక్కి తెచ్చుకోవడమే కాకుండా ఈ ఎన్‌ఎల్‌ఎఫ్‌టి వాళ్లలో కూడా కొద్దిమందిని వెనక్కి తీసుకొచ్చాడు. దాంతో కొంత ఊపిరి వచ్చింది సమాజానికి. కానీ ఇంత చేసిన ఈ మనిషికి భద్రత ఎలా? అశోక్‌జీని అడిగాను. అడ్వాణీగారితో మాట్లాడితే విక్రమ్ బహద్దూర్‌కి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు. ఆ సెక్యూరిటీ తీసుకొని మొత్తం అడవులంతా గాలించాడు. అదే సమయంలో నేనేం చేశానంటే, మన వెంబడి వచ్చిన ఈ 35 మంది సహకారం తీసుకొని ఒక సనాతన హిందూ ధర్మ సమ్మేళనం జరిపేందుకు ఏర్పాట్లు చేశాను. 18 వేలమందితో అగర్తల టౌన్‌లో అష్టబల్ మైదానంలో ఆ కార్యక్రమం జరిపాం. అశోక్‌జీ వచ్చారు. అప్పుడు గృహమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి చిన్మయానంద వచ్చారు. విష్ణుకుంజ్ మహారాజ్ ఉన్నారు. అవైద్యనాథ్‌జీ అంటే ఆదిత్యనాథ్‌గారి గురువుగారు వచ్చారు. నాథ్ సంప్రదాయం సంబంధించిన గిరిజనులు ఈ ప్రాంతంలో బాగా ఉన్నారు. ఈ అవైద్యనాథ్ వస్తున్నారనగానే వాళ్లు పరుగెత్తుకొచ్చారు. తరువాత అయోధ్య సాధుసంతులు వచ్చారు. కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అప్పుడు ఒక సేథ్ అని లెప్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన అశోక్‌జీతో మాట్లాడుతూ ఈ రోజు మేము బయటికి రాగలుగు తున్నాం. ఇంతవరకు మిలిటెంట్లు బయట మేము లోపల. ఈ రోజు మాకు ధైర్యం వచ్చింది అన్నాడు. ఎందుకు ఈ రెండు ఘటనలు చెప్పానంటే వారి జీవితం ఎలా నడిచేదో చెప్పేందుకే. ఎప్పుడైతే మనం దానిని కొంచెం మార్చే ప్రయత్నం చేశామో వాళ్లలో దేశభక్తి, ఆధ్యాత్మికత, ధార్మికత మేల్కొన్నాయి. ఇంకా అనేక రకాలుగా మార్పు తెచ్చాం. మన అనాథ శరణాలయం ఎంత పని చేసిందంటే మరొక 12 ఫీల్డ్ సెంటర్‌లను తెచ్చిపెట్టింది. మొన్న వార్షికోత్సవం జరిగితే 8 వేలమంది పాల్గొన్నారు. అంత ప్రభావితమైంది వాతావరణం.
పిల్లలలో వచ్చిన మార్పు ఏమిటి?
బెంగళూరు మధుపండిత్ దాస్ ఏం చేశారంటే 29 మంది రియాంగ్ గిరిజన పిల్లలని కృష్ణాష్టమికి విమానంలో బెంగళూరు ఇస్కాన్ టెంపుల్‌కు తీసుకొచ్చారు. వాళ్ల నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దానికి పలు కార్పోరేట్ కంపెనీల అధిపతులను పిలిచారు. అంతా ఆశ్చర్యపోయారు. పిల్లలు కూడా ఆనందపడ్డారు. కార్యక్రమాల్లో పూర్తిగా మన ధార్మిక ఇతివృత్తాలు చూపిచారు.
బాగుందండీ! భారతదేశం వేరు అన్న వాతావరణం నుంచి ఈ పరిస్థితి ఏర్పడిర దంటే మాకే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఒక ప్రశ్న. మిగిలిన భారతదేశంలో అయోధ్య స్ఫూర్తి చాలా స్పష్టంగా, ఘనంగా కనిపించింది. అది ఈశాన్య భారతంలో ఎట్లా ఉంది? వీహెచ్‌పీ కార్యకర్తగా మీరు అక్కడ గమనించిన మార్పు ఏమిటి?
అయోధ్య స్ఫూర్తి అణువణువూ కనిపించింది. అక్షింతలు తీసుకొని వెళ్తున్నప్పుడు అనంతమైన సంతోషాన్ని వారు వ్యక్తం చేశారు. ధనసేకరణలో వారూ పాల్గొన్నారు. మొన్న నడిపిన స్పెషల్ రైళ్లలో అనేకమంది అయోధ్యకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్లారు. మనవాళ్లు చేసిన యోజన ప్రకారం అన్ని ప్రాంతాలూ ప్రాతినిధ్యం వహించేలా చేసి, గిరిజను లకూ ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఆ పెద్దలందరు వచ్చి ఆనందపడ్డారు. విక్రమ్ బహదూర్ జమాత్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. దశాబ్దాల క్రితమే రాణి గైడిన్లు క్రైస్తవం ప్రవేశించకుండా ప్రతిఘటించింది. మూలతః ఈ భూమి దేవభూమి అని చెప్పడానికి ఇవన్నీ కారణాలు. ఇదంతా శిక్షణతో వచ్చిన హిందు త్వం కాదు. ఇది నా ధర్మం అన్న రీతిలో జనించింది. ఆ ప్రాంతంలో చక్కని వాతావరణం ఏర్పరిచింది. ఇస్కాన్ అన్ని ప్రాంతాలలోకి ప్రవేశించింది. ఇస్కానే కాదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్`పండిట్ రవిశంకర్ గురూజీ, సత్యసాయిబాబా, మాతా అమృతానంద మయి`దేశంలో ఎన్నిరకాల ధార్మిక సంస్థలున్నాయో, ధార్మిక పెద్దలున్నారో అందరి ప్రయాణం ఇక్కడ సక్రమంగా సాగుతోంది. ఈ ప్రయత్నం ఇంకా సాగాలి. ఇంకా అటు బర్మా నుంచి వచ్చిన రొహింగ్యా ముస్లింల ప్రవేశించే ప్రాంతాలలో పని జరగవలసి ఉంది. సరిహద్దుల రక్షణకు ప్రభుత్వం చాలా పథకాలను తయారు చేసింది. అంటే ఇవాళ అక్కడ రక్షణ ఉంది. కరీం గంజ్ అస్సాంకు దక్షిణ భాగాన ఉంది. దాని ఒకనాటి పేరు శ్రీభూమి. బరాక్ వ్యాలీ అని ఉంటుంది. ఇదే భారత్‌ను, బాంగ్లాదేశ్‌లను వేరు చేస్తుంది. బరాక్ వ్యాలీకి పక్కనే ఉన్న ఊరు శ్రీభూమి. 1947లో హిందువులు అధికంగా ఉన్నారు కాబట్టి మనకు మిగిలినా, ఇవ్వాళ 80శాతం ముస్లింలే అక్కడ. ఇప్పుడు ఆ ఊరి పేరు కరీంగంజ్. చొరబాట్లు అంత విపరీతంగా సాగుతున్నాయి. ఇప్పుడు వాటిని ఆపడానికి మన ప్రయత్నాలు నడుస్తున్నాయి. బాంగ్లాదేశ్ ప్రయత్నం దీన్ని కూడా కలిపేసుకుందా మని. అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన: అక్కడ మొత్తం టీ తోటలు. వాటి ఇద్దరు మేనేజర్లను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. యాభై లక్షలు పంపండి లేదా చంపేస్తాం అన్నారు. మనవాళ్లకి ఆ వార్త అందగానే ఐదువందలమంది కార్యకర్తలు సరిహద్దుకు వెళ్లి ‘చలో బాంగ్లాదేశ్’ నినాదం ఇచ్చారు. మన సైనికులు ‘నో పర్మిషన్! గో బ్యాక్’ అంటూ సైనిక భాషలో మాట్లాడారు. ‘సరే, మేం వెళ్లిపోతాం. మిలిటెంట్లు వచ్చారు, మీరెట్లా అనుమతిచ్చారు? ఎట్లా కిడ్నాప్ జరిగింది? కాబట్టి, మేం కూడా అదే అనుమతితో వెళతాం. మా వాళ్లని తెచ్చుకుంటాం. మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపల వారిద్దరూ ఆఫీసుకు వచ్చారా సరే సరి, లేదా మేం వెళ్లిపోతాం బాంగ్లాదేశ్‌లోకి. మీరేం చేయగలుగుతారు? ఫైర్ చేయగలరు. లేదా బాంబు వేస్తారు. మేం చచ్చిపోతాం. అంతేకదా, చూద్దాం. మీరేం చేస్తారో చేయండి’ అనేసరికి, మన ప్రభుత్వం, బాంగ్లా ప్రభుత్వం కదిలాయి. ఆ ఇద్దరు మేనేజర్లు పన్నెండు గంటలలోపు తిరిగి వచ్చారు. అంటే ఇలాంటి పరిస్థితు లను ఎదుర్కొనవలసిన సన్నివేశాలకు కూడా మన వాళ్లు వాతావరణాన్ని తయారు చేసుకున్నారు.
ఒక్క గోవు బతకడం లేదు. గుళ్లలో దీపం లేకుండా చేశారు. ధర్మ గ్రంథం పఠించడానికి ధైర్యం లేదు. అలాంటి వాటన్నింటినీ ఇవాళ సరిచేసుకునే స్థితిలో ఉన్నాం. అదే కరీంగంజ్‌లో ఇవాళ ప్రథమ వర్ష శిక్షావర్గ్ (ఆర్.ఎస్.ఎస్. ట్రైనింగ్ క్యాంప్) జరిగింది అంటే, నార్త్‌ఈస్ట్ రాష్ట్రాలలో మనవాళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సాహసంతో పని చేస్తున్నారు కాబట్టే. ఈ మధ్య ‘సీల్ ప్రాజెక్టు’ వచ్చింది కదా! సరిహద్దులను చూసిరమ్మని పంపగా, వారంతా చాలా విజయవంతంగా చూసి కూడా వచ్చారు. మొత్తం వాతావరణం మనకు అనుకూలంగా మారింది.
మొత్తానికి వేర్పాటువాదం అందులో హింసావాదం, క్రైస్తవంలో తీవ్రవాదం వీటన్నింటినీ భారతీయ చింతన ఓడిరచగలిగింది కదా!
తప్పనిసరిగా! తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఒక్కటి, మన సంపర్కం ఎంత పెంచగలిగితే, అంత విజయాన్ని సాధించ గలుగుతాం. అంత యంత్రాంగాన్ని మనం తయారు చేసుకోవలసిన అవసరం ఉంది. తయారవుతోంది కూడా. ప్రతి ఏటా విహెచ్‌పి ట్రైనింగ్ క్యాంపుల సంఖ్య పెరుగుతుంది. పూర్తి సమయ కార్యకర్తలు పెరుగుతున్నారు. ఏబీవీపీ, బీఎంఎస్ – ఇలా అన్ని సంస్థలు ఇక్కడ పెరుగుతున్నాయి. సంఘ శాఖలు విశిష్టంగా పెరుగుతున్నాయి. ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో మన అంచనా ప్రకారం ఇంకా మంచి విజయాన్ని సాధించ గలుగుతాం. అది మనకున్న విశ్వాసం.
మణిపూర్ అసలు వాస్తవాలేమిటో తెలియదు కానీ, ఈశాన్యంలో ఒక సమస్య పరిష్కారం కాకుండా ఉండిపోవడం అన్నది వీహెచ్‌పీ ఎట్లా చూస్తున్నది?
మైతేయీలంటే మైదానంలో ఉండే కృష్ణభక్తులు లేదా వైష్ణవులు. మణిపూర్‌లో తొమ్మిది జిల్లాలుంటాయి. గిరిజనులు నివసించే ఆరు జిల్లాలు కొండ ప్రాంతాల్లో ఉంటాయి. తౌబల్, సేనాపతి, జీరిబామ్ అనే మూడు జిల్లాలు మైదాన ప్రాంతంలో ఉంటాయి. అయితే వీళ్ల సంఖ్య పెరిగితే అటు గిరిజన ప్రాంతాలలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ మైదానప్రాంతమే అలాంటిది. దీనితో ఆ గిరిజనులని ఎట్లా ఎగదోశారు అంటే, ఇక్కడున్నవాళ్లు ఎవరూ కూడా అక్కడికి రాకూడదు అనే పద్ధతిలో వేర్పాటువాదాన్ని పెంచిపోషించిన పరిస్థితి, అటువైపు బర్మాలో ఉన్న క్రిస్టియానిటీ కానీ, అవతల ఉన్న చైనా ప్రేరిత వాతావరణం కానీ మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచకుండా చేసేందుకే. అందులో ఇది కూడా ఒకటి. కాబట్టి, ఆ రకంగా ఎవరైతే ప్రవేశించారో ఆ ప్రాంతంలో కొద్దిమంది వారిని చంపేయడానికి చూస్తుంటారు. దీనికి కాంగ్రెస్ కొంత ప్రాణం పోసిందనే చెప్పాలి. ఏదైతేనేం మనవాళ్లు కనిపెట్టారు, దీనిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకొని పరిస్థితిని కంట్రోల్ చేశారు. అవుతుంది కూడా. ఇక్కడ మీరు విజయం సాధించలేరని చెప్పడం కోసం చేస్తున్న కొన్ని దుర్మార్గాలు. ఇవి ఎంతో కాలం కొనసాగవు. ఎందుకంటే, కృష్ణభక్తి అంటే వైష్ణవ సంప్రదాయం శక్తిమంతమైంది. అంతకు ముందు మణిపూర్‌లోకి పోవాలంటే ఇన్నర్‌లేన్ పర్మిట్ అవసరం. సుమారు 19 మిలిటెంట్ సంస్థలు పని చేసేవి. మేం ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో పోతుంటే ఎవరు, ఎప్పుడు వచ్చి ఆపుతారో తెలియదు. ఒక మిలిటెంటు వచ్చి బస్సు ఆపాడు అనుకోండి, వాడికి అంతో ఇంతో ఇవ్వాలి. పోనీ అంతటితో ఆగదు. మళ్లీ ఎవడొస్తాడో తెలియదు. ఒక్కొక్కసారి రాత్రిపూట ఎక్కడాపుతారో తెలియదు. మేం బిస్కెట్లు, బ్రెడ్డు అలాంటివన్నీ సంచీలో వేసుకొని పోవాల్సి వస్తుంది. అంత భయంకర పరిస్థితులు ముందు ఉన్నాయి. అవి ఇవాళ లేవు. మిలిటెన్సీ అనేది బహుశ 90 శాతం అంతమైంది. అయినా, కొన్ని అవశేషాలు ఉంటాయి కదా, వాటి కారణంగా ఇలా జరుగుతోంది. అతి కొద్ది సమయంలోనే అది మన దారికి వస్తుంది.
– జాగృతి డెస్క్