జంధ్యాల శరత్‌బాబు సీనియర్ జర్నలిస్ట్
వందమంది మాతృమూర్తులు. వారి నిరంతర సేవానిరతికి హృదయపూర్వక అభివందనం. ఏడు దశాబ్దాల ప్రాయం దాటినా నవయౌవన సాహితీ కళాస్ఫూర్తితో దీప్తిమంతులుగా వెలుగొందుతున్నవారూ ఎందరో ఉన్నారు. ఆ షష్టిపూర్తి మహిళామణులను భాగ్యనగరంలోని తెలుగు విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించడం మనందరికీ తెలుసు. ఆమె పేరు ఆర్. శోభాదేవి. ప్రఖ్యాత కళావేత్త రేవూరి అనంత పద్మనాభరావు అర్ధాంగి. ప్రత్యేకించి ఆధ్యాత్మిక తత్వశీలి.
పరమ ముగ్ధభావంలా, మధువసంత హాసంలా
శశిముఖ లావణ్యాంచిత శరద్గగన రాగిణిలా
స్వచ్ఛ జీవనాన్విత ప్రశస్త శైల వాహినీ వనిలా
నిత్యమూ సారస్వత సమర్చన సాగిస్తున్న ఆమె ‘పదకవితా పితామహ అన్న మార్యుని జీవనం – సాహితీ ప్రస్థానం’ పేరిట పుస్తకం రచించారు. ఆ గ్రంథాన్నే ప్రపంచ తెలుగు మహాసభల వేళ ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా సంఘంతోపాటు విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యాన మళ్లీ మహాసభలు ఏర్పాటవుతున్నాయి. వచ్చే డిసెంబరులో. ప్రపంచ తెలుగు మహాసభల (1975) స్వర్ణోత్సవ శుభ సందర్భం ఇది. అప్పటి, ఇప్పటి మహోత్సవాల నేపథ్యంలో…
సుధామధుర సుమసుగంధ
శాంతి వసుధ కరుణకిరణ
సుఫల శోభకు నమస్సుమాలందిస్తూ –
అన్నమయ్య భక్తి సామ్రాజ్యం, సంకీర్తనా సౌరభం, సంభవామి యుగే యుగే… ఈ మూడు పరిశోధన కావ్యాల అక్షర అనుశీలనం ఇది.
తెలుగునాట నెల్లూరు ప్రాంతం కారేడులో పుట్టిన శోభాదేవి పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం విజయవాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు బిట్రగుంట, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో కొన సాగింది. సాహిత్యంతోపాటే సంగీత అనురక్తికి మూలవేదిక తిరుపతి.
భక్తి కేంద్రం తిరుపతిలోని అన్నమాచార్య కళా క్షేత్రంలో సంకీర్తనలను అభ్యసించి నిపుణత సాధిం చారు. గ్రంథస్థం చేసిన ఆ రచనలు, విశ్లేషణ లన్నిం టినీ ‘సౌరభం’ శీర్షికన ప్రచురించింది తిరుమల – తిరుపతి దేవస్థానం. తొలి ముద్రణ జరిగి ఇప్పటికి పుష్కరం. ఇందులో అన్నమార్య పదసంపద నుంచి బ్రహోత్సవ వాహనాదుల విశదీకరణ వరకు ఎన్నెన్నో అంశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్య ఫలితంగా తాను చేసిన పరిశోధనకు ఇది ప్రచురణ రూపమన్నారు ‘నివేదన’లో. కృతజ్ఞతాంజలి సమర్పించారు.
అప్పట్లో తితిదే దృశ్య శ్రవణ ప్రాజెక్టు సహస్రాధిక కీర్తనలను ఆడియో సీడీలుగా తయారుచేయించింది. వాటినే పుస్తకరూపానికి తెచ్చింది దేవస్థానం. ఆ పాటలనే ప్రణాళికగా స్వీకరించిన రచయిత్రి, సంగీతవేత్త తన సృజననీ జోడించి పేరొందారు.
వాగ్గేయకార ప్రసిద్ధుడి రచనలు వేలల్లోనే. అన్నింటిలోనూ ఎంతెంతో వైవిధ్యం. తల్లిజోల, వైరాగ్యగీతికలు, సామాజిక కోణ ఆవిష్కరణలు, ఇంకా ఎన్నెన్నో. సంస్కృతాంధ్ర కీర్తనలు, ఊహా చిత్రణలు, సంగీత సాహితీ సమ ప్రాధాన్యతలు.
అనిశము దలచరో అహోబలం
అనంత ఫలదం-అనడంలో నరసింహ కీర్తనం.
దేవదేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం – అని పలకడంలో రామసంకీర్తనం. రామచంద్రుని సేవలో తరించిన హనుమంతుడే వేంకటేశ్వర సేవా అగ్ర గణ్యుడయ్యాడు. శరణు కపీశ్వర శరణం బనిలజ /సరవినెంచ నీసరి ఇకలేరీ’- ఇందులో ఆంజనేయ శక్తి స్తుతి.
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకినందుని గనియె – అన్నపుడు శ్రీకృష్ణ జనని విశేషం.
అటు తర్వాత దశావతార వర్ణనం.
డోలాయాంచల డోలాయం/ హరే డోలాయం (ఇందులో అవతార ప్రత్యేకతల విపులీకరణం)
ఓహో ఎంతటి వాడే వొద్దనున్నవాడే హరి
సాహసపు గుణముల చతురుడా ఇతడు (దీనిలో మూడుపదాలు-జలధి, ధరణి, కొండ స్మరణ లున్నాయి)
ఇటువంటి విశిష్టతలెన్నింటినో శోభాదేవి వ్యాసరచనలు వివరించాయి.
ఆరు చరణాల కీర్తన ‘తందనాన ఆహి తంద నానా పురే / తందనాన భళా తందనానా (బ్రహ్మమే శాశ్వతమనడం).
జీవుని వేదనను వ్యక్తీకరించే కీర్తనం ‘ఎన్నడు విజ్ఞానమిక నాకు / విన్నపమిదే శ్రీ వెంకటనాథా’
ఇన్నియు జదువనేల యింతా వెదుకనేల / కన్ను తెరచు టొకటి, కన్నుమూయ టొకటి (తత్వ విజ్ఞత)
ఇతరములన్నియు నడుమంత్రములే
యెంచి చూచినను యింతానూ
హితవగు బందుగు డీశ్వరుడొకడే
ఇతని మరువకుమీ జీవాత్మా! (పరమాత్ముడే ఆత్మబంధువు) అనడం. మిగిలినవన్నీ నడ మంత్రాలని హెచ్చరించడం అన్నమాట).
అన్నమాచార్య హృదయాన్ని ఆవిష్కరించే….
- శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
- వందే వాసుదవం శ్రీపతిం / బృందారకాధీశ వందిత పదాబ్జం (సంస్కృత పద సమన్విత వర్ణన)
- గురువు ఎవరు? దైవసమం. ‘గతులన్ని ఖిల మైన కలియుగమందును / గతి యితడే చూపె ఘన గురు దైవము’
ఇటువంటి మరెన్నింటినో తేటతెల్లం చేశారు శోభాదేవి.
ఆమె బ్రహోత్సవాల తరుణంలో బృంద సభ్యు రాలిగా కోలాటాలు వేశారు. ఆస్థాన మండపంలో గీతాపారాయణం చేశారు.
తనది ఆధ్యాత్మిక విలసిత చిత్తవృత్తి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశునికి పదకవితార్చన చేసిన అన్నమయ్యలోని ఆధ్యాత్మిక, సామాజిక భావజాలాన్ని విస్తృతీకరించారు తన కావ్యాల్లో.
ఐశ్వర్యం, వీరత్వం, యశస్సు
శ్రియం, జ్ఞానం, వైరాగ్యం (ఈ ఆరుగుణాల సమన్వితుడే పరమాత్ముడు అని కథన రూపంగా వివరించారు.
‘కలౌ వేంకట నాయకః’ అనేది ఉపశీర్షిక అయితే, ఆమె రచించిన పుస్తక మూల శీర్షిక ‘సంభ వామి యుగే యుగే.’
అన్నమాచార్యుని కథా ప్రారంభాన్ని ఉదాహరిస్తూ-
‘శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్’ అని విశదపరచారు.
‘శుభలేఖ’ అంటూ మరొక విశేషాంశాన్ని ఉటంకించారు శోభాదేవి తన పుస్తకంలో. ఆ వివరం ఇదీ:
‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీనివాస ప్రభువులవారికి ఆకాశరాజు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అగునట్లు దీవించి పంపు లేఖ.
వ్యాససుతుడు చెప్పగ
మా కుమార్తెయైన పద్మావతిని మీకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించినాము. చిత్తగించవలెను.’
దీనికి ప్రత్యుత్తరం అందింది. అది శ్రీనివాసుడు మొగలిరేకులపైన కొనగీట రాసింది.
‘మహారాజ రాజశ్రీ ఆకాశరాజుగారికి! శేషాద్రి నాథుడు అభివాదములు చేసి వ్రాయు విన్నపములు. ఉభయకుశలోపరి.
వైశాఖమాసమున శుక్ల దశమినాటి శుక్రవారంబు
శుభ ముహూర్తమునకు మా బంధుమిత్రులతో తరలివచ్చెదము.’
అనంతరం మాంగల్యధారణ అయింది. పద్మావతీ శ్రీనివాసులు ఎంతో సందడీ సంరంభాల నడుమ తలంబ్రాలు పోసుకుంటున్న ఘట్టం. ‘పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు’ మనకు విదితమే. ఈ సన్నివేశమంతటినీ హృద్యంగా వివరించారమె.
ఆనాటి దృశ్యమంతటినీ అక్షరబద్ధం చేయగలిగిన కవయిత్రి. ఇలా తనదైన రీతిన రచనా వ్యాసంగం కొనసాగిస్తూ వచ్చిన, వస్తున్న శోభాదేవికి ఇదివరలోనే కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఫెలోషిప్… సాంస్కృతిక శాఖ నుంచి లభించింది. అన్నమయ్య 600వ జయంతి మహోత్సవాల సందర్భంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠి ఏర్పాటైంది. అందులో తాను గాన సత్కారం పొందడం విశేషం.
తెలుగునాట ప్రత్యేక వేదికపైన అలనాడు తమిళనాడు గవర్నరు నుంచి సన్మానం అందుకున్నదీ మధుర జ్ఞాపకం. అలా ఉత్తమ రచయిత్రి పురస్కృతిని స్వీకరించారు శోభాదేవి.
అన్నమార్యుని గురించిన అనేకానేక రచనల పర్యవసానంగా ఆమెకు జాతీయ స్థాయిన గుర్తింపు. తులనాత్మక పరిశీలన చేసిన వైనాన్ని సంస్థలనేకం సభాముఖంగా ప్రశంసించాయి.
భర్త పద్మనాభరావు రచనల్లో చాలా మటుకు ‘ఆయన చెప్తుంటే ఆమె రాసినవే.’
ఇప్పటికి దరిదాపు పాతికేళ్ల క్రితం ఆయన అనువాద రచనల్లో ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుంది. ముల్క్‌రాజ్ ఆనంద్ రచించిన ‘మార్నింగ్ ఫేస్’కి ఆ అనువాదాన్ని భర్త చెప్తుండగా భార్య రాయడం ఎంతైనా విశేషాంశం!
మరొక ప్రత్యేకతనీ ఇక్కడ మనం ప్రస్తావించు కోవాలి. అమితాఘోష్ రాసిన ‘షాడులైన్స్’ను పద్మ నాభరావు అనువదించినపుడు… సరైన తెలుగుపదం స్ఫురించనపుడు, వెంటనే అందించిన ఘనతా శోభాదేవికే దక్కుతుంది. అదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ప్రకటించడం అసలైన మెరుపు!
సహజ మధుర సౌమ్యామతీ!
సమరసత భావ జయగీతీ!
జగదద్భుత జీవయాత్ర
సాగింపగ రావమ్మా!
‘మా ఆనందమయ వైవాహిక జీవితంలో ఆమె ఒక వెలుగు దివ్వె. నాకు నిరంతర స్క్రైబ్’ అంటా రాయన. ఇంతకుమించిన ప్రశంస ఏ రచయిత్రికైనా ఇంకొకటి ఏముంటుంది?