జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం పండుగలా జరుపుకుంది. కానీ భారతదేశంలో అదే రోజు తలపెట్టిన రామ శోభాయాత్రల మీద, ఇతర ఉత్సవాల మీద 15 చోట్ల దాడులు జరిగాయి. అందులో ముంబై నగరంలోని మీరా రోడ్‌ ఘటనను మరీ తీవ్రంగా పరిగణించవలసినది. మహారాష్ట్ర, గుజరాత్‌,  ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఈ దారుణాలు జరిగాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావలసిందని కోరితే ‘సగౌరవంగా’ తిరస్కరించింది కాంగ్రెస్‌. జైశ్రీరామ్‌ నినాదం కడుపు నింపుతుందా? 24 గంటలు ‘భారతమాతా! భారతమాతా!’ అవే నినాదాలేమిటి? అంటాడు రాహుల్‌ గాంధీ. మోదీ, యోగీ పాలనల తరువాత అయోధ్య మళ్లీ మాదే అంటారు కొందరు ముస్లిం మతోన్మాదులు. మార్చి 17న ముంబై శివాజీ పార్క్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ అన్నమాటను ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ‘హిందూయిజంలో ఒక మాట ఉంది, శక్తి అని. మనం ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడతాం. మోదీ మీద పోరాటం అంటే అది వ్యక్తిగతం కాదు. ఆయన ఒక శక్తి కోసం పనిచేస్తారు. ఆ శక్తికి మోదీ ఒక ముసుగు.’  అని ప్రకటించారు రాహుల్‌. కాంగ్రెస్‌ నేత చేసిన ఈ వ్యాఖ్యలనే ప్రధాని మోదీ తెలంగాణలోని జగిత్యాల సభలో దుయ్యబట్టారు.


నిరుడు సెప్టెంబర్‌లో డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ హిందూ ధర్మాన్ని డెంగ్యూతో పోల్చాడు. దానిని నిర్మూలించడమే పరిష్కారం అన్నాడు. ఈ మార్చి ఆరంభంలో అదే పార్టీ నాయకుడు ఎ. రాజా భారత్‌ ఒక దేశమే కాదన్నాడు. రాముడు మాకు శత్రువు అన్నాడు. శ్రీరాముడినే కాదు, భారతమాతాకీ జై వంటి నినాదాలని తమిళనాడు ఏనాడూ అంగీకరించదని అన్నాడు.

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ అనే ప్రదేశంలో దళిత వర్గాలకు (అంతా హిందువులు) చెందిన అనేక మంది మహిళలను షేక్‌ షాజహాన్‌ అనేవాడు చెరబడితే ఈ దేశంలో ఒక్క మానవ హక్కుల సంఘం నోరెత్తలేదు. ఒక్క హక్కుల కార్యకర్త అక్కడికి వెళ్లలేదు. అలాంటి నీచుడిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాసనసభ సాక్షిగా వెనకేసుకొచ్చారు.

‘370 అధికరణాన్ని రద్దు చేసినా మౌనండి ఉన్న నాయకులు సెక్యులరిస్టులు ఎందుకవుతారు?’` అసదుద్దీన్‌ ఒవైసీ. సెక్యులరిజం అంటే ముస్లిం భారత్‌ను తయారు చేయడమేనని ఒవైసీ సోదరుల నిశ్చితాభిప్రాయం. ఆ అధికరణం ఉన్నంతకాలం కశ్మీర్‌లో ఏం జరిగిందో తెలుసు. దానిని అడ్డం పెట్టుకుని అడ్డంగా బలిసిన ముస్లిం ఛాందసవాదం, ఉగ్రవాదం కశ్మీరీ పండిత్‌లను అక్కడ నుంచి ఏ ఉద్దేశంతో తరిమివేశాయో, ఆ సందర్భంలో ఎలాంటి నినాదాలు ఇచ్చాయో, అక్కడి గోడల నిండా ఏం రాశాయో తెలుసు.

కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే అంతకు ముందు ఉన్న బీజేపీ ప్రవేశపెట్టిన మతాంతరీకరణ నిరోధక చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పింది కాంగ్రెస్‌. హిజాబ్‌ మళ్లీ తెస్తామన్నారు. యథేచ్ఛగా గోవధ చేసుకోనిస్తామని అన్నారు. వాళ్ల దృష్టిలో ఇవన్నీ సెక్యులరిజానికి గీటురాళ్లు. కోటి రూపాయల ఆదాయం దాటిన హిందూ దేవాలయాల మీద పన్ను విధించడానికి బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును శాసనమండలి నిరాకరించింది. ఇలాంటి పన్ను ఇతర మతాల ప్రార్థనామందిరాల మీద కూడా విధించ గలరా? అంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌ కూడా నిలదీశారు. భంగపడినా మళ్లీ తీసుకువస్తామని శపథం చేసింది కన్నడ కాంగ్రెస్‌. బెంగళూరు మహానగరంలో, ఐటీ హబ్‌లో అజాన్‌ సమయంలో తన దుకాణంలో హనుమాన్‌ చాలీసా వింటున్నందుకు ముస్లిం గూండాలు వచ్చి హిందూ యువకుడి మీద దాడి చేశారు. ఆంజనేయస్వామి బొమ్మతో ఉన్న జెండాను ఎగరవేస్తే పోలీసులు వచ్చి దింపేశారు.

అలనాటి బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ వ్యాఖ్యలతో ఉన్న ఒక మెసేజ్‌ను సామాజిక మాధ్య మాలలో  మరొకరికి పంపినందుకు ఉదయ్‌పూర్‌లో ఇద్దరు ముస్లిం మతోన్మాదులు ఒక దర్జీ గొంతు కోశారు.

గోధ్రా అల్లర్ల గురించి ప్రపంచమంతా చాటి వచ్చే వాళ్లు, అసలు రగడకు దారి తీసిన కారణాలను మాత్రం దాచి పెడుతున్నారు. అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులను గోధ్రా వద్ద సజీవ దహనం చేశారు. తరువాత మాత్రమే బాధితుల తరఫు సమాజం భగ్గుమంది.

ఇలా చెప్పుకుంటూ వెళితే కొల్లేరు చాంతాడు కూడా నివ్వెరపోతుంది. అక్షరాలా వందల దుర్ఘట నలు జరిగాయి. ఆ ఘటనలన్నీ మైనారిటీలుగా హోదాను అనుభవిస్తున్న మతాలలో కొందరు  హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే పరిగణిస్తున్నారు. తాము ఏం వ్యాఖ్యానించినా ప్రశ్నించే పని పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ధోరణి ప్రబలడానికి కారణం` సెక్యులరిజం పేరుతో సాగుతున్న ఒక విధ్వంసం. మైనారిటీ ప్రజల మతోన్మాదం కంటే మెజారిటీ మతాల మతోన్మాదం ప్రమాదం అనే అత్యంత నీచమైన వాదన. సెక్యులరిజం అంటే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, చాలా ప్రాంతీయ పార్టీలకు ఓట్లు తెచ్చిపెట్టే సూత్రం. అధికారం అప్పగించే మార్గం. కానీ సెక్యులరిజం, అది తెచ్చిపెడుతున్న పరిణామాలు భారతదేశాన్ని ఒక ప్రమాదపు అంచుకు  నెడుతున్నాయన్నది పచ్చి నిజం. అందుకే హిందువును మేల్కొల్పక తప్పలేదు. ఇప్పుడు మేల్కొనవలసిన అవసరం నుంచి హిందు వులు తప్పించుకోవడం సాధ్యం కాదని చెప్పినా తప్పుకాదు. హిందూ సమాజంలో వస్తున్న ఈ మార్పు భారత రాజకీయాలను నిర్దేశించడం అనివార్యమే.

ఆగస్ట్‌ 15, 1947న మత ప్రాదికన భారత్‌ రెండు ముక్కలయింది. చరిత్ర గమనంలో హిందూ సమాజం ఎదుర్కొన్న నష్టాలకు అది పరాకాష్ట. మత ప్రమేయంలేని, హిందూ ఆధిక్యం ఉన్న భారతదేశం లోనే కాదు, ముస్లిం రిపబ్లిక్‌గా ప్రకటించుకున్న పాకిస్తాన్‌లో (తరువాత బంగ్లాదేశ్‌లో కూడా అదే పరిస్థితి) కూడా హిందువులే నష్టపోవడం, వంచనకు గురికావడం ఒక వైచిత్రి. ఇలా చరిత్ర శాపగ్రస్థులుగా మిగిలిపోయిన బయటి హిందువులకు న్యాయం చేయాలన్న చిన్న ప్రయత్నానికి కూడా ఇవాళ్టి భారతదేశంలో ప్రతికూలత ఎదురవుతున్నది. పౌరసత్వ సవరణ చట్టం పూర్వాపరాలు అందుకు సంబంధించినవే. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌లలో మత వివక్షను ఎదుర్కొంటున్న పిడికెడు హిందువులకు, మరొక ఐదు మైనారిటీ మతాల వారికి ప్రస్తుత భారత ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వదలిచింది. ఈ ఆలోచన ఈ ఒక్క ప్రభుత్వానిది కూడా కాదు. గాంధీజీ, నెహ్రూల కాలం నుంచి ఉంది.

Balak Ram: Ram Lalla idol in Ayodhya's Ram Mandir has a new name - India Todayఅయోధ్య, రాముడు పుట్టిన పుణ్యక్షేత్రమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. మధుర కృష్ణ భగవానుడు నడయాడిన స్థలం. కాశీ పరమ పవిత్రస్థలం. ఈ మూడు ముస్లింలు వదులుకుని సహృదయత చాటుకోవాలని కోరింది హిందూ సమాజం. కానీ ముస్లిం సమాజం అందుకు సిద్ధపడడం లేదు. నిజానికి  ఆ వర్గాన్ని హిందూ సమాజానికి వ్యతిరేకంగా నిలిపి ఉంచుతున్నది సెక్యులరిస్టులు, ఉదారవాదులే. అయోధ్య వివాదం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు ఈ విషయాన్ని ప్రతిబింబిస్తుంది కూడా. చరిత్రకారులు చేసిన దగాను కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం అభిశం సించింది. అయోధ్య, మధుర, కాశీ, భోజశాల` వరసగా హిందూ ఆనవాళ్లతో బయటపడుతున్నాయి. అయినా ప్రతి మసీదులో శివలింగాలను వెదికే ప్రయత్నం వద్దని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ పెద్ద మనసుతో ప్రకటించారు. దీనికి కూడా ముస్లిం సమాజం నుంచి సరైన స్పందన రాలేదు. ఇదే క్రమంలో మరొక వాదన కూడా ఇటీవల బలపడుతున్నది. ముస్లిం దురాక్రమణదారులు ఈ దేశంలో దాదాపు ముప్పయ్‌ నుంచి నలభయ్‌ వేల ఆలయాలను ధ్వంసం చేశారు, మసీదులుగా మార్చారు, వాటన్నిటినీ న్యాయపోరాటంతో తిరిగి తీసుకోవాలి అన్న నినాదంతో ఒక వర్గం ఇప్పుడు బలపడుతున్నది. ఇదంతా గడచిన నాలుగు దశాబ్దాలుగా భారతీయ సమాజం చూస్తున్న పరిణామం. ఈ పరిణామంతోనే భారత రాజకీయాలు కనీవినీ ఎరుగని ఒక పెద్ద మలుపు దగ్గరకు చేరాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలు ఆ విషయాన్ని రుజువు చేస్తాయి. దేశ రాజకీయ దృక్పథంలో, దృశ్యంలో ఒక విభజన రేఖ అవతరిం చింది. ఎప్పుడో హిందూ మహాసభ,  భారతీయ జనసంఫ్‌ు కాలం నాటి  ‘హిందూత్వ’ రాజకీయాలు అనే భావన తెరపైకి వచ్చి నిలిచింది. స్థూలంగా చెప్పాలంటే ఒక వైపు హిందూత్వ రాజకీయాలు, మరొకవైపు  హిందూయేతర రాజకీయాలు. ‘హిందూత్వ రాజకీయాలు’ అన్న పేరును నిజానికి హిందూత్వ రాజకీయ శిబిరం ప్రకటించుకోలేదు. ఈ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చినది హిందూయేతర రాజకీయ శిబిరమే. అయినా హిందూత్వ రాజకీయాల పేరుతో ఇవాళ కనీవినీ ఎరుగని రీతిలో దాడి జరుగుతున్నది. హిందూ వ్యతిరేక విమర్శ ఇంత తీవ్రస్థాయిలో మున్నెన్నడూ లేదు. అయితే ఒకటి నిజం, హిందూ శిబిరం ధ్యేయం హిందూ సమాజం హక్కులు, వారి ఆత్మగౌరవం. హిందూయేతర రాజకీయ శిబిరానికి ఆయువుపట్టు మాత్రం ఓటు బ్యాంక్‌ రాజకీయాలే. ఇక్కడ చాలామంది మేధావులు, ఒక వర్గం మీడియా, ఉదారవాదులు, సెక్యులరిస్టులు కలసికట్టుగా విస్మరిస్తున్న అంశం` ఆరు దశాబ్దాలుగా హిందూ వ్యతిరేక శిబిరం లేదా ముస్లిం ఓటు బ్యాంకు స్పష్టంగా అవతరించినప్పుడు, దాని ఫలితాలు సుస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు హిందూ సమాజం ఎంతకాలం మౌనంగా ఉండగలదు? ఒక ఓటు బ్యాంకుగా అవతరించకుండా మౌన ప్రేక్షకపాత్రకు అది పరిమితం కావాలని ఎవరైనా ఎలా అనుకో గలరు?  నిజానికి దీనిని హిందూ ఓటు బ్యాంక్‌ అనడం కంటే భారతీయ ఓటు బ్యాంక్‌ అనాలి. అంటే భారతీయతకు సానుకూలమైన ఓటు. ఇలాంటి ఓటర్లలో హిందువులు కూడా భాగం. ఈనాడు భారతీయతను గౌరవిస్తున్న హిందూయేతరులు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

సెక్యులరిజం చాటున భారత సార్వభౌమాధికారా నికి జరుగుతున్న చేటు, నిజానికి వెన్నుపోటు హిందూయేతర రాజకీయ శిబిరం వైఖరి పుణ్యమే. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న బీజేపీ హిందువుల పార్టీ అని ఈ శిబిరం విమర్శిస్తూ ఉంటుంది. బీజేపీ నిజంగా హిందువుల పార్టీయే అయితే ఎన్నికలలో ఓడిరచి సెక్యులర్‌ ప్రభుత్వం స్థాపించవచ్చు కదా! అది జరగడం లేదు. తాము సెక్యులరిస్టులమనీ, సమన్యాయం, పురోభివృద్ధి ధ్యేయంగా ఉన్నవారమనీ ఈ శిబిరం చెప్పుకుంటూ ఉంటుంది. ఇది వాగాడంబరమని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు చూపించవచ్చు. భారత పార్లమెంటు మీద దాడి చేసిన వారిని, భారత ఆర్థిక రాజధానిలో రక్తపాతం సృష్టించిన వారిని జేఎన్‌యు వంటి విశ్వవిద్యాలయా లలో ఆకాశానికి ఎత్తుతూ ఉంటే సెక్యులరిస్టులు ఎందుకు మౌనం దాలుస్తారో అర్ధం కాదు. జేఎన్‌యు భారత వ్యతిరేకతను ఖండిరచినా అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని ఈ దేశంలో సెక్యులరిస్టులు నమ్ముతున్నట్టు కనిపిస్తుంది. భారత్‌ను ముక్కలు ముక్కలు చేస్తామని అక్కడ విద్యార్థులు, పరిశోధకుల పేరిట చలామణి అవుతున్న మతోన్మాదులు, ఉగ్రవాదుల మాటలను సెక్యులరిస్టులు ఏనాడూ ఖండిరచలేదు. పేదరికం కారణంగా ఇస్లాం ఫండమెంటలిజం విస్తరించిందని మొదట వీరు వాదించారు. అది శుద్ధ తప్పని తేలింది. అలీగడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి, జామియా మిలియా నుంచి పరిశోధక విద్యార్థులు కశ్మీర్‌ ఉగ్రవాదంలోకి దిగారు. దీనితో మాట మారింది. మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడం సరికాదన్న నినాదం పట్టుకొచ్చారు. పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేస్తే మొత్తం పాకిస్తాన్‌ను నిందించడమేమిటన్న వాదన ఇలాంటిదే. కానీ ‘హిందూ ఉగ్రవాదం’ అంటూ కాంగ్రెస్‌ ఒక మాటను తీసుకువచ్చింది. మతమంటే ఏనాడూ తీవ్రంగా పరిగణించని మెజారిటీ సమాజాన్ని అలా అవమానించడం ఈ శిబిరం చేస్తున్న పెద్ద తప్పిదం.  ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అక్కసుతో, భారతీయతను, భారతీయులను కూడా ఆ శిబిరం విమర్శించడం సర్వసాధారణంగా మారిపోయింది. భారతీయ జనతా పార్టీని రాజకీయంగా విమర్శించే హక్కు ఆ శిబిరానికి ఉంది. బీజేపీ ప్రభుత్వ విధానాలను ఖండిరచే హక్కు కూడా ఉంది. కానీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఆ పేరుతో భారతీయతను విమర్శించే అధికారం లేదు. ఇలాంటి ధోరణిలోని అనౌచిత్యాన్ని గుర్తించడం మొదలు కావడంతోనే హిందూ రాజకీయ ఐక్యతకు, తదనుగుణంగా హిందూ ఓటు బ్యాంకు రాజకీయాలకు సోపానాలు పడినాయని గుర్తించవలసి ఉంటుంది. హిందూ యిజంలోని శక్తిని మేం ఎదుర్కొంటామని రాహుల్‌ అనడం వెనుక, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోమని చెప్పడం వెనుక, హిందూ దేవాలయాల మీద పన్ను విధించే ఆలోచన అయినా హిందూ వ్యతిరేకమే. ‘ఎవరైనా కాంగ్రెస్‌ వాడు నీ దగ్గరకు వచ్చి వాళ్లకి ఓటు వేయమని అడిగితే  ఒక్కటే విషయం అడుగు. రామమందిరం వివాదంలో వ్యతిరేకంగా వాదించడానికి 24 మంది న్యాయవాదులను ఎందుకు నియమించారు అని!’ అంటారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌. అవును, హిందూ సమాజం ఇప్పుడు ప్రశ్నిస్తున్నది. నిలదీస్తున్నది. నిజమే, ఆ అంశం గురించి ప్రశ్నించ మని పటేకర్‌ కోరుతున్నారు. కానీ ఒక్క కాంగ్రెస్‌ నేతనే కాదు, ప్రతి సెక్యులర్‌ పార్టీ నేతకు ఆ ప్రశ్న వేయాలి. ఈ దేశంలో తమకూ హక్కులు ఉన్నాయని హిందువులు గుర్తించాలి. లేకపోతే సాధించేందుకు ఇకనైనా నడుం కట్టాలి. హిందువు లకు హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడతామని ఎన్నికల బరిలోని అన్ని పార్టీల నాయకుల చేత ప్రతిజ్ఞ చేయించాలి.

ముస్లింలకు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. కొన్ని కొత్త దేశాలను కూడా వాళ్లు సృష్టించుకునే పనిలో ఉన్నారు. క్రైస్తవులకు కూడా ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ హిందువులకు మాత్రం భారతదేశం ఒక్కటే ఉంది. ఇది ఎప్పటికీ గుర్తుంచు కోవలసిన సత్యం. ప్రపంచంలోని ఏ హిందువుకైనా ఇదే జన్మభూమి. ఇక ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారి సంగతి సరేసరి. కాబట్టి భారతదేశాన్ని, భారతీయ భావనను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రధానంగా హిందువులు మీదే ఉన్నది. అందుకు వారు కలసికట్టుగా సాగాలి. అందుకు అవసరమైన రాజకీయ చింతనను అనుసరించాలి. శుష్క సిద్ధాంతాలనీ, ఇతర ప్రలోభాలనీ దూరంగా ఉంచాలి. సంఘే శక్తి కలౌయుగే (కలియుగంలో ఐక్యతను కలిగి ఉండడమే శక్తి).


హిందూ వ్యతిరేకతే ధ్యేయంగా…

చరిత్రలో హిందువులు ఎన్ని దారుణమైన పరిణామాలు చూశారో, ఎన్ని చేదు జ్ఞాపకాలు మింగారో మన చరిత్రకారులు కాకపోయినా, విల్‌ డ్యూరాంట్‌ వంటి పాశ్చాత్య చరిత్రకారులు చక్కగా చెప్పారు. ఆ ఘర్షణలలో హిందూ సమాజం కునారిల్లి పోయింది. కానీ ఇక్కడి చరిత్రకారులు మాత్రం ఆ ఘర్షణను, హిందూ సమాజం పడిన అవమానాలను చరిత్రపుటలలో చేర్చడానికి నిరాకరించారు. అందుకు వారు చెబుతున్న కారణం, ఆ ఘర్షణలను, రక్త పాతాన్ని విద్యార్థులకు వెల్లడిస్తే మత సామరస్యం దెబ్బతింటుందట. అంటే హిందు వుల అవమానాలు, దురాక్రమణదారులను ఎదిరించిన భారతీయుల సాహసాలు అన్నీ మరుగున ఉండిపోవాలి. చరిత్ర అంతా హిందువులు, ముస్లింలు సయోధ్యతోనే ఉన్నారని బొంకాలి. వాస్తవ చరిత్ర అదే అయితే అదే రాయవచ్చు. కానీ కాదు. అయోధ్య, కాశీ, మధురలలో బయటపడిన శిథిలాలు అందుకు సాక్ష్యం చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ప్రథమ ప్రధాని, విద్యామంత్రి వంటి వారు హిందువులు అణగిమణిగి ఉండవలసిన వర్గంగానే పరిగణించారు. హిందూ జీవన విధానం పలచబడి పోవాలన్న ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది.

భారతదేశంలో తమిళ ప్రాంతానికి లేదా మద్రాసు ప్రెసిడెన్సీకి ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ అక్కడ స్వాతంత్య్రానికి ముందు జస్టిస్‌ పార్టీ  పేరుతో సాగిన వేర్పాటుధోరణులు స్వతంత్ర భారతదేశంలో కూడా కొనసాగాయి. అవే ద్రవిడ రాజకీయాలు. రాముడి విగ్రహంతో సాగుతున్న ఊరేగింపుల మీద చెప్పులు విసిరిన ఘనత అక్కడి ద్రవిడ ఉద్యమానిది. దాని అధినాయకుడు రామస్వామి నాయకర్‌ వ్యాఖ్యలు, విధానాలు వికారం కలిగిస్తాయి. ఇప్పటికీ ఆ నీచత్వాన్ని తలకెత్తుకు మోస్తున్నది డీఎంకే. రామస్వామినాయకర్‌ ఆనాడు చేసిన వేర్పాటువాద రాజకీయాలను కూడా డీఎంకే సాగదీయాలని చూస్తున్నది. రాముడు దక్షిణ భారతానికి చెందినవాడు కాదు అనడం, హిందీ వ్యతిరేకత, ఆఖరికి 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలని అంశాలు అన్నీ కూడా దేశ వ్యతిరేకతను ప్రబోధించేవే. అసలు సనాతన ధర్మాన్ని దేశం నుంచి నిర్మూలించడమే తక్షణ కర్తవ్యమని ఆ పార్టీ ఇటీవలయ పిలుపునిచ్చింది.

ఆర్యులు, ద్రావిడులు అన్న శుష్క సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని  మరొక విభజనకు గురి చేయాలని (ఉత్తర భారతం, దక్షిణ భారతం) కూడా కుట్రలు సాగాయి. తెల్లగా ఉండేవారంతా ఆర్యులట. నల్లగా ఉన్నవారంతా ద్రావిడులట. ఆర్యులు ఇక్కడికి వచ్చి మూలవాసులను తరిమివేశారట.

సోమనాథ్‌ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ ఆలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ హాజరు కాదలిచారు. ఆయన వెళ్లకుండా అడ్డుకోవడానికి నెహ్రూ చేయని ప్రయత్నం లేదు. అయినా రాజేంద్రప్రసాద్‌ హాజరయ్యారు. ఈ విభేదాలు ఆ పెద్దలిద్దరి మధ్య చిరకాలం కొనసాగాయి.

‘హిందుత్వ’ పేరుతో ఒక పుస్తకం రాసినందుకు, హిందూ మహాసభకు నాయకత్వం వహించినందుకు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను ఈనాటికీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఉదారవాదులు పరమ నీచంగా చిత్రిస్తూ ఉంటారు. ఆ పేరుతో సావర్కర్‌ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన నిరుపమాన త్యాగాలను మరుగుపరిచే యత్నం చేస్తున్నారు. మణిశంకర్‌ అయ్యర్‌ అనే రాజకీయ దళారి కూడా సావర్కర్‌ను విమర్శించడమే ఈ దేశంలో వింత. కానీ గతంలో ఆ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ సావర్కర్‌ త్యాగాన్ని శ్లాఘించి, నాణెం విడుదల చేశారు. అయినా ఇప్పుడు ఆయనను దూషిస్తే సెక్యులర్‌ వీరతాళ్లు దండిగా పడతాయి కాబట్టి పరమ నీచంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిందలు వేస్తుంటారు. ఇందులో అగ్రతాంబూలం రాహుల్‌ గాంధీదే కూడా.

గాంధీజీ హత్యలో సావర్కర్‌ను ఇరికించడం, ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడం రెండూ కూడా హిందూత్వ కోణం నుంచి చూడవలసినవే. తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ను రెండుసార్లు నిషేధించారు.

అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమ తించాలంటూ కొందరు మహిళలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇది పూర్తిగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమే అయినా న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. దీనిని అడ్డుకోవాలని మహిళలు తీవ్ర ప్రయత్నం చేశారు. కేరళ సీపీఎం ప్రభుత్వ పోలీసుల చేతిలో దారుణ హింసకు గురయ్యారు. ఇంతకీ అయ్యప్ప ఆలయం లోకి వెళ్లడానికి స్త్రీలను అనుమతించాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన మహిళలెవ్వరూ ఆ దేవాలయం ప్రత్యేకత గురించి, అక్కడి సంప్రదాయాల గురించి తెలిసినవారే కాదు. హిందూ ధర్మం మీద కక్ష కట్టిన ఎన్‌జీవోల తరఫున పనిచేసే వారు మాత్రమే. వీరినే ఆనాడు చాలామంది ఒక ప్రశ్న అడిగారు. హిందూ ధర్మంలో మహిళలకు ప్రవేశంలేని ఆలయాలు ఒకటి రెండు మాత్రమే. కానీ అసలు ఈ భూమి మీద ఉన్న ఏ మసీదులోను స్త్రీలకు ప్రార్థన అవకాశం లేదు. వేరే స్త్రీలు కాదు, ఆ మతంలోని స్త్రీలకే ప్రవేశం లేదు. ఆ విషయం గురించి మీకెందుకు పట్టదు? దీనికి ఇప్పటికీ సమాధానం లేదు. అయ్యప్ప ఆలయం లోకి మహిళలను అనుమతించాలని పట్టుపట్టిన మహిళామణులు జ్ఞానవాపి కట్టడంలో శృంగార గౌరి పూజల కోసం కొందరు మహిళలే కోర్టుకు వెళితే మాత్రం వారికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

కర్ణాటక ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం మైసూరు నవాబు టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలు ఆరంభిం చింది. టిప్పు చరిత్ర మతవివక్షతో మలిన మైనది. అతడు మేల్కోటే అనే గ్రామంలో ప్రవేశించే ఒకే రోజున వేలాది మంది శ్రీవైష్ణవులను హత్య చేశాడు. కానీ ఒక మొండి పట్టుదలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అతడి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నది.

హిందూ దేవీదేవతల మీద అవాకులు చెవాకులు పేలేవాళ్ల సంఖ్య తక్కువే మీ కాదు. ఇందుకు తాజా ఉదాహరణ ఒక ప్రొఫెసర్‌ సీతమ్మను రాముడు విఫణిలో పెట్టి అమ్మేశాడని సోషల్‌ మీడియా పోస్టులో పెట్టాడు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తరువాత, దేశమంతటా ఒక చైతన్యం వెల్లివిరిసిన తరువాత పుణేలో ప్రదర్శించిన ఒక నాటికలో సీతమ్మ చేత పొగతాగించారు.  ఎంఎఫ్‌ హుసేన్‌ చిత్రకారుడు తన కారు మీద సరస్వతి అమ్మ వారి బొమ్మను నగ్నంగా చిత్రిం చాడు. స్వామిప్రసాద్‌ మౌర్య అనే ఉత్తరప్రదేశ్‌ రాజకీయ నాయకుడు రామచరిత్‌ మానస్‌ను దగ్ధం చేయించాడు. అందులో వివక్షను ప్రేరేపించే అంశాలు ఉన్నాయని ఆ మూర్ఖుడి వాదన. ఇక భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో హిందూ దేవుళ్ల మీద, పండుగల మీద, జీవన విధానం మీద ఎన్ని వేల కథలు, కార్టూన్లు, రచనలు, సినిమాలు వచ్చి ఉంటాయో చెప్పడం కూడా కష్టం. కానీ వాస్తవంగా హిందువులు బాధితులుగా ఉన్న కశ్మీర్‌ లోయ ఘోరాలు, కేరళ హిందూ యువతుల అపహరణాలు, నిజాం రాజ్యంలో రజాకార్‌ అరాచకాలు ఇతివృత్తాలుగా చలనచిత్రాలుగా వస్తే ఉదారవాదులు విపరీతంగా బురద చిమ్ముతారు. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలిన తరువాత బంగ్లాదేశ్‌లో అనేకమంది హిందువులను ఊచకోత కోశారు. ఆ అంశాలే ఇతివృత్తంగా తస్లిమా నస్రీన్‌ ‘లజ్జ’ పేరుతో నవల రాశారు. దీనితో ఆమె భారతదేశానికి వచ్చి తలదాచుకోవలసి వచ్చింది. తస్లిమాకు మద్దతుగా ఒక్క మహిళా సంఘం, హక్కుల సంఘం కూడా ప్రకటన చేయలేదు. వీటిని సాధారణంగా కమ్యూనిస్టులే దొంగపేర్లతో నడుపుతూ ఉంటారు.

కొందరు క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మతోన్మా దులు కూడా ప్రత్యేక దేశం నినాదాలు చేస్తున్నారు. మరొక పాకిస్తాన్‌ కావాలని వాళ్లు, పాకిస్తాన్‌ ఇచ్చినట్టే మాకూ ఒక స్వతంత్ర రాజ్యం కావాలని వీళ్లు నినాదాలు చేస్తూ ఉంటారు.


సెక్యులరిజం ఒక వేరుపురుగు

సెక్యులరిజం భారతీయ మూలాలను హరిస్తున్న వేరుపురుగు. ఇది భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుతుందన్న మాట పెద్ద భ్రమ. ఇక్కడ సెక్యులరిజం అంటే భారత వ్యతిరేకత. స్థూలంగా చెప్పాలంటే పచ్చి హిందూద్వేషానికి ఒక రాజకీయ ముసుగు. 1976లో రాజ్యాంగంలో చొరబడిన ఈ పదం 1947 నుంచే భారతీయ మూలాలను హరించడం మొదలు పెట్టింది. భారత్‌ సెక్యులర్‌ దేశమంటే డేవిడ్‌ ఫ్రాలే (అమెరికాకు చెందిన సంస్కృత పండితుడు, వాసుదేవశాస్త్రి అని పేరు మార్చుకున్నారు) అంగీకరించరు. ఇది హిందూ వ్యతిరేక దేశమనే ఆయన ఘంటాపథంగా అంటున్నారు. భారత్‌లో  మెజారిటీ ప్రజలను దోపిడీ చేస్తున్న తీరులో ప్రపంచంలో మరెక్కడా మెజారిటీ ప్రజలు దోపిడీకి గురికావడం లేదని కూడా ఆయన రాస్తారు. 80 శాతానికి పైగా హిందువులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులనే చాలామంది అనుభవం. హిందువులకు కూడా హక్కులు ఉంటాయని గుర్తించాలని చాలామంది ఇవాళ కూడా చెబుతూ ఉంటారు.

ఇక్కడ సెక్యులరిజం అంటే హిందువుల హక్కులను నిరోధించడమే. వారి పండుగలను అడ్డుకోవడమే. వారి ఆచార వ్యవహారాలను అపహాస్యం చేయడమే. భారత్‌లో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యం ఉంటుంది. కానీ మసీదుల కేసి, చర్చ్‌ల వైపు చూసే దమ్ము ధైర్యం వాటికి ఉండదు. చాలా చర్చ్‌ల భూములు లీజ్‌లోనివి. ఆ లీజ్‌ పూర్తయి దశాబ్దాలు గడుస్తున్నది. స్వాధీనం చేసుకునే ప్రయత్నమే లేదు. కానీ హిందూ దేవాలయాల మీద పన్నులు విధిస్తారు. వాటి భూములు వేలం వేయాలని కమ్యూనిస్టులు గొంతు చించుకుంటారు. దీపావళి జరుపుకుంటేనే ఇక్కడ వాయుకాలుష్యం, పర్యావరణ కాలుష్యం సంభవిస్తాయి. హోలీ రంగులు ప్రమాదకరం. కానీ ప్రతి జనవరి 1వ తేదీకి ప్రపంచమంతటా తగలబెట్టే బాణసంచా గురించి వీరెవరూ నోరెత్తరు. కొన్ని కొన్ని హిందూ ఆలయాల దగ్గర కనిపించే బలులు ఉదారవాదులకి అమానుషంగా కనిపిస్తాయి. ముస్లింల పండుగలలో తెగిపడే వేలాది జంతువుల తలలు వారికి కనిపించవు. కోర్టులు కూడా హిందువుల పండుగలంటే వెంటనే స్పందించి, కట్టడికి ఆదేశాలు ఇస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల సంగతి చెప్పవలసిన అవసరమే ఉండదు. హిందువుల పండుగ, మైనారిటీల పండుగ ఒకే సమయంలో వస్తే హిందువుల పండుగల మీద నిషేధం విధించిన వాతావరణం ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్‌లో ఉంది. కర్ణాటకలో దేవాలయాల పరిస్థితి ఘోరం. తమిళనాడులో హిందూ దేవాలయాల ముందే ఈవీ రామస్వామి నాయకర్‌ విగ్రహాలు ఉంటాయి. వాటికింద హిందూత్వాన్ని, ఆచారాలని కించపరిచే వ్యాఖ్యలు ఉంటాయి. దీనిని ప్రశ్నిస్తే హిందువులలో అసహనం పెరిగిపోయిందన్న ప్రచారం చేయడానికి ఒకవర్గం మీడియా సదా సిద్ధంగా ఉంటుంది. హిందూ అన్న పేరుతో ఉన్న పత్రికలు కూడా హేతుబద్ధం కాని విమర్శలను చేయడం రివాజుగా మారింది.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram